Wednesday, 5 August 2020 By: satyasrinivasg

బీజాక్షరాలు

పర్యావరణ క్షీణత, సంరక్షణలో మూడు మౌలిక అంశాలున్నాయి. 1. ప్రకృతి సమిష్టి జీవన వ్యవస్ధగా , 2.ప్రకృతి ఉమ్మడి వనరులుగా, 3.ప్రకృతి  వ్యక్తిగత, వ్యవస్ధాగతమైన వనరుగా. ముందుగా మొదటి అంశాన్ని పరిశీలిద్దాం.

కవిత్వానికి వస్తే అనుభూతి,అనుభవ కవిత్వం అన్న రెండు కోవలు. ప్రకృతి అన్నది సబ్జెక్ట్,ఆబ్జెక్ట్ కూడా. అదే విధంగా అనుభూతి,అనుభవం అన్నవీను. ప్రకృతికి సంబంధించి అనుభూతి,అనుభవం లో వెంట్రుక వాసంత  తేడా వుంటుంది. మన అనుభూతులు వ్యక్తిగత అనుభవంతో నిండినవి. మనం అంశం, రూపము కావచ్చు, కారణం  జీవనం అన్నది ఆలోచనలకి వాస్తవ రూపమివ్వడం, ఈ ఆలోచనల రూపాంతర మట్టివ్యోమగామి కవిత్వం.  

జాజెన్ చిన్టింగ్ పర్వతం పైన

లి పో (762 ఏ.డి.)

"ఆకాశం అంచున పక్షులు మాయమైపోయాయి. ఇప్పుడు చివరి మబ్బు కనుమరుగవుతుంది. మేము కలిసి కూర్చుంటాం, నేను, పర్వతము, పర్వతాలు మిలిగిలున్నంతవరకు"

లి పో జాజేన్ చిన్టింగ్ పర్వతం పైనుండి చెప్పినదల్లా అంశం రూపమవ్వడం తీరు, అది తను, పర్వతం కూర్చునే వుండడం అంటే కవి ప్రకృతిలో మిళితమైపోవడం. కవి ,కవిత్వమవ్వడం. ఇదే భావనని మిత్రుడు పసునూరు శ్రీధర్ బాబు మరో విధంగా అంటాడు.

తత్ ఏకం

నేనొకసారి  ఆ చెరువు గట్టునీ  తాడి చెట్టునీ నీలాకాశాన్నీ

తదేకంగా చూసి వెనుదిరిగాక అక్కడవేవీ వుండవు. నేను మాత్రమే వుంటాను.

 ఇప్పుడు మరోలా చెబుతా.

నేనొకసారి  ఆ చెరువు గట్టునీ తాడి చెట్టునీ నీలాకాశాన్నీ తదేకంగా

చూసి వెనుదిరిగాక ఇక నేనే వుండను. చెరువు గట్టు

 తాడి చెట్టు నీలాకాశామే వుంటాయి.

నేను మాత్రమే వున్నప్పుడు నేను కవిని

అప్పుడు నువ్వు నన్ను పాడుకుంటూ పోవచ్చు

నేను లేనప్పుడు... నేను కవిత్వాన్ని

అప్పుడు నన్ను పటం కట్టి తీసుకుపోవచ్చు.

ఈ రెండు కవిత్వాల్లో సూక్ష్మంగా ప్రకృతిలోని రుపాంతరాన్ని ,అప్పటి సమయాన్ని పక్షి, రెండోది కవి. మొదటి కవితలో ఆకాశం అంచున పక్షులు మాయమైపోయాయి... అవి గూటికి చేరే సమయం. తర్వాత చీకటి పడుతుంది ఇక అంతా ఒకటే! ఇంటికి చేరే సమయం లో పక్షుల పాటలు వెలుతురి పిట్టలకి  ఆహ్వానం పాడుతూ  వెళ్ళిపోతాయి.  

అది శ్రీధర్ బాబు మాటల్లో... ‘నేను మాత్రమే వున్నప్పుడు నేను కవిని, అప్పుడు నువ్వు నన్ను పాడుకుంటూ పోవచ్చు’.

తత్ ఏకంలో లేనప్పుడు అన్నది మాయమైపోవడం అన్నది కాదు మిళితమైపోవడం, అది కవిత్వమవ్వడం...

ప్రకృతిలో జీవం అంతరించదు, మరో శక్తి(ఎనర్జీ)గా మార్పుచెందుతుంది, ‘మ్యాటర్ ఈజ్ నైధర్ డిస్ట్రోయిడ్,నార్ క్రియేటేడ్.’

ఎడ్వర్డ్ హయామ్స్ ‘soil and civilization’  అన్న పుస్తకంలో ప్రస్తావిస్తాడు  ‘కవితను చూసే రూపాన్ని,  ఇంద్రియాలతో, మేధస్సుతో   ఆ రూప కాంతిని  జీవం ఉట్టిపడే తేజస్సుతో  పాఠకుడికి అందించగల్గినప్పుడు అది దార్శనికత  అవుతుంది,   కవి అవ్వడానికి (  స్త్రీ అయినా పురుషుడైనా),రెండు లక్షణాలుండాలి,ఒకటి  దార్శనికత, రెండోది అసాధారణమైన తీక్షణతో కూడిన అనుభూతి’. ఇది పొందాలంటే అరికాలు లో కన్ను, కంటికి కాలిబాట స్పర్శ వుండాలి.

ప్రకృతి కవిత్వం అన్నదాన్ని రొమాంటిక్  కవిత్వం గా జమకట్టి ప్రకృతిని, సమాజాన్ని ఆ రెండిట్ని కలిపి చూసే దోవని మరో మార్గం వైపు మరలించడం జరిగింది. కారణం మనం ప్రకృతిని ఒక ఎంక్లోజర్ గా, ప్రకృతికి సంబంధించన రాత,గీత మర్మాన్ని సరిగ్గా అర్ధం చేస్కోలేదు. విల్లియం వర్డ్స్ వర్త్ తన కవితలో ‘I wandered as a lonely cloud’ , ఒంటరితనం నుండి ఉపశమనం పొందడానికి ప్రకృతి గుళికలా  ఎలా ఉపయోగపడిందో చెబుతాడు. ‘నా మనస్సు అప్పుడు ఆనందంతో నిండిపోయింది, డఫోడిల్స్ పూలతో నృత్యం చేస్తుంది’.

ఇదంతా అర్ధం అవ్వడానికి మనకు ప్రకృతిని చూసే  భౌతిక ,మానసిక చలనం లేనప్పుడు అది అవగతం కాదు. పారిశ్రామీకరణ,నగరీకరణ ఒరవడిలో ప్రకృతిని, మనలోని ప్రకృతిని ఖైదు చేశాం. చలనం అన్నది భావాల్ని ప్రేరేపించే ఆలోచన. నేడు మన భావాలు ,ఆలోచనలు, చేసే క్రియలు అన్నీ నియత్రించబడ్డాయి. తోరియోస్ వాల్దేన్ భావాల్లో ‘సమాజ నియంత్రణతో కూడిన  జీవనం  నుండి ప్రకృతి మనని విముక్తి చేస్తుంది’. కాని ప్రకృతి అన్నది నేడు మన ప్రయాణంలో వెయిటింగ్ రూం లో  వున్న  సామాగ్రి గానే మిగిలిపోయింది , మిగతా పనులన్నీ చూస్కున్న తర్వాత తిరుగు ప్రయాణమప్పుడు ,సేకరించుకుంటాం. అది మన జీవన ప్రయాణంలో మన పూర్వీకుల అనుభవ,అనుభూతి దార్శనిక బీజాక్షర వెలుగడుగుల  సవ్వడి  తోవ   అని మర్చిపోతాం.

ఇక్కడ సెనెగల్ సాంప్రదాయాన్ని జ్ఞాపకం చేస్తూ,  ఇప్పటికి సెలవు...

 

భూమి పాట

సెనెగల్ సాంప్రదాయ గీతం

వస్తువుల్లా కాక మాములుగా తరచూ వింటూoడండి

నిప్పు గళాన్ని వినండి, నీటి అలికిడిని వినండి,

గాలి సవ్వడిని వినండి, పొదల చప్పుడు వినండి:

ఇది పూర్వీకుల శ్వాస.

చనిపోయినవారు కనుమరుగైపోలేదు;

వారు  భూమి లోపల లేరు:

గాలికి వూగుతున్న చెట్లల్లో వున్నారు,

అడవుల ఘోషలో వున్నారు,

ప్రవహించే నీళ్ళల్లో, నిద్రించే నీళ్ళల్లో వున్నారు,

వారు గుడిసెల్లో, జనసమూహంలో వున్నారు.

చనిపోయినవారు కనుమరుగైపోలేదు;

స్త్రీల రొమ్ముల్లో  వున్నారు,పిల్లల రోదనలో వున్నారు,

మండే కట్టెల్లో, కొండరాళ్ళ ఘోషలో  వున్నారు .

గరిక కన్నీటిలో వున్నారు, అడవిలో, ఇళ్ళల్లో వున్నారు.

వస్తువుల్లా కాక మాములుగా తరచూ వింటూ౦డండి.

నిప్పు గళాన్ని వినండి, నీటి అలికిడిని వినండి,

గాలి సవ్వడిని వినండి, పొదల చప్పుడు వినండి:

ఇది పూర్వీకుల శ్వాస.


(అనుసృజన-జి.సత్యశ్రీనివాస్)


0 comments:

Post a Comment