Friday, 21 August 2020 By: satyasrinivasg

కళ్ళ కంచెలు

 భూమి పాట లో వస్తువుల్లా కాక మాములుగా తరుచు వింటూoడండి అన్న దాంట్లో  చాలా నిక్షిప్తతమైన అర్ధం వుంది. అది తెలియాలంటే  మన ఆలోచనలకి  జీవన స్పర్శతో కూడిన చలనం వుండాలి, మరి అది వుండాలంటే. మన మేధస్సుకి ఒక శైలి వుండాలి. దానికి ... వాల్ట్  విట్  మ్యాన్ అన్నట్టు రూపం, రంగు,సాంద్రత,  పరిమళం బాహ్యంగా వున్నదాంతో సంభాషించేది   నాలో ఏముంది అన్నది తెలియాలి. ఇది తెల్సుకోడానికి  మనం  రెల్లు గడ్డి పూల అలల పైన పశువుల కాపర్ల చూపుతో ప్రయాణించాలి. కారణం ఋతువుల మార్పు, అడవి రహస్యాలు, ప్రకృతి ప్రతీకలు వాళ్ళ కనుపాపల్లో అల్లుకుని వుంటాయి.   ప్రకృతిలో రంగుల నిగూఢ అర్ధం చెప్ప గలిగే మేధావులు వాళ్ళు .  ఎటువంటి జీవావరణంలో  నైనా జీవించ గలిగే సామర్ధులు. విశాలమైన మైదానంలో పశువులు మీద కూర్చుని  పశువులను మేతకు  తోలుతున్న పిల్లల దృశ్యం చూస్తుంటే ... నేల  కాన్వాజ్ పైన  నింగి రంగుల ఆట పాటల చలన చిత్రాన్ని సజీవంగా చూస్తున్నట్టు౦టుంది. వీళ్ళకూ స్ధానం ,రంగు అన్నవి భౌతికమైనవి. అవి చాలా విస్తారమైనవి. అందుకే వారి కనుపాప కొలనులో పలు హరివిల్లులు కొలువుంటాయి. ఇది నమ్మశక్యం కాదనుకుంటే వారితోనే ఒకసారి సంచరించి చూస్తే మన కనుపాప తడిలోనూ ఆ హరివిల్లు మొలకై మోలుస్తుంది.

పశువుల కాపర్లు

 

వాళ్ళ

భుజాల మీద కర్ర

రూపం మార్చే

సరిహద్దు

వాళ్ళ చేతులు

లోయ వంకలు

 

వాళ్ళు

మాటల్లేని

కబుర్ల గాలులు

 

వాళ్ళు

ఋతువుల మగ్గం పై

పచ్చికల్లే

నేల నేతలు

(2-4-2000,చల్లపల్లి)

నాకు పలు ప్రాంతాల్లో వాళ్ళ తో కలిసి పనిచేసే అదృష్టం కలిగింది. వాళ్ళ ద్వారా ప్రకృతి, సంచార జీవనం,  ప్రకృతి రంగుల్ని ప్రకృతి , సామాజిక పరంగా చూసే చూపు తెల్సింది. నా లోని ఆలోచనలకి కొత్త చలనం, శైలి తోడైయ్యాయి.

 

వాళ్ళ

భుజాల మీద కర్ర

రూపం  మార్చే

సరిహద్దు

 ఆ కర్ర కేవలం పశువులను అదుపు చేయడం కోసమే కాదు , అది పలు విధాలుగా ఉపయోగపడే పని ముట్టు. చాల సేపు ఒకే చోట నిల్చుని పశువుల్ని జాగ్రత్తగా కావలి కాసేటప్పుడు వాళ్ళు దాని  కొసన అరచెయ్యి పెట్టి తమ

దవడ ఆనించి వున్నప్పుడు ఆకాశమంత రూపం అమితమైన ప్రేమచూపుల చెట్టు అయ్యి కొలువున్నట్టు  అనిపిస్తుంది. లోయ వంకల ప్రతిధ్వని ఋతువుల మగ్గంలాగాను  నాకనిపిస్తుంది.  ఈ కవిత గురించి నేను ఇంతకంటే చెప్పలేను... అది మీ చేతుల్లో  వుంది ... ఇక మీరే చెప్పాలి...

నేలనల్లుకున్న చూపుకి సరిహద్దు గీతలు

పారిశ్రామీకరణ ,ముందు, ఇప్పుడు , విస్తారమైన పచ్చిక మైదానాలని, పంట భూముల్ని   ఎంక్లోజర్స్ గా వర్గీకరించి కైవసం చేస్కోడం జరిగింది. ఊరుమ్మడి భూముల్ని లాక్కుని ధనికులకు అప్పచెప్పడం జరిగింది.  ఇందుకు బల ప్రయోగం, దౌర్జన్య పద్ధతులు ప్రయోగించారు.18,19  శతాబ్దిలో జరిగింది. ఇది నేటికీ  కొనసాగుతోంది.

ఈ దురాక్రమణ వల్ల భూమి కొందరికి సొత్తుగా మారడమే కాదు, ప్రకృతిని చూసే దృష్టి కుడా మారిపోయింది. విస్తారమైన భూముల్లో వాటి సరిహద్దుల చుట్టూ, కంచెలు వేయడం, గోడలు కట్టడం వంటివి జరిగాయి , ముఖ్యంగా ఇంగ్లాండ్లో . వీటి స్ధానంలో  కొత్త రోడ్లు, కొత్త పొలాలు చోటు చేసుకున్నాయి. ఆ భుముల్ని వేరే రైతులకు, భూస్వాములకు అప్పచెప్పారు, ముందుగా  మాటామంతి పై వుండే ఒప్పందాలు  17 వ శతబ్దంలో పార్లమెంట్ చేతుల్లోకి వెళ్ళాయి,16వ శతాబ్దం  నుండి   1904  వరకు సుమారు  52000  బిల్లులు అమల్లోకి వచ్చాయి. పార్లమెంట్ లో భూస్వాముల పలుకుబడి వల్ల వాళ్ళ ఇష్టానుసారంగా ఈ ఎంక్లోజర్ భూముల వినియోగం జరిగేది. గత  500 వందల సంవత్సరాలుగా , రాజకీయ వేత్తలు,చరిత్ర కారులు, ప్రకృతి సంరక్షకులు  ఉమ్మడి భూముల్ని ,వ్యక్తిగత ఆస్తులుగా వ్యతిరేకిస్తూ ఈ చట్టాల పై గళమెత్తుతూనే వున్నారు. ఇది ప్రజల్ని ఇంకా పేదరికంలోకి నెట్టడమే కాక, గ్రామీణ ఆర్ధిక  వ్యవస్దని కృంగదీస్తుందని చెప్పినా ,ఎంక్లోజర్స్ ని ప్రోత్సహించే వాళ్ళు మటుకు ఇది నూతన ఆర్ధిక విధానానికి నా౦ది అన్న పాటను ఇంకా పాడుతూనే వున్నారు. 2009 నాటికి ఇంగ్లాండ్లో   ప్రజాస్వామ్య పాలన అధికారంలోనున్న  ప్రకృతి వనరుల ఆస్తులు  40,000 భూ మిలియనీర్ల చేతుల్లో వుంది, అంటే 0.06 శాతం. ఇక మిగిలిన కొద్దో ,గొప్పో  వున్న భూమి పై మిగిలిన వాళ్ళు తమ జీవనం కొనసాగించాలి.

ఎంక్లోజర్ల వల్ల కేవలం పశువుల కాపర్ల జీవనమే కాదు , మొత్తం అభివృద్ధి దిశా మారిపోయింది. ప్రకృతి పై ఆధిపత్య ధోరణి పెరిగి , మనం ప్రకృతిని చూసే చూపే మారిపోయింది.  ప్రకృతి వనరుల వినియోగంలో తారతమ్యాలు,తేడాలు ,వివక్షతకు వున్న విభజనకు కొత్త ధోరణలు పుట్టుకొచ్చాయి. అది  ఇంగ్లాండ్ ప్రకృతి కవి జాన్ క్లైర్  కవితలోని కొన్ని పంక్తుల్లో....



వాలిపోయిన ఎల్మ్ చెట్టుకి

జాన్ క్లైర్

 ఒకరి నష్టం మరొకరి హక్కు

 అది కొందరు మూర్ఖులకు లైసెన్స్ కల్పించింది

స్వచ్చమైన నిజాయితీ పరులను అధికారికంగా మోసం చేయడానికి

అలా ఎంక్లోజర్ వచ్చింది-  వినాశన దిక్చూచితో

స్వేచ్చను  ఆస్వాదించే చూపులకు  కరతాళ ధ్వనులు జోడై

సుఖంగా వుండే పాకల్ని పక్కకు తోసేశాయి

పని గుడారాల బందిఖానాలు అక్కడ నివాసాలయ్యాయి

మనుషుల్లోని ప్రకృతి మటుమాయమైoది

అందరి ఆరోగ్యం కొందరికి సొత్తై౦ది

ఇక  కుందేళ్ళకు నివసి౦చే బొరియలు కరువయ్యాయి

పేద వాడికి వున్న ఒకానొక ఆవు కనిపించకుండా పోయింది

ఏదేమైనా- తప్పు ఒప్పైంది, ఒప్పు తప్పైంది

 ఇక స్వేచ్చా వాయువు వున్న వాడి గీతమైంది



ప్రకృతి, పర్యావరణ కవిత్వం అర్ధం అవ్వాలంటే  వాటికి సంబంధించిన చట్టాల పైన  అవగాహన ఎంతైనా అవసరం. మనం అనుకున్నట్టు ప్రకృతి సంరక్షణ అన్నది కేవలం భావుకతతో వచ్చేది కాదు, కారణం అప్పుడు, ఇప్పుడు ,ఎప్పుడు ప్రకృతిని పాలకులు శాసనాలు, చట్టాల పరిధిలో ఇమిడ్చిపెట్టుకున్నారు. చట్టాల చట్రం అర్ధం కానంత వరకు , మనం అక్కడే తిరుగుతూ వుంటాం.

 పేద వాడికి వున్న ఒకానొక ఆవు కనిపించకుండా పోయింది

ఏదేమైనా- తప్పు ఒప్పైంది, ఒప్పు తప్పైంది

ఇక స్వేచ్చా వాయువు వున్న వాడి గీతమైంది

 చాల కాలం క్రితం విజయనగరం జిల్లాలోని పాచిపెంట దగ్గర ఒక గిరిజన గ్రామానికి అటవీ సంరక్షణ పని మిద వెళ్ళినప్పుడు ,జరిగిన సంఘటన ఇంకా మెదులుతూనే వుంటుంది. గోధూళి వేళ మేము ఊర్లోకి అప్పుడే అడుగెడుతున్నాం, ఊర్లో ఒక పిల్లాడు గట్టి గా ఏడుస్తున్నాడు,  విషయం  తెల్సుకుంటే, వాడు, పశువుల్ని మేతకు తీసుకు వెళ్ళాడు. తిరిగి వచ్చేశాక చూసుకుంటే ఒక ఆవు మందలో లేదు, వాడ్ని అడిగితే తెలియదన్నాడు. ఆవు పోయిందన్న భాదతో కూడిన ఉక్రోషంతో వాడ్ని తల్లిదండ్రులు చితక బాదుతున్నారు, ఆ భాధ తట్టుకోలేక వాడు రోదిస్తున్నాడు. అసలే ఎండా కాలం , పశుగ్రాసం దొరకదు, ఎక్కువ సేపు, ఎక్కువ ప్రాంతం తిరగాలి, అప్పుడు పశుగ్రాసం కోసం కొత్త దార్లని అన్వేషించాలి,   అన్వేషణ పిల్లాడికి, పశువులకు కొత్తే. అటువంటి సందర్భాల్లో పశువులు తప్పి పోవడం సాదారణంగా  జరుగుతుంది. కాని ఆవు పోయిందన్న బాధ లో ఇవన్నీ తటస్తించవు.

ప్రకృతిలో ఋతువ కూడా ఒక విధమైన కంచే. మరి ఈ కంచెలు మానవ ప్రేరితమైతే, గోధూళి వేళ, ఆవుల మందలో సూర్యుడు వాటి అడుగుల గుర్తుల్లో అస్తమిస్తాడేమో కాని, పిల్లలు, మంద ఇంటికి రాన౦త సేపూ పాకలోని దీపం ఆరదు...

చివరిగా  ఒక విషయం, వాస్తవమన్నది గుర్తించడానికి దానికి చలనం వుండాలి. వాస్తవాల్ని తెలుసుకోడానికి ఎక్కువగా చీకట్లోనే ప్రయాణిస్తాం. చలన రహిత అనుభవం కంటే అవాస్తవం లేదు. అలా అని చలనం వున్నవన్నీ వాస్తవాలు కాదు.  ఆధునికతలో కేవలం దృశ్య మాధ్యమాల  ద్వారా తెలిసే విషయాలే వాస్తవాలుగా భావించడం పరిపాటైంది. అందుకే చలన  చిత్రాల వల్ల అల్లుకుపోయిన ప్రపంచం అమితంగా ఆకట్టుకుంటుంది. మరో కళకు, కళాకారులకు  గుర్తింపునిచ్చే  చోటును కుడా లేకుండా చేస్తుంది. అన్నీ వ్యాపార ధోరణి బాటే పట్టాలి, లేకపొతే మింగ మెతుకు దొరకదు. చలనం అన్నది భావాల్ని ప్రేరేపించే ఆలోచన. నేడు మన భావాలు ,ఆలోచనలు, చేసే క్రియలు అన్నీ నియత్రించబడ్డాయి. మన సృజనాత్మకత చూపు ఈ కంచెలు దాటాలి .అప్పుడే గోధూళి వేళ మనం సమయానికి ఇంటికి చేరుతాం.


0 comments:

Post a Comment