Tuesday 27 January 2015 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- సైలెంట్ వ్యాలీ ఉద్యమం-19

స్వాతంత్ర్యానంతరం స్వాతంత్ర్య పోరాటం కూడా కొనసాగుతుంది అనటానికి నిదర్శనం పర్యావరణ ఉద్యమాలు. మనం విదేశీయలనుండి విముక్తి పొందాం కాని మన వనరుల నిర్వహణలో వాళ్ళ ఆలోచనలు,ప్రణాలికల నుండి మాత్రం కాదు. అప్పడు గీసిన  సర్వే రేఖలు ఆన్ని రంగాల్లో ఇప్పటికీ చెరిగి పోలేదు. ఇప్పుడు ఓ మూడొందలు చిలుకు చట్టాలు పనికి రావని వాట్ని తొలగించాలని ప్రయత్నాలు మొదలైయాయి. ఒక విధంగా దీనిని మనకంటూ మన ప్రణాలికల్ని మనంతట మనమే రుపొందిచుకునే ప్రయత్నం గా బావించాలి. ఈ తీరు మన వనరుల నిర్వహణలో మనకంటూ వున్న ఊహలకి  ప్రణాళికనిస్తుంది. అదే విధంగా మన చరిత్రను భద్రపరుస్తుంది.
స్వాతంత్ర్యానంతరం చేపట్టిన ప్రాజెక్టులన్నిటికీ మూలాలు బ్రిటిష్  హయంలో  ప్రవేశ పెట్టిన ఆలోచనలే, అందుకే ఈ వ్యతిరేకత ఏర్పడుతోంది.వారికి స్థానిక అవసరాలకంటే వ్యాపార లక్ష్యాలు ముఖ్యం ,కాని మనకి స్థానికత కీలకం. దీనిని విస్మరించి మొండిగా ప్రాజెక్ట్లు చేపడితే ముందుగా జరిగేది వ్యతిరేక గళాల ప్రతిధ్వని. ఇది నిరూపించింది  సైలెంట్ వ్యాలీ ఉద్యమం.1929 లో ఒక బ్రిటష్ ఇంజనీర్ కేరళలోని సైలెంట్ వ్యాలీ లో హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్టుని నిర్మించాలని ఊహించాడు కాని చేపట్టలేదు. అతని ఊహకు అందని విషయం యాభై,అరవై సంవత్సరాల తర్వాత ఈ విషయం పై ఒక ఉద్యమం జరుగుతుందని. ఇది మన దేశంలో వున్న అరుదైన సతత హరిత అడవి.8950 హెక్టార్ లలో విస్తరించి వుంది. కొన్ని వందల సంవత్సరాలుగా మనుషులు జాడ అతి తక్కువగా వుండి సురక్షితంగా వుంది. ఇది  40,000 హెక్టార్  లలో నిరంతరంగా విస్తరించివుంది.ఇక్కడ రైల్వే స్లీపర్ల కోసం ఒక  ఎకరాలో కేవలం రెండు లేదా మూడు చెట్లు నరికబడ్డాయి. 19 శతాబ్దంలో కాఫీ తోటల్ని పెంచాలని ప్రయత్నం చేసి తర్వాత వైదొలిగారు, మన దేశంలో అంతరించిపోయి,అరుదై పోయిన వన్యప్రాణులకి గూడు ఈ ప్రాంతం.
సర్వాత్రా జరిగేదే ఇక్కడ జరిగింది.1973లో అప్పటికే ప్రణాళిక సంఘం వారు ఆమోదించిన హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్టు విషయం వెలుగు లోకి వచ్చింది. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకున్నది రోములస్ విటేకర్, ఈమె తన భర్త జాయి విటేకర్ తో కలిసి కేరళలో పాముల పై అధ్యనం చేయడానికి ఆస్ట్రేలియా నుండి వచ్చి అక్కడ స్థిరపడ్డారు.ఈ విషయం పై తన వ్యతిరేకతను తెలుపుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది,క్రమేణా ఈ విషయం గురించి తెలుసుకున్న కేరళ లోని మేధావులు,పర్యావరణ ప్రేమికులు ప్రాజెక్టుకు వ్యతిరేకతను తెలిపారు. ఈ ఉద్యమంలో కీలక పాత్ర వహించింది కేరళ శాస్త్ర సాహితి పరిషత్.ఈ వ్యతిరేక నినాదాల్లో వచ్చిన పర్యావరణ పద జాలాన్ని కించపరిచారు, ఉదా: వర్జిన్ ఫారెస్ట్(virgin forest) , విశిష్ట (unique) అడవులు. అన్ని రాజకీయ పార్టీలు ప్రాజెక్టును సమర్ధించాయి.  ఈ ఉద్యమంలో సాహితి వేత్తలు కీలక పాత్ర వహించడం దీనికున్న ప్రత్యేకత. నిశ్శబ్ద లోయ ప్రతిధ్వనుల తరంగాలు వీరి ద్వారా ప్రకోపించాయి.పర్యావరణానికున్న ఒక రొమాంటిక్ ఇమేజరి నుండి జీవనానికి, ప్రకృతికి వున్న అవినాభావ సంబంధాన్ని తెలిపాయి.
కేరళ సాహిత్యంలో పర్యావరణానికి  సంబంధించిన కవితల్లో ఉలూర్ యస్.పరమేశ్వర్ అయ్యర్ (1877-1949) ‘The Hymn of Love’(ప్రేమ సంగీతం-1933) ని ప్రధమ కవితగా భావిస్తారు.
ప్రపంచానికి ఒక నమ్మకం వుంది-ప్రేమ, అది ,
పున్నమి చంద్రుడు మనకి తన తేనెని అందిస్తాడు ,ఆరగించడానికి-పాలు,
విశ్వం వివిధ రూపాల్లో భక్తిని ప్రదర్శిస్తుంది,
ప్రేమ,కోరిక,ఇష్టం,
నేల పై తన వాంఛను కురిపిస్తుంది,
ద్వేషం,శత్రుత్వం, అది కేవలం నాస్తిక వాదన నమ్మకం:
అయ్యో! చీకట్లో పడిపోయిన ప్రపంచం అర్ధాంతర చావుని కొని తెచ్చుకుంటుంది,
విధ్యంసకరమైన మూర్తి ప్రేమ సంబంధాల్ని అగ్నికి ఆహుతి చేస్తుంది,
పూల తోటని బీడు భూమిగా, స్వర్గాన్ని నరకంగా.
(అనుసృజన)

మేధావులు దీనిని కవిత్వoగా జమకట్టక పోవచ్చు,అనువాదంలో కవిత్వ తత్వాని చేరక పోవచ్చు, ప్రకృతి, మన మనస్సులు కవిత్వమయం చేసినప్పుడు జీవితం పర్యావరణీయం అవుతుంది.
Tuesday 13 January 2015 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- నర్మదా బచావో ఆందోళన్-18

నర్మదా బచావో ఆందోళనలో కీలక పాత్ర వహించింది  మేధా పాట్కర్. ఈ ఉద్యమం ద్వారా ఉద్యమం ఎన్ని విధాలుగా చేపట్టాలో కూడా వెలుగులోకి వచ్చింది. పర్యావరణ,నదులు ,ఆనకట్టలు చర్చల్లో నిర్వాసితం అన్న అంశం ప్రపంచ వ్యాప్తంగా తెల్సింది. ప్రపంచ బ్యాంకు ఈ విషయంలో తన ఆపరేషన్ ఇవాల్యువేషన్ డైరెక్టివ్స్ మార్చుకుంది. పునారావాస ,పునరుద్ధరణ ప్రణాళికలు మళ్ళీ వెలుగులోకి వచ్చాయి. ఈ మార్పులు ఇప్పుడు భూసేకరణ చట్టంలో జరుగుతున్న మార్పులకు మూలాలు. అదే విధంగా అభివృద్ధిలో భాగస్వామ్య౦ పేరు మీద జరుగుతున్న పబ్లిక్,ప్రైవేట్,పీపుల్ పార్టనర్ షిప్ వంటి ప్రయోగాలు మొదలవడానికి కారకులు.
మనం జీవించడానికి వేరే గ్రహాల్ని అన్వేషిస్తున్నాం ,కాని అసలు విషయం ఈ భూమిని నిర్వీర్యం చేసి మనమందరం  నిర్వాసితులమవుతున్నాం అన్నది అసలు వాస్తవం. సామాజిక వాతావరణం మారినప్పుడు సహజంగానే ప్రకృతి వాతావరణం మారుతుంది. నది పైన పెద్ద ఆనకట్టి కట్టినప్పుడు పరివహక ప్రాంతంతో బాటు ఆయకట్టు ప్రాంతం తీరుతెన్నులు మారుతాయి. ఒక కాలంలో ఆనకట్టలు కట్టింది వ్యవసాయానికి నీరందించడానికి ,కాని నేడు వ్యవసాయం అన్నది నామ మాత్రమే ,అసలు అవసరాలు నగరాల దప్పిక తీర్చడానికి, పరిశ్రమల అవసరాలకి. పోలవరం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వీటన్నిటికి త్యాగాలు చేసేది గిరిజనులు, దళితులూ. వీళ్ళకి భూమి మీద హక్కులు ఇవ్వరు. దళితులకు ఇచ్చిన భూములు నేటికీ డి. పట్టా భూములే, వాటిలో దేశ అబివృద్ధి కోసం తిరిగి తీస్కుంటాం అని సుస్పష్టంగా పేర్కొని వుంటుంది.
నర్మదా  ప్రాంత వాసులు నర్మదా నది కి ఆనకట్టకు సంబంధించిన కధ ఒకటి చెపుతారు.మహాభారత కాలంలో అర్జునుడు నర్మాదని పెళ్ళాడాలనుకుంటాడు.నర్మద ఒక షరతు పెడుతుంది. అది తన మీద సాయంత్రం కాకి కూతలోపు తన పైన ఆనకట్ట కట్టాలని. అందుకు అర్జనుడు ఒప్పుకుని భీముడి సహాయంతో రెండు పర్వతాలు తెచ్చి నదికి ఇరువైపులా పెడతాడు. ఇంకా మరో కొండ తెచ్చి ఆ కొండల పైన వారధి ఏర్పరచడానికి వెళతాడు. వాళ్ళు అన్నంత పని చేస్తారని నర్మద సాయంత్రంలోపే కాకిలా అరుస్తుంది. అది  విని అర్జున ,భీములు తమ ప్రయతాన్ని వదిలిపెట్టి తిరుగు దారి పడతారు. తల్లి నర్మదని ఎవరూ  బంధించలేరని స్థానికుల నమ్మకం. మరి కొందరు స్ధానికులు ఈ కధకి కొనసాగింపుగా, అర్జనుడికి కోపం వచ్చి కలియుగంలో మనుషులు నర్మద పై ఆనకట్ట కడతారని శపించాడని అంటారు. ఆ శాపం ఎన్నో విధాలుగా ప్రస్ఫుటం అయ్యింది. కొందరు గిరిజన పెద్దలు ఆనకట్ట కడతారని పాతిక సంవత్సరాలుగా తమ వ్యవసాయ భూముల్ని అభివృద్ది పర్చుకోలేదు. ఇదీ ఒక విధమైన నిర్వాసితమే.
నేడు జరుగుతున్న 102 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్స్ లో మన పురాణాలు సైన్స్ గురించి మాట్లాడుతాయి,కాని ఇవి ఎవరి పురాణాలు ? గిరిజనుల జ్ఞానం, జీవనం సైన్స్ గా పరిగణిoచి దాన్ని విస్మరిస్తాం. ఎందుకంటే వాళ్ళు భూమి పుత్రులైనప్పటికీ వాళ్ళని నరసురులుగా చిత్రీకరించాం. అక్కడ ఆనకట్టలు కడితే భూమిని అభివృద్ది చేస్కోకుండా వుండి పోయారు. అదే కొత్త రాజధాని కాని ,పోలవరం కాలువ వస్తోంది అంటే చుట్టు పక్కల భూముల ధరలు ఆకాశాన్ని తాకు తాయి. ఎకరం భూమి కోటి పైగా పలుకుతుంది. ఒక ఎన్. ఆర్. ఐ. కూడా కొనడానికి సంకోచిస్తాడు.
మనం భూసేకరణ ,పురావాస ,పునరుద్ధరణ చట్టంలో మార్పులు ఒక శతాబ్దం తర్వాత మార్పులు చేస్తున్నాం. కాని ఇప్పటికీ ఆ రెండిటిని అమలు పరచడంలో మనకి నైపుణ్యం లేదు. ముఖ్యంగా పునరావాస,పునరుద్ధరణ అన్నది కేవలం నిర్వాసితుల్ని ఒక చోట నుండి  మరో చోటుకి చేర్చి వారికి బస ఏర్పాటు చేయడం కాదు. వారు తిరిగి సామాజికంగా,మానసికంగా తమ ఉనికిని ,జీవనాన్ని పునారావృతం చేస్కోవడం. దానికి పట్టే కాలాన్ని ఖచ్చితంగా చెప్పలేం. నిర్వాసితుల మదిని తొలిచే ప్రశ్నలకి మన దగ్గర సమాధానాలు లేవు. వారిని వారు ఓదార్చుకునే తీరు...
నీ మదిలో సమాధానాలు దొరకని ప్రశ్నలపై  ఓపికగా వుండు, ఆ ప్రశ్నల్ని వాటిగానే ఆస్వాదించు.బంధించిన గదులలాగా, పరిచయంలేని బాషలో రాస్తున్న పుస్తకాలుగా స్వీకరించు.వాటికి సమాధానాల్ని ఆశించకు,వాటి సమాధానాల్ని నువ్వు జీర్ణి౦చుకోలేవు, వాటితో సాంగత్యం చేయనూలేవు,విషయం ఏమిటంటే, అన్నింటా జీవించాలంటే, ఇప్పుడు  ఆ ప్రశ్నల్ని వదిలిపెట్టు.క్రమేణా నువ్వు, నీకు తెలియకుండానే, రాబోవు రోజుల్లో ఒక  సమాధానం గా  జీవించేస్తావు.-రైనర్ మారియా రైక్.
1992లో ఖమ్మం జిల్లాలోని చింతూర్ మండలంలోని చట్టి గ్రామంలో మాన్య ప్రాంత చైతన్య సదస్సు కార్యక్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధ కోయరాలు అన్న మాటలు ఎప్పటికీ మర్చిపోలేను  బాబూ, నా చుట్టూ పక్కల వున్న చెట్టు,పుట్ట ,వాగు, వంక ,జీవాలని  నాకు నష్ట పరిహారంగా ఇయ్యండి, నేను మావూర్ని పోలవరం డ్యామ్  కోసం వదిలి వెళ్ళి పోతామన చుట్టూ వున్నఆవరణ ,మనలోని పంచేంద్రియాలు, వాటినుండి మనని విడదీసి బతకమనడం నిర్వాసితం. దానికి నష్ట పరిహారం ఇవ్వడం ఎవ్వరి తరం కాదు. నేడు అవతరించిన రెండు కొత్త రాష్ట్రాలకి త్యాగం చేసింది పోలవరం నిర్వాసితులు.వీరి కోసం ఓ కొత్త జిల్లాని ఏర్పాటు చేయడం అన్నది కొత్త విషయం కాదు. పెసా చట్టం ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనులకి వారి జిల్లాలు ,మండలాలు ఏర్పాటు చేయాలి, అదే విధంగా కొత్త ప్రాజెక్ట్లు వస్తునప్పుడు గ్రామసభలకి తెలియచేసి వారి ఆమోదం పొందాలి. మరి ఇవన్నీ ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న భూసేకరణ ఆర్డినెన్స్ లో లేకుండా పోతున్నాయి.అంటే ప్రాధమిక మానవ హక్కులైన ప్రి అండ్ ప్రియర్ ఇంటిమేషన్, కన్సంట్ తో  బాటు సామాజిక ప్రభావ అంచనాలను కొట్టి పారేయడమే.
ఆ  మనుషులు ఎక్కడ
(నశ్రుల్ గీతి, అనూప్ గోషాల్)
గంగ, సింధు, నర్మదా
కావేరి ,జమునల జలాలు 
అవి మునపటి లానే ప్రవహిస్తున్నాయి
కాని అప్పటి మనుషులు ఏరి?
గంగ, సింధు, నర్మదా
 నిశబ్దం లో వున్న హిమాలయాలు
నిలువెత్తు భక్తితో అలానే నిలబడి వున్నాయి
కాని ఇప్పుడు  అక్కడ ఋషులు వుండడంలేదు
మనం అప్పటి మనుషులం కాదు
మన పైన ఆకాశం ఇప్పటికీ వుంది
కాని ఇంద్రుడి దివ్యత్వం లేదు
కైలాస పర్వతం వుంది
అందులో శివుడి తేజస్సు లేదు
మన పైన ఆకాశం యిప్పటికీ వుంది
కాని ఇంద్రుడి దివ్యత్వం లేదు
కైలాస పర్వతం వుంది
అందులో శివుడి తేజస్సు లేదు
దేవుడి పిల్లలిప్పుడు యాచిస్తున్నారు
ఇదేనా మన విధి
కాని అప్పటి మనుషులు ఏరి?
గంగ, సింధు, నర్మదా
 ఇప్పటికీ ఆగ్రా కోట వుంది
దిల్లి కూడా వుంది
కాని సర్వాంతర్యామి కీర్తి లేదు
కోహినూర్ వజ్రం దొంగలించబడింది
నెమలి సింహాసనం కనిపించడం లేదు
మన వీర సైనికులు, చరిత్ర ఇప్పుడు
ఎవరి దగ్గరైనా సమాధానాలు వున్నాయా?
మనం ఏమీ చెయ్యొద్దా, ఏమీను?
ఎవరి దగ్గరైనా సమాధానాలు వున్నాయా?
మనం ఏమీ చెయ్యొద్దా, ఏమీను?
మన కోసం ఏమిటని వేచి వుంది?
ఇది మన క్రూర నుదిటి రాత అని ఒప్పుకుందామా?
కాని అప్పటి మనుషులు ఏరి?
గంగ, సింధు, నర్మదా
కావేరి ,జమునల జలాలు 
అవి మునపటి లానే ప్రవహిస్తున్నాయి
కాని అప్పటి మనుషులు ఏరి?
గంగ, సింధు, నర్మదా
(అనుసృజన)
 ఈ పాట వింటుంటే మనస్సు కనురెప్పలకి కన్నీళ్ళ చెమ్మ నీటి గింజల్లా అల్లుకు పోతాయి. పర్యావరణ కవిత్వం ఈ నీటి గింజల సవ్వడే! ఎందుకంటే అబివృద్ధిని పొందడానికి   జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ లో  గిరిజనులు, దళితులూ ,నిరుపేదలు ,చిన్న రైతులు గిన్ని పిగ్స్ గా మార్చబడుతున్నారు.

నదిప్పుడు మన నేలలో వున్న టియర్ గ్లాండ్ ,అది డ్రై అయిపోతోంది.పర్యావరణ కవిత్యం ఆ డ్రైనెస్ కి  కొద్దిగా చెమ్మనిచ్చే మంచు కమ్మిన ఉదయం.
Tuesday 6 January 2015 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- నర్మదా బచావో ఆందోళన్-17

మన దేశ సంస్కృతి నదీ సంస్కృతి. మన జీవనం గుడులు(ప్రముఖమైనవి) అన్నీ నది ఒడ్డున వెలిసినవే. అదే విధంగా మన అంతిమ యాత్రలు, పాప ప్రక్షాళనలు, పిత్రులను స్మరించుకునేది ఆ ఒడ్డునే. ఒక విధంగా చెప్పాలంటే మన జీవన చక్రం ,జల చక్రంతో ముడి పడి వుంది. ఈ జీవన చక్రానికి జీవం పోయడానికి భగీరధుడి ప్రయత్నాలు సదా జరుగుతూనే వున్నాయి.గంగ భూమిని చేరడానికి మధ్యలో వారధి కావాలి ,లేకపోతే గంగ ప్రవాహ తాకిడిని తట్టుకునే శక్తి భూమికి లేదు. ఇతిహాసాల ప్రకారం అప్పడు బ్రహ్మ ప్రకృతి ప్రళయం గురించి తీవ్రంగా వ్యధ చెందాడట. ఆ వ్యధను ఈ విధంగా వ్యక్త పర్చాడు...
గంగ, ఎవరి అలలు స్వర్గంలో ప్రవహిస్తాయో
ఆమె మంచు దేవుడి బిడ్డ
శివుడిని ఆశ్రయించు,ఆయన సహాయం కోరు
ఆమె ప్రవాహాన్ని మధ్య దారిలో అడ్డుకునేందుకు
ఒక్క భూమి వల్ల అది సాధ్యపడదు
గగనం  నుండి వస్తున్న ప్రవాహాన్ని
(అనుసృజన)
పై ప్రస్తావించిన మెటాఫర్ పెద్ద పెద్ద నదులైన గంగ వంటివి ,వాటికి సంబంధించిన జలచక్రాల గురించి. ఇక్కడ గమనించాల్సిన విషయం పచ్చదనం లేని (నేకెడ్ ఎర్త్) భూమి పాకి నీటి ప్రవాహం ఉదృతంగా వస్తే విపత్తులు సంభవిస్తాయి. శివుడి జడలలో ఓ భౌతిక శక్తి వుంది, దానికి ఉపరితలం నుండి వేగంగా వస్తున్న నీటి తాకిడిని అడ్డుకునే శక్తి వుంది. అది కొండలలో వున్న పచ్చదనమే కావచ్చు.
పచ్చదనాన్ని ఈ చూపుతో చూసి వుంటే నది ఒడ్డున నున్న గూడుల స్ధానం లో డ్యాంలు వచ్చివుండేవి కావేమో. బాబా ఆమ్టే అలా ఒడ్డున ఒంటరి భౌద్ధ వృక్షంలా ఉండేవాడు కాదు.పారిశ్రామీకరణ అన్నది మనలో కాలాన్ని జయించి ఎక్కువ స్పేస్ ని ఆక్రమించాలి అన్న కోరికను బలంగా పెంచింది. దీని వల్ల మన లోని ప్రకృతి క్షీణించింది.డ్యాంలు కట్టడం వల్ల నాల్గు రకాల విధ్వంసం జరుగుతుంది. 1.పరీవాహక ప్రాంతంలో వర్షపాతం తగ్గుతుంది, తదనుగుణంగా నదీ ప్రవాహం తగ్గి, జీవ నదికి ఋతువుల బట్టి ప్రవాహం ఏర్పడుతుంది.2. సహజ సిద్ధ మైన ప్రవాహాన్ని అరికట్టి ,ఇంజనీరింగ్ తో ఏర్పడ్డ ప్రవాహం వల్ల ఆయకట్టు ప్రాంతాలలో వాటర్ లాగింగ్,(నీటి నిల్వ) సెలినిటి(ఉప్పగా మారడం) పడుతుంది (యివి కోస్తా ప్రాంతంలో కనిపించే సమస్యలు).3. నీటి సహజ  ప్రవాహ తీరులో మార్పుల వల్ల దిగువ ప్రాంతంలో భూగర్భ నీరు పునరావృతం అవ్వడంలో  ఒడిదుడుకులు ఏర్పడుతాయి.4. సముద్రంలో కలిసే ఫ్రెష్ వాటర్ నిష్పత్తి తగ్గడం వల్ల సంద్రపు నీరు- ఫ్రెష్ వాటర్ బ్యాలెన్స్ లో మార్పులు జరుగుతాయి  దీని  కారణంగా సెలినిటి, ఇంకా సముద్రం కోతకు గురవుతుంది.
ఒక డ్యాం వల్ల ప్రకృతిలో జరిగే మార్పులు ఇవి. ప్రకృతి వనరుల్ని వినియోగించడం కోసం  హింసతో ముడి పడి వున్న మార్గాలే అవలంబిచాల్సిన అవసరం లేదు. స్థానికుల జ్ఞానాన్ని ప్రతిపాదనల్ని పరిగలోకి తీసుకోవచ్చు. ఈ మాటలు అన్నధి ఆధునిక ఇరిగేషన్ ప్రాజెక్ట్లు చేపట్టిన  సర్ ఆర్థర్ కాటన్, భారత దేశంలో వివిధ ప్రాంతాలలో పురాతన కాలం నాటి పలు రకాల కట్టడాలున్నాయి... ఇవి గొప్ప పనులు, ఇవి కాలానికి తట్టుకు వున్నాయి, నైపుణ్యానికి చిహ్నాలు. నేను మొదటి సారి భారత దేశానికి వచ్చినప్పుడు ,ఈ కట్టడాల పైన చూపిస్తున్న అశ్రద్ధ గురించి స్ధానికులు సూక్ష్మoగా చెప్పిన తీరు  వాస్తవం. వాళ్ళన్నది మేము నాగరిక క్రూరులం,పోరాడడంలో అద్భుతమైన నైపుణం వున్న వాళ్ళం,కాని ఎంత అత్మాన్యూనతులం ఆంటే పూర్వీకులు నిర్మించిన వాటికి మరమత్తులు చేయం సరికదా ఆ వ్యవస్ధల్ని కనీసం అనుకరించి కొనసాగించే ప్రయత్నం కూడా చేయం.   మన సంస్కృతి లో  ప్రకృతిని వారసత్వంగా చూడడం క్షీణించిన లక్షణం. ఇది ఆధునికతలో మరీ ఎక్కువైంది. ప్రకృతినే కాదు, దానిని అప్పుడే ఆధునిక ధోరణిలో ప్రకృతికి సింబాలిక్ గా   నిర్మించి వినయోగించిన వాళ్ళను విస్మరించడం ఆనవాయతీ.
రెండు దశాబ్దాల క్రితం రాజమండ్రి దగ్గర బొమ్మూరులో ని తెలుగు విశ్వవిదాయలం పక్కనే వున్న ఓ పాడు బడిన ఇంటిలోకి వెళ్ళా. గోడల్ని తాకితే కూలిపోయేలా వున్నాయి, ఓ పాడుబడిన గది లోని సగం తెరుచుకున్న కిటికిలో నుండి వెల్తురు వస్తోంది. అది గోడలోని అల్మారాలో దీపం పెట్టి ఆర్పేయడం మర్చిపోయి వెళ్ళి పోయినట్లు వెలుగుతోంది. ఇంటి బయటికి వచ్చి చూసా, కొండ పైన ఇల్లు ,దూరంగా గోదావరి నది తన ప్రయాణ మార్గాని సర్వ్ మ్యాప్ లోని  రేఖ లా     సాగుతోంది. సూది లోనుండి పత్తి దారంలా, దాని మొత్తం నది నడక, దారి ఒక్క చూపులో బంధించ గల వైడ్ యాంగిల్   దృష్టి.పర్ఫెక్ట్ షెటర్ స్పీడ్, అపర్చర్, లైట్  అండ్ టోన్ ని ప్రిసైస్ గా కాప్చర్ చేసే లొకేషన్. అది ఎవరిదో కాదు సర్ ఆర్థర్ కాటన్ ఇల్లు. ధవళేస్వరం దగ్గర గుఱ్ఱం మీద వున్న ఆయన విగ్రహానికి ఏటా పూల దండలు పడతాయి. ఎక్కడైతే ఆయన గుఱ్ఱం ఎక్కి ఆనకట్టకు ప్రణాళిక రూపొందించాడో అక్కడ మాత్రం ఓ  ఇల్లు శిధిలంగా మిగులుతుంది. ఈయన పాపం  స్ధానికుల  మనోగతాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని 1874 లో అన్నాడు కాని అది ఇప్పటికి  కలగానే మిగిలింది.
ఇప్పుడు మెగా ప్రాజెక్ట్ లు అమలు పర్చే ముందు చేప్పట్టే పబ్లిక్ హియరింగ్ల ఉద్దేశ్యం అదే. కాని ఇవన్నీ కంటి తుడుపు ప్రయత్నాలు మాత్రమే. కైఫియత్లు (మనసులోని మాట) ఎవరు వినరు .
పర్యావరణ కవిత్వం ఈ కైఫియత్ల ఘోష. శివుడి జడ సత్వం లోని పచ్చదనాన్ని కేవలం నలుపు రంగులో చూపించడమే కాక , దాని మార్మిక ప్రక్రియ రహస్యాన్ని ఉపదేశిస్తుంది.  గ్రీన్ అనే రంగు సెకండరి రంగు, ప్రైమరి రంగు కాదు. ఇది నీలం,పసుపచ్చ రంగులు కలిస్తే వచ్చే వర్ణం. నీలం రంగు నిష్పత్తి ఎక్కువ వుండి  ,పసుపచ్చ రంగు నిష్పత్తి తక్కు వుండి వాటి కలయిక వల్ల పుట్టిన పచ్చని రంగు(డార్క్ గ్రీన్/ ఆలివ్ గ్రీన్) నలుపు రంగు దగ్గర గా వుంటుంది., అలానే ప్రైమరి,సెకండరి రంగుల్ని కలిపినా అవి చాలా డార్క్ షేడ్స్ లో వుంటాయి. వాట్ని దూరం నుండి చూస్తే నలుపు లానే కనిపిస్తాయి. చీకట్లో చెట్లని చూసినట్టు రంగుల ప్రపంచాన్ని అక్షరాల కుంచెతో కాగితం కాన్వాస్ మీద వేసే చిత్రం పర్యావరణ కవిత్వం. ఈ చిత్రాల్ని డ్యాం వల్ల  హింస గురవుతున్న  నాటి శ్రీశైలం నుండి నేటి పోలవరం వరకు బాధితులు చిత్రిస్తూనే  వున్నారు.
సంతాల్ గిరిజనులు దామోదర్ వ్యాలీ కార్పోరేషన్ గురించి పాట రూపం చెప్పుకున్న వ్యధ....
నా నేల పై కార్ఖానా తెరిచేందుకు ఏ కంపెనీ వచ్చింది?
అది నదిలో, కుంటల్లో దాని పేరు రాస్కుంది
డి.వీ.సి. అంటూ?
యంత్రాలతో మట్టి   తవ్వి, నేలను నదుల్లో పోస్తోంది
కొండను తవ్వి బ్రిడ్జ్ కట్టింది
కింద నీరు పారుతుంది
రోడ్లు వస్త్తున్నాయి, వాళ్ళు మాకు కరెంటు ఇస్తున్నారు
కార్ఖానా  తెరిచి
అక్కడి ప్రజలందరూ వాళ్ళని    ప్రశ్నిస్తారు
మళ్ళీ దాని పేరుకి అర్ధమేమిటని అడుగుతారు
సాయంత్రం అయ్యేటప్పటికి కాగితాల్ని కూలిగా ఇస్తారు
అవి నీళ్ళల్లో కరిగి పోతాయి
ప్రతి ఇంట్లో ఒక భావి వుండేది అది నీళ్ళు ఇచ్చేది
వంకాయలకి,క్యాబేజీలకి
ప్రతి ఇంటి చుట్టూ కంచె వుండేది అది
ఇంటిని రాజప్రాసాదంగా చూపించేది
ఈ ప్రాంతంలోని మా సంతాల గొంతుని నులిమేసారు,
మీరు వచ్చి ఇక్కడ నిరంతరం మండే మారణ ఘాట్లుగా మార్చారు,
మిమల్ని మీరు డి.వీ.సి. పిలుచుకుంటూ?
(అనుసృజన)

ఆధునిక భారత దేశంలో ప్రతి మెగా డ్యాం లక్షల మందిని సారవంత మైన లోయ ప్రాంతాల నుండి(ఎగువన,దిగువున) నిర్వాసితుల్ని చేసింది. సారవంత మైన అల్లువియాల్ నేలల్ని ముంపుకి లేక పొతే నిస్సారంగా నైనా మార్చింది. ఈ అంశాలు కొత్త ఇరిగేషన్ లెక్కల్లో పరిగణలో రావు. ఈ విధ్వంశంని అరికట్టేందుకు, మళ్ళీఅభివృద్ధికి కొత్త నిర్వచనం ఇచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, పచ్చదనాన్ని నలుపు వర్ణంలో రాసి ప్రతిఘటిస్తున్నవారు శివోన్ముఖులే.