నర్మదా బచావో ఆందోళనలో కీలక పాత్ర వహించింది మేధా పాట్కర్. ఈ ఉద్యమం ద్వారా ఉద్యమం ఎన్ని
విధాలుగా చేపట్టాలో కూడా వెలుగులోకి వచ్చింది. పర్యావరణ,నదులు ,ఆనకట్టలు చర్చల్లో
నిర్వాసితం అన్న అంశం ప్రపంచ వ్యాప్తంగా తెల్సింది. ప్రపంచ బ్యాంకు ఈ విషయంలో తన
ఆపరేషన్ ఇవాల్యువేషన్ డైరెక్టివ్స్ మార్చుకుంది. పునారావాస ,పునరుద్ధరణ ప్రణాళికలు
మళ్ళీ వెలుగులోకి వచ్చాయి. ఈ మార్పులు ఇప్పుడు భూసేకరణ చట్టంలో జరుగుతున్న
మార్పులకు మూలాలు. అదే విధంగా అభివృద్ధిలో భాగస్వామ్య౦ పేరు మీద జరుగుతున్న
పబ్లిక్,ప్రైవేట్,పీపుల్ పార్టనర్ షిప్ వంటి ప్రయోగాలు మొదలవడానికి కారకులు.
మనం జీవించడానికి వేరే గ్రహాల్ని అన్వేషిస్తున్నాం ,కాని అసలు విషయం ఈ భూమిని
నిర్వీర్యం చేసి మనమందరం నిర్వాసితులమవుతున్నాం
అన్నది అసలు వాస్తవం. సామాజిక వాతావరణం మారినప్పుడు సహజంగానే ప్రకృతి వాతావరణం
మారుతుంది. నది పైన పెద్ద ఆనకట్టి కట్టినప్పుడు పరివహక ప్రాంతంతో బాటు ఆయకట్టు
ప్రాంతం తీరుతెన్నులు మారుతాయి. ఒక కాలంలో ఆనకట్టలు కట్టింది వ్యవసాయానికి నీరందించడానికి
,కాని నేడు వ్యవసాయం అన్నది నామ మాత్రమే ,అసలు అవసరాలు నగరాల దప్పిక తీర్చడానికి,
పరిశ్రమల అవసరాలకి. పోలవరం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వీటన్నిటికి త్యాగాలు చేసేది
గిరిజనులు, దళితులూ. వీళ్ళకి భూమి మీద హక్కులు ఇవ్వరు. దళితులకు ఇచ్చిన భూములు
నేటికీ డి. పట్టా భూములే, వాటిలో దేశ అబివృద్ధి కోసం తిరిగి తీస్కుంటాం అని సుస్పష్టంగా
పేర్కొని వుంటుంది.
నర్మదా ప్రాంత వాసులు నర్మదా నది కి
ఆనకట్టకు సంబంధించిన కధ ఒకటి చెపుతారు.మహాభారత కాలంలో అర్జునుడు నర్మాదని
పెళ్ళాడాలనుకుంటాడు.నర్మద ఒక షరతు పెడుతుంది. అది తన మీద సాయంత్రం కాకి కూతలోపు తన
పైన ఆనకట్ట కట్టాలని. అందుకు అర్జనుడు ఒప్పుకుని భీముడి సహాయంతో రెండు పర్వతాలు
తెచ్చి నదికి ఇరువైపులా పెడతాడు. ఇంకా మరో కొండ తెచ్చి ఆ కొండల పైన వారధి ఏర్పరచడానికి
వెళతాడు. వాళ్ళు అన్నంత పని చేస్తారని నర్మద సాయంత్రంలోపే కాకిలా అరుస్తుంది. అది విని అర్జున ,భీములు తమ ప్రయతాన్ని వదిలిపెట్టి
తిరుగు దారి పడతారు. తల్లి నర్మదని ఎవరూ బంధించలేరని స్థానికుల నమ్మకం. మరి కొందరు
స్ధానికులు ఈ కధకి కొనసాగింపుగా, అర్జనుడికి కోపం వచ్చి కలియుగంలో మనుషులు నర్మద
పై ఆనకట్ట కడతారని శపించాడని అంటారు. ఆ శాపం ఎన్నో విధాలుగా ప్రస్ఫుటం అయ్యింది.
కొందరు గిరిజన పెద్దలు ఆనకట్ట కడతారని పాతిక సంవత్సరాలుగా తమ వ్యవసాయ భూముల్ని
అభివృద్ది పర్చుకోలేదు. ఇదీ ఒక విధమైన నిర్వాసితమే.
నేడు జరుగుతున్న 102 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్స్ లో మన పురాణాలు
సైన్స్ గురించి మాట్లాడుతాయి,కాని ఇవి ఎవరి పురాణాలు ? గిరిజనుల జ్ఞానం, జీవనం
సైన్స్ గా పరిగణిoచి దాన్ని విస్మరిస్తాం. ఎందుకంటే వాళ్ళు భూమి పుత్రులైనప్పటికీ
వాళ్ళని నరసురులుగా చిత్రీకరించాం. అక్కడ ఆనకట్టలు కడితే భూమిని అభివృద్ది
చేస్కోకుండా వుండి పోయారు. అదే కొత్త రాజధాని కాని ,పోలవరం కాలువ వస్తోంది అంటే చుట్టు
పక్కల భూముల ధరలు ఆకాశాన్ని తాకు తాయి. ఎకరం భూమి కోటి పైగా పలుకుతుంది. ఒక ఎన్.
ఆర్. ఐ. కూడా కొనడానికి సంకోచిస్తాడు.
మనం భూసేకరణ ,పురావాస ,పునరుద్ధరణ చట్టంలో మార్పులు ఒక శతాబ్దం తర్వాత మార్పులు
చేస్తున్నాం. కాని ఇప్పటికీ ఆ రెండిటిని అమలు పరచడంలో మనకి నైపుణ్యం లేదు.
ముఖ్యంగా పునరావాస,పునరుద్ధరణ అన్నది కేవలం నిర్వాసితుల్ని ఒక చోట నుండి మరో చోటుకి చేర్చి వారికి బస ఏర్పాటు చేయడం
కాదు. వారు తిరిగి సామాజికంగా,మానసికంగా తమ ఉనికిని ,జీవనాన్ని పునారావృతం చేస్కోవడం.
దానికి పట్టే కాలాన్ని ఖచ్చితంగా చెప్పలేం. నిర్వాసితుల మదిని తొలిచే ప్రశ్నలకి మన
దగ్గర సమాధానాలు లేవు. వారిని వారు ఓదార్చుకునే తీరు...
‘నీ మదిలో సమాధానాలు దొరకని ప్రశ్నలపై ఓపికగా వుండు, ఆ ప్రశ్నల్ని వాటిగానే
ఆస్వాదించు.బంధించిన గదులలాగా, పరిచయంలేని బాషలో రాస్తున్న పుస్తకాలుగా
స్వీకరించు.వాటికి సమాధానాల్ని ఆశించకు,వాటి సమాధానాల్ని నువ్వు జీర్ణి౦చుకోలేవు,
వాటితో సాంగత్యం చేయనూలేవు,విషయం ఏమిటంటే, అన్నింటా జీవించాలంటే, ఇప్పుడు ఆ ప్రశ్నల్ని వదిలిపెట్టు.క్రమేణా నువ్వు, నీకు
తెలియకుండానే, రాబోవు రోజుల్లో ఒక సమాధానం
గా జీవించేస్తావు.’-రైనర్ మారియా రైక్.
1992లో ఖమ్మం
జిల్లాలోని చింతూర్ మండలంలోని చట్టి గ్రామంలో మాన్య ప్రాంత చైతన్య సదస్సు
కార్యక్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధ కోయరాలు అన్న మాటలు ఎప్పటికీ
మర్చిపోలేను ‘బాబూ, నా చుట్టూ పక్కల వున్న చెట్టు,పుట్ట ,వాగు,
వంక ,జీవాలని నాకు నష్ట పరిహారంగా
ఇయ్యండి, నేను మావూర్ని పోలవరం డ్యామ్ కోసం వదిలి వెళ్ళి పోతా’ మన చుట్టూ వున్నఆవరణ ,మనలోని
పంచేంద్రియాలు, వాటినుండి మనని విడదీసి బతకమనడం నిర్వాసితం. దానికి నష్ట పరిహారం
ఇవ్వడం ఎవ్వరి తరం కాదు. నేడు అవతరించిన రెండు కొత్త రాష్ట్రాలకి త్యాగం చేసింది
పోలవరం నిర్వాసితులు.వీరి కోసం ఓ కొత్త జిల్లాని ఏర్పాటు చేయడం అన్నది కొత్త విషయం
కాదు. పెసా చట్టం ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనులకి వారి జిల్లాలు ,మండలాలు
ఏర్పాటు చేయాలి, అదే విధంగా కొత్త ప్రాజెక్ట్లు వస్తునప్పుడు గ్రామసభలకి తెలియచేసి
వారి ఆమోదం పొందాలి. మరి ఇవన్నీ ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న భూసేకరణ ఆర్డినెన్స్
లో లేకుండా పోతున్నాయి.అంటే ప్రాధమిక మానవ హక్కులైన ప్రి అండ్ ప్రియర్ ఇంటిమేషన్, కన్సంట్
తో బాటు సామాజిక ప్రభావ అంచనాలను కొట్టి
పారేయడమే.
ఆ మనుషులు ఎక్కడ
(నశ్రుల్ గీతి, అనూప్ గోషాల్)
గంగ, సింధు, నర్మదా
కావేరి ,జమునల జలాలు
అవి మునపటి లానే ప్రవహిస్తున్నాయి
కాని అప్పటి మనుషులు ఏరి?
గంగ, సింధు, నర్మదా
నిశబ్దం లో వున్న హిమాలయాలు
నిలువెత్తు భక్తితో అలానే నిలబడి వున్నాయి
కాని ఇప్పుడు అక్కడ ఋషులు వుండడంలేదు
మనం అప్పటి మనుషులం కాదు
మన పైన ఆకాశం ఇప్పటికీ వుంది
కాని ఇంద్రుడి దివ్యత్వం లేదు
కైలాస పర్వతం వుంది
అందులో శివుడి తేజస్సు లేదు
మన పైన ఆకాశం యిప్పటికీ వుంది
కాని ఇంద్రుడి దివ్యత్వం లేదు
కైలాస పర్వతం వుంది
అందులో శివుడి తేజస్సు లేదు
దేవుడి పిల్లలిప్పుడు యాచిస్తున్నారు
ఇదేనా మన విధి
కాని అప్పటి మనుషులు ఏరి?
గంగ, సింధు, నర్మదా
ఇప్పటికీ ఆగ్రా కోట వుంది
దిల్లి కూడా వుంది
కాని సర్వాంతర్యామి కీర్తి లేదు
కోహినూర్ వజ్రం దొంగలించబడింది
నెమలి సింహాసనం కనిపించడం లేదు
మన వీర సైనికులు, చరిత్ర ఇప్పుడు
ఎవరి దగ్గరైనా సమాధానాలు వున్నాయా?
మనం ఏమీ చెయ్యొద్దా, ఏమీను?
ఎవరి దగ్గరైనా సమాధానాలు వున్నాయా?
మనం ఏమీ చెయ్యొద్దా, ఏమీను?
మన కోసం ఏమిటని వేచి వుంది?
ఇది మన క్రూర నుదిటి రాత అని ఒప్పుకుందామా?
కాని అప్పటి మనుషులు ఏరి?
గంగ, సింధు, నర్మదా
కావేరి ,జమునల జలాలు
అవి మునపటి లానే ప్రవహిస్తున్నాయి
కాని అప్పటి మనుషులు ఏరి?
గంగ, సింధు, నర్మదా
(అనుసృజన)
ఈ పాట వింటుంటే మనస్సు కనురెప్పలకి
కన్నీళ్ళ చెమ్మ నీటి గింజల్లా అల్లుకు పోతాయి. పర్యావరణ కవిత్వం ఈ నీటి గింజల
సవ్వడే! ఎందుకంటే అబివృద్ధిని పొందడానికి జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ లో గిరిజనులు, దళితులూ ,నిరుపేదలు ,చిన్న రైతులు
గిన్ని పిగ్స్ గా మార్చబడుతున్నారు.
నదిప్పుడు మన నేలలో వున్న టియర్ గ్లాండ్ ,అది డ్రై అయిపోతోంది.పర్యావరణ
కవిత్యం ఆ డ్రైనెస్ కి కొద్దిగా చెమ్మనిచ్చే
మంచు కమ్మిన ఉదయం.
0 comments:
Post a Comment