Thursday, 4 June 2020 0 comments By: satyasrinivasg

చరిత్ర సౌ౦జ్ఞలు ప్రకృతి చిహ్నాలు



 జీవం అన్నది ఒక  పరిశోధన శాల నుండి పుట్టలేదు, అది విపత్కర సందర్భం  నుండి ఆవిర్భవించింది  అన్నది  శాస్త్రజ్ఞుల అంచనా. 251 మిలియన్ సంవత్సరాల(గ్రేట్ డైయింగ్) క్రితం 96 శాతం జీవరాసులు అంతరించి  కేవలం నాలుగు రకాల జీవరాసులు భూమి, నేల పైన జీవనం కొనసాగించాయట. దీనికి చిహ్నం సెల్ ఫిష్. జీవనయానం  అంటే విపత్కర  పరిస్ధితులని ఎదురొడ్డి నిలవడం. జీవం అలా కొనసాగింది, ఈ  కొనసాగింపులో మనతో బాటు ప్రకృతిని ఒక చిహ్నంగా  చేస్కుంటూ వచ్చాం. ప్రాణహిత- గోదావరి లోయ ప్రాంతం భౌగోళికంగా చాలా  విశిష్ట ప్రాంతం.  ఈ ప్రాంతంలోని పూర్వ ఆదిలాబాద్   జిల్లాలోని యమ్మన్ పల్లి గ్రామంలో తొలి మానవులు ఉపయోగించిన పనిముట్లు లభ్యమయ్యాయి.ఆర్కియాలజిస్ట్లు ఆనతి కాలం గా వున్న పనిముట్లని కల్చర్(సంస్కృతి) అని వ్యాఖ్యానిస్తారు., పనిముట్లు అన్నవి మానవ సంస్కృతికి చిహ్నాలు, ఈ పనిముట్ల ద్వారా వారి జీవన, సామాజిక , ప్రకృతికి గల సంబంధం వ్యక్తమవుతుంది. ఇక్కడే మరొక కధ లాంటి సంఘటన ప్రస్తావిస్తా,  కామ్తి శ్రేణుల ప్రాంతంలో( ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాలలో)1968 కాలంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లోని ప్యాలియనటోలజిస్త్స్(పురాజీవ, శిలాజీవ) పరిశోధన చేస్తునప్పుడు త్రైస్సాక్ కాలం (252 -201 మిలియన్ సంవత్సరాల క్రితం, అంటే గ్రేట్ డైయింగ్ కాలం పిదప) తీవ్రమైన ఎండలను లెక్కచెయ్యకుండా తవ్వకాలు చేపట్టారు, ఫలితం రాక ఇక వెనుతిరుగుతునప్పుడు వారికి, కామ్తి గ్రామస్తుడు ఒకరు ,గతంలో అంటే  కొన్ని సంవత్సారాల క్రితం గ్రామస్తులు వారికి దొరికిన రెండు రాళ్ళను, అవి దేవతల్ని పోలి వున్నాయి  అని  వాటిని విగ్రహ ప్రతిష్ట చేసి గుడి కట్టారని  చెప్పాడు. ప్రతి ఏడాది అక్కడ సంబరాలు చేస్తారు. ఇది తెలుస్కుని శాస్త్రజ్ఞులు అక్కడికి వెళ్లి చూస్తే అవి,లైస్త్రోసవురస్  అనే పురాతన సరీసృపాల అవశేషం. శాస్త్రజ్ఞులు గ్రామస్తులని ఒక దేవతని తమకు  పరిశోధన నిమ్మిత్తం ఇమ్మని అడిగి తీసుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం  వస్తువు ఒకటే కాని దానిని చూసే తీరు  ఆయా ప్రాంతం, సందర్భ౦, వ్యక్తులు ,వ్యవస్ధల తీరు పై ఆధార పడి వుంటుంది. ఒకరికి ఆ రూపం దేవత అయితే మరొకరికి  అది జంతుజీవరాసుల ఆనవాలు. ఈ   పి.జీ.(ప్రాణహిత –గోదావరి వ్యాలీ) ప్రాంతంలో కొండలు,నేలలు శిలాజీవాల అవశేషాలు ఘని. అక్కడ జరిగిన పరిశోధనల వల్ల ఆయా గ్రామాలకు ఆ కొండ శ్రేణుల పేర్లు పెట్టారు. గొంద్వాన రీజియన్ అన్న పేరు కుడా అలానే వచ్చింది. దురదృష్టవశాత్తు మనం  ప్రకృతికి, జీవరాశికి సంబంధం వల్ల ఏర్పడిన చరిత్రను పట్టించుకోము, తగిన గుర్తింపు ఇవ్వం. ఎంతసేపు మానవ నిర్మిత కట్టడాలనే చరిత్ర చిహ్నాలుగా కీర్తిస్తాం. ఎందుకంటే గిరిజనులకు అది బువ్వనిచ్చే గూడైతే నాగరికతకు అది డబ్బునిచ్చే ముడిసరుకు కాబట్టి. అంటే మన ఇజంలలో ప్రకృతి చిహ్నాలని ఎక్కువగా వాడుకున్నది మతం కోసమే! అది, భారతంలో శల్యుని  రధం పై జెండా   గుర్తు అరటి చెట్టు,భీష్ముడికి తాడి చెట్టు,అభిమన్యుని జెండా పై   గుర్తు  కొండగోగు పువ్వు,లేక గన్నేరు చెట్టు. వాటికంటూ ప్రత్యేక విశిష్టత వుంది. ఆ వ్యక్తుల విశిష్టతకు తగ్గటుగా ,ఇతర విశేషాల వల్ల పెట్టుకుని వుంటారు. ఇవి కేవలం గుర్తులే కాదు, అవి ఇంకా చాలా విశేషాల్ని  చెబుతాయి.ఇవి మనలో కాలక్రమేణా నాటుకు పోతాయి, నాల్గో సింహం సినిమా డైలాగ్ కంటే బలంగా.   ప్రతీకలకు సంబంధించి  మరొక  విశ్లేషణ వుంది, అది వాణిజ్యానికి, వర్తకానికి సంబంధించి.ఇందుకు సజీవ ఉదాహరణ  సుప్రసిద్ది గాంచిన లక్ష్మీ దేవి క్యాలెండర్. రాజా రవి వర్మ తన చిత్రపటాలని విస్తృతంగా వ్యాప్తి చేయడానికి తదనంతరం కాలంలో ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభిoచాడు, తన పెయింటింగ్స్ ని అచ్చువేసి సరఫరా చేసాడు, అందుకే ఇప్పటికీ శకుంతల, సరస్వతి ,లక్ష్మీ దేవి పెయింటింగ్లు గోడలకి క్యాలెండర్లు గా , మార్బుల్స్ పైన  దేవుడి గదుల్లో ప్రతిష్టి౦చుకున్నాయి.  ఇక లక్ష్మీదేవి క్యాలెండర్ని గమినిస్తే ,లక్ష్మీ దేవి సముద్రంలోని కలువ పైన కూర్చుని కుడిచేతి నుండి కాసులు రాలుస్తుంది.అసలు ఈ రూపం ఎందుకు వచ్చింది, అని మిత్రులతో చర్చించినప్పుడు కళల పైన అవగాహన వున్న మిత్రుడు ఇచ్చిన వివరణ. ఒక కాలంలో సముద్రయానం  అన్నది తిరిగిరాని ప్రయాణం, కాని అప్పుడు వాణిజ్యం ,వర్తకం,అంటే కాక పై చదువులకు బయటకు వెళ్ళాలి,అది సముద్రయానం ద్వారానే జరిగేది. కనుక జనాల్లో వుండే భయం పోగొట్టడానికి సముద్రయానం ద్వారా వాణిజ్యం ,వర్తకం చేస్తే  డబ్బులు, డిగ్రీలు  సంపాదిoచవచ్చు అన్న  ప్రేరణతో కూడిన అవగాహన కల్పించడానికి ఏర్పడిన చిత్రం, ఇక ఏముంది శుభ్ లాభ్ పోయి,  లాభ్  శుభ్ అన్న నినాదం  వచ్చింది.
కళలలో రూపం ముఖ్యం,ఆ రూపం ప్రకృతి ఆనవాలైనప్పుడు, ప్రీ కాని పోస్ట్ కాని ఇజం లో రీజన్ అండ్ రివిలేషన్(కారణం ,కనుగొనడం) కంటే  నమ్మకమే ఆచరణ లోకి వచ్చేస్తుంది, ప్రకృతి సంరక్షణ పేర్న  గుడ్డిగా చెట్లు నాటినట్టు.నేడు మనమున్నది పోస్ట్ ట్రూథ్ కాలం లో ప్రజల అభిప్రాయాన్నిఏర్పరచుకోడానికి  వాస్తవ అంశాల కంటే , వారి నమ్మకాల్ని ,భావోద్వేగాల్ని ఎవరికి అనువుగా వారు మల్చుకోవడం కీలకం. మేక ,కుక్క కధ లా...
ఇప్పటి రోజుల్లో ప్రకృతి చిహ్నం ఒకటే అయినప్పటికి దాని వాడుక  అర్ధానికి వివిధ తీరులున్నాయి కనుక ప్రకృతి సంరక్షణ,పర్యావరణ, జీవావరణ సంరక్షణ అన్నది   అరచేతిల్లో తిరిగే గ్లోబ్ చిహ్నం ఒక్కటే కాదు, ఎందుకంటే ఆ అరచేతులు ఎవరివి అన్నది నిగూఢ రహస్యం.
 సంరక్షణ ఒక బొంగరాలాట
నాకు చిన్నప్పుడు బొంగరాలాట ఆడడం చాల ఇష్టం. నేల పైన బొంగరం తిరుగుతునప్పుడు  కళ్ళు దాని చుట్టూ తిరిగేవి, అందుకే అది ఎంత ఎక్కువ సేపు తిరిగితే అంత సేపు దాని చుట్టే  చూపులు అల్లుకునేవి. నాకంటే పెద్దవాళ్ళు బొంగరాన్ని అరచేతిలో తిప్పుతున్నప్పుడు ,నేను చాలా ప్రాక్టిస్ చేసి నేర్చుకున్నా, ఇంకేముంది నేనే బొంగరమై పోయా!. ఆ బొంగరాన్ని చిన్న పిల్లల అరచేతులకి అందిస్తే , అది వారి లేలేత చేతుల్లో తిరుగుతోంటే వారి సంతోషం ,నీటి చుక్కల్లో తడిసే బుజ్జి పక్షుల కేరింతలాగుంటుంది. ఈ ఆటలో మరో లక్షణం   గుండ్రంలోని రాయి ఎవరు కొడితే వాళ్ళు గెలిచినట్టు. అలా మనకు తెలియకుండా మనకు చాలా అబ్జర్వేషన్ గుణాల్ని నేర్పిస్తుంది. నేడు య్యానిమలిజం, మోడర్నిజం, హ్యుమనిజం, నుండి  అన్నీ ఇజంలలో పోస్ట్ స్ధాయికి చేరామని అనుకుంటున్నాం. ఇవి ఎక్కువ గా సాహిత్యం , కళలు, శాస్త్రీయ ధోరణిలలో కనిపిస్తాయి తప్ప సామాజిక మార్పుల్లో కాదు.  ఇక పోస్ట్ మోడర్నిజం స్ధాయిలో శాస్త్రీయ మార్పుల వల్ల అభివృద్ధి చెందాము అని చెప్పడానికి  ఉపయుక్తకరమైన సాధనాలని ఏర్పరుచుకున్నాం, కాని పోస్ట్ హ్యుమనిజం స్ధాయికి ఎదగలేదు. వివక్షత అన్ని రూపాల్లో కొనసాగుతోంది, కొన్నిట్లో అయితే హెచ్చు స్ధాయిల్లో ఎదిగిపోయింది. ఆశించే స్ధాయికి ఎదగలేకపోవడానికి కారణం  మనం అనాదిగా  ప్రకృతికి ఎంక్లోజర్స్ ఏర్పరుస్తూ వాటి ద్వారా సమాజాన్ని అదుపాజ్ఞలలో పెట్టుకోవడం.  దీనికి ,బొంగరం ఆటకి చాలా దగ్గర పోలికల్లున్నాయి. ఆట ఆడుకోడానికి ఒక వస్తువు కావాలి , ఆట ఆడుతూ, ఆడుతూ, క్రమేణా మనమే ఆట వస్తువయి పోతాం. బొంగరం ఆటలో మన ఆలోచన ,శరీరం అంతా బొంగరం చుట్టూ తిరుగుతుంది, అది తిరుగుతుంది , కాని మనం తిరుగుతున్నాం అన్న భ్రమలోకి  పోతాం.
ఇదే అట 2000 దశలో వచ్చిన బేబ్లేడ్ పిల్లల కార్టూన్ సీరియల్, పిల్లలని ఎగబడి కోనేడట్టు చేసింది, అన్నం తినే కంచాలలో సైతం బొంగరాలు తిరిగాయి.నేను తిప్పిన బొంగరం నేల పైన తిరిగేది, నా కొడుకు,మేనల్లుడు తిప్పే బొంగరం కంచంలో తిరుగుతోంది.  మన తోలి దశ బొమ్మలు కుడా అన్నం తింటూ, అన్నం ముద్దల్ని వలయా కారం , గీతలు గీయడం తో మొదలైయింది, తరం మారేసరికి నేల కంచం అయిపోయింది. ప్రీక్వెల్  నుండి సీక్వెల్ కి వచ్చే సరికి బొంగరం  రూపం అదే వుంది, దానిని తయారు చేసే సామాగ్రి మారింది, ఆడే ప్రదేశం మారింది, తిరిగే స్ధానం కూడా. ఒక సహజమైన చెట్టు నుండి తయారైన బొంగరం(.  చిత్తూరు జిల్లా ఒక కాలంలో బొంగరాల తయారీకి ప్రసిద్ది , అక్కడ బొంగరాలు తయారు చేసుకునేందుకు అనువైన చెట్లు ఉండేవి)  ప్లాస్టిక్ అయ్యింది. ఇది అందరూ చూడలేరు, కొన లేరు ,సామాజిక తేడాలు ,వివక్ష. ప్రకృతిని ముడిసరుకుగా  మార్చి ఎదగడం అన్నది సింబల్ గా  మారింది. ఇది జరగాలంటే ప్రకృతిని సహజంగా కాక ఒట్టి ముడిసరుకుగా మార్చాలి. అది కొందరి చేతుల్లోనే వుండాలి, ఇక్కడే మనలోని  డా. జెకిల్ అండ్ హైడ్ పాత్రలు వస్తాయి. ఒకడు మంచివాడు ,మరొకడు దుర్మార్గుడు.  ఈ పద్ధతిని ఇప్పుడు రివర్స్ లో  తిప్పాలి . కధ ప్రీక్వెల్ లోకి వెళ్ళాలి!
ఈ ప్రతీకల రూపాల్లోని మూలాలు చూడాలి,ఇందుకు మనం నేర్చుకున్న దాంట్లో ఏమి నేర్చుకోలేదో తెల్సుకోవాలి అందుకు, చదివినది పక్కన పెట్టి, రాయనిది,చెప్పనిది తిరిగి  చదవాలి. ప్రకృతి, జీవావరణ ,పర్యావరణ కవిత్వంలో కొత్త ఒరవడి , ప్రతీకలని సృష్టించాలి. , ఇందకు జాయ్ హర్జో, అమెరికాలోని మొదటి నేటివ్ అమెరికన్ కవయత్రి , సంగీత విధ్వాంసురాలు, రచయత్రి, నాటక రచయత్రి, 20 వ శతాబ్దం చివరి దశలో  నేటివ్ అమెరికన్  సాహిత్యంలో కొత్త ఒరవడి సృష్టించిన వ్యక్తి.  జాయ్ హర్జో  రెండు సార్లు పోయెట్ లారేట్ గా పురస్కారం అందుకుంది.
గ్రద్ద
జాయ్ హర్జో
ప్రార్ధించాలంటే, మనస్సుని పూర్తిగా తెరవాలి
ఆకాశానికి, భూమికి, సూర్యుడికి, చంద్రుడికి
ఒకే  గొంతుక, అది నువ్వు.
నువ్వు చూడలేనిది, వినలేనిది
ఇంకా వుందని తెలుసుకో
మెల్లిగా ఎదుగుతూ, భాషల్లోనూ
చలనం లేకుండా ఏదీ అంతుబట్టదు
అవి ఎప్పుడూ శబ్దాలే కాదు,ఇతరత్రవి కూడా
చలన గోళాలు.
ఆ ఆదివారమప్పుడు  గ్రద్ద లా 
సాల్ట్ నది పైన నీలటి ఆకాశంలోని వలయంలా
పవిత్రమైన రెక్కలతో
గాలిలో, మన మనస్సుల్ని శుభ్రపర్చినది
మేము నిన్ను చూస్తాము, మమ్మల్ని మేము, ఇంకా తెలుసుకుంటాం
అన్నిట్ని భద్రంగా చూడాలని
అన్నిటి పట్ల దయతో వుండాలి.
మనం వీటన్నిటితో ముడిపడున్నామని,శ్వాస పీల్చు
ఇవన్నీ,
శ్వాస పీల్చు, ఇది తెల్సుకుని
నిజంగా  మనం ధన్యులం, ఎందుకంటే
మనం జన్మించాము, త్వరలోనే చనిపోతాం,
స్వచ్చమైన  జీవన చక్రం
మనలోనే.
ఉదయమే వలయంలా  ఎగురుతున్న గ్రద్దలా
ప్రార్దిద్దాo అది జరగాలని
అందంగా.
అందంగా.
(అనుసృజన జి.సత్య శ్రీనివాస్)

ఇదంతా ఆమె మాటల్లో చెప్పాలంటే...  నిజంగా  మనం ధన్యులం, ఎందుకంటే ...,
 నాకో సిద్ధాంతం వుంది మనలో కొందరు మన శరీరాలను దాటి బతుకుతామని ,ఎందుకంటే మనం నరాల అల్లికలతో జన్మించాము.
ఉదయమే వలయంలా  ఎగురుతున్న గ్రద్దలా...
నాకు తెల్సు ప్రతి రోజు  ఎన్నో ప్రపంచాల్ని చూస్తూ ,వస్తూ పోతూ వుంటా..
ఈ కవితలో నేటివ్ అమెరికన్ల ప్రాపంచిక ప్రకృతి రూపం నేటి కోణంలో ఆవిర్భవిస్తుంది,
ఆకాశానికి, భూమికి, సూర్యుడికి, చంద్రుడికి
ఒకే  గొంతుక, అది నువ్వు.
ఆమె మాటల్లోనే ఒక ఆకుని చదువుతూ ప్రపంచాన్ని అర్ధం చేస్కోవచ్చు...
ఇది నేననుకుంటున్న మాట ,ఆ ఆకు పచ్చని పాఠ౦ మీరే కావచ్చు!

Wednesday, 27 May 2020 0 comments By: satyasrinivasg

ద హ్యుమేన్ జూ....




సాహిత్యం , కళల్లో యానిమలిజం అన్న దృక్పధం వుంది. అంటే జంతుజాలాదుల ప్రవర్తన .గుణగణాల్ని రాయడం, వాట్ని ఆపాదించడం, పోలికలుగా , భౌతిక, అభౌతిక,సులువుగా, క్లిష్టంగా,వస్తువుగా, ప్రక్రియగా,సంఘటనగా, జీవ, నిర్జీవిగా ప్రస్తావించడం అన్నది  ఆనవాయితీగా వున్నది. అంటే మానవ సమాజ అభివృద్ధి క్రమంలోని సాహిత్య మాధ్యమాల్లో ఇవి మన వెన్నంటే వున్నాయి. కళ అంటే కాల్పనిక ఆలోచనకి రూపమివ్వడం, ఆ రూపమే క్రమేణా ఆలోచనగా మారడం. ఈ రూపాలు ఎక్కువగా మతపరమైన, ఫాంటసీ, మ్యాజికల్ రియలిజం,సైన్స్ ఫిక్షన్  సాహిత్యంలో విస్తారంగా కనిపిస్తాయి.
మానవ సమాజ అభివృద్ధి అంతా ప్రకృతిని మచ్చిక చేస్కోవడమే. అడవులన్నవి మన మనుగడకు ప్రాణమిచ్చే బీజాలు , జన్యు కేంద్రాలు. అభివృద్ధి అంతా  అడవులనుండి కాంక్రీట్ అడవులలోకి (హ్యుమేన్ జూ) వచ్చిన వలస. ఈ వలస అంతా  మనం మన ఆలోచనలోకి రూపమిస్తూ కొనసాగిన బతుకు తెరువు. ఈ క్రమంలో ప్రకృతిని మచ్చిక చేసుకున్న తీరంతా హింసతో కూడుకున్నదే! దురదృస్టవశాత్తు ఈ ప్రయాసలోని వాంఛని యానిమల్ ఇన్స్టింక్ట్ అంటాము, కాని జంతువులకు హింసా  ప్రవృత్తి వుండదు. మనం మంచి వాళ్ళం అని చెప్పుకోడానికి వాటి ప్రవృత్తిని క్రూరంగా చాటాం!.
జెకిల్  అండ్ ద హైడ్
నేడు మనం యానిమలిజం నుండి పోస్ట్ యానిమలిజం, హ్యుమేనిజం నుండి పోస్ట్ హ్యుమేనిజం స్ధాయికి చేరాం. ఈ మార్పు దారిలో ఎక్కువగా మన శారీరక శక్తి కంటే ఇంకా ఎక్కువ శక్తిని జమచేసుకుని ముందు తరాలకి అంది౦చాలన్న వాంచ. ఈ శక్తి ( డబ్బు, పరపతి, అధికారం,పేరు, ప్రతిష్ట ,హోదా అన్నిటికి వర్తిస్తుంది)ని ఒక ఆధ్యాత్మిక శక్తిగా, అంతులేని శక్తిగా పరిగణి౦చాం.  వాస్తవానికి మనం పూర్తిస్ధాయిలో పోస్ట్ హ్యుమనిజం స్ధాయికి చేరామని చెప్పలేము, కారణం మనం ఇంకా పక్షుల్ని, జంతుజాలాల్ని ప్రతీకలుగా వాడుతున్నాం.  యానిమలిజం నుండి  ఇంకా పై స్ధాయికి ఎదిగే క్రమం అన్నది ఇంకా ఎక్కువ తెలుస్కోడానికి అనంతమైన  పరిశోధన. వాటి ఫలితాల్ని పరివ్యాప్తి చేయడం, ఇంకా కొత్త వాట్ని రూపొంది౦చడం.  ఈ క్రమం  భూమి,ప్రకృతి  స్వరూపాన్ని మార్చేస్తుంది, దాని ఫలితంగా మానవ సమాజ స్వరూపాలు మారుతాయి. యుద్ధానంతరం వచ్చిన మార్పులో జంతువుల రూపాల్ని మార్చి మన శక్తి సామర్ధ్యాలకే విలువ నిచ్చే ఆలోచనా ధోరణి చోటుచేసుకుంది. జంతువుల స్ధానంలో యంత్రాల ద్వారా శక్తిని వినియోగించడం ఏర్పడుతుంది.ఇది అన్ని రూపాల్లో కనిపిస్తుంది, ఉదాహరణకి, సర్ కాటన్ దొర ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణమప్పుడు  అన్న మాట, ‘బ్యారిజ్ నీళ్ళు వచ్చిన తర్వాత ,నీళ్ళు అందే ప్రాంతంలో వ్యవసాయ రూపురేఖలు మారిపోతాయి, అక్కడ  పండే  నల్ల బియ్యం కనుమరుగవుతుంది’.  అది జరిగింది. అక్కడ పండే ప్రాంతీయ పంటల స్ధానంలో వాణిజ్య పంటలు చోటుచేసుకుంటాయి. అదే కాదు ఆనకట్టల దిగువ ప్రాంతం అంటే నీరు అందే ప్రాంతంలో ఆవులు ,ఎద్దులు పోయి వాటి స్ధానంలో గేదెల పెంపకం పెరుగుతుంది, ఇదీ నేడు కనిపిస్తుంది.
ఇదంతా యానిమలిజం నుండి పోస్ట్ యానిమలిజం ఎదిగిన తీరు ,అదే విదంగా సమాజం హ్యుమేనిజం నుండి  పోస్ట్ హ్యుమేనిజం స్ధాయికి ఎదిగింది. అంటే  మనిషి తన జీవితానికి తనే ఆర్ధం ,పరమార్ధం కల్పించుకుంటాడు అన్న తీరు నుండి  తన మేధో శక్తితో మనిషి కంటే గొప్ప వాడవుతాడు.  ఈ తాత్విక  మేదస్సు ధోరణి అంతా అన్త్రఫోసెంత్రిక్ దృక్పధం.   ఈ దృక్పధం లో నిగూఢoగా వున్నది వర్తకం , వాణిజ్య దృష్టి. దీనిని చారిత్రాత్మక చూపు లేకుండా జీవావరణం,పర్యావరణ,  ప్రకృతి సంరక్షణ అన్న నినాద కూడిత కార్యక్రమాలు అన్నీ ఒక మిధ్య.
నేడు చలామణిలో వున్న ఎకో పోయట్రీ  పారిశ్రామీకరణమప్పుడు పచ్చిక మైదానాలు హరించిపోతున్నాయి అన్న ఆవేదన నుండి వెల్లువెత్తిన గళం, ఇందుకు ఉదాహరణ విలయం వర్డ్స్ వర్త్ కవిత్వం.వాణిజ్యం,వర్తకం అన్నవి సముద్రయానం ద్వారా ఉదృతమవుతున్న కాలంలో ఓడలకి(ఒకప్పుడు యానా౦ పడవల తయారీకి ప్రసిద్ది గాంచినది) కావాల్సిన ముడి సరుకుల  కోసం అడవుల వాడకం పెరిగింది, తర్వాత పారిశ్రామీకరణ జతవ్వడంతో డబ్బున్న వాళ్ళు ,పాలకులు తమ అవాసాల్ని ఎస్టేట్లు గా ఏర్పరచుకున్నారు.అక్కడే ప్లాంటేషన్ లు ప్రారంభించారు, ఇది నేడు రియల్ ఎస్టేట్ వాళ్ళు కొత్తగా పెట్టిందీ  కాదు, పచ్చదనం కోసమూ కాదు. పారిశ్రామీకరణ వల్ల భూవినియోగంలో  జరిగిన మార్పులు భూమి స్వరూపాన్ని మార్చేశాయి, నేలకు వుండే ఉత్పత్తి గుణాన్ని చంపేశాయి.
ప్రకృతిని మచ్చిక చేస్కోవడమంటే కేవలం చెట్టు ,పుట్ట, నేల ,నింగిని కైవసం  చేస్కోవడం కాదు, ఇతరలనుండి వాట్ని హస్తగతం చేస్కువడం.దానికి ధనిక ,పేద, కులం ,మతం ,జాతి, వర్గం, స్త్రీ, పురుషుడు  అన్న ఆయుధాల్ని ఉపయోగించాలి. అంటే ఎదుటి వారి ఆలోచనలకి మనం అనుకునే రూపం ఇవ్వాలి, ఇందుకు మనిషి రూపం కాదు , జంతుజాలాల రూపం అయితే  సులువుగా వుంటుంది  కదా. ఇదే మనలోని జాకాల్ అండ్ ద హైడ్ కధ.
మన నీడంటే మిగిలిన పక్షులు
మన చుట్టూ వున్న జీవావరణంలో(నగరం) నేడు అరుదుగా కనిపించేవి చిత్రిత కొంగలు(తెల్ల కొంగలు), ఇవి ఎక్కువగా పక్షుల పైన , మేకల,గొర్రెల మందలలో కనిపిస్తాయి. వీటికి చింత చెట్లు అనువైన ఆవాసం . వీటికి మేకలు, గొర్రెలు, పశువుల కాపర్లకి అవినాభావ సంబంధం వుంది. పంట చేలల్లో వరి నాట్లప్పుడు ఇవి చేలో వాలిన మబ్బుల బుడగల్లా గెంతుతాయి. ఇవి మనని ఎంతగా అర్ధంచేసుకున్నయ్యో దీన్ని బట్టి అర్ధం అవుతుంది అంతే కాదు బహుశా మనకంటే ఎక్కువగా యంత్రాలని అర్ధం చేసుకున్నాయనిపిస్తుంది.  ఈ విషయం స్వీయ అనుభవంతో చెబుతున్నా... ఆ అనుభవాన్ని మీరూ చదవండి...
 మేము ,చిత్రిత కొంగ ,ప్రొక్లైనర్
మా ఇంటి వెనుక మైదానంలో
కొంత కాలం క్రితం ఆమె, నేను నాటిన మామిడి,చిన్న వుసిరి, సీతాఫలం ,సపోటా,జామ, నేరేడు, మునగ ,చింత,నిమ్మ, గుల్మొహర్ , వేప మొక్కలు ..
హరిత హారంలో భాగంగా  నాటిన కానుగ, నేరేడు  మొక్కలు...
భారతి ఆంటీ కావాలని తెచ్చి నాటించిన మారేడు, రావి ,వెలగ మొక్కలు...
సుమారు 50 చెట్లు.....
కొన్ని పూతకొచ్చాయి
ఆ చెట్లిప్పుడు చాలా రకాల పక్షుల నివాస ప్రాంతాలు
  ప్రాంతాన్ని పిల్లలు ఆడుకోడానికి అనువుగా ప్రొక్లైనర్ తో చదును చేయిస్తున్నారు
యంత్రం నేలను చదును చేస్తునప్పుడు చెట్లకు ఇబ్బంది కలిగి అవి పెకలించబడతాయన్న శ్రద్ధతో కూడుకున్న భయంతో  కావలి కూర్చున్నా...
 వాటికి నీళ్ళు పోసి, ఆమె ,నేను వాట్ని పిల్లల్లా పెంచాము
---------
ఎక్కడినుండో వచ్చింది ఒక చిత్రిత కొంగ !
యంత్రంతో బాటు భయంలేకుండా దాని  చుట్టూనే తిరుగుతోంది.ట్రాఫిక్లో బాగా తిరిగే అలవాటున్న ప్రాణంలా .
సన్నిహితుడితో నగర రోడ్డుల్లో ఇష్టానుసారంగా  తిరిగినట్టు వుంది దాని స్వభావం.  ఒకప్పుడు పశువుల పైన వాలి తిరిగే సహజీవన వాసి అది. చిన్నపాటి అలికిడికి పశువులు తమ తోకాడించేవి. ఆ సౌ౦జ్ఞకు కొంగ పశువుల నుండి దూరంగా ఎగిరి వాలి, వాట్ని గమనించి మళ్ళీ వచ్చి వాలేది. ఆ అలవాటు ఇప్పటికీ  దానిలో కనపడుతోంది. అది యంతాన్ని పశువుగా ఎందుకు అనుకుని, అలా యంత్రాన్ని వదలకుండా తిరుగుతుందో  కొద్దిసేపటికి అర్ధమయ్యింది.  పెకలించిన మట్టిని కుప్పగా వేస్తునప్పుడల్లా ,అది ఒక్క ఉదుటున ఎగిరి కుప్ప మీద వాలి వాన పాముల్ని,క్రిముల్ని  పట్టుకుని తింటోంది. ఏదో పాత పుస్తకంలోని అక్షరాల్ని ఆస్వాదిస్తున్నట్టు !
పశువులు లేని కాలంలో యంత్ర స్వభావం దానికి అర్ధమైనంతగా  మనకు అర్ధం కాదు.
ప్రొక్లైనర్లను, బుల్డోజర్లను మనం, మట్టిని,మట్టివాసుల్ని, నివాసాల్ని పెకిలించాడానికే ఎక్కువగా ఉపయోగించే యంత్రతంత్రులం. అది మటుకు యంత్రానికి కొద్దిపాటి మట్టి చూపుని కలిగిస్తోందనిపించింది.
.........
మర్నాడు  మళ్ళీ  మిగిలిన పని ముగించడానికి  ప్రొక్లైనర్ వచ్చింది ,నేను వెళ్ళాను ,కాని చిత్రిత కొంగ రాలేదు.తను ,నేను,అందరం నాటిన మొక్కలు  ఇంకా పెద్ద చెట్లైనప్పుడు,దాని సంతతి  వాలుతుందన్న ఆశతో దాన్ని తలుచుకుంటూ కూర్చున్నా ...
ఆవుల,గేదెల మందను కాసే పిల్లలు, నింగి విహంగాలుగా గేదెలపై ఎక్కి రాజ్యాల్ని హస్తగతం చేస్కుంటునట్టు పశువుల్ని కాసేవారు,నేల పైన పిల్లల్లా  చిత్రిత కొంగలు వాటి వెంటే నేల పైన తచ్చాడేవి.
పచ్చటి నేల తివాచీ పై స్వచ్ఛమైన తెల్లటి మబ్బు మన్ను పర్చుకునట్టు...
యాంత్రిక యుగం లోని రాతి కాలంలో,ఆ జీవన దృశ్యాలు ,పిల్లలకు ఆటస్ధలాలు కనుమరుగయ్యాయి ...
పిల్లల ఆటపాటడుగులు లేని  నేల, వేరులేని మట్టే ! చినుకు లేని నేల రోదన !!
------
అక్కడే వున్నా .....
ప్రొక్లైనర్ నడిపే రిజ్వాన్ని అడిగా ఎక్కడి నుంచి వచ్చావని, “ డిల్లీ దగ్గర ఉంటా సార్, రెండు  నుండి నాల్గు  నెలలు వచ్చి ఈ పని చేస్తా, మాములుగా  అయితే చలి కాలంలో వస్తా, కానీ ఇప్పుడు వేసవిలో వచ్చా . అక్కడ వ్యవసాయం చేస్తా! మట్టివాసన తెల్సిన మరో కొంగ కాబట్టి మొక్కలకి ఇబ్బంది కలగ కుండా ,విసుక్కోకుండా శ్రద్ధగా పనిచేశాడు.
ఇంతలో   పిల్లలు అంకుల్ ఇది వాలీ బాల్ కోర్టా”    అయితే  మేము వచ్చి ఆడుతాం అంటూ కట్టమీద నడుచుకుoటూ వెళ్ళి పోతున్నారు,అవును ,నా కొడుకు  వాడి స్నేహితులతో ఒకప్పడు ఆడుకునేవాడిక్కడ !
నీ కోసం ... పిల్లల కోసం...ఇప్పుడు కూర్చున్నాను.
కానుగ, వేప,మామిడి ,నేరేడు,సపోటా  చిగురించాయి, గుల్మొహర్ ఎర్రటి పూలు మొదలయ్యే కాలం.
పని ముగిసే సమయానికి వాలింది చిత్రిత కొంగ. పని ముగిసేంత వరకు వుండి వెళుతూ, వెళుతూ,   నా వైపు వీడ్కోలు చూపు విసిరి  ఎగిరిపోయింది.  
దాని కనుపాప దృశ్యం    నాకు చెప్పిందల్లా... మట్టంటని పసిపాదాలకు తల్లి గర్భమే ఆట స్ధలంగా మిగిలిందని ,కూసింత మట్టిని వాళ్ళకి పచ్చటి మైదానంగా  పెంచి, వేయి ఋతువుల రంగులతో అల్లుకున్న క్రీడా స్ధలంగా ఇవ్వడమే  మనం చేసే  సహజమైన మట్టి వేర్ల   జపమని !
 (లిబ్రా ఎన్ క్లేవ్ పార్క్, బడంగ్ పేట, 25-3-2016),- జి. సత్య శ్రీనివాస్