Tuesday 28 July 2015 0 comments By: satyasrinivasg

నగరీకరణ ప్రకృతి- అంతరిస్తున్న నిశ్శబ్దం

అన్ని పాటలలో ప్రశిష్టమైనది
పక్షి పాట
నిశ్శబ్దంలో, కాని ముందుగా
నీలో నిశ్శబ్దం వుండాలి.
-వెండెల్ బెర్రీ
( అనుసృజన జి. సత్య శ్రీనివాస్)

మనం మానవాళి కోరికలకు అనుగుణంగా  ప్రకృతిని మల్చుకుంటే, మనం మన పరిమితుల్ని అద్దంగా మార్చుకునే ప్రమాదాన్ని సృష్టించుకుంటాం .అని జాన్ గ్రే అంటాడు. అవును పురోగతి అంటూ మట్టికి శ్వాస లేకుండా చేస్తే మనలో అంతరించేది  మనలోని యోగ నిశ్శబ్దం. అప్పుడు శ్వాస  ఉచ్చ్వాస,నిశ్వాస శబ్దంనుండి పుట్టే  కవిత్వం, ముందు తరాలకు మనం ఇచ్చే వీలునామా కాదు, మరణ వాంగ్మూలం.

కవిత్వ తత్వం కోల్పోనప్పుడు కవిత్వం కోల్పోవడంలో ఆశ్చర్యం లేదు. చరిత్ర కవులకు పోషకులు  అరుదనే చెపుతుంది. కారణం కవిత్వం అనేది వినోదం కాదు అందుకే అప్పటికి ఎప్పటికి దానికి ధనం కరువే. దాని ఇంధనం ప్రకృతిగా ఇమిడిపోయిన ని శబ్దగోష.   ఆ ప్రకృతిని  వెతుక్కుంటూ రాసుకుంటూ పోతున్నాం. శ్వాస , గుండెల చకుముకి రాళ్ళ నుండి  పుట్టే  నిప్పు ఇది. రోజురోజుకి పెరిగిపోతున్న పరాధీనత్వం నుండి బయట పడేసే యోగ ముద్ర..పర్యావరణ కవిత్వంలో బహుశా ఎక్కువ శాతం వున్న అంశం పరాధీనత్వమే.  సామాజిక పరిణామంలో అత్యున్నత దశ నగరీకరణం అన్న సిద్ధాంతం అయితే ,ఇదే చివారఖరి దశ అని గుబులు కుడా పుట్టించింది.

దీని పురోగతి నలుదిశలా వ్యాపించలేదు. ఇలా ఎందుకనిపిస్తోంది అంటే చాల మారుమూల గ్రామాలు తిరిగాను ,రోడ్లు వుండవు ఏమీ వుండవు కాని అక్కడి సంస్కృతి మాత్రం  ఇది పాత  వూరు, ఇది కొత్త వూరు అని ఒకే ప్రాంతాన్ని విభజించి చూడదు. ఇది కేవలం నగరాలలోనే కనిపిస్తుంది. ఓ పురానా  షెహర్ ,యే నయా  షెహర్’ ( అది పాత నగరం ఇది కొత్త నగరం). నదికి ఆవలి పాత, ఈవల కొత్త . ఏ నగరంలో నైనా  నదే   కొత్త పాతల మధ్య సరిహద్దు రేఖ. మరి ఇది అద్దంలోని మన పరిమితుల ప్రతిబింబమే  కదా. 

ఇప్పుడు ప్రపంచం విస్తారమైన  నియంత్రణలేని ప్రయోగశాల, ఇందులో అసంఖ్యాక ప్రయోగాలు నిరంతరం జరుగుతూనే వున్నాయి. ఆ ప్రయోగాల ప్రభావం మనలోని ప్రశాంతమైన నిశబ్ద గీతాన్ని రణ గొణ ధ్వని గా మార్చేస్తోంది. ఈ రణ గొణ  ధ్వనిలో  మనతో బాటు మనలాగే  అపార్ట్ మెంటులో  మిగిలి పోయిన పావురాళ్ళు కొన్ని గుత్రున్ ,గుత్రున్  అని శబ్దం చేస్తు వుంటాయి. వాటి పాటల్లా వీ ఆర్ ఇన్ కస్టడి. ప్రకృతినుండి  పరాధీనం అయిన తర్వాత ప్రతి పక్షి పాటలోని అర్ధం  ఇదే. అందుకే పశ్చాతాపంతో వాటికిన్ని గింజలు జల్లుతూ వుంటాం, ఏమి సాధించాం ఏమి కోల్పోయామని అన్న నిశబ్దపు ఆలోచనలో. దానిని -ఎల్లెన్ గిన్స్ బర్గ్  ఇలా వ్యక్తపరిచారు...


చాల ఎక్కువ ,
చాల తక్కువ
-ఎల్లెన్ గిన్స్ బర్గ్

మరి ఎక్కువ పరిశ్రమలు
చాల తినడం
చాల ఎక్కువ బియర్
చాల ఎక్కువ సిగరెట్లు
చాల ఎక్కువ తత్వం
చాల ఎక్కువ ఆలోచనా ధోరణులు
సరిపోని గదులు
తక్కువ చెట్లు
మరి ఎక్కువ పోలీసులు
మితిమీరిన కంప్యూటర్లు
మరి ఎక్కువ హై ఫై
మరి ఎక్కువ పంది మాంసం
మరి ఎక్కువ కాఫీ
మరి ఎక్కువ పొగ
మసిబారిన పై కప్పులు
మరి ఎక్కువ అతివినయం
చాల బానికడుపులు
చాల ఎక్కువ వ్యాపార దుస్తులు
చాల ఎక్కువ కాగితం పైన పనులు
చాల ఎక్కువ పత్రికలు
ఎక్కువ మంది అలసిన కార్మికులు
రైళ్లల్లో
ఎక్కువ వృద్దుల  హత్యలు
ఎక్కువ మంది వెర్రి విద్యార్ధులు
చాలని తోటలు
చాలని యాపిల్ పండ్లు
విపరీతమైన డబ్బు
ఎక్కువ మంది పేదలు
ఓటు హక్కులేని శరణార్ధులు
ఎక్కువ లోహాలు
ఎక్కువ కొవ్వు
మరి ఎక్కువ హాస్యం
అతి తక్కువ ధ్యానం
( అనుసృజన జి. సత్య శ్రీనివాస్)


నగరీకరణాన్ని, అభివృద్ధి ,అభివృద్ధి ప్రకృతిని అతి క్లుప్తత తో చెప్పడం కష్టం ,ఆ శైలి ఈ కవితలో వుంది.విస్తారమైన మైదానాన్ని ఒక్క చూపులో పొదిగినట్టు. ఇదంతా స్లో పాయిజన్ ప్రాసెస్. అందులోని చేదు నిజాల్ని మింగడం క్రమేణా అలవాటైపోతోంది. నగరీకరణం అనివార్యం అయినప్పుడు మనః చెరశాలనుండి వచ్చే వాక్యం హరిత హారానికి మట్టి రేణువవుతే  చాలు.     
Tuesday 21 July 2015 0 comments By: satyasrinivasg

నగరీకరణ ప్రకృతి-పరాధీన ప్రకృతి

ఫ్రిడ్రిచ్ రాత్జేల్ సైంటిఫిక్ డిటర్మినిజం సృష్టికర్త క్లాసికల్ జియోగ్రాఫికల్ డిటర్మినిజంని సోషల్ డార్వినిజం తో ముడిపెట్టి జీవ వ్యవస్ధ సిద్ధాంతాన్ని పేర్కొన్నాడు.దాని ప్రకారం జీవి లేక ప్రాణి తన జీవనాన్ని భూమితో అనుసంధాన పర్చుకుంటుంది,అది రోజు రోజుకి భౌగోళిక  విస్తృతిని ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది.  రాత్జేల్ ప్రకారం ఒకే రక మైన  ప్రదేశాలు ఒకే రకమైన జీవన తీరుని ఏర్పరుస్తాయి.అభివృద్ధిలో భాగంగా మానవాళి భౌగోళిక విస్తృతిని పెంచుకుంది, పెంచుకుంటూ  పోతుంది. ఈ క్రమంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలన్నీఒకే రూపురేఖలు సంతరించుకుంటూ పోతాయి. గతంలో వాటి భౌగోళిక, పర్యావరణానికి అనుకూలంగా ఏర్పడిన వ్యవస్ధల స్ధానం లో ఒకే రకమైన నివాస,వాణిజ్య,పరిశ్రమల సముదాయాలు ఏర్పడుతాయి. ఈ ప్రక్రియ అంతా ఒక మొనాటనీ గా ప్రబలుతుంది. అప్పుడు వైవిధ్యం అంటే కేవలం ఎక్కువ ,తక్కువ శక్తిని వియోగించడంలోనే వ్యత్యాసాలు వుంటాయి. ముఖ్యంగా డబ్బు, ఇతర ఇంధనం.శక్తిని తీవ్ర స్ధాయిలో వినియోగిస్తాం. ఈ వినియోగం వాతావరణం లోని ఉష్నోగ్రతల్నే కాదు, సామాజిక ఉష్నోగ్రతల్ని పెంచుతుంది. ఈ సంస్కృతి నుండి పుట్టుకొచ్చింది పరాధీనత్వం(alienation).

నగరీకరణతో బాటు పర్యావరణ కవిత్వంలో ఉద్యమ, విధ్వంసం, కవిత్వానికి కంటే  ముందుగానే వచ్చిన కవిత్వం ప్రకృతి పరాధీన కవిత్వం. ప్రకృతి కవిత్వం లో ప్రకృతి ఆరాధనా,మమైకత, చోటుచేసుకుంటే ,పరాధీన కవిత్వంలో మన నుండి ,ప్రకృతి నుండి అన్యాక్రాంతులమై దాన్ని కవిత్వం ద్వారా వ్యక్త పర్చుకుంటాం. మనమున్న ప్రాంతం మన జీవనశైలిని,నడవడికని తెలియచేస్తుందిఅని రాత్జేల్ అంటాడు.అవును నగరం అన్నది అసహజ ప్రకృతి, అందులోని సంబంధాలు కూడా అసహజంగా గానే వుంటాయి. ఎదుగుతున్న కొద్ది మనలోని అవయం కుడా ఫాబ్రికేటేడ్ అయినప్పుడు గుండె చప్పుడు ధ్వని మారుతుంది. మనస్సులోని ఊహలు కుడా. ఈ వూహల  
వాతావరణాన్నివర్ణిస్తూ ఉర్దూ ఘజళ్ళు కోకొల్లలు గా వచ్చాయి. అందులో షహరియార్ సీనే మే జలన్... జనం 

మనసుల్లోకి తడి ఆర కుండా  కొనసాగుతుంది.
మనసులో వేదన,కళ్ళల్లో తుఫానులా ఎందుకుంది
ఈ  నగరంలో ప్రతి ఒక్కరు చెల్లాచెదురుగా  ఎందుకున్నారు
గుండె వుంటే కొట్టుకునేందుకు ఒక కారణాన్ని వెతుకుతుంది
రాయిలా  కదలకుండా నిర్జీవంగా ఎందుకుంది
ఒంటరితనపు  గమ్యం ఇదేమిటి  చెప్పండి జనులారా
దారిలేనిదృష్టి  సందేశం  లేకుండా  ఎందుకుంది
ఏంటి నాలో కొత్త విషయం  ఏమైనా కనపడుతోందా
అద్దం నను చూసి విస్తుపోయింది  ఎందుకు
(మూలం-షహరియార్, అనుసృజన- జి.సత్యశ్రినివాస్)

నగరం ,అద్దం రెండు ఒకటే వర్చువల్ ప్రతికల్ని చూపిప్తాయి. ఇక్కడి రూపకం (మెటాఫర్) సీతాకోక చిలుకలు అవ్వడం కాదు,అద్దాల మేడల్లో మన వర్చువల్ ప్రతిబింబాల్ని చూసుకోవడమే.అరబ్ భౌగోళిక శాస్త్ర వేత్తలు ప్రపంచాన్ని  ఏడు భౌగోళిక ప్రాంతాలుగా విభజింఛి  భౌతిక ,సంస్కృతిక లక్షణాల్నివివరించారు. దానితోబాటు స్ధానిక పర్యావరణాన్ని,మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ని మనుషుల చర్యలతో పోల్చారు. సంవృద్దిగా నీరు వున్న చోట  మనషులు ఒక లాగా, నీరు లేని చోట ఒక లాగా ,విస్తారమైన ప్రదేశాల్లో వుండే సంచారులు శక్తి ,ధృడ నిశ్చయం,వివేకంతో బాటు శారీరక ధృడత్వం కల్గి ఉంటారని పేర్కొన్నారు.
నగరం అన్నది ఇతర ప్రాంత పర్యావరణాన్ని అక్కడి వనరుల్ని వినియోగించుకుంటూ ,ఉత్పాదకని సృష్టించే ప్రదేశం. ఇది ఇతర స్ధానిక పర్యావరణాన్ని కృత్రిమంగా మార్చి వినియోగించే  సమాజంగా  ఏర్పడుతుంది. అటువంటి ప్రదేశంలోనుండి మనలో ఉత్పాదన అయ్యేది పరాధీనతే. మన చుట్టూ వున్న   బాహ్య ప్రదేశం మనలాగే విస్తారమవుతున్న రహదారి. ఆ రాహదార్లు ఎలావుంటాయంటే --

ముసుగు

నడిరాత్రిలో
తడిసిన రోడ్డు
పగటి ముసుగుని
తొలిగిస్తుంది
సప్తవర్ణాల్ని
ఏక వర్ణంలో
చూపిస్తుంది
పెరుగుతున్న
ఏకాంత కొలతల్లో
వెడల్పవుతున్న రోడ్లు
రాత్రి పలుకుతుంది
అమ్మమ్మ చెప్పిన కధలు
ప్రేయసితో చేసిన వాగ్దానాలను
నెమరేస్తుంది
రాత్రి మనం
అలసిపోయి నిద్రపోం
ముసుగులు తొలగించి
దాక్కుంటాం
నిజం పలకడానికి
నిర్జీవులమవుతాం
పగలు
అబద్ధాలు చెప్పడానికి
రాత్రి
శ్వాసలు జోడిచుకుంటాం
అందుకే రాత్రి- చీకటి
వీధులు-నిర్మానుష్యం
-జి.సత్య శ్రీనివాస్
(మే,28,95,ట్యాంక్ బండ్,న్యూ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్,) 

రాత్రి నగరంలో తిరుగుతునప్పుడు మన వెన్నంటే వచ్చే మన నియోన్ కాంతి నీడ ఎ దిల్ ఎ క్యా కరూన్ అని మజాజ్ గజల్...
నగరం రాత్రి నేను
ఏమి తోచక  గమ్యంలేక  తిరుగుతాను
తళుకు మెరుపులతో మేల్కున్న
వీధుల్లో అవారాగా తిరుగుతాను
ఓ వేదనతో వున్న మనసా నే నేమి చేయను...

అంటూ కోల్పోయిందాన్ని వెతుక్కుంటూ తిరిగే ప్రదేశం ఇది. దీనినే స్మార్ట్ సిటి గా మల్చుకుంటాం కాని ఆ స్మార్ట్ సిటి లో ఏమి ఇమిడి వుందో అబ్దుల్ వాహిద్ కవితలో ...

స్మార్ట్ సిటీ

చెత్త కుండీలో
వేలితో డయల్ చేసే ఫోనుల్లా
పాత ర్యాలీ సైకిలుకు దారి చూపిన కిరోసిన్ బుడ్డిలా
తాతల జేబువాచి స్ప్రింగులా
బండెద్దుకు కొట్టిన నాడాలా
పనిచేయని టచ్ స్క్రీన్ మొబైళ్ళ పక్కనే
విరిగిన అంకెలు 
తలతెగిన కలలు
చెల్లచెదురుగా పడున్నాయి
చెత్తకుండీ వీధుల్లో
రాత్రింబవలు తిరిగే బొద్దింకలు, చీమలు
ఆ కలల మూటలు పోగేసుకుంటున్నాయి
గుండెకుంపటి రాజేసి
నాలుగు కలలు కాల్చుకుని 
ఒకపూట ఆకలి తీర్చుకుని
బతికేసే కొన్ని మెతుకులు...
కలను అమ్ముకుని
కలను కొనుక్కుని
కలను నమ్ముకుని
కలగా మారిన బతుకులు
చెత్తకుండీ నెత్తిమీద
రాజుగారి కిరీటంలా
వీధిలైటు వెలుగులు
విరిగిన గ్రామ్ ఫోను రికార్డు
చిట్లిన డివీడీ డిస్కు
చెట్టాపట్టాలేసుకుని
బతికే నగరం...
(5-2-15,కవి సంఘమం)
మట్టి కల్లుకున్న కొన్ని వేల నాటి సంస్కృతిని మట్టి లేని నగరం త్వరితంగా మార్చేస్తుంది. ప్రకృతిలో చివరాఖరికు వచ్చిన వాళ్ళం మనం, మానవ సమాజం కొసలో  ఏర్పడిన నగర సమాజం ప్రకృతికి మనకి చివరకు మిగిల్చేది పరాధీనతనే.ప్రకృతిలో జీవ వైవిద్యం లేని చోట మోడ్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంతా పచ్చ కాగితమే. నగరం ఒక హ్యుమేన్ జూ. 
Tuesday 14 July 2015 0 comments By: satyasrinivasg

నగరీకరణ ప్రకృతి

పర్యావరణ కవిత్వం అన్నది ప్రకృతిలోని జీవవైవిధ్య వ్యవస్ధ అంతరించేటప్పుడు ఆవిర్భవించింది అన్నది ఇకో క్రిటిజం వాదన. అవును ఇది వాస్తవం. మనం సహజమైన ప్రకృతిని కోల్పోయిన తర్వాత నెమరేసుకోవడం.  ఒకానొక కాలంలో నెమరేసుకోవడానికి కనీసం జీవిత కాలంలో ఒక 50 సంవత్సరాలు పట్టేది,కాని ఇప్పుడు ప్రతి రోజూ గతం. మన చుట్టూ వున్నదాన్ని అంత త్వరగా మార్చేగలిగే సాంకేతిక పరిజ్ఞానం వున్న వాళ్ళం. దానితో బాటు నాస్టాల్జియాని అంతే త్వరగా పొంద గల్గుతున్నాం. రాచెల్  కార్సన్ (ప్రముఖ పర్యావరణ ఉద్యమ కారిణి)అన్నట్టుగా వాసన పసిగట్టే ఇంద్రియ జ్ఞానానికి  జ్ఞాపకాల్ని జ్ఞప్తికి తెచ్చుకునే శక్తి అన్నిటికంటే ఎక్కువ వుంది,కాని మన దౌర్భాగ్యం దానిని అతి తక్కువగా వినియోగిస్తాం. అవును కోల్పోయినప్పుడు, వదిలి వచ్చినప్పుడు మాత్రమే మన ప్రయాణంలో మన తో బాటు వచ్చే గాలిలో వాట్ని స్పృశిస్తూ కాలం వెళ్ళదీస్తాం.
మనం ఇప్పుడు  ముని వళ్ళ కొసళ్ళతో సంభాషణని కొనసాగించే ఆప్దారులం. ఈ ఆప్ ని జోడింజుకున్న మొబైల్  జీవితం మనలోని ,చుట్టు పక్కల ప్రకృతిని  ఎంత ఖననం చేస్తోందో అర్ధం కావడం లేదు. పచ్చదనం కేవలం ప్రకృతి లోని ఆకు అలమలు కావు అది దృష్టి అని అద్భుతంగా వివరించిన పచ్చని కవిత...
పచ్చదనం
ఉషోదయం ఆకుపచ్చని ఆపిల్ రంగులో,
ఆకాశం సూర్యుడిలో పచ్చని మధువు పొదిగుంచింది,
వీటి నడుమ చంద్రుడు పైడిరంగు పూరేకు.
ఆమె కనులు తెరిచింది,పచ్చదనం
అవి మెరుస్తూ, పూలలా విచ్చుకున్నాయి,
మొదటిసారిగా, మొట్టమొదటిసారిగా చూసాను.
(1914,అచ్చయిన కవిత, కవి పేరు తెలియదు, అనుసృజన - జి. సత్య శ్రీనివాస్)
ఆకు పచ్చ చంద్రుడు అని వర్ణించాం,కాని అరుదుగా ఆకాశాన్ని ,ప్రేమని పచ్చదనంతో  వర్ణించడం జరుగుతుంది. అది చెట్ల ఆకుల గొడుగుకింద నుంచుని వాటి కొసల నుండి రాలే కాంతి చుక్కలనుండి  చూస్తే తప్ప తెలియదు. పాబ్లో నెరుడా  వాక్యాల్లో , మాటల్లో తెలుస్తుంది.
పాబ్లో నెరుడా  ఒక కవితని ముగించిన తీరు  నేను కిందనుండి వచ్చాను, భూమి నుండి భూమి,మనుషులు,కవిత్వం అంతా ఒక లోతైన కనిపించని బంధాల్లో  ఇమిడివుంది. భూమి పులకించినప్పుడు,మనుషులు స్వేఛ్చా గాలి పీలుస్తారు,కవులు పాడి దారి చూపుతారు.
ఇదే తీరు ఇస్మాయిల్ చిలకలు వాలిన చెట్టు కవితలో ఇలా  ప్రస్తావిస్తాడు
చిలకలు వాలిన చెట్టు
కిచకిచమని శబ్ధమైతే
కిటికిలోంచి చూసాను.
ఎప్పటిలాగే చెట్టు
గుప్పిట విప్పి నిలుచుంది.
మరెక్కడిదీ చప్పుడు?
పరకాయించి చూశాను.
పచ్చటి చీకట్లో
మంటేదో ఎర్రగా కదిలింది.
గుట్టు తెలిసింది!
చెట్టునిండా ఉన్నట్టున్నాయి.
గుబురంతా వెతికి వీటిని
గుర్తించడం ఒక సరదా.
ముక్కుల దీపశిఖలవల్ల
ఒక్కొక్క చిలకనే పోలుస్తుంటే
తెలిసిందప్పుడు నాకు
చిలకలు వాలిన చెట్టు
లోతైన కావ్యం
లాంటిదని.
అవును పచ్చటి చీకట్లో చికలు వాలిన చెట్టు లోతైన కావ్యం ,ఇది చూపించిన కిటికీని మూసేసిన నగరీకరణ ప్రకృతి పరిస్ధితి  నుండి వచ్చే మాట,రాసే వాక్యం ఒక వ్యధా గీతంగానే మారుతుంది.
దానిని ఖైఫి ఆజ్మి ఇలా వివరించాడు
పక్షులు యిలా...
పక్షులు యిలా వూరికే గోల చేయవు
నగర గాలి అడవికి సోకింది
నేలపచ్చంచుని నమిలే వాళ్ళ కోరిక
చందన కాష్టంలోధగ్ధమవ్వాలని
ముళ్ళకు సైతం రక్తాన్ని
రుచింపచేసే వాళ్ళకి
వసంతగీతం సైరన్ మోత
అడవులొదిలి వలసపోయే
దాహార్తులకు
ఎండమావుల సముద్రయానం
చింతల రెక్కలతో
కరెంట్ తీగమీదున్న
ఏకాకికి తెలుసు
అడవి పరాయిదైందని
(మూలం ఖైఫీ ఆజ్మి షోర్ యుహికీ,
స్వేచ్చానువాదం జి. సత్య శ్రీనివాస్, ఆగస్టు-97)
ఆధునికతకు నగరీకరణను పరాకాష్టగా భావించడం అభివృద్ధి నిర్వచనం ఇది ‘అమృత్’(నగర అభివృద్ధి యోచన) సంకల్పంగా భావిస్తాం. నగరీకరణ చెందకూడదు అనట్లేదు, చరిత్రలో నగర,రాజధాని నిర్మాణాలు ఆయా భౌగోళిక స్వరూపాన్ని ,భౌగోళిక వనరులను బట్టి జరిగాయి. అభివృద్ధి చెందాయి. నేడు దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు రాజకీయ,పారిశ్రామిక అనివార్య ప్రేరకాలు ఆయా ప్రాంత రాజధాని నగరాలే. పని కట్టుకుని నగరీకరణ అభివృద్ధి  వెంటే పడితే అది భూమిని,నేలను, జీవ వ్యవస్ధను మింగేస్తుంది.  అది జీవంలేని ఆర్ధిక శాస్త్ర స్తోత్రం. ఇకోనామిక్స్ కి విరుద్ధం. భౌగోళిక శాస్త్రం ప్రకారం ,భౌగోళిక ఆర్ధిక సిద్ధాంతం అనుసారం, నగరం లోని నేల కల్చరల్ వేస్ట్ అంటే నిర్జీవమైన నేల.  ఇది ఎంత విస్తృతంగా విస్తరిస్తే అంతే విస్తృతంగా ప్రకృతి రూపు రేఖలు మారిపోతాయి.
మరి ఈ నేలనుండి పుట్టుకొచ్చే  మాటలు కలిసి నప్పడు, విడిపోయినప్పుడు మధ్యన జరిగే మునివేళ్ళ కొసల కరచాలనం నడుమ జరిగే చర్చలే తప్ప సంభాషణలు కావు. నగ్న మొహాలు (1990 లో రాసుకున్న) నా కవితలోని పంక్తులు జ్ఞాపకం వస్తాయి అవి...
వేళ్ళ చివర్న మొహాలు
పొదిగివుంటాయి
అడవిలో రాలిన
ఆకుల మీద నడుస్తున్న
పాదాల నీడ
భూమి పొరలా(పంక్తులు1-6)
వేళ్ళ చివర మొహాలకి
కళ్ళు వుండవు
తమ మొహాల్ని
మొహంలేని కళ్ళలోనే
చూసుకుంటాయి
 వేళ్ళ మొహాలు
మట్టి వుండల్ని
దొర్లించుకుంటూ నడిచే
చూపుడు కళ్ళు(13-21 పంక్తులు)
అందుకే కాబోలు  వుయ్ ఆర్  పర్ఫెక్ట్, స్మార్ట్ ఆప్స్ అండ్ నేకేడ్ ఏప్స్.