చికోమెండిస్
గత కొంత కాలంగా అడవులు,నీళ్ళు,భూమి,పంటలు, గూడు కోసం పోరాడే యోధులు
బలవ్వడం క్రమేణ పెరుగుతోంది. ఈ పరిణామం వనరుల క్షీణతకు ,వాటిని ప్రేమించే గుణ మున్న వార్ని ,మట్టినుండి దూరం చేసే సంకేతం.
"నా సమాధి మీద పెట్టే పూల పరిమళాలు ఏ కొమ్మవో , దాని మొదలు నాకు తెలుసు, నెను పోరాడేది వాటితో కలిసి బతకాలని, చావు కోసం కాదు" అన్నాడు చికోమెండిస్.పూల నీడల్లో పరిమళించాలన్న,కెన్ శారొ వివ అతని అనుచరుల జీవితం అర్ధాంతరంగానే ముగిసింది. ఇవి జరిగినవి 1995,1998 మధ్యలో. పోరాటాలు పెరుగుతూనే వున్నాయి దానితో పాటు ఆబాట దారి పట్టిన వారి చావులు కూడా.
ఈ మధ్య బ్రెజిల్లో రియో +20 ముగిసింది, గ్లోబల్ విట్నెస్ వారి అంచానాల ప్రకారం గత దశాబ్ద కాలంలో బ్రెజిల్లోనే వనరుల సంరక్షణ కోసం గళమెత్తిన వారు 365 మంది చనిపోయారు.గ్లోబల్ ఎకానమీ అయిన తర్వాత స్థానిక వనరులు మల్టినేషనల్ కంపెనీల పెట్టుబడులు పెరిగాయి, ఇప్పుడు పోరాటం గ్లోబలే!అది డ్యాం ,అడవులు, యెస్.ఇ.జడ్. లేక ఇతరత్రా ఏదయినా.
భూమి కోసం పోరాటం సదా జరుగుతూనే వుంది .ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు దోచుకొవడానికి విస్త్రుతమైన సాంకేతిక నైపుణ్యం వుంది. చాల తొందరగా ,తక్కువ కాలంలో వనరుల్ని పెకిలించవచ్చు. అందుకే మన దేశంలో భూ సేకరణ చట్టంలో మార్పుల్ని తీసుకురావడం జరుగుతోంది.పూర్వం గనులు తవ్వడానికి పట్టినంత వ్యవధి ఇప్పుడు అవసరం లేదు. అన్నిటి కంటె మించి ఇప్పుడు అభివృద్ధి కున్న నిర్వచనం వేరు, నిరంకుశంగా వనరుల వాడకం.భూమి పైన ,లోన వున్న వనరుల్ని వ్యక్తిగత స్థాయిలో దోచుకోవడం,దీని వల్ల నిర్వాసితం అన్నది అభివృద్ధిలో భాగమైంది. వ్యక్తి తననుండి తాను, వ్యవస్థనుండి, సమాజం నుండి నిర్వాసితుడయ్యాడు. ఇలా జరగకుండా వుండడాన్ని వ్యతిరేకిస్తే వార్ని విద్రోహ శక్తులుగా నిర్వచిస్తారు.మన సోంపేట రైతులు,అందరూ ఈకోవకు చెందినవారే.వీళ్ళంతా ఇకో వారియర్స్.1994 లో విశాఖ జిల్లా ,అనంతగిరి మండలం , ఒలాసి పంచాయతీ , నిమ్మలపాడు గ్రామాల్లో బాక్సైట్ గనుల గురించి వూళ్ళోని పెద్దాయన చెప్పిన మాటలు- "ఈ చుట్టూ వుండే కొండ, చెట్టు, చేమ, వాగు ,వంకల్లో దేవుడున్నాడని పూజించటంలేదు, అవి మనం బతకడానికి కూడు, గుడ్డా, ఇస్తున్నాయని పూజిస్తాం".
కోయ మహిళమహిళ-చట్టి గ్రామం
ఇవే మాటల్ని1992లో ఖమ్మం జిల్లా చట్టి గ్రామంలో పోలవరంకి వ్యతిరేకంగా ఓ కోయ మహిళ అంది- ఇప్పుడు పోరాటం అంటే మన బతుకుని, మన భూమిని కాపాడడం.వీరి సంఘర్షణ కేవలం మట్టిని కబళించకుండ అడ్డుకునే ప్రయత్నం మాత్రమే కాదు! మట్టిలోని జీవాన్ని పునరావ్రుతం చెయ్యడం కూడా.
పర్యావరణం అంటె మనతో బాటు మనచుట్టూ అల్లుకున్న కధే.ఈ కధల్ని బతికించే , అటువంటి వివిధ ప్రయాసలు చేసే వారి గురించి నాకు తెలిసిన, తెలుసుకుంటున్న, తెలుసుకోబోతున్న విషయాలు మీతో పంచుకోవాలన్న ప్రయత్నం ఈ బ్లాగ్- నేల గంధం.
సత్య
14-7-2012