Friday, 11 August 2017 0 comments By: Satya Srinivas

మట్టిగూడు-పర్యావరణ కవిత్వ నేత్రం
ప్రకృతి వినాశకులపై గళమెత్తిన యోధులు
(Foreword by Ketu Viswanadh Reddy)

కేతు విశ్వనాధరెడ్డి.
ఇది పర్యావరణ కవిత్వ సంకలనం కాదు. పర్యావరణ కవిత్వ మూలాలను, ప్రేరణలను, చోదక శక్తులనూ పరిచయం చేస్తున్న పుస్తకం ఇది. ప్రకృతి విధ్వంసానికి,పర్యావరణ సంక్షోభానికి, దారితీసిన,దారి తీస్తున్న యదార్ధ ఘటనలనూ,వాటి నేపధ్యాలనూ, వివరించిన పుస్తకం ఇది. ప్రకృతి విద్వసంపై ,పర్యావరణ నాశానంపై ప్రతిఘటనలు ఏఏ దేశాల్లో మన దేశంతో సహా ఎందుకు,ఎప్పుడు,ఎట్లా మొదలై, పెల్లుబికాయో విశ్లేషించిన పుస్తకం ఇది. అమలులో ఉంచిన, ఉన్న అటవీ రక్షణ , భూసేకరణ చట్టాల మర్మాలనూ, గిరిజనలు,దళితుల హక్కులలోని డోల్లతనాన్నీ ఎత్తిచూపిన పుస్తకం ఇది. అభివృద్ధి క్రమం,సాంకేతిక పరిజ్ఞానం ,మార్కెట్ చాటున సహజ వనరుల్ని వాణిజ్య వర్తకులు,దొంగ కంపెనీలు, బహుళజాతి సంస్ధలు ప్రభుత్వాలను మాయచేసి హస్తగతం చేసుకుంటూ పోయిన,పోతున్న తతంగాలను మన కళ్ళెదుట నిల్పిన పుస్తకం ఇది. పర్యావరణ సంరక్షణ,ప్రకృతి సమతుల్యత ,మనిషి- ప్రకృతి సహజీవనం,వీటి శిక్షణ విషయంలో ఇప్పుడో,అప్పుడో తెరమీదకు వచ్చే ప్రజలలో ముఖాముఖి( పబ్లిక్ హియరింగ్) బోలుతనాన్ని సైతం విడమర్చిన పుస్తకం ఇది.
బ్రేజిల్లో పచ్చటి అడవుల్ని నరికి బయళ్ళుగా మార్చినా, వాణిజ్య పంటలు వేసినా, నైజీరియాలో ఒగొని భూముల్లో ఇందనం వెలికితీసినా, మన ఉత్తరాఖండ్ లో చిప్కో ఉద్యమాన్ని మహిళలు చేపట్టినా , నర్మదా లోయ రక్షణ ఉద్యమాన్ని బాబా అమ్టే,మేధా పాట్కర్ వంటి వారు, పర్యావరణ ఉద్యమకారులు ప్రజల దృష్టికి తెచ్చినా , కేరళలోని సైలెంట్ వ్యాలీ ఉద్యమం కవులను ,కళాకారులనూ ఒక్కతాటి పై నడిపినా,భోపాల్ కార్బైడ్ కర్మాగారం,చెర్నోబిల్ అణుశక్తి కర్మాగారం,కేరళలోని కేసరగోడ ప్రాంతంలోని జీడి తోటలను ఎండోసల్ఫాన్ రసాయనిక క్రిమిసంహారక మందులు నాశనం చేసినా,ఇట్లాంటివన్నీ ప్రకృతి హక్కులను ఉల్లఘించనవే అని చాటి చెప్పిన పుస్తకం ఇది. ఈ కారణాలవల్లనే గత కొంత కాలంగా అడవులు,నీళ్ళు, భూమి,పంటలు.గూడు కోసం పోరాడే యోధులు బలవ్వడం క్రమంగా పెరుగుతోంది. ఈ పరిణామం వనరుల క్షీణతకు, వాటిని ప్రేమించే గుణమున్న వారని మట్టినుండి దూరంచేసే సంకేతం” (పుట 48) ఈ వేదనాగ్నిని రగిలించే పుస్తకం ఇది.
ఓడిస్సా, జార్ఖండ్ , చత్తీస్ ఘడ్ , తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ,అడ్డదిడ్డంగా ఖనిజాల వెలికితీత, విశాఖ ప్రాంతంలో బాక్సైట్ ఖనిజం, రంగురాళ్ళ తవ్వకాలూ, ఖనిజాలు ఆధారంగా వెలిసే కర్మాగారాలు,భారీ ప్రాజెక్టుల నిర్మాణాలూ,భుసేకరణలు,కొత్త సామాజిక సముదాయాలను పుట్టించినవే. ఈ సముదాయాల పేరే నిర్వాసితులు, ఈ నిర్వాసితుల పునరావాసం,పున్నరుద్దరణ, సామాజికంగా, సాంకేతికంగా,సాంకృతికంగా, మానసికంగా జీవన పునరుత్ధనం కాదు.ఇది పరాయికరణ,అడ్డు ఆపులేని,అర్ధం పర్ధం లేని పట్టణి కరణకూ,నగరీకరణకు,వలసలకూ దారితీసే దారుణం ఇది. మట్టిగూళ్ళను పెకిలించే దృశ్యాలివి.
ఈ దృశ్యాలకు,పర్యావరణ కవిత్వానికి పరస్పర సంభందం ఉందని నిరూపించడమే ఈ పుస్తకంలో రచయిత జి.సత్య శ్రీనివాస్ చేసిన ప్రయత్నం. సత్యశ్రీనివాస్ క్రియాశీల పర్యావరణ చైతన్యమున్న కవి. విస్తారమైన పర్యటనానుభావాలు అతనవి. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కాలినడకన తిరిగి,అక్కడి ప్రజల గోడును పట్టించుకున్న మనిషి. నిశితమైన పరిశీలన,విశ్లేషణ ,అధ్యయనం ఉన్న భావుకుడు శ్రీనివాస్. ప్రకృతి విధ్వంసానికి ,పర్యావరణ సంక్షోభానికి తల్లడిల్లిన కవులు తమతమ రచనల్లో ఎట్లా,ఏఏ భాషల్లో ప్రతిస్పందిన్చారో, ప్రతిఫలించారో ఉదహరిస్తూ వచ్చాడు. అంతేకాదు,అన్ని దుష్పరిణామాలకు కారణమైన కొందరి దగ్గరపోగైన పెట్టుబడినీ, ప్రభుత్వ యంత్రాంగాలను కవులు ప్రతిఘటించిన ఉదాహరణలను కుడా సమకూర్చాడు.
పర్యావరణ తాత్వికతకు సంబందించిన వివరాలను పొందుపరిచాడు.ఈ తాత్వికతకు సంభందించిన పరిభాషను-ఇకో పోయట్రి, ఇకో సెంట్రిజం,బయో సెంట్రిజం,ఆంత్రపో సెంట్రిజం, బయో కామనలిజం,సోర్స్ స్ట్రగుల్ వంటి వాటిని పాటకులకు పరిచయం చేసాడు,వివరించాడు.
పర్యావరణ కవిత ఎట్లాపుడుతుంది? నిర్వచనం ఏది? విశదీకరించడం ఎట్లా? పర్యావరణ తాత్వికత దృక్పదం ఏది? సత్యశ్రీనివాస్ ఈ ప్రశ్నలు వేసుకున్నాడు.సమాధానాలను ఇవ్వడానికి మనసావాచా కర్మణా ప్రయత్నించాడు.
ఒక కవిత ఉబికి వచ్చే అంతర్లీన బాహ్య ప్రపంచం మధ్య సంభాషణఅది ఒక పర్యావరణ రోదసి సవ్వడి”( పుట 28) అని శ్రీనివాస్ అంటాడు. ఇకో పోయట్రి, ప్రకృతితో సంభందాన్ని పునరావృతం చేసుకునే ధ్వని, ప్రకృతి విధ్వంసం పై ప్రతిఘటన ,మెరుగైన ,ఆరోగ్యకరమైన ప్రకృతి కోసం,పర్యావరణ రక్షణ కోసం ప్రణాళికల్ని,చట్టాల్ని ప్రోత్సహించడం”(వికిపిడియా నిర్వచనం,పుట 11,12). “పర్యావరణ కవిత్వం మన ఇన్నర్ స్పేస్ లో ,ఓటర్ స్పేస్ ను కలిపే పచ్చటి శ్వాస ప్రవాహం”(పుట 34) “పర్యావరణ కవిత్వం భవిష్యత్తును ప్రస్తావించే కాలజ్ఞానం”(పుట 70). “పర్యావరణ కవిత్వం అన్నది ఒక సింధటిక్ ప్రవచనం కాదు,ఒక సజీవ వేదురాకంచున మంచు బిందువు గూడులో నిశ్శబ్దంగా విచ్చుకున్న తొలి కిరణం”(పుట 71,72) ఇంకా 44,46,49,51,54,63,77,81,109, పుటల్లో పర్యావరణ కవిత్వం పుట్టుకనూ లక్షణాలను శ్రీనివాస్ సమకూర్చాడు.వీటిలో కవితాత్మక శైలిలోని abstractness నూ అర్ధం చేసుకోడానికి, మనసుకు పట్టించుకోవడానికి పాటకులు కొంత ప్రయత్నం చేయక తప్పదు.
పర్యావరణ కవిత్వం ఒక కొత్త రూపం. ఇది అస్తిత్వ పోరాట సంకేతం. అయితే ఇది ప్రాంతీయ, దళిత సామాజిక వర్గాల అస్తిత్వ ఉద్యమాల కంటే భిన్నమైంది. ఎందుకంటే, పర్యావరణ అస్తిత్వ ఆకాంక్షల్లోని పోరాటం పెట్టుబడి మీద, పెట్టుబడి సృస్టించే విధ్వంసం మీద,సంక్షోభం మీద.పర్యావరణ కవిత్వం,సామాజిక పర్యావరణాన్ని అర్ధం చేసుకునేందుకు సృజనాత్మకంగా బాషను వాడుకునే పదాల కూర్పు,పదచిత్రాల కలయిక. ఈ కూర్పు కలయికల ద్వారా గాడమైన సంవేదనలను పర్యావరణ కవిత్వం అనే కొత్త రూపం పాటకులకు,శ్రోతలకు కలిగిస్తుంది. ఈ అవగాహనను ఈ పుస్తకంలో ఉదహరించిన కవితలు,వాటి చుట్టూ చేసిన పరామర్శలు కలిగిస్తాయి.
ఇప్పుడు పర్యావరణ దినాలు,ధరిత్రి దినాలు,వన్యప్రాణి దినాల గురించి వింటున్నాం. ఇవి బడిపిల్లల ప్లేకార్డులకూ,ఫ్లెక్సిలకు ,పోస్టర్లకూ, గోడమీద రాతలకూ, ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక,రెండు కధనాలకు,చర్చలకు పరిమితమైనవను కుంటున్నాం. ఈ అరకొర ప్రయత్నాల నేపద్యంలో స్మార్ట్ సిటీలు ,ఎన్విరాన్మెంట్ స్మార్ట్ సిటీ అని పలు సిటీల కలలు కమ్ముకుంటున్నాయి. నగరీకరణతో ప్రకృతి పరాధీనమై పోతుంది, “కరెంటు తీగ మీదున్న ఏ కాకికి తెలుసు అడవి పరాయిదైందని”( ఖైఫీ ఆజ్మీ పుట 129) ప్రకృతిలోని జీవవైవిధ్య వ్యవస్ధ అంతరిస్తూ పోయే క్రమంలో మిగిలేది పచ్చకాగితాలూ, మానవ జంతుప్రదర్శనశాలలూ.
ప్రకృతిలో,పర్యావరణంలో జరిగిన, జరుగుతున్న దుష్పరిణామాలకు చలించడం కవులతోపాటు,అందరి విధీ. ఈ స్పృహనూ, పర్యావరణ చైతన్యాన్నీ ఈ పుస్తకం కలిగిస్తుంది.తెలుగులో ఇంతటి విపులమైన పుస్తకాన్ని తెస్తున్నందుకు సత్యశ్రీనివాస్ అభినందనీయిడు. ప్రచురిస్తున్న నవచేతన పబ్లిషింగ్ హౌస్ జనరల్ మేనేజర్ మధుకర్,ఇతర మిత్రులనూ మెచ్చుకోక తప్పదు.
ఈ పుస్తకంలో ఉదహరించినవే కాక మరి కొన్ని కూర్చి ప్రత్యేకంగా పర్యావరణ కవిత్వ సంకలనాన్ని ఒక ప్రచురణగా తేవడం పర్యావరణ ప్రేమికులకు ఉద్ధీవనగా ఉంటుందని నా అభిప్రాయం. అనుసృజనలో కవిత్వ స్పర్శ ఉండేటట్లు చూసుకుంటేనే ఆ ఉద్ధీవన బలంగా ఉటుంది. అట్లాగే కవిత్వేతర సాహిత్య రూపాల్లో కుడా పర్యావరణ రచనలు వస్తే మంచిది.
Top of Form