Wednesday, 27 May 2020 By: satyasrinivasg

ద హ్యుమేన్ జూ....




సాహిత్యం , కళల్లో యానిమలిజం అన్న దృక్పధం వుంది. అంటే జంతుజాలాదుల ప్రవర్తన .గుణగణాల్ని రాయడం, వాట్ని ఆపాదించడం, పోలికలుగా , భౌతిక, అభౌతిక,సులువుగా, క్లిష్టంగా,వస్తువుగా, ప్రక్రియగా,సంఘటనగా, జీవ, నిర్జీవిగా ప్రస్తావించడం అన్నది  ఆనవాయితీగా వున్నది. అంటే మానవ సమాజ అభివృద్ధి క్రమంలోని సాహిత్య మాధ్యమాల్లో ఇవి మన వెన్నంటే వున్నాయి. కళ అంటే కాల్పనిక ఆలోచనకి రూపమివ్వడం, ఆ రూపమే క్రమేణా ఆలోచనగా మారడం. ఈ రూపాలు ఎక్కువగా మతపరమైన, ఫాంటసీ, మ్యాజికల్ రియలిజం,సైన్స్ ఫిక్షన్  సాహిత్యంలో విస్తారంగా కనిపిస్తాయి.
మానవ సమాజ అభివృద్ధి అంతా ప్రకృతిని మచ్చిక చేస్కోవడమే. అడవులన్నవి మన మనుగడకు ప్రాణమిచ్చే బీజాలు , జన్యు కేంద్రాలు. అభివృద్ధి అంతా  అడవులనుండి కాంక్రీట్ అడవులలోకి (హ్యుమేన్ జూ) వచ్చిన వలస. ఈ వలస అంతా  మనం మన ఆలోచనలోకి రూపమిస్తూ కొనసాగిన బతుకు తెరువు. ఈ క్రమంలో ప్రకృతిని మచ్చిక చేసుకున్న తీరంతా హింసతో కూడుకున్నదే! దురదృస్టవశాత్తు ఈ ప్రయాసలోని వాంఛని యానిమల్ ఇన్స్టింక్ట్ అంటాము, కాని జంతువులకు హింసా  ప్రవృత్తి వుండదు. మనం మంచి వాళ్ళం అని చెప్పుకోడానికి వాటి ప్రవృత్తిని క్రూరంగా చాటాం!.
జెకిల్  అండ్ ద హైడ్
నేడు మనం యానిమలిజం నుండి పోస్ట్ యానిమలిజం, హ్యుమేనిజం నుండి పోస్ట్ హ్యుమేనిజం స్ధాయికి చేరాం. ఈ మార్పు దారిలో ఎక్కువగా మన శారీరక శక్తి కంటే ఇంకా ఎక్కువ శక్తిని జమచేసుకుని ముందు తరాలకి అంది౦చాలన్న వాంచ. ఈ శక్తి ( డబ్బు, పరపతి, అధికారం,పేరు, ప్రతిష్ట ,హోదా అన్నిటికి వర్తిస్తుంది)ని ఒక ఆధ్యాత్మిక శక్తిగా, అంతులేని శక్తిగా పరిగణి౦చాం.  వాస్తవానికి మనం పూర్తిస్ధాయిలో పోస్ట్ హ్యుమనిజం స్ధాయికి చేరామని చెప్పలేము, కారణం మనం ఇంకా పక్షుల్ని, జంతుజాలాల్ని ప్రతీకలుగా వాడుతున్నాం.  యానిమలిజం నుండి  ఇంకా పై స్ధాయికి ఎదిగే క్రమం అన్నది ఇంకా ఎక్కువ తెలుస్కోడానికి అనంతమైన  పరిశోధన. వాటి ఫలితాల్ని పరివ్యాప్తి చేయడం, ఇంకా కొత్త వాట్ని రూపొంది౦చడం.  ఈ క్రమం  భూమి,ప్రకృతి  స్వరూపాన్ని మార్చేస్తుంది, దాని ఫలితంగా మానవ సమాజ స్వరూపాలు మారుతాయి. యుద్ధానంతరం వచ్చిన మార్పులో జంతువుల రూపాల్ని మార్చి మన శక్తి సామర్ధ్యాలకే విలువ నిచ్చే ఆలోచనా ధోరణి చోటుచేసుకుంది. జంతువుల స్ధానంలో యంత్రాల ద్వారా శక్తిని వినియోగించడం ఏర్పడుతుంది.ఇది అన్ని రూపాల్లో కనిపిస్తుంది, ఉదాహరణకి, సర్ కాటన్ దొర ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణమప్పుడు  అన్న మాట, ‘బ్యారిజ్ నీళ్ళు వచ్చిన తర్వాత ,నీళ్ళు అందే ప్రాంతంలో వ్యవసాయ రూపురేఖలు మారిపోతాయి, అక్కడ  పండే  నల్ల బియ్యం కనుమరుగవుతుంది’.  అది జరిగింది. అక్కడ పండే ప్రాంతీయ పంటల స్ధానంలో వాణిజ్య పంటలు చోటుచేసుకుంటాయి. అదే కాదు ఆనకట్టల దిగువ ప్రాంతం అంటే నీరు అందే ప్రాంతంలో ఆవులు ,ఎద్దులు పోయి వాటి స్ధానంలో గేదెల పెంపకం పెరుగుతుంది, ఇదీ నేడు కనిపిస్తుంది.
ఇదంతా యానిమలిజం నుండి పోస్ట్ యానిమలిజం ఎదిగిన తీరు ,అదే విదంగా సమాజం హ్యుమేనిజం నుండి  పోస్ట్ హ్యుమేనిజం స్ధాయికి ఎదిగింది. అంటే  మనిషి తన జీవితానికి తనే ఆర్ధం ,పరమార్ధం కల్పించుకుంటాడు అన్న తీరు నుండి  తన మేధో శక్తితో మనిషి కంటే గొప్ప వాడవుతాడు.  ఈ తాత్విక  మేదస్సు ధోరణి అంతా అన్త్రఫోసెంత్రిక్ దృక్పధం.   ఈ దృక్పధం లో నిగూఢoగా వున్నది వర్తకం , వాణిజ్య దృష్టి. దీనిని చారిత్రాత్మక చూపు లేకుండా జీవావరణం,పర్యావరణ,  ప్రకృతి సంరక్షణ అన్న నినాద కూడిత కార్యక్రమాలు అన్నీ ఒక మిధ్య.
నేడు చలామణిలో వున్న ఎకో పోయట్రీ  పారిశ్రామీకరణమప్పుడు పచ్చిక మైదానాలు హరించిపోతున్నాయి అన్న ఆవేదన నుండి వెల్లువెత్తిన గళం, ఇందుకు ఉదాహరణ విలయం వర్డ్స్ వర్త్ కవిత్వం.వాణిజ్యం,వర్తకం అన్నవి సముద్రయానం ద్వారా ఉదృతమవుతున్న కాలంలో ఓడలకి(ఒకప్పుడు యానా౦ పడవల తయారీకి ప్రసిద్ది గాంచినది) కావాల్సిన ముడి సరుకుల  కోసం అడవుల వాడకం పెరిగింది, తర్వాత పారిశ్రామీకరణ జతవ్వడంతో డబ్బున్న వాళ్ళు ,పాలకులు తమ అవాసాల్ని ఎస్టేట్లు గా ఏర్పరచుకున్నారు.అక్కడే ప్లాంటేషన్ లు ప్రారంభించారు, ఇది నేడు రియల్ ఎస్టేట్ వాళ్ళు కొత్తగా పెట్టిందీ  కాదు, పచ్చదనం కోసమూ కాదు. పారిశ్రామీకరణ వల్ల భూవినియోగంలో  జరిగిన మార్పులు భూమి స్వరూపాన్ని మార్చేశాయి, నేలకు వుండే ఉత్పత్తి గుణాన్ని చంపేశాయి.
ప్రకృతిని మచ్చిక చేస్కోవడమంటే కేవలం చెట్టు ,పుట్ట, నేల ,నింగిని కైవసం  చేస్కోవడం కాదు, ఇతరలనుండి వాట్ని హస్తగతం చేస్కువడం.దానికి ధనిక ,పేద, కులం ,మతం ,జాతి, వర్గం, స్త్రీ, పురుషుడు  అన్న ఆయుధాల్ని ఉపయోగించాలి. అంటే ఎదుటి వారి ఆలోచనలకి మనం అనుకునే రూపం ఇవ్వాలి, ఇందుకు మనిషి రూపం కాదు , జంతుజాలాల రూపం అయితే  సులువుగా వుంటుంది  కదా. ఇదే మనలోని జాకాల్ అండ్ ద హైడ్ కధ.
మన నీడంటే మిగిలిన పక్షులు
మన చుట్టూ వున్న జీవావరణంలో(నగరం) నేడు అరుదుగా కనిపించేవి చిత్రిత కొంగలు(తెల్ల కొంగలు), ఇవి ఎక్కువగా పక్షుల పైన , మేకల,గొర్రెల మందలలో కనిపిస్తాయి. వీటికి చింత చెట్లు అనువైన ఆవాసం . వీటికి మేకలు, గొర్రెలు, పశువుల కాపర్లకి అవినాభావ సంబంధం వుంది. పంట చేలల్లో వరి నాట్లప్పుడు ఇవి చేలో వాలిన మబ్బుల బుడగల్లా గెంతుతాయి. ఇవి మనని ఎంతగా అర్ధంచేసుకున్నయ్యో దీన్ని బట్టి అర్ధం అవుతుంది అంతే కాదు బహుశా మనకంటే ఎక్కువగా యంత్రాలని అర్ధం చేసుకున్నాయనిపిస్తుంది.  ఈ విషయం స్వీయ అనుభవంతో చెబుతున్నా... ఆ అనుభవాన్ని మీరూ చదవండి...
 మేము ,చిత్రిత కొంగ ,ప్రొక్లైనర్
మా ఇంటి వెనుక మైదానంలో
కొంత కాలం క్రితం ఆమె, నేను నాటిన మామిడి,చిన్న వుసిరి, సీతాఫలం ,సపోటా,జామ, నేరేడు, మునగ ,చింత,నిమ్మ, గుల్మొహర్ , వేప మొక్కలు ..
హరిత హారంలో భాగంగా  నాటిన కానుగ, నేరేడు  మొక్కలు...
భారతి ఆంటీ కావాలని తెచ్చి నాటించిన మారేడు, రావి ,వెలగ మొక్కలు...
సుమారు 50 చెట్లు.....
కొన్ని పూతకొచ్చాయి
ఆ చెట్లిప్పుడు చాలా రకాల పక్షుల నివాస ప్రాంతాలు
  ప్రాంతాన్ని పిల్లలు ఆడుకోడానికి అనువుగా ప్రొక్లైనర్ తో చదును చేయిస్తున్నారు
యంత్రం నేలను చదును చేస్తునప్పుడు చెట్లకు ఇబ్బంది కలిగి అవి పెకలించబడతాయన్న శ్రద్ధతో కూడుకున్న భయంతో  కావలి కూర్చున్నా...
 వాటికి నీళ్ళు పోసి, ఆమె ,నేను వాట్ని పిల్లల్లా పెంచాము
---------
ఎక్కడినుండో వచ్చింది ఒక చిత్రిత కొంగ !
యంత్రంతో బాటు భయంలేకుండా దాని  చుట్టూనే తిరుగుతోంది.ట్రాఫిక్లో బాగా తిరిగే అలవాటున్న ప్రాణంలా .
సన్నిహితుడితో నగర రోడ్డుల్లో ఇష్టానుసారంగా  తిరిగినట్టు వుంది దాని స్వభావం.  ఒకప్పుడు పశువుల పైన వాలి తిరిగే సహజీవన వాసి అది. చిన్నపాటి అలికిడికి పశువులు తమ తోకాడించేవి. ఆ సౌ౦జ్ఞకు కొంగ పశువుల నుండి దూరంగా ఎగిరి వాలి, వాట్ని గమనించి మళ్ళీ వచ్చి వాలేది. ఆ అలవాటు ఇప్పటికీ  దానిలో కనపడుతోంది. అది యంతాన్ని పశువుగా ఎందుకు అనుకుని, అలా యంత్రాన్ని వదలకుండా తిరుగుతుందో  కొద్దిసేపటికి అర్ధమయ్యింది.  పెకలించిన మట్టిని కుప్పగా వేస్తునప్పుడల్లా ,అది ఒక్క ఉదుటున ఎగిరి కుప్ప మీద వాలి వాన పాముల్ని,క్రిముల్ని  పట్టుకుని తింటోంది. ఏదో పాత పుస్తకంలోని అక్షరాల్ని ఆస్వాదిస్తున్నట్టు !
పశువులు లేని కాలంలో యంత్ర స్వభావం దానికి అర్ధమైనంతగా  మనకు అర్ధం కాదు.
ప్రొక్లైనర్లను, బుల్డోజర్లను మనం, మట్టిని,మట్టివాసుల్ని, నివాసాల్ని పెకిలించాడానికే ఎక్కువగా ఉపయోగించే యంత్రతంత్రులం. అది మటుకు యంత్రానికి కొద్దిపాటి మట్టి చూపుని కలిగిస్తోందనిపించింది.
.........
మర్నాడు  మళ్ళీ  మిగిలిన పని ముగించడానికి  ప్రొక్లైనర్ వచ్చింది ,నేను వెళ్ళాను ,కాని చిత్రిత కొంగ రాలేదు.తను ,నేను,అందరం నాటిన మొక్కలు  ఇంకా పెద్ద చెట్లైనప్పుడు,దాని సంతతి  వాలుతుందన్న ఆశతో దాన్ని తలుచుకుంటూ కూర్చున్నా ...
ఆవుల,గేదెల మందను కాసే పిల్లలు, నింగి విహంగాలుగా గేదెలపై ఎక్కి రాజ్యాల్ని హస్తగతం చేస్కుంటునట్టు పశువుల్ని కాసేవారు,నేల పైన పిల్లల్లా  చిత్రిత కొంగలు వాటి వెంటే నేల పైన తచ్చాడేవి.
పచ్చటి నేల తివాచీ పై స్వచ్ఛమైన తెల్లటి మబ్బు మన్ను పర్చుకునట్టు...
యాంత్రిక యుగం లోని రాతి కాలంలో,ఆ జీవన దృశ్యాలు ,పిల్లలకు ఆటస్ధలాలు కనుమరుగయ్యాయి ...
పిల్లల ఆటపాటడుగులు లేని  నేల, వేరులేని మట్టే ! చినుకు లేని నేల రోదన !!
------
అక్కడే వున్నా .....
ప్రొక్లైనర్ నడిపే రిజ్వాన్ని అడిగా ఎక్కడి నుంచి వచ్చావని, “ డిల్లీ దగ్గర ఉంటా సార్, రెండు  నుండి నాల్గు  నెలలు వచ్చి ఈ పని చేస్తా, మాములుగా  అయితే చలి కాలంలో వస్తా, కానీ ఇప్పుడు వేసవిలో వచ్చా . అక్కడ వ్యవసాయం చేస్తా! మట్టివాసన తెల్సిన మరో కొంగ కాబట్టి మొక్కలకి ఇబ్బంది కలగ కుండా ,విసుక్కోకుండా శ్రద్ధగా పనిచేశాడు.
ఇంతలో   పిల్లలు అంకుల్ ఇది వాలీ బాల్ కోర్టా”    అయితే  మేము వచ్చి ఆడుతాం అంటూ కట్టమీద నడుచుకుoటూ వెళ్ళి పోతున్నారు,అవును ,నా కొడుకు  వాడి స్నేహితులతో ఒకప్పడు ఆడుకునేవాడిక్కడ !
నీ కోసం ... పిల్లల కోసం...ఇప్పుడు కూర్చున్నాను.
కానుగ, వేప,మామిడి ,నేరేడు,సపోటా  చిగురించాయి, గుల్మొహర్ ఎర్రటి పూలు మొదలయ్యే కాలం.
పని ముగిసే సమయానికి వాలింది చిత్రిత కొంగ. పని ముగిసేంత వరకు వుండి వెళుతూ, వెళుతూ,   నా వైపు వీడ్కోలు చూపు విసిరి  ఎగిరిపోయింది.  
దాని కనుపాప దృశ్యం    నాకు చెప్పిందల్లా... మట్టంటని పసిపాదాలకు తల్లి గర్భమే ఆట స్ధలంగా మిగిలిందని ,కూసింత మట్టిని వాళ్ళకి పచ్చటి మైదానంగా  పెంచి, వేయి ఋతువుల రంగులతో అల్లుకున్న క్రీడా స్ధలంగా ఇవ్వడమే  మనం చేసే  సహజమైన మట్టి వేర్ల   జపమని !
 (లిబ్రా ఎన్ క్లేవ్ పార్క్, బడంగ్ పేట, 25-3-2016),- జి. సత్య శ్రీనివాస్

0 comments:

Post a Comment