Tuesday 30 December 2014 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- నర్మదా బచావో ఆందోళన్-16

మ్యాక్రో  దృక్పధం లో ముఖ్యంగా వచ్చింది,మెగా డ్యాం ల నిర్మాణం. ఇది దానితో పాటు పెద్ద ఎత్తున సృష్టించింది నిర్వాసితం. నిర్వాసితానికి గురయ్యే ప్రజలు తమ గతాన్ని కోల్పోతారు, వర్తమానం భయంతో నిండి పోతుంది, భవిష్యత్తు అగ్యమ్య గోచరంగా మారుతుంది. మెగా డ్యాంలు నిర్మాణం జరిగిన ప్రదేశాల్లో ప్రకృతి తన ఉనికి కోల్పోతుంది. భారత మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1954 లో భాక్రా నంగల్ కాల్వ ఉధ్ఘాటనప్పుడు డ్యాం లను “ఆధునిక దేవాలయాలు “గా వర్ణించారు.డ్యాం ల నిర్మాణాన్ని చేపట్టినప్పుడల్లా దీనినే సూత్రీకరించడం,ప్రస్తావించడం ఆనవాయతీ అయ్యింది. ఈ దేశ సౌభాగ్యం కోసం
నా గ్రామం ముంపుకి గురైయింది
మునిగిన నా పొలాలు ఇంధనం అవుతాయి
మీ విద్యుత్ ఉత్పాదనకి
ఆ విద్యుత్ వినియోగదార్లు
ఏమి కోల్పోయారు?
మీ వాగ్దానాలు నమ్మి
మీరన్నారు మేము భూములు త్యజించాలని
అలా అయితే మేమి చేయాలి
మీ వాగ్ధానాలు మీరు పాటించకపోతే
మీరు ఏ దేశ అభివృద్ధి గురించి అయితే చెపుతున్నారో
నేను అందులో అంతర్లీన భాగం
మర్చిపోయిన ప్రజలు ఫలించని వాగ్దానాలు
నేను ఆ చెప్పని కధని
( అనానిమస్ పోయట్)
(అనుసృజన)
నెహ్రూ 1958 లో 29వ కేంద్ర బ్యూరో ఆఫ్ ఇరిగేషన్ సదస్సులో  అతి పెద్ద ప్రాజెక్టులు  ఒక వ్యాధి గా కూడా చెప్పారు. ఆ ప్రస్తావన ఎక్కడా విన్పించదు. ఈ వ్యాధి లక్షణాలు, తరచూ పెట్టు బడులు పెరుగుతాయి. వాటి నిర్మాణంలో చాలా సంవత్సరాలు  పడతాయి. ఇందులో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, నాయకులు, పెద్ద పెద్ద రైతులు బాగా లబ్ది పొందుతారు. భూమిని కోల్పోయిన వారి జీవితాలు ,త్యాగాలను ఎక్కడా ప్రస్తావించం. ఇది  ఈ కాలంలో స్వాతంత్ర్యం   తర్వాత గిరిజనులు, దళితులూ, పేదల పై దాడి.
బాబా ఆమ్టే 1980 లో దేశంలో మధ్యలో శాంతిని పెంపొందించాలన్న కోరికతో దేశ వ్యాప్తంగా క్విట్ ఇండియా అన్న సహ్రుద్భావన్ యాత్రను చేపట్టారు. ఆ యాత్రలో మతకల్లోలాలతో బాటు  ఆయనను దేశ సహజ వనరుల క్షీణత కలిచి వేసింది. దీనితో బాటు భారీ ఆనకట్టల వల్ల ఏర్పడే వ్యవస్థ కొందరికే అభివృద్ధిఫలాలను పంచుతుంది అని స్పష్ట మైంది.1988 లో  ఆనందవన్ లో జరిగిన పర్యావరణ కార్యకర్తల సమావేశంలో భారీ ఆనకట్టలకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకున్నారు. ఇవన్నీ గమనించిన బాబా ఆమ్టే 1989 లో నర్మదా ఒడ్డుకి చేరారు ,అంతకు క్రితమే ఆయన నర్మదా రోదన అన్న పుస్తకం ప్రచురించారు.ఆమడ దూరంలో నున్న నదిని పలకరించడానికి తెల్లవారే లేవడం,నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న నదితో కబుర్లు చెప్పుకోవడం. ఈ జీవనం వాళ్ళిద్దరికే చెల్లింది, ఓ రాలుతున్న తోక చుక్క  కోరిక లా...
 ఆగని వారు
ఆగని వారు.ఒరగని వారు.
అణిచి వేయబడే వారు కారు. మటుమాయం అయ్యే వారు కారు.
ఆ విప్లవం మేము.
దౌర్జన్యానికి సమాధానాలం

పర్యావరణ కవిత్వంలో సోషియాలజి ఆఫ్ పోయట్రి ని కాప్చర్ చేయచ్చు. దీని వల్ల నేర్చుకునేటప్పుడు మన దృష్టితో కాక ఎదుటి వాళ్ళ దృష్టితో పరిశీలించే అవకాశం ఏర్పడుతుంది. సామాజిక అస్తిత్వ పోరాటాలలో  ఈ ప్రక్రియ కీలక పాత్ర వహించింది. ఆ ప్రక్రియ ఇప్పుడు కవిత్వానికి కొత్త రూపాన్ని ఆవిష్కరించేందుకు జరుగుతోంది. కవిత్వం .సాహిత్యం ద్వారా అస్తిత్వ పోరాటాల్ని వెలికి తీయడం. ఇది చేపట్టడానికి కవిత్వం, సాహిత్యంతో బాటు సోషల్ ఇకాలజిని అర్ధం చేసుకోవాలి.
Wednesday 24 December 2014 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- నర్మదా బచ్చావో ఆందోళన్-15

అభివృద్ధి పేరుతొ పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టి గిరిజనలను తమ నేలశ్వాస కొసనుండి దూరం చేస్తున్నారు.నర్మదా నది పై తలపెట్టిన 30 డ్యాం లలో అతి పెద్దవి సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్, నర్మదా సరోవర్ ప్రాజెక్ట్.నర్మదా నది మైకల్ శ్రేణులలోని  సముద్రానికి 1057 మీటర్ల ఎత్తులో అమరకాన్తాక్ ప్రాంతంలో పుట్టి అరెభియన్ సముద్రంలో కలిసే ముందు మధ్య ప్రదేశ్ , గుజరాత్, మహారాష్ట్రల గుండా 1312 కి.మీ. ప్రవహిస్తుంది.మన ప్రాచిన గ్రంధాలలో పేర్కొన్న 7 పవిత్ర నదుల్లో ఇది ఒకటి. ఈ నది చుట్టూ వైవిధ్యమైన సంస్కృతీ, ప్రకృతి, జనజీవనం ముడి పడి వుంది. అందులో గిరజనులు అల్లుకున్ని వున్నారు. ఈ నది పై ఆనకట్టలు కట్టాలన్న ప్రతిపాదన బ్రిటిష్ వారి కాలం నుండి వుంది.అప్పుడు వాళ్ళు (1901) ఎంచుకున్న ప్రాంతం భరుచ్ లో నల్ల రేగడి భూమి అనువైనది కాదని ఆ ఆలోచనని విరమించుకున్నారు. మళ్ళి స్వాతంత్ర్యం తర్వాత పండిట్ నెహ్రు గారు ఉదహరించిన డ్యాములు- ఆధునిక దేవాలయాలు అన్న స్పూర్తి తో ఈ ప్రక్రియ వెలుగులోకి వచ్చింది1965 డ్యాం ప్రతి పాదనలు కొనసాగింపు మొదలైంది.
నర్మదా వ్యాలిని స్వర్గసీమ గా వర్ణిస్తారు. ఈ స్వర్గ సీమలో తలపెట్టిన ఈ ప్రయోగం గిరిజనుల పాలిట నరకంగా మారింది. పారిశ్రామిక కరణ వల్ల అన్నీ పెద్దవిగా నిర్మంచాలి అన్న తపన పెరిగింది. ఆ ప్రయోగాలలో డ్యాం ల నిర్మాణం ఒకటి. పారిశ్రామీకరణ పూర్వం వున్న అభివృద్ధి నిర్వచనాన్ని మార్చేసింది. ఒక మెగా పర్సపెక్టివ్ ని తీసుకువచ్చింది. మైక్రో నుండి మాక్రో దృక్పదం. ఈ దృక్పదంలో స్మాల్ సొసైటీలు కొట్టుకు పోతాయి.అంతే కాదుకొన్ని వేల సంవత్సరాల సంస్కృతీ ఒక త్రుటిలో మటు మాయమవుతుంది. ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుంది. ఇది కల్చరల్ ఎరోషన్. ప్రకృతి లోని భూమి కోత లాంటిది. డ్యాం వల్ల కొందరి భూములు సారవంతమవుతే,స్ధానికుల జీవితాలు నిస్సారమవుతాయి.పల్లపు ప్రాంతాల వాళ్ళకి బంగారు భవిషత్తు ఏర్పడితే, స్ధానికుల భవిష్యత్తు నిర్విర్యమవుతుంది.అభివృద్ధిలో నిర్వాసితం ఇన్ని రూపాల్లోప్రబలుతుంది . కాని మనకి కన్పించేది కేవలం స్ధానికులు భౌతికంగా నిర్వాసితం అవ్వడమే. ఈ మెగా దృక్పదం క్రమేణా ఆల్విన్ టాఫ్లర్ చెప్పినట్టు  ఇది  అంతటా ఒక ఫ్యూచర్ షాక్ ని సృష్టిస్తుంది. ఈ గమనంలో మనం విస్మరించేది మనం పిల్చే ప్రతి శ్వాస,మనం ఇతర జివ రాశులతో కలిసి బతుకుతున్నాం అన్నది పునరుద్గాటిస్తుంది. మన పూర్వికులతో వున్న సంభందాన్ని పునర్జివింప చేస్తూ ,మన ముందు తరం తో కొనసాగిస్తుంది. మన శ్వాస మన జీవన్ శ్వాసలో ఒక భాగం. ఈ భూమిని అల్లుకున్న గాలి సముద్రం.- డేవిడ్  సుజుకి.
పర్యావరణ కవిత్వంలో నెరేటివ్ కాపిటల్ ని కాప్చర్ చేస్తునప్పుడు, గతం ,వర్తమానం తో బాటు భవిష్యత్తుని ప్రస్తావించాలి. ప్రస్తావనలో  అది వాస్త వానికి దగ్గర వుండాలి. అది దయా పావర్  నర్మదా ఆందోళనకు సంభందించిన గేయంలో ప్రస్తావించారు.
డ్యాం కట్టడంలో
జీవితాన్ని సమాధి చేస్తాను
పొద్దు పొడుస్తుంది
నా రోట్లో మాత్రం
వుట్టి చప్పుడే
నిన్న వరి కుప్పలేసిన చోట
ఈ రోజు వడ్లు యేరుకుంటాను
సుర్యోదయమైంది
బుట్ట నీడలో బిడ్డ నుంచి
కళ్ళల్లో కన్నీళ్ళు వుంచి
డ్యాం కట్ట డానికి వెళతాను
డ్యాం పూర్తయింది
వాళ్ళ భూముల్లోని చెరుకు గడలో
శారముంది
నేను మాత్రం అడవి ఎడారిలో
గుక్కెడు మంచి  నీళ్ళ కోసం ఓడ నవుతాను
నా చెమట వర్షం తో నేల తడుస్తుంది
నా ముంగిట్లో మాత్రం
ఎండుటాకులు రాలుతాయి

(దయా పావర్) (అనుసృజన)
Tuesday 16 December 2014 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- కెన్ సారో వివా-పచ్చని కాంతి విస్ఫోటం -14

ఇనుప  బూటూ- నల్ల తూనీగ
1
నువ్వు వర్షపాతాల్ని
కలలు గన్నావు
కలలు కనే వాడెవడైనా సరే దు:ఖ oపాత్రుడు
2
నేనేల నూనె గానుగల
ఒగోనిశోకాన్ని కద్దేడులా తిప్పిన వాడివి
క్రిమి కీటకా లం
మాకు వచ్చేపోయే ఋతువుల   పై
ప్రేమలు కూడా లేవు
నవ్వుల ఏడ్పుల గాయాలపై వీచే
తేమల్నివాసన కూడా చూడం
3
ఒకే దేహమెందుకుంది
అన్ని దేహాలూ నేనెందుకు కాలేదని
చింతించిన వాడికి
భయపడ్తాడెవరైనా
4
అభయారణ్యాల నిర్భయారణ్యాలకై
నెత్తురోడుతూ కువారిల్లిన కుందేలుకూనా...
అందరికో...నీ కొందరికో
దాచిన నీ ప్రొద్దుటి నక్షత్రాల్ని
వాడి ఉమ్మి తొట్లో దులుపుకున్నాడు
5
అక్షరాన్ని నమ్ముకున్నావు
చినిగిన చినుకుగా చేజారిపోయావు
ప్రేమికదేవుడు భయపెడ్తాడు
6
ఓ పచ్చి కుండలో నదుల్ని
వనాల్ని
వనాల పరివాహక గానాల్నీ
మోసుకు తిరిగిన వాడివి
భయపెడ్తావు
7
వాడు డబ్బు బొడ్లో తల దాచుకున్నాడు
హింసా రోగ పీడితుడు
ఇనుప బూట్లో ముడుచుకున్నవాడు
భయపడ్తాడు
8
ఆఖరాఖరి
వెలుతురు ద్వారం దగ్గర
ఈవా అపజయయాల ప్రపంచం
తల మోదుకుంటూనే  వుంది
ఇంకా ఎంత మందో
నీకులా....
(కెన్ సారో వివాకి, సిద్ధార్ధ,95)

గత కొంత కాలంగా అడవులు,నీళ్ళు,భూమి,పంటలు, గూడు కోసం పోరాడే యోధులు బలవ్వడం క్రమేణ పెరుగుతోంది. ఈ పరిణామం వనరుల క్షీణతకు ,వాటిని ప్రేమించే గుణ మున్న వార్ని ,మట్టినుండి దూరం చేసే సంకేతం.

పూల నీడల్లో పరిమళించాలన్న,కెన్ శారొ వివ అతని అనుచరుల జీవితం అర్ధాంతరంగానే ముగిసింది. 1995,1998 దశలో పోరాటాలు పెరుగుతూనే వున్నాయి దానితో పాటు ఆబాట  పట్టిన వారి చావులు కూడా. ఈ మధ్య  బ్రెజిల్లో రియో +20 ముగిసింది పర్యావరణానికి సంబంధించిన సదస్సులు షరా మాములుగా జరుగుతూనే వున్నాయి. కాని అవి  ఏ మాత్రం పర్యావరణాన్నిఆపడం లేదు. గ్లోబల్ విట్నెస్ వారి  అంచానాల ప్రకారం గత దశాబ్ద కాలంలో బ్రెజిల్లోనే  వనరుల సంరక్షణ కోసం గళమెత్తిన వారు 365 మంది చనిపోయారు/చంపివేయబడ్డారు. గ్లోబల్ ఎకానమీ అయిన తర్వాత స్థానిక వనరులు ,మల్టినేషనల్ కంపెనీల పెట్టుబడులు పెరిగాయి, ఇప్పుడు పోరాటం గ్లోబలే! భూమి కోసం పోరాటం సదా జరుగుతూనే వుంది .ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు  దోచుకోవడానికి విస్త్రుతమైన సాంకేతిక నైపుణ్యం వుంది. చాల తొందరగా ,తక్కువ కాలంలో వనరుల్ని పెకిలించవచ్చు. 
సిద్ధార్ధ తన కవితలో చెప్పాల్సిన విషయాన్ని వివిధ ప్రక్రియలతో  చిత్రించాడు. ఈ కవితలో సంఘర్షణ ఒక దృశ్యంగా అవిష్కరించుకుంటుంది. మాములుగా సిద్ధార్ధ కవిత్వంలో దృశ్యం కంటే ధ్వనితో కూడుకున్న శబ్ద సౌందర్యం ఎక్కువ. కాని ఈ కవితలో దృశ్యం లో ధ్వని అంతర్లీనం గా వుంది. ధ్వని స్ధాయి గద్యమం దాటలేదు, పూర్వపు సంగీత బాణీ లా. వాయిస్ ఓవర్ ఒక     దీర్ఘ పాస్ తో వస్తు విజువల్ పై ఎక్కువ ఫోకస్ వున్నట్టు. ఈ టెక్నిక్ పర్యావరణ కవిత్వం లో వుండే మరో ప్రతేక్యత. దీని ద్వారా పాఠకుడ్ని ఇమోషనల్ గా టచ్ చేయగల్గుతాం. కవి కూడా ఇటువంటి కవితలు రాసేటపుడు అదే విధమైన భావోద్యేగంలో  ఉంటాడు. రెండు మనసుల్ని ఒకే విధమైన భావోద్వేగ స్దాయిలోకి చేర్చే రసాయనిక ప్రక్రియ ఇది.
ఓ మెలోడి పాటని ఒంటరిగా శీతాకాలం సంధ్యా సమయంలో వింటునట్టు. ధ్వని అప్పుడు మనలో ఓ దృశ్యంలా ప్రవహిస్తుంది. మనము మెల్లిగా పాడడం మొదలు పెడతాం, అలా మది కొలనులో కలువుగా ఉండిపోతుంది.
కెన్ సారో  వివా జ్ఞాపకంలా
వివా అపజయయాల ప్రపంచం
తల మోదుకుంటూనే వుంది
ఇంకా ఎంతమందో
నీకులా....
కవిత ముగింపులో ఓ డిసాల్వ్ టెక్నిక్ కనపడుతుంది. ఒక హమ్మింగ్ తో పాట ముగిసినట్టు.
పర్యావరణ కవిత్వాన్ని రాయడం,ఆస్వాదించడానికి, విజువల్, మ్యూజిక్,పర్ఫామింగ్ ఆర్ట్స్ ని అర్ధం చేస్కోవడం అవసరం. ఎందుకంటే అంతర్లీన ,బాహ్య ప్రకృతి అంటే ఇంతే! ఈ  లక్షణాల్ని మన పదాల్లో,ప్రతీకల్లో వచ్చే టట్లు చూసుకోవాలి.ఎందుకంటే పుట్టుకతో వచ్చిన భావాల్లో మార్పు వుండదు అవి వ్యక్త పరచే తీరు మారుతుంది.ఇది సామాజిక,సాంకేతిక పరిజ్ఞానంలో మార్పుల వల్ల ఏర్పడుతుంది. ప్లాస్టిక్ డబ్బుల కాలం మనని ప్లాస్టిక్ చేసింది. ఇప్పుడు పాటలు ఎంత తొందరగా పుడుతున్నాయో అంటే తొందరగా చనిపోతున్నాయి. మన పాట కవితని ఇప్పుడు, ఎప్పుడు చదువుకున్నా అది ఫ్రెష్ గా వుండాలంటే మనలో సునిశత అలానే వుండాలి,కవితని అల్లిన తీరు అలా వుండాలి.(అందుకే కవితని రాసిన వెంటనే పోస్ట్ చేయకండన్న హెచ్చరికలు వెలువడుతాయి).అది మనలోని ప్రకృతి దాని పర్యావ రణం గా మార్చకుండా ఉండేందుకే ఉద్యమాలు జరుగుతున్నాయి.

గిరిజనుల మాటల్లో, పాటలు, కధల్లో ఇవి ఇమిడి వున్నాయి. పర్యావరణ విధ్వంశం వల్ల మనం కోల్పోతుంది కేవలం వనరుల్నే కాదు ,వాటిని అల్లుకున్న గిరిజన పలుకుల్ని.ఈ పలుకులతోనే కెన్ సారో వివా వివాదం సృష్టించాడు. అది గద్యమ స్ధాయిలో భూమి చుట్టూ .తిరుగుతూనే వుంది, ఎప్పటికి మన చెవుల్లో  తూనీగ పాటలా ధ్వనిస్తూ...
Tuesday 9 December 2014 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- కెన్ సారో వివా-పచ్చని కాంతి విస్ఫోటం -13

నిజమైన చెరశాల
కారుతున్న పై కప్పు  కాదు
పాడుతున్న దోమలు కావు
తడితోనున్న ఈ మురకి చెరశాల గది
తాళం చెవి చప్పుడులు కావు
 నిన్ను వార్డెన్ గదిలో పెట్టి తాళం వేసినప్పుడు
కుళ్ళిన కూడు కాదు
జంతువుకి, మనిషి కి  సహించనిది
ఖాళీ ఉదయాలు కావు
చీకటి రాత్రుల్లోకి ఇంకిపోతూ
ఇది కాదు
ఇది కాదు
ఇది కాదు
 మ్రోగిన ఈ అబద్ధాలు
యుగాలుగా నీ చెవుల్లో
ఇది భద్రతా అధికారి సృష్టించిన ఉన్మాదం
నిర్ధయత్వంతో విధ్వంసం ఏర్పరిచిన  ఉత్తరువులు
ముష్టి ఒక పూట భోజనం కోసం
న్యాయాధి కారిణి తన పుస్తకంలో రాస్కుంటుంది
ఆమెకి తెలుసు ఇది అన్హరమైన శిక్ష అని
విలువల విధ్వసం
మానసిక అసంగత్వం
నియంతల మాంసం
పిరికితనం ముసుగులో విధేయత
మన కుళ్ళిన మనసుల్లో రహస్యగోళాలు
మనం ఎప్పటికీ శుభ్రపర్చుకోం
ఇది ఇదే
ఇది ఇదే
ఇది ఇదే
మిత్రమా,మన స్వేఛ్చా ప్రపంచాన్ని
నిర్జీవమైన చెరశాలగా  మారుస్తుంది
(కెన్ సారో వివా,1993)
(అనుసృజన)
 మిత్రమా మన స్వేఛ్చా ప్రపంచాన్ని నిర్జీవమైన చెరశాలగా మారుస్తుంది అన్న ముగింపులో చెప్పాల్సినదంతా  చెప్పాడు కెన్ శారో వివా. 1950ల నుండి నైజీరియా లోని ఒగోని  భూముల్లో షెల్ల్ కంపెనీ వారు చేపట్టిన ఆయుల్ వెలికితీతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు. కెన్ శారో వివా నైజీరియన్ రచయిత,టి,వీ. ప్రొడ్యూసర్,పర్యావరణ కార్యకర్త.
ఈయన ప్రపంచంలోనే అరుధైన పర్యావరణ కవి. అయన ఆప్త మిత్రుడు ఇన చిక్స్ ఇలోగ్భునం ఆయన గురించి అన్న మాటలు  -కెన్ సారో వివా తన ఒగోని ప్రజల కోసం వాళ్ళలో రాజకీయ అవగాహన,స్వదేశీ ఆర్ధిక విధానం గురించి అవగాహన కల్పించారు. ఆయనను ఉరితీయడమంటే నైజిరియాలో పరిస్ధితుల్లో మార్పు లేదని. -.
ఈయనని 1995,లో స్ధానిక సైనిక పాలన  వారు అరెస్టు చేసి ,హడావిడిగా ప్రత్యేక సైనిక ట్రిబ్యునల్ ద్వారా కోర్ట్ కచేరీలు ముగించి ఆయనని మరో 8  యం.ఓ.ఎస్.పి. నాయకుల్ని 10,నవంబర్,1995లో ఉరితీసారు. అప్పటికి ఆయన వయస్సు 45 సంవత్సరాలు.
వివా కోర్టులో ప్రకటించినవి - మిలార్డ్! మన మంతా ఈ నాడు చరిత్ర ముందు నిలుచున్నాం. నేను శాంతి కాముకుణ్ణి, భావుకుడిని.సంపద ధ్వంసమయిన ప్రాంతంలో నివసించే నా ప్రజల దుర్భరమైన పేదరికం చూసి భయభ్రాంతుడినయ్యాను. వారి పై విధించిన రాజకీయ పరిమితులను,ఆర్ధిక అణిఛివేతనూ చూసి దిగాలు పడ్డాను,వారి నేల తల్లిని మరుభూమిగా చేయడం చూసి ఆగ్రహించాను.చీకు, చింతా లేని సాధారణ జీవితాన్ని గడపడానికి వారికి వున్న జీవించే హక్కును రక్షిండంలో ఆసక్తి కనపర్చాను. ఈ దేశానికి మొత్తంగా న్యాయబద్ధమైన ప్రజాస్వామ్య వ్యవస్ధను అందించాలని నిర్ణయించుకున్నాను . నాకున్న మొత్తం మేధా సంపత్తిని, భౌతిక వనరుల్ని- ఒక్క మాటలో చెప్పాలంటే నా జీవితాన్నే! నేను పూర్తిగా నమ్మిన విశ్వాసం కోసం అంకితం చేసాను. నన్ను దీని నుంచి భయపెట్టిగానీ, బ్లాక్ మెయిల్ చేసి గాని వేరు చేయ లేరు.నేను గాని,నన్ను నమ్మి నాతో ప్రయాణం చేస్తున్న  వారు గాని ఎదుర్కోవాల్సిన కష్టనష్టాలేవైనా కానీయండి!, అంతిమంగా నా కోర్కె విజయం సాధిస్తుందన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు.మా అంతిమ విజయాన్ని కారాగారవాసం గానీ,మరణం గాని అడ్డుకోలేవు.
మొత్తం తన మనసు ఆవిష్కరణని పై కవితలో చెప్పాడు వివా. ఈయన కేవలం ప్రకృతి   కోసం పోరాటం చేసిన వ్యక్తే కాదు,పర్యావరణ కవిత్వానికి కొత్త భాష్యం   నేర్పిన ఘనుడు. పదబంధానికి అనుభవం,అనుభూతి కలిపి కవితనల్లే నేర్పరి.ఇది పర్యావరణ కవితకు ఉండే విశిష్ట లక్షణం.
పర్యావరణ కవిత్యానికి మరొక కీలక గుణం నెరేటివ్ కాపిటల్’, అర్ధాన్ని,సంఘటనల్ని వ్యక్తిగత అనుభవాల దృక్కోణం నుండి పరిశీలించడం. ఇది మనకి అవగతం అవ్వడానికి కేవలం అనుభుతుల్ని నుండి కాకుండా అనభవం కూడా అవసరం(అనుభం అంటే ఉద్యమకారు లవ్వాలన్న ఉద్దేశ్యం కాదు)., పరిపూర్ణమైన అవగాహన.
 పర్యావరణ విధ్వంసం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదు ,అదే విధంగా పర్యావరణ ఉద్యమాలు కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం కావు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పర్యావరణ ఉద్యమాల పుట్టుకలో,( ఎక్కువ శాతం అడువుల్లో నుండి మొదలయ్యాయి.) తీరుతెన్నులోను పోలికలున్నాయి. ఇవి ఎక్కువ శాతం అహింసా మార్గాలనే పాటించాయి.  అన్నిటినీ సమకాలికంగా  చూడడం అవసరం. అందుకే పర్యావరణ కవిత్వానికి   నేరేటివ్ కాపిటల్  లక్షణం వుంటుంది. మరొకటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల,వలస వాదం  వల్ల మల్టీ నేషనల్ కంపెనీలు అంతటా విస్తరించాయి. అవ్వి అన్ని చోట్లా వనరుల్ని హస్త గతం చేసుకోడానికి ఒకే విధమైన ఫార్ములాలు ప్రయోగిస్తాయి.వాటికి భూమి మీద వున్న వనరులు కాపిటల్. రాజ్య వ్యవస్ద తనకంటూ ఒక సిద్ధాంతాన్ని లేకుండా చేయడం. కంపెనీల దృక్పధమే ప్రభుత్వాల దృక్కోణం. ఈ వ్యవస్ధలో అంతర సూత్రంగా   వనరులపై  సంరక్షణ భావం కంటే, స్థానికులు వనరులు కంపెనీలకి వనరులు ఇవ్వరన్న అభద్రతా భావం వుంటుంది. ఇది కంపెనీల  నుండి  రాజ్య వ్యవస్దకి సోకిన వైరస్. అందుకే తరుచూ భూసేకరణ చట్టాల్లో మార్పుల్ని ప్రతిపాదిస్తారు.కంపెనీలకి, ప్రభుత్వాలకి తెలుసు -వాళ్ళు ప్రతిపాదించే ప్రయోగాల వల్ల వనరుల క్షీణత జరుగుతుందని.కానీ ఒప్పు కోరు . ఎందుకంటే భయం,నిజం చెపితే ఎక్కడ దక్కదో అన్న అభద్రత.
ఈ విషయాన్ని నేను విశాఖపట్నం జిల్లాలో ఆన్ రాక్ మైనింగ్ విషయంలో, నర్సీపట్నం దగ్గర మాకవారి పాలెం లో జరిగిన పబ్లిక్ హియరింగ్ లో స్వయంగా చూశా. పబ్లిక్ హియరింగ్ కి  ప్రభావిత జనాల్ని రానీయకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంది, పబ్లిక్ హియరింగ్ కి  వచ్చిన జనాల కంటే పోలీసు బందో బస్తు ఎక్కువ. ఇందంతా  ఎందుకంటే భయం.
మన కుళ్ళిన మనసుల్లో రహస్య గోళాలు
మనం ఎప్పటికి శుభ్రపర్చుకోం
పై కవిత కొద్ది పాటి మాటల్లోనే సమాజంలో నిజమైన చెరశాల భయం అని చెప్తుంది. మనల్నిఇది మాట్లాడకు అని మనకు మనం విధించుకునే సెన్సార్ . దీని గురించి జర్మి బెంతాం మైకేల్ ఫుకోల్ట్  విపులంగా  విశ్లేషించారు.
ఇది గ్రహించిన వివా తన గురించి ఇలా చెప్పుకుంటాడు.
నేనొక తుఫాను
నా రంగేమిటా అని పరీక్షించకు
నా మొహంలోకి కూడా
నువ్వు చూడ వద్దు
ఒక్క చావుతో
అంతమయ్యే వాణ్ని కాదు నేను
నే నొక తుఫాను
నీ జైళ్ళని ఒక్క ఊపు ఊపుతాను
నేను చావను
నా తల మీద ఆకాశం
నా ఊపిరిలో
పెనుగాలు లున్నాయి
నిజమే! నేను నల్ల వాణ్నే
పుట్టుక ముందే చచ్చిపోయే
జనం మధ్య పుట్టిన వాణ్నే
అయినా సరే
నే నొక తుఫాను
నేను నల్ల వాణ్నే
నా కంఠాన్ని మూసినప్పుడు
నీ చరిత్రంతా
నల్ల బారి పోవాల్సిందే
( కెన్ సారో వివా)
(అనువాదం- అఫ్సర్,1995)
పర్యావరణ కవిత్వం లో మరో విశిష్ట లక్షణం ప్రకృతి ప్రతీకల్ని ఒక ఉన్మాద  రూపంలో విశదం చేయదు దానికి కుండే గుణాన్ని సూటి గానే చెపుతుంది. అప్పుడు ప్రకృతి ఒక ఉన్మాదంగా కాకుండా సామాజిక,రాజకీయ వ్యవస్ధ ఒక ఉన్మాదంగా ప్రస్ఫుటం అవుతుంది. పై కవితలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

మనం ఇప్పటికీ ఎప్పటికీ ప్రకృతిలోని వాట్నే ప్రతీకలు గా తీసుకుంటాం. కాని ప్రకృతిలోని జీవరాసుల్ని ముఖ్యంగా జంతువుల్ని క్రూర మృగాలుగా ప్రతీకరిస్తాం. ఇది పంచతంత్ర కధల మహిమ. నిజంగా అడవిలోని జంతువులు క్రూర మృగా లైతే  ఏ ఒక్క గిరిజనుడూ మిగిలి వుండే వాడు కాదు. మానవాళి పరిణతి చెందేది కాదు. మనం ప్రకృతిని ప్రేమతో రక్షించడం కంటే ఎదుటి వాడి కంటే ముందే మనం దాన్ని పొందాలన్న ఒక ఆత్రుతతో కూడుకున్న భయం తో కబళిస్తాం. ఈ దురాక్రమణ మనని నల్లబారుస్తుంది .మనని అలా నల్ల బారకుండా చేయడానికి వచ్చిన కెన్ సారో వివా వ్యక్తి, కవిత్వం ఓ పచ్చని కాంతి విస్ఫోటం.
Tuesday 2 December 2014 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- చిప్కో ఉద్యమం-12

చెట్లని ఆలింగనం చేస్కుందాం
వాట్ని నరకకుండా కాపాడుకుందాం
ఇది భిల్లుల ఆస్తి
వీట్ని దోపిడీకి గురికాకుండా అడ్డుకుందాం’
(మూలం-  ఘనశ్యాం  రాటురి )
(అనుసృజన)
ఈ కవిత చిప్కో ఉద్యమంలో పుట్టింది. చిప్కో ఉద్యమం మన దేశo లోనే కాక ప్రపంచ ప్రసిద్ది చెందిన ఉద్యమం . ఉద్యమం తీరులో ప్రత్యేకత చెట్లని నరకడానికి సా మిల్లుల వాళ్ళు వచ్చినప్పుడు  స్ధానిక మహిళలు చెట్లని కౌగలించుకుని వాట్ని కాపాడారు. ఇది 1972 లో ఉత్తరాఖండు లో జరిగిన ఉద్యమం. ఇదే పద్ధతిలో ౩౦౦ సంవత్సరాల క్రితం రాజస్థాన్ లో ని బైశనవి ప్రాంతంలో కూడా జరిగింది. పవిత్రమైన ఖేజరి చెట్లని రక్షించడానికి అమ్రితా దేవి ఉద్యమం నడిపారు. తన ప్రాణాల్ని కూడ కోల్పోయారు. ఈ రెండు ఉద్యమాల్లో ప్రత్యేకత ఇవి మహిళలు చేపట్టిన ఉద్యమాలు.
వారికి,వారిలోని ప్రకృతికి సదా శిరస్సు వంచి ప్రణమిల్లుతాను.

పర్యావరణ  కవిత్వంలోని ప్రత్యేకత దాని కంటూ ఓ నరేటివ్ గుణం వుంటుంది. ఇది సహజంగా ఫోక్ లిటేరేచర్కి వుండే లక్షణం.చరిత్రని సాధ్యమైనంత పొదుపుగా ,ఓ కధలా చెప్పే తీరు. పై కవితలో రాతురి గారు అదే చెప్పారు. 
Tuesday 25 November 2014 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు-నేలకు పచ్చని పదాలను అల్లిన కవి-విల్లియం వర్డ్స్ వర్త్-11

18,19 వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వల్ల ప్రకృతి రూపు రేఖలు మారిపోయాయి.బొగ్గు గనులు,మిల్లులు, రైల్ మార్గాలు,ఓడ రేవుల పుణ్యమా అని ఇంగ్లాండ్ ప్రపంచంలో ఆర్ధిక శక్తి గా ఎదిగింది. పారిశ్రామీకరణ వల్ల 1801 నుండి 1901వరకు జరిగిన మార్పుల్లో ప్రధానమైనది నగరీకరణ.ఈ కాలంలో 20 శాతం నుండి 80 శాతం వరకు ఇంగ్లాండ్లో నగరవాసులయ్యారు. గ్రామాల సామాజిక స్వరుపాలు మారాయి. ఇంగ్లాండు పారిశ్రామీకరణకు పుట్టినిల్లు అయ్యింది,దానికి వ్యతిరేకత ఏర్పడింది.
ఈ వ్యతిరేకత ఆంగ్ల సాహిత్యంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ముఖ్యంగా విల్లియం వర్డ్స్ వర్త్ కవితల్లో(1770-1850).ఆయన కవితల్లో ప్రకృతి పురి విప్పుకుంటుంది. అయన తన జీవిత కాలంలో ఇంగ్లాండులో 175000 మైళ్ళు నడిచాడు. సాహిత్య చరిత్ర కారుడు జోనాథన్ బెట్ మాటల్లో ఆయన తన పాటకులకి ప్రకృతితో నడవడం నేర్పాడుఅంటాడు. 
పారిశ్రామీకరణ, నగరీకరణ వల్ల, ప్రకృతి విధ్వసం వల్ల సామాన్య ప్రజలు స్వచ్చమైన గాలి పీల్చలేకపోతున్నారు అన్నాడు.నేలను పచ్చగా అల్లలేకపోతున్నారు అనీ చెప్పాడు. గ్రామీణ ప్రజలకు అక్షర జ్ఞానం లేకపోయినా ప్రకృతి తో మమేకమయే గుణం వుంది అన్నాడు. ప్రకృతితో మమేకమై జీవించడం చెప్పిన కవి వర్డ్స్ వర్త్.
తటాకాలున్న నేలతో అనుబంధం వున్న వ్యక్తి ఆయన.ఆయన చెరువులు గురించి రాసిన పుస్తకం ఇప్పుడు ఎవరికీ తెలియదు,కాని అప్పట్లో బాగా అమ్ముడుపోయిన పుస్తకం అది. ఆయన కవితా సంపుతులకంటే ఎక్కువ ఆర్ధిక సంపాదనని ఇచ్చిన పుస్తకం అదే.
ఆయన మాటల్లో ప్రకృతి సంరక్షణ అంటే అది ప్రణాళిక బద్దంగా జరగాలి, కొల్లకొట్టుకోవడానికి కాదు
ఆయన కవిత్వ తాత్వికతలో రైతులు,పశువుల కాపర్లు ప్రకృతితో మమేకమైన జీవనం ఒట్టిపడుతుంది.
ఎవరినుద్దేసించి---
పచ్చటి లోయలు ,వాగులు,గుట్టలు
పశువుల కాపర్ల ఆలోచనలు వేరు
పొలాలు, వాళ్ళ పసిడి నవ్వుల్లో ఆలోచనల్లో వాళ్ళు శ్వాసించారు
ఉమ్మడి గాలి, కొండలు నుండి అతను ఊపిరి పొందాడు
క్లిష్టతరమైన మెట్లను ఎక్కి ,ఇష్టంగా
ఎన్నో సంఘటనలు అతని మదిలో
కష్టాలు, నైపుణ్యం,ఆత్మ నిబ్బరం, సంతోషం లేక భయం;
ఓ పుస్తకంలా జ్ఞాపకాల్ని భద్రపర్చుకున్నాయి
మొద్దు పశువులు,అతను కాపాడినవి
అతను పోషించినవి, పెంచుకున్నవి
ఈ పొలాలు, ఈ కొండలు
అవి ఆయన సహచరులు,అంతకంటే ఎక్కువ
అతని రక్తం కంటే ఎక్కువ- అంత కంటె తక్కువేం కాదు? అవి అతని
భావనల్లో ఒక భాగం,అంతే
ఓ మమైక ఆరాధ్య భావన
జీవితంలోని ఆనందం ఒక అనుభూతుల భావం తప్ప ఇంకేమిలేదు . 
(
అనుసృజన)
ఓ దేశం తన ప్రాంతాన్ని అందరికీ ఉపయోగపడేలా ఉండాలి అంటే ,ఆ ప్రాంతం తన స్వారుప్య రూపాన్ని మార్చుకోకుండా,గ్రామీణ స్వారుప్యాన్ని ఉంచుకుంటూ,ఒక ప్రత్యేకమయిన చరిత్రని , గాలిలో అనే చరిత్రలో తన వునికిని కాపాడుకుంటూ,దానికంటూ చరిత్రలో ఓ గుర్తుగా వుండాలి.
ఆయన తన ప్రాంతంలో రైల్ మార్గం వల్ల చెరువులు పాడైపోతాయని దానికి వ్యతిరేకపోరాటం చేశాడు.


Tuesday 18 November 2014 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు-అడవి పాట చికొమెండిస్‌-10

పర్యావరణ ఉద్యమాల ద్వారా పర్యావరణ స్పృహ ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తి చెందింది. దీనికి ముఖ్య కారణం, 1960 కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వనరులు దోపిడికి గురవ్వడం. ఈ తీరుని వ్యతిరేకిస్తూ స్థానికులు చేసిన తిరుగు బాటు. అందులోది అమెజాన్ లో చికొమెండిస్‌ చేపట్టిన ఉద్యమం కీలక పాత్ర వహించింది.అతని మాటల్లో ఉద్యమానికి నిర్వచనం-మొదట్లో నేను రబ్బర్ చెట్లను కాపాడడానికి పోరాడుతున్నాననుకున్నాను, తర్వాత అమెజాన్ సతత హరిత అడవుల్ని కాపాడడానికి పోరాడుతున్నాననుకున్నాను, ఇప్పుడు నాకు అర్ధమైంది నేను మానవాళికై పోరాడుతున్నానని.
చికో మెండిస్  చేపట్టిన  ఉద్యమంపై మనోఎల్ శాంతా మారియా కవిత అమెజాన్ లోని ప్రజల గోడును వివరిస్తుంది.
 ఇప్పడు ఇండియన్స్ సహాయం కోసం అర్ధిస్తున్నారు
అట్లాంటిక్ సతత హరిత అడవులు కన్నీళ్ళు రాలుస్తున్నాయి
 ఇప్పుడు అమెజాన్ అక్కడి మృతుల గురించి వ్యధ చెందుతోంది
దుర్గంధమైన గాలి వీస్తోంది
మమ్మల్నందర్ని ఉక్కిరిబిక్కిరి చేసి భయబ్రాంతులకి గురిచేస్తోంది.
(అనుసృజన)
పర్యావరణ ఉద్యమాలకి అంతం వుండదు. నిరంతరం ప్రకృతి వనరులు దోపిడీకి గురవుతూనే వుంటాయి.డబ్బు, పలుకుబడి, రాజకీయం, సాంకేతిక పరిజ్ఞానం, ఈ దోపిడిని పెంచుతోందే తప్ప తగ్గించడం లేదు. చాలా మటుకు పర్యావరణ ఉద్యమాలు అహింసా పద్ధతులే అనుసరిస్తాయి. ఆ ఉద్యమకారులు మనల్ని వదిలి పోయిన తీరు ,మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే వుంటుంది.
చికో మెండిస్
ఆతను ఈ గ్రహానికి కరుణని పంచాడు
ఇప్పడు ఓ ఆకులా రాలి పోయాడు
అతనికి ఇష్టమైన సతహరిత అడవుల్లో, నమ్మశక్యం కావడం లేదు
అమెజాన్ వీరుడు నిష్క్రమించాడంటే.
(కెన్ని జే బెజ్)

(అనుసృజన)