Wednesday, 18 February 2015 By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు-22-సైలెంట్ వ్యాలీ ఉద్యమం- కాల్ అఫ్ నేచర్.

సైలెంట్ వ్యాలీ ఉద్యమానికి సంబంధించిన కవితల్లో “గీతం” అన్న శీర్షికతో కవితలో ప్రముఖంగా వచ్చాయి . దీనికి విరుద్ధంగా ప్రకృతిని ధ్వంసం చేస్తే ప్రతిస్పందన విధ్వంసం అని ఓ.యన్. వి. కురుప్ రాసిన ‘భూమికోరు చరమగీతం’ చెట్టుకి సంభందించిన కవితల్లో  సృజనాత్మక పరంగా , విశేషంగా ప్రాచుర్యం పొందిన కవిత ఇది. ప్రకృతిలోని  వ్యవస్ధలపై మానవ ప్రమేయం వలన వాతావరణ సమతుల్యత ఏ విధంగా దెబ్బతింటుందని తెలుపుతుంది.నిస్సంకోచంగా ఈ రచన తీరు ప్రకృతి విద్వంసం కి సంభందించిన రచనా శైలికి నిదర్శనాలు.
విద్వేషం ఉప్పొంగింది
మండే సూర్యుడి నుండి నిప్పులు కురుస్తాయి;
వర్షం మబ్బులు 
 తాగడానికి చుక్క నీటి కోసం తపిస్తాయి;
వసంత కన్యలు చల్లటి గాలికోసం తహతహ లాడుతాయి
ఋతువుల రాజు అన్వేషణ నిర్వియమవుతుంది
ఒక పువ్వు కోసం;
కదలిక లేని నదులు తరంగాల కోసం తపిస్తాయి
జీవన చక్రాలు దారుల్లో కుంగిపోతాయి
(30-37,పంక్తులు)
(అనుసృజన)
ఇదే విధమైన  ప్రకృతి చరమ గీతం దాని వల్ల భవిష్యత్తు ప్రస్తావన 1962 లో రేచల్ కర్సన్ సైలెంట్ స్ప్రింగ్ పుస్తకంలో కనిపిస్తుంది. ప్రకృతి పై ఏ అడ్డు అదుపు లేని మానవ దురాగతాలు కొనసాగితే, ఏ మార్పులేని ఒకే విధమైన జీవనంతో మిగిలిన భూమి, ఇక ఎప్పటికీ పక్షుల గళం లేని  వసంతం గురించి చెపుతుంది.’భూమి’ కవితలో నేల తల్లి ని  సౌందర్యారాధనతో చూసిన దృష్టి, భూమి చెక్కు చెదరని  నవ యవ్వనాన్ని తెలుపుతూనే రాబోయే విధ్వంశం గురించి చెపుతుంది. పర్యావరణ కవిత్వం భవిష్యత్తుని ప్రస్తావించే కాల జ్ఞానం. ఇదే విషయాన్ని నేడు ప్రకృతి విద్వంశం వల్ల వాతావరణ మార్పులు గురించి విస్తారంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ కవితలోని అంశాలనే 2006 నోబుల్ బహుమతి పొందిన  అంతర్జాతీయ వాతావరణ మార్పులు నివేదికలో ప్రస్తావించారు. శాస్త్రీయ పరిజ్ఞానం ప్రకృతి రహస్యాలను చెపితే , కవిత్వం మనలోని మనస్సు ప్రకృతి, సామాజిక ప్రకృతి,ప్రకృతి ప్రకృతి మధ్య అంతర్లీన టైం ,స్పేస్ సంభాషణ. ప్రముఖ ఫిలాసఫర్ యు.జి. కృష్ణమూర్తి మాటల్లో ‘మన శరీరంలో ఒక గడియారం వుంటుంది. అది ఏ యాంత్రిక గడియారం లేకుండానే మేలుకొల్పుతుంది’. ఆ ఘడియారపు సెకండ్ల ముల్లు చప్పుడే మన కవితాక్షరాలు. శరీరం డైనమైటు అయినప్పుడు   మనస్సు సవ్వడి  చరమ గీతానికి సహవాయిద్యాల తంత్రులగానే పలుకుతుంది. ఇంత కంటె తీవ్ర మైన హృద్రోగం ,నరాల బలహీనత లేదు. మనం మనలోని సహజంగా మేల్కొలిపే సుప్రభాత గీతాన్ని కోల్పోయాం. రోజుల్ని యాత్రికం చేస్కునప్పుడు ,రోజులు మనకి ప్రతి రోజు మనకి ‘దినం’ గా నే గడుస్తుంది. డి. వినయచంద్రన్ అన్నట్టు పర్యావరణీయం అంటే ప్రకృతి ని గుడ్డిగా పుజించడం కాదు, అదే విధంగా తోటల/వనాల పెంపకం గురించి అధ్యయనమూ కాదు. ఈ విధమైన దృక్పథం ప్రకృతిని కేవలం చెట్లు,నదులు,పక్షులు,అడవులు గా మార్చేస్తుంది. ఈ నిర్జీవ (సింథటిక్) ఆలోచన, అనాలోచితంగా నే మానవ జీవనాన్ని, మనుషుల్ని ప్రకృతిని విడధీస్తుంది. అప్పుడు సూర్యోదయం కూడ  కరిగిపోతున్న కలే!
వినయచంద్రన్ దృష్టిలో పర్యావరణీయ సాహిత్యం అటువంటి ధృక్కోణాల్నిమార్చాలి, ప్రకృతి ,సమస్త  మానవ జీవన అంశాలు ఒకటికొకటి ముడిపడి ఉన్నాయన్న భావనని కల్పించాలి అన్నది వ్యక్తపరుస్తాయి. అయ్యప్ప పానికర్ ఉదయాస్తమనం  అన్న కవితలో వివిధ జీవరాసుల మధ్య వున్న సహజీవనాన్ని చెపుతాయి. సూర్యుడి పడమటి పయనాన్ని సహజీవనానికి ప్రతీకగా వర్ణిస్తుంది.
సరిహద్దులనుండి పొడుచుకొస్తున్న నిప్పు బాణాలు
భూమిని మేల్కొనేలా చేస్తాయి;
చొచ్చుకుపోయిన వేర్లు;
మొగ్గలు,పూలు, లేత ఆకులూ
కొమ్మల కున్న;
ముందుకు సాగుతున్న  క్రిములు
 లేత ఆకుల్ని భుజించడానికి;
పాటలు పాడుతున్న పక్షుల గుంపు
ఆ క్రిముల్ని ఆరగించడానికి;
వేటగాడు తనకు ఆహారం కోసం ఆ పక్షుల్ని సంహరిస్తాడు;
వేటగాడిని వెంటాడే వన్య ప్రాణి
అతనిని భుజించడానికి;
వన్య ప్రాణిని ,అడవిని ఆహుతి చేసే మంటలు;
అప్పుడు సరిహద్దు వాట్ని తిరిగి పొందుతుంది
(22- 35 పంక్తులు)
(అనుసృజన)
ఈ కవితలో మనకి ప్రకృతిలోని ఆహార చక్రం తెల్సుతుంది. ప్రకృతిలోని నీటి చక్రం,ఆహారం చక్రం అన్నిటికీ ఆదీ అంతం వుండదు.ఇదంతా శక్తి(యనర్జి సైకిల్) ని తెలుపుతాయి. ఇది అర్ధం చేస్కోకుండా మనం మనలోని గడియారాన్ని సరిచేసుకోలేము. మనం ఎంత డిజిటల్ క్లాక్స్ ఉపయోగిస్తున్నా .సెల్ కెమెరాలు వాడుతున్నా అది ఒక పునర్జీవం కాలేని ఐ వెస్ట్ గానే మారుతోంది. ఈ తీరు మారాలంటే మన ఆలోచనలు సింథటిక్ గా వుండకూడదు. ప్లాస్టిక్ డబ్బుల కాలంలో సంబంధాలు కూడ నిర్జీవంగాను వుంటాయి. పర్యావరణ కవిత్వం అన్నది ఒక సింధటిక్ ప్రవచనం కాదు, ఒక సజీవ వెదురాకంచున మంచు బిందువు గూడులో నిశ్శబ్దంగా విచ్చుకునే తొలి కిరణం. అప్పుడే వెదురు గూటి లోనుండి ఆహార అన్వేషణకు వెళ్ళే తల్లి పక్షికి వీడ్కోలు పలికే బుల్లి పిట్టల  స్వరం. 

ఈ స్వరం మనని మన లోని  ప్రకృతి ఘడియల్ని  స్ప్రుజించే మేల్కొల్పు. సైలెంట్ వ్యాలీ ఉద్యమ కవిత్వం అంటే కాల్ అఫ్ నేచర్.

0 comments:

Post a Comment