Saturday, 2 May 2020 By: satyasrinivasg

ప్రకృతి, సంస్కృతి, జీవన స్మృతులు


దైనందిన జీవితంలో అనారోగ్యంగా వున్నపుడు వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్ళం, కొందరికి దానిని స్వతహాగా తట్టుకుని కోలుకునే శక్తి వుంటుంది, కొందరికి వుండదు. ఒక్కోసారి  అనారోగ్యం అన్నదానిని అసహజమైనదిగా చూస్తాం తప్ప సహజంగా వచ్చేది గా అనుకోము. ఉదా: జలుబు దగ్గు, లాంటివి పక్కన పెడితే, డిప్రెషన్ ,ఒంటరితనం లాంటి మానసిక రుగ్మతులని భూతద్దాలతో చూస్తాం ,అందుకే అవి చెప్పుకోరు, మరి ఎపిడెమిక్స్ ప్రబలినప్పుడు బాధితులు ఎలా ఎవరికి చెప్పుకోవాలి?
 ఏదైనా గతం, వర్తమానం , భవిష్యత్తు అన్న కాల చక్ర వలయంలోనే తచ్చాడుతాయి, పర్యావరణ ,జీవావరణ కవిత్వం కూడా అంతే! ఇది ఒక పర్యావరణ ,జీవావరణ సామాజికావరణ కాల చక్ర  కవిత్వ రాట్నం. ఇందులో అందరం బందీలమే. 
మనం ఈ వలయంలోని అనుభూతుల్ని, అనుభవాల్ని మాట ,మంతి  ద్వారా  వ్యక్త పర్చుకుంటాం. ఒక పీడన అందులోను ఎపిడెమిక్ 2020 కాలం అద్దాల నుండి 915 అంటే 10  శతాబ్దం కాలం కవిత్వాన్ని చూద్దాం ...
ఒక పీడిత వ్యక్తి అదీ కవి అయినప్పుడు వ్యక్త పర్చుకునే  తీరు...

రాత్రి సందర్శకురాలు
అల్- ముతన్నాబి
మధువు మత్తులో లేకున్నా , అశ్వస్థ శరీరం, లేవలేని స్ధితిలో ...
నమ్రతతో ఇమిడిన  ఆమె సందర్శనంలా,
చీకటి అంచులలో దాగి  ఆమె సందర్శించదు
నేను ఆమెకు ఇష్టపూర్వకంగా  వస్త్రాలు ,దిండ్లు ఇచ్చాను
కాని వాట్ని తిరస్కరించి నా ఎముకలలో రాత్రిని గడిపింది
 నా చర్మానికి, నా శ్వాసని ,ఆమెని ,రెండిట్నిఇముడ్చుకునే  శక్తి  లేదు,
 అందుకే ఆమె అన్ని రకాల  రోగాలతో  కలిసి విశ్రమిస్తుంది
ఏదో మేమిద్దరం చేయకూడని పనిని ముగించినట్టు
ఆమె నన్ను వదిలి  వెళ్ళినప్పుడు, తన శ్వాసతో నన్ను కడిగి వెళుతుంది
ఉదయం, ఆమెని తరిమేస్తుంది,
ఆమె కన్నీరు, నాల్గు రంద్రాలలో  ద్రవంలా వరదై పారుతుంది
వాంఛ లేకుండా, నేను ఆమె సమయం కోసం ఎదురుచూస్తాను
ఒక ప్రియుడి ఎదురు చూపులా
ఆమె ఎప్పటిలానే క్రమం తప్పకుండా   సమయానికి వస్తుంది, కాని నమ్మకం ఒక దుష్ట శక్తి
అది సోకినప్పుడు తీవ్రమైన బాధలకు గురిచేస్తుంది
(అనుసృజన-జి.సత్య శ్రీనివాస్)
ఇక్కడ కవి వ్యాధిని రాత్రి వేళ వచ్చే ప్రేయసి గా ప్రస్తావిస్తున్నాడు,అంతేకాక చావు అనివార్యం అని తెలిసి నిబ్బరంగా వుండడానికి ఆ విధంగా మృత్యువుని ఆహ్వానిస్తున్నాడు. అల్- ముతన్నాబి పేరుకి అర్ధం ‘అతను ప్రవక్త కావచ్చు’. ఇతని కవిత్వ భాష అప్పట్లో విశిష్టమైనది, వ్యాధిని రాత్రి  సందర్శకురాలిగా  ఏ వైద్య బాషా పేర్కొనలేదు. తన మిత్రుడైన అలెప్పో రాజు సైఫ్ ఎల్ దవలతో వాగ్వివాదం జరిగిన తర్వాత అతనిని వీడి వెళ్లి పోతాడు.965లో ఆహ్వాస్ (నేటి ఇరాన్) నుండి పయనిస్తున్నపుడు బందిపోట్లు అతనిని హతమారుస్తారు . అతని చావు వార్త దావానంలా పాకింది.
 ఈ కవి ప్రవక్త  ద్వారా నాగరికతకు వ్యాధికి వుండే వారధుల్ని పరిశీలిద్దాం...
నాగరి ‘కత’
వ్యవసాయం వల్ల అవాసాల్ని స్ధిరంగా చేసుకుంటూ నగరీకరణకూ వూతమిచ్చింది, ఈ క్రమంలో పారిశ్రామీకరణ వల్ల రాజు ,పేద వర్గాల్ని విస్తృతంగా ప్రబలించేటట్టు చేసింది. స్పష్టంగా వున్న వాళ్ళది, లేని వాళ్ళది అన్న ప్రాంతాల్ని బలపరచింది. గతంలో ఊరు ,వాడకి కుల ,మతంతో బాటు డబ్బుని కూడా అతికించింది.
నేడు మనం ఏ  స్ధాయికి ఎదిగామంటే మన శరీరంలోని అవయవాలు కూడా వాడల్లా ఏర్పడినాయి. కారణం వాటికంటూ వుండే జీవితకాలం వల్ల అవి నేడు ఒక వనరుల సంపత్తిగా మారాయి. ఇప్పుడు వనరు అన్నది కేవలం మనకు బాహ్యంగా వున్న ప్రకృతి వనరే కాదు, మనలోని అవయవాలు కూడా దోపిడికి గురవుతున్న వనరులే!. పేదరికం వల్ల మనుషులే కాదు వలసపోతున్నది, వారి అవయవాలు. శరీరం ,అస్దిత్వం  కూడా. అభివృద్ధికి నమూనా నగరమే అయితే ఇదే అవుతుంది.
నేడు నగరరీకరణంలో మనం కోల్పోయింది మౌకిక భాష, అంటే శబ్దం ,మాటల ద్వారా సంభాషించుకోవడం. మనకు సమాచారం, జ్ఞానాన్ని అందించే  మాధ్యమం, మన విధ్యాబ్యాసంలో కేవలం కొన్ని విద్యలే ఉపాధి, డబ్బు ,పరపతిని సమకూరుస్తాయని వాటినే శిరోధారoగా పరిగణించి .  జీవించడానికి కావాల్సిన విలువల్ని, మనో: ధైర్యాన్ని సమకూర్చలేని చదువుల్ని  నూరిపోశాo.   దీని వల్ల శరీరం అన్నది కేవలం ఒక అవయవాల యంత్రం తప్ప మరేమీ కాదు! ఈ యంత్రానికి వినడం తప్ప .విన్నదాంట్లో వాస్తవ అవాస్తవాల్ని అంచనావేసే తీరిక, ఆలోచన లేకుండా పోయింది. అంతే కాదు ప్రకృతి, మనిషి అన్నది ఒక సబ్జెక్ట్ గా  మారింది, అంటే ఉపయోగానికి అవసరమై పరిశీలించే వస్తువు.అందుకే పర్యావరణ , ప్రకృతి సంరక్షణ అన్నవి కేవలం నినాదాలుగానే మిగులుతాయి, కారణం భాధితుడి, సంరక్షణ చేసే వారి మాటలు ఆచరణలోకి రావు. ఇందుకు కారణం  నేటి అధునాతన ప్రసార మాధ్యామాలు  మనకి ఆలోచించే సమయం ఇవ్వవు, ఒక క్షణంలోనే  కోకోల్లల కొద్దీ  టెక్స్ట్ మెసేజ్లు, వాట్ని మనం  విపులంగా చదివే కాలం లేదు, అందుకే గుడ్డిగా ఫార్వర్డ్ చేసేస్తాం.అంతే కాక ఎదుటి వారు ఏమి అర్ధంచేసుకున్నారో అన్నదాన్ని మనం అర్ధం చేసుకోకుండా మన పరిభాషలోకి మార్చేస్తాం.
ఆధునికత ఘడియ ,ఘడియకు మారే  మార్కెట్   క్యాప్షన్. మనం ఎక్కువగా కాలచక్ర వలయంలో   బందీలై పోవడం వల్ల  మనకంటూ వుండే కాలాన్ని అర్ధం చేస్కోక దాన్ని సద్వినియోగం చేస్కోo ! నేడు మార్కెట్ అధినేతల కంటే  గొప్ప స్టోరీ టేల్లర్స్ లేరు. వాళ్ళు చెప్పే వాళ్ళు ,మనం వినే వాళ్ళం. నేడు మనకు ఎదురవుతున్న విపత్తులు, ఇతరత్రా విషయాల్ని ,మనం కేవలం తాత్కాలికంగా, కొంత సమయమే వాటి గురించి అలోచిస్తాం, అవి ఎంత తీవ్రమైనప్పటికీ!.
సామాజిక స్దితిగతుల్లోని  మార్పుల కధనాలన్నీ , శక్తినిచ్చే వనరుల వినియోగంలో జరిగిన మార్పుల కధనాలేనా! లేక జీవక్రియ చర్యల వివరణా అన్నది అర్ధం చేసుకోకుండా అవసరాలకి మించిన కోరికల వెంట పడ్డాం. దీన్నిఅభివృద్ధి మార్పుగా పరిగణిoచాం.
ప్రకృతిలో పునరావృతం కాని శక్తిని ఇచ్చే  వనరుల్ని హరించేస్తున్నాం,  పునరావృతం అయ్యి శక్తి నిచ్చే వనరుల్ని సరిగా వినియోగించు కోవడం లేదు. మరి శక్తిని పొంది జీవించే వైరస్  తనకు కావాల్సిన శక్తిని పొందే ఆవరణని పసిగట్టి ,అందులోకి ప్రవేశించడం జరుగుతుంది, ఇది గతంలోనూ జరిగింది ,నేడు కని విని ఎరుగని రీతిలో జరుగుతోంది. ఆ తీరులో అది మన అవయవాల్నే కాదు , మన ఆలోచనల నుండి కార్యాచరణ దాల్చిన వ్యవస్ధల్ని కబళించింది. వ్యవస్ధల్ని ప్రోద్భలించిన సిద్ధాంతాల్ని ప్రశ్నిస్తోంది. ప్రకృతిని కబళించడంలో క్యాపిటల్, సోషలిస్ట్ సిద్ధాంతాలు ఏవీ వెనుకంజ వేయలేదు.  రెండూ భూమిని కేవలం శక్తినిచ్చే ముడిసరుకుగా జమకట్టాయి తప్ప జీవక్రియను పట్టించుకోలేదు.

ప్రతి ఘడియ ఒక సంఘర్షణ
విపత్తుల వల్ల ఏర్పడే సామాజిక రుగ్మతుల్ని గ్రహిస్తే గతం,వర్తమానంలో వుండే సమకాలీన పోకడలని అంచనా వేయచ్చు. రుక్మిణి భాయి నాయర్ రాసిన ప్లేగ్ ,కోవిడ్-19 పోలికలు,  వ్యాసంలో ప్రస్తావించిన అంశం 1347 లో ఇటలీ లోని మేసిన తీర ప్రాంతంలో 12  ఓడలు వచ్చాయి. అందులోని నావికులందరూ అశ్వస్థులై వున్నారు, అదే బ్లాక్ డెత్ (నల్లటి  మృతువు). ఇది  బుబోనిక్ ప్లేగ్ ,దీని వల్ల దశాబ్ద  కాలంలో మూడొంతుల యురోపియన్ జనాభా ,అంటే   20 మిలియన్ల మంది చనిపోయారు. నేచర్ అనే పత్రిక లో అచ్చయిన వ్యాసం  ప్రకారం ఈ వైరస్ ‘ఎర్సినియా పెస్టిస్’ చైనా లేక అక్కడి పరిసర ప్రాంతంలో పుట్టి సిల్క్ రూట్ ద్వారా , ఇతర  భూ వాణిజ్య మార్గాల ద్వారా పరివాప్తి చెందింది. సముద్ర వాణిజ్య ,వర్తక మార్గం ద్వారా ఇటలీకి చేరింది. ఈ వైరస్ ఎలుక, పాము, గబ్బిలం ద్వారా సోకి వుండచ్చు. ఈ ప్లేగ్ వల్ల ఏర్పడిన తీవ్ర పరిణామాలు ఆర్ధిక సంక్షోభానికి  దారితీశాయి. ఆహార కొరత, బతకడం కోసం పేదలు దోపిడిలకూ పాలుపడడం. ఈ పరిస్ధితుల నుండి బయటకు రాడానికి సుమారు శతాబ్ద కాలం పట్టింది. నేటికి ఈ
ప్లేగ్  సార్వజనికంగా ప్రచారంలో వున్న పిల్లల రైం
‘రింగా,రింగా రోజెస్,
పాకెట్ ఫుల్ ఆఫ్ పోయిజేస్ ,
హాషా, బుషా,
 అల్ ఫెల్ డౌన్’  
ఈ రైం 1881 లో అచ్చయింది, అంత కంటే మునుపే 1790 లో పాడిన తీరు ఒకేలా వున్నాయి. వివిధ ప్రాంతాలలో వారికనుగుణంగా మార్చుకున్నారు. బహుశా  ఇక్కడ రొజేస్ అంటే గులాబి పూలు కాదేమో, రోగం వల్ల శరీర భాగంలో ఏర్పడిన గడ్డలు. అలానే పాయిజేస్ అంటే రోగం వల్ల వచ్చే దుర్వాసనని అరికట్టే ఔషద మొక్కలు.
లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్
ఫాలింగ్ డౌన్
ఈ రైం  కూడా 1200-1500 A.D. (మధ్య యుగం) చివరిలో రాసినట్టు చరిత్ర తెలుపుతోంది, ఈ రైం లండన్ బ్రిడ్జ్ వల్ల ఏర్పడిన దుష్పలితాల్ని పిలల్లు ఆహ్లాదంగా ఆడుకునే టట్టు మార్చారు. ఇది తెలిసి పిల్లలు ఆడి పాడుతూ, ఆడుకోడాన్ని ఒకసారి ఉహించుకుంటే!
సాహిత్యం ద్వారా చరిత్రను పరిశీలిస్తే చాలా వాటి అర్దాల వెనకున్న పరమార్దాలు తేటతెల్లమవుతాయి.మనం చరిత్ర సాహిత్యం ,అందులోనూ కవిత్వం ద్వారా పరిశోదిద్దాo అంటే  సాహిత్య మాధ్యమంలో వాటి ప్రస్తావన చాల తక్కువ, ఇది  ప్రకృతి, పర్యావరణానికీ వర్తిస్తుంది. 
డి బ్లాక్ డెత్  గురించి బొచ్చాసియో రాసిన డికామేకరోన్లో ప్రతి రోజూ ధనవంతుల జీవితాల్లోని సంఘటనల్ని  ప్రస్తావిస్తుంది. ఇప్పటి లానే అప్పట్లో కూడా ధనవంతులు ఈ వైరస్ ఎక్కడ  సోకుతుందో అన్న భయంతో, అమానుష ధోరణి ప్రదర్శించారు. వాళ్ళ ఇంట్లోనే వుండిపోయారు.   వాళ్ళ కధనాలు  నేటికీ కనబడుతాయి. ఫ్లోరెన్స్ అనే నగరంలో  సుమారు ఒక లక్ష మంది చనిపోయారు, ఆ సంఘటన ద్వారా కానీతెలియలేదు ఆ నగరంలో అంత మంది నివసిస్తున్నారని.
మాములుగా వున్నప్పుడు తెలియనివి , పట్టించుకోనివి , అనుకోని పరిస్ధితులు ఏర్పడినప్పుడు బహిర్గతం అవుతాయి.  అదే అంత్రోపో సీన్ .జర్మన్ ఫిలాసఫర్ స్లోటేర్దిజ్క్స్ అన్నట్టు  ‘ఇప్పుడున్న స్ధాయి, మానవుల వూహకు అందని  స్ధాయి, అన్ని విధాల  మానవేతర, అతీతమైన ఆవరణలో  చిక్కుకుపోయిన  స్ధితి.  స్ధలం అన్నది కేవలం మానవాళి ప్రదేశం కాదు’.
డార్క్ ఎకాలజి అనుసారం మన ఆలోచనలు అన్నవి మన మెదడు చేసే ప్రక్రియ, లేక  ఇంకేదైనా, eliminative materialism(1980 లో మొదలైన దృక్పదం) అనుసారం: మనసుని మెదడు దృష్ట్యా వ్యక్తీకరిస్తే , మనకు మనస్సు అన్నది లేదు , అది ఒక మిధ్య. మనమిప్పుడు వివిధ విషయాల్ని  వున్నత  స్ధాయిలో ఆలోచించే తీరులో అడుగిడుతున్నాం. జీవావరణ యుగంలో వ్యక్తి, వస్తువు,జీవరాశి అన్నీ మానవుడి ఆలోచనలకు అవసరం,జీవనాన్ని కొనసాగించడానికి ఇవి కీలకం. మనం భూమి తీవ్రత స్ధాయిని అర్ధం చేసుకోవడాన్ని మొదలెడుతున్నాం. 
ఆర్ధిక శాస్త్రవేత్తలు, జీవశాస్త్ర వేత్తలు నేడు ఉపయోగించే పదం ‘ఎకో సిస్టం సర్వీసెస్’ ,అంటే ప్రకృతి మానవుల జీవనానికి అందించే సహాయ సహకారాలు.మనం దీనిని అర్ధం చేసుకోకుండా, ప్రకృతిని సంరక్షించకపోతే,అది నాశనమై ,మనకి తెలియని రీతిలో సాధిస్తుంది.మచ్చుకగా కనిపించేవి,  మనని తీవ్ర స్ధాయిలో గురి చేసిన రోగాలు ఎయిడ్స్, ఇబోల,వెస్ట్ నైల్ ,సార్స్,లిం  లాంటి అనేక వ్యాధులు. ఈ వ్యాధులు పర్యావరణానికి సంబంధించినవి,60% ఈ వ్యాధులు మనిషికి జంతువు నుండి సంక్రమించినవి, ముఖ్యంగా వన్య జీవుల నుండి వచ్చినవి.వైరస్ సోకే విధం గురించి  అధ్యయనాలు జరుగుతున్నాయి. జరుగుతూనే వుంటాయి. మనం ఎప్పటికప్పుడు అనుకునేదల్లా మనం జయిస్తాం! అవును మనం జయిస్తాం, వివిధ రకాల యుద్దాల్ని   సృష్టించడం, యుద్ధం చేస్తూ వుండడం మనకు పరిపాటి ,ఎందుకంటే డార్విన్ సూత్రాన్ని ‘సర్వైవల్ ఆఫ్ ధ ఫిట్టెస్ట్’ ని దేవుని  పలుకుగా ఆచరిస్తాం, కాని దాని అర్ధం బలప్రయోగం (తెలివి, శారీరక బలం) వల్ల ఇతర వాట్ని నాశనం చేయడం కాదు, ఎటువంటి పరిస్థితిలోనైనా తట్టుకుని బతికి, బతికించడం అని. బికాజ్ వి ఆర్ బయో సోషల్ యానిమల్స్! ఇది నగ్న సత్యం.

0 comments:

Post a Comment