Tuesday 9 December 2014 By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- కెన్ సారో వివా-పచ్చని కాంతి విస్ఫోటం -13

నిజమైన చెరశాల
కారుతున్న పై కప్పు  కాదు
పాడుతున్న దోమలు కావు
తడితోనున్న ఈ మురకి చెరశాల గది
తాళం చెవి చప్పుడులు కావు
 నిన్ను వార్డెన్ గదిలో పెట్టి తాళం వేసినప్పుడు
కుళ్ళిన కూడు కాదు
జంతువుకి, మనిషి కి  సహించనిది
ఖాళీ ఉదయాలు కావు
చీకటి రాత్రుల్లోకి ఇంకిపోతూ
ఇది కాదు
ఇది కాదు
ఇది కాదు
 మ్రోగిన ఈ అబద్ధాలు
యుగాలుగా నీ చెవుల్లో
ఇది భద్రతా అధికారి సృష్టించిన ఉన్మాదం
నిర్ధయత్వంతో విధ్వంసం ఏర్పరిచిన  ఉత్తరువులు
ముష్టి ఒక పూట భోజనం కోసం
న్యాయాధి కారిణి తన పుస్తకంలో రాస్కుంటుంది
ఆమెకి తెలుసు ఇది అన్హరమైన శిక్ష అని
విలువల విధ్వసం
మానసిక అసంగత్వం
నియంతల మాంసం
పిరికితనం ముసుగులో విధేయత
మన కుళ్ళిన మనసుల్లో రహస్యగోళాలు
మనం ఎప్పటికీ శుభ్రపర్చుకోం
ఇది ఇదే
ఇది ఇదే
ఇది ఇదే
మిత్రమా,మన స్వేఛ్చా ప్రపంచాన్ని
నిర్జీవమైన చెరశాలగా  మారుస్తుంది
(కెన్ సారో వివా,1993)
(అనుసృజన)
 మిత్రమా మన స్వేఛ్చా ప్రపంచాన్ని నిర్జీవమైన చెరశాలగా మారుస్తుంది అన్న ముగింపులో చెప్పాల్సినదంతా  చెప్పాడు కెన్ శారో వివా. 1950ల నుండి నైజీరియా లోని ఒగోని  భూముల్లో షెల్ల్ కంపెనీ వారు చేపట్టిన ఆయుల్ వెలికితీతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు. కెన్ శారో వివా నైజీరియన్ రచయిత,టి,వీ. ప్రొడ్యూసర్,పర్యావరణ కార్యకర్త.
ఈయన ప్రపంచంలోనే అరుధైన పర్యావరణ కవి. అయన ఆప్త మిత్రుడు ఇన చిక్స్ ఇలోగ్భునం ఆయన గురించి అన్న మాటలు  -కెన్ సారో వివా తన ఒగోని ప్రజల కోసం వాళ్ళలో రాజకీయ అవగాహన,స్వదేశీ ఆర్ధిక విధానం గురించి అవగాహన కల్పించారు. ఆయనను ఉరితీయడమంటే నైజిరియాలో పరిస్ధితుల్లో మార్పు లేదని. -.
ఈయనని 1995,లో స్ధానిక సైనిక పాలన  వారు అరెస్టు చేసి ,హడావిడిగా ప్రత్యేక సైనిక ట్రిబ్యునల్ ద్వారా కోర్ట్ కచేరీలు ముగించి ఆయనని మరో 8  యం.ఓ.ఎస్.పి. నాయకుల్ని 10,నవంబర్,1995లో ఉరితీసారు. అప్పటికి ఆయన వయస్సు 45 సంవత్సరాలు.
వివా కోర్టులో ప్రకటించినవి - మిలార్డ్! మన మంతా ఈ నాడు చరిత్ర ముందు నిలుచున్నాం. నేను శాంతి కాముకుణ్ణి, భావుకుడిని.సంపద ధ్వంసమయిన ప్రాంతంలో నివసించే నా ప్రజల దుర్భరమైన పేదరికం చూసి భయభ్రాంతుడినయ్యాను. వారి పై విధించిన రాజకీయ పరిమితులను,ఆర్ధిక అణిఛివేతనూ చూసి దిగాలు పడ్డాను,వారి నేల తల్లిని మరుభూమిగా చేయడం చూసి ఆగ్రహించాను.చీకు, చింతా లేని సాధారణ జీవితాన్ని గడపడానికి వారికి వున్న జీవించే హక్కును రక్షిండంలో ఆసక్తి కనపర్చాను. ఈ దేశానికి మొత్తంగా న్యాయబద్ధమైన ప్రజాస్వామ్య వ్యవస్ధను అందించాలని నిర్ణయించుకున్నాను . నాకున్న మొత్తం మేధా సంపత్తిని, భౌతిక వనరుల్ని- ఒక్క మాటలో చెప్పాలంటే నా జీవితాన్నే! నేను పూర్తిగా నమ్మిన విశ్వాసం కోసం అంకితం చేసాను. నన్ను దీని నుంచి భయపెట్టిగానీ, బ్లాక్ మెయిల్ చేసి గాని వేరు చేయ లేరు.నేను గాని,నన్ను నమ్మి నాతో ప్రయాణం చేస్తున్న  వారు గాని ఎదుర్కోవాల్సిన కష్టనష్టాలేవైనా కానీయండి!, అంతిమంగా నా కోర్కె విజయం సాధిస్తుందన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు.మా అంతిమ విజయాన్ని కారాగారవాసం గానీ,మరణం గాని అడ్డుకోలేవు.
మొత్తం తన మనసు ఆవిష్కరణని పై కవితలో చెప్పాడు వివా. ఈయన కేవలం ప్రకృతి   కోసం పోరాటం చేసిన వ్యక్తే కాదు,పర్యావరణ కవిత్వానికి కొత్త భాష్యం   నేర్పిన ఘనుడు. పదబంధానికి అనుభవం,అనుభూతి కలిపి కవితనల్లే నేర్పరి.ఇది పర్యావరణ కవితకు ఉండే విశిష్ట లక్షణం.
పర్యావరణ కవిత్యానికి మరొక కీలక గుణం నెరేటివ్ కాపిటల్’, అర్ధాన్ని,సంఘటనల్ని వ్యక్తిగత అనుభవాల దృక్కోణం నుండి పరిశీలించడం. ఇది మనకి అవగతం అవ్వడానికి కేవలం అనుభుతుల్ని నుండి కాకుండా అనభవం కూడా అవసరం(అనుభం అంటే ఉద్యమకారు లవ్వాలన్న ఉద్దేశ్యం కాదు)., పరిపూర్ణమైన అవగాహన.
 పర్యావరణ విధ్వంసం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదు ,అదే విధంగా పర్యావరణ ఉద్యమాలు కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం కావు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పర్యావరణ ఉద్యమాల పుట్టుకలో,( ఎక్కువ శాతం అడువుల్లో నుండి మొదలయ్యాయి.) తీరుతెన్నులోను పోలికలున్నాయి. ఇవి ఎక్కువ శాతం అహింసా మార్గాలనే పాటించాయి.  అన్నిటినీ సమకాలికంగా  చూడడం అవసరం. అందుకే పర్యావరణ కవిత్వానికి   నేరేటివ్ కాపిటల్  లక్షణం వుంటుంది. మరొకటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల,వలస వాదం  వల్ల మల్టీ నేషనల్ కంపెనీలు అంతటా విస్తరించాయి. అవ్వి అన్ని చోట్లా వనరుల్ని హస్త గతం చేసుకోడానికి ఒకే విధమైన ఫార్ములాలు ప్రయోగిస్తాయి.వాటికి భూమి మీద వున్న వనరులు కాపిటల్. రాజ్య వ్యవస్ద తనకంటూ ఒక సిద్ధాంతాన్ని లేకుండా చేయడం. కంపెనీల దృక్పధమే ప్రభుత్వాల దృక్కోణం. ఈ వ్యవస్ధలో అంతర సూత్రంగా   వనరులపై  సంరక్షణ భావం కంటే, స్థానికులు వనరులు కంపెనీలకి వనరులు ఇవ్వరన్న అభద్రతా భావం వుంటుంది. ఇది కంపెనీల  నుండి  రాజ్య వ్యవస్దకి సోకిన వైరస్. అందుకే తరుచూ భూసేకరణ చట్టాల్లో మార్పుల్ని ప్రతిపాదిస్తారు.కంపెనీలకి, ప్రభుత్వాలకి తెలుసు -వాళ్ళు ప్రతిపాదించే ప్రయోగాల వల్ల వనరుల క్షీణత జరుగుతుందని.కానీ ఒప్పు కోరు . ఎందుకంటే భయం,నిజం చెపితే ఎక్కడ దక్కదో అన్న అభద్రత.
ఈ విషయాన్ని నేను విశాఖపట్నం జిల్లాలో ఆన్ రాక్ మైనింగ్ విషయంలో, నర్సీపట్నం దగ్గర మాకవారి పాలెం లో జరిగిన పబ్లిక్ హియరింగ్ లో స్వయంగా చూశా. పబ్లిక్ హియరింగ్ కి  ప్రభావిత జనాల్ని రానీయకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంది, పబ్లిక్ హియరింగ్ కి  వచ్చిన జనాల కంటే పోలీసు బందో బస్తు ఎక్కువ. ఇందంతా  ఎందుకంటే భయం.
మన కుళ్ళిన మనసుల్లో రహస్య గోళాలు
మనం ఎప్పటికి శుభ్రపర్చుకోం
పై కవిత కొద్ది పాటి మాటల్లోనే సమాజంలో నిజమైన చెరశాల భయం అని చెప్తుంది. మనల్నిఇది మాట్లాడకు అని మనకు మనం విధించుకునే సెన్సార్ . దీని గురించి జర్మి బెంతాం మైకేల్ ఫుకోల్ట్  విపులంగా  విశ్లేషించారు.
ఇది గ్రహించిన వివా తన గురించి ఇలా చెప్పుకుంటాడు.
నేనొక తుఫాను
నా రంగేమిటా అని పరీక్షించకు
నా మొహంలోకి కూడా
నువ్వు చూడ వద్దు
ఒక్క చావుతో
అంతమయ్యే వాణ్ని కాదు నేను
నే నొక తుఫాను
నీ జైళ్ళని ఒక్క ఊపు ఊపుతాను
నేను చావను
నా తల మీద ఆకాశం
నా ఊపిరిలో
పెనుగాలు లున్నాయి
నిజమే! నేను నల్ల వాణ్నే
పుట్టుక ముందే చచ్చిపోయే
జనం మధ్య పుట్టిన వాణ్నే
అయినా సరే
నే నొక తుఫాను
నేను నల్ల వాణ్నే
నా కంఠాన్ని మూసినప్పుడు
నీ చరిత్రంతా
నల్ల బారి పోవాల్సిందే
( కెన్ సారో వివా)
(అనువాదం- అఫ్సర్,1995)
పర్యావరణ కవిత్వం లో మరో విశిష్ట లక్షణం ప్రకృతి ప్రతీకల్ని ఒక ఉన్మాద  రూపంలో విశదం చేయదు దానికి కుండే గుణాన్ని సూటి గానే చెపుతుంది. అప్పుడు ప్రకృతి ఒక ఉన్మాదంగా కాకుండా సామాజిక,రాజకీయ వ్యవస్ధ ఒక ఉన్మాదంగా ప్రస్ఫుటం అవుతుంది. పై కవితలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

మనం ఇప్పటికీ ఎప్పటికీ ప్రకృతిలోని వాట్నే ప్రతీకలు గా తీసుకుంటాం. కాని ప్రకృతిలోని జీవరాసుల్ని ముఖ్యంగా జంతువుల్ని క్రూర మృగాలుగా ప్రతీకరిస్తాం. ఇది పంచతంత్ర కధల మహిమ. నిజంగా అడవిలోని జంతువులు క్రూర మృగా లైతే  ఏ ఒక్క గిరిజనుడూ మిగిలి వుండే వాడు కాదు. మానవాళి పరిణతి చెందేది కాదు. మనం ప్రకృతిని ప్రేమతో రక్షించడం కంటే ఎదుటి వాడి కంటే ముందే మనం దాన్ని పొందాలన్న ఒక ఆత్రుతతో కూడుకున్న భయం తో కబళిస్తాం. ఈ దురాక్రమణ మనని నల్లబారుస్తుంది .మనని అలా నల్ల బారకుండా చేయడానికి వచ్చిన కెన్ సారో వివా వ్యక్తి, కవిత్వం ఓ పచ్చని కాంతి విస్ఫోటం.

0 comments:

Post a Comment