Wednesday 29 June 2022 0 comments By: satyasrinivasg

నిశ్శబ్ద విప్లవం- రేచెల్ కార్సన్

 

అమెరికన్ రచయిత్రి, విద్యావేత్త ,ప్రకృతి స౦రక్షురాలు అయిన తెర్రి టెంపెస్ట్ విలియమ్స్ అంటుంది, నేను రేచల్ కార్సన్  కాంక్షని జ్ఞాపకం చేసుకుంటాను, నేను ఏకకాలంలో ఉద్రేకంగాను, కారుణ్యంతో ఉండాలనుకుంటాను. సమాజంలో చొచ్చుకుపోయిన నిర్లక్ష్యాన్ని పెకిలించడానికి నాలో రౌద్రం  నింపుకోవాలనుకుంటాను. దానిని పవిత్రమైన రౌద్రం అనుకోండి,అది సమస్త జీవరాశి కలిసి సహజీవనం చేయాలన్న జ్ఞానం. నాకు వన్య జీవుల్లో  వుండే నిశ్చల .నిరంతరమైన ,సుస్ధిరమైన ఆశని పొందాలని వుంది. ప్రకృతి రచయితలందరూ రేచల్ వల్ల వాళ్ళ పైన , పర్యావరణ ఉద్యమం పైన ఏర్పడిన ప్రభావాన్ని ప్రస్తావించడం మటుకు మర్చిపోరు.

రేచల్ కార్సన్ అమెరికన్ మెరైన్ బయోలజిస్ట్.  1907 లో జన్మించి  1964 లో మరణించింది. ఆమె రాసిన సిలేట్ స్ప్రింగ్ ప్రపంచ పర్యావరణ దృక్పధాన్ని మార్చేసింది. జిల్ లిపోఎర్  మాటల్లో ఆమె తన జీవితం చివరి  అంకంలో రాసిన పుస్తకం చిరస్ధాయిగా వుండిపోతుంది.అంతకు మునుపు ఆమె తనని తాను సముద్రపు కవి గా భావించేది.

రేచల్ కార్సన్  ఒక సారి “నా కంటూ పలుకుబడి వుంటే, పిల్లలకు నామకరణం చేసే అద్భుత వ్యక్తులతో ఒక మాట చెప్తాను, ప్రపంచంలోని పిల్లలందరిలోను వుండే అద్భుత భావన ఎప్పటికీ అంతరించకుండా  వుండే వరం ఇవ్వు అని”

ఆమె అండర్ ది సీ లో అన్న వాక్యాలు చిరస్మరణీయం.నీటి ప్రపంచంలోని జీవరాశుల చూపుని అర్ధం చేస్కోడానికి ముందుగా మనకున్న  మట్టి మనుషుల టైం, స్పేస్, స్ధలం ప్రమాణాలతో వున్న కుంచించుకు పోయిన  ఆలోచనల్ని త్యజించి, విస్తారమైన నీటి ప్రపంచoలోకి దూకాలి. సముద్ర పిల్లలకి వాళ్ళ ప్రపంచంలోని ధృవీకరణ కంటే మరొకటి ముఖ్యమంటూ ఏమీ లేదు. అవును ఆ కదిలే ప్రపంచం అర్ధం కాకే మనం మనకి మన పిల్లలకి చెప్పేదల్లా ఈ  నేల ఎక్కడికీ  కదలకుండా ఎప్పటికీ  ఇక్కడే నిలకడగా వుంటుంది అన్న పచ్చి అబద్ధం. ఈ అబద్ధం వల్ల నేడు మననుండి పుట్టిన వ్యర్ధ ఆలోచనల్ని నీటిలో కలిపి నదుల్ని, సముద్రాల్ని కలిషితం చేశాం. ఎందుకంటే నేల , నీరు, నింగి అన్నీ వేరు వేరు అని. కాని ఇవన్నీ ఒకే జీవవేరుతో ముడిపడి వున్నాయి అని కార్సన్ చెప్పింది. 1929 లో ఆమె  గ్రాడ్యుయేషన్లో ఆమె తన చదువుని సాహిత్యం నుండి భౌతిక శాస్త్రం లోకి మార్చుకుంది. అప్పుడు శాస్త్రీయ విద్యాభ్యాసం చేసే స్త్రీలు అతి తక్కువ. ఆమె కేవలం భౌతిక శాత్రం మాత్రమే చదువలేదు, మనకి వుండే భౌతిక ఆలోచనల్ని కూడా చదివింది. ‘ప్రకృతిని ఆధీనంలో పెట్టుకోవడం అన్నది మనిషి సౌలభ్యం కోసం  నియాండ్ డర్తల్  కాలం నాటి భౌతిక శాస్త్రం ఆలోచన’ అంటుంది  రేచల్ కార్సన్. రేచల్ కి వుండే లిరికల్ ప్రోస్ ,శాస్త్రీయ దృక్పధం వల్ల 1951 వల్ల అచ్చయిన  సీ అరౌండ్ అజ్ అన్న పుస్తకానికి ఆమెకి అంతర్జాతీయంగా విస్త్రుత గుర్తింపు లభించింది.1941 లో  అండర్ ది సి విండ్ పుస్తకం రాసింది. కార్సన్ మనని విచక్షణారహితంగా సముద్ర  జలాల్లో  వేస్తున్న అణు విసర్జన గురించి హెచ్చరించింది.అంతే కాదు దీని వల్ల ఏర్పడే వాతావరణ మార్పుల గురించి చెప్పింది. నేడు కాలుష్యం, వ్యవసాయంలో  విపరీతమైన రసాయనిక మందుల వాడకం గురించి వెలువెత్తిన  నినాదాలు, ఉద్యమాల వెనుక వున్న ఆలోచన రేచల్ కార్సన్. దురదృష్టం ఏంటంటే ఆమెని మాత్రం గుర్తుoచుకోము. కారణం మనం మొదట ఈత నేర్చుకున్న  ఉమ్మి నీటి కొలను నుండి నేల మీద కాలు మోపిన వాళ్ళం. మర్చిపోవడం సహజంగా కొనితెచ్చుకున్న వాళ్ళం, ఇక కృతజ్ఞత గురించి ఏమి ఆలోచిస్తాం. అందుకే నేను ఈ మాట చెబుతాను పిల్లలకి మంచిని మర్చిపోకుండా వుండే అద్భుత శక్తిని ఇవ్వమని. నీరు, నింగి, నేల వేరు కాదని అది పేగు సంబంధమని.

రేచల్ కార్సన్  మనకి కవిత్వానికి ,ప్రకృతి సౌందర్యానికి గల సంబంధాన్ని చూపించిన వ్యక్తి. సైలెంట్ స్ప్రింగ్ పుస్తకంలో వున్న వాక్యాలు...

మనిషికి ముందు చూపు,విపత్తులను ఆపే శక్తి సామర్ద్యాలు కోల్పోయాడు.  ఈ భూమిని నాశనం చేస్తూ తనని తానూ నాశనం చేస్కుంటాడు. కీట్స్ మాటల్లో... చెరువులోని గడ్డి పూలు మాయమైపోయాయి, ఇక పక్షులు పాటలు పాడవు.

 ఆమె సైలెంట్ స్ప్రింగ్ పుస్తకం లో అన్న మాట  నాకు పరిచయం లేని వాళ్ళెందరో మొదటిగా ఈ దుష్పరిణామాల గురించి ప్రస్తావించారు, మనిషి తనతో బాటు ఈ దుష్పరిణామాల్ని సమస్త జీవరాసులతో పంచుకుంటున్నాడు.  కొందరు  దీని పై నినాదాలు చేస్తున్నారు, పోరాడుతున్నారు. ఈ చిన్న చిన్న పోరాటాలు  మనకు మంచిని, మన౦ సమస్త జీవరాశుల్లో ఒకరిమని కొద్దిపాటి ఇంకిత జ్ఞానాన్ని కలిగిస్తాయి అన్న ఆశ. అవును ఈ ఆశ  కోసం ఇంకా పోరాటాలు కొనసాగుతూనే ఉనాయి. కొద్ది పాటి ఇంకిత జ్ఞానం  చాలదు, చాలా ఎక్కువ కావాలి, కారణం  మనం అభివృద్ధి ప్రయాణంలో  చాల ఇంకిత జ్ఞానాన్ని నీళ్ళల్లో వదిలేసి చేతులు శుభ్రపర్చుకున్నాం. అందుకే ఇప్పుడు చేతులు శుభ్రపర్చుకున్తున్నాం. ఇలా శుభ్రపర్చుకుంటూ నీళ్ళల్లో మరొక్కసారి మళ్ళీ పునర్జన్మిద్దాం....

సముద్రంలో పునర్జన్మ

లౌర పుర్డి సలాస్

నా పునర్జన్మని దర్శించాను- సముద్రంలో-

ఎగిసి పడుతున్న వెండి కెరటాల ప్రపంచంలో

 ఎక్కడైతే ఉప్పు,నక్షత్రాలు, మనస్సు స్వేచ్చగా విహరిస్తుందో!

నన్ను నేను దర్శించుకున్నాను, సముద్రంలో పునర్జన్మించాను

నా నుండి నా పాత ఆలోచనలు కొట్టుకుపోయాయి

నా గమ్యం అలలలో విచ్చుకుంది

నన్ను నేను దర్శించుకున్నాను, సముద్రంలో పునర్జన్మించాను

ఎగిసి పడుతున్న వెండి కెరటాల ప్రపంచంలో

 

మౌన వసంతం

ఈ నేల కదలలేని బలహీనురాలుగా కనిపిస్తుంది. నేల కదలిక మన అడుగులకు, మన చర్యలకు తెలియదు. మనం తినే ఆహారం, చర్యలు, బతుకు తెరువు, జీవనం అంతా దాని కదలిక పుణ్యమే. మనని అంతర్గతంగా .బహిర్గతంగా వలసకు పంపేది ఆ నేలే! అది మనకు అర్ధం కాక  నేలను బలహీనురాలుగా భావించి , దాని పౌష్టికత  పెంచడానికి నానా రకాల క్రిమిసంహారక మందులు జల్లి ఆ మందులని  ఆహార పదార్ధాలుగా  మార్చి తింటాం. నేల బాష మనకు తెలియదు కనుక. ఆ నేల బాషను అర్ధం చేస్కున్న వ్యకి. రేచెల్ కార్సన్. నేలలో జీవించే అసంఖ్యాక జీవులు కళ్ళకు  కనిపించవు. ఎందుకంటే మన అడుగులకు అంధత్వం సోకింది. మన కాళ్ళకి చెప్పులున్నట్టు, అడుగులకి కళ్ళజోళ్ళు అవసరం అని చెప్పింది కార్సన్. చేలల్లో  చీడ పురుగులను క్రిమిసంహారక మందుల ద్వారా వాట్ని చంపి ప్రకృతిలో  వున్న ప్రే అండ్ ప్రిడేటర్ సంబంధాల్ని నాశనం చేస్తూ ఒకటి మర్చిపోతాం వి ఆర్  ద అల్టిమేట్ ప్రిడేటర్స్ అని. చావుని కొని తెచ్చుకోవడం అంటే ఇదే.

వ్యవసాయాన్ని జీవన సంస్కృతి లా కాక వ్యాపార ధోరణిని బట్టి. వ్యవసాయదారులను ఉత్పత్తి దారులా కాక ఉత్పత్తి వినియోగదారులా మార్చిన వ్యాపార వలసవాదుల పంజరంలో  చిక్కుకున్న వాళ్ళం . చిన్న సమాజాలని వదిలి ఒంటరితనంతో సహజీవనం చేసే స్ధాయికి అభివృద్ధి చెందాం. ఇట్స్ ఆల్ ఎ వే టు వర్చ్యువల్ ఎంగేజిమేంట్. మనకి వసంతం మౌన గీతం గానే వుంటుంది.శిశిరంలో  రాలే ఆకుల సవ్వడి వినడం ,చూడడం కోల్పోయిన వాళ్ళం. శిశిరంలో

రాలే ఆకులు...

ముంగిట్లో రాలిన ఎండుటాకుల్ని, ఉషోదయ

సంధ్యా కాలాల్లో

ఆమె శుభ్రపరుస్తూనే వుంటుంది

అలిగి వెళ్ళిన వాళ్ళు ఇల్లు వదల్లేక

అక్కడే తచ్చాడుతున్నట్లు

మళ్ళీ తొలి కిరణాల్లా

అవి ముంగిట్లో వాలుతూనే వుంటాయి

ఎండుటాకుల వాకిలి

మట్టి రేణువుల పట్టీల తరంగం.

( ఎండుటాకుల వాకిలి నుండి కొన్ని పంక్తులు, ఇంకా సగం  సీక్వెల్, జి.సత్యశ్రీనివాస్)

 

మనం  కూడా ఎండుటాకులా  రాలి అక్కడే తచ్చాడుతూ మట్టిలో కలిసి జాతక కధలా మళ్ళీ రూపాంతరం చెందుతాం. ప్రకృతి లోని, స్త్రీలలోని రుతుచక్రాన్ని అర్ధం చేస్కోలేనప్పుడు మనం ప్రకృతి రంగుల్లో అల్లుకుపోలేం. నిరెంద్రియ (ఇనార్గానిక్) జీవనంలో సేంద్రియ ఊసులు చెప్పుకు౦టూనే వుంటాం. బీజ క్షేత్రాల్ని నిర్జీవం చేస్తూనే పోతాం. అందుకే  మన చూపుకు  కించిత్  పచ్చటి లేహ్యం అద్దిన కార్సన్ చూపుడు వేలుని అంటిపట్టుకుని నడవడం అవసరం.

1960చివరి సంవత్సరాలలో ఒక సారి వైల్డ్ లైఫ్ ఫండ్ డిన్నర్ పార్టీ లో నెథర్లాండ్స్ ప్రిన్స్ బెర్న్హార్డ్  మాటలు... ‘మనం స్పేస్ని జయించాలని కలలు కంటున్నాం. ఇప్పటికే చంద్ర మండలానికి వెళ్ళే ప్రయత్నాలు మొదలు పెట్టాం. కాని మన గ్రహాన్ని  ఉపయోగిస్తున్నట్టే , మనం మార్స్, వీనస్,మూన్ ని  వుపయోగించాలనుకుంటే,  వాటి మానాన వాట్ని వదిలేడం ఉత్తమం. మన నగరాల్ని గాలి కాలుష్య  కేంద్రాలుగా, నదులు, సముద్రాల్ని  కలుషితం చేశాం. మన నేలని సైతం విషపూరితం చేశాం”.

 ఇదే మాదిరి మాటలని నీల్ ఆర్మ్ స్త్రాంగ్ కి ,బుస్స్ ఆల్డ్రిన్ కి ఒక నేటివ్ అమెరికన్ చెప్పాడు. వాళ్ళు 20 జులై 1969న అపోలో  II   ద్వారా చంద్రమండలం లోకి అడుగుపెట్టే ముందు, పశ్చిమ అమెరికా లోని చంద్ర మండలం లాంటి ఒక ఎడారి  ప్రాంతంలో   నేటివ్ అమెరికన్ నివాస ప్రాంతంలో శిక్షణ పొందుతున్నప్పుడు జరిగిన సంఘటన. ఒక రోజు అక్కడి ఒక నేటివ్ అమెరికన్ వచ్చి వాళ్ళను  మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు అని అడిగాడు. వాళ్ళు దానికి సమాధానంగా మేము  ఒక పరిశోధన నిమిత్తం చంద్ర మండలానికి వెళుతున్నాం ,దానికి కావాల్సిన శిక్షణ ఇక్కడ పొందుతున్నాం అని చెప్పారు. అది విని ఆ పెద్దాయన కొంచం సేపు నిశబ్దంగా  వున్నాడు. వాళ్ళు అతన్ని నువ్వు ఎందుకు మాట్లడం లేదు అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, ఏమీ లేదు, మా తెగ వాళ్ళకు ఒక నమ్మకం వుంది. అది మా పూర్వీకుల ఆత్మలు చంద్రుడిలో వుంటాయని. మీరు నాకు సహాయం చేస్తారమోనని చిన్న ఆశ, అంతే! ఏమిటి  అని అతడిని  అడిగారు , అబ్బే ఏమీ లేదు, మా వాళ్ళకి ఒక సమాచారం అందించాలి అంతే!. సరే ఆ సమాచారం ఏంటి అని అడిగారు. దానికి బదులుగా ఆయన వాళ్ళ బాషలో అది చెప్పి , నీల్ ని ,బుస్సుని అది కంఠస్ధం వచ్చేవరకు  నేర్చుకునేటట్టు చేశాడు. వాళ్ళు దాని అర్ధం అడిగితే ఇది మా గూడెం వాళ్ళ రహస్యం ఎవరికీ చెప్పం అని వెళ్ళు పోతూ, తిరిగి చూసి ఇది మీరు చెప్పడం  మాత్రం  మర్చిపోకండి, ఆ, బాగా కంఠస్ధం  చెయ్యండి, మర్చి పోకండి అని వెళ్ళిపోయాడు. వాళ్ళు  తిరిగి వాళ్ళ క్యాంప్ కి  వచ్చి , ఈ బాష తెల్సిన వ్యక్తి కోసం వెతికి పట్టుకున్నారు. అది అతనికి చెప్పి అర్ధం చెప్పమన్నారు. అది విని ఆ గూడెం, మనిషి విరగ బడి చాలా సేపు నవ్వాడు, అలా నవ్వుతూనే వున్నాడు. ఇక ఓపిక నశించి అతన్ని గట్టిగా పట్టుకుని అడిగారు. అప్పుడు అతను దాని అర్ధం చెప్పాడు. ‘వీళ్ళు చెప్పే ఒక్క మాట కూడా నమ్మద్దు, వీళ్ళు మీ భూముల్ని లాక్కోడానికి వచ్చారు!’

అవును మనం వున్న నేలను నాశనం చేసి వేరే గ్రహాలకి వెళ్ళేది ఇందుకే అని ఇప్పటికి తెల్సింది. అదే నేటి స్పేస్ కలోనైజేషన్.

 మన నేలని, సముద్రాల్ని , ఇతర గ్రహాలని ఇలా దోచుకుంటూ, నాశనం చేస్తూ పోకూడదనే రేచల్  జీవితాంతం చేసి,రాసి చూపించింది. అది నేల నింగి, నీరు కలిసే ప్రదేశం నుండి వచ్చిన ఆకు పచ్చని అలల వసంత సవ్వడి. ఆ సవ్వడి ,  స్త్రీ , ప్రకృతి ఋతువుల మధ్యనున్న గురుత్వాకరణ శక్తి. అది ప్రకృతి   బాష . అది అర్ధం అయితే మనం పలికే పలుకుల కంటే గొప్ప పచ్చటి కవిత్వం వుండదు.అదే ప్రకృతి కవిత్వ రసవాదం.

పెను మార్పు(రేచెల్ కర్సన్ కి )-లౌర పుర్డి సలాస్

ప్రియమైన  సముద్రం

అందరూ మనని అనుకున్నారు, మనం వేసవి గాడ్పులమని

నాకు అప్పుడు 22 సంవత్సరాలు మాత్రమే

నువ్వు... పెద్ద దానివి

కాని నాకు తెల్సు- నాకు తెల్సు - నువ్వు నా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తావని

నాకు ఎప్పటికీ బ్లాక్ చెర్రి,హెమ్ లాక్ చెట్లు, జింకలు

తాబేళ్ళు, ధూళి ఇంకా గొడవ పడడం అంటే ఇష్టం

నాకు ఎప్పటికీ ఇష్టం కాగితాల్లో ఒరుసుకు పోయిన చెక్క పెన్సిల్ .

పరిగెడుతున్న ఆలోచనలు

వీక్షణం, రాయడం

ప్రపంచం, పదాలు.

ఇంకా కొనసాగిస్తున్నాను

కాని అవి నీతో సరితూగవు

నీ వెండి కళ్ళు, నీ అలల కేశాలు

మెరిసే చేపలు

ఇంకా మెల్లటి  అలలు

నీతో వున్నపుడు నక్షత్రాలు ఇంకా జ్వలంగా మెరుస్తాయి

దయచేసి నా వేళ్ళ కొసలనుండి  జారిపోయి ,కనిపించకుండా పోకు

నా జీవితాంతం నీ కోసం పోరాడుతా , నా సముద్రమా,

నిన్ను ప్రేమించే

రేచల్  కార్సన్

(అనుసృజన జి.సత్యశ్రీనివాస్)

దయచేసి నా వేళ్ళ కొసలనుండి  జారిపోయి ,కనిపించకుండా పోకు,

అవును దయచేసి నా వేళ్ళ కొసలనుండి  జారిపోయి ,కనిపించకుండా పోకు,

పొతే జీవితం ప్రాణం లేని  శ్వాస  లా,  మట్టి  నేలగందం లేని తడిలా మిగిలిపోతుంది...