Tuesday 3 February 2015 By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- సైలెంట్ వ్యాలీ ఉద్యమం-20

కవిత ఒక భద్రమైన శక్తి,ఒక అనధికార ప్రకంపన,ఓ జీవం,ప్రవాహంలోని సుడి,కవితలు జీవనాన్ని సుస్థిరం చేసే మూల మార్గాలు.కవితలు ప్రకృతి అవశేషాలను పోలిన అక్షర మాటల దార్లు (భద్రమైన శక్తి),అవి పునరావృతమయ్యే ప్రకృతి శక్తి జన్యు వనరులు.ఊహ,బాష కవలల మాతృక కలయిక నుండి, వాటంతటవే నిరంతరం ఉద్భవిస్తుంటాయి, ఈ నిర్వచనం  లిటరేచర్ అండ్ ఎకాలజీ గ్లాట్ఫెల్టి ఎడిటెడ్ పుస్తకం   లోనిది.ఈ నిర్వచనం ఇకో సేన్ ట్రిసం దృక్పదంతో ముడిపడింది.
  ఈ నిర్వచనం సైలెంట్ వ్యాలీ ఉద్యమ సాహిత్యానికి  జీవం పోసింది. ముఖ్యంగా పర్యావరణ కవిత్వం ఒక ఉద్యమ రూపం దాల్చడం సైలెంట్ వ్యాలీ సంరక్షణలో  కనిపిస్తుంది. కేరళ శాస్త్ర సాహిత్య  పరిషత్, 1979 లో సైలెంట్ వ్యాలీ సంరక్షణ అన్న నినాదంతో వుపందుకుంది. ఈ సంరక్షణలోని పరిషత్ సభ్యులు అన్ని వర్గాలకు చెందినవారున్నారు.వీరు 7000 వేల సంఖ్యలో ఉన్నారు. ఇందులో సాహిత్య కారులు ముఖ్య భూమిక పోషించారు.కధకులు,నవలాకారులు,కవులు అందరూ ఏకమయ్యారు. వీరు వివిధ వర్గాల వారైనప్పటికీ వారిని కలిపింది సేవ్ సైలెంట్ వ్యాలీ అన్న నినాదం.పశ్చిమ కనుమల్లోని సైలెంట్ వ్యాలీలో జీవ వైవిధ్యం ఎలా కలిసి వుందో అదే విధంగా వివిధ సాహిత్య వైవిధ్యాలు కలగలసి ఏక గీతాన్ని ఆలపించాయి. ఇకోసేన్ ట్రిసం ప్రకృతి సమతుల్యతను పలుకుతుంది, అది ప్రకృతిలోని జీవ,నిర్జీవ వ్యవస్ధలతో బాటు చంద్రుడు,ఆకాశం,నక్షత్రాలను కలుపుకుని.అందుకే కవిత అన్నదానికి విశాల అర్ధం అన్ని ఊహాజనిత మార్గాల ఉత్పత్తి ప్రక్రియ. దీనినే భారతీయ సనాతన సాహిత్య కారులు మానసిక  శక్తులను సృజనాత్మక రూపంలో విడుదల చేయడం అన్నారు.ఇది జరగాలంటే మనం ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతాం అన్న వాస్తవాన్ని తెల్సుకోవడమే కాక మనలోని సునిసితను పెంచుకోవాలి.అప్పుడు సాహిత్యం ఒక నిర్జీవమైన పుస్తకంగా మిగిలిపోదు.భిన్న స్వర వచనం  (పోలిఫోనిక్) లేక  ముఖ్యమైన అసంఖ్యాక ( ప్లూరి సిగ్నిఫికంట్) స్వరాల గళం అవుతుంది,అందులో రచయిత/రచయిత్రి,విశ్లేషకులు, పాటకులు, మధ్య పరస్పర చర్య అవుతుంది.సనాతన భారతీయ తర్కశాస్త్రం అనుసారం ప్రపంచ మనుగడకు ఒకరిమీద ఒకరికి ప్రేమ మూలం. మూలాన్నే అద్వైతం పేర్కుంటుంది. ఈ ప్రేమను  కేవలం కవితలు ద్వారానే చెప్పాల్సిన  లేదు ,సైలెంట్ వ్యాలీకి సంబంధించి పెట్టుకున్న  కేరళ హై కోర్టుకు మొదటి పిటిషన్ రాసింది కవి సుజాత దేవి. అది ఒక కవితాత్మ రూపంలోనే ప్రస్తావించింది.
సైలెంట్ వ్యాలీ అద్భుతమైన భూమికవిత
దానికి ప్రత్యేకమైన భౌగోళిక పరిస్ధితులతో బాటు
ప్రకృతి పరమైన స్థితిగతులు వున్నాయి.
దీని  ప్రత్యేక విశిష్టతలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది
ఇక్కడ మరొక విషయం ప్రస్తావించాలి .ఆధునిక పర్యావరణ సాహిత్యానికి ,సాంప్రదాయ పర్యావరణ సాహిత్యానికి తేడాలలో కీలకమైనది, కి స్టోన్ ప్రకారం ఎన్విరాన్మెంటలిజం (పర్యావరణీయం).అన్నది పారిశ్రామిక సంస్కృతి నుండి పుట్టింది. ఇది అనాదిగా మానవ సమాజాలు చేతుల్లో బలవుతున్న  ప్రకృతిని సంరక్షించుకోడం కోసం ఉద్భవించే వ్యతిరేక నినాదం. స్లేమేకర్ అనుసారం పర్యావరణ సాహిత్య, పర్యావరణ విశ్లేషకులు తమ మనోభావాల్ని రాజకీయ స్ధైర్యంతో ,ఆధ్యాత్మిక చింతనతో, ప్రకృతిని యాంత్రికంగా మార్చుతున్న తీరుని ఖండిస్తున్నారు. సాంప్రదాయకమైన ప్రకృతి సాహిత్యం లోని జ్ఞానం ప్రస్ఫుటంగా ప్రకృతి విధ్వంసాన్ని భరించే తీరుని వెల్లడించడంలో తన ఛాయల్ని పూర్తి స్థాయిలో చాటి చెప్పలేదు. అవి పూర్తి స్ధాయిలో పర్యావరణ స్పృహని వ్యక్తపరచలేదు, చాల మటుకు ప్రాంతీయ ,జాతీయ స్థాయికే పరిమితమయ్యాయి , ముఖ్యంగా పర్యావరణ సాహిత్యం భౌగోళికమైనదన్నది ఆయన ప్రస్తావన. ఈ ప్రస్తావనల్ని పూర్తీ స్ధాయిలో ఖండిచలేo. సైలెంట్ వ్యాలీ విషయంలో రెండు ప్రధాన ధోరణులు ద్వారా ఉద్యమం నడిచింది. ఒకటి శాస్త్రీయ నినాదాల ద్వారా ,రెండు సాహిత్యం ద్వారా. పర్యావరణ విషయంలో ఎప్పుడూ శాస్త్రీయ వాదనలదే పై చేయి, సాహిత్యాన్ని కేవలం ఊహాజనికంగా,భావావేశంగా జమ కట్టి పట్టించుకోరు. శాస్త్రీయ జ్ఞానం జనాలకి అర్ధం కాదు,కోర్టు కచేరి వ్యవహారలు అసలు అర్ధం కావు. ఈ రెండు వ్యవస్ధలే పర్యావరణ అంశాల పై నిర్ణయం తీసుకునేవి. ఈ రెండు వ్యవస్ధల్లో స్ధానిక జనాలకి చోటు లేనప్పుడు ,అక్కడ చోటుకి మార్గం ఏర్పరిచే సాధనం సాహిత్యం. ఇది నిశబ్దంగా ఈ  ఉద్యమంలో ఏర్పడింది. అందులోను కవిత్వాన్ని కోర్టులో కచేరి చేయడం చాల అరుదు. సైలెంట్ వ్యాలీ ఉద్యమంలోని మరో ప్రత్యేకత అక్కడ జనావాసం నామ మాత్రమే, మరప్పుడు అడవిగోడు విన్పించేందుకు సాహిత్యకారులు ఏకమయ్యారు, బహుశా అందుకే వర్గ వైరుద్ధ్యాల్ని పక్కన పెట్టారేమో.
సైలెంట్ వ్యాలీ హైడ్రో ప్రాజెక్ట్ నినాదం అడవి మొత్తం సమాజంది. కేవలం, పారిశ్రామికవేత్తల్ది,మార్కెట్ది కాదు, ప్రత్యక్షంగా అక్కడ నివసిస్తున్న వార్ది,వారి మనుగడది. వీట్ని గుర్తించడం అంటే ప్రకృతిని ఆరాధించడమే  కాదు, ప్రకృతికి,మనిషికి వున్న ప్రేమ పూరిత సహజీవనానిది.
ఈ నినాదాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో సాహిత్యకారులతో ఏర్పడిన ప్రకృతి పరిరక్షణ సమితి క్రియా శీలక పాత్ర వహించింది. వారు ఉద్యమాన్ని నడిపిన తీరుని  ఎందుకో తుకారాం పలుకుల్లో చెప్పాలని...
పదాలొక్కటే
నా దగ్గరున్న ఆభరణాలు
పదాలొక్కటే
నేను ధరించే దుస్తులు
పదాలొక్కటే ఆహారం
నాకు జీవితానిచ్చేది
పదాలొక్కటే సంపద
నేను జనానికిచ్చేది
-అంటాడు తుకా
పదాలను దర్శించు
అవి దేవుళ్ళు
నేను వాట్ని
పదాలతో పూజిస్తాను.
(సెయింట్ తుకారం)
(అనుసృజన)
ఇటువంటి పదం బాటలో నడిచిన పర్యావరణీయ కవితోద్యమo  సైలెంట్ వ్యాలీ. చాల బలంగా పరివ్యాప్తి చెందుతున్న పారిశ్రామీకరణ,శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం,మార్కెట్ అన్నవి ప్రకృతిని త్వరితంగా  కబళిస్తున్నాయి.కాని ప్రకృతి తన ప్రాంతీయ ఉనికి వల్ల భౌగోళిక పర్యావరణ సమతుల్యతను పరిరక్షిస్తున్నదన్న సత్య వాక్కు అంతగా పరివ్యాప్తి చెందడం లేదు. ఓ ప్రాంతంలో మనం చేసేది  తప్పో,ఒప్పో అన్న ప్రస్తావనకి అతీతంగా చర్చించే ప్రాంతంలో కలయిక కోసం కవిత్వ గళం నుండి జరుగుతున్న  సాహిత్యాభివృద్ది ప్రక్రియ పర్యావరణ కవిత్వం. ఇది నిశబ్దంగా భూమంతా ప్రతిధ్వనిస్తున్న  నేలాకాశ వాక్కు ... సుజాత కుమారి కేరళ కౌముది అన్న పత్రికలో 
కాలం చేజారిపోతోంది
గొడ్డలికోత కొనసాగుతోంది
అడవికి నిప్పంటించారు
అడవి చేతులుచాచి అరుస్తోంది

ఇది చదువుకుని ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యి నిరంతరం కొనసాగే అడవి రక్షణ పోరాటాన్ని తన జీవిత ఆశయంగా తీసుకుంది.ఈ పోరాటంలో ఆమె సైనుకురాలైనందుకు గర్వపడింది. తనతోటి రచయితల్ని ఇందులో భాగ్యస్వాముల్ని చేసింది.ఎందుకంటే ఆమె గట్టి నమ్మకం ప్రజల భాషని తెలిసి ,బాగా పలికే వారు శాస్త్రజ్ఞులు కాదు రచయితలని. అదే  ప్రకృతి పరిరక్షణ సమితికి బీజం వేసింది. దీని ఆశయం కేవలం మానవ మనుగడే కాదు, ప్రకృతి వ్యవస్ధల సుస్తిరత. ఆమె వాంగ్మూలాన్ని వచ్చే వారానికి వాయిదా వేస్తూ, శెలవు...

0 comments:

Post a Comment