Sunday, 29 March 2020 By: satyasrinivasg

డార్క్ ఎకాలజి(చీకటి జీవావరణం)— చీకటి పొలిమేర



 చాలా సందర్భాలలో  చాలా సార్లు ఎదురయ్యే ప్రశ్న ప్రకృతిని  సంరక్షించగల్గుతామా? దీనికి నా దగ్గర, బహుశా చాలా మంది వద్ద ఖచ్చితమైన సమాధానం లేదు. ఎందుకంటే అది వ్యక్తితో కూడుకున్న పరిష్కారం కాదు, వ్యక్తి స్ధాయి నుండి వివిధ వ్యవస్ధలతో జతపడివుంది. ఇక్కడ  ముఖ్యంగా మనం జీవావరణం ,పర్యావరణం, ప్రకృతి, అన్న అంశాల్ని .వాటి సాంగత్యాన్ని అర్ధం చేసుకోవాలి! జీవావరణం అన్నది ఒక  ప్రాంతంలో వివిధ  జీవరాసులు మధ్య అంతర చలన సంబంధం, పర్యావరణం అన్నది  భూమి, జీవ శాస్త్రానికి సంబంధించినది, ప్రకృతి అన్నది ఈ  వివిధ జీవావరణ, పర్యావరణ జీవన్ముఖం. మరి వివిధ ప్రకృతి  వ్యవస్ధలు, సూర్య కుటుంభం సంగతి.  ఇక పరిష్కారం అన్నది ,సమస్య ఏంటి ,దాని ప్రభావం ఎంత, దాని కారకులు(అందరమూ  చిన్న, మధ్య, పెద్ద మొత్తాలలో కొద్దో గొప్పో కారకులమే), దాని ప్రభావం (ప్రకృతి తో సహ మనమందరం  ప్రభావితులమే చిన్న, మధ్య, పెద్ద స్ధాయిల్లో) ఎవరి  పైన ,ఏ  రూపాల్లో! అన్నది అర్ధం అయినప్పుడు మన అడుగు పడాలి. అది జరగాలంటే    జీవావరణ,పర్యావరణ, ప్రకృతిని కేవలం భౌతిక, అభౌతిక వ్యవస్ధల పరిశీలనే కాక, వాట్ని  జీవావరణ,పర్యావరణ, ప్రకృతి, సామాజిక, రాజకీయ,ఆర్ధిక ఇంకా పలు వ్యవస్దల దృష్ట్యా  పరిశీలించాలి. ఈ పరిశీలనకే  జీవిత కాలం చాలదు, అందుకే ఈ నిరుత్సాహ ధోరణి. వాటి  తీరుతెన్నులు చూడడానికి డార్క్ ఎకాలజితో,  దృక్పధాల తోవ పడదాం.
పర్యవరణానికి సంబంధించి చాలా దృక్పధాలున్నాయి ,మనం డార్క్ ఎకాలజి (చీకటి జీవావరణం) అన్న దృక్కోణం నుండి మొదలుపెడదాం. ఎందుకంటే పర్యావరణ  సాహిత్యం లోని చీకటి కోణాల్నిశోధించడానికి  పూర్వపు జీవావరణ విశ్లేషణల అధ్యయనాల పరిధిని పెంచి,కవిత్వ పరిధి విస్తృతం చేస్తూ,  ఉత్పన్నమవుతున్న కీలక అధ్యయనాల్ని కొత్త ఒరవడితో చూడాలన్న ఆశయం.  టిమోతి మార్టన్ అనుసారం 'డార్క్ ఎకాలజి అన్నిట్ని సహజమైన వాటిగా ఊహించుకుని సంబరాలు  చేస్కునే జీవావరణ ఆలోచన అతి మంచిది, సహజమైనది, అంత పచ్చనిదీ కాదు.  జీవకోటి అంతా  ఒకదాని తో మరొకటి ముడి పడి వున్నాయని వాస్తవంగా చూసే దృక్కోణం అవసరం  .ఇది   సమయం  తుది నుండి ప్రపంచాన్ని చూడడం. అంటే తుది శ్వాసప్పటి కోరికలా....అది నేటి    వాస్తవం.
కరోనా పుణ్యమా అని నేడు సోషల్ ఐసోలేషన్, సోషల్ డిస్ టెన్స్ ఏర్పడలేదు ,ఎప్పుడైతే మనం సాంకేతిక పరిజ్ఞానం తో ప్రకృతిని జయించాలనుకున్నమో అప్పటి నుండే ఇది మొదలయ్యింది.  నేడు హాండ్ వాష్ తో పాటు  దాని కంటే కీలకమైనది మనలోని,మన చుట్టూ అల్లుకున్న  క్యాపిటలిజం వాష్ అవసరం! కారణం క్యాప్టివ్ టివ్  గ్లోబ్ అన్న ప్రవచనం వల్ల సోషల్ మీడియా ,ఇతర సాంకేతిక పరిజ్ఞానం,మార్కెట్ ఎకానమీ వల్ల  మనం ఒక క్యాప్టివ్   కన్ జ్యూమర్స్ అవ్వడం  వల్ల  మన ఐసోలేషన్ (సెల్ఫ్ అండ్ సోల్)     తారాస్ధాయికి చేరింది. నేడు జీవావరణ కవిత్వం చాలా మటుకు ఈ తీరులోనే కొనసాగుతోంది. ఏదో ప్రకృతికి చివరి కవితలా అల్లుకుపోతున్నాం తప్ప ప్రకృతిప్రపంచ సమాజం(నేచర్ గ్లోబల్ సొసైటి)  విప్పత్తులో వుంది అన్న బాధాకర భావన కన్పించడం లేదు.డార్క్ మౌంటెన్ అనే ప్రాజెక్ట్ కవుల  మాటల్లో “అనాగరిక(అన్ సివిలైజిడ్)  రాతల్లో,  చీకటిని(మరుగునపడిన ) ఎకాలజికల్(జీవావరణ) రచనల్లో  ప్రాధమిక సూత్రంగా భావించాలి”, నేడు ఇది ఎక్కువగా  చలామణి అవ్వడం వల్ల ప్రకృతి అంతరిస్తోంది, అన్న భయంలో  మనం,మన సమాజం పురాతన కట్టడాల్లా  కూలిపోయే స్ధాయికి వచ్చాయి అన్న నిజాన్ని విస్మరించాం.అందుకే కాబోలు వైప్పతప్పుడే వచ్చే  వార్తా పత్రికల్లో కధనాల్లా, పర్యావరణ సాహిత్యం కూడా పర్యావరణ టూరిజం లా చలామణి అవుతుంది.
 సాహిత్యం ఎకోక్రిటిజంని(జీవావరణ విమర్శ)  ‘మన భౌతిక పర్యావరణానికి ,సాహిత్యానికి గల సంబంధం’ అని నిర్వచిస్తుంది. అప్పుడు మనం  ఇప్పటిలా కాక వేరేలా  వుండాలంటే,మన ఆలోచనలు కళల వైపు మొగ్గాలి.  ‘ఒక పన్నెండు వేల సంవత్సరాల  నిర్మాణం ,ఆ నిర్మాణం వాస్తవమైనది,అదే ప్రకృతి! చాలా నిదానస్తురాలు,అత్యంత విస్తృతంగా  విధ్వంశకరమైనది, చాలా ప్రణాళికాబద్ధమైనది కూడా’!. మరి డార్క్ ఎకాలజి (చీకటి జీవావరణం) అంటే?  అది జీవావరణ అవగాహన అనేది చీకటి- నిరుత్సాకరమైనదీనూ!ఇంకా జీవావరణం పై అవగాహన ,చీకటిదీనూ-  విలక్షమైనిదీనూ!విచిత్రమేమిటంటే  ఇది చేదు చీకటి కాదు ,తియ్యని చీకటి! డార్క్ ఎకాలజి, చీకటి నుండి  జీవావరణ వెలుగునూ చూపించే మార్గం.. మరి ఇది జరగాలంటే ,బయోస్ఫియర్ని చూడాలి, అంటే భూమి ఉపరితలం, భూమి పైన వాతావరణం, ఇతర గ్రహాల జీవనం,అది తెలిస్తే మనకి  మనకి బయోసోఫి అర్ధం  అవుతుంది, ‘బయోసోఫి అంటే ‘జీవన విజ్ఞానం , ఇది  సాంకేతిక , కళలతో కూడిన అవగాహన కల్గిన  తెలివైన ఆధ్యాత్మిక(నాట్ జస్ట్ ఫిలాసఫి) విలువలతో కూడిన జీవనం.  వ్యక్తిగత .సామాజిక  ఐక్యానికి సామాజిక విలువలు, గుణాలు, సూత్రాలతో ఇమిడిన జీవనయానం’. అప్పుడు,ఇప్పుడు తప్పులు చేశాం అన్న దానికంటే వాట్ని సరిద్దుకునే మార్గాలు అన్వేషించాలి. ఈ అన్వేషణ కీ  సంబంధిచిన ప్రపంచ స్ధాయి  పర్యావరణ సదస్సు 1990 బ్రేజిల్ లోని రియో డి జనారియో లో మొదటిగా జర్గింది. చాలా తీర్మానాలు తీస్కున్నారు, ఒకరి పై ఒకరు తప్పొప్పులు చూపుతూ... కాని ఫలితం తప్పులు పెరుగుతూనే పోతున్నాయి , వాతవరణం లో చిల్లులు పడుతూనే వున్నాయి, కొందరి జేబులు నిండుతూనే వున్నాయి... ఎటోచ్చి అందరిదీ ఒకే నినాదం ‘బ్లేం ఇట్ ఆన్ రియో’!.
 తప్పు చేసే వార్ని శిక్షించడం కంటే వారి తప్పుని వారు గుర్తించి సరిద్దిద్దుకునే మార్గాలు చూపాలి. ఈ పధ్ధతి ఆఫ్రికా లోని ఒక తెగ వారు పాటిస్తారు. ఊర్లో ఒక నిర్దిష్టమైన  ప్రాంతంలో తప్పు చేసిన వార్ని పిల్చి ఒకటి ,రెండు సార్లు ఊరు మొత్తం వచ్చి నచ్చ చెబుతారు.  కాని  నాగరిక  యుగంలో ఎక్కువ శాతం ఇంక్లుజన్( ఇముడ్చుకోవడం) కంటే  ఎక్స్ క్లుజన్ (వెలివేయడం) పద్ధతులు పాటిస్తాం. అది కిం రోడ్రిగ్యుస్  చెప్పిన కవితలో చూద్దాం..
యోధుడు,
కిం రోడ్రిగ్యుస్
దేవుడు తనిచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చడంలో నిదానస్తుడు కాదు,కొందరు దాన్నిఆలస్యం అనుకుంటారు. కాని అతను నీతో ఓపికగా వుంటాడు,
నువ్వుఅంతమొందకూడదని,
అందరూ పశ్చాత్తాపంచెందాలని.
అనుసృజన-జి.సత్యశ్రీనివాస్
అవును మనం జయించినది మనని అంతమొందించుకోడానికి కాదు, జీవితాన్ని కొనసాగింపచేయడానికి,నాటి నుండి నేటి వరకు ప్రకృతిని హస్తగతం చేస్కోడానికి మనం మనతోనే యుద్ధాలు చేస్కున్నాం. అది వనరులు, రాజ్యాలు, మతం ,కులం ,జాతి పేర్న. ఇవన్నీ చేస్కుంటూ పోతూ మనం మనుష్యులం అని ఎప్పుడో మర్చిపోయాం!. ఒక కాలంలో ప్రకృతిని దేవుడు, దేవతలుగా పూజించాం, ఇప్పటికీ కొనసాగుతొందనుకోండి! కాని అదే ఆరాధన భావన లేనప్పుడు ఎవరు ఎందుకు రక్షించాలి, ఆశీర్వదించాలి, కోరికలు తీర్చాలి?వాళ్ళు కూడా మనం ఎప్పుడు మారతాం  అని ఎదురుచూస్తున్నారు. కారణం మనం పూలు, పళ్ళతో పూజించడం లేదు, డబ్బు కాగితాల దండలతో, బంగారం ,వజ్ర, వైడూర్యాలతో జపిస్తున్నాం కాబట్టి. బహుశా ఇవి అయిపోయిన తర్వాత  అప్పుడు ప్రత్యక్షమై మనని దీవిస్తారేమో!
మనం మనలోని జీవావరణ  లక్షణాల్ని వెలివేసుకున్నాం , మనం అన్నిటినీ పొందాలి అన్న తాపత్రయంతో  మన చుట్టుపక్కల వాట్ని చాలా పోగుట్టుకున్నాం.  ఏదో గొప్ప నగరాన్ని నిర్మించాం అన్న అభూత కల్పనలో మనం చాలవాటి నుండి ఐసోలేట్ (విడిపోయాం) అయ్యాం అన్నది గ్రహించడం లేదు. పోయినవాటికి దినాలు పెట్టుకుంటూ బతికేస్తున్నాం!
 ది లార్డ్ అఫ్ డార్క్ లైట్
డార్క్ ఎకాలజీకి సంబధించి  లార్డ్ బైరాన్ని కీలకుడిగా భావిస్తారు.ఈయన 1788లో ఇంగ్లాండ్ లో జన్మించారు, 1824లో మరణించారు.18  ఏట నుండే కవిత్వం రాశారు.ఈయన వ్యంగ కవి,చైల్డ్ హరాల్డ్స్ పిలిగ్రిమేజ్ అన్న ఈయన ఆత్మ కవిత చాలా ప్రజా ధరణ పొందింది. ఇతను 1816 లో రాసిన  డార్క్ నెస్ కధారూపం కవిత మానవజాతికి భవిషత్తు పై భయం కల్పించే విధంగా వుంటుంది. ఇందులోని కొన్ని పంక్తులకు ముగింపు వుండదు. ఈయన కవిత్వం వ్యక్తిగత మైనది.
డార్క్ నెస్   కవిత పూర్వాపరాలను గమనిస్తే  1816, 16 జూలైన సూర్యుడు మసైపోతాడు,ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది  అన్నఒక ఇటాలియన్ అస్త్రానమార్ మాట దావానంలా పాకింది.అది  సన్ స్పాట్ ఎక్కువగా వున్న సంవత్సరం . సన్ స్పాట్ అంటే సూర్య ఉపరితలం పై చీకటిగా వుండే ప్రదేశాలు , అవి మిగితా వాటి  కంటే చల్లగా వుండడం వల్ల చీకటిగా అగుపిస్తాయి.1815 లో ఇండోనేషియా లో తుంభోరా అగ్ని పర్వతం పేలి ఆకాశం  చీకటి కమ్ముకుంది, ఉష్ణోగ్రతలు తగ్గి ,ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి.జూన్   9-10 న సూర్య గ్రహణమప్పుడు ఆకాశంలో సూర్యుడు కనిపించకుండా పోయాడు. ఈ సహజ ప్రకృతి వైపరీత్యాలు సునిశిత మనస్కులని ఆందోళనకు గురిచేసింది. ఈ సందర్భంగా బైరాన్ సూర్యుడు అస్తమించడం, రోజులు అంతరించడం అని కాక , పూర్తిగా వినాశానమయ్యే రోజు వస్తుందని హెచ్చరిస్తూ రాసిన కవితే డార్కనెస్... పదండి ఆ చీకటి కవిత గుహలోకి....
చీకటి
లార్డ్ బైరాన్
నాకు ఒక కల వచ్చింది, అది అసలు కల కాదు
కాంతితో వెలుగుతున్న సూర్యుడు,నక్షత్రాలు అస్తమించాయి
అంతరిక్షమంతా  చీకటి కమ్ముకుంది,
వెలుగు రేకల  మంచు భూమి, దారిలేనిదయ్యింది
చంద్రుడు లేని గాలి  చీకటితో గుడ్డిదయ్యింది;
ఉదయం వచ్చింది,వెళ్ళింది- వచ్చింది ,రోజులని తేకుండా,
మనుషులు భయంతో ఆశలు మర్చిపోయారు
 వాళ్ళ గుండెలు విచ్చిన్నమయ్యాయి, ఈ  విధ్వంశం వల్ల
వెలుగు కోసం  తుచ్చ వాంఛలతో నిశ్చేస్టులయ్యారు:
ఇక ముళ్ళతో-నెగళ్ళతో బతికారు,
రాజప్రాసాదాలు -పూరి గుడిసెలు,
అన్ని ఆవరణాల ప్రదేశాలు కూలిపోయాయి,
ఎత్తైన ప్రదేశంలో అమర్చిన మంట; నగరాల్ని బూడిద చేసింది,
ఇక మనుషులు కాలుతున్న వాళ్ళ ఇళ్ళ చుట్టూ గుమిగూడారు
ఒకరి మొఖాలు ఒకరు మరొక సారి చూసుకోడానికి;
 కళ్ళల్లో నివాసమున్న వారు సంతోషస్తులు
అగ్ని పర్వతాలు , వాటి కొండ - కాగడాలు:
ఒక భీకర కోరిక ప్రపంచమంతా అల్లుకుంది;
గంటకీ గంటకి-అడవులన్నీఅగ్నికి ఆహుతవుతున్నాయి
 వాటి మాన్లు విరిగి -అవి కూలి బూడిదవుతున్నాయి
కూలి మటుమాయమవుతున్నాయి-అంతా చీకటి.
మనుషులు నుదుళ్ళ  పైన నిరుత్సాహ కాంతి  తిలకం
అనువైన నిర్జీవ  తొడుగులా
 బూడిదలో కప్పడిపోయున్నారు
మొహం చాటేసుకుని  రోదిస్తున్నారు; కొందరు సొలిసిపోయారు
వాళ్ళ గడ్డం చేతుల్లో పెట్టుకున్న జీవచ్చవాల్లా ;
ఇంకొందరు హడావిడిగా అటిటూ తిరుగుతూ,ఆహారం అందిస్తూ
 పేరుకుపోతున్న వాళ్ళ అసంఖ్యాక కళేబరాలు
 నిర్జీవమైన ఆకాశం వైపు జీవం లేని చూపుతో పైకి చూస్తూ,
మళ్ళి : శాపాల ధూళితో వున్న,
గత ప్రపంచ కఫన్
ఫటఫటమని పళ్ళు కొరుకుతూ,ఘీంకరిస్తూ: కృర పక్షులు కూతలు
భూమి పైన అటుఇటు తిరుగుతూ ,భయపెట్టిస్తూ,
నిరుపయోగమైన రెక్కలాడిస్తూ; కిరాతకమైన జీవులు
 పాకుతూ, ఊగుతూ చేరిన మచ్చికైన విష సర్పాలు ;
బహుసంఖ్యలో అల్లుకుపోయాయి
 కోరలు లేకుండా బుసకొడుతూ, ఆహారం కోసం పరితపిస్తూ.
ఇక యుద్ధం, ఒక క్షణానికి వాయుదాపడి,
కొదవ లేదన్నట్టుగా- భోజనం తెచ్చారు
ప్రేమ రాహిత్యంగా నిస్పృహతో నిండివుండి,
ఇష్టంలేదన్నట్టు రక్తంతో వండినది
ఈ భూమంతా ఒకే ఆలోచనతో కూడుకున్నది
వెంటనే ,అగౌరవమైన; అమితమైన నొప్పి కల్గించే-  మృత్యువు
మనుషులు-  కరువు కాలంలో జంతు కళేబరాలను భుజిస్తూ
ఆహార కొరత,కొరత వల్ల కొద్ది,కొద్దిగా మింగుతూ,
మృతిచెందారు, వాళ్ళ ఎముకలు మాంసం లేని  సమాధుల్లా;
శవానికి మాత్రం విశ్వాసంగా నిల్చి వుండి,
ఒకర్ని రక్షించడానికి,  యజమానుల పెంపుడు కుక్కలు కూడా వాళ్ళ పై తిరగబడ్డాయి
 ఒడ్డున ,పక్షులు, జంతువులు, కరువుకాటకాలతో వున్న మనుషులు,
ఆకలితో అలమటిస్తూ, లేక కళేబరాల్ని పడేస్తూ...
( మిగిలింది వచ్చే వారం)
  ఈ కవిత్వాలోని ఉద్వేగ పూరిత మైన ధార నేడు కనిపిస్తోంది...ఇంకా మిగితా పంక్తులతో  వచ్చే వారం కలుద్దాం, అప్పటివరకు ఈ చీకటి కవితని నెమరేసుకుంటూ , మన చుట్టూ వున్న జీవావరణ కోణాల్నిడార్క్ లైట్స్ తో సోధిద్దాం... 

0 comments:

Post a Comment