గతంలో ప్రస్తావించిన పర్యావరణ క్షీణత, సంరక్షణలో మూడు మౌలిక అంశాలు. 1. ప్రకృతి సమిష్టి జీవన వ్యవస్ధగా , 2.ప్రకృతి ఉమ్మడి వనరులుగా, 3.ప్రకృతి
వ్యక్తిగత, వ్యవస్ధాగతమైన వనరుగా.
పై రెండు అంశాల చర్చ తర్వాత ఇప్పుడు మూడో అంశమైన
ప్రకృతి - వ్యక్తిగత, వ్యవస్ధాగతమైన వనరుగా
అర్ధంచేస్కోవాలంటే ముందుగా ప్రతివ్యక్తి ప్రకృతిని చూసే దృష్టిని అర్ధంచేస్కోవడం
ముఖ్యం. అది అర్ధం కానప్పుడు మన దృష్టినే ఎదుటివారి పైన రుద్దడం పరిపాటవుతుంది.
అందుకు కళలు, సాహిత్యం, కవిత్వం అతీతం కాదు. చాలా కాలం క్రితం మిత్రుడు
చెప్పిన ఒక కధ మీతో పంచుకుంటాను.
శిల్ప కళ మీద ఉత్సాహమున్న కుర్రాడొకడు, నేర్చుకోడానికి పేరొందిన శిల్పి దగ్గరకు వెళ్ళాడు. ఆ శిల్పి ఆ కుర్రాడు ఎందుకొచ్చాడో తెల్సుకుని, అతనికి ముందుగా ఒక పని చెప్పాడు. ‘అక్కడ ఒక
చిన్న బండ రాయి కనిపిస్తోంది,అవునా! అందుకు కుర్రాడు అవునన్నాడు. సరే అయితే నువ్వు
ఆ కొండరాయి లోని గుర్రం ఆకారం లేనిదానిని చెక్కేసి దానిని ఒక గుర్రంగా మలుచు, అప్పుడు నీకు శిల్పం ఎలా చెక్కాలో తెలుస్తుంది అన్నాడు’.
ఆ కుర్రాడు ఆ చిన్న బండ రాయిలో అసలు
గుర్రాన్ని చూసాడో లేదో ముందుగా
తెలుసుకోవాలి కదా! ఎవరికైనా ఔత్సాహికులలోని ఆలోచనా శైలి తెలియనప్పుడు
వాళ్ళకు మనం ఏమి నేర్పిస్తాం! ఏ కళాకారుడికయినా రెండు అంశాలు పైన పట్టు రావాలి, ఒకటి నైపుణ్యం(స్కిల్), రెండొవది
మెళుకువలు ( క్రాఫ్ట్). నేడు రెండవ దానికి సంబంధించి చాల పనిముట్లు వున్నాయి, కాని ముందుగా మొదటి దాని గురించి తెల్సుకుంటూ రెండవ దాని
పై దృష్టి పెట్టడం అవసరం.
ప్రకృతి, కళలు,
క్రీడలు కేవలం నేర్పిస్తే
వచ్చేవికావు. మనం పుట్టిపెరిగిన వాతావరణం, పరిస్ధితులు, ఇతరత్రా
కారణాల వల్ల అవి మనలో అంకురిస్తాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే పసి పిల్లలకి నడక నేర్పించనవసరం లేదు, అదే స్వతహాగానే వస్తుంది. కళ కూడా అంతే, అంటే ఆ నైపుణ్యం సహజమైనది, ఆర్ధిక
దృష్ట్యానే చూసే సమాజ నియంత్రణ వల్ల అ గుణాన్ని పసితనం నుండే చిదిమేసే యా౦త్రిక
సమాజం లో వున్నాం! ప్రకృతి ఎంతగా క్షీణించిందో అంతే స్ధాయి లో మనలోని కళాతృష్ణ
కూడా నశించింది. ఒక విధంగా చెప్పాలంటే
సృజనాత్మకంగా ఆలోచించే శైలిని, ప్రేమించే
గుణాన్ని చంపేశాము.
మనిషికి తను జీవించే కాలాన్ని అతి
చేరువుగా స్పృశించి తనదంటూ ఒక గుర్తు, చిహ్నమో ప్రకృతికి రూపొందించివ్వడం కంటే గొప్ప బహుమతి
ఇంకేము౦టుంది. ఇది వ్యక్తిగతమైన మానసిక అనుభవం నుండి రూపొందితే అది పది తరాలకూ
గొప్ప అనుభూతుల్ని ,భిన్న
ప్రతిస్పందనలను ఇస్తూ చెట్టు నీడలా అల్లుకుపోతుంది. ఒక విధంగా
చెప్పాలంటే కళాకారులు ప్రకృతి కంటే కళ నుండి
ప్రేరణ పొందుతారు, దీనితో చాల మంది ఏకీభవించకపోవచ్చు. కాని
మనం ఒకానొకప్పుడు ఒకరి కవిత్వం, కళల ద్వారా, ఆకర్షితులమై, ప్రేరితమై వారి బాట పట్టి ఒకానొక
రోజు మనదంటూ ఒక ఆలోచనా శైలిని నాటుతాం. ఈ
మార్గంలో ఎక్కడో అక్కడ, ఎప్పుడో
ఒకప్పుడు కళ- ప్రపంచం, జీవనం- ప్రపంచం, చుట్టూ ఏర్పడే ముఖ్యమైన స్ధితిగతుల మధ్యన సంతులమైన రేఖను గీయాలి.
ఈ గీత గీయడం అర్ధం కాకే పసితనంలోనే పిల్లలలోని సృజనాత్మక ఆలోచనా శైలి
అంతరించిన కోవలోకి చేరిపోయింది. ప్రకృతికి , కళలకి ఎంత సాంగత్యముందో అంత కంటే ఎక్కువ సాంగత్యం ప్రకృతికి, స్త్రీకి వుంది. ప్రకృతిని ఎంతగా దోపిడీ చేసామో బహుశా అంత కంటే ఎక్కువగా
స్త్రీలని చేశాము. ప్రకృతిని స్త్రీతో పోలుస్తూ, రెండిటిని అదేవిదంగా విచక్షణా రహితంగా దోచుకున్నాం.
ప్రకృతి-స్త్రీ
ప్రకృతి, స్త్రీలకి గల
సంబంధాన్ని పరిశీలించాల్సినప్పుడు, మానవ సమాజం
అభివృద్ది క్రమం ,ఆది నుండి
నేటి వరకు ప్రకృతిని వినియోగించే తీరు, ఆ తీరుకి
వినియోగించిన నైపుణ్యం, మెళుకువలు, అవి ఎవరి ఆధీనంలో, యాజమాన్యంలో
వున్నాయి అన్నవాటి చరిత్ర అన్ని కోణాల్లో చూడాలి. ప్రకృతిని ఉపయోగించే తీరులో ఒక
కీలక మైన ఆలోచన ‘ప్రకృతి వేరు
మన౦ వేరు’ ఆన ధోరణి. ఇదే ధోరణి స్త్రీ- పురుషుడు
అన్న ధోరణికి వర్తిస్తుంది. ఇది ‘నేను-ఇతరులు’ అన్న మేధస్సు
కోవ నుండి అ౦కురించిన ఆలోచన. పర్యావరణ విధ్వ౦శం లో బహుళ ప్రచారంలో వున్న దృష్టి పేదవాళ్ళు ప్రకృతిని విధ్వ౦శం
చేస్తున్నారని. కాని వాస్తవానికి ప్రకృతి క్షీణత వల్ల ఎక్కువగా
ప్రభావితులైయ్యే వాళ్ళు పేదలు, దళితులూ,గిరిజనులు, ఇతరులు. అందులో
ఎక్కువగా స్త్రీలు. వర్షాలు వున్నా లేకున్నా ఇంటికి దూర ప్రాంతాల నుండి నీళ్ళు
తెచ్చే వారు వాళ్ళు, అదే వర్షాలు పడక మంచి నీటికి బాగా ఎద్దడి అయినప్పుడు, దూర ప్రాంతాలకు
వెళ్ళి నీళ్ళుతెచ్చే వారు వాళ్ళు. పొయ్యిలో వంట చేరుకు తెచ్చేది వాళ్ళు. ఇదే వంట చెరుకు ఆమ్మకం కోసమైతే స్త్రీ ,పురుషుల మధ్య
తెచ్చే పద్ధతిలో మార్పులుంటాయి.మగవాళ్ళు అమ్మకం కోసమైతే సైకిళ్ళు,కావళ్ళు, ఎడ్లబండ్లు
వాడుతారు. కాని మహిళలు మటుకు ఎంత బరువైనా నెత్తిన పెట్టుకుని వచ్చేవారు. నాకు
ఇప్పటికీ కొన్ని దృశ్యాలు కళ్ళ ముందే తచ్చాడుతాయి, శ్రీకాకుళం, ఒడిస్సా
సరిహద్దున వున్న పాతపట్నం (1997 లో) బస్ స్టాండ్
దగ్గర మహిళలు తమ కంటే ఎత్తైన ఎండుకట్టెల్ని తమ ముందు పెట్టుకుని వరుసుగా నిల్చునే వారు, ఏదో జైల్లో ఊచల
చాటున ను౦చున్నట్టు. ఇక్కడే ఇంకో విషయం గమనించాలి వార్ని సమాజం ఎప్పడూ దోషులుగానే
చూసింది, కొనే వాళ్ళని కాదు. వంట చెరుకు అమ్మడం చట్ట రీత్యా నేరం, మరి కొనడం! వంట
చెరకు, పశుగ్రాసం. వ్యవసాయం వల్ల అడవులు నశించాయన్నవదంతి బాగా చలమణిలో
వుంది. అదే జరిగి వుంటే
అడవులు ఎప్పుడో నశించి పోయేవి .వంట చెరకు
కోసం ఎన్ని చెట్లని కొడతాం, కలప కోసం ఎన్ని చెట్లని
కొడతాం!
పై విషయాల్లో రెండు అంశాల్ని గమనిద్దాం, ఒకటి అమ్మకం వచ్చే సరికి సరుకుని సరఫరా చేసేందుకు యాంత్రిక
శక్తి ని పురుషులు వినియోగించడం. ఇది తక్కువ సమయంలో ఎక్కువ అమ్మడానికి. రెండవది
వంటచెరుకుని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వేలం వేసినప్పుడు అది అగ్రవర్ణ
భూస్వాములకు అందడం ,అదే విధంగా సా
మిల్లులకి కూడా. వంట చెరుకు వేలం దాని పైన
భూస్వాములకు, పేదలకు మధ్యన జరిగిన పోరాటం గురించి మహాశ్వేతా దేవి గారి ‘ఎవరిదీ అడవి’, ‘ద్రుపది’ లో చాల
వివరంగా రాసారు.
అడవిలోకి వెళ్ళి
వంట చెరుకు, మోదుగాకులు,అడ్డాకులు, ఫల సాయం, బీడిఆకులు
సేకరించడం అంత సులువైన విషయం కాదు. ఈ విషయంలో కుడా తారతమ్యాలు కనబడతాయి.
దీనికి సంబంధించి
మరొక సంఘటన చెబుతా... కాశ్మీర్ లో కార్గిల్ యుద్ధ కాలం. అదే కాలంలో ఇంకా కొన్ని
రోజుల్లోనే మంచు కురిసే కాలం
మొదలవుబోతుంది. అప్పుడు కనుక అడవిలోకి వెళ్ళి కట్టెలు తెచ్చుకోక పొతే
రాబోయే కాలంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఇక గత్యంతరం లేక మహిళలు అడవిలోకి
వెళ్ళి కట్టెలు తెచ్చుకొన్నారు. అప్పుడు యుద్ధం దేనితో!
స్వేచ్చ అన్నది
సార్వజనికంగా మన అవసరాల్ని తీర్చుకోవడమే అయితే, అది అందరికీ అందు బాటులో
వుండదు అన్నది కటోరమైన నిజం.
మార్క్సిజం లో
మహిళా స్వేచ్చకు, సాదికారతకు
సంబంధి౦చిన పరిధులను దాటి ఫెమినిజం ముందుకు వచ్చింది, కాని ఆ దృక్పదం కూడా
మహిళకు , ప్రకృతికి గల సాంగత్యాన్ని పరిగణలోనికి తీసుకోలేదు. ఈ
సాంగత్యాన్ని వెలుగులోకి తీసుకు వచ్చింది
ఎకో ఫేమినిజం.
నేడు సమస్త
మనుగడకు జన్యు క్షేత్రాలైన అడవులు, ప్రకృతిని దోచుకుంటున్న
క్యాపిటల్ సిన్ ధోరణి నే కాదు మానవ
పునరుతప్పత్తి బీజక్షేత్రాల సంరక్షణకు
ఎలుగెత్తే నినాదం ఎకో ఫెమినిజం.
అడవుల నుండి మేము ఏమి పొందుతాము |
నేల, నీళ్ళు,స్వచ్చమైన గాలి. |
గొడ్డలి తీసుకుని మూర్ఖుడు వచ్చాడు |
చెట్లని నరికాడు, కాని, నష్టం మాకు జరిగింది |
చెట్లని నరకడంతో అడవంతా కూకటివేళ్ళతో
మటుమాయమైంది |
మళ్ళీ నదుల్లో వరద ముంచుకొచ్చింది |
చెట్లని, అడవినంతటినీ రక్షించండి, |
చిప్కో,చిప్కో నినాదం మనది. |
కవయత్రి- రుపాలి గులాటి |
(అనుసృజన-
జి.సత్య శ్రీనివాస్)
ఎకోఫెమినిజం
చెప్పేదల్లా ప్రకృతి సంరక్షణ అంటే కేవలం
అడవుల్ని, ప్రకృతిని కాపాడడం కాదు. ప్రకృతి సంరక్షణ అంటే ‘నేను-ఇతర’ అన్న తారతమ్యం
లేకుండా మనలోని ప్రకృతితో మనం మమైకమవ్వడం. మనం తిరిగి వేర్లున్న చోటికి చేరి ఉమ్మి
నీటి కొలనులో ఈత నేర్చుకోవడం.
0 comments:
Post a Comment