The land is a mother that never dies…
-Maori
పోలినేషియన్ ఆదిమజాతి వాసులు 1320-1350 మధ్యన న్యూజిల్యాండ్ కు చేరినవారు. వారు అప్పుడన్న వాక్కు ‘పూడమితల్లికి
మరణం లేదు!”. అవును పుడమితల్లి
ఎప్పటికీ చావదు, కాని రోజు రోజుకి
క్షీణి౦చిపోతుంది. ఈ భూమి మనకుండే ఏకైక నివాసం అని అంటూనే మనం జీవించే స్ధలాల్ని కుంచిచేస్తాం! ఎదుగదల క్రమంలో స్పేస్
అండ్ టైంని హస్తగతం చేస్కోవాలన్న తాపత్రయంతో ,శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానం
ద్వారా నివాసాలని యంత్రాల అంగడిగా మార్చుకుంటాం. అప్పుడు మనం వుండేది
ఇల్లు అనబడే వస్తువులో!.ఈ వస్తువులో వున్న
సంబంధాలు యాంత్రికంగానే వుంటాయి. శారీరక శ్రమను తగ్గించుకునేందుకు ఇంట్లో కావల్సిన
యంత్రాలన్నీ వుంటాయి ఇట్లాంటి ఇళ్ళల్లో
పరిశ్రమలో పనిచేస్తున్నట్లుగానే
వుంటాం. అట్లాంటి ఇళ్ళల్లో జావేద్ అఖ్తర్
అన్నట్టు ‘యే తేరా ఘర్, యే మేరా ఘర్,కిసీకో దేఖనా ఉధర్, తో ఫహలే ఆకే మాంగ్ లే తేరీ నజర్, మేరీనజర్’
.దీని అర్ధం ఇది మనద్దిరి ఇల్లు, ఎవరికైనా చూడాలనిపిస్తే, నీ చూపుని, నా చూపుని
ముందుగా అడగాలి.
ఇలా వుండే వాళ్ళు లేకుండా పోతున్నారు, ఇంకా వున్నా అలా చూడాలని చూపునిస్తే కళ్ళు
పొడిచేస్తున్నారు జావేద్ భాయ్. ఇంకే౦చెప్పాలి భాయ్! ,తరచూ ఎదురయ్యే ప్రశ్నలు, మీరు
ఎక్కడ వుంటారు, ఫలానా చోట అని సమాధానం చెప్పే ముందే, అక్కడ స్ధలాల రేట్ ఎంత. స్ధలం
రేటు ఎక్కువగా లేని ప్రాంతంలో వుంటే,
ఎందుకు అక్కడ వుంటున్నావు, అంటారు. అక్కడ డెవెలప్మెంట్ లేదు కదా. సరే, ఇంట్లోకి అడుగుపెట్టడం ఆలస్యం, ఇప్పుడు ఇంటి వాల్యూ ఎంత. అలా అడుగుతూనే ఇంట్లో
ఖరీదైన సామాన్లు ఏమున్నాయి అన్న చూపులు.ఇంక ప్రశ్నల పరంపర షురూ...
పెళ్లిళ్ళల్లో కదులుతున్న నగల షాపులో
బంగారం వెల తెలుసుకుంటునట్టు. ఇంట్లో మొక్కలు తప్ప ఏమీ బరువైన వస్తువులు
కనిపించకపోతే CAG(Comptroller and Auditor General of India) రిపోర్ట్ వాళ్ళ అంతట వాళ్ళు రాసుకుని ఇక
సబ్మిషన్ కి వెళ్ళిపోతారు. అరె చెప్పడం
మర్చిపోయాను, ఇంట్లో వచ్చిన వాళ్ళకు టి, కాఫీ అడిగితె వంటిటి వైపు చూస్తారు, అక్కడ
ఎవరూ కనిపించపోతే, ఏంటి నువ్వు ఇస్తావా అన్నట్టు గా ఒక చూపు విసురుతారు. అబ్బే
వద్దు, ఇంట్లో ఆడవాళ్ళు లేరనుకుంటా , మీకెందుకు శ్రమ. మా ఇంట్లో వుండేది
ముగ్గురమే, మావాడు వేరే ఊర్లో చదువుకుంటున్నాడు, ఆమె ఫీల్డ్ వర్క్ మీద వేరే ప్రాంతానికి వెళ్ళింది. ఇంకో మూడు, నాల్గు రోజుల్లో వస్తుంది అని చెబుతాను. దానికి వాళ్ళ ప్రశ్నార్ధక చూపులు, అరె ఆవిడ ఏంటి వూర్లకి వెళ్ళి పనిచేయడం
, ఈయన ఇంట్లో వుండడం ఏంటి, అదేదో నేను మరో
రకమైన క్వారెంటైన్లో వున్నట్టు. ఇందంతా
ఏంటి అని నాకు ప్రశ్నలు మిగులుతాయి.
ఇళ్ళు అనగానే ,బాగా ఖరీదైనది, ఇంట్లో వస్తువులతో
బాటు వుండాలి(ఎన్ని ఇ.యం.ఐ లు వున్నా
పర్వాలేదు). సతీమణి బయట పనిచేస్తున్నా ,
ఇంట్లో పని చేయాలి.ఇంటి చుట్టూ ఖాళీ స్ధలం వుండకూడదు. (వున్నా దాచేయండి), అలా
వుంటే ఆ ఇంటి ప్రాంతo అభివృద్ధి చెందని ప్రాంతం.
మనం ఎప్పట్నుంచి చేను మకాములు వదిలి పరిశ్రమించి
నగరాలలోకి వచ్చామో అప్పటి నుండి ఈ ధోరణి
కొనసాగుతోంది. ఎంతైతే టైం అండ్ స్పేస్ ని జయించామో, అంతకంటే ఎక్కువ శాతం
భూమిని నిర్జీవంగా మార్చాము. మనకంటూ టైం అండ్ స్పేస్ ని , మనలో వుండే సహజమైన
గుణాల్ని కోల్పోయాము, మచ్చుకగా ... మీరు ఎవరినైనా చదువుకున్న వాళ్ళని అడగండి ,
ఈమధ్యన ఏమైనా చదివారా. రాశారా, ఠక్కున వచ్చే సమాధానం అబ్బే నాకు ఆ రెండు అలవాట్లూ
లేవండి. అంటే మనం పెట్టె పెట్టుబడంతా బడి అయిపోయిన వెంటనే ఆ గుణాన్ని ఖచ్చితంగా
చంపేసి మనని కేవలం మానసిక, శారీరక కార్మికులుగా మార్చి
డబ్బు తోవ పట్టిస్తుంది. ఇంత ప్రణాళికా బద్ధమైన చదువులు చదివి మన యాంత్రిక
జీవనాన్ని జీవిస్తునప్పుడు, ప్రకృతి లో స్త్రీని ఏమి చూస్తాం, స్త్రీ లో ప్రకృతిని
ఏమి చూస్తాం. చూడలేము ,ఎందుకంటే అలా చూసే గుణాన్ని మన గడప మీద కాలు మోపనీయం. కాలు
మోపితే పరువు హత్యలు జరిగుతాయి. పరువు, ప్రతిష్ట అంతా డబ్బుతోనే ముడిపడివుంది.
‘డబ్బు ఊరికే రాదు’, భూమిని లోతుగా తవ్వి రాబట్టాలి. పుడమితల్లి అంటూనే మొక్కి మరీ
తవ్వకాలు చేపట్టాలి. ప్రణాళిక బద్ధమైన ఈ
చర్యలు స్త్రీలను సమాంతరంగా వివక్ష, దోపిడీకి గురిచేశాయి అని ఎకో ఫెమినిజం చూపిస్తుంది.
అంతే కాదు ప్రకృతి, స్త్రీని భౌతికంగా దోచుకోవడం వల్ల పితృస్వామ్య వ్యవస్ధలో పలు
రకాలుగా అధికారం ఎలా నిలదొక్కుకు౦టుంది అన్నది చూపిస్తుంది. ఎకోఫెమినిజం ఈ
పితృస్వామ్య వ్యవస్ధలలోని అధికారాన్ని ప్రశ్నించడమే కాక వాటిని మార్చే ప్రక్రియను తెలియచేస్తాయి.
అది సాహిత్య, కవిత్వ మాధ్యమంలో అంకురించింది. ఎకోఫేమినిజం కవిత్వం అంటే పుడమి జీవనయోగ్యంగా
వుండాలంటే మన బీజ క్షేత్రాలలో భ్రూణ హత్యలు వుండకూడదు అని కూడా
పేర్కుంటుంది. ఎకో ఫెమినిజం కవిత్వం మన సృజనాత్మక ఆలోచనకు జీవనాడి.
ఈ జీవనాడి ద్వారా స్వేచ్చకు కావాల్సిన మౌలిక దృక్పధాన్ని
అన్వేషిస్తుంది. మార్క్ ట్వైన్ అన్నట్టు “freedom is not the avoidance of painful
conditions”. అవును స్వేచ్చ అంటే
కటినమైన పరిస్థితుల నుండి పారిపోవడం కాదు, వాట్ని మార్చడం. అది జరగాలంటే ముందుగా
మనకి స్వేఛ్చ అనే దానికి అర్ధం తెలియాలి అదే విధంగా బందీగా వుండడం అంటే కూడా తెలియాలి.
ఈ
రెండింటి తేడాలను మాయ ఆన్జిలో పంజరంలోని పక్షి కవితలో వివరిస్తుంది
పంజరంలో పక్షి |
మాయ ఆన్జిలో |
ఒక స్వేచ్చా విహంగం |
గాలి వీపున కూర్చుని ఎగురుతుంది |
అలలు ఆగిపోయెంత వరకు |
నది ముఖద్వారం దాకా ఈదుతుంది |
అక్కడ,కాషాయ రంగు సూర్య కిరణాలలో |
రెక్కలను ముంచుతుంది |
ఇక, ధైర్యంగా రివ్వున ఆకాశంలోకి దూసుకువెళుతుంది. |
కాని ,పంజరంలో చిక్కుకున్న పక్షి |
ఎప్పటికీ తన కాంక్షను ఊసలు దాటి చూడలేదు |
రెక్కలు కత్తిరించ బడ్డాయి |
కాళ్ళకు సంకెళ్ళు |
అందుకే అది గొంతు విప్పి పాడుతుంది. |
పంజరంలోని పక్షి |
తెలియని వాటి గురించి |
వణుకుతున్న స్వరంతో పాడుతుంది |
దూరాన కొండంచున వాటికి |
తన గళం వినపడుతుందన్న ఆశతో |
పంజరంలోని పక్షి |
స్వేచ్చా గీతం పాడుతుంది. |
స్వేచ్చా విహంగం మరో వాయువు గురించి ఆలోచిస్తుంది |
అందమైన వృక్షాలనుండి వచ్చే మెత్తటి గాలి వీస్తున్నట్టు |
సంధ్య వెలుగులో పచ్చిక పైనున్న లావుపాటి పురుగుల్ని తల్చుకుంటూ |
ఇక ఆకాశాన్ని తనదిగా భావిస్తూ |
కాని కలల సమాధి పైన నుంచున్న పంజరంలోని పక్షి నీడలు |
పీడకలలరుస్తుంటాయి |
దాని రెక్కలు కత్తిరించ బడ్డాయి, కాళ్ళకు సంకెళ్ళు |
అందుకే అది గొంతు విప్పి పాడుతుంది. |
పంజరంలోని పక్షి |
తెలియని వాటి గురించి |
వణుకుతున్న స్వరంతో పాడుతుంది |
ఆ కొండంచున వాటికి |
తన గళం వినపడుతుందని ఆశతో |
పంజరంలోని పక్షి |
స్వేచ్చా గీతం పాడుతుంది. |
మాయ అన్జిలో (1928-2014) అమెరికన్ కవయత్రి, సింగర్, మేమోరిస్ట్, మానవ హక్కుల
కార్యకర్త. ఆమె ఎన్నో కవితా సంపుటులను విలువరించారు. అందులో మొదటిది I know why the caged bird
sings(1969). ఇందులో తన 17వ వయస్సు వరకు గల అనుభవాల్ని వ్యక్తపరిచారు. పై కవితలోని
భావం అప్పటి నుండి నేటి వరకు
మనందరం ఏదో ఒక దాంట్లోబందీలై వున్నాము, ఆ బందిఖానా నుండి విముక్తి
కోరుతున్నాం అని చెబుతూనే వుంది. విముక్తి కల్గిన వాళ్ళు అలలు ఆగిపోయెంతవరకు గాలి వీపున కూర్చుని
ఎగురుతూ మరో వాయుని వైపు పయనిస్తారు. కాని పంజరంలో వున్న పక్షి మటుకు ఎక్కడో
కొండంచున వున్న వారు తను కోరుకునే స్వేచ్చా గీతం వింటారన్న ఆశతో పాడుతూనే
వుంటుంది. ఈ పాట మనకు చేరి మన చూపుని
మార్చాలి. అది జరగాలంటే, వెలుగు మన మనస్సు ఆవరణలోనే వుంది, అది మనకు కనిపించకుండానే ఎదుగుతుంది.మనమందరం ఆ
వెలుగు కోసమే అన్వేషిస్తాం. అదే అంతర్లీన
శక్తి, నిర్దిష్టమైన సంస్కృతి వలయాల్లో ముడిపడి పోయింది. ఈ చిక్కు ముడులను విప్పడానికి మనకు కావలిసినది కేవలం
ప్రజాస్వామ్య పరిపాలనే కాదు, అందులోనూ భుస్వామ్య౦ వుంది , అది కాదు మనకు
కావలిసింది . మనకు కావలసినది ఈ నేల దృశ్యం
లో ఎన్నో జీవరాశుల రంగుల కలయికల చూపు కావాలి. అప్పుడే పంజరంలోని పక్షికి స్వేచ్చా
వాయువు లభిస్తుంది, అదే భూమిస్వామ్య(ఎర్త్ డెమోక్రసీ).
0 comments:
Post a Comment