Monday, 9 March 2020 0 comments By: satyasrinivasg

పర్యావరణ కవిత్వం లోని భిన్నత్వం

కవిత కవితతో పెనవేసుకోడం, పర్యావరణ కవిత్వం  కవిత్వ  పర్యావరణమవ్వడం. ఇది మన అంతర్లీన ,బాహ్య ప్రకృతి తో బాటు మన స్పేస్ ,టైంనిఐక్యం చేసే భావ ప్రకటన. అంతే గాని మొక్కలు నాటడం వల్ల అడవులు పెరుగుతాయి అన్న ప్రచారాల వల్ల కాదు. మనలో కవిత్వ ప్రకృతి బీజం లేనప్పుడు పచ్చని  ఆలోచన మొలకెత్తదు. ఒక్టావో పాజ్ ఈ విషయాన్నే ముచ్చటగా ప్రస్తావించాడు, ‘జీవితం నుండి కవిత్వాన్ని రాసుకోవడం కంటే, కవిత్వాన్ని జీవితంగా మలుచుకోవడం ఉత్తమం కదా’ అని.

ఆధునిక పర్యావరణ సాహిత్యానికి ,సాంప్రదాయ పర్యావరణ సాహిత్యానికి తేడాలలో కీలకమైనది, కి స్టోన్ ప్రకారం ఎన్విరాన్మెంటలిజం (పర్యావరణీయం)అన్నది పారిశ్రామిక సంస్కృతి నుండి పుట్టింది. ఇది అనాదిగా మానవ సమాజాల చేతుల్లో బలవుతున్న  ప్రకృతిని సంరక్షించుకోడం కోసం ఉద్భవించే వ్యతిరేక నినాదం. స్లేమేకర్ అనుసారం పర్యావరణ సాహిత్య, పర్యావరణ విశ్లేషకులు తమ మనోభావాల్ని రాజకీయ స్ధైర్యంతో ,ఆధ్యాత్మిక చింతనతో, ప్రకృతిని యాంత్రికంగా మార్చుతున్న తీరుని ఖండిస్తున్నారు. సాంప్రదాయకమైన ప్రకృతి సాహిత్యం లోని జ్ఞానం ప్రస్ఫుటంగా ప్రకృతి విధ్వంసాన్ని భరించే తీరుని వెల్లడించడంలో తన ఛాయల్ని పూర్తి స్థాయిలో చాటి చెప్పలేదు. అవి పూర్తి స్ధాయిలో పర్యావరణ స్పృహని వ్యక్తపరచలేదు, చాలా మటుకు ప్రాంతీయ ,జాతీయ స్థాయికే పరిమితమయ్యాయి , ముఖ్యంగా పర్యావరణ సాహిత్యం భౌగోళికమైనదన్నది ఆయన ప్రస్తావన. పర్యావరణ కవిత్వంలో నెరేటివ్ కాపిటల్ ని కాప్చర్ చేస్తునప్పుడు, గతం ,వర్తమానం తో బాటు భవిష్యత్తుని ప్రస్తావించాలి. ప్రస్తావనలో  అది వాస్తవానికి దగ్గర వుండాలి.
మనమిప్పుడు సామాజిక,సంస్కృతిక,రాజకీయ,సిద్ధాంతాల్లో ఏర్పడుతున్న  పలు మార్పుల స్ధితిలో వున్నామన్నదాన్ని కాదనలేము. సామాజిక తీరుతెన్నులు,అవి నూతన ఒరవడులను ఒకదానితో ఒకటి ఏవిధంగా సాగుతున్నాయన్నది కేవలం విద్యావేత్తల అధ్యయనాలకే పరిమితం కావడం లేదు. మన నరనరాల్లోకి మనకి తెలియకుండానే ఇంకిపోతున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా జీవించడమే మనం అనుభవిస్తున్న ఘర్షణ!.ఈ విషయాన్ని పర్యావరణానికి అతీతంగా భావించడమే మనం చేస్తున్న తప్పు.
మనం మనలోని సహజంగా మేల్కొలిపే సుప్రభాత గీతాన్ని కోల్పోయాం. రోజుల్ని యాత్రికం చేస్కునప్పుడు ,రోజులు మనకి ప్రతి రోజు మనకి ‘దినం’ గా నే గడుస్తుంది. డి. వినయచంద్రన్ అన్నట్టు పర్యావరణీయం అంటే ప్రకృతి ని గుడ్డిగా పూజించడం కాదు, అదే విధంగా తోటల/వనాల పెంపకం గురించి అధ్యయనమూ కాదు. ఈ విధమైన దృక్పథం ప్రకృతిని కేవలం చెట్లు,నదులు,పక్షులు,అడవులుగా మార్చేస్తుంది. ఈ నిర్జీవ (సింథటిక్) ఆలోచన, అనాలోచితంగానే మానవ జీవనాన్ని, మనుషుల్ని ప్రకృతిని విడదీస్తుంది. అప్పుడు సూర్యోదయం కూడ  కరిగిపోతున్న కలే!
పర్యావరణ కవిత్వం అన్నది  ఈ మధ్యనే వెలుగులోకి వస్తున్న అంశం. అంటే ప్రకృతికి సంబంధించిన కవిత్వం. పూర్వం లేదా అంటే అప్పుడూ వుంది. అప్పటికీ ఇప్పటికీ తేడా వికిపీడియా నిర్వచనం తో మొదలుపెడదాం. ఎకో పోయెట్రీ ప్రకృతి తో సంబంధాన్ని పునరావృతం చేసుకునే ధ్వని,ప్రకృతి విధ్వంసం పై  ప్రతిఘటన, మెరుగైన ,ఆరోగ్యకరమైన ప్రకృతి కోసం పర్యావరణ సంరక్షణ ప్రణాళికల్ని, చట్టాల్ని   ప్రోద్భలించడం.( నసీర్76). గతంలో పర్యావరణం గురించి రాసినప్పటికీ, ఈమధ్యనే ఇది కొత్త ఒరవడిగా ,నూతన పద సృష్టి గా ఎదుగుతోంది. జేమ్స్ ఎన్గల్ హార్ట్ చెప్పిన వివరణ లోని కీలక అంశం , ఇతర సిద్దాంతాల్లాగానే (మార్క్స్, స్త్రీవాదం, వగైరా ) సామాజిక  బాధ్యతతో కూడిన ప్రక్రియ. ఎకో పోయెట్రీ  అన్నది విలువలతో కూడుకున్నది. వాళ్ళు ఇదే నిర్వచనమని అనరు,కాని ఈ నిర్వచనాన్ని లోతుగా పరిశీలించాలి. ఎందుకంటే ఇది ఎక్కువ శాతం స్టేట్(రాజ్య వ్యవస్ధ) నిర్వచనంగా కనపడుతుంది. మూలవాసుల,దళితులు,గ్రామీణ ప్రజలు, నగర జీవులు ప్రకృతిని చూసే దృక్పధాలు వేరు. ముఖ్యంగా రాజ్య వ్యవస్ధ చూసే తీరు వేరు.  ప్రకృతి ,సంస్కృతి నిర్మాణానికి, స్టేట్ ప్రకృతి సంస్కృతి నిర్మాణానికి మధ్యన పొంతన కుదరరడం లేదు. దీని మధ్యన పర్యావరణ కవిత్వానికి,కవిత్వ పర్యావరణానికి వున్నంత లోతైన అగాధం వుంది. రెండూ పోషకుల పైనే ఆధారపడి వుంటాయి.   ఎటొచ్చీ ధృక్కోణాలే వేరు.
ఇది ఇప్పుడే అని కాదు,అనాదిగా వున్న   ధృక్పధాల్లో  అంతరం. దీనికి బీజం, వనరుల్ని  అంచనా కట్టే  భిన్న ఆర్ధిక   దృక్పధాలు. ప్రకృతి భావాన్ని కవిత్వంగా  వ్యక్తపర్చడమంటే వైవిధ్యమైన దారిన సాగే  నిరంతర అన్వేషణ. వలస  పక్షుల  వైతరణి తోవ.  ఇది ప్రణాళికలు  ,చట్టాల కంటే విస్త్రుతమైనది .పాట పాటతో  ముచ్చటించుకోవడం.
కవిత ప్రకృతిలోని  మానవ సమాజాన్ని అన్వేషిస్తుంది, లేక మానవ సమాజంలోని ప్రకృతిని వెతుకుతుంది.ఒక విధంగా పర్యావరణ కవిత్వం-ప్రదేశాలు, మనం,మనతో,  అంతర్గతంగా,ఇతరులతో సంభా షించుకోవడం. మనలోని ప్రకృతిని రాయడం , దానిని ప్రస్తావించే తీరే పర్యావరణ కవిత్వమనవచ్చు. సహజమైన ప్రకృతి నుండి ,మానవ  ప్రేరిత పర్యావరణం మార్గంగా కృత్రిమ పర్యావరణం లోకి వచ్చాం. ఈ ప్రస్థానంలోని దశలు  ప్రకృతితో మమైకతతో జీవించడంగా చెప్పుకుంటాం. వునికి, అస్తిత్వ పోరాటాలు చాటుతాం, ప్రకృతితో పరాధీనమైన వ్యధను, ప్రకృతి విధ్వంసం , సంరక్షణ గురించి పంచుకుంటాం. ఇదంతా మనలోని ,మన బయట వున్న చెట్టు,పుట్టా, నీరు,నిప్పు,గాలి,మట్టిని అర్ధం చేస్కునే ప్రక్రియ. ఈ ప్రక్రియ వ్యక్తీకరణ  కోసం మట్టి తివాచీ పై కూర్చుని ఆకాశ మార్గంలో పయనిస్తూ పక్షి కన్నుతో చూడ్డం పర్యావరణ కవిత్వం.
ఎకో పోయెట్రీ (Eco poetry)
ఎకోసెన్ట్రిజం ప్రకృతి సమతుల్యతను పలుకుతుంది, అది ప్రకృతిలోని జీవ,నిర్జీవ వ్యవస్ధలతో బాటు చంద్రుడు,ఆకాశం,నక్షత్రాలను కలుపుకుని.అందుకే కవిత అన్నదానికి విశాల అర్ధం అన్ని ఊహాజనిత మార్గాల ఉత్పత్తి ప్రక్రియ. దీనినే భారతీయ సనాతన సాహిత్య కారులు మానసిక  శక్తులను సృజనాత్మక రూపంలో విడుదల చేయడం అన్నారు.ఇది జరగాలంటే మనం ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతాం అన్న వాస్తవాన్ని తెల్సుకోవడమే కాక మనలోని సునిశితను పెంచుకోవాలి.అప్పుడు సాహిత్యం ఒక నిర్జీవమైన పుస్తకంగా మిగిలిపోదు.భిన్న స్వర వచనం  (పోలిఫోనిక్) లేక  ముఖ్యమైన అసంఖ్యాక ( ప్లూరి గ్నిఫికంట్) స్వరాల గళం అవుతుంది,అందులో రచయిత/రచయిత్రి,విశ్లేషకులు, మధ్య పరస్పర చర్య అవుతుంది.సనాతన భారతీయ తర్కశాస్త్రం అనుసారం ప్రపంచ మనుగడకు ఒకరిమీద ఒకరికి ప్రేమ మూలం. ఈ మూలాన్నే అద్వైతం పేర్కొoటుంది.
“గాలి,వాన, కొండలు,నదులు,అడవులు,పచ్చిక బైళ్ళు,అక్కడ నివాసులు- ఇవన్నీ మన  భౌతిక అవసరాల కంటే మనః స్ధితికి చాలా  అవసరం. “-థామస్ బెర్రీ.
ప్రకృతి సంస్కృతి నిర్మాణం రూపాంతరం చెందడం (nature cultural construction), అదే సమయంలో పర్యావరణాన్ని వినియోగించడం.  ఈ  వినియోగంలో ప్రకృతిని సంస్కృతిగా, సంస్కృతిని ప్రకృతిగా అర్ధం చేసుకోవడం చాలా కీలకమైనది. ప్రకృతి వివిధ రూపాల్లో వుంటుంది. ఇది అంతర్గత,బాహ్య చర్యల వల్ల ఏర్పడుతుంది. మనం కొండంచున నిల్చుని, ఉబికివున్న కొండ చరియల్ని,లోయను చూస్తునప్పుడు,ఆ దృశ్యంలోని అంతర్లీన చర్యలను,వాటి ప్రతిస్పందనను  గమనించడం,వ్యక్తపరచడం  ముఖ్యం. వాట్ని ఒక క్రియగా చూడాలి   తప్ప కేవలం నామ వాచకంగా కాదు. ఈ దృష్టిని అర్ధం చేస్కున్నపుడే మనం మన చుట్టూ వున్న పరిసరాలని   మచ్చిక చేసుకుంటూ  వాటి రంగునీ, రూపాన్ని,పరిమళాన్ని,స్పర్శని  మనలో ఇముడ్చుకుంటూ మనం అందులో ఇమిడిపోతాం.
పర్యావరణ కవిత్వానికి , నేడు చలా మణిలో వున్నఎకో పోయెట్రీకి  మధ్య చాలా  పర్యావరణ దృక్పధాలు వచ్చాయి వాట్ని  పరిశీద్దాం...

Friday, 6 March 2020 0 comments By: satyasrinivasg

పచ్చటి పలుకులు



ప్రకృతి, కవిత్వం అన్నవి  శక్తి కేంద్రాలు. ప్రకృతి కవిత్వం  రాస్తునప్పుడు గమనించాల్సిన  విషయం ప్రకృతి లోని శక్తిని మన అక్షరాల ద్వారా ఎలా ప్రసురితం చేస్తాం అన్నది అర్ధమవ్వాలి.  ప్రకృతి ఓ శబ్ద  తరంగిణి , ఈ తరంగాలు  మండుటెండ మిట్ట మధ్యాహ్నం  కీచురాళ్ళ చప్పుడు, అర్ధ రాత్రి చేలో కప్పల బెక,బెకలు , ఉషోదయమప్పుడు చిట్టి పక్షుల కూతలు కావచ్చు. ఈ తరంగాల్ని మన కవిత్వం ద్వారా అరంగేట్రం చేయించాలి . దానికి కేవలం రాయడం,  చదువర్లని ప్రోత్సహించడం తో సరిపోదు , కవిత్వాన్ని చదవాలి , చదువర్లని ప్రేక్షకులుగా మలచాలి,పర్ఫాం చేయాలి  వార్ని ప్రేక్షకులుగా మలచాలి. అప్పుడు అక్షరంలో వున్న శక్తి వార్ని శక్తిని నిల్వ చేసుకునే శక్తి కేంద్రాలుగా ఏర్పరుస్తుంది ఇదే  ప్రకృతి కవిత్వ బయో సెంట్రిజం. ‘ప్రతి ఒక్కటి, మరొకదానితో ముడిపడి వుంది అన్న జీవావరణ ప్రధమ సూత్రం. నేడు కవిత్వం కాగితానికి, మొబైల్, కంప్యూటర్లకి అంటిపెట్టుకుపోయి శబ్ద లయని కోల్పోతోంది. ఒక విధంగా చెప్పాలంటే టెక్నాలజీ పుణ్యామా అని కవిత్వం,సాహిత్యం ఎంత తొందరగా పరివ్యాప్తి చెందుతుందో అంతే తొందరగా అది కనుమరుగవుతోంది అన్నది వాస్తవం. ప్రకృతి, కవిత్వం  ఈ రెండు సముహాల్ని కలిపి ప్రకృతిమయమవ్వడం చాలా అవసరం. ఎందుకంటే మనం రాసేది  ఓ డాలర్ కోసమో, మరో డాలర్ కోసమో కాదు. ఈ డాలర్ల మాయా జాలం నుండి  ప్రకృతిని సంరక్షించడానికి. ఇట్స్ నాట్  ఫర్    ఫ్యూ డాలర్స్ మోర్. బట్ ఫర్  ‘చివరి పాట వరకు,ఆమె ఎంత మృదువుగా వచ్చిందో అంతే మృదువుగా నిష్క్రమించింది’. ఈ నిష్క్రమణ  ఇకాలజికల్ జస్టిస్ కి (ప్రకృతి  న్యాయం) విరుద్ధం. ప్రతి ఒక్కరికీ జీవావరణ సంరక్షణ బాధ్యత వుంది, వారు దీనికోసం సృజనాత్మకంగా ,ఉమ్మడిగా కృషి చేయాలి.మనం జీవావరణ కవితాత్మకతని,ప్రకృతి ధృకోణాన్ని ఏర్పరచుకోవాలి ,  దీన్ని వాల్ట్ విట్ మ్యాన్  కవితలో చూద్దాం...
నా  స్వీయ గీతం(1892)
వాల్ట్ విట్ మ్యాన్
1
నాకు నేను ఉత్సవం జరుపుకుంటాను, నా కోసం పాడుకుంటాను
నేనేమిభావిస్తానో ,మీరూ అదే భావిస్తారు
నాకున్న అణువులు అంతే మంచిగా మీకు వుంటాయి
నను వీడి నా ఆత్మను ఆహ్వానిస్తాను
 నను వీడి , సుతారంగా ఒకింత ఒరిగి వేసవి గడ్డి పోచను గమనిస్తుంటాను
నా నాలుక , నా శరీరంలోని ప్రతి అణువు ఈ నేల , గాలి నుండి పుట్టింది
ఇక్కడే తల్లితండ్రుల నుండి పుట్టాను, ఇక్కడే వారి      
 తల్లి తండ్రులు, వారి వారి తండ్రులు అంతా ఇచ్చోటనే
నాకిప్పుడు ముప్పై ఏడేళ్ళ వయస్సు ,ఆరోగ్యవంతంగా వున్నాను
చచ్చేంతవరకూ ఇలానే వుంటానన్న ఆశ
బడిని, నమ్మకాల్ని పక్కనపెట్టాను
అవి ఉన్నంత కోశాన చూసుకుని కొద్దిగా విశ్రమించాను,వాట్ని ఎన్నటికి మర్చిపోలేదు
మంచో చెడో  నేను శ్రమిస్తాను, ప్రతి విధ్వంశం అప్పుడూ మాట్లాడుతాను
అవధులు లేని ప్రకృతి,స్వీయ శక్తి తో
2
ఇళ్ళు,గదులు సుగందాలతో నిండి వున్నాయి, అలమరాలు కూడా సుగంధ ద్రవాలతో నిండి వున్నాయి
 నేను ఆ పరిమళాన్ని పీలుస్తాను , నాకు తెలుసు అది నాకు ఇష్టమని
వాటి స్వేదనం నాకు మత్తెక్కిస్తుంది,కానీ దానికి నేను లొంగను
వాతావరణం పరిమళ ద్రవం కాదు, దానికి స్వేదనం, రంగు లేవు
అదిఎప్పటికీ నా నోటికి రుచినిస్తుంది, నేను దాని ప్రేమలో సదా
మానుల ఒడ్డుకి వెళ్తాను, నగ్నంగా అదృశ్యమైపోతాను
నాకు వాటితో కలిసి వుండాలన్న పిచ్చి
నా శ్వాస పొగ
ప్రతిధ్వనులు, నీటి వలయాలు, రహస్య గుసగుసలు, ప్రేమ వేర్లు,సిల్క్ దారాలు, మధువు
నాకు ప్రోత్సాహం ఇంకా ఊపిరి, నా గుండె చప్పుడు, నా ఊపిరితిత్తుల గుండా ప్రవహించే రక్తం,గాలి
పచ్చటి, ఎండిన ఆకుల పరిమళం , సముద్రపుఒడ్డున  నల్లని కొండలు, ధాన్యా గారంలోని  గడ్డి
నా గొంతులోని పల్చటి మాటలు గాలి సవ్వడిలో కొట్టుకుపోతాయి
 నా భుజాలని  అల్లుకున్న కొన్ని చిన్ని ముద్దులు,కౌగలింతలు
నీడ ,వెల్తుర్లలో చెట్ల కొమ్మలు తోకలూపుతాయి
ఒంటరి పారవశ్యం లేక వీధుల్లో రద్దీ,లేక కొండల దగ్గర ,పొలాల్లో
 ఆరోగ్యకరమైన భావన , మిట్టమధ్యాహ్నపు ఎండ ,
నాలో నీ గీతం అంచునుండి లేచి సూర్యుడిని చేరుతుంది
నీవు వేల ఎకరాల్ని అంచనా వేశావా? నీవు భూమిని కొలిచావా
నీవు సుధీర్ఘంగా చదవడం అభ్యసించావా?
కవితల్ని అర్ధం చేసుకోవడం లో గర్వం పొందావా?
ఈ రోజు పగలూ రాత్రీ నాతో వుండు,ఇక నీవు కవితల మూలాల్ని పొందగల్గుతావు
నీవు భూమి, సూర్యుడ్ల మంచిని అస్వాదించగల్గుతావు,(కొన్ని లక్షల సూర్యుడ్లున్నారు)
ఇక పై మరొకరి దగ్గరనుండి ఏదీ తీసుకోవు, ఇక చనిపోయిన వారి చూపుతో చూడవు,
పుస్తకాల్లో దెయ్యాల గురించి ప్రస్తావించవు
నువ్వు నా కంటితోనూ చూడవు,నా నుండి ఏమీ తీసుకోవు
అన్ని వైపుల నుండి విని నీ వాట్ని మేళవిస్తావు
(అనుసృజన-జి.సత్యశ్రీనివాస్)
వాల్ట్ విట్ మ్యాన్ కి , తన  జీవితకాలంలో  పెద్ద పేరుప్రఖ్యాతలు రానప్పటికీ,(1819-1892).
ఇప్పటికీ ఆయనని  గొప్ప కవి- ఫిలాసఫర్, ప్రజల  కవి, మానవతావాది, మేధావి కవి గా భావిస్తారు. 
 ఇయన్  హోమర్,వర్జిల్, డాంటే షేక్క్ పీయర్ వారసుడిగా అంచనావేస్తారు.
ఈయన పుస్తకం  “లీవ్స్ ఫ్రం గ్రాస్” 
లో ప్రజాస్వామ్యం, ప్రకృతి,ప్రేమ ,శృంగార స్వేచ్ఛ,స్నేహం  గురించి రాశారు. 
ఈయన కవిత్వం 1850-1890 కాలంలో బ్రిటిష్ ధోరణికి భిన్నంగా వస్తూ అమెరికన్ కవిత్వానికి 
కొత్త ఒరవడి సృష్టించింది. సాంగ్ అఫ్ మై సెల్ఫ్  అన్న కవిత  52 స్టాన్జాల్లో వుంటుంది.  
ఇందులో ప్రేమ శక్తి తొణికిసలాడుతుంది. ఇందులో  విట్ట మ్యాన్ నుండి శక్తి భౌతిక
 ప్రపంచలోకి ప్రసారమై ,
తిరిగి విట్ట మ్యాన్ లోకి ప్రవహిస్తుంది ఇది కవిత్వం లో అరుదుగా కనిపించే ప్రకృతితో ముడిపడిన 
మెటాఫిజికల్ బంధం. ఈ బాంధవ్యం  కవికి ,జీవావరణానికి శక్తి ప్రవాహం ,
ఇదే కవిలోని జీవనానికి పునాది.
 ఈ కవితలో పూర్తి స్ధాయిలో ప్రకృతి దృష్టి ఇమిడి వుంది.విట్ట మ్యాన్  మాటల్లో కవిత్వం, 
 కవులనుండి ఉత్పన్నమై వాతవరణం లో కలిసి కవిత్వ వాతావరణాన్ని సృష్టిస్తుంది 
అది తిరిగి కవిత్వ వర్షంగా కురిసి ,మన  ఎదుగుదలకు దోహదపడుతూ,
మనని సృజనాత్మకంగా పునారావృతం చేస్తుంది. 
ఈ కవిత్వ  సాంస్కృతిక  వాతావరణం లేనప్పుడు  మనం కేవలం గాలి పీల్చుకునే 
మనుషులుగానే చచ్చిపోతాం.
 ఇది కాకుండా వుండాలంటే మనలోని ప్రకృతిని తడి కవిత్వ నీటి చుక్కలతో
 తరుచూ తడపడం అవసరం!.