మన దేశ సంస్కృతి నదీ
సంస్కృతి. మన జీవనం గుడులు(ప్రముఖమైనవి) అన్నీ నది ఒడ్డున వెలిసినవే. అదే విధంగా
మన అంతిమ యాత్రలు, పాప ప్రక్షాళనలు, పిత్రులను స్మరించుకునేది ఆ ఒడ్డునే. ఒక విధంగా
చెప్పాలంటే మన జీవన చక్రం ,జల చక్రంతో ముడి పడి వుంది. ఈ జీవన చక్రానికి జీవం
పోయడానికి భగీరధుడి ప్రయత్నాలు సదా జరుగుతూనే వున్నాయి.గంగ భూమిని చేరడానికి
మధ్యలో వారధి కావాలి ,లేకపోతే గంగ ప్రవాహ తాకిడిని తట్టుకునే శక్తి భూమికి లేదు.
ఇతిహాసాల ప్రకారం అప్పడు బ్రహ్మ ప్రకృతి ప్రళయం గురించి తీవ్రంగా వ్యధ చెందాడట. ఆ
వ్యధను ఈ విధంగా వ్యక్త పర్చాడు...
గంగ, ఎవరి అలలు
స్వర్గంలో ప్రవహిస్తాయో
ఆమె మంచు దేవుడి
బిడ్డ
శివుడిని
ఆశ్రయించు,ఆయన సహాయం కోరు
ఆమె ప్రవాహాన్ని
మధ్య దారిలో అడ్డుకునేందుకు
ఒక్క భూమి వల్ల అది
సాధ్యపడదు
గగనం నుండి వస్తున్న ప్రవాహాన్ని
(అనుసృజన)
పై ప్రస్తావించిన
మెటాఫర్ పెద్ద పెద్ద నదులైన గంగ వంటివి ,వాటికి సంబంధించిన జలచక్రాల గురించి.
ఇక్కడ గమనించాల్సిన విషయం పచ్చదనం లేని (నేకెడ్ ఎర్త్) భూమి పాకి నీటి ప్రవాహం
ఉదృతంగా వస్తే విపత్తులు సంభవిస్తాయి. శివుడి జడలలో ఓ భౌతిక శక్తి వుంది, దానికి
ఉపరితలం నుండి వేగంగా వస్తున్న నీటి తాకిడిని అడ్డుకునే శక్తి వుంది. అది కొండలలో
వున్న పచ్చదనమే కావచ్చు.
పచ్చదనాన్ని ఈ
చూపుతో చూసి వుంటే నది ఒడ్డున నున్న గూడుల స్ధానం లో డ్యాంలు వచ్చివుండేవి కావేమో.
బాబా ఆమ్టే అలా ఒడ్డున ఒంటరి భౌద్ధ వృక్షంలా ఉండేవాడు కాదు.పారిశ్రామీకరణ అన్నది
మనలో కాలాన్ని జయించి ఎక్కువ స్పేస్ ని ఆక్రమించాలి అన్న కోరికను బలంగా పెంచింది.
దీని వల్ల మన లోని ప్రకృతి క్షీణించింది.డ్యాంలు కట్టడం వల్ల నాల్గు రకాల విధ్వంసం
జరుగుతుంది. 1.పరీవాహక ప్రాంతంలో వర్షపాతం తగ్గుతుంది, తదనుగుణంగా నదీ ప్రవాహం
తగ్గి, జీవ నదికి ఋతువుల బట్టి ప్రవాహం ఏర్పడుతుంది.2. సహజ సిద్ధ మైన ప్రవాహాన్ని
అరికట్టి ,ఇంజనీరింగ్ తో ఏర్పడ్డ ప్రవాహం వల్ల ఆయకట్టు ప్రాంతాలలో వాటర్ లాగింగ్,(నీటి
నిల్వ) సెలినిటి(ఉప్పగా మారడం) పడుతుంది (యివి కోస్తా ప్రాంతంలో కనిపించే సమస్యలు).3.
నీటి సహజ ప్రవాహ తీరులో మార్పుల వల్ల
దిగువ ప్రాంతంలో భూగర్భ నీరు పునరావృతం అవ్వడంలో ఒడిదుడుకులు ఏర్పడుతాయి.4. సముద్రంలో కలిసే ఫ్రెష్ వాటర్
నిష్పత్తి తగ్గడం వల్ల సంద్రపు నీరు- ఫ్రెష్ వాటర్ బ్యాలెన్స్ లో మార్పులు జరుగుతాయి దీని
కారణంగా సెలినిటి, ఇంకా సముద్రం కోతకు గురవుతుంది.
ఒక డ్యాం వల్ల
ప్రకృతిలో జరిగే మార్పులు ఇవి. ప్రకృతి వనరుల్ని వినియోగించడం కోసం హింసతో ముడి పడి వున్న మార్గాలే అవలంబిచాల్సిన
అవసరం లేదు. స్థానికుల జ్ఞానాన్ని ప్రతిపాదనల్ని పరిగలోకి తీసుకోవచ్చు. ఈ మాటలు
అన్నధి ఆధునిక ఇరిగేషన్ ప్రాజెక్ట్లు చేపట్టిన
సర్ ఆర్థర్ కాటన్, ‘భారత దేశంలో వివిధ ప్రాంతాలలో పురాతన కాలం నాటి పలు రకాల కట్టడాలున్నాయి...
ఇవి గొప్ప పనులు, ఇవి కాలానికి తట్టుకు వున్నాయి, నైపుణ్యానికి చిహ్నాలు. నేను
మొదటి సారి భారత దేశానికి వచ్చినప్పుడు ,ఈ కట్టడాల పైన చూపిస్తున్న అశ్రద్ధ
గురించి స్ధానికులు సూక్ష్మoగా చెప్పిన తీరు
వాస్తవం. వాళ్ళన్నది మేము నాగరిక క్రూరులం,పోరాడడంలో అద్భుతమైన నైపుణం
వున్న వాళ్ళం,కాని ఎంత అత్మాన్యూనతులం ఆంటే పూర్వీకులు నిర్మించిన వాటికి
మరమత్తులు చేయం సరికదా ఆ వ్యవస్ధల్ని కనీసం అనుకరించి కొనసాగించే ప్రయత్నం కూడా
చేయం’. మన సంస్కృతి లో ప్రకృతిని వారసత్వంగా చూడడం క్షీణించిన
లక్షణం. ఇది ఆధునికతలో మరీ ఎక్కువైంది. ప్రకృతినే కాదు, దానిని అప్పుడే ఆధునిక
ధోరణిలో ప్రకృతికి సింబాలిక్ గా నిర్మించి
వినయోగించిన వాళ్ళను విస్మరించడం ఆనవాయతీ.
రెండు దశాబ్దాల క్రితం
రాజమండ్రి దగ్గర బొమ్మూరులో ని తెలుగు విశ్వవిదాయలం పక్కనే వున్న ఓ పాడు బడిన
ఇంటిలోకి వెళ్ళా. గోడల్ని తాకితే కూలిపోయేలా వున్నాయి, ఓ పాడుబడిన గది లోని సగం
తెరుచుకున్న కిటికిలో నుండి వెల్తురు వస్తోంది. అది గోడలోని అల్మారాలో దీపం పెట్టి
ఆర్పేయడం మర్చిపోయి వెళ్ళి పోయినట్లు వెలుగుతోంది. ఇంటి బయటికి వచ్చి చూసా, కొండ
పైన ఇల్లు ,దూరంగా గోదావరి నది తన ప్రయాణ మార్గాని సర్వ్ మ్యాప్ లోని రేఖ లా
సాగుతోంది. సూది లోనుండి పత్తి దారంలా, దాని మొత్తం నది నడక, దారి ఒక్క
చూపులో బంధించ గల వైడ్ యాంగిల్ దృష్టి.పర్ఫెక్ట్
షెటర్ స్పీడ్, అపర్చర్, లైట్ అండ్ టోన్ ని
ప్రిసైస్ గా కాప్చర్ చేసే లొకేషన్. అది ఎవరిదో కాదు సర్ ఆర్థర్ కాటన్ ఇల్లు.
ధవళేస్వరం దగ్గర గుఱ్ఱం మీద వున్న ఆయన విగ్రహానికి ఏటా పూల దండలు పడతాయి. ఎక్కడైతే
ఆయన గుఱ్ఱం ఎక్కి ఆనకట్టకు ప్రణాళిక రూపొందించాడో అక్కడ మాత్రం ఓ ఇల్లు శిధిలంగా మిగులుతుంది. ఈయన పాపం స్ధానికుల
మనోగతాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని 1874 లో అన్నాడు కాని
అది ఇప్పటికి కలగానే మిగిలింది.
ఇప్పుడు మెగా ప్రాజెక్ట్
లు అమలు పర్చే ముందు చేప్పట్టే పబ్లిక్ హియరింగ్ల ఉద్దేశ్యం అదే. కాని ఇవన్నీ కంటి
తుడుపు ప్రయత్నాలు మాత్రమే. కైఫియత్లు (మనసులోని మాట) ఎవరు వినరు .
పర్యావరణ కవిత్వం ఈ
కైఫియత్ల ఘోష. శివుడి జడ సత్వం లోని పచ్చదనాన్ని కేవలం నలుపు రంగులో చూపించడమే కాక
, దాని మార్మిక ప్రక్రియ రహస్యాన్ని ఉపదేశిస్తుంది. గ్రీన్ అనే రంగు సెకండరి రంగు, ప్రైమరి రంగు
కాదు. ఇది నీలం,పసుపచ్చ రంగులు కలిస్తే వచ్చే వర్ణం. నీలం రంగు నిష్పత్తి ఎక్కువ వుండి ,పసుపచ్చ రంగు నిష్పత్తి తక్కు వుండి వాటి
కలయిక వల్ల పుట్టిన పచ్చని రంగు(డార్క్ గ్రీన్/ ఆలివ్ గ్రీన్) నలుపు రంగు దగ్గర గా
వుంటుంది., అలానే ప్రైమరి,సెకండరి రంగుల్ని కలిపినా అవి చాలా డార్క్ షేడ్స్ లో
వుంటాయి. వాట్ని దూరం నుండి చూస్తే నలుపు లానే కనిపిస్తాయి. చీకట్లో చెట్లని చూసినట్టు
రంగుల ప్రపంచాన్ని అక్షరాల కుంచెతో కాగితం కాన్వాస్ మీద వేసే చిత్రం పర్యావరణ
కవిత్వం. ఈ చిత్రాల్ని డ్యాం వల్ల హింస
గురవుతున్న నాటి శ్రీశైలం నుండి నేటి
పోలవరం వరకు బాధితులు చిత్రిస్తూనే వున్నారు.
సంతాల్ గిరిజనులు
దామోదర్ వ్యాలీ కార్పోరేషన్ గురించి పాట రూపం చెప్పుకున్న వ్యధ....
నా నేల పై కార్ఖానా
తెరిచేందుకు ఏ కంపెనీ వచ్చింది?
అది నదిలో,
కుంటల్లో దాని పేరు రాస్కుంది
డి.వీ.సి. అంటూ?
యంత్రాలతో
మట్టి తవ్వి, నేలను నదుల్లో పోస్తోంది
కొండను తవ్వి
బ్రిడ్జ్ కట్టింది
కింద నీరు
పారుతుంది
రోడ్లు
వస్త్తున్నాయి, వాళ్ళు మాకు కరెంటు ఇస్తున్నారు
కార్ఖానా తెరిచి
అక్కడి ప్రజలందరూ
వాళ్ళని ప్రశ్నిస్తారు
మళ్ళీ దాని పేరుకి
అర్ధమేమిటని అడుగుతారు
సాయంత్రం
అయ్యేటప్పటికి కాగితాల్ని కూలిగా ఇస్తారు
అవి నీళ్ళల్లో
కరిగి పోతాయి
ప్రతి ఇంట్లో ఒక
భావి వుండేది అది నీళ్ళు ఇచ్చేది
వంకాయలకి,క్యాబేజీలకి
ప్రతి ఇంటి చుట్టూ
కంచె వుండేది అది
ఇంటిని
రాజప్రాసాదంగా చూపించేది
ఈ ప్రాంతంలోని మా
సంతాల గొంతుని నులిమేసారు,
మీరు వచ్చి ఇక్కడ
నిరంతరం మండే మారణ ఘాట్లుగా మార్చారు,
మిమల్ని మీరు
డి.వీ.సి. పిలుచుకుంటూ?
(అనుసృజన)
ఆధునిక భారత దేశంలో
ప్రతి మెగా డ్యాం లక్షల మందిని సారవంత మైన లోయ ప్రాంతాల నుండి(ఎగువన,దిగువున)
నిర్వాసితుల్ని చేసింది. సారవంత మైన అల్లువియాల్ నేలల్ని ముంపుకి లేక పొతే
నిస్సారంగా నైనా మార్చింది. ఈ అంశాలు కొత్త ఇరిగేషన్ లెక్కల్లో పరిగణలో రావు. ఈ
విధ్వంశంని అరికట్టేందుకు, మళ్ళీఅభివృద్ధికి కొత్త నిర్వచనం ఇచ్చేందుకు జరుగుతున్న
ప్రయత్నాలు, పచ్చదనాన్ని నలుపు వర్ణంలో రాసి
ప్రతిఘటిస్తున్నవారు శివోన్ముఖులే.
0 comments:
Post a Comment