Tuesday, 7 October 2014 By: satyasrinivasg

భూమి మనకు ఓ లమాఖాన్ – మూల వాసుల జీవన వలయం -5



భూమి మీదకు చివరాఖరిగా వచ్చింది మానవులు.భూమిని ఆక్రమణకు గురిచేసింది వాళ్ళు. భూమి మనకు ఓ ల మాఖాన్( నిరాశ్రయుల గూడు) అయితే ,మనమే మన గూటిని కబళించాం. ఇది మనం అనాదిగా పాటిస్తున్న  ఓ ఆచారం.ఈ ఆచారం బలంగా  వ్యాప్తి చెందడానికి దురాక్రమణ,కబ్జ, అన్న ఆయుధాలను రూపొందిస్తాం, ఈ యుద్ధాలను తు.చ. తప్పకుండ వాడడానికి శాసనాలు, చట్టాలు,ప్రణాళికలు,ఉత్తర్వులు ఏర్పాటు అవుతాయి. ఇవన్నీ కొందరి ఇష్టాయిష్టాలను సంతృప్తి పర్చడానికే కాని భూమిని, భూవాసుల సంరక్షణకు కాదు. ఇది అప్పటి నుండి నేటి వాతావరణ మార్పు పై జరుగుతున్న అంతర్జాతీయ ప్రోటోకాల్ వరకు వర్తిస్తుంది. రాజ్య వ్యవస్థకి ప్రకృతి సంరక్షణ అన్న అభిమతం వుండదు కాబట్టి . అంతర్జాతీయ స్ధాయినుండి మన ప్రాంతీయ స్ధాయి వరకు ఒకే నినాదం, లేని వాడు రక్షించాలి వున్నవాడు వినియోగించాలి. లేనివాడు నిందితుడు, వున్నవాడు నిరపరాధి. ఈ సూత్రం ఆధారంగానే గిరిజనులని,పశువులకాపర్లని అడవులని నాశనం చేశారన్న  ముద్ర వేసారు.అందుకే ఈ లమాఖాన్ లోని వనరులన్నీ ఒకరి  మఖాన్ లోకే చేరుతాయి.
రాజ్య వ్యవస్థకు అనుగుణంగా ప్రకృతిని స్తుతిస్తే అదే పర్యావరణ కవిత్వంగా చలామణి అవుతుంది.అప్పుడు మనం చెప్పే వస్తువు ,రూపం,ప్రతీకలు మనం వర్ణించినవి తప్ప వాస్తవం కావు.అడవులు అందంగా వుంటాయి, నదులు గల గల పారుతాయి,కోయిల  కూత మధురంగా వుంటుంది , వగైరా, వీట్ని  నిర్వచించింది, రాయడం వచ్చిన బయట వారు తప్ప  లోన వారు కాదు. దీని వల్ల ఒక క్రియాత్మక సౌందర్యాన్ని చూసే దృష్టి మనం కోల్పోయి కేవలం సౌందర్య పిపాసులమవుతాం.చెట్టుని రక్షించు అది నిన్ను రక్షిస్తుంది, మొక్కలు నాటండి,అడవులు పెంచండి అన్న నినాదాల శబ్ద తరంగాల్ని లౌడ్ స్పికర్ల్లలోనే వినే వాళ్ళ మవుతాం.
చెట్లని రక్షించు- అంటే వాటి జీవావర్ణలో  మనం బతికేందుకు అనువుగా  మన జీవితాల్ని అలవర్చుకోవడం తప్ప వాట్ని నరకకుండా చూసే కావలి కాదు.అడవులు పెంచితే పెరిగేవి కావు వాటికవే పెరుగుతాయి.వాట్ని సంరక్షించే ప్రజలు కావాలి అన్నప్పుడు ఆ ప్రజలకు కావాల్సినవి ఇవ్వాలి.ఈ విషయాల్ని విస్మరించి రాస్తే అది అసలైన ప్రజలకు అందదు.అది  కేవలం బాషతో కూడినదే కాదు, అంతర్లీన భావన ముఖ్యం. ఆ భావనే ఓ రూపాన్ని,ప్రతీకలని ఏర్పరుస్తుంది.
చెట్టు చుట్టూ అల్లుకున్న జీవితానికి ,చెట్టుతో అల్లిన  జీవితానికి వ్యత్యాసముంది. ఒకటి  ఓ చిగురించే ఆవరణ,రెండవది ఒంటరిగా  బతికే ఆవరణ. రెండవ దాంట్లో నిరాశ్రయులైన రూపాల గుట్టలుంటాయి,మొదటి దాంట్లో సహజీవన రాసులుంటాయి. ఈ రాసులనుండి పుట్టే రూపానికి ముగింపు వుండదు ,అది చీమల పుట్ట కావ్వచ్చు, బొగ్గుగా మారిన ఓ చెట్టు కావచ్చు.అడవిలో యిప్పపూల కాలంలో  యిప్ప చెట్టు ఓ సజీవ సౌందర్య హారంలా గుంటుంది. పైన కోతులు పూలు తింటుంటే, రాలిన పూలని కింద జింకలు తింటుంటాయి. మన కవిత్వానికి వుండే రూపం ఆలానే కొనసాగితే అంతకంటే ముందు తరాలకి ఇచ్చి పోవాల్సినది  ఏమీలేదనిపిస్తుంది. అది మన జ్ఞాపకాల గూడులా పసిమనస్సుల తేమ  చేతుల్లోని రేఖలకంటిన మట్టి లతలవుతాయి. కొరియన్ సామెత ప్రకారం ...
ఈ భూమిని మన పూర్వీకులు మనకి ఆస్తిగా ఇచ్చి వెళ్ళారు
మనం దీనిని మన  బిడ్డలకు వడ్డీ తో సహా  అందించాలి
పూర్వీకులు చెప్పిన  ఈ మాటలు చెవికి సోకవు ఎందుకంటే విల్లియం వర్డ్స్ వర్త్ నాలుక గురించి అన్న మాటలు వాస్తవం అనిపిస్తాయి .
నాలుక, కొద్ది తేమను నింపుకుంటుంది, కొద్ది బువ్వను రుచిస్తుంది, , కొద్ది శభ్దాన్ని చేస్తుంటుంది, కాని దాని రోదన కొంచెం కూడా వినిపించదు.ఇది పశువుల కాపర్ల విషయంలో ముమ్మాటికి నిజమనిపిస్తుంది.
గిరిజనులు కేవలం వనరుల నిర్వహణే కాదు దానికి ఒక పరిబాషనిచ్చారు. విశాఖ,శ్రీకాకుళం,విజయ నగరం ప్రాంతంలోని గిరిజనులు,పశువుల కాపర్లు ఎవరి  పశువులు వారు  కాస్తే వాట్ని పశువులు అంటారు ,వారి వీధిలోని వాట్ని  వంతులు వారిగా కాస్తే వాట్ని వంతు అంటారు, వూరంతటి వాట్ని ఒకరే కాస్తే వాట్ని సొమ్ములు అంటారు.ఈ  సొమ్ములు కాసే వాళ్ళు తొలకరి ముందు అడవులమ్మటే తిరుగుతారు .కారణం వర్షం అప్పుడు వూర్లోని భూమి వ్యవసాయానికి(ముఖ్యంగా పల్లపు ప్రాంతంలో) వాడుతారు,పచ్చిక కొరత ఏర్పడుతుంది అందుకని సంచారులవుతారు. ఇది ఇప్పటికీ కొనసాగుతుంది. తెలంగాణలోని లంబాడాల జీవన శైలికి రాయలసీమలోని సుగాలీల  జీవనశైలి లోని వ్యత్యాసాలకి ప్రధాన కారణం ఇది కావచ్చు.
వీళ్ళకి వివిధ అడవుల జీవావరణ పై సమగ్రమైన అవగహన వుంటుంది. ఇది మనం హిమాలయ ప్రాంతంలో కూడా గమనించ  వచ్చు.అంతే కాక వీళ్ళకి రాజకీయ వ్యవస్థ పై న  కూడా పట్టు వుంటుంది.
పశువుల నిర్వహణ సంచారత్వం తో ముడి పడి వుంది, కాని స్థిరంగా ఒకే చోట వున్నట్టు, వుండేట్టు ఇల్యూషన్ కల్పిస్తుంది.విశాలమైన సంచారాన్ని ఒకే ఫ్రేం లో ఫిక్స్ చేసే టెక్నిక్ (సిల్ ఆవుట్ షాట్). ఇది  ప్రకృతి పరంగా ఏర్పడుతాయి. ఎలా అంటే   పచ్చిక మేస్తున్న పశువుల పైన వాలిన చిత్రిత కొంగలు , ఈ  దృశ్యం లోనే నిగూడార్ధాన్ని  చెపుతాయి. ఒకటి  భూమి మీద సంచరించే జీవి,రెండవది నింగి లోని విహంగం. పశువుల పైన వుండే క్రిముల్ని తింటూ చిత్రిత కొంగ వాటమ్మటే  తిరుగుతుంది. చిన్న అల్కిడికి ఎగిరిపోతుంది, దానితో పశువులు అప్రమత్తం అవుతాయి. ఒకటి నిలకడ రూపం ,మరొకటి విస్తృతంగా సంచరించే  రూపం. ప్రకృతి తనదైన శైలిలో వివిధ రూపాల్లోని ఒకే రకమైన గుణానికి వున్న  విస్తారాన్ని  చూపుతుంది, బయో ఎన్విరాన్మెంట్ నిర్వచనం దీనిని  బయో కామనలిజంగా అంటుంది. 
నిలకడగా  వున్న వాటి కదలిక చెప్పడానికి  దానికున్న ఆవరణ లోని కదలిక ద్వారా  చూపుతాం,ఉదా:చెట్టు కదలికని తెలపడానికి ఆకుల సవ్వడి, ఆకుల రెపరరెపలాడ్డం వంటి వర్ణన వుంటుంది. అదే  పశువులు తిరిగే విస్తారమైన దాన్ని వివరించడానికి ఆ ప్రాంతాన్ని వివరించాలి ,అక్కడున్న ప్రకృతిలోని సంబంధాల్ని,ప్రకృతికి మానవ సమాజాలకి వుండే సంబంధాల్ని వివరించాలి. ఇదంతా ఒక ల్యాండ్ స్కేప్ పెయింటింగ్ లాంటిది. ఆయా ప్రాంతాల్లో ఏర్పడిన సామాజిక,రాజకీయ, మత సంబంధాల్ని బట్టి మనం వనరులకి,జీవరాసులకి సింబల్స్ ఇస్తాం.  ఆవులకి సాధు జంతువని, ఈ గుణం వల్ల స్త్రీలతో పోల్చడం వగైరా...,కాని ఆవు ప్రకృతిలో, మానవ సమాజంలో వ్యవస్థలు ఏర్పర్చడానికి దోహదమైన కీలక జీవి. దీని వర్ణనని ప్రముఖ కవి బద్రి నారాయణ్ కవితలో ఆస్వాదించండి.

కలలో నల్లని ఆవు
నిన్న రాత్రి
నా కలలో వో నల్లని ఆవు
ఉదయం
స్వప్న విశ్లేషకులతో.
 యీ  విషయం ప్రస్తావించినప్పుడు
ఎవరో అన్నారు
పృథ్విఅని
భూమి పై అత్యాచారాలు పెరిగినప్పుడు
అది
కవుల కలలోకి ఆవులా వస్తుందని
మరొకడన్నాడు
 కవులు తమ భార్యల్ని కాదని
పరాయి కాంతలతో ప్రేమ కలాపాలు
రచించినప్పుడు వాళ్ళ కలల్లోకి
భార్యలు ఆవులై వస్తారని
మిత్రమా! నేనింకా బ్రహ్మచారినే!!
ఇంతలో
ఒక లావుపాటి విశ్లేషకుడన్నాడు
ప్రపంచంలో ఎక్కడైనా
ఒక్క సారిగా
రాజ్యం మారినప్పుడు
కవుల కలల్లోకి ఆవు వస్తుందని
ఎందుకో తెలియదు 
నా కలలోకి వచ్చింది మాత్రం
ఓ నల్లని ఆవు
(అనుసృజన)
ఈ కవితలో ఆవు  ద్వారా  మొత్తం వ్యవస్థ చిత్రపటాన్ని చూపించారు.ప్రపంచ స్ధాయి హింస, భార్యా భర్తల సంబంధాలు, రాజ్య రాజకీయ స్ధితిగతులు. ఇది నేటి దేశ స్ధితికి నిలువుటద్దం,నూతనంగా ఏర్పడిన రాష్ట్రాలు, మొన్న నే ఏర్పడిన తెలుగు రాష్ట్రాలలో  నదీ జలాలు, విద్యుత్,విద్య,రాజధాని అంశం ప్రధాన చర్చనీయాశా లయ్యాయి,కాని గిరిజనుల జీవితాలు, పశువుల  కాపర్ల జీవావరణ అంశాలు చర్చలోకి రాలేదు.(ఎప్పుడు ఇవి రాకుండా వుంచు తున్నారు) .మొన్నటి  వరకు ఒకే రాష్ట్రంలో తిరిగిన పశువులు ఇక పై అదే ప్రాంతాన్ని రెండు రాజ్య వ్యవస్థల్లో పచ్చిక మేయాలి. ఒక విషయం మర్చాం, భారతంలో ఐదు కీలక నగరాలని  అడిగించింది  గోపన్నే!నల్లనావు కలలోకి ఎప్పుడొస్తుందో!

 




1 comments:

Post a Comment