Wednesday 1 October 2014 By: satyasrinivasg

గుప్పెడంత గుప్పిట్లో మట్టి శ్వాస ఖైదీ –మూల వాసుల జీవన వలయం

గత వారం పర్యావరణం నిర్వచనం, రాజ్య వ్యవస్థ , మూలవాసుల దృష్టి,రూపం గురించి ప్రస్తావించాను. ఈ  వారం అదే దిశగా మీతో  బాటు కొనసాగుతాను. పర్యావరణ నినాదం 1960 ల నుండి ప్రచారం లోకి వచ్చింది. మొదట్లో ఈ నినాదాన్ని రొమాంటిక్ ప్రచారంగా జమ కట్టారు. ఇది నిలదొక్కుకోదు అని అన్నారు. ఇప్పటికీ ఓ మొలకగా చిన్నగా పెరుగుతోంది. ఇది ఎదగాలంటే దీనిని  కేవలం ఒక రొమాంటిక్ భావనగా అంచనా వెయ్యొద్దు . పర్యావరణ కవిత్వాన్ని కూడ అంతేగా భావించకూడదు. పర్యావరణ నినాదంలో సంక్షిప్తంగా  వున్నది చరిత్రలోని సంఘటనలను ఆయా జీవావరణ వ్యవస్థల ద్వారా చూడడం తప్ప విడదీసి కాదు. పర్యావరణ కవిత్వానికి మూలం ఇదే.  అంతర్గత, బాహ్య చర్యల ప్రక్రియ  ప్రతీకలుగా  రూపాన్ని అర్ధం చేసుకోవాలి. ఇది ప్రేమ ,ఘర్షణ చిహ్నాల జెండా. ఇది వ్యక్తిగత,సామూహిక మట్టి పాద ముద్ర.

అనగనగా రోజులనుండి నేటి వరకు అడవిని అందంగా చిత్రికరించాము,ఆ ఆవరణలోని వాట్ని అనాగరికులుగా, జంతువుల్నిక్రూర మృగాలుగా   వర్ణించారు. ఈ వర్ణన మన జీర్ణ కోశములో నాటుకుపోయింది. దీనినుండి బయటపడాలంటే చరిత్ర విశ్లేషణలో సంస్కృతిక మనో విశ్లేషణ(చికిత్స) చాలా అవసరం. గిరిజనుల జీవన విధానం వైవిధ్యంతో అల్లుకున్నది. వాళ్ళు కొండ పోడు,చెలక పోడు, అటవీ ఫల సేకరణ,పశుపోషణ,చేపలు పట్టడం,పండ్ల చెట్ల పెంపకం, వేట లాంటి వ్యవస్థల పై  జీవనాన్ని కొనసాగిస్తారు. ఇప్పటికీ కేవలం అటవీ ఫల సేకరణ,పశుపోషణ  పై అచ్చంగా జీవిస్త్తున్నవారు,శ్రీశైలం ప్రాంతంలోని చెంచులు(అహోబిలం వైపు వారు కారు). ఇక మిగితా తెగలవారు (ఆంధ్రా,తెలంగాణలో) అన్నిటి  మీద  ఆధారపడి బతుకు తున్నారు. అంటే ఒక రాజ్య వ్యవస్థ నిర్వహణ,యాజమాన్యం చేసే సహజ వనరుల అన్నింటి పైన వీరి జీవనం ముడి పడి వుంది. ఈ వ్యవస్థ లన్నిటికీ  పరమాణు కేంద్రం  అడవి.  గిరిజనుల జీవన వలయాన్నిజీవన  చిత్రంగా కాక ప్రమేయంగా రాజ్య వ్యవస్థ భావిస్తుంది. వనరుల పై ఆధిపత్యం కోసం వాట్ని వర్గీకరించింది.గిరిజనులకు అడవిని ఉమ్మడిగా చూసే వ్యవస్థలో అడుగడుగునా కంచెలు ఏర్పడ్డాయి.ఈ వర్గీకరణలో కలప,పశు పోషణ కోసం పచ్చిక బైళ్ళుగా మార్చడం,ఆధ్యాత్మిక చింతన కోసం వనాలు, రాజ్యపాలన అనంతరం  విశ్రమించేందుకు వనాలు, వేట కోసం ప్రాంతాలు గా వర్గీకరణ జరిగింది. వీటి మూలాలు ఇతిహాస కాలాల నుండి వున్నాయి.ఈ వర్గీకరణ గిరిజనుల జీవనాన్ని  సంక్షోభంలో పడేసింది.  ఉదాహరణకు ప్రముఖ చరిత్ర కారిణి రొమిల్లా  థాపర్ ఖాండవ దహనాన్ని విశ్లేచించిన తీరులో తెల్సుతుంది,  పశుపోషణ కోసం అడవి ప్రాంతాన్ని పచ్చిక బైళ్ళు గా మార్చడానికి ఖాండవ దహనం జరిగింది. ఆ కాలంలో రాజ్య వ్యవస్థకు పశుపోషణ కీలకం.
 అదే గిరిజనులు పశుపోషణ చేస్కుంటుంటే అది అడవుల్ని నాశనం చేస్తుందన్న అభియోగం ఇప్పటికీ  కొనసాగుతోంది ,అది ప్రకృతి వినాశకరం  అని శాస్త్రీయ జ్ఞానంతో నొక్కి వక్కాణిస్తారు. పశు పోషణ పై ఆధారపడిన వారు ఒకే ప్రాంతంలో వుండరు ,పచ్చిక బైళ్ళను అన్వేషిస్తూ తిరుగుతారు. వాళ్ళు చినుకు జాడను పసిగట్టే జ్ఞానులు. ఇక్కడ తిరుపతి పక్కన తలకోన దగ్గర ఓ చిన్నపిల్లాడు పశువులు కాస్తూ అన్న మాట ఎప్పటికీ మర్చిపోలేను. అన్నాఈ  అడవిలో పశువులు కాస్తే అడవి నాశనం అవుతుందని పారెస్ట్ వాళ్ళంటారు, పశువుల్ని  మేపుకోనివ్వరు,ఇది అభయారణ్యం అంట. మరి  అడవిలోకి పశువులొచ్చి గడ్డి మేస్తుంటే కదన్నా గడ్డి  తక్కువవుతుంది, నలిగి పోతుంది. అప్పుడు అడవికి నిప్పు బెడద తగ్గుతుంది కదా . ప్రతి వేసవి కాలం లో శేషాచలం అడవులు తగల బడుతూనే వున్నాయి. మరి శేషాచల వాసుడి  చెవిలో ఇది ఎప్పుడు పడుతుందో,రోజూ అయన తలుపులు తెరచి భక్తులకి ప్రవేశం ఇచ్చేది ఈ  కాపర్లే కదా.  మరి వారి  జీవనానికి అడ్డంకులు పెరుగుతూనే పోతున్నాయి తప్ప తొలగటం లేదు. ఇదే విషయాన్నీ2002 కాలంలో  హైదరాబాద్ హరిణ వనస్థలిపురం జాతీయ పార్క్  విస్తరణ అప్పుడు (నిజాం కాలంలో వనస్థలి పురం-జంతువుల వేట స్ధలం )అక్కడే వుండే ఓ పెద్దామె ఫారెస్ట్ అధికారితో అంది  సారూ మీరు ఇంటికాడి నుండి ఈడ్కి అచ్చేటప్పుడు,ఇంటికాడ నాస్థా చేసొచ్చినారు ,ఎందు కంటే ఇంటికాడి బువ్వ ఆరోగ్యం అని, మరి మా పశువులకు కూడా అడవిలోని బువ్వ ఆరోగ్యం సారూ.వాట్ని ఆడ్కి  తొల్క పోకపోతే ఎట్లా” - స్థానికుల నాడిని ఎప్పుడూఅర్ధం చేసుకోలేదు అన్న దానికి ఇంత కంటే వివరణ చెప్పలేను. కానీ వారి మాటలు అశాస్త్రీయం అని   వలస వాదం వల్ల ఇంకా ఎక్కువైయ్యాయి.  రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్,ఇబ్రహీం పట్నం,చుట్టుపక్కల ప్రాంతాల్లోని అడవులు పచ్చిక బైళ్ళు గా  ప్రసిద్ధి,వీట్ని కంచెలు అని కూడ అనే వారు ,కారణం ఆ గడ్డిని వేలం లో అమ్మేవారు ,ఆ వేలం ఎక్కువగా భూస్వాముల ఆధీనం లోనే  వుండేది. గడ్డి మీద అధికారం కోసం తిరుబాట్లు జరిగాయి. ఈ సందర్భంలో ‘సుద్దాల హనుమంతు రాసిన పాట పల్లెటూరి పిల్లగాడ,పసులు కాసే పోరగాడ’  ఇంకా ప్రతిధ్వనిస్తూనే వుంటుంది.   ( ఇక పై   ఈ ఉపోద్ఘాతాల్ని ఒక్కో జీవావరణ జీవన రేఖల్ని వివరణ గా చెప్పుకుంటూ వస్తాను.)
అడవి అనేది కేవలం కొన్ని వృక్షాలతో ఇమిడిన ప్రాంతం కాదు. మట్టికి,మట్టి మనసులకి   శ్వాసనిచ్చే గాలి మర. చరిత్ర పాఠాల్లో అడవిని బందీని చేయడం ,స్థానిక గిరిజనులు వ్యక్త పరచిన అభియోగాలు రాయకుండా జాగ్రత్త పడడం జరిగింది.అడవి అనేది ఎంతో నిగూడమైన మర్మం ,  అందులో నివసించే గిరిజనుల జీవన వలయంలో  ప్రతి ఘడియ  ఒక యుద్ధమే, అయితే ప్రకృతితో కాదు బాహ్య రాజ్య వ్యవస్థలతో. ప్రకృతి వలయంలో వేటాడేది,వేట కావించబడేది మధ్యన  కొంత విశ్రాంతి సమయం వుంటుంది,ఆకలేసినప్పుడే వేట జరుగుతుంది.రాజకీయ సామాజిక వ్యవస్థ లో ఈ విశ్రాంతి ఘడిలుండవు, ఆకలే వేటైనప్పుడు ప్రతిదాని మీదా యుద్ధమే!  కానీ గిరిజనులు ఆ జీవనాన్ని ఒక యుద్ధంగా భావించ లేదు ,చడీ చప్పుడు కాకుండా ప్రకృతి సంరక్షిస్తూనే వున్నారు. ఈ సంరక్షణ వెనుక వున్న  యుద్ధం గురించి తెలియటం లేదు ప్రకృతి పైన వారి ప్రేమనే ప్రతీకలుగా చెప్పుకుంటూ పోతున్నాం. అడవిలో ప్రతి చెట్టు ఆకుల పైన ఓ రణ గీతం  సోకుతూనే వుంది.  
ఓ ఆకు  ప్రేమలో,యుద్ధంలో

స్వచ్చమైన చెట్లు,ముదురు రంగుల హారాలు 
నేలతో ఐక్యమవుతూ
ఎండిపోవడం  ఎరుగదు;
ఆకుల పైన  రంగులు
కళ్ళలోని సమూహం .
మనం ఆకుల్ని చూశాం
నగలతో ముస్తాబైన స్త్రీల పైన,
ఘనీభవించిన
వారి ప్రేమ రూపం మీద,

ఇప్పుడు స్వచ్చమైన దండ తెగి పడి వుంది
భూమి మీద,ఎంత మారింది,ఎంతగా మిళితమైపోయిందో
రక్తంతో, రాబందువులు తమ ముక్కుతో రక్కేస్తునాయి
పచ్చి మాంసపు ముద్దలనుకుని.

ఇదీ మనం చూస్తున్నాం
 ఎందుకంటే  ఓ  నవ యువకుడు
యుద్ధం మీద ప్రేమతో
వాట్ని విజయ కేతనంగా ధరించాడు.
(రెండు వేల సంవత్సరాల క్రితం తమిళ భాషలో రాసిన కవిత.ఆంగ్ల మూలం, ఎ.కే. రామానుజం)
(అనుసృజన)

ఈ కవితలో ఆకుల రంగుల్ని వివిధ సందర్భాల్లో  ప్రతీకను కవి జెక్ష్ టాపోస్  చేసాడు, ప్రేమలోని కలయిక లో ,యుద్ధంలో  .ఇది బాధని సుతిమెత్తంగా మన గూట్లోకి చేరుస్తుంది. పర్యావరణ కవిత్వం  మనలోని సునిశితను తట్టి లేపే అనగనగా అల్లిన ప్రకృతి పాట. అందుకే పర్యావరణ కవిత్వం ఒకరి ప్రతీకే, ఒకరి ప్రతిరూపం కాదు, ఎవరి మొహాలు వాళ్ళు చూసుకునే సొంత అద్దం  కాదు, చెరువులోని చేప పిల్ల నోటిబుడగ లోని అందరి ప్రతిరూపం. 

0 comments:

Post a Comment