Tuesday, 3 March 2015 0 comments By: satyasrinivasg

ఉద్యమ పర్యావరణ కవిత్యం ఆవశ్యకత,ఉనికి-పర్యావరణ ఉద్యమాలు-24

ఇప్పటి వరుకు పలు పర్యావరణ ఉద్యమాలు  అందులో పర్యావరణ కవిత్యం ఉనికిని ప్రస్తావించాను. ఈ ఉనికి వెనుక కధ కి మూలం ...

అభివృద్ధి  అనే ధోరణిలో ఆర్థిక అభివృద్ధినే పరిగణలోనికి తీసుకునప్పుడు యాంత్రిక జీవనం పునర్జీవనం కాని ప్రకృతిని కేవలం ఒక ఆదాయ మార్గం గానే భావిస్తుంది. ఈ భావన  సమస్త జీవరాసుల్ని ఎప్పటికీ తరగని ప్రకృతి స్థిరాస్తులుగా అంచనా కడుతుంది. ఇప్పడు మన చుట్టూ అల్లుకున్న తాపత్రయం స్మార్ట్ సిటి’. స్మార్ట్ అన్న పదానికి నిర్వచనం మన అవసరాల్ని క్షణ కాలంలో తీర్చే నేర్పరితనమా లేక మన ఉనికికి సంబంధిoచిన ఒక ఆవరణని సృష్టించడమా? నా చిన్న మెదడుకి తెల్సింది సాంకేతిక పరిజ్ఞానంతో మన అవసరాలని తీర్చుకునే౦దుకు  పరిపక్వత వున్న పాలనా వ్యవస్థని పటిష్ట పర్చుకునే ప్రయత్నం అని పలు విధాలుగా ప్రచారం జరుగుతోంది. వీటికి సైన్స్ స్మార్ట్ సిటి, ఎన్విరాన్మెంట్ స్మార్ట్ సిటి అని పలు సిటీల పేర్లు పుట్టుకొస్తున్నాయి. మరి అప్పుడు ఆ నగరాలలో వుండే మనుషులూ స్మార్ట్  మనుషులే కదా , ఈ స్మార్ట్ మనుషులకి  ఏర్పడిన  స్మార్ట్ సిటి నిర్మాణానికి  పెట్టుబడి అయిన  ప్రకృతి పెట్టుబడి/సహజ పెట్టుబడి( న్యాచురల్ క్యాపిటల్) నగర నిర్మాణం అయ్యేసరికి హరించుకుపోతుంది. మనం స్మార్ట్ సిటి కట్టే ముందు స్మార్ట్ గా ఆలోచిస్తే, బంగారు పెట్టే గుడ్డు కధ గుర్తు తెచ్చుకోవాలి!

1960 వరకు ఆస్ట్రేలియాలో  ఫ్లోరా ,ఫోనా  చట్టం కింద మూల వాసుల్ని మనుషులు గా కాక జంతువులు గా పరిగణించారు.  వాస్తవంగా వారి భూమిని అన్యాక్రాంతం చేసి వారిని ఆ విధంగా చూసే దృష్టి ఇప్పటికీ పోలేదు. ఇప్పుడున్న సాంకేతిక సామర్ధ్యం తో మునుపటికన్నా ప్రకృతిని వెయ్యింతలు త్వరగా క్షీణింప చేయగలం ,అది స్మార్ట్ నెస్ అనుకోవడం దురదృష్టకరం. ఈ దృక్పధాన్ని అడ్డుకట్ట వేసేందుకే పర్యావరణ  దృక్పధంతో  ఎలుగెత్తడమే తిరుగుబాటు గా ముద్ర వేస్తే భూమి మీద వున్న చెట్టు కూడా ఉద్యమ జెండానే.
ఈ అభివృద్ధి వలసల్ని పెంచేస్తుంది, భూస్వరుపాన్ని మార్చేస్తుంది. అంతే కాదు ఎక్కడ నుండి వనరుల్ని వెలికి తీసి ఈ అభివృద్ధికి సరఫరా చేస్తారో అక్కిడికి వెళ్ళడం అంటే  కొన్ని  వేదాంత రహస్యాల్ని ఛేదించాలి.దానికి సజీవ సాక్ష్యాలు ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ లోని మైనింగ్ ప్రాంతాలు. గత 20 సంవత్సరాల కంటే  ఆంధ్ర లోని బాక్సైట్ మైనింగ్ వ్యతిరేక ఉద్యమం  కొనసాగుతూనే వుంది. ప్రకృతిని కాపాడే ఉద్యమాల కధలు కంచికి చేరవు.ఇవి కేవలం మనుషుల గురించి చెప్పే కధలు కావు ,  వాళ్ల చుట్టూ అల్లుకున్న ఆవరణ తో బాటు పుడమి కధలు. ఈ కధలు అర్ధం కావాలంటే మనం బతికి వుండడం అనేది  ప్రాధమిక హక్కు గా గుర్తించడం అవసరం. ఇది హెగెల్ అన్నట్టు ఒక అబ్ స్ట్రాక్ట్  రైట్”.  ఇరువురి మధ్యన ఇచ్చి పుచ్చుకునే ఒప్పందం కుదిరి నప్పుడు, ఇరువురికి సమ్మతమైనది అందాలి. అంతే కాని అర్ధం కాని వాట్ని,  అంద చేయడం కాదు. మరి ఇప్పుడు పబ్లిక్ ,ప్రైవేట్ పార్ట్నర్ షిప్ లో జరుగుతున్న ఒప్పందాలలో ఈ భూమి ఒక ఉమ్మడి వనరు. దీనిని తదనంతరం వాళ్ళకి వడ్డీ తో సహా ఇచ్చి వెళ్ళాలి  అన్న  తీర్మానాలు ఎక్కడా లేవు. ఇంకా ఏమిచ్చి వెళుతున్నాం. విలువలతో వున్న ఒప్పందం లేనప్పుడు ,విలువలతో వున్న జీవనం ఏమి వుంటుంది. నేడు అభివృద్ధిలో దళితులు,గిరిజనులు నిరాశ్రయులు ,వనరుల నిష్క్రమణ అనివార్యం , ఈ అభివృద్ధి ఒప్పందాలని బలియపాల్ (ఒ డిశా- మిసైల్ రేంజ్) సంబంధి౦చిన కవిత లో  బ్రజాబాబు ప్రస్పుటంగా చెప్పారు.

నువ్వు నుంచో మంటే
నుంచుoటాను
నువ్వు కూర్చో మంటే
కూర్చుంటాను
నా పేరు నమ్మకస్తుడు
దీనికి  బానిసఅన్న బిరుదు.

భూమిని బానిసగా అంచనావేయడం అన్నది అనాది గా జరుగుతోంది. అందుకే కొందరి ఆధీనంలోనే వుంది. వారి నుండి వేరు చేసి లేని వారికి అందచేయడం లో కూడా భూమిని ఒక తరగని గని గానే అంచానా వేయాలిo. లేని వాడికిచ్చినా , అభివృద్ధి లో వాళ్ళ పలుకు అందులో చోటు చేసుకోలేక పోయింది. ఎప్పుడూ  ఇరువురు వున్న  వాళ్ళ మధ్య జరిగే ఒప్పందాలకి , లేని వాడికి ,వున్న వాడికి, మధ్య జరిగే ఒప్పందాలలో చాలా వ్యత్యాసం వుంటుంది. సదా కోల్పోతుంది కాలి కింద  మట్టినే .

లేనప్పుడు పోరాడే ధోరణి వేరు, కోల్పోతున్న దాని కోసం పోరాడ్డం  వేరు, ఎక్కువగా పర్యావరణ కవిత్యం రెండో ధోరణికి సంభందిచినది.ఈ ఉదంతాలను గత 5 దశబ్దాలుగా చెప్పుకుంటూ వస్తోంది. మనం మట్టి మనుషులుమని.

 ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ ఉద్యమాలు కొనసాగుతున్నాయి ,ఈ ఉద్యమాల్లో సాహిత్య ప్రయోగాల విస్త్రుతి ఇంకా పెరగాలి.   పర్యావరణ కవిత్యం  సాధారణ మనషులు గురించిన అనితర విషయాల్ని  శోధించడం,  వాట్ని  ముచ్చటగా చెప్పడం , ఇది నిరంతరం వీచే మట్టి నీలి  రంగు గాలి వాగు. ఈ ప్రవాహం పెరుగుతుందన్న ఆశ...
Tuesday, 24 February 2015 0 comments By: satyasrinivasg

సైలెంట్ వ్యాలీ ఉద్యమం- ప్రకృతికి కొత్త భాష్యం-పర్యావరణ ఉద్యమాలు-23

అడవి
డి. వినయ చంద్రన్
వాళ్ళకి ఏ పేరు ఇవ్వను, అడవివాసులకు?
ఏవిధమైన వర్ణన ఇవ్వను?
అక్షరంతో-అ,ఆ
అక్కడ చెట్ల వేర్లు,తుప్పలు మొలకెత్తుతాయి.
వేయ్యిన్నొక్కసార్లు, వేయ్యిన్నొక్క బండలు దొర్లుతాయి
ప్రేమతో మమేకమై,
పచ్చికబయళ్ళు,గడ్డి మైదానాలు వికసిస్తాయి,
కొండల చుట్టూ తిరిగి అలసి
వాట్ని ఏమని పిలవను- అడవి బిడ్డల్ని,
ఏవిధమైన వర్ణన ఇవ్వను?
రంగులు,కళ్ళకి నగ్నంగా కనిపించేవి,
గొంతులు,చెవులకు విన్పించేవి.
అంతులేని పరిమళం
రాత్రింబవళ్ళు నువ్వు లెక్కపెట్టినా,
గాలి సూర్యుడిలో వర్షాన్నిలెక్కపెట్టడం మానదు
సంయమనం ధ్యానించే పరిపూర్ణతని
మమైకత ఆలింగనాల అసంపూర్తి శీర్షికల్ని.
అడవి బిడ్డలకి ఏ పేరు పెట్టను,
ఏ పేరైనా ఇవ్వగలనా?
ప్రతి నీడా,పూల తివాచీల- నేర్పరి తనం,
ప్రతి చివర నియంతల యేలిక,
అనాగరిక దేవుళ్ళు, చనిపోయిన ఆత్మలు, జననం ఎరుగని భవిష్యత్తు తరాలు,
శుభసూచికల నమ్మకాల నరికివేత,కాటుకలాంటి అడవి మంటలు,
రాత్రుల్ని చంపేసిన పైశాచకత్వం,
ఎవరు తల్లి,ఎవరు తండ్రి, ఎవరు తండ్రి ,చెల్లి?,
ఆ తమ్ముడు లేక కాబో యే వరుడా?
క్షీణించిన అడవి మళ్ళీ పునారావృతం అవుతుంది-
మళ్ళీ ఆ కాలం వస్తుంది లేక వెళ్ళిపోతోందా?
మిట్టమధ్యాహ్నం కుడా అడవిలో కురుస్తుంది,
సూర్యుడి రధ చక్రాలు రాత్రప్పుడు కూడా కాంతిని వెదజల్లుతాయి,
నేను వాడని సరస్సులో దూకి మళ్ళీ వస్తాను,
ఎన్నెన్ని పుట్టుకలు,ఎన్నెన్ని మరణాలు!
భయాన్ని నిప్పుల్లో వేయండి, అది తిరిగి నెగళ్లు గా వికసిస్తుంది,
శివుడి డమరుకం సముద్రపు ప్రళయం,
అడవి కూడా ఒక సంద్రమే, ఆదరణమైన తాబేళ్లు,
చేపలు,సంద్రపు మాయా జీవాలు,
మైనాక పర్వతపు చిహ్నం
నోవా, మను,కృష్ణుడి ప్రళయ నాదం
మనం, నావికులం,నక్షత్రాలు,పడవలు, అడవి కూడా ఒక సముద్రమే!
మనం అడవిలో మునిగి తేలుతాం,
మనం వేదాలం,కాలాలం, చెదల గూళ్ళం.
ఏ పేరైనా ఇవ్వగలనా-
అడవి స్నేహితులకు, ఇతర మిత్రులకు,
వారి పిల్లా పాపలకు,ఆ  చుట్టు పక్కల వాళ్ళకి,
యవ్వనులకు, పూర్వీకుల ఆత్మలకు,ఋతువులకు?
లక్ష్మణా, వాళ్ళు ద్రౌపది కారు, లేక పరిజన్య కారు
లేక భాగీరధి,రిగ్,యజుర్ లేక  సామవేదాలు కారు
లేక వస్తువులు, వివేకం,నమ్మకం.
వాళ్ళు వన్య ఏనుగులు,సింహాలు, తూనీగలు,ఎలుగుబంట్లు,
దియోదర్ వృక్షాలు,అరటి చెట్లు, టేకు చెట్లు, పూలు,
గరికలు,పక్షులు, పూర్వజన్మ పై వాలే ముందు ఘడియలు 
వాళ్ళని మనం వాళ్ళ పేర్లతో గుర్తించం,
మనకి ఏమి తెల్సుఅని? మన గురించి మనకైనా?
అడవి- భూమాత గాజుల సవ్వడి
ఎవరైతే నక్షత్ర కూటమి దివి పీటం మీద కూర్చు౦టుందో,
అన్నిటిని మేళవించుకుని  వీణ వాయిస్తూ
ఆమె కాళ్ళు ఆడిస్తునప్పుడు, కాలం తన్మయత్వంలో నాట్యమాడుతుంది,
అడవికి ఏ పేరని పెట్టను?
అడవికి నా పేరే పెట్టుకుంటాను
పేర్లు సూర్యుడి తో బాటు పన్నెండు రాసులలో నడుస్తాయి,
ఉత్తరం, దక్షిణం, తృతీయ గ్రహణాలు
రాహు గొంతు చుట్టూ,
తరచూ వాటి ప్రకాశాన్ని  పొందుతూ మళ్ళీ వికసిస్తూ
సూర్యుడి రధం ముందు వాలుతూ
ఏడు గుర్రాల బండిలో
వేకువ వెనక నడిచే పేర్లు ముందుకు కొనసాగుతాయి
సూర్యుడి రధసారధి అరుణలా , గరుడి తమ్ముడు,
ఋషుల అనుంగుడి లా,
దైవతా మూర్తుల ఆనందపు సంగీతం లా,
దైవకన్యల నృత్యంలా,
యక్షులు,నాగాల్లా
సంధ్య, ఛాయ ,సూర్యుడి నమ్మక సహచరిణిల్లా,
చెట్ల కొమ్మలకి తలక్రిoదుల వుండి తపస్సు చేసే వేలెడంత ఋషుల్లా,
ఉద్యమం, సాయంత్రం విశ్రాంతి లేకుండా,
మది లోని సరిహ ద్దుల్లా,
సూర్యుడితో పేర్లు నడుస్తాయి,

ఏ పేరని పెట్టగలను అడవికి?
అడవిని నా పేరుతోనే పిలుస్తాను,

చంద్రుడి తో పేర్లు నడుస్తాయి
నేలవంక నుండి, పున్నమి చంద్రుడి వరకు,
ఇరవై ఏడు మార్లు వికసించే నెలవంక చారలతో కూడి,
శక్తి నలుముకున్న రోహిణి,శుక్ర బుద్ధ సహచరులతో,
ఔషద గల గుణంతో
సృష్టికి ఉత్తేజమిచ్చే,
రాత్రి పూర్వీకుల ఆత్మలకు లంగరయ్యే విధంగా,
పెంచిన తల్లి కలగా,
కవిత్వానికి రాజ హంస లా,
పేర్లు చంద్రుడి తో నడుస్తాయి, కవిత్వ విల్లుని ధరించి,
 ఏ పేరని పెట్టగలను అడవికి?
అడవిని నా పేరుతోనే పిలుస్తాను,
సూర్యుడు, చంద్రుడు, భూమి వాటి పేర్లు
సమస్త ప్రపంచం నీ నామం
పేరుల్లోనే పెరుమాళ్ళు వుంటాడు,మూలవాసి,
పేరు ,పెరుమాళ్ళు ఒకటే.
(ఆంగ్ల మూలం-సరితా మోహనన్ వర్మ)
(అనుసృజన- సత్య శ్రీనివాస్)

సైలెంట్ వ్యాలీ ఉద్యమం వల్ల మైక్రో హైడ్రో ప్రాజెక్ట్ ని ప్రభుత్వం నిలిపేసింది.1983లో సైలెంట్ వ్యాలీ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతoగా ప్రకటించారు.2014లో 25 ఏళ్ల ఉద్యమానికి ప్రతీకగా మలయాళం సాహిత్య కారులు సదస్సు నిర్వహించి, మలయాళం సాహిత్యం పర్యావరణం అన్న ప్రత్యేక సంచిక విడుదల చేసారు. ప్రకృతి సాహిత్యం లో ఈ అధ్యయనం ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది.
Wednesday, 18 February 2015 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు-22-సైలెంట్ వ్యాలీ ఉద్యమం- కాల్ అఫ్ నేచర్.

సైలెంట్ వ్యాలీ ఉద్యమానికి సంబంధించిన కవితల్లో “గీతం” అన్న శీర్షికతో కవితలో ప్రముఖంగా వచ్చాయి . దీనికి విరుద్ధంగా ప్రకృతిని ధ్వంసం చేస్తే ప్రతిస్పందన విధ్వంసం అని ఓ.యన్. వి. కురుప్ రాసిన ‘భూమికోరు చరమగీతం’ చెట్టుకి సంభందించిన కవితల్లో  సృజనాత్మక పరంగా , విశేషంగా ప్రాచుర్యం పొందిన కవిత ఇది. ప్రకృతిలోని  వ్యవస్ధలపై మానవ ప్రమేయం వలన వాతావరణ సమతుల్యత ఏ విధంగా దెబ్బతింటుందని తెలుపుతుంది.నిస్సంకోచంగా ఈ రచన తీరు ప్రకృతి విద్వంసం కి సంభందించిన రచనా శైలికి నిదర్శనాలు.
విద్వేషం ఉప్పొంగింది
మండే సూర్యుడి నుండి నిప్పులు కురుస్తాయి;
వర్షం మబ్బులు 
 తాగడానికి చుక్క నీటి కోసం తపిస్తాయి;
వసంత కన్యలు చల్లటి గాలికోసం తహతహ లాడుతాయి
ఋతువుల రాజు అన్వేషణ నిర్వియమవుతుంది
ఒక పువ్వు కోసం;
కదలిక లేని నదులు తరంగాల కోసం తపిస్తాయి
జీవన చక్రాలు దారుల్లో కుంగిపోతాయి
(30-37,పంక్తులు)
(అనుసృజన)
ఇదే విధమైన  ప్రకృతి చరమ గీతం దాని వల్ల భవిష్యత్తు ప్రస్తావన 1962 లో రేచల్ కర్సన్ సైలెంట్ స్ప్రింగ్ పుస్తకంలో కనిపిస్తుంది. ప్రకృతి పై ఏ అడ్డు అదుపు లేని మానవ దురాగతాలు కొనసాగితే, ఏ మార్పులేని ఒకే విధమైన జీవనంతో మిగిలిన భూమి, ఇక ఎప్పటికీ పక్షుల గళం లేని  వసంతం గురించి చెపుతుంది.’భూమి’ కవితలో నేల తల్లి ని  సౌందర్యారాధనతో చూసిన దృష్టి, భూమి చెక్కు చెదరని  నవ యవ్వనాన్ని తెలుపుతూనే రాబోయే విధ్వంశం గురించి చెపుతుంది. పర్యావరణ కవిత్వం భవిష్యత్తుని ప్రస్తావించే కాల జ్ఞానం. ఇదే విషయాన్ని నేడు ప్రకృతి విద్వంశం వల్ల వాతావరణ మార్పులు గురించి విస్తారంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ కవితలోని అంశాలనే 2006 నోబుల్ బహుమతి పొందిన  అంతర్జాతీయ వాతావరణ మార్పులు నివేదికలో ప్రస్తావించారు. శాస్త్రీయ పరిజ్ఞానం ప్రకృతి రహస్యాలను చెపితే , కవిత్వం మనలోని మనస్సు ప్రకృతి, సామాజిక ప్రకృతి,ప్రకృతి ప్రకృతి మధ్య అంతర్లీన టైం ,స్పేస్ సంభాషణ. ప్రముఖ ఫిలాసఫర్ యు.జి. కృష్ణమూర్తి మాటల్లో ‘మన శరీరంలో ఒక గడియారం వుంటుంది. అది ఏ యాంత్రిక గడియారం లేకుండానే మేలుకొల్పుతుంది’. ఆ ఘడియారపు సెకండ్ల ముల్లు చప్పుడే మన కవితాక్షరాలు. శరీరం డైనమైటు అయినప్పుడు   మనస్సు సవ్వడి  చరమ గీతానికి సహవాయిద్యాల తంత్రులగానే పలుకుతుంది. ఇంత కంటె తీవ్ర మైన హృద్రోగం ,నరాల బలహీనత లేదు. మనం మనలోని సహజంగా మేల్కొలిపే సుప్రభాత గీతాన్ని కోల్పోయాం. రోజుల్ని యాత్రికం చేస్కునప్పుడు ,రోజులు మనకి ప్రతి రోజు మనకి ‘దినం’ గా నే గడుస్తుంది. డి. వినయచంద్రన్ అన్నట్టు పర్యావరణీయం అంటే ప్రకృతి ని గుడ్డిగా పుజించడం కాదు, అదే విధంగా తోటల/వనాల పెంపకం గురించి అధ్యయనమూ కాదు. ఈ విధమైన దృక్పథం ప్రకృతిని కేవలం చెట్లు,నదులు,పక్షులు,అడవులు గా మార్చేస్తుంది. ఈ నిర్జీవ (సింథటిక్) ఆలోచన, అనాలోచితంగా నే మానవ జీవనాన్ని, మనుషుల్ని ప్రకృతిని విడధీస్తుంది. అప్పుడు సూర్యోదయం కూడ  కరిగిపోతున్న కలే!
వినయచంద్రన్ దృష్టిలో పర్యావరణీయ సాహిత్యం అటువంటి ధృక్కోణాల్నిమార్చాలి, ప్రకృతి ,సమస్త  మానవ జీవన అంశాలు ఒకటికొకటి ముడిపడి ఉన్నాయన్న భావనని కల్పించాలి అన్నది వ్యక్తపరుస్తాయి. అయ్యప్ప పానికర్ ఉదయాస్తమనం  అన్న కవితలో వివిధ జీవరాసుల మధ్య వున్న సహజీవనాన్ని చెపుతాయి. సూర్యుడి పడమటి పయనాన్ని సహజీవనానికి ప్రతీకగా వర్ణిస్తుంది.
సరిహద్దులనుండి పొడుచుకొస్తున్న నిప్పు బాణాలు
భూమిని మేల్కొనేలా చేస్తాయి;
చొచ్చుకుపోయిన వేర్లు;
మొగ్గలు,పూలు, లేత ఆకులూ
కొమ్మల కున్న;
ముందుకు సాగుతున్న  క్రిములు
 లేత ఆకుల్ని భుజించడానికి;
పాటలు పాడుతున్న పక్షుల గుంపు
ఆ క్రిముల్ని ఆరగించడానికి;
వేటగాడు తనకు ఆహారం కోసం ఆ పక్షుల్ని సంహరిస్తాడు;
వేటగాడిని వెంటాడే వన్య ప్రాణి
అతనిని భుజించడానికి;
వన్య ప్రాణిని ,అడవిని ఆహుతి చేసే మంటలు;
అప్పుడు సరిహద్దు వాట్ని తిరిగి పొందుతుంది
(22- 35 పంక్తులు)
(అనుసృజన)
ఈ కవితలో మనకి ప్రకృతిలోని ఆహార చక్రం తెల్సుతుంది. ప్రకృతిలోని నీటి చక్రం,ఆహారం చక్రం అన్నిటికీ ఆదీ అంతం వుండదు.ఇదంతా శక్తి(యనర్జి సైకిల్) ని తెలుపుతాయి. ఇది అర్ధం చేస్కోకుండా మనం మనలోని గడియారాన్ని సరిచేసుకోలేము. మనం ఎంత డిజిటల్ క్లాక్స్ ఉపయోగిస్తున్నా .సెల్ కెమెరాలు వాడుతున్నా అది ఒక పునర్జీవం కాలేని ఐ వెస్ట్ గానే మారుతోంది. ఈ తీరు మారాలంటే మన ఆలోచనలు సింథటిక్ గా వుండకూడదు. ప్లాస్టిక్ డబ్బుల కాలంలో సంబంధాలు కూడ నిర్జీవంగాను వుంటాయి. పర్యావరణ కవిత్వం అన్నది ఒక సింధటిక్ ప్రవచనం కాదు, ఒక సజీవ వెదురాకంచున మంచు బిందువు గూడులో నిశ్శబ్దంగా విచ్చుకునే తొలి కిరణం. అప్పుడే వెదురు గూటి లోనుండి ఆహార అన్వేషణకు వెళ్ళే తల్లి పక్షికి వీడ్కోలు పలికే బుల్లి పిట్టల  స్వరం. 

ఈ స్వరం మనని మన లోని  ప్రకృతి ఘడియల్ని  స్ప్రుజించే మేల్కొల్పు. సైలెంట్ వ్యాలీ ఉద్యమ కవిత్వం అంటే కాల్ అఫ్ నేచర్.
Tuesday, 10 February 2015 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- సైలెంట్ వ్యాలీ ఉద్యమం-21

మనమిప్పుడు సామాజిక,సంస్కృతిక,రాజకీయ,సిద్ధాంతాల పలు మార్పుల స్ధితిలో వున్నామన్నదాన్ని కాదనలేము. సామజిక తీరుతెన్నులు,అవి నూతన ఒరవడులను ఒకదానిదో ఒకటి ఏవిధంగా సాగుతున్నాయన్నది కేవలం విద్యావేత్తల అధ్యయనాలకే పరిమితంకావడం లేదు. మన నరనరాల్లోకి మనకి తెలియకుండానే ఇంకిపోతున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా జీవించడమే మనం అనుభవిస్తున్న ఘర్షణ.ఈ విషయాన్ని పర్యావరణానికి అతీతంగా భావించడమే మనం చేస్తున్న లోపం. వీట్ని గ్రహించి సైలెంట్ వ్యాలీ ఉద్యమంలో రచయితలు తమ రచనల్ని కొనసాగించారు.భౌతిక పర్యావరణాన్ని కాపాడడం కోసం విలువల ప్రాముఖ్యతను చెప్పారు. సామాజిక అంశాల్నిశాస్త్రీయ అంశాలతో జోడించారు. ఇది పర్యావరణీయం అయ్యింది. వీరు ఉద్యమంలో చేరేసరికి ఉద్యమం తీవ్ర స్ధాయికి చేరింది, ఆ వేగాన్ని వీరు మరింత పెంచారు. ఇది సాహిత్య పర్యావరణీయం అయ్యింది. వైకం బషీర్,యస్.కే. పోట్టేకర్,ఓ,వీ. విజయన్, కే.భాస్కరన్ నాయర్, సుకుమర్ర్ అజ్హికోడే వంటి వారు ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. వివిధ ప్రయోగాలు చేసారు అందులో భాగంగా  1983లో 34 కవితలతో కూడిన వనపర్వం అన్న కవితా  సంపుటిని ప్రచురించారు. సుగత కుమారి గారు సైలెంట్ వ్యాలీని దట్టమైన,చల్లని, జీవం ఉట్టిపడుతున్న ప్రదేశం, భూమి వ్యక్త పరిచిన అత్యత్భుతమైన భావన అంటారు. ఆ భావాలన్నీ వనపర్వంలో చోటుచేస్కున్నాయి. వనపర్వం అన్న శీర్షికకి స్ధానికులు సైలెంట్ వ్యాలీ గురించి చెప్పే కధకి పోలిక వున్నది. ఈ ప్రాంతాన్ని సైరంధ్రి వనం అంటారు. ద్రౌపది కి వున్న మరో పేరు సైరంధ్రి. వనవాసమప్పుడు పాండవులు ఇక్కడ కొంత కాలం గడిపారని వారి నమ్మకం. కాలక్రమేణా బ్రిటిష్ వారి కాలం వచ్చే సరికి సైరంధ్రి వనం సైలెంట్ వ్యాలీ గా మారింది.  చిత్తూరు జిల్లాలోని మదనపల్లి దగ్గర వున్న ఏనుగు మల్లమ్మ కొండ కూడా  బ్రిటిష్ వారి పుణ్యామా అని హార్స్లీ హిల్స్ గా మారింది. అలా చాలా ప్రాంతాలని వారు మార్చారు. ఈ ప్రాంతాన్ని  చిపింగ్ సిడా అన్న అడవి  క్రిమి వల్ల కూడా సైలెంట్ వ్యాలీ అన్న పేరు వచ్చింది అన్న నానుడి కూడ వుంది.
 ఒక ప్రాంతాన్ని భౌతికంగా ఆక్రమించడానికి దాని చరిత్రను మార్చాలి ,అది నామధేయాన్ని మార్చడం వల్ల చాలా తొందరగాను ,అనుకున్న ఆశయాన్ని సాధించడంలో ప్రయోగాత్మకంగా సంభవిస్తుంది. వనపర్వం పర్యావరణ చరిత్రను  తిరగరాసే ప్రయత్నం చేసింది. ప్రకృతికి సంబంధించిన సాహిత్యంలో   బైయో సెన్ ట్రిసం, ఇకో సెన్ ట్రిసం, ఎర్త్ సెన్ ట్రిసం అన్న ధృక్పధాలు వున్నాయి తరచూ ఒకదానికి ఒకటి పర్యాయంగా   వాడుతారు. ఇవి ప్రస్ఫుటంగా థియో సెన్ ట్రిసం, హ్యూమన్ /ఆంత్రాపో సెన్ ట్రిసం ధృక్పధాని కి విభిన్నంగా ప్రయోగిస్తారు.
బైయో సెన్ ట్రిసం భూమి పైనున్న అన్ని  జీవ,నిర్జీవ వ్యవస్ధాలకు సమాన భావాన్ని అపాదిస్తాయి, ఇకోసేన్ ట్రిసం ప్రకృతి సమతుల్యతను పలుకుతుంది, అది ప్రకృతిలోని జీవ,నిర్జీవ వ్యవస్ధలతో బాటు చంద్రుడు,ఆకాశం,నక్షత్రాలను కలుపుకుని. ఆంత్రాపో సెన్ ట్రిసం మనషులను ప్రధానంగా పరిగణించి మిగతా జీవరాశులను మనుషులకు ఉపయోగపడే వనరులుగా పరిగణిస్తుంది. ఇది ఇకోసేన్ ట్రిసంకి విరుద్ధమైనది.మానవజాతిని విస్మరించలేము కాని మనవ మనుగడ అన్నది ప్రకృతిలోని మిగతా జీవ రాసుల పైన ఆధారపడి వుంది. ఇకోసేన్ ట్రిసం అంటే జీవ వ్యవస్ధ కేంద్రంగా ఊహాజనకంగా ప్రతిష్టించడం ,కేవలం మనుషుల్ని కీలకంగా కాదు. ఇకోసేన్ ట్రిసంకేంద్రం అన్నది అంటూ ఏమి వుండదు, ఒక స్పెషల్ స్పేస్ లో, కేంద్ర బిందువుకి ,చివరి అంచులకి మధ్యన తారతమ్యాలంటూ వుండవు,ముందు వెనకకు కూడా. (కేర్దిజ్). దీనిని అర్ధం చేసుకునప్పుడు మానవుడు ప్రకృతిలో ఎంతపాటి భాగమన్నది అర్ధం అవుతుంది.
సాహిత్యం ద్వారా కేవలం సైలెంట్ వ్యాలీ అంశాలనే కాక ప్రకృతి మానవ మనుగడ గురించి విశిష్టంగా ప్రకృతి సంరక్షణ,సుస్ధిర జీవనం అన్న నినాదం తో ప్రకృతి సంరక్షణ సమితి పని చేసింది. సైలెంట్ వ్యాలీ ఉద్యమం ప్రచారానికి కేరళ నలుమూలల వివిధ కళా రూపాల ద్వారా ప్రచారం చేసారు. 1980 జూన్,6 వ తేదీన కవులను సత్కరించారు. ప్రముఖ కవులు కవితలు చదివి పర్యావరణ విశిష్టతను చెప్పారు. సైలెంట్ వ్యాలీ సంరక్షణకు వివిధ స్ధాయిల్లో సమితి కృషి చేసింది. అందులో సుగత కుమారి గారు ప్రముఖ పాత్ర పోషించారు ,ఆమె రచించిన మరతిను స్తుతి’(వృక్ష గీతం) విశిష్ట ప్రాచుర్యం  పొందింది. ఈ కవితలో ఆమె చెట్టుని, భూమిని కాపాడడానికి  విషం తాగిన శివుడిగా వర్ణిస్తారు. నేను అతనిని పూజిస్తాను/ ఎవరైతే శ్వాస గాలినిస్తారో/ విషం తాగి/నీలకంటుడిలా(5-8). ఇదంతా పాటకుడికి కిరణజన్య సంయోగంగా అనిపించవచ్చు. ఈ కవిత ప్రకృతి సమతుల్యతను శాస్త్రీయంగా వివరిస్తుంది. ప్రకృతిలో చెట్టు పాత్రను ,అది మానవ మనుగడకు చేసే ఉపయోగాలను.
నువ్వు  మా
తల్లి భూమిని వరదల నుండి రక్షిస్తావు
నేలను పునర్జీవింప చేస్తావు
నువ్వుఅమృతాన్ని భద్ర పరుస్తావు
దివినుండి భువి కి వస్తున్న దానిని
ఉబుకుతున్న నీ గుండెల్లో(౩౩-40,పంక్తులు)
భూమి ఏమైనా ఆడుకునే బంతా లేక ఆడుకునే బొమ్మా! (43-44 పంక్తులు)

ఈ కవితలో భూమి కున్న ఓపికను పరిక్షించొద్దని హెచ్చరిస్తారు. దీని ద్వారా  ప్రకృతి మన తల్లి ,ఆమెని పూజ్య భావంతో, ప్రేమతో దరి చేరమని  చెపుతారు. మన చర్యలు విధ్వంశంగా వుంటే ప్రకృతి ప్రతిచర్యలు అదే విధంగా ఉంటాయిఇది అర్ధం చేస్కునే సునిశిత మనకు అవసరం.
Tuesday, 3 February 2015 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- సైలెంట్ వ్యాలీ ఉద్యమం-20

కవిత ఒక భద్రమైన శక్తి,ఒక అనధికార ప్రకంపన,ఓ జీవం,ప్రవాహంలోని సుడి,కవితలు జీవనాన్ని సుస్థిరం చేసే మూల మార్గాలు.కవితలు ప్రకృతి అవశేషాలను పోలిన అక్షర మాటల దార్లు (భద్రమైన శక్తి),అవి పునరావృతమయ్యే ప్రకృతి శక్తి జన్యు వనరులు.ఊహ,బాష కవలల మాతృక కలయిక నుండి, వాటంతటవే నిరంతరం ఉద్భవిస్తుంటాయి, ఈ నిర్వచనం  లిటరేచర్ అండ్ ఎకాలజీ గ్లాట్ఫెల్టి ఎడిటెడ్ పుస్తకం   లోనిది.ఈ నిర్వచనం ఇకో సేన్ ట్రిసం దృక్పదంతో ముడిపడింది.
  ఈ నిర్వచనం సైలెంట్ వ్యాలీ ఉద్యమ సాహిత్యానికి  జీవం పోసింది. ముఖ్యంగా పర్యావరణ కవిత్వం ఒక ఉద్యమ రూపం దాల్చడం సైలెంట్ వ్యాలీ సంరక్షణలో  కనిపిస్తుంది. కేరళ శాస్త్ర సాహిత్య  పరిషత్, 1979 లో సైలెంట్ వ్యాలీ సంరక్షణ అన్న నినాదంతో వుపందుకుంది. ఈ సంరక్షణలోని పరిషత్ సభ్యులు అన్ని వర్గాలకు చెందినవారున్నారు.వీరు 7000 వేల సంఖ్యలో ఉన్నారు. ఇందులో సాహిత్య కారులు ముఖ్య భూమిక పోషించారు.కధకులు,నవలాకారులు,కవులు అందరూ ఏకమయ్యారు. వీరు వివిధ వర్గాల వారైనప్పటికీ వారిని కలిపింది సేవ్ సైలెంట్ వ్యాలీ అన్న నినాదం.పశ్చిమ కనుమల్లోని సైలెంట్ వ్యాలీలో జీవ వైవిధ్యం ఎలా కలిసి వుందో అదే విధంగా వివిధ సాహిత్య వైవిధ్యాలు కలగలసి ఏక గీతాన్ని ఆలపించాయి. ఇకోసేన్ ట్రిసం ప్రకృతి సమతుల్యతను పలుకుతుంది, అది ప్రకృతిలోని జీవ,నిర్జీవ వ్యవస్ధలతో బాటు చంద్రుడు,ఆకాశం,నక్షత్రాలను కలుపుకుని.అందుకే కవిత అన్నదానికి విశాల అర్ధం అన్ని ఊహాజనిత మార్గాల ఉత్పత్తి ప్రక్రియ. దీనినే భారతీయ సనాతన సాహిత్య కారులు మానసిక  శక్తులను సృజనాత్మక రూపంలో విడుదల చేయడం అన్నారు.ఇది జరగాలంటే మనం ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతాం అన్న వాస్తవాన్ని తెల్సుకోవడమే కాక మనలోని సునిసితను పెంచుకోవాలి.అప్పుడు సాహిత్యం ఒక నిర్జీవమైన పుస్తకంగా మిగిలిపోదు.భిన్న స్వర వచనం  (పోలిఫోనిక్) లేక  ముఖ్యమైన అసంఖ్యాక ( ప్లూరి సిగ్నిఫికంట్) స్వరాల గళం అవుతుంది,అందులో రచయిత/రచయిత్రి,విశ్లేషకులు, పాటకులు, మధ్య పరస్పర చర్య అవుతుంది.సనాతన భారతీయ తర్కశాస్త్రం అనుసారం ప్రపంచ మనుగడకు ఒకరిమీద ఒకరికి ప్రేమ మూలం. మూలాన్నే అద్వైతం పేర్కుంటుంది. ఈ ప్రేమను  కేవలం కవితలు ద్వారానే చెప్పాల్సిన  లేదు ,సైలెంట్ వ్యాలీకి సంబంధించి పెట్టుకున్న  కేరళ హై కోర్టుకు మొదటి పిటిషన్ రాసింది కవి సుజాత దేవి. అది ఒక కవితాత్మ రూపంలోనే ప్రస్తావించింది.
సైలెంట్ వ్యాలీ అద్భుతమైన భూమికవిత
దానికి ప్రత్యేకమైన భౌగోళిక పరిస్ధితులతో బాటు
ప్రకృతి పరమైన స్థితిగతులు వున్నాయి.
దీని  ప్రత్యేక విశిష్టతలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది
ఇక్కడ మరొక విషయం ప్రస్తావించాలి .ఆధునిక పర్యావరణ సాహిత్యానికి ,సాంప్రదాయ పర్యావరణ సాహిత్యానికి తేడాలలో కీలకమైనది, కి స్టోన్ ప్రకారం ఎన్విరాన్మెంటలిజం (పర్యావరణీయం).అన్నది పారిశ్రామిక సంస్కృతి నుండి పుట్టింది. ఇది అనాదిగా మానవ సమాజాలు చేతుల్లో బలవుతున్న  ప్రకృతిని సంరక్షించుకోడం కోసం ఉద్భవించే వ్యతిరేక నినాదం. స్లేమేకర్ అనుసారం పర్యావరణ సాహిత్య, పర్యావరణ విశ్లేషకులు తమ మనోభావాల్ని రాజకీయ స్ధైర్యంతో ,ఆధ్యాత్మిక చింతనతో, ప్రకృతిని యాంత్రికంగా మార్చుతున్న తీరుని ఖండిస్తున్నారు. సాంప్రదాయకమైన ప్రకృతి సాహిత్యం లోని జ్ఞానం ప్రస్ఫుటంగా ప్రకృతి విధ్వంసాన్ని భరించే తీరుని వెల్లడించడంలో తన ఛాయల్ని పూర్తి స్థాయిలో చాటి చెప్పలేదు. అవి పూర్తి స్ధాయిలో పర్యావరణ స్పృహని వ్యక్తపరచలేదు, చాల మటుకు ప్రాంతీయ ,జాతీయ స్థాయికే పరిమితమయ్యాయి , ముఖ్యంగా పర్యావరణ సాహిత్యం భౌగోళికమైనదన్నది ఆయన ప్రస్తావన. ఈ ప్రస్తావనల్ని పూర్తీ స్ధాయిలో ఖండిచలేo. సైలెంట్ వ్యాలీ విషయంలో రెండు ప్రధాన ధోరణులు ద్వారా ఉద్యమం నడిచింది. ఒకటి శాస్త్రీయ నినాదాల ద్వారా ,రెండు సాహిత్యం ద్వారా. పర్యావరణ విషయంలో ఎప్పుడూ శాస్త్రీయ వాదనలదే పై చేయి, సాహిత్యాన్ని కేవలం ఊహాజనికంగా,భావావేశంగా జమ కట్టి పట్టించుకోరు. శాస్త్రీయ జ్ఞానం జనాలకి అర్ధం కాదు,కోర్టు కచేరి వ్యవహారలు అసలు అర్ధం కావు. ఈ రెండు వ్యవస్ధలే పర్యావరణ అంశాల పై నిర్ణయం తీసుకునేవి. ఈ రెండు వ్యవస్ధల్లో స్ధానిక జనాలకి చోటు లేనప్పుడు ,అక్కడ చోటుకి మార్గం ఏర్పరిచే సాధనం సాహిత్యం. ఇది నిశబ్దంగా ఈ  ఉద్యమంలో ఏర్పడింది. అందులోను కవిత్వాన్ని కోర్టులో కచేరి చేయడం చాల అరుదు. సైలెంట్ వ్యాలీ ఉద్యమంలోని మరో ప్రత్యేకత అక్కడ జనావాసం నామ మాత్రమే, మరప్పుడు అడవిగోడు విన్పించేందుకు సాహిత్యకారులు ఏకమయ్యారు, బహుశా అందుకే వర్గ వైరుద్ధ్యాల్ని పక్కన పెట్టారేమో.
సైలెంట్ వ్యాలీ హైడ్రో ప్రాజెక్ట్ నినాదం అడవి మొత్తం సమాజంది. కేవలం, పారిశ్రామికవేత్తల్ది,మార్కెట్ది కాదు, ప్రత్యక్షంగా అక్కడ నివసిస్తున్న వార్ది,వారి మనుగడది. వీట్ని గుర్తించడం అంటే ప్రకృతిని ఆరాధించడమే  కాదు, ప్రకృతికి,మనిషికి వున్న ప్రేమ పూరిత సహజీవనానిది.
ఈ నినాదాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో సాహిత్యకారులతో ఏర్పడిన ప్రకృతి పరిరక్షణ సమితి క్రియా శీలక పాత్ర వహించింది. వారు ఉద్యమాన్ని నడిపిన తీరుని  ఎందుకో తుకారాం పలుకుల్లో చెప్పాలని...
పదాలొక్కటే
నా దగ్గరున్న ఆభరణాలు
పదాలొక్కటే
నేను ధరించే దుస్తులు
పదాలొక్కటే ఆహారం
నాకు జీవితానిచ్చేది
పదాలొక్కటే సంపద
నేను జనానికిచ్చేది
-అంటాడు తుకా
పదాలను దర్శించు
అవి దేవుళ్ళు
నేను వాట్ని
పదాలతో పూజిస్తాను.
(సెయింట్ తుకారం)
(అనుసృజన)
ఇటువంటి పదం బాటలో నడిచిన పర్యావరణీయ కవితోద్యమo  సైలెంట్ వ్యాలీ. చాల బలంగా పరివ్యాప్తి చెందుతున్న పారిశ్రామీకరణ,శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం,మార్కెట్ అన్నవి ప్రకృతిని త్వరితంగా  కబళిస్తున్నాయి.కాని ప్రకృతి తన ప్రాంతీయ ఉనికి వల్ల భౌగోళిక పర్యావరణ సమతుల్యతను పరిరక్షిస్తున్నదన్న సత్య వాక్కు అంతగా పరివ్యాప్తి చెందడం లేదు. ఓ ప్రాంతంలో మనం చేసేది  తప్పో,ఒప్పో అన్న ప్రస్తావనకి అతీతంగా చర్చించే ప్రాంతంలో కలయిక కోసం కవిత్వ గళం నుండి జరుగుతున్న  సాహిత్యాభివృద్ది ప్రక్రియ పర్యావరణ కవిత్వం. ఇది నిశబ్దంగా భూమంతా ప్రతిధ్వనిస్తున్న  నేలాకాశ వాక్కు ... సుజాత కుమారి కేరళ కౌముది అన్న పత్రికలో 
కాలం చేజారిపోతోంది
గొడ్డలికోత కొనసాగుతోంది
అడవికి నిప్పంటించారు
అడవి చేతులుచాచి అరుస్తోంది

ఇది చదువుకుని ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యి నిరంతరం కొనసాగే అడవి రక్షణ పోరాటాన్ని తన జీవిత ఆశయంగా తీసుకుంది.ఈ పోరాటంలో ఆమె సైనుకురాలైనందుకు గర్వపడింది. తనతోటి రచయితల్ని ఇందులో భాగ్యస్వాముల్ని చేసింది.ఎందుకంటే ఆమె గట్టి నమ్మకం ప్రజల భాషని తెలిసి ,బాగా పలికే వారు శాస్త్రజ్ఞులు కాదు రచయితలని. అదే  ప్రకృతి పరిరక్షణ సమితికి బీజం వేసింది. దీని ఆశయం కేవలం మానవ మనుగడే కాదు, ప్రకృతి వ్యవస్ధల సుస్తిరత. ఆమె వాంగ్మూలాన్ని వచ్చే వారానికి వాయిదా వేస్తూ, శెలవు...
Tuesday, 27 January 2015 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- సైలెంట్ వ్యాలీ ఉద్యమం-19

స్వాతంత్ర్యానంతరం స్వాతంత్ర్య పోరాటం కూడా కొనసాగుతుంది అనటానికి నిదర్శనం పర్యావరణ ఉద్యమాలు. మనం విదేశీయలనుండి విముక్తి పొందాం కాని మన వనరుల నిర్వహణలో వాళ్ళ ఆలోచనలు,ప్రణాలికల నుండి మాత్రం కాదు. అప్పడు గీసిన  సర్వే రేఖలు ఆన్ని రంగాల్లో ఇప్పటికీ చెరిగి పోలేదు. ఇప్పుడు ఓ మూడొందలు చిలుకు చట్టాలు పనికి రావని వాట్ని తొలగించాలని ప్రయత్నాలు మొదలైయాయి. ఒక విధంగా దీనిని మనకంటూ మన ప్రణాలికల్ని మనంతట మనమే రుపొందిచుకునే ప్రయత్నం గా బావించాలి. ఈ తీరు మన వనరుల నిర్వహణలో మనకంటూ వున్న ఊహలకి  ప్రణాళికనిస్తుంది. అదే విధంగా మన చరిత్రను భద్రపరుస్తుంది.
స్వాతంత్ర్యానంతరం చేపట్టిన ప్రాజెక్టులన్నిటికీ మూలాలు బ్రిటిష్  హయంలో  ప్రవేశ పెట్టిన ఆలోచనలే, అందుకే ఈ వ్యతిరేకత ఏర్పడుతోంది.వారికి స్థానిక అవసరాలకంటే వ్యాపార లక్ష్యాలు ముఖ్యం ,కాని మనకి స్థానికత కీలకం. దీనిని విస్మరించి మొండిగా ప్రాజెక్ట్లు చేపడితే ముందుగా జరిగేది వ్యతిరేక గళాల ప్రతిధ్వని. ఇది నిరూపించింది  సైలెంట్ వ్యాలీ ఉద్యమం.1929 లో ఒక బ్రిటష్ ఇంజనీర్ కేరళలోని సైలెంట్ వ్యాలీ లో హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్టుని నిర్మించాలని ఊహించాడు కాని చేపట్టలేదు. అతని ఊహకు అందని విషయం యాభై,అరవై సంవత్సరాల తర్వాత ఈ విషయం పై ఒక ఉద్యమం జరుగుతుందని. ఇది మన దేశంలో వున్న అరుదైన సతత హరిత అడవి.8950 హెక్టార్ లలో విస్తరించి వుంది. కొన్ని వందల సంవత్సరాలుగా మనుషులు జాడ అతి తక్కువగా వుండి సురక్షితంగా వుంది. ఇది  40,000 హెక్టార్  లలో నిరంతరంగా విస్తరించివుంది.ఇక్కడ రైల్వే స్లీపర్ల కోసం ఒక  ఎకరాలో కేవలం రెండు లేదా మూడు చెట్లు నరికబడ్డాయి. 19 శతాబ్దంలో కాఫీ తోటల్ని పెంచాలని ప్రయత్నం చేసి తర్వాత వైదొలిగారు, మన దేశంలో అంతరించిపోయి,అరుదై పోయిన వన్యప్రాణులకి గూడు ఈ ప్రాంతం.
సర్వాత్రా జరిగేదే ఇక్కడ జరిగింది.1973లో అప్పటికే ప్రణాళిక సంఘం వారు ఆమోదించిన హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్టు విషయం వెలుగు లోకి వచ్చింది. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకున్నది రోములస్ విటేకర్, ఈమె తన భర్త జాయి విటేకర్ తో కలిసి కేరళలో పాముల పై అధ్యనం చేయడానికి ఆస్ట్రేలియా నుండి వచ్చి అక్కడ స్థిరపడ్డారు.ఈ విషయం పై తన వ్యతిరేకతను తెలుపుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది,క్రమేణా ఈ విషయం గురించి తెలుసుకున్న కేరళ లోని మేధావులు,పర్యావరణ ప్రేమికులు ప్రాజెక్టుకు వ్యతిరేకతను తెలిపారు. ఈ ఉద్యమంలో కీలక పాత్ర వహించింది కేరళ శాస్త్ర సాహితి పరిషత్.ఈ వ్యతిరేక నినాదాల్లో వచ్చిన పర్యావరణ పద జాలాన్ని కించపరిచారు, ఉదా: వర్జిన్ ఫారెస్ట్(virgin forest) , విశిష్ట (unique) అడవులు. అన్ని రాజకీయ పార్టీలు ప్రాజెక్టును సమర్ధించాయి.  ఈ ఉద్యమంలో సాహితి వేత్తలు కీలక పాత్ర వహించడం దీనికున్న ప్రత్యేకత. నిశ్శబ్ద లోయ ప్రతిధ్వనుల తరంగాలు వీరి ద్వారా ప్రకోపించాయి.పర్యావరణానికున్న ఒక రొమాంటిక్ ఇమేజరి నుండి జీవనానికి, ప్రకృతికి వున్న అవినాభావ సంబంధాన్ని తెలిపాయి.
కేరళ సాహిత్యంలో పర్యావరణానికి  సంబంధించిన కవితల్లో ఉలూర్ యస్.పరమేశ్వర్ అయ్యర్ (1877-1949) ‘The Hymn of Love’(ప్రేమ సంగీతం-1933) ని ప్రధమ కవితగా భావిస్తారు.
ప్రపంచానికి ఒక నమ్మకం వుంది-ప్రేమ, అది ,
పున్నమి చంద్రుడు మనకి తన తేనెని అందిస్తాడు ,ఆరగించడానికి-పాలు,
విశ్వం వివిధ రూపాల్లో భక్తిని ప్రదర్శిస్తుంది,
ప్రేమ,కోరిక,ఇష్టం,
నేల పై తన వాంఛను కురిపిస్తుంది,
ద్వేషం,శత్రుత్వం, అది కేవలం నాస్తిక వాదన నమ్మకం:
అయ్యో! చీకట్లో పడిపోయిన ప్రపంచం అర్ధాంతర చావుని కొని తెచ్చుకుంటుంది,
విధ్యంసకరమైన మూర్తి ప్రేమ సంబంధాల్ని అగ్నికి ఆహుతి చేస్తుంది,
పూల తోటని బీడు భూమిగా, స్వర్గాన్ని నరకంగా.
(అనుసృజన)

మేధావులు దీనిని కవిత్వoగా జమకట్టక పోవచ్చు,అనువాదంలో కవిత్వ తత్వాని చేరక పోవచ్చు, ప్రకృతి, మన మనస్సులు కవిత్వమయం చేసినప్పుడు జీవితం పర్యావరణీయం అవుతుంది.
Tuesday, 13 January 2015 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- నర్మదా బచావో ఆందోళన్-18

నర్మదా బచావో ఆందోళనలో కీలక పాత్ర వహించింది  మేధా పాట్కర్. ఈ ఉద్యమం ద్వారా ఉద్యమం ఎన్ని విధాలుగా చేపట్టాలో కూడా వెలుగులోకి వచ్చింది. పర్యావరణ,నదులు ,ఆనకట్టలు చర్చల్లో నిర్వాసితం అన్న అంశం ప్రపంచ వ్యాప్తంగా తెల్సింది. ప్రపంచ బ్యాంకు ఈ విషయంలో తన ఆపరేషన్ ఇవాల్యువేషన్ డైరెక్టివ్స్ మార్చుకుంది. పునారావాస ,పునరుద్ధరణ ప్రణాళికలు మళ్ళీ వెలుగులోకి వచ్చాయి. ఈ మార్పులు ఇప్పుడు భూసేకరణ చట్టంలో జరుగుతున్న మార్పులకు మూలాలు. అదే విధంగా అభివృద్ధిలో భాగస్వామ్య౦ పేరు మీద జరుగుతున్న పబ్లిక్,ప్రైవేట్,పీపుల్ పార్టనర్ షిప్ వంటి ప్రయోగాలు మొదలవడానికి కారకులు.
మనం జీవించడానికి వేరే గ్రహాల్ని అన్వేషిస్తున్నాం ,కాని అసలు విషయం ఈ భూమిని నిర్వీర్యం చేసి మనమందరం  నిర్వాసితులమవుతున్నాం అన్నది అసలు వాస్తవం. సామాజిక వాతావరణం మారినప్పుడు సహజంగానే ప్రకృతి వాతావరణం మారుతుంది. నది పైన పెద్ద ఆనకట్టి కట్టినప్పుడు పరివహక ప్రాంతంతో బాటు ఆయకట్టు ప్రాంతం తీరుతెన్నులు మారుతాయి. ఒక కాలంలో ఆనకట్టలు కట్టింది వ్యవసాయానికి నీరందించడానికి ,కాని నేడు వ్యవసాయం అన్నది నామ మాత్రమే ,అసలు అవసరాలు నగరాల దప్పిక తీర్చడానికి, పరిశ్రమల అవసరాలకి. పోలవరం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వీటన్నిటికి త్యాగాలు చేసేది గిరిజనులు, దళితులూ. వీళ్ళకి భూమి మీద హక్కులు ఇవ్వరు. దళితులకు ఇచ్చిన భూములు నేటికీ డి. పట్టా భూములే, వాటిలో దేశ అబివృద్ధి కోసం తిరిగి తీస్కుంటాం అని సుస్పష్టంగా పేర్కొని వుంటుంది.
నర్మదా  ప్రాంత వాసులు నర్మదా నది కి ఆనకట్టకు సంబంధించిన కధ ఒకటి చెపుతారు.మహాభారత కాలంలో అర్జునుడు నర్మాదని పెళ్ళాడాలనుకుంటాడు.నర్మద ఒక షరతు పెడుతుంది. అది తన మీద సాయంత్రం కాకి కూతలోపు తన పైన ఆనకట్ట కట్టాలని. అందుకు అర్జనుడు ఒప్పుకుని భీముడి సహాయంతో రెండు పర్వతాలు తెచ్చి నదికి ఇరువైపులా పెడతాడు. ఇంకా మరో కొండ తెచ్చి ఆ కొండల పైన వారధి ఏర్పరచడానికి వెళతాడు. వాళ్ళు అన్నంత పని చేస్తారని నర్మద సాయంత్రంలోపే కాకిలా అరుస్తుంది. అది  విని అర్జున ,భీములు తమ ప్రయతాన్ని వదిలిపెట్టి తిరుగు దారి పడతారు. తల్లి నర్మదని ఎవరూ  బంధించలేరని స్థానికుల నమ్మకం. మరి కొందరు స్ధానికులు ఈ కధకి కొనసాగింపుగా, అర్జనుడికి కోపం వచ్చి కలియుగంలో మనుషులు నర్మద పై ఆనకట్ట కడతారని శపించాడని అంటారు. ఆ శాపం ఎన్నో విధాలుగా ప్రస్ఫుటం అయ్యింది. కొందరు గిరిజన పెద్దలు ఆనకట్ట కడతారని పాతిక సంవత్సరాలుగా తమ వ్యవసాయ భూముల్ని అభివృద్ది పర్చుకోలేదు. ఇదీ ఒక విధమైన నిర్వాసితమే.
నేడు జరుగుతున్న 102 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్స్ లో మన పురాణాలు సైన్స్ గురించి మాట్లాడుతాయి,కాని ఇవి ఎవరి పురాణాలు ? గిరిజనుల జ్ఞానం, జీవనం సైన్స్ గా పరిగణిoచి దాన్ని విస్మరిస్తాం. ఎందుకంటే వాళ్ళు భూమి పుత్రులైనప్పటికీ వాళ్ళని నరసురులుగా చిత్రీకరించాం. అక్కడ ఆనకట్టలు కడితే భూమిని అభివృద్ది చేస్కోకుండా వుండి పోయారు. అదే కొత్త రాజధాని కాని ,పోలవరం కాలువ వస్తోంది అంటే చుట్టు పక్కల భూముల ధరలు ఆకాశాన్ని తాకు తాయి. ఎకరం భూమి కోటి పైగా పలుకుతుంది. ఒక ఎన్. ఆర్. ఐ. కూడా కొనడానికి సంకోచిస్తాడు.
మనం భూసేకరణ ,పురావాస ,పునరుద్ధరణ చట్టంలో మార్పులు ఒక శతాబ్దం తర్వాత మార్పులు చేస్తున్నాం. కాని ఇప్పటికీ ఆ రెండిటిని అమలు పరచడంలో మనకి నైపుణ్యం లేదు. ముఖ్యంగా పునరావాస,పునరుద్ధరణ అన్నది కేవలం నిర్వాసితుల్ని ఒక చోట నుండి  మరో చోటుకి చేర్చి వారికి బస ఏర్పాటు చేయడం కాదు. వారు తిరిగి సామాజికంగా,మానసికంగా తమ ఉనికిని ,జీవనాన్ని పునారావృతం చేస్కోవడం. దానికి పట్టే కాలాన్ని ఖచ్చితంగా చెప్పలేం. నిర్వాసితుల మదిని తొలిచే ప్రశ్నలకి మన దగ్గర సమాధానాలు లేవు. వారిని వారు ఓదార్చుకునే తీరు...
నీ మదిలో సమాధానాలు దొరకని ప్రశ్నలపై  ఓపికగా వుండు, ఆ ప్రశ్నల్ని వాటిగానే ఆస్వాదించు.బంధించిన గదులలాగా, పరిచయంలేని బాషలో రాస్తున్న పుస్తకాలుగా స్వీకరించు.వాటికి సమాధానాల్ని ఆశించకు,వాటి సమాధానాల్ని నువ్వు జీర్ణి౦చుకోలేవు, వాటితో సాంగత్యం చేయనూలేవు,విషయం ఏమిటంటే, అన్నింటా జీవించాలంటే, ఇప్పుడు  ఆ ప్రశ్నల్ని వదిలిపెట్టు.క్రమేణా నువ్వు, నీకు తెలియకుండానే, రాబోవు రోజుల్లో ఒక  సమాధానం గా  జీవించేస్తావు.-రైనర్ మారియా రైక్.
1992లో ఖమ్మం జిల్లాలోని చింతూర్ మండలంలోని చట్టి గ్రామంలో మాన్య ప్రాంత చైతన్య సదస్సు కార్యక్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధ కోయరాలు అన్న మాటలు ఎప్పటికీ మర్చిపోలేను  బాబూ, నా చుట్టూ పక్కల వున్న చెట్టు,పుట్ట ,వాగు, వంక ,జీవాలని  నాకు నష్ట పరిహారంగా ఇయ్యండి, నేను మావూర్ని పోలవరం డ్యామ్  కోసం వదిలి వెళ్ళి పోతామన చుట్టూ వున్నఆవరణ ,మనలోని పంచేంద్రియాలు, వాటినుండి మనని విడదీసి బతకమనడం నిర్వాసితం. దానికి నష్ట పరిహారం ఇవ్వడం ఎవ్వరి తరం కాదు. నేడు అవతరించిన రెండు కొత్త రాష్ట్రాలకి త్యాగం చేసింది పోలవరం నిర్వాసితులు.వీరి కోసం ఓ కొత్త జిల్లాని ఏర్పాటు చేయడం అన్నది కొత్త విషయం కాదు. పెసా చట్టం ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనులకి వారి జిల్లాలు ,మండలాలు ఏర్పాటు చేయాలి, అదే విధంగా కొత్త ప్రాజెక్ట్లు వస్తునప్పుడు గ్రామసభలకి తెలియచేసి వారి ఆమోదం పొందాలి. మరి ఇవన్నీ ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న భూసేకరణ ఆర్డినెన్స్ లో లేకుండా పోతున్నాయి.అంటే ప్రాధమిక మానవ హక్కులైన ప్రి అండ్ ప్రియర్ ఇంటిమేషన్, కన్సంట్ తో  బాటు సామాజిక ప్రభావ అంచనాలను కొట్టి పారేయడమే.
ఆ  మనుషులు ఎక్కడ
(నశ్రుల్ గీతి, అనూప్ గోషాల్)
గంగ, సింధు, నర్మదా
కావేరి ,జమునల జలాలు 
అవి మునపటి లానే ప్రవహిస్తున్నాయి
కాని అప్పటి మనుషులు ఏరి?
గంగ, సింధు, నర్మదా
 నిశబ్దం లో వున్న హిమాలయాలు
నిలువెత్తు భక్తితో అలానే నిలబడి వున్నాయి
కాని ఇప్పుడు  అక్కడ ఋషులు వుండడంలేదు
మనం అప్పటి మనుషులం కాదు
మన పైన ఆకాశం ఇప్పటికీ వుంది
కాని ఇంద్రుడి దివ్యత్వం లేదు
కైలాస పర్వతం వుంది
అందులో శివుడి తేజస్సు లేదు
మన పైన ఆకాశం యిప్పటికీ వుంది
కాని ఇంద్రుడి దివ్యత్వం లేదు
కైలాస పర్వతం వుంది
అందులో శివుడి తేజస్సు లేదు
దేవుడి పిల్లలిప్పుడు యాచిస్తున్నారు
ఇదేనా మన విధి
కాని అప్పటి మనుషులు ఏరి?
గంగ, సింధు, నర్మదా
 ఇప్పటికీ ఆగ్రా కోట వుంది
దిల్లి కూడా వుంది
కాని సర్వాంతర్యామి కీర్తి లేదు
కోహినూర్ వజ్రం దొంగలించబడింది
నెమలి సింహాసనం కనిపించడం లేదు
మన వీర సైనికులు, చరిత్ర ఇప్పుడు
ఎవరి దగ్గరైనా సమాధానాలు వున్నాయా?
మనం ఏమీ చెయ్యొద్దా, ఏమీను?
ఎవరి దగ్గరైనా సమాధానాలు వున్నాయా?
మనం ఏమీ చెయ్యొద్దా, ఏమీను?
మన కోసం ఏమిటని వేచి వుంది?
ఇది మన క్రూర నుదిటి రాత అని ఒప్పుకుందామా?
కాని అప్పటి మనుషులు ఏరి?
గంగ, సింధు, నర్మదా
కావేరి ,జమునల జలాలు 
అవి మునపటి లానే ప్రవహిస్తున్నాయి
కాని అప్పటి మనుషులు ఏరి?
గంగ, సింధు, నర్మదా
(అనుసృజన)
 ఈ పాట వింటుంటే మనస్సు కనురెప్పలకి కన్నీళ్ళ చెమ్మ నీటి గింజల్లా అల్లుకు పోతాయి. పర్యావరణ కవిత్వం ఈ నీటి గింజల సవ్వడే! ఎందుకంటే అబివృద్ధిని పొందడానికి   జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ లో  గిరిజనులు, దళితులూ ,నిరుపేదలు ,చిన్న రైతులు గిన్ని పిగ్స్ గా మార్చబడుతున్నారు.

నదిప్పుడు మన నేలలో వున్న టియర్ గ్లాండ్ ,అది డ్రై అయిపోతోంది.పర్యావరణ కవిత్యం ఆ డ్రైనెస్ కి  కొద్దిగా చెమ్మనిచ్చే మంచు కమ్మిన ఉదయం.