Tuesday 21 April 2015 0 comments By: satyasrinivasg

భోపాల్ రాత్రి -పర్యావరణ విధ్వంసం -3౦

జి.సత్య శ్రీనివాస్
-భోపాల్ నా నగరం,నా ఆవాసం,డిసెంబర్ 2,1984  రాత్రి ,ప్రపంచంలోని అత్యంత పారిశ్రామిక విధ్వంసం జరిగింది. ఆ బాధ, ఆ రక్తపు మరకలు నగరం గుండెల్లో చెరగని ముద్రల్లా నిలిచిపోయాయి.  10,౦౦౦ మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే ఎక్కువ మంది జీవచ్చవాలుగా  ఇప్పటికీ మిగిలి వున్నారు.- అని పా అండ్ టేల్స్ కవి తన మనో వేదనని చెప్పుకున్న తీరు...
భోపాల్  గ్యాస్ దుర్ఘటన పై ఒక గజల్

వాళ్ళు, ఆత్మీయుల మృత దేహాల పై    రోదిస్తున్నారు
మృత్యు వాతావరణంలో నిర్జీవ సాక్షులుగా మిగిలారు

భీకరమైన నిశ్శబ్దంలో గుండెల నిండా భయం కమ్ముకుంది
మంచి శకునాలన్నీ నిష్క్రమించాయి

తుది శ్వాసలో కొట్టుమిట్టాడుతున్నారు
నరకం ఎదుట చేతులెత్తి ప్రార్ధిస్తున్న పర్యాటకుల్లా  గుమిగూడారు

భీకరమైన రోజు దృశ్యాలలో చిద్రమైపోతునట్టున్నారు
రోదన దుప్పట్లో కరుగుతున్న ముద్దల్లాగున్నారు


ఈ  తూఫాన్ వేళ మస్జిద్ ఒక్కటే శరణార్ధుల  శిబిరమైంది
నీటి గూడు లేని చేపల్లా విలవిల్లాడుతున్నారు

రెప్పపాటు కాలంలో స్వర్గం నరక మైంది
వాళ్ళు, విలపిస్తున్న   రాత్రి ప్రతిధ్వనుల్లో  కలిసిపోతున్నారు
(మూలం- పా అండ్ టేల్స్. అనుసృజన-జి.సత్య శ్రీనివాస్ ,)         
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి 3 దశాబ్దాలు అయ్యింది, అయినా బాదితులకు న్యాయం జరగలేదు, భోపాల్ చంద్రుడి నుండి ఆ మచ్చా తొలగలేదు. ఇప్పటికి భూపాల్ నగరమంటే యూనియన్ కార్బైడ్ సృష్టించిన భయానక  రాత్రి స్మ్రుతి ఇంకా వెంటాడుతూనే వుంది. ప్రముఖ భోపాల్ ఉర్దూ కవి ఇష్రాత్ కాద్రి  షేర్ లా...
వెంటాడే జ్ఞాపకాలు చాల ఏడిపిస్తాయి
రాత్రి, కళ్ళల్లోనే ఇంకిపోయినట్లు
(అనుసృజన- జి.సత్య శ్రీనివాస్)
అవును ఆ బాధితుల మూసుకోని కళ్ళల్లోని  నిశీధి  రాత్రి తరతరాలు వెంటాడుతుంది. ఎందకంటే వారి చుట్టాలు ఇంకా వారి కధలు చెపుతూనే  వుంటారు, అంతే కాదు, వారి పూర్వీకులకు, వారికి, వారి తదనంతరం వారికి యూనియన్ కార్బైడ్ కంపెని వారికిచ్చిన గుర్తింపు గ్యాస్ ట్రాజడి విక్టింస్.మనకి ,మన ప్రాంతానికి ఆ మచ్చ మిగిలిపోయింది.
ఆ నగరం  చరిత్రలో ,సాహిత్యం,కవిత్వం,గజల్స్ వంటి  కళల్లో గొప్ప పేరున్న ప్రాంతం , హిందుస్తానీ సంగీతంలో భోపాల్ ఘరానాకి గొప్ప స్ధానం ,ఇప్పడు భోపాల్ ఘర్ కా టికాన బదల్ గయా (ఇప్పుడు భోపాల్ ఇంటి అస్దిత్వం మారిపోయింది) నేడు దాని ఆవాసం పేరు వినగానే గుర్తుకొచ్చేది ఆ రాత్రి ప్రతిధ్వనులు.
ఆ రాత్రిని  ఎప్పటికీ చెరిపేయలేం. అంతే  కాదు ఆ బాధితులకి, ఆ పర్యావరణానికి ఎంత నష్టపరిహారం ఇచ్చినా జీవితాన్ని తిరిగి తీసుకు రాలేం. అందుకే కంపెని యజమానిని రహస్యంగా సరిహద్దులు దాటిస్తాం. ఇప్పడు చేస్తున్న అంతర్జాతీయ ఒప్పందాలలో, ప్రవేశ పెడుతున్న  చట్టాలలో విధ్వంసానికి భాద్యులు వారు కారని   అన్ని కంపెనీలకు  అనుగుణంగా  సవరణలు వస్తున్నాయి.  ఇది ఒక అణు రహస్యం.
గేబ్రియల్ గార్షియా  మార్కుస్ మాటల్లో మనం ఎలా జీవించాం అన్నదానికి ,దానిని ఎలా జ్ఞాపకం  వుంచుకుంటాం, ఇతరులు జ్ఞప్తికి తెచ్చుకోడానికి  ఏ తీరులో  నెమరేసుకుంటారు అన్న దాంట్లో అంతరార్ధం  వుంటుంది. పిల్చే గాలిని ధ్వంసం చేసే అభివృద్ధిలో   ఉచ్శ్వాస, నిశ్వాసలు మర యంత్రాల చప్పుళ్ళు. ఈ చప్పుళ్ళకి లయ బద్ధంగా  నడిచే గుండె, తదనంతరం వాళ్ళకి గతాన్ని కోల్పోయినదిగానే నెమరేసుకోమని ఒక ఎలిజీని  మిగిల్చి వెళుతుంది,గడిచినదంతా  ఒక పీడకల మాత్రమె, ఒక మధుర స్మ్రుతి వనం కాదన్న ఒక నీతి సూక్తి బోధిస్తుంది. గడిచిన  రాత్రి పొగ గొట్టంలోంచి ఉదయించే సూర్యుడు మనని మర మనుషుల్నిగా   మల్చే  ఒక సైరన్ మోతగాడిగానే చూపిస్తుంది.  
ఏకాంతంలో మన మనస్సుతో  సంభాషించుకునేటప్పుడు మనలోని సునిసితను (స్త్రీతత్వాన్ని) కోల్పోయి మనం దుఖంతో మాట్లాడుకోవడం, రాత్రి ఒక విషాద గజల్. ఆ గజల్ కి  ప్రేరణ ఇచ్చినవాళ్ళు, రాసిన వాళ్ళు ,వినే వాళ్ళు తన్మయత్వంతో కళ్ళు మూసుకోరు, కళ్ళు తెరిచి మరణించిన  పసికందు నేత్రాల్ని మూస్తున్న  చేతి వేళ్ళల్లా మన మనస్సుకి కనురెప్పల తడి  హత్తుకున్ని పోతుంటాయి. అప్పుడు పర్యావరణ కవిత  భూమిని కప్పెడుతున్న మట్టి నుండి పొరలు పొరలు గా మన మనో గజల్ అవుతుంది. ఆ కవిత  సారాంశం  భూమి మన అస్తిపంజరాల ఖార్ఖాన  అని, కున్’(తధాస్తు, దైవం  అన్న తొలి పదం) మనకు మిగిలిన దీవెనని నివేదిస్తుంది.
ప్రముఖ గజల్ గాయకుడు శశాంక్ తడ మాటల్లో గజల్ పాడటం అంటే అంతర్లీన ప్రామాణిక కళ ,దైవ వరం, దీనిని పెంపొందిoచుకోగల్గుతాం,కాని మానవ  ప్రమేయం వల్ల సృష్టించలేం. ఇక్కడ దైవం అంటే కేవలం దేవుడు అని కాదు, మన మనఃస్దితి. ప్రకృతి కవిత్వం లో ఆ దైవత్వాన్ని పొందాం. పర్యావరణ కవిత్వంలో కోల్పియినదాన్ని నెమరేసుకుంటున్నాం.
భోపాల్ దుర్ఘటన కాలంలోనే బాబ్రి మస్జిద్ ఉదంతం జరిగింది, అప్పుడు నిదా ఫాజిల్ రాసిన గజల్ లోని పంక్తులు ప్రకృతి ని, మనుషుల్ని పణంగా పెట్టుబడి పెట్టే అభివృద్ధి కాముకుల్ని నేర్చుకోమని కోరేదల్లా...
రెండు,రెండు కలిస్తే ఎప్పుడూ నాలుగే ఎలా అవుతాయి,
మేధావులకి కొంచం అమాయకత్వం కూడా ప్రసాదించు దేవుడా
బుల్లి పిచుకలకు కొన్ని గింజలు
పసి పిల్లలకు పప్పు బెల్లాల్లు ఇవ్వు దేవుడా .
(అనుసృజన- జి.సత్య శ్రీనివాస్)

నేడు నగర గాలిలో కాలుష్యాన్ని నియంత్రించడానికి ,గాలిలో కాలుష్యశాతాన్ని కొలిచేందుకు కొన్ని సూచికలని ఏర్పరిచే యోచన చేస్తోంది ప్రభుత్వం. కాలుష్య నియంత్ర మండలి ఈ దిశగా కొత్త ప్రయోగాలు చెయ్యొచ్చు. కంపెనీల పై మన నడవడిక మారనంత కాలం ఇవన్ని  సాంకేతికంగా,పారిశ్రామికంగా నగరంలోని  అద్దాల గాలి మేడల్ని శుభ్రపర్చే  గీతాలుగానే మిగులుతాయి. 
Tuesday 14 April 2015 0 comments By: satyasrinivasg

భూమి పుత్రిక – దయామణీ బర్లా - పర్యావరణ ఉద్యమాలు-29

దయామణీ  బర్లా జార్కండ్ కి  చెందిన గిరిజన మహిళ. జార్కండ్ లోని అరహర వూర్లో జన్మించింది. వారిది నిరుపేద కుటుంబం. అయినప్పటికీ ఇళ్ళల్లో పని చేస్తూ పట్టభద్రురాలయ్యింది. దొరికిoది భుజించింది.పశువుల కొట్టంలో జీవించింది. ఇంగ్లీష్, హిందీ లో టైప్ చేస్తూ  గంటకి రూపాయి సంపాదించింది.  పోలీసుల దగ్గర పాచి పనిచేసింది,ఆమె జార్కండ్లోని  మొదటి గిరిజన  పత్రికా విలేఖరి కుడా.ఈమెకు  పి.సాయినాథ్ సంస్ధ వారు ఉత్తమ గ్రామీణ విలేకరి అవార్డు కూడా ఇచ్చారు. ఈమె అరెసేలోర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వల్ల నిర్వాసితమవుతున్న 4౦ గ్రామలకు అండగా నిల్చి పోరాడింది. గిరిజన కధలు చెప్పుతూ ,రాతల ద్వారా , వివిధ కార్యక్రమాల ద్వారా ప్రపంచానికి గిరిజనులు, దళితులూ ,మహిళల  స్ధితి గతుల్ని తెలిపే స్వరం కోసం  జన్ హక్ అనే పత్రిక నడిపాను అని చెపుతుంది. ఈ పత్రిక కష్టాల్లో వునప్పుడు స్ధానిక ప్రభాత్ ఖబర్ పత్రికలో గిరిజన ,దళితుల అంశాలపై రాయమని అందులో ఆ విషయాలకి సంబంధించి కూసింత స్ధానం ఏర్పడేటట్టు చేసింది. జార్కండ్ నలుమూలల నుండి ప్రాతినిధ్యమున్న గిరిజన. దళితుల, ఆదివాసి, మూలవాసి,అస్దిత్వ రక్షా మంచ్ కి ప్రధాన సూత్రధారిణి.స్టీల్ ప్లాంట్ వల్ల ,కోయల్,కరి నదుల పై కడుతున్న డ్యాం ల వల్ల ,ఇంకా అనేక విషయాల పైన దశాబ్ద కాలం పాటు నలుమూలలా గ్రామాల్లో పర్యటించింది.2౦1౦ లో రాంచి కి 15 కిలోమీటర్ల దూరంలో వున్న నగిరి గ్రామంలో ఐ.ఐ.యం.ఐ.ఐ.ఐ.టి. కి నల్సార్ కి 227 ఎకరాల వరి పండే భూముల్ని ప్రభుత్వం కేటాయించింది. ఇది ప్రభుత్యం ప్రకారం 1957లోనే బిర్సా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తీసుకున్నట్టు పేర్కొంది. దయామణీ బర్లా ఆర్.టి.ఐ. ద్వారా సేకరించిన సమాచారం అనుసారం 153 కుటుంబాలకు రావాల్సిన నష్ట పరిహారం లో కేవలం 25 కుటుంబాలే నష్ట పరిహారం తీసుకున్నారు, మిగితా వాళ్ళు దానిని తిరస్కరించారు.
ఇంతటి పరిస్తుతుల్ని ఒకే కవితలో రాయడం కష్టమే ,గతం, వర్తమానం భవిష్యత్తు అంతటిని కనురెప్ప మూసి తెరిచే లోపు కేవలం కవిత ద్వారా చెప్పగలం.అందుకే పర్యావరణ కవిత్వ అపర్చర్ అఫ్ ది హార్ట్స్ ఐ. దానిని హిమాన్షు మనకు ఈ విధంగా చూపిస్తాడు.... 
ఇప్పుడు  దాయమణీ  బర్ల అవ్వడం   చాల  ప్రమాదం
ఆదివాసిగా వుండడం ప్రమాదం
ఇప్పుడు  వూర్లో వుండడం ప్రమాదం
వూర్లో భూముంది
వూర్లో చెట్లున్నాయి
వూర్లో  నదులున్నాయి
వూర్లో ఖనిజాలున్నాయి
వూర్లో  మనుషులున్నారు
వూర్లో  దయామణీ  బర్లా  కూడా వుంది
కంపెని వూర్లోని భూమి పై కన్నేసింది
కంపెని వూర్లోని నదుల పైనా కన్నేసింది
కంపెని వూర్లోని చెట్ల మీద కన్నేసింది
కంపెని వూర్లోని ఖనిజాల పైనా కన్నేసింది
కాని  దయామణీ  బర్లా ఊర్లోనే వుంది
కంపెని అంటే ప్రభుత్వానికి భయం
కంపెని అంటే పోలీసులు భయపడతారు
కంపెని అంటే పత్రికలూ భయపడతాయి
దయామణీ బర్లా కి కంపెని అంటే భయం లేదు
ఇది కంపెని నిబంధన
అందుకే కంపెనీకి కోపం
అందుకే కంపెని యజమాని  ఉత్తర్వు ప్రకారం
పొలీసు వున్నతాధికారి  దయామణీ బర్లా ని
చెరశాలలో  బంధించారు
రండి, మనం ఉత్సవాలు చేసుకుందాం
ఇప్పుడు  దయామణీ బర్లా జైల్లో వుంది
ఇక దయామణీ బర్లా కంపెని అధికార్ని ఆపలేదు
ఇప్పుడు కంపెని అధికారి నదిని  వూరి నుండి పెకిలించేస్తాడు
ఇప్పుడు  కంపెని అధికారి  భూమిని    వూరి నుండి లాగేసుకుంటాడు
ఇప్పుడు  కంపెని అధికారి  ఖనిజాల్ని  వూరి నుండి కొల్లగొట్టేస్తాడు
ఇక కంపెని అధికారి  దేశాన్ని అభివృద్ధి చేస్తాడు
ఇంక కంపెని అధికారి అన్నిట్ని సక్ర పరుస్తాడు
మనమెప్పుడు  ఈ దేశంలోని దయామణీ  బర్లా నుండి విముక్తి చెందుతాము?
మన నదులన్నీ ఎప్పుడు
మన చెట్లన్నీ
మన భూమి అంతా
ఇంక మన అడవులన్నీ
కంపెని హస్తగతం అవుతాయి
కంపెనీల  ఫ్యాక్టరీలు
కంపెని ఉద్యోగాలు
కంపెనీల కార్లు
కంపెనీల షాపింగ్ మాళ్ళు
కంపెనీల రోడ్లు
కంపెనీల టోల్  గేట్లు
కంపెనీల కాలేజీలు
కంపెనీల అధునాతన సాంకేతిక సంస్థలు
కంపెనీల అధునాతన యాజమాన్య సంస్ధలు
కంపెనీల విశ్వవిద్యాలయాలు
అందులో చదివివచ్చే  వారు
కంపెనీల బానిసలు
కంపెనీలకు అవసరమైన చదువులు
కంపెనీలకు  లాభాలు తెచ్చే జ్ఞానం
కంపెనీల  ఇచ్చకు అనుకూలమైన  ప్రభుత్వాలు
కంపెనీలకు తగట్టుగా వంగి  'అవును సర్' అని  నమస్కరించే  పోలీసులు
ఆ..., ఇప్పుడు, మీరే చెప్పండి
మనకు  దయామణీ  బర్లా  అవసరమా?
(హిందీ మూలం-హిమాన్షు  కుమార్,అంగ్ల అనువాదం- ప్రియాంక , తెలుగు- సత్య శ్రీనివాస్)
ఈ భూమిప్పుడు కంపెనీల మాయజాలం లో ఇరుక్కుని ప్రదక్షణ చేస్తోంది, ఆ ప్రదక్షణని వ్యతిరేకించే వారు తీవ్రవాదులుగా ముద్రించ  బడతారు. అవును, వాళ్ళిప్పుడు మనకు అవసరమా అంటే మన ఆలోచనలు సైతం జనిటికల్లీ మాడిఫై అవుతునప్పుడు అంత తీవ్రంగా ఆలోచించే విషమే ఇది. ఆ సమయాన్ని చెప్పే దయామణీ బర్లా అడవిముక్కెర . ఆ ముక్కెరలోని తళుక్కు చాల దూరంనుండి కనపడుతుంది, కొద్దిగా సునిశితంగా దృష్టి పెట్టాలి.
దయామణీ బర్లా ఫాసిల్ కి రాసిన ఉత్తరం(సంక్షిప్త భాగం) ఆమె వ్యక్తిత్వాన్ని చేబుతుంది.
నేను నా మాత్రు భూమిని మోసం చేయలేదు. జార్కండ్ ప్రజలు లేవనెత్తిన  ప్రస్నల్ని మరుగున పర్చలేదు  ఇందుకు ప్రవహించే కోయల్,కరో,చాట నదులే సాక్ష్యం.నేను నెలలో ఇంకిన మట్టి వేళ్ళతో రాస్తున్నాను.కరో నది ఒడ్డున ,గొర్ల కి పచ్చిక  మేపుతూ నేను ఈత కొట్టడం నేర్చుకున్నాను. గడ్డి నీడలు, మంచులో తడిసిన చెట్లతో కమ్మిన ఆకాశం నాకు ప్రేమను పంచింది. నేను వీట్ని ఎలా అమ్మగలను.  నన్ను నన్నుగా మలచిన, జీవించడం నేర్పిన సామాజిక బాధలు , కష్టాలని నాలో భాగ మైన వాట్ని  ఎలా విడనాడను.
ప్రజల కష్టాల్ని, ఇష్టాల్ని కాపాడడం మన (ప్రతి ఒక్కరి) భాద్యత.  ఈ బాధ్యతల్ని నెరవేర్చేవారికి  ఇదొక్కటే మార్గం అని నేనుకుంటాను.  విపత్తులు, కష్టాలే వారి నుదిటిన రాసి వున్నాయి. ఇది జీవిత సత్యం. నేను ప్రభుత్వం ,వారి వ్యవస్ధ ప్రజల పట్ల తమ బాధ్యత నిర్వహించడం లేదని  చెప్పాను.
నగడి గ్రామం నుండి ప్రభుత్వం బలవంతంగా 227 ఎకరాల పంట భూమిని బలవంతంగా తీసుకుంటోంది. చట్ట బద్ధగా, మనవ విలువలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ పనిచేస్తోందని నేను చెప్పను. పంట భూముల్ని కాక నిస్సారమైన భూముల్లో లా కాలేజి, ఐ.ఐ.యం. ని కట్టమని నివేదించాను. ఇదే నేను చేసిన తప్పు, నా నల్గురు మనుషుల్ని చెరశాలలో బంధించారు.చాల మంది చేతులు కోల్పోయారు, నేను, చెరశాలలో బందీనయ్యాను. నేడు, దోచుకునేవారు ,వారి సంస్ధలు ప్రభుత్వ దృష్టిలో మంచి వాళ్ళు గా అయ్యాయి. ఒక వైపు ప్రభుత్వ వనరులని, దోచుకునే వారు, మానవ హక్కుల్ని కబళించే వారికి  ప్రభుత్వ రక్షణ వుంటుంది. మరో వైపు భూమి పుత్రులకు ,భూమి పుత్రికలకి , శ్రేయోభిలాషులని  క్రూరులుగా చిత్రీకరిస్తారు.బిర్సా ముందా లాగానే దేశ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరినీ అదే విధంగా ప్రకటిస్తారు.ప్రజల కోసం పోరాడిన అతనిని దొంగ గా చిత్రీకరించారు.
ఏది ఒప్పో, ఏది తప్పో నాకేమి పాలు పోవటం లేదు. కాని ఒక్కటి మాత్రం తెలుసు, నేను రాయిగా మారాను.ప్రపంచం అంతా నిద్రిస్తోంది,ఇప్పుడు సమయం రాత్రి ఒంటి గంటయ్యింది. మహిళా బందీలు బిర్సా ముండా సెంట్రల్ జైల్లోని మహిళల బందిఖానలో నిద్రిస్తున్నారు. నేను ఒంటరిగా కూర్చున్నాను. ఎప్పడు ఇటువంటి  కష్టాలని మర్చి పోలేదు.అది రాత్రైనా, పగలైనా.ఇతరుల కన్నీళ్ళని తుడవడానికి చీకటి రాత్రులు అడ్డుకాలేదు. కాని ఈ రోజు నా కాళ్ళని కట్టేశారు,ఇతరుల కన్నీళ్ళని తుడిచే చేతుల్ని కట్టేశారు. నా ఇంట్లో ,నా వదిన శవం వుంది. కుటుంబం మొత్తం భయంతో వణుకుతున్నారు. నేను జైల్లో ,నిస్సహాయంగా, మౌనంగా ఉండిపోయాను. కళ్ళల్లో కన్నీరున్నా, కన్నీరు రాల్చలేని స్ధితి. నేడు ,6,నవంబర్ ,2౦12. నేను కోర్టుకి వెళ్ళాలి. నా కనిపిస్తోంది, నా పై మరో కొత్త కేసు మోపుతారని,దాని ద్వారా నన్ను బంధిస్తారు,లేకపోతే రిమాండ్ లో పెడతారు, కాకపొతే, నా మీద వారంట్ జారీ చేస్తారు. నాకు నమ్మకం పైన నమ్మకం పోతోంది.
ఈ కష్ట కాలంలో నాకు తోడుగా వున్న నా మిత్రులందరికీ కృతజ్ఞతలు. నాతోటి ఖైదీలు. జైలు గోడలు దాటి పోరాడమని కోరుతున్నారు.  ఈ పోరాట పటిమని చాటే ఊర్లల్లో వుండే బలమైన పర్వతంలా,నదుల్లా, అడవుల్లా నిలబడడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తా. వీస మెత్తు  మా పూర్వికుల భూమిని ససేమిరా ఇవ్వం. మా జీవితాలతో అంతమయ్యే పోరాటం కాదని తెలుసు,ఎందుకంటే...కోయల్,కరో,చాట నదులు ప్రవహిస్తున్నంత కాలం మేము పోరాడుతూనే వుంటాం.
మీ సోదరి
దయామణీ బర్లా.
(ఈ ఉత్తరం, మొదటిగా ప్రభాత్ ఖబర్ పత్రికలో అచ్చు అయ్యింది.)

భూమి పుత్రుల ,పుత్రికల ఉత్తరాల్లోని సారాంశం ఒకటే చెపుతుంది, అది కెన్ శారో వివా ,చికో మెండిస్, దయామణీ బర్లా కానివ్వండి. ఈ పోరాటం కేవలం భూమి నల్లుకున్న మనుషుల కోసమే కాదు. భూమి మనుగడ కోసం కూడా అని. అందుకే మనకి దయామణీ బర్లాల గుణం అడవి ముక్కెరలోని తళుక్కు. అది భూమి కంట్లోని కనుపాప ,ఆ కనుపాప నాడే  పర్యావరణ కవిత్వం.
Tuesday 7 April 2015 0 comments By: satyasrinivasg

మనో ‘గనులు’-పర్యావరణ ఉద్యమాలు-28-పబ్లిక్ హియరింగ్-సంఘటితంగా మినహాయించడం(inclusive exclusion)

ప్రాజెక్ట్ లు అమలులోకి రావడానికి ప్రభుత్వ పరంగా జరగవలసిన కీలక మైన చర్యల్లో ,పర్యావరణ ప్రభావ నిర్ధారణ , సామాజిక ప్రభావ నిర్ధారణ , పబ్లిక్ హియరింగ్ జరగాలి.వీటన్నిటినీ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అని నిర్వచిస్తారు. కాని ఈ ప్రక్రియలన్నీ అభివృద్ధి పేర్న ప్రజలని కలుపుకోక పోగా ,అభివృద్ధిని పొందటానికి అధికారం, అందుబాటు వున్న వర్గం వారు సంఘటితమై ప్రజల్ని అభివృద్ధి నుండి మినహాయించేందుకు బాగా ఉపయోగకర భాగస్వామ్య పద్ధతులుగా సహకరిస్తాయి. ఇది  ఇలా ఎందుకనిపిస్తుందంటే,ప్రాజెక్ట్ ప్రభావిత వేలమందికి ఆ రిపోర్టులు  అందవు, అందినా వేల  కొద్ది పేజీలలోని బాష అర్ధం కాదు, ఇక పబ్లిక్ హియరింగ్ అన్నది ఒక పబ్లిక్ ఫియర్ సృష్టించేది గా ఎలా జరుగుతుందన్నది నా అనుభవంతో ఒక ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్...
దృశ్యం 1
                జూన్‌ 7 2008న విశాఖపట్నం జిల్లాలోని మాకవరపాలెం మండలం, రాచపల్లిలో వెయ్యికిపైగా పోలీసు బలగాలున్నాయి. ఊరికి వెళ్లేదారిలో ఇరువైపులా పోలీసులు. ఊళ్లోకి వెళ్ళేవాళ్లను, వాహనాలను పరిశీలిస్తున్నారు. అతికష్టం మీద ఊళ్లోకి వెళ్ళి పరిచయస్తులతో మాట్లాడాం. నలుగురైదుగురు గుంపుగా ఉండి మాట్లాడుకుంటుంటే అంతకంటే ఎక్కువ మంది పోలీసులు వచ్చి వారిని గుంపుగా ఉండొద్దని, మీటింగ్‌ స్థలానికి వెళ్ళమని అంటున్నారు. మన దేశంలో అన్ని చర్చలూ మీటింగ్‌లుగానే కొనసాగే సాంప్రదాయం ఇక్కడా ఉందని నిరూపణ అయింది. దారిలో సమావేశ ముఖద్వారంలో, వేదికపైన కాలుష్య నియంత్రణ మండలి వారు, ''ఆన్‌రాక్‌ అల్యూమినియా రిఫైనరీ గూర్చి పబ్లిక్‌ హియరింగ్‌'' అన్న ఫ్లెక్స్‌ బ్యానర్లు పెట్టారు. సమావేశానికి వచ్చిన అతి కొద్దిమందికి తప్ప పబ్లిక్‌ హియరింగ్‌కు, మీటింగ్‌కు గల తేడా తెలియదు. ఇది అడుగడుగున వ్యక్తమయ్యింది. సమావేశ స్థలాన్ని అయిదారు విభాగాలుగా బ్యారికేడ్‌లతో విభజించారు. మీడియాకు, ప్రజలు అందులో స్త్రీలకై ప్రత్యేక స్థలం కేటాయించారు. వీరందరూ బ్యారికేడ్‌లో ఉన్నారు. మీడియాను బ్యారికేడ్‌లో చూసిన సందర్భాలు అరుదు. తరచూ సమావేశాలలో మీడియా ఫోటోగ్రాఫర్లను వేదిక నుండి కిందకు దించడం సమావేశంలో భాగమవుతుంది. ఇక్కడ ఆ శ్రమ తగ్గింది. విఐపిలు, వేదిక మీద ఎక్కేవారికి మాత్రం బ్యారికెడ్‌లు మినహాయించారు. విఐపిలో కూర్చున్నవారు ,కంపెనీ ప్రతినిధులు ఇంకా విశాఖపట్నం నుండి వచ్చిన కొందరు పారిశ్రామిక వేత్తలు, ప్రజలు ఉండే బ్యారికేడ్‌లకి, వేదికకు చాలా దూరం ఉంది. సుమారు నలభై అడుగుల దూరం. దూరంగా కూర్చున్న ప్రజల మాట వేదికకి చేరడానికి అనువుగా వుండకుండా ఉండేటట్లు జాగ్రత్త పడ్డారు. పబ్లిక్‌ హియరింగ్‌ నిబంధనలను పట్టించు కోకుండా ఉండే జాగ్రత్త అనిపించింది. ప్రజలు ఎవరైనా ఒక్కొక్కరిగా మాట్లాడాలంటే మైక్‌ వాళ్లదగ్గరకి చేరడానికి అతికష్టంగా ఉండేటట్టుగా ఉంది. వేదిక దగ్గరికి వెళ్ళడానికి బ్యారికేడ్‌లు దాటుతూ, చుట్టూ ఉన్న పోలీసుల వలయం ఛేదించుకుని, బ్యారికేడ్‌ల నుండి దూకి వెళ్ళేసరికి అలసటతో, భయంతో నోటమాట రాకుండా ఉండేటట్టుగా పద్మవ్యూహం ఉంది. ప్రజలు అభిమన్యులుగా ఉన్నారు.
దృశ్యం 2
                సమావేశ సమయానికి గంటకు ముందుగా ప్రజలు, రాజకీయపార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, సమత సంస్థ ప్రతినిధులు చేరారు. మొదట్లో ప్రజలు చాలా పల్చగా ఉన్నారు. ముఖ్యంగా మహిళల ప్రాతినిధ్యం. వచ్చిన వారికి ఒక్కొక్కరికి ఒక్కో పోలీసు కావలి కాసేటట్టుగా ఉంది. వాతావరణం ప్రజలకు సానుకూలంగా అసలు లేదు. అంతమంది పోలీసుల మధ్య మాట విప్పితే ఏమౌతుందో అన్న ఆందోళన. వెనకాల నాల్గు వజ్ర వాహనాలు. ఏ సమయంలోనైనా లోపల వున్న ప్రజలపై బాష్యవాయువు ప్రయోగించడానికి అనువుగా, ఉండే ప్రదేశంలో సిద్ధంగా ఉన్నాయి. బహుశా పబ్లిక్‌ హియరింగ్‌ ఇలాగే నిర్వహించాలి అన్న నిబంధన ఉన్నట్టుగా! ఇవన్నీ చూసిన తర్వాత ఇంక మనం చెప్పేదేముంది అన్న భావన ప్రతి ఒక్కరిలో కనబడుతోంది. అంతా వాళ్ళకనుకూలంగా (ప్రభుత్వం, కంపెనీ) ఏర్పాటుచేసుకున్నారు. లోపలికి రావడం ఎంత కష్టమో, బయటకు వెళ్ళడం కూడా అంతే! వాళ్ళ పుణ్యమా అని వచ్చిన వాళ్ళు కూర్చుండిపోయారు అన్న ఆలోచన కూడా కలుగుతుంది.
దృశ్యం-3
మిగతా సమావేశాల్లాగా  కాక ఈ సమావేశం నిర్ణీత సమయంలోనే ప్రారంభమయింది. టంచన్‌గా గోడ గడియారం పదకొండు గంటలు కొట్టేసరికి బొమ్మ మొదలైంది. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధి వేదికపైకి వచ్చారు. అన్నీ సవ్యంగా ఉన్నాయా? లేదా? అన్న పరిశీలన తర్వాత కాలుష్య నియంత్రణ మండలి అధికారి సమావేశాన్ని, సమావేశ ఉద్దేశ్యాన్ని తెలియజేస్తూ ప్రారంభించారు. తర్వాత ఆన్‌రాక్‌ కంపెనీ ప్రతినిధులు కంపెనీ వల్ల వచ్చే లాభాలు, నష్టాలు లేదన్న వాళ్ళ ప్రగాడ నమ్మకంతో చెప్పుకొచ్చారు.ఆకాశంలోని తారల్ని గుపిట్లో చూపించినట్టు. ఇక్కడే మొదలయింది అసలు కథ! సాధారణంగా పబ్లిక్‌హియరింగ్‌ వేదికపైకి పానెల్‌ సభ్యులు తప్ప ఇతరులు వేదికపై ఉండకూడదు. కానీ జాయింట్‌ కలెక్టర్‌ గారు అక్కడికి విచ్చేసిన ఎమ్‌.ఎల్‌.ఏ., ఎమ్‌.ఎల్‌.సి., ఎం.పిజెడ్‌.పి.టి.సి., పంచాయితీ ప్రెసిడెంట్‌ ఇంకా స్థానిక నాయకుల్ని కొందర్ని వేదికనలంకరించమన్నారు. కొందరు స్థానిక పంచాయితీ ప్రెసిడెంట్లు సమావేశంలోకి వస్తున్నప్పుడు వారిని పోలీసులు అడ్డుకున్నారు. కంపెనీ వారి మాటల తర్వాత శ్రీ ఎమ్‌.ఎల్‌.ఏ గారిని మాట్లాడమని జాయింట్‌ కలెక్టర్‌ కోరారు. ఎమ్‌.ఎల్‌.ఏ గారు మైక్‌ అందుకోవడంతోనే కంపెనీ వల్ల కలిగే పర్యావరణ నష్టాలు గురించి చాలా వివరంగా చెప్పారు. అంతేకాక కంపెనీ కోసమని ఇచ్చే భూములు కంపెనీ రాక పూర్వమే ప్రభుత్వం రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసిందని, ఉద్యమాల వల్ల సదరు ప్రభుత్వం ఎకర భూమికి నాలుగు లక్షలు నష్టపరిహారం ఇచ్చిందని చెప్పారు. కాని ఈ భూములు ప్రభుత్వం తీసుకున్నది ఐ.టి. పార్కు కోసమని తీసుకుని ఆన్‌రాక్‌ కంపెనీకిచ్చిందని, ఇలా ఎందుకు చేశారని అడిగారు. దీనితోపాటు నష్టపరిహారం తీసుకున్న రైతులు డబ్బులు ఈపాటికి ఖర్చుపెట్టేసారు, ఏదో కొందరు పెద్ద రైతులు మాత్రమే లాభపడ్డారని అన్నారు. దీనికి ప్రజలనుండి సానుకూల ప్రతిస్పందన లభించింది. ఆ తర్వాత ఎమ్‌.ఎల్‌.సి మాట్లాడటం మొదలు పెడుతూ ప్యానెల్‌ మెంబర్లు ఎవరు? అని అడిగారు. దీనికి అధికార్లనుండి ఎవరూ లేరన్న సమాధానం వచ్చింది. అయితే పబ్లిక్‌ హియరింగ్‌ చెల్లదు అనగానే ప్రజలనుండి ప్రతిస్పందన వచ్చింది. అసలు ప్యానెల్‌ సభ్యులు తప్ప ఇతరులు వేదికపై రావలసిన అవసరం లేదు, మేము ఇక్కడ ఉండకూడదు అన్నారు. అధికార్లు ఇక్కడ వ్యక్తమయ్యే అభిప్రాయాలన్నీ నమోదు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.
ఈ ఇరువర్గాల సంభాషణ వల్ల పబ్లిక్‌ హియరింగ్‌ పద్దతులు కొన్ని ప్రజలకు తెలిసాయి. ప్రజలలో తెలిసినవాళ్ళు కొందరు ప్యానెల్‌ ఉండాలన్న నినాదాలు చేశారు. సమావేశం ఈ తీరులో ప్రారంభమవ్వడం వల్ల ప్రజలలో నుండి భయం మెల్లమెల్లగా బ్యారికేడ్‌లు దాటి వేదికపైకి వెళ్ళడం మొదలయ్యింది. ఎమ్‌.ఎల్‌.సి గారు కొత్త పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే చట్టాలు (భూసేకరణ చట్టం సవరణ బిల్లు, పునరావాస  చట్టం బిల్లు) గురించి అవి ఏవిధంగా ప్రస్తుత ప్రాజెక్టుకు వర్తిస్తాయో చెప్పారు. అప్పుడు ప్రజలకి ఇంకొంచెం విషయ పరిజ్ఞానం వచ్చింది. కంపెనీ పబ్లిక్‌ హియరింగ్‌ ముందుగా చేసినా ఇ.ఐ.ఎ. లోని(పర్యావరణ ప్రభావ నిర్ధారణ) అంశాలే చెప్పారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశాల ప్రకారం అన్ని పంచాయితీలలో, ప్రజలకి అర్ధమయ్యేటట్లుగా స్థానిక భాషలో వాటిని అనువదించి అందించాలని చెప్పింది. అది ఎందుకు జరగలేదన్న ప్రశించారు. అది తక్కువ ఖర్చుతో కూడుకున్న పని, కానీ ఆ సమాచారం అందరికీ తెలిస్తే సమస్య ఏమో అన్న భయంతో వాటిని పాటించరు. కంపెనీ రూపొందించిన ఇ.ఐ.ఎ. నివేదికలో ఈ చట్టాల ప్రస్తావనే లేదు. కేవలం ఇన్ని ఉద్యోగాలు కలుగుతాయి, బడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మిస్తామని మాత్రమే ఉంది. అదీ సబబేనేమో, ఎందుకంటే భూమిని కంపెనీతో కొనిపించలేదు. ప్రభుత్వం రైతులనుండి భూమి కొని కంపెనీకి ఇవ్వదల్చుకుంది. ప్రభుత్వ అధికారులు, కంపెనీ వారెవరూ సమావేశంలో ఇది ప్రస్తావించలేదు. ఈ ఇరువురి నాయకుల ప్రసంగం వల్ల ఈ విషయం బయటకు వచ్చేందుకు దారి ఏర్పడింది. ఇంక అప్పటికే ప్రజలనుండి కంపెనీకి వ్యతిరేకత మొదలయి మాకు కంపెనీ వద్దు,వద్దు అన్న నినాదాలు మొదలయ్యాయి. నాయకులు  ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు,వేరు,వేరు, పార్టీల  మధ్య భేదాభిప్రాయాలు కనిపించాయి.
దృశ్యం-4
వేదిక పైన ,కింద కంపెనీ పై తీవ్ర స్ధాయిలో వ్యతిరేకత వెల్లువెత్తింది.ఇక ప్రజలనుండి ఒకరిద్దరిని మాట్లడమని కోరారు. బ్యారికేడ్లను పై నుండి దూకి జిల్లా సి.పి.యం. కార్యదర్శి గారు వెళ్లారు. అయన తీవ్ర స్ధాయిలో వ్యతిరేకించారు. దానితో పాటు పదమూడు వందలమంది వ్యతిరేకతతో కూడిన సంతకాల పత్రాన్ని అందచేశారు.వాటి పై వేదిక మీదున్న పెద్దలు కొందరు సంతకం చేశారు. ఒకరిద్దరు, మహిళలు ,పురుషులు తమ ఆవేదనను తెలిపారు. ఇంకా కొందరు తమ గోడు చెప్పుకుందామని వెళ్ళినా ప్రయోజనం లేకపోయింది.అర్దాతరంగా ఇక సమావేశం ముగిసిందని కార్యక్రమాన్ని ముగించారు. వేదిక నుండి దిగివస్తున్న జాయింట్  కలెక్టర్ను కొందరు చుట్టు ముట్టి ఎంతమంది సానుకూలంగా చెప్పారు, ఎంతమంది వ్యతిరేకించారు అని ప్రశ్నించారు.అది తెలియచేయడం పబ్లిక్ హియరింగ్ ఆనవాయితీ అని అడిగారు. దానికి అయన ఎక్కువశాతం వ్యతిరేకించారని చెపుతూనే వెళ్ళిపోయారు.
దృశ్యం-5
రాచపల్లిలో,చుట్టూ పక్కల గ్రామాల్లో   గత పదిహేను రోజులుగా వున్న యుద్ధ వాతావరణంలో రక్తపు మరకలు లేకుండా కార్యక్రమం ముగిసింది. కొందరు భీబత్సంగా ఏ గొడవ జరగ కుండా కార్యక్రమం ముగిసిందని, మరి కొందరు డామిట్ కధ అడ్డం తిరిగిందని, మరి కొందరు అనుకున్న మలుపుకి రాలేదని ఎవరి దార్న వాళ్ళు వెళ్ళిపోయారు. కాని కధ ఇంకా కొన సాగుతూనే వుంది. అందుకే ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు వున్నారు.
కంపెనీలకి వనరుల్ని కట్ట బెట్టడం అంతా చట్ట పరంగా గానే జరుగుతుంది. అందుకే అభివృద్ధి ని అవలంభించడంలో చట్ట బద్దమైన మార్పులు జరుగుతాయి. గతంలో చాల ఈస్ట్ ఇండియా కంపెనీలు వ చ్చాయి.వాటిలో కొన్ని మనల్ని పాలించి ,ఎప్పటికి చెరగని చట్టాల్ని చేసి పోయాయి, వాట్ని మనం పలక మీద అక్షరాల్లా తుడిపి మళ్ళి దిద్దుకుంటున్నాం. ఇదంతా ఆధునికతలో జ్ఞాపకాలకి ముసుగు వేయడం లాంటిది.  మన చట్టాలలో ముఖ్యంగా వన్య ప్రాణి చట్టం లో  ఒక కీలక మెలిక వుంది, యిది బలవంతంగా స్దానికుల్ని నిర్వాసితుల్ని చేయదు. వాళ్ళని ఇన్వాలెంటరి డిస్ప్లేస్మెంట్ పేర్న వాళ్ళoతట వాళ్ళే వెళ్ళి పోయేటట్లు చేస్తుంది, అక్కడ ఏవిధమైన సౌకర్యాలు లేకుండా చేసి వెళ్ళిపోయేటట్లు చేసే ప్రక్రియ . ఇది ఇప్పుడు అన్ని ప్రాజెక్ట్ ప్రాంతాల్లో జరుగుతోంది, పోలవరం నిర్వాసిత గ్రామాల్లో, విశాఖ బాక్సైట్ గ్రామాల్లో ,అటవీ హక్కుల చట్టం , ఉపాది హామీ పధకం నామ మాత్రంగాగే జరిగాయి, చాల సందర్భాల్లో జరగలేదు.
ఇదంతా తప్పుని ప్రజల పైనే నెట్టడానికి చేపట్టే  యోజన, ఇది కళ్ళకి కనిపించదు, ఒక జ్ఞాపకానికి మెటాఫర్ లేకుండా ,వున్నా ఆ జ్ఞాపకానికి మనలో చోటులేకుండా కొన్ని వేల మంది ఆలోచనల్ని మన మెదళ్ళలో ఒకే సారి గుప్పించే ప్రయత్నం. అది పబ్లిక్ హియరింగ్.ఇప్పటికి మన దేశంలో సుమారు 900 పైగా పబ్లిక్ హియరింగ్ లు జరిగాయి, అందులో 90 శాతం పైగా వ్యతిరేకతలు వచ్చినవే, కాని ప్రాజక్టులు ముందుకు కొనసాగుతాయి.
ఈ సంఘటనలకు సంబంధిoచిన కవితలు లేవనే చెప్పాలి, బహుశా సాహిత్యంలో కధలు, నవలల్లో సంఘటన ఆధారంగా వస్తువుని ఎంపిక చేస్కుని అల్లుకుంటారు, కాని కవితల్లో అది అరుదు .అది పర్యావరణ కవిత్వానికి చాల అవసరం. ఎందుకంటే, మన ఆలోచన ప్రకృతికి ఆకృతి , మనలోని సంఘటన, మెటాఫర్ అండ్ మెమరీ. ఈ మెమరీ లోనే ప్రకృతి మనకి అందంగా మిగిలిపోయిన జ్ఞాపిక. 195౦లో బొలీవియన్ కవి విలియం స్టివెంస్ అన్నట్టు అపనమ్మకం బాగా చెలామణి అవుతున్న కాలం లో ,కళలు కవిత్వం ద్వారానే ఉపశమనం పొందొచ్చు.

కవిత్వ ప్రకృతి లక్షణం మెటాఫర్ . వెనకున్న వాస్తవాన్ని వెలికితీయడం కూడా, అది మనలోని సామాజిక ప్రకృతి నైజం.