Tuesday, 24 March 2015 0 comments By: Satya Srinivas

మనో ‘గనులు’-పర్యావరణ ఉద్యమాలు-27

బ్రిటిష్‌ కాలంలోనే  ఆంధ్రప్రదేశ్‌లో, అరకులో ఖనిజాల శ్యాంపుల్‌ తీసుకున్నారు. అరకు, అనంతరగిరి ప్రాంతాల్లో గాలికొండ, రక్తకొండ ప్రాంతంలో బాక్సైట్‌ ఖనిజాల తవ్వకాల వల్ల సుమారు రెండు వందల గ్రామాల్లోని వెయ్యిమంది గిరిజన కుటుంబాలకు ప్రత్యక్షంగా నష్టం వాటిల్లుతుంది. దీనికి వ్యతిరేకంగా 1992 నుండి పోరాటం కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో ఉద్భవించే సహజ ఊటల నీరు గోస్తానీ నది ద్వారా పల్లపు ప్రాంతానికి చేరుతుంది. విజయనగరంలోని తాడిపూడి రిజర్వాయర్‌కు ఇదే ఆధారం. 1/70 చట్టం, పీసా. అటవీ హక్కుల చట్టం, సమత తీర్పు అన్నింటిని ఉల్లఘించి ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు గనుల తవ్వకానికి లీజులు ప్రతిపాదిస్తోంది. కంపెనీ వారు ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో ఏదో రీతిలో గనుల తవ్వకం చేపట్టాలని శత విధాల ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక యువకులకు డబ్బులు ఎరచూపి పోరాటాన్ని బలహీనపర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ కథ కూడా అదే. వ్యతిరేక గొంతులను నక్సలైట్లన్న పేరుతో కేసులు బనాయించడం, ప్రభుత్వం, కంపెనీ వారు నిర్వాసితులకు ఎటువంటి నష్టపరిహారం ప్యాకేజీలు ఇస్తారో అన్నది మీమాంస .
ప్యాకేజిల్లో మనలో ఇమిడిపోయిన మన చుట్టు పక్కల  ప్రకృతి నష్టపరిహారంగా లభించదన్నది వాస్తవం.ఇది మన నుండి మనని ఎలియనేట్ చేస్తుంది.అంతర్లీనంగా మనలో మనం నిర్వాసితుల శిబిరంలో వున్నట్లు జీవిస్తాం. ఇది ఎలా అంటే...
విశాఖ జిల్లా అనంతగిరి మండలం ,వోలాసి పంచాయతిలోని నిమ్మలపాడు గ్రామంలో బాక్సైట్ మైనింగ్ చేపట్టే ప్రాంతం. 1994 లో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక రాత్రంతా  ఊర్లో వాళ్ళతో  మైనింగ్ విషయం పైన చర్చలు జరిగాయి. ఊర్లోని పెద్దలు మైనింగ్ కి  వ్యతిరేకంగా , యువకులకు  ఉద్యోగాలు దొరుకుతాయన్న మీద రాత్రంతా జరిగిన చర్చలకు ముగింపు దొరకలేదు. మర్నాడు కాలకృత్యాలు తీర్చుకోడానికి వెళుతునప్ప్పుడు ఆ వూరి పెద్దాయన అందరితో  చుట్టూ పక్కల వున్న ప్రకృతిని చూపిస్తూ అన్న మాటలు “ఈ కొండ, ఈ వాగు, ఈ వంక, ఈ చెట్టు ,ఈ నేలలో దేవుడున్నాడని పూజించం, అవి మనకి బతకడానికి తిండి,గాలి, నీరు నిస్తాయని పూజిస్తాం, అందుకే వాట్టిల్లో దేవుళ్ళు వుంటారు, వాటిని అమ్మడం అంటే మనని మనం  అమ్ముకోవడమే”. ఈ మాటలు ఎంగెల్స్ తన డైలెక్ట్స్ఆఫ్ నేచర్ లోను ధ్వనిస్తాయి. ఈ పెద్దాయన వల్ల  పొందిన స్పూర్తి నన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు. మైధాలజిని మతంతో జమకట్టకూడదన్న విషయం కుడా అప్పుడే నాకు బాగా అర్ధమైంది.
ఈ విషయాల్ని మిత్రులు చిక్కటి పచ్చదనమున్న టి. శివాజీ గారి తో చెప్పుకున్నా. అయన దీనికి ఒక కధ రూపం, డైలాగులు రాశారు, వాటికి మిత్రులు రాజు గారు బొమ్మలు వేశారు. అది వార్త పత్రికలో వచ్చే లింగా ది గ్రేట్ అన్న కామిక్ సీరియల్ లో అరకు లో అల్లుడు  అన్న శీర్షిక కింద నవంబర్- డిసెంబర్,1996లో అచ్చయ్యింది. బహుశా సమకాలీన పర్యావరణ ఉద్యమాల గురించి ప్రపంచంలో, మన దేశంలో ఒక సీరియల్ గా  అచ్చయిన, అరుదైన కార్టూన్ సీరియల్  ఇది.ఒకసారి మాటల్లో శివాజీ గారన్నారు ఇది చాల భారతీయ బాషలలో కూడ అనువదించబడిందని.
నిమ్మలపాడు గోడు నిమ్మలపాడుకే  పరిమితం కాలేదు, కొండ దేవుడి మాటలు పల్లపు ప్రాంతంలో కూడ విన్పించాయి. మాతో బాటు సేలం కి వచ్చిన దేవుడమ్మ,కడప మిత్రుడు విజయ్ కుమార్  ఇదే గోడుని ప్రస్తావించారు.
శృంఖలాల కోట...
దేవుడమ్మ(టి.వి.9, నవీన మహిళ అవార్డు గ్రహీత) . తల్లిదండ్రుల్ని తాటిపూడి రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా నిర్వాసితుల్ని చేశారు. ప్రస్తుతం వారు విజయనగరం జిల్లాలోని ఎస్‌.కోట మండలం,కిలతంపాలెం పంచాయతీలోని రామన్నపాలెంలొ  ఉంటున్నారు. ఆమె తల్లి దండ్రులు జొన్నలుసోళ్లుదినుసులు పండించేవారు. ఆమె తన పొలంలో వరి,పెసరలుమినుములుచెరుకు పండిస్తోంది. అంతా సజావుగానే ఉంది. ఇక ఇన్నేళ్ళకు స్థిరపడాం,భవిష్యత్తు బాగానే ఉంటుంది అనుకుంటున్న కాలంలో జిందాల్‌ కంపెనీ ప్రవేశం. ఒక రోజు వూర్లో ప్రభుత్వ అధికార్లు భూమి సర్వే మొదలు పెట్టారు. ఇది చిన్న పిల్లలు చూసి తల్లిదండ్రులకు చెప్పారు. గ్రామస్థులందరు ప్రభుత్వ అధికారులను ప్రశ్నించగా అధికార్లు ఇక్కడ కంపెనీ వస్తుంది మీకు ఉద్యోగాలొస్తాయని అన్నారు. ఎకరానికి 75,00 రూపాయలు నష్టపరిహారమిస్తామన్నారు.. ప్రజలందుకు ఒప్పకోలేదు. ఎంఆర్‌ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సంఘటన తర్వాత జాయింట్‌ కలెక్టర్‌ప్రభావిత మూడు పంచాయితీల గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. కంపెనీ వల్ల లాభాలు వివరించారు.  యింటికొక్కరికి ఉద్యోగo, పది సెంట్ల ఇళ్ళ స్థలంఉచిత కరెంట్‌నీరు అందిస్తామన్నారు. ఎకరానికి 1,25,00 రూపాయలు ఇస్తామన్నారు. ప్రజలు డబ్బు వద్దుకావాలంటే మీ జీతాలు పెంచుకోoడి, వేరే దేశం పొండిమేం మటుకు భూములు వదలం అన్నారు,అయితే మా పొలాలకు తాడిపూడి రిజర్వాయర్‌ నీరు ఇవ్వండి అని కూడా అన్నారు.
                ఇది జరిగిన తర్వాత గ్రామస్తులకు భూసేకరణకు సంబంధించి ఎ-నోటీసులొచ్చాయి. గ్రామస్థులెవరూ తీసుకో లేదు. అధికార్లు వాటిని గ్రామంలో గోడలకు అతికించి వెళ్ళారు. నోటీసులు తీసుకోకపోతే వారిపై కేసులు పెడతామనితీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్త్తుందని కూడా హెచ్చరించారు. అయినప్పటికీ ప్రజలు భూములివ్వలేదు. బాక్సైట్‌ వ్యతిరేక పోరాట కమిటి అన్నది ఏర్పరచుకున్నారు. ఇందులో మొత్తం 50 మంది సభ్యులు, 20 మంది పురుషులు, 30 మంది మహిళలు. ఈ కమిటీని చెల్లాచెదరు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం వారిలో కొందర్ని విడిగా పిల్చి రహస్య చర్చల ద్వారా ఆశలు రేపింది. ఫలితం కొందరు విడిపోయారు. తర్వాత కీలకపాత్ర వహిస్తున్న ఐదుగురు మహిళలతో ఇదేవిధమైన మంతనాలు జరిపారు. ఫలితం ఇద్దరు మహిళలు వెళ్లిపోయారు. దేవుడమ్మకు 3.75 ఎకరాల భూమి రసీదు తీసుకు వచ్చి ఇచ్చారు. ఇందులో సర్వే నెం:131 అన్నది రాసి ఉంది. ఈ ప్రలోభాలకు ఆమె  లొంగలేదు. ఆమె భర్తని విడిగా తీసుకెళ్ళి మంతానాలు జరిపారు. ఆయన ప్రతికూలనగా లొంగిదేవుడమ్మ మీద వత్తిడి తీసుకు వచ్చాడు. అయినా ఆమె  లొంగలేదు. పోరాటం కొనసాగిస్తూనే ఉంది. పోరాటం సాగిస్తున్నవారoదరూ భూ నిర్వాసిత కమిటీగా ఏర్పడి పది రోజుల పాటు ధర్నా నిర్వహించారు. ఆ కాలంలో ప్రభుత్వ అధికార్లు వీరి భూముల్లో మళ్ళీ సర్వే చేశారు. ఇది గ్రహించిన గ్రామస్థులు కొందరు అధికార్లను గ్రామంలో కట్టేశారు. ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఆ తతంగం కొనసాగింది. చివరకు గ్రామస్థుల భూముల జోలికి రాము అన్న లిఖిత పూర్వకంగా ఒప్పందం మీద అధికార్లను విడిచిపెట్టారు. ఇది జరిగిన పది రోజులకు గ్రామస్థులు ఎంఆర్‌ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికార్లు, 41 మందిని సబ్‌ జైల్‌కు తరలించారు. చివరకు వారిని కండిషనల్‌ బెయిల్‌పై విడుదల చేశారు. వీరు తమ గ్రామంలోని తమ కుటుంబీకులతో కలవ కూడదన్నది షరతు.  దేవుడమ్మ మీద కూడా కేసులు పెట్టారు. ఆ కాలంలో దేవుడమ్మకు సమత సంస్థ అండగా ఉంది. గతంలో కనిపించిన రాజకీయ పార్టీల నుండి తగిన సహకారం అందలేదు. లోక్‌ సత్తా,బీజేపీరాష్ట్ర నాయకులు ఆమె గ్రామాన్ని ఈ సందర్భంలో సందర్శించినప్పుడు స్థానిక నాయకులు కనుచూపు మేరలో కనిపించలేదు.
                ప్రభుత్వం మూడు పంచాయితీలలో సుమారు రెండు వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. అందులోని కొంత  భాగంలో ప్రహరీ గోడను నిర్మించారు. కొన్ని చోట్ల ఈ భూమిపై ఎవరైనా అడుగు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోనాల్సి వస్తుంది అన్న హెచ్చరిక బోర్డులు పెట్టారు. వాట్ని గ్రామస్తులు పెకిలించి” గిరిజనుల భూములపై అడుగుపెడితే వారికి సమాధి కడతాంఅన్న హెచ్చరిక బోర్డు పెట్టారు.
పబ్లిక్‌ హియిరింగ్‌కు ముందుగానే భూముల సర్వే చేపట్టారు. ముందుగానే కంనెనీ తన మనుషుల చేత గ్రామంలో డబ్బులు వెదజల్లింది. కంపెనీప్రభుత్వం కలసి తమకనుగుణంగా పబ్లిక్‌ హియిరింగ్‌ చేయాలన్న ప్రయత్నం చేసింది. ప్రజలు పబ్లిక్‌ హియిరింగ్‌లో తమ గోడు వినిపించారు. ముఖ్యంగా మహిళలు. అయినా ప్రభుత్వం కంపెనీ మాటలకే అనుమతి మంజూరు చేస్త్తోంది. దేవుడమ్మ గనులకుకంపెనీకి వ్యతిరేకంగా చేస్తున్న నినాదం ప్రతిధ్వనిస్తూనే ఉంది.

గడప గడపకి ఇదే వ్యధ...
 కడప జిల్లాలోని పులివెందులలో యురేనియం మైనింగ్ కధ: పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో యు.సి.ఐ.ఎల్‌. వారు యురేనియం మైనింగ్‌  ప్రాజెక్టు మెదలుపెట్టారు. దీని వల్ల ప్రభావితమయ్యే గ్రామాలు తుమ్మల పల్లె, మబ్బుచింతలపల్లె,  భూమయ్యగారి పల్లె, రాచకుంటపల్లె,  మీదిపెంట్ల కోట,  కనం క్రింద కొట్టాలు.

ఈ ఆరు గ్రామాల్లో 80%  మంది వ్యవసాయ భూములున్నవారే. వర్షాధారంబావులుబోరుబావుల కింద పంటలు సాగుచేస్తారు. ప్రతీ గ్రామంలో పశుసంపద ఆవులుబర్రెలుమేకలుగొర్రెలున్నాయి.  మైనింగ్‌ ప్రాంతం 6 గ్రామాలకు మధ్యలో  తుమ్మలపల్లె లో వుంది. పులివెందుల నుండి అనంతపురం జిల్లా కదిరి  బస్సు రోడ్డు దగ్గర టెయలింగ్‌ పాండ్ ఉంది.
 ఇక్కడ రైతులు వేరుశెనగకందిఆరికకొర్రధనియాలునువ్వులుశెనగఆముదాల పంటల్ని వర్షాధారంతో సాగుచేస్తారు.  అరటిచీన (బత్తాయి)దానిమ్మచిన్న నిమ్మమిరప పంటలు బావులుబోరువావుల ద్వారా పండిస్తారు.

భూగర్భజలాలు 120 అడుగుల నుండి 200 అడుగులలోతులో  బోర్లు వేస్తారు. కరెంటు మోటార్లు 130 అడుగుల నుండి 160 అడుగుల మధ్యలో బిగిస్తే మంచినీరు పంట పొలాలకు సమృద్ధిగా వస్తాయి.
          ఈమైన్స్ కు అతి సమీపంలో రిజర్వ్‌ ఫారెస్టు ఉన్నందువల్లఇక్కడ నుండి రాచకుంట పల్లెకు ఊటనీరు పారుతుంది,  తుమ్మలపల్లె,మబ్బుచింతలపల్లెకు మధ్యన రిజర్వ్‌ ఫారెస్టు నుండి ఊట నీరు పారుతుంది. ఈ ఊటనీటిని గ్రామాల పశువులువ్యవసాయ కూలీలు ప్రతినిత్యం తాగుతారు. అలాగే మీదిపెంట్ల కోట దగ్గర నిరంతరం ఊటవంక పారుతుంది. ఈ నీటిని భూమయ్యగారి పల్లెమీదిపెంట్ల కోట పశువులుపశువుల కాపర్లువ్యవసాయ కూలీలు తాగుతూ ఉంటారు. ఈ గ్రామాల ప్రజలు ఇక్కడ బట్టలు ఉతుక్కుంటారు.
          యు.సి.ఐ.ఎల్‌. కంపెనీ యురేనియం మైనింగ్‌ ఓపెన్‌ కాస్ట్‌ పద్ధతిలో  జరుగుతుంది600 అడుగులు మైన్స్‌ తవ్వడం వల్ల నిరంతరమూ పారే ఊట వంకలు పూర్తిగా కలుషితమై ఎండిపోతాయి. యురేనియం శుద్ధి చేయు ప్రాంతం ఈ 6 గ్రామాల మధ్యనే  గాలి ద్వారా పర్యావరణం పూర్తిగా పాడవుతుంది. భూగర్భ జలాలు కలుషితమవ్వడమే కాకవ్యవసాయదారులు వేసుకున్న బోరుబావుల నీరు కలుషితమవుతాయిపూర్తిగా ఎండిపోతాయి.
          కొద్దో గొప్పో పారే వంకల నీరు కలుషితమైపోయిపశువులుఅడవి జంతువులు ఈ నీరు తాగి అశ్వస్ధతకు గురికావడమో లేదా చనిపోవడమో జరుగుతుంది. ఈ ఊట వంకలు పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. అంతేకాక 6 గ్రామాల్లోని 3,382 మంది జనాభా అనారోగ్య పాలయ్యే అవకాశాలు కోకొల్లలు.

పర్యావరణ విధ్వంసం ఒకే ప్రాతానికి పరిమితమవ్వదు, అంతటా పరివ్యాప్తి చెందుతుంది, అక్కడ జరిగింది ఇక్కడ మనకెందుకు అనే వదిలేసే గుణం సమాజంలో వున్నా, ప్రకృతిలో ఆ నైజం లేదు. కవిత కూడా ఒక బాషలో ,ఒక ప్రాంతం లో పుట్టినా అది విశ్వమంతా పరివ్యాప్తి చెందుతుంది, అందుకే అనువాదాలు. కవితలోని సారాంశం విశ్వజనీన మైనప్పుడు ,దానికి భాష అడ్డం రాదు. భావన మనస్సులోని పచ్చదనం పై చిరు  జల్లు కురిపిస్తుంది.
క్యూబన్ కవి నికొలస్ గిగేన్, క్యాన్ యు.. కవితలో అన్నట్టు ( నౌడూరి మూర్తి గారి వ్యాసం కవిత్వంతో ఏడడుగులు 60,కవి సంగమం, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు)

నువ్వు ఆకాశాన్ని అమ్మగలవా?...
ఒక్కోసారి నీలంగా,
మరోసారి తెల్లగా ఉండే
ఒక చిన్న ఆకాశం ముక్క.
నీ తోటలో చెట్లతోపాటే కొనుక్కున్నాననుకున్నఆకాశం ముక్క,
ఇంటితోపాటే, ఇంటికప్పుకూడా కొనుక్కున్న వాడిలా...
నాకో డాలరు ఖరీదు చేసే ఆకాశం,
ఓ రెండుమైళ్ళ ఆకాశం,
పోనీ ఓ చిన్న ముక్క
ఎంత వీలైతే అంత
ఆకాశం అమ్మగలవా?
(13-22 పంక్తులు)
ఈ సంఘటనలన్నీ ప్రకృతి వనరుల్ని అమ్మకపు  వస్తువులుగా మార్చే ప్రక్రియను అభివృద్ధిగా  నిర్వచించే కాలం గురించి చెప్తాయి. మనం మన ముందు  తరాలకి ఆకాశంలోని నక్షత్రాలని కూడా  రంగు కాగితంతో కొన్న మరో కాగితపు బొమ్మగా గోడ మీద వేలాడదీసి చూపిస్తాం. ఈ మొత్తం క్రమంలో ఒకటి మాత్రం నిజం- మనలోని అవయవాలు కూడా రంగు కాగితాల సంతలో ముడి సరుకులే!

నాకు కొంచెం మట్టిని అమ్మగలవా?
చెట్లవేళ్ళు చొచ్చుకుపోయిన చీకటిమట్టి,
పోనీ రాక్షసబల్లుల దంతాలూ,
ఏనాటివో అస్థిపంజరాలనుండి
చెల్లాచెదురైన సున్నం అమ్మగలవా?
నాకు భూకంపాలలో సమాధి అయిన అడవులూ,
చనిపోయిన పక్షులూ,
చేపల శిలాజాలూ,
వేలకోట్ల సంవత్సరాలబట్టి లోలోపల ఉడుకుతూ,
పైకి వెదజిమ్మిన అగ్నిపర్వతాల
లావాలోని గంధకాన్ని అమ్మగలవా?
నాకు ఆ అగ్నిపర్వతాల నేలని అమ్మగలవా?
భూమిని అమ్మగలవా? నిజంగా?
(పంక్తులు-43-55)
మట్టి, మట్టిలోనిది, మట్టి పైనది అంతా ముడిసరుకు గా జమ కట్టి నప్పుడు ఆకాశం ఓ నిర్మానుషమైన శ్మశాన వాటిక లానే కనపడుతుంది. అప్పుడు అందులో రెప రెప లాడుతూ  రగిలే చితి మంటల్లో తిరిగే  సూర్యుడు కాటి కాపరిగానే కనిపిస్తాడు.

 దేవుడమ్మ కూడా ఇవే ప్రశ్నల్ని అడిగింది, అలానే ప్రపంచ వ్యాప్తంగా చాల మంది దేవుడమ్మల గొంతులోని గుటకకి అడ్డం పడుతున్న ప్రశ్నలు ఇవే...

అందరి కాళ్ళ క్రిందా నలిగే,
నీదనుకుంటున్న ఈ నేల నాది కూడా.
అది ఎవ్వరిదీ, ఏ ఒక్కరిదీ కాదు.
(పంక్తులు-56-58)
ఈ ప్రశ్నా పత్రమే పర్యావరణ కవిత్వం , వీటికి జవాబులు ఏ ఒక్కరి వల్లే  దొరుకుతుతాయి అన్నది లేదు, కాదు కూడా! పీల్చే గాలి కళ్ళని  తాకితే చెపుతాయి, దేవుడమ్మ మట్టి కాళ్ళ సవ్వడి  వేదాన్ని , ఆ కాళ్ళ కింద ఖననమమవుతున్న జీవ ఘోషని. ఈ ఘోషని శిధిలమవ్వకుండా  ప్రతిధ్వనింప చేయడం పర్యావరణ కవిత్వం.

ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో వనరులని వేగవంతంగా వేలికితీయగల సామర్ధ్యంతో బాటు త్వరగా గ్లోబల్ బిడ్డింగ్ చేయగలం.ఇపుడు జరుగుతున్న భూమి, మైనింగ్ చట్టాల సవరణలు కేవలం కాగితాలు కావు, అవి సామాజిక ప్రకృతి నైసర్గిక  స్వరూపాన్ని మార్చే ఇంధనాలు.ఇవి    భూమినల్లుకున్న మట్టిని దానితో పెనవేసుకున్న ఖనిజ  గుణాన్నిఖననం  చేసే సాధనాలు. ప్రకృతినే మనం  ఖననం చేయడం లేదు, మనలోని ప్రకృతిని కూడా చేసుకుంటున్నాం, మనని మనలోని ప్రకృతి   నుండి దూరం చేసుకునప్పుడు , మనం ముందుగా విక్రయ వస్తువులుగా మారుతాం. దీనిని పరిణామ క్రమంలో ఎదిగామంటే ఆలోచించాల్సిన విషయమే. మనం సోల్ లెస్ నేకేడ్ ఏప్స్ అవుతామేమో! ఈ భూమ్మీదున్న ఎలియన్స్ మనమే కావచ్చు.
వ్యక్తిత్వ అభివృద్ధి జీవితాంతం కొనసాగే చర్య,మనోగతం ఒక కధలా నిరంతరం పరిణతి చెందుతుంది. కాని దేవుడమ్మ లాంటి వాళ్ళకి మటుకు అది పరమపద సోపానం. మైనింగ్ కోసం ప్రయత్నాలు అంతం లేని సీరియల్ కిల్లర్ కధల్లా ఎప్పటికీ కొనసాగుతాయి.
అందుకే మైనింగ్ కి సంబంధించిన పర్యావరణ కవిత్వం ఒక ప్రాసెస్, ప్రోగ్రెస్ డాక్యుమెంటేషన్ లా ,ఒక కోహర్ట్ అధ్యయనం లా వుండాలి. సీక్వెల్ కవితలు రాయాలి.
ప్రభుత్వాలు మారినపుడల్లా మర్చిపోయామనుకున్న మైనింగ్ మళ్ళీ,మళ్ళీ తెర మీదకి  వస్తుంది, అది విశాఖ లోని బాక్సైట్ మైనింగ్ లోనే కాదు సర్వత్రా  జరుగుతోంది. అపారమైన ఖనిజ సంపదున్న నేల  అభివృద్ధి పేర్న ఏర్పడ్డ  యుద్ధ భూమి.అక్కడి  వాళ్ళ కంటే అక్కడ ఎప్పుడూ ఎక్కువగా కన్నేసి  వుండేది ప్రపంచంలోని సమస్త భూమికలు.  అక్కడి వారికి గాలి ప్రశాంతమైన  శ్వాసనివ్వదు. నేలకు పహారా కాసే చౌకి చూపులా ప్రసరితమవుతూ వుంటుంది , ఆ ప్రసారంలోని తరంగాల ఫ్రీక్వెన్సి మనని వెంటాడుతూనే వుంటుంది.Tuesday, 17 March 2015 0 comments By: Satya Srinivas

మనో ‘గనులు’-పర్యావరణ ఉద్యమాలు-26

మన దేశంలో కొన్ని ప్రాంతాలు ప్రకృతి రమణీయతకు ప్రసిద్ది, అక్కడ పర్యాటకం కూడా అంతే విసృతిగా అదాయం తెస్తుంది. కాని ఆ ప్రాంతంలో ప్రకృతి వనరులు ఎంత బీభత్సంగా దోపిడీకి గురవుతన్నాయన్నది వెలుగు లోకి రాదు.ఇక్కడ  ప్రకృతి కేవలం ఆనందానిచ్చే వస్తువు తప్ప ఇంకేమీ కాదు, అదే విధంగా ప్రకృతి, ఆదాయాన్ని పెంచే ముడి సరుకు.
ఆ రంగులు ఏ విధంగా మైనింగ్ పుణ్యామా  మారుతున్నాయో, మన దేశంలో వివిధ ప్రాంతాల్లో చూద్దాం!...
గోవా గోడు..
                దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా స్వాతంత్య్రం రాని ప్రదేశం గోవా. ముందుగానే కంపెనీలకు మైనింగ్‌ లీజులిచ్చారు. స్వాతంత్య్రం తర్వాత పోర్జుగీస్‌ వారు వెళ్ళిపోయినప్పటికీ, గోవాలో ఆ లీజులు అదే విధంగా కొనసాగేటట్టు ఒప్పందాలు జరిగాయి. అది 1961 నాటికి, నేటికి చర్చనీయంశంగా కొనసాగుతోంది. ఈ లీజుల వల్ల గోవా ప్రభుత్వాన్ని, విద్య, ఆరోగ్య, ఇతర కీలక వ్యవస్థలను కంపెనీలు విరాళాలు అందిస్తూ తమ ఆధిపత్యంలో ఉంచుకున్నాయి. గోవాలో బీచ్‌ల కంటే మైనింగ్‌ లీజులెక్కువ. ప్రస్తుతం ఇక్కడ 891 లీజులున్నాయి. బాక్సైట్‌, మ్యాంగనీస్‌ ఖనిజాలు కాక, ఇవి 100కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి.
                ఇప్పటికే గనుల వల్ల కాలుష్యం, నేల సారం కొట్టుకుపోవడం, ధూళి కాలుష్యం, తరచూ వరదలు . సర్వసాధారణమయ్యాయి. ప్రస్తుతం ఎక్కువ ప్రాంతాల్లో ఉన్న కంపెనీలు షాల్‌గాంవ్‌కర్‌, జెనకో, ఇంకా వేదాంత తన ఆలోచనలు ప్రతిపాదిస్తోంది.
                1913లో గనులకోసం భూములు తీసుకున్నప్పుడు ఎకరానికి అయిదు నుండి పది రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు. ప్రస్తుతం లక్ష నుండి 20 లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. నష్ట పరిహారo   వద్దు మా భూములు ఇవ్వం అంటే కథ పోలీస్‌ స్టేషన్‌కి చేరి పోలీసులు ఝళుం, కేసులు వగైరా,...అంతటితో ఆగక పంట పొలాలన్నీ కూడా ధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ రోజుకు ఒక గ్రామంలో సుమారు ఆరు వేల వాహనాలు తిరుగుతున్నాయి. దాని వల్ల  శబ్ధ కాలుష్యం ప్రబలుతుంది. ఈ మధ్యన చికెన్‌గున్యా వ్యాథి కూడా సోకిన సందర్భాలు వెలువడ్డాయి. ఇక్కడి ఖనిజ, నీటి సంపద జపాన్‌, చైనా దేశాలకు ఎగుమతి అవుతుంది. దేశానికి మటుకు కాలుష్యం, ధూళి, వనరుల క్షీణతఅనారోగ్యం దిగుమతి అవుతోంది. గనుల వల్ల గోవాలోని ఘోషల్లో ఇవి కొన్ని.........ఇంకాచాలా చిత్రాలు ప్రభావితుల గుండేల్లో శిధిలమై ఉన్నాయి.
తిరువన్నమలైలో దేవుడుకు కూడా ప్రభావితుడు..:
తిరువన్నమలైలో జిందాల్‌ కంపెనీ పెట్టడంకంటే  దానికి ముందుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇరన్‌ ఓర్‌ ఖనిజాన్ని తీసుకుని స్టీల్‌ ప్యాక్టరి పెట్టాలన్నది యోచన. ఈ ప్రకటన ద్వారా సేలంలోని స్థానికలు కొందరు, తిరువన్నమలై చుట్టుపక్కల ప్రజలకి సమాచారాన్ని అందించారు. స్థానికులు, కార్యకర్తలు, పబ్లిక్‌ హియిరింగ్‌కు 20 రోజులు ముందుగా ప్రభావిత గ్రామాల్లో ప్రచారం చేశారు. కంపెనీకి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది.
                తిరువన్నమలైలో గనులు చేపడుతున్న ప్రాంతాల్లో గౌతమ మహర్షి గుడి, స్థానిక గిరిజనుల దేవుడు కొలువున్నారు. గనుల తవ్వకం వల్ల ఈ గుళ్ళు పోతాయి. గనులున్న ప్రాంతమంతటా పలు ఔషధ మొక్కలు, సహజ ఊటలు ఉన్నాయి. ఇవన్నీ గనుల వల్ల క్షీణిస్తాయి. ఇరన్‌ ఓర్‌ కాక ఇక్కడ లైమ్‌స్టోన్‌, సోప్‌స్టోన్‌, ఎర్రమట్టి, లభిస్తుంది. ఎర్రమట్టిని స్థానికులు ఇళ్లకు ముగ్గుగా ఇంకా ఇతర అవసరాలకు వాడతారు. ఇంత ప్రాభల్యం, నమ్మకం ఉన్న కొండల్లో గనుల తవ్వకం జరగకుండా ఉండాలన్నదే ప్రజల కోరిక. సినిమాలు, ఇతర ప్రచార సాధనాలు వల్ల జరిగిన ప్రచారం వల్ల ప్రజలు, స్థానిక సర్పంచులు గనులకు వ్యతిరేకంగా పోరాటాన్ని బలపర్చారు.
                పబ్లిక్‌ హియిరింగ్‌ రోజున ప్రజలు అధికారులను 'మీరు ముందుగా పెద్ద దేవుళ్లున్న కొండలైన తిరుపతి వంటివి వదిలి, చిన్న కొండలైన, చిన్న దేవుళ్లున్న మా కొండల్లో గనుల తవ్వకం ఎందుకు  చేపడతారు, ముందుగా ఆ కొండల్లో గనుల తవ్వకం చేపట్టoడి. తర్వాత ఇక్కడకి రండి' అన్నారు. అంతేకాక ఎక్కడైతే గనుల తవ్వకం చేపడతారో అది వదిలి ' పల్లపు ప్రాంతంలో ఎందుకు పబ్లిక్‌ హియిరింగ్‌లు ? అడవిలో చెట్టు, పుట్ట, జంతువులు, పక్షులు ,సెలయేర్లు ఉన్నాయి. వాటితో కూడా పబ్లిక్‌ హియిరింగ్‌ పెట్టండి ' అన్నారు.
కంపెనీని ప్రోత్సహించే నాయకులకు ఓటు వేయొద్దనుకున్నారు. దానికి తోడు సర్పంచుల అండ కూడా ఉంది.
                ఇది గ్రహించిన అభ్యర్ధుల పార్టీల రాష్ట్ర నాయకులు ప్రజల వద్దకు ఛలో ! అని చెప్పి ప్రజలకు మద్దతు తెలిపారు. ఇప్పటికయితే కంపెనీని ఆపారు. కంపెనీ వారు 180 ఉగ్యోగాలు ఇస్తామంటున్నారు. ప్రభావిత అంచనా నివేదిక ప్రకారం 2.20 చెట్లు పోతాయి. స్థానికులకు ఉద్యోగాలు  ఎన్ని వస్తాయో తెలియదు. ప్రజల అంచనా ప్రకారం సుమారు పది లక్షల చెట్లు పోతాయి.  గతంలో 2005 నాటికి జపాన్‌ ప్రభుత్వసహాయంతో ఈ ప్రాంతంలో మొక్కలు నాటారు. మళ్ళీ గనుల తవ్వకం వల్ల ఆ ఎదిగిన మొక్కలను పెకలిస్తారు. మళ్ళీ పర్యావరణాన్ని  రక్షించడానికి మళ్ళీ మొక్కలు నాటతారు. బహుశా ఈ కారణం వల్లే మన దేశపు నేల మీద మొక్కలుండడం లేదు. ఈ కొండల్లో నుండి వచ్చే వాగుల మీద ఆధారపడి పెన్నదురు ఆనకట్ట నిర్మించారు. గతంలో ఈ ఆనకట్ట కింద 30,000 ఎకరాల సాగు అయ్యేది. 120 రోజులు నీళ్ళు అందేవి. ఇప్పుడు 90 రోజులు మాత్రమే నీళ్లందుతున్నాయి. ఈ ఆనకట్ట నుండి తిరువన్నమలై, చుట్టు పక్కల ఊర్లకి మంచినీరు అందుతుంది. గనుల తవ్వకం వల్ల ఈ నీరు కూడా పోతుంది. ఇదివరలో ఇది గోవాలో జరిగింది. అక్కడ, గ్రామస్థులకు రోజూ నీరందేది. ఇప్పుడు నాల్గు రోజులకొకసారి ట్యాంకర్ల ద్వారా నీరందుతుంది. మొక్క అయినా తడి గొంతయినా ఒకే పరిస్థితి. ఉన్నవి తీసేసి ఎండగట్టడం, తర్వాత అప్పడప్పుడు గొంతు తడపడం. గనుల తవ్వకాలు కేవలం ముడి ఖనిజాల కోసమేకాదు మొక్క, సుక్కని కనుసూపు మేరలో కనిపించకుండా చేయడానికి, మనుషులు, దేవుళ్ళు, ఋషులని కూడా ప్రభావితుల జాబితాలోకి జోడించుకుంటు పోడానికి!
మాల్కో..నువ్వు మేల్కో !
తమిళనాడులోని సేలం దగ్గర వేదాంత కపెనీ వారు బాక్సైట్‌ ఖనిజాన్ని తవ్వి అల్యూమినియం ఉత్పత్తి చేసే కర్మాగారం 16 కొండలున్న పర్వత శ్రేణుల నుండి ఖనిజాన్ని వెలికితీస్తారు. వచ్చిన వ్యర్థ పదార్థాన్ని కావేరి నది వద్ద ఒడ్డున పారేస్తారు. దీనితోపాటు కాస్టిక్ సోడాని  అదే విధంగా విసర్జిస్తారు. దిగువ ప్రాంతంలో కావేరి నది సుమారు 17 జిల్లాల్లో  ప్రవహిస్తుంది. ఇక పరిస్థితి ...... నీరు పల్లమెరుగు..నిజం దేవుడెరుగు ....కావేరి స్వచ్చమైనదని ఆ నదీ జలాల కోసం సంఘర్షణలు జరిగాయి. మళ్ళీ కావేరిని కలుషితం చేయవద్దని ప్రతిఘర్షణలు కావాలి !
మేటుర్‌ కత...
1936లో ఇక్కడ కావేరి ఒక చిన్న పాయిగా ఉండేది. స్వచ్చమైన నీరు, ఆహ్లాదమైన ఊరు. అప్పుడు బ్రిటిషు వారిక్కడ ఒక పత్తిమిల్లును ఏర్పరిచారు. సుమారు మూడు వేల మందికి ఉపాధి కల్పించారు. స్వాతంత్య్రం తర్వాత వెంకటస్వామి నాయుడు మాల్కో కంపెనీ పెట్టారు. స్వతహాగానే ఉద్యోగాలు వస్తాయని   ప్రజలు తమ భూమల్ని అతి తక్కువ ధరకి అమ్ముకున్నారు. కంపెనీ వారు సుమారు ఐదువేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. స్థానికులెవ్వరికీ ఉద్యోగాలు లభించలేదు. కంపెనీ నుండి వచ్చే వ్యర్థపదార్థాల వల్ల భూమి, నీరు  కలుషితమయ్యింది. గత 15 సంవత్సరాలుగా సాగుతున్న పోరాటం ఎటువంటి ఫలితాలను  ఇవ్వడం లేదు. కంపెనీ వాడి పుణ్యామా అని విద్య ఇతర వసతులు లభించకపోగా చుట్టు పక్కల మందు దుకాణాలు, ఆసుపత్రులు కోకొల్లలుగా వచ్చాయి. ఈ కంపెనీ మీద  అనుభవజ్ఞుల  రాసిన నివేదకలో వీరి దీనగాథను ప్రస్తావించినప్పటికీ, పరిష్కారాలు ప్రజలకు అందకపోగా కంపెనీకి మట్టుకు ఫలితాలిస్తున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా అది యధావిధిగా తన కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఇక్కడ కోల్‌ యార్డ్లో పనిచేసే వారి పరిస్థితి దుర్భరంగా ఉంది, 1996లో కంపెనీకి లీజు కాలం అయిపోవడం వల్ల అప్పటికి వీటికి తన బాధ్యత కాదని చేతులు దులుపుకుంది. పోరాటం కొనసాగుతూనే ఉంది.
 పర్యావరణ కవిత్వం అన్నది రాసే వారిలో చదివే వారిని, చదివే వాళ్ళల్లో రాసే వారిని అన్వేషించే దారి.   మనం సృష్టించే అక్షరానికి జీవం లేక పోతే , అది చదివేవారికి చలనం కలిగించే స్పందన ఇవ్వదు.ఒక నృత్యం, నాటకం ప్రక్రియలో ప్రేక్షకుడు కళ్ళముందు కనబడతాడు, కవిత్వంలో అలా కాదు. కవి ఒక ఆబ్స్ట్రాక్ట్ స్పేస్ ని సృష్టించి దానిని  పాఠకుడితో పంచుకుంటాడు. ఈ స్పేస్ లోకి పాఠకుడు తన స్పేస్ ని  తీసుకు వస్తాడు .ఇక్కడ కవివి, పాఠకుడివి అంతర్లీన ,బాహ్య స్పేస్ షేరింగ్ వుంటుంది తప్ప పూర్తిగా కలిసిపోవు. అది ఎలా అంటే, తీగల మీద కూర్చున్న పక్షులు వరుసగా కూర్చునప్పటికీ వాటి ఫిజికల్ స్పేస్ చుట్టూ కొద్దిగా ఖాళీని ఉంచుతాయి. మనo పార్క్ లో  బెంచి పైన కూర్చున్నప్పుడు ,అలానే కూర్చుంటాము. అదే విధంగా  కవిత, కవి, పాఠకుడి అంతర్లీన ,బాహ్య స్పేస్ షేరింగ్  కి స్పేస్ నిచ్చే తీగ. ఇది మనలోని మానసిక, శారీరక  స్పేస్ డైమెన్షన్.మన కళ్ళ ముందు విశాలమైన ప్రదేశం వున్నప్పుడు మన మనస్సు ,ఆలోచనలు అంతే విస్తారంగా సాగుతాయి, మన ముందు అ ప్రదేశం లేనప్పుడు ఆ రెండూ కుంచించుకు పోతాయి.
ఈ స్పేస్ డైనమిక్స్ అన్నవి ప్రకృతిలో క్షీణించిపోతున్నాయి, ముఖ్యంగా ఖనిజ సంపదకు జరిగే మైనింగ్ వల్ల భూస్వరూపం మారిపోతోంది. ఉదాహరణకి, విజయవాడ, విశాఖ పట్నం చుట్టుపక్కల తూర్పు కనుమల శ్రేణులు పోవడం వల్ల పూర్వం ప్రకృతి  , ఇప్పుడున్న ప్రకృతి రూపం లోనే తేడా ఏర్పడ లేదు, సామాజిక  సంబంధాల్లో కూడా తేడాలు చోటుచేసుకున్నాయి.
పర్యావరణ కవిత్వం ఈ స్పేస్ డైనమిక్స్  ని చెప్పే ఇంట్రా పర్సనల్ ,ఇంటర్ పర్సనల్ సంభాషణ. ఈ  సంభాషణ ఒక దృశ్యాన్ని చిత్రించే చిత్రకళ కాదు , దృశ్యాల  చలనచిత్రం. అందుకే ఇందులో భూత, వర్తమాన, భవిష్యత్తు రంగులుంటాయి.
ఈ రంగులు అభివృద్ధి సారాన్ని చెబుతాయి... ఇది అర్ధ రాత్రి పూట నిశబ్దాన్ని ఛేదించే గోడ గడియారం చిన్న ముల్లు శబ్దం లా విన్పిస్తుంది...

అభివృద్ధి మైనింగ్

చదరంగ పావుల్ని
కదపడం నేర్చుకోవాలి
ప్రత్యర్ధి పావుల్ని నడిపే
వ్యూహాన్ని పసిగట్టాలి
వారి ఆలోచనల్ని
నెమరేయాలి
రెండు మెదళ్ళ మధ్యనున్న
చదరంగ బోర్డులో
ఊహాచిత్ర పావులకి
జీవం పోయాలి
నిర్జీవం చేయాలి
ఎక్కడా రక్తపాతం వుండదు
వాటి మరకలూ కనిపించవు
యుద్ధమంతా
నలుపు తెలుపు గడుల్లో
తొక్కుడు బిళ్ళాట
కిటికు ఒక్కటే
ఆడేవాళ్ళు
మధ్యలో
యాం ఐ ఔట్
అని అడగాలి
ఇంతలో
టైం విల్ రన్ ఔట్
టిక్   టిక్  టిక్
భూవేర్లనంటిపెట్టుకున్న
ఖనిజాన్ని పెకలించే
అధునాతన యంత్రాలు
దూసుకుపోతాయి
అంతరిక్షం లోనూ
గుండెల్లోనూ...
అగుపించని ప్రత్యర్ధి
నీలోనూ
నాలోనూ
పబ్లిక్ హియరింగ్ లోనూ
టిక్  టిక్  టిక్...

(7-2-13, జి. సత్య శ్రీనివాస్)
Tuesday, 10 March 2015 0 comments By: Satya Srinivas

ప్రజల మనో ‘గనులు’-పర్యావరణ ఉద్యమాలు-25

మన దేశంలో అత్యంత ఖనిజ సంపద గల రాష్ట్రాలు అతి పేద రాష్ట్రాలుగా వున్నాయి. ఇది కేవలం మన దేశంలోనే కాదు, ఆఫ్రికా ఖండంలోనూ అదే పరిస్ధితి. ఈ ప్రాంతాలు అత్యంత దోపిడీకి గురవుతున్న ప్రాంతాలు. నా అనుభవం లో నాకు బాగా తెలిసిన విషయం ఏమిటంటే ప్రకృతి పచ్చగా వుందటంటే ,అక్కడ ప్రజల బతుకులు మాడి మసై పోతాయని.  ఈ ప్రాంతమంతటా గనులు విస్తారంగా వచ్చేస్తున్నాయి.గనుల వల్ల కేవలం ఖనిజ సంపదనే వెలికితీయడం లేదు. స్ధానిక సంస్కృతిని ఖననం చేస్తునారు. అక్కడ అంతా ఓ భయంతో కూడుకున్న వాతావరణం, తిరుగుబాటుకి పునాదులు మొలకెత్తే ఘడియలు చోటుచేసుకుంటున్నాయి.  ఓ 5-6 సంత్సరాల క్రితం తమిళనాడు సేలం లో గనులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నా. అందులో  వివిధ రాష్ట్రాలనుండి వచ్చిన స్ధానిక ప్రజలు, కార్య కర్తలు పాల్గొన్నారు. వారి మాటలు మీ ముందుచుతున్నాను... ఎవరికీ ఏమి తెలియదు. కాని ఎదురు తిరిగితే ఏమి జరుగుతుందో అన్నది స్ఫష్టంగా తెలుసు. కంపెనీ రాకమునుపే మన గూట్లో మనం అజ్ఞానంగా ఉండే వాతావరణం ఏర్పడుతోంది. ఇక కంపెనీ వస్తే ఎటువంటి కాలం ఉంటుందో అన్నది ఉహించుకోవడం పెద్ద కష్టం కాదు.ఇది కేవలం ఒక ప్రాంతం ప్రజల గోడు కాదు, తూర్పు కనుమల నిండా ప్రతిధ్యనిస్తున్న ఘోష.
ఒడిస్సా రాష్ట్రంలో లాంజిగడ్‌ ప్రాంతాలలో, ఆంధ్రా రాష్ట్రంలో అరకు, చింతపల్లి, పాడేరు, ఎస్‌. కోట, కడప, తమిళనాడులోని సేలం, తిరువన్నామలై, గోవా, జార్ఖండ్‌, ఛత్తీస్‌ఘర్, ‌ పశ్చిమ బెంగాల్‌ అంతా ఇంతే. ఒక కొండ పట్టుకుని దారమ్మటే వెళితే దారమ్మటంతా కొండ గోడు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఒరిస్సాలో వేదాంత కంపెనీ, లాంజిగర్‌, జార్సిగుడ ప్రాంతంలో అల్యూమినియం కంపెనీలు పెద్దవి. గనుల కోసం ప్రజలకు భూమి వదిలి పొమ్మని నోటీసులు అందాయి. దేవదాని సంగ్రామ్‌ పరిషత్‌, లోక్‌ శక్తి, వంటివి గనులు తవ్వకాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఇదే ప్రాంతంలో పక్షుల అభయరణ్యాం ఏర్పడానికి ప్రయత్నాలు జరిగాయి. దీని వల్ల 250 గ్రామలు నిర్వాసితుమవుతాయి. గనుల కోసం పబ్లిక్‌ హియిరింగ్‌ జరిగింది. ఇదీ ఒక కంటితడుపు పద్దతిలోనే అయ్యింది. వేదాంత కంపెనీ జార్సిగూడలో బాక్సైట్‌ ఖనిజాన్ని తీసుకుని లాంజిగర్‌లో శుద్దిచేసి కోర్బాలో అల్యూమినయం ఉత్పత్తి చేస్తుంది. జార్సిగూడ నుండి లాంజిగర్‌కి దూరం ఎక్కువ కనుక లాంజిగర్‌కి ప్రత్నామ్నాయంగా నియమగిరి కొండల నుండి ఖనిజాన్ని వెలికతీసే ఆలోచన మొదలయ్యింది. అదే తడువుగా భూసేకరణకు ప్రజలను భూమి వదలాలన్న నోటీసులు,ఈ విషయం మీద స్థానిక డొంగ్రిజాతి గిరిజనులు, దళితలు, సంస్థల నుండి వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతను అణచివేయడానికి కంపెనీ ప్రయత్నాలలో భాగంగా స్థానిక ప్రజల్ని అరెస్టు చేయించడం, దళితలకు, గిరిజనులకు మధ్య ఘర్షణలు సృష్టించడం, గూండాలచేత ప్రజల్ని బెదిరించడం వనరుల మీద ఆధిపత్యం ఛలామణి జరుగుతూ వస్తోంది. చరిత్రపుటాల్లో గిరిజనుల వ్యతిరేకతను తిరుగుబాటుగానే చిత్రీకరించారు. ఇప్పుడూ అంతే. ఇప్పుడున్న కొత్త మార్పు ఏమిటింటే ఎన్నికలకు ముందు ఈ సమస్యల మీద రాజకీయ నాయకులకు అపార సానుభూతి, పోరాటానికి చేయూతనివ్వడం, ఎన్నికైన తర్వాత ఆ పోరాటం, ఓ తిరుగుబాటు, ఈ నాయకులే వారి పూర్వ మిత్రుల్ని అరెస్టు చేయిస్తారు. ఇదే మన రాజశేఖర చరితం కూడా చెబుతుంది.
గంధమర్థన పోరు
ఒరిస్సాలోని గంధమర్థన ప్రాంతంలో బాల్‌కో కంపెనీపై తిరుగుబాటు జరిగింది.  ఈ ప్రాంతం హనుమంతుడు సంజీవిని పర్వతం తీసుకు వస్తున్నప్పుడు ఒక్క ముక్క విరిగి గంధమర్థన పర్వతంగా ఏర్పడిందన్నది స్థానికుల నమ్మకం. ఇక్కడ వందల సంఖ్యలో ఔషధ మొక్కలున్నాయి. సుమారు 52 సహజ ఊటలు కొండల నుండి పుడతాయి. అందులో చాలా మటుకు నిరంతరం ప్రహిస్తాయి, 1983లో బాల్‌కో కంపెనీ వారు 300 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు. అందుకు ముందుగా ఖనిజ శ్యాంపుల్ని తీసారు. దీని వల్ల కొన్ని జీవజలాలు హరించుకుపోయాయి. ఈ కారణంగా దిగువనున్న గిరిజన రైతుల పంట నాశనమైంది.
కంపెనీలు స్థానిక జల వనరుల్ని తమ అవసరాలకు మళ్ళించుకుంటాయి. దంతేపాడు నుండి నీరు కంపెనీకి మళ్ళించడం వల్ల సుమారు 200 కుటుంబాల గొంతెండిపోతుంది. గనులు తవ్వకం వల్ల కొండల్లో ఉండే ఊటలు తరిగిపోయి క్రమేణా మటుమాయమవుతాయి. నియమగిరి సంరక్షణ సమితి, లోక్‌ సంగ్రాం,ఇతర ప్రజా సంస్థలు వారివారి స్థాయిలో పోరాటం చేస్తునే ఉన్నారు. కలెక్టర్‌, ఎంఆర్‌ఓ కార్యాలయాలు ముట్టడి వగైరా లాంటవి. కంపెనీ వాళ్ళ వాహనాలు మటుకు కన్వేయర్‌ బెల్ట్‌ వరకు వెళతాయి. కానీ ప్రజల్ని మటుకు వారి భూముల్లోకి వెళ్ళనివ్వరు. దిక్కుతోచక వాళ్ళ భూముల్లో....వాళ్ళు ఖైదీలుగా మిగిలుపోతున్నారు. ఎండిన గొంతుతో, ఆకలి తీరని డొక్కలతో అలమటించి పోవచ్చు .అప్పుడు నియమగిరి పర్వతంలోని మొక్కలే వీళ్ళని తిరుగుబాటు చేసేందుకు తగిన బలాన్నిస్తాయి.
ఆ గొంతుల్లోనుండి వచ్చే పాట, కాశీపూర్ బాక్సైట్ మైనింగ్  వ్యతిరేకంగా పోరాడుతున్న గిరిజనుల నాయకుడు  భగవాన్ మాజీ ప్రేరణతో  సునీల్ మింజ్,విండో కుమార్ సహకారంతో మేఘనాథ్ రాసిన పాటలా మనని తాకుతుంది ...

వూరువిడిచి వెళ్ళం!
వూరువిడిచి వెళ్ళం!
అడవి వదిలి వెళ్ళం!
మా మట్టి తల్లిని విడిచి వెళ్ళం!
మేము పోరాటం వదలం!(2)
వూరువిడిచి వెళ్ళం!
అడవి వదిలి వెళ్ళం!
వాళ్ళు డ్యాములు కట్టారు
వూర్లు మునిగాయి
ఫ్యాక్టరీలు కట్టారు
అడవుల్ని నరికారు
గనులు తవ్వారు,
శాంక్చరీలు పెట్టారు  (2)
నీళ్ళూ లేక, భూమీ లేక,అడవీ లేక
మేమేక్కడెక్కడికి పోతాం?
ఓ, అభివృద్ధి దేవుడా,
దయచేసి చెప్పు
మా బతుకుల్ని ఎలా కాపాడుకోవాలి(2)
వూరువిడిచి వెళ్ళం!
 అడవి వదిలి వెళ్ళం!
మా మట్టి తల్లిని విడిచి వెళ్ళం!
మేము పోరాటం వదలం!

జమున ఎండిపోయింది
నర్మదా ఎండిపోయింది
ఇంకా, ఎండింది సువర్ణ రేఖా
గంగైంది మురికి వాగు
కృష్ణా  అయ్యింది నల్లటి రేఖ(2)
మీరు తాగుతారు పెప్సీ కోలా
బిస్లరీ నీళ్ళు
మేమెట్లా దాహం తీర్చుకోము
బురద నీళ్ళు తాగి?
వూరువిడిచి వెళ్ళం!
అడవి వదిలి వెళ్ళం!
మా మట్టి తల్లిని విడిచి వెళ్ళం!
మేము పోరాటం వదలం!(2)
మా పూర్వీకులు  మూర్ఖులు
అడవిని కాపాడారు
భూమిని పచ్చగా వుంచారు
నదుల్ని తేనెలా ప్రవహింప చేసారు(2)
నీ అత్యాశ భూమిని దహనం చేసింది
దాని పచ్చదన్నాన్ని దోచుకుంది
చేపలు చచ్చిపోయాయి
పక్షులు ఎగిరి పోయాయి
ఎ దిశగానో తెలియలేదు?!(2)
వూరు విడిచి వెళ్ళం!
 అడవి వదిలి వెళ్ళం!
మా మట్టి తల్లిని విడిచి వెళ్ళం!
మేము పోరాటం వదలం!
మంత్రులయ్యారు పరిశ్రమల బ్రోకర్లు
మా భూముల్ని లాక్కున్నారు!
తుపాకులతో పోలీసుల బలగాలు వాళ్ళని కాపాడుతారు!(2)
అధికారులయ్యారు రాజులు
కాంట్రాక్టర్లు కోటిశ్వరులు!
మావూరయ్యింది వారి కాలనీ !
ఓ సోదరుడా వారి కాలనీ!(2)
వూరు విడిచి వెళ్ళం!
అడవి వదిలి వెళ్ళం!
మా మట్టి తల్లిని విడిచి వెళ్ళం!
మేము పోరాటం వదలం!
బిర్సా పిల్చాడు
అందర్ని కలవమని, నిశభ్దాన్ని చేదించమని!
మత్స్యకారులు రండి,దళితులు రండి, గిరిజనులు కలవండి(2)
పొలాల నుండి, గనుల నుండి మేల్కొనండి!
నగారా మ్రోగించండి!
దేశ ప్రజలారా వినండి
పోరాటం ఒక్కటే మార్గం!(2)
వూరు విడిచి వెళ్ళం!
అడవి వదిలి వెళ్ళం!
మా మట్టి తల్లిని విడిచి వెళ్ళం!
మేము పోరాటం వదలం!
 (అనుసృజన-జి.సత్య శ్రీనివాస్)