Friday, 6 March 2020 By: satyasrinivasg

పచ్చటి పలుకులు



ప్రకృతి, కవిత్వం అన్నవి  శక్తి కేంద్రాలు. ప్రకృతి కవిత్వం  రాస్తునప్పుడు గమనించాల్సిన  విషయం ప్రకృతి లోని శక్తిని మన అక్షరాల ద్వారా ఎలా ప్రసురితం చేస్తాం అన్నది అర్ధమవ్వాలి.  ప్రకృతి ఓ శబ్ద  తరంగిణి , ఈ తరంగాలు  మండుటెండ మిట్ట మధ్యాహ్నం  కీచురాళ్ళ చప్పుడు, అర్ధ రాత్రి చేలో కప్పల బెక,బెకలు , ఉషోదయమప్పుడు చిట్టి పక్షుల కూతలు కావచ్చు. ఈ తరంగాల్ని మన కవిత్వం ద్వారా అరంగేట్రం చేయించాలి . దానికి కేవలం రాయడం,  చదువర్లని ప్రోత్సహించడం తో సరిపోదు , కవిత్వాన్ని చదవాలి , చదువర్లని ప్రేక్షకులుగా మలచాలి,పర్ఫాం చేయాలి  వార్ని ప్రేక్షకులుగా మలచాలి. అప్పుడు అక్షరంలో వున్న శక్తి వార్ని శక్తిని నిల్వ చేసుకునే శక్తి కేంద్రాలుగా ఏర్పరుస్తుంది ఇదే  ప్రకృతి కవిత్వ బయో సెంట్రిజం. ‘ప్రతి ఒక్కటి, మరొకదానితో ముడిపడి వుంది అన్న జీవావరణ ప్రధమ సూత్రం. నేడు కవిత్వం కాగితానికి, మొబైల్, కంప్యూటర్లకి అంటిపెట్టుకుపోయి శబ్ద లయని కోల్పోతోంది. ఒక విధంగా చెప్పాలంటే టెక్నాలజీ పుణ్యామా అని కవిత్వం,సాహిత్యం ఎంత తొందరగా పరివ్యాప్తి చెందుతుందో అంతే తొందరగా అది కనుమరుగవుతోంది అన్నది వాస్తవం. ప్రకృతి, కవిత్వం  ఈ రెండు సముహాల్ని కలిపి ప్రకృతిమయమవ్వడం చాలా అవసరం. ఎందుకంటే మనం రాసేది  ఓ డాలర్ కోసమో, మరో డాలర్ కోసమో కాదు. ఈ డాలర్ల మాయా జాలం నుండి  ప్రకృతిని సంరక్షించడానికి. ఇట్స్ నాట్  ఫర్    ఫ్యూ డాలర్స్ మోర్. బట్ ఫర్  ‘చివరి పాట వరకు,ఆమె ఎంత మృదువుగా వచ్చిందో అంతే మృదువుగా నిష్క్రమించింది’. ఈ నిష్క్రమణ  ఇకాలజికల్ జస్టిస్ కి (ప్రకృతి  న్యాయం) విరుద్ధం. ప్రతి ఒక్కరికీ జీవావరణ సంరక్షణ బాధ్యత వుంది, వారు దీనికోసం సృజనాత్మకంగా ,ఉమ్మడిగా కృషి చేయాలి.మనం జీవావరణ కవితాత్మకతని,ప్రకృతి ధృకోణాన్ని ఏర్పరచుకోవాలి ,  దీన్ని వాల్ట్ విట్ మ్యాన్  కవితలో చూద్దాం...
నా  స్వీయ గీతం(1892)
వాల్ట్ విట్ మ్యాన్
1
నాకు నేను ఉత్సవం జరుపుకుంటాను, నా కోసం పాడుకుంటాను
నేనేమిభావిస్తానో ,మీరూ అదే భావిస్తారు
నాకున్న అణువులు అంతే మంచిగా మీకు వుంటాయి
నను వీడి నా ఆత్మను ఆహ్వానిస్తాను
 నను వీడి , సుతారంగా ఒకింత ఒరిగి వేసవి గడ్డి పోచను గమనిస్తుంటాను
నా నాలుక , నా శరీరంలోని ప్రతి అణువు ఈ నేల , గాలి నుండి పుట్టింది
ఇక్కడే తల్లితండ్రుల నుండి పుట్టాను, ఇక్కడే వారి      
 తల్లి తండ్రులు, వారి వారి తండ్రులు అంతా ఇచ్చోటనే
నాకిప్పుడు ముప్పై ఏడేళ్ళ వయస్సు ,ఆరోగ్యవంతంగా వున్నాను
చచ్చేంతవరకూ ఇలానే వుంటానన్న ఆశ
బడిని, నమ్మకాల్ని పక్కనపెట్టాను
అవి ఉన్నంత కోశాన చూసుకుని కొద్దిగా విశ్రమించాను,వాట్ని ఎన్నటికి మర్చిపోలేదు
మంచో చెడో  నేను శ్రమిస్తాను, ప్రతి విధ్వంశం అప్పుడూ మాట్లాడుతాను
అవధులు లేని ప్రకృతి,స్వీయ శక్తి తో
2
ఇళ్ళు,గదులు సుగందాలతో నిండి వున్నాయి, అలమరాలు కూడా సుగంధ ద్రవాలతో నిండి వున్నాయి
 నేను ఆ పరిమళాన్ని పీలుస్తాను , నాకు తెలుసు అది నాకు ఇష్టమని
వాటి స్వేదనం నాకు మత్తెక్కిస్తుంది,కానీ దానికి నేను లొంగను
వాతావరణం పరిమళ ద్రవం కాదు, దానికి స్వేదనం, రంగు లేవు
అదిఎప్పటికీ నా నోటికి రుచినిస్తుంది, నేను దాని ప్రేమలో సదా
మానుల ఒడ్డుకి వెళ్తాను, నగ్నంగా అదృశ్యమైపోతాను
నాకు వాటితో కలిసి వుండాలన్న పిచ్చి
నా శ్వాస పొగ
ప్రతిధ్వనులు, నీటి వలయాలు, రహస్య గుసగుసలు, ప్రేమ వేర్లు,సిల్క్ దారాలు, మధువు
నాకు ప్రోత్సాహం ఇంకా ఊపిరి, నా గుండె చప్పుడు, నా ఊపిరితిత్తుల గుండా ప్రవహించే రక్తం,గాలి
పచ్చటి, ఎండిన ఆకుల పరిమళం , సముద్రపుఒడ్డున  నల్లని కొండలు, ధాన్యా గారంలోని  గడ్డి
నా గొంతులోని పల్చటి మాటలు గాలి సవ్వడిలో కొట్టుకుపోతాయి
 నా భుజాలని  అల్లుకున్న కొన్ని చిన్ని ముద్దులు,కౌగలింతలు
నీడ ,వెల్తుర్లలో చెట్ల కొమ్మలు తోకలూపుతాయి
ఒంటరి పారవశ్యం లేక వీధుల్లో రద్దీ,లేక కొండల దగ్గర ,పొలాల్లో
 ఆరోగ్యకరమైన భావన , మిట్టమధ్యాహ్నపు ఎండ ,
నాలో నీ గీతం అంచునుండి లేచి సూర్యుడిని చేరుతుంది
నీవు వేల ఎకరాల్ని అంచనా వేశావా? నీవు భూమిని కొలిచావా
నీవు సుధీర్ఘంగా చదవడం అభ్యసించావా?
కవితల్ని అర్ధం చేసుకోవడం లో గర్వం పొందావా?
ఈ రోజు పగలూ రాత్రీ నాతో వుండు,ఇక నీవు కవితల మూలాల్ని పొందగల్గుతావు
నీవు భూమి, సూర్యుడ్ల మంచిని అస్వాదించగల్గుతావు,(కొన్ని లక్షల సూర్యుడ్లున్నారు)
ఇక పై మరొకరి దగ్గరనుండి ఏదీ తీసుకోవు, ఇక చనిపోయిన వారి చూపుతో చూడవు,
పుస్తకాల్లో దెయ్యాల గురించి ప్రస్తావించవు
నువ్వు నా కంటితోనూ చూడవు,నా నుండి ఏమీ తీసుకోవు
అన్ని వైపుల నుండి విని నీ వాట్ని మేళవిస్తావు
(అనుసృజన-జి.సత్యశ్రీనివాస్)
వాల్ట్ విట్ మ్యాన్ కి , తన  జీవితకాలంలో  పెద్ద పేరుప్రఖ్యాతలు రానప్పటికీ,(1819-1892).
ఇప్పటికీ ఆయనని  గొప్ప కవి- ఫిలాసఫర్, ప్రజల  కవి, మానవతావాది, మేధావి కవి గా భావిస్తారు. 
 ఇయన్  హోమర్,వర్జిల్, డాంటే షేక్క్ పీయర్ వారసుడిగా అంచనావేస్తారు.
ఈయన పుస్తకం  “లీవ్స్ ఫ్రం గ్రాస్” 
లో ప్రజాస్వామ్యం, ప్రకృతి,ప్రేమ ,శృంగార స్వేచ్ఛ,స్నేహం  గురించి రాశారు. 
ఈయన కవిత్వం 1850-1890 కాలంలో బ్రిటిష్ ధోరణికి భిన్నంగా వస్తూ అమెరికన్ కవిత్వానికి 
కొత్త ఒరవడి సృష్టించింది. సాంగ్ అఫ్ మై సెల్ఫ్  అన్న కవిత  52 స్టాన్జాల్లో వుంటుంది.  
ఇందులో ప్రేమ శక్తి తొణికిసలాడుతుంది. ఇందులో  విట్ట మ్యాన్ నుండి శక్తి భౌతిక
 ప్రపంచలోకి ప్రసారమై ,
తిరిగి విట్ట మ్యాన్ లోకి ప్రవహిస్తుంది ఇది కవిత్వం లో అరుదుగా కనిపించే ప్రకృతితో ముడిపడిన 
మెటాఫిజికల్ బంధం. ఈ బాంధవ్యం  కవికి ,జీవావరణానికి శక్తి ప్రవాహం ,
ఇదే కవిలోని జీవనానికి పునాది.
 ఈ కవితలో పూర్తి స్ధాయిలో ప్రకృతి దృష్టి ఇమిడి వుంది.విట్ట మ్యాన్  మాటల్లో కవిత్వం, 
 కవులనుండి ఉత్పన్నమై వాతవరణం లో కలిసి కవిత్వ వాతావరణాన్ని సృష్టిస్తుంది 
అది తిరిగి కవిత్వ వర్షంగా కురిసి ,మన  ఎదుగుదలకు దోహదపడుతూ,
మనని సృజనాత్మకంగా పునారావృతం చేస్తుంది. 
ఈ కవిత్వ  సాంస్కృతిక  వాతావరణం లేనప్పుడు  మనం కేవలం గాలి పీల్చుకునే 
మనుషులుగానే చచ్చిపోతాం.
 ఇది కాకుండా వుండాలంటే మనలోని ప్రకృతిని తడి కవిత్వ నీటి చుక్కలతో
 తరుచూ తడపడం అవసరం!.





0 comments:

Post a Comment