వేటగత్తె కలలు
ఇదంతా షరా మాములే
ఆమె నా కంటే
ఎత్తులో నిలబడి వుంది
అడవిని శుభ్రపరుస్తూ,
ఆమె చెంప పైనున్న రక్తాన్ని తుడుచుకుంటూ
ఒక కుందేలుదో లేక జింకదో,
నాకేమీ తెలియదు
కాని నా విద్రోహపు
మాంసం,
బందీని చేసే
వాంఛలని
పంపాను వాట్ని
పసిగట్టమని-
ఆమె ఉత్త చేతుల్ని,
ఉత్త చేతులుగా
భుజాల్ని, వదులుగా
వున్న జుట్టుని,
గట్టిగా, ఎత్తైన
వక్షోజాలని,
బెల్టుకి
వేలాడుతున్న
కత్తులకున్న
చేపల్ని-రక్తాన్ని
చికిత్స చేసుకొని
ఆమె గాయం.
ప్రతి రోజూ అంతే:
తెగిన కలయిక,
తిరిగి సంసిద్ధ మవుతూ:
ఆమె శరీరంలో నే మేల్కుంటా
విరిగిన, ఓ తుపాకిలా
(మూలం- రాబర్ట్
రాబర్ట్ సన్)
(అనుసృజన)
అడవి అనగానే
గిరిజనులు జ్ఞాపకం వస్తారు అలానే వేట కూడా
జ్ఞాపకం వస్తుంది. ఈ రెండు ప్రతీకలు
అడవికి ఓ చిరునామాగా మారాయి. కాని విలాసానికి వేట చేయడం వేరు, తమని తాము రక్షించుకుంటూ,ఆహారం
కోసం వేటచేయడం వేరు. గిరిజనులు విలాసానికి వేట చేసిన సందర్భాలుండవు. వేట పురుష
లక్షణం ,వీరత్వానికి ప్రతీక అన్నవి మనలో ఓ మైలు రాయిగా స్థిరపడి పోయాయి. కాని
రాబర్ట్ ఈ గుర్తుల్ని తిరగ రాశాడు. తనని
తాను ఓ స్త్రీ తనువులో ఓ విరిగిన తుపాకిగా మలచుకున్నాడు. యిలాంటి ఇమేజస్ చాలా
అరుదుగా చదువుతాం. వేటంటే కేవలం
క్రూర జంతువుల్ని చంపడమే కాదు, చేపలు పట్టటడం కూడా వేటే! కాని అడవుల్ని నాశనం
చేసారన్న గిరిజనులు నిజంగా విలాసానికి వేటాడితే ఒక్క జంతువూ వుండేది కాదు .అసలు వాళ్ళని
పాలకులు వేటాడనిచ్చింది కూడా లేదు.
ఎందుకంటారా ,. ఈ దృశ్యాలు...
దృశ్యం-1
అడవుల్ని అనాదిగా
వర్గీకరించాం. ఈ వర్గీకరణలో వేట కోసం ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్ని ఏర్పాటు
చేసారు. అక్కడికి సరదా కోసం పాలకులు వచ్చి విలాసం కోసం, వీరత్వం కోసం వేటాడి
వెళ్ళే వారు. వీరికి దారి తెలీదు కాబట్టి స్ధానికులు దారిచూపే వారు, ఇతర విడిది
,భోజనం వగైరా ఆవసరాలు తీర్చే వారు.అప్పట్లో పాలకుల చర్యల్ని పొగిడారు. కాని
గిరిజనుల పై బడ్డ నిందకి నివారణ ఇప్పటికీ లేకుండా పోయింది. ఎవరైనా ఒక ఆవరణలో జీవనం
సాగిస్తునారంటే ఆ ఆవరణలోని జీవవైవిధ్యాన్ని తెలుసుకోవడం చాల అవసరం. అలా గిరిజనులకు
చెట్టు, పుట్టతో బాటు పురుగు పుట్రా గురించి కూడా క్షుణ్ణంగా తెలుసు ,అందుకే
వాళ్ళు వాట్ని హతమర్చలేదు. ఒక రాజ్య వ్యవస్దకి
వర్గీకరణ చేసే అవసరం వేరు, గిరిజనులకి వారి ప్రాంతాన్ని గుర్తు పెట్టుకునేందుకు ఏర్పరుచుకునే ఆనవాళ్ళు వేరు. అలా ఓ స్త్రీ
శరీరాన్ని ,వాటి పై వున్న మరకల్ని రాబర్ట్
చాల బాగా వర్ణించారు. అంతే గాక ఓ బయట
వాడిగా వాట్ని అన్వేషించే తీరు చెప్పారు. వేట గురించిన అంశంలో వాస్తవం , కల్పన
విషయాలు ఓవర్ లాప్ అవుతాయి. ఇక్కడ ఏది కల్పనో ,ఏది వాస్తవమో ఒక్కో సారి అంతు
బట్టదు. గిరిజనులకి జంతు జాలల గురించి కొన్ని కాలప్నిక నమ్మకాలుంటాయి. సాహిత్యంలో వేటగురించి
పాలకుల కధలు ఇతి వృత్తాలుగా వున్నాయి కాని స్ధానికుల నమ్మకాలు, జ్ఞానం గురించిన
సమాచరం చాల తక్కువుగా వుంది. ఉదా: రాజు అనగానే ,అనగనగా ఓ రాజు అడవికి వెళ్ళి క్రూర
మృగాలను వేటాడేను వగైరా. సహజంగా జంతువులు క్రూరంగా ఎందు కవుతాయి ,మూల వాసులు
జంతువుల్ని ఎప్పుడు క్రూర జంతువులని అనరు, వాటికి వాళ్ళు స్ధానిక పేర్లని వాళ్ళ భాషలో
పెట్టుకుంటారు. వేటాడటంలో స్ధానికులు పడే ఇబ్బందులు చాలా వుంటాయి.
దృశ్యం-2
తూర్పు గోదావరి జిల్లాలోని
అడ్డతీగల మండలంలోని దొరమామిడిలో అడవి దున్నల బెడద ఎక్కువ. ఒకసారి మాటల్లో వాళ్ళు
చెప్పారు. అడవి దున్నలు కనుక చేలల్లో పడితే వాట్ని తరమడం చాలాకష్టమని. మొదటిగా
ఒకటి వచ్చి కూర్చుంటుంది. దానిని వెళ్ళకొడతారు,
అది వెళ్ళిపోయి కొద్ది సేపటికి బలగంతో తిరిగి చేలల్లో పడుతుంది, ఊరంతా కలిసి చాల
సేపు డప్పులు కొట్టుకుంటూ వాట్ని తరుముతారు. ఈ తతంగంలో చేలు పాడవుతాయి. దున్నల
గురించి ఆర్.పి. నొరోన్హ తన వ్యాసంలో మరో విషయం చెప్పారు. గిరిజనులు కూడ ముసలి
వాళ్ళను ఎక్కువగా పట్టించుకోరు ‘వృద్ధ
మహిళలు అందరికి చాకిరి చేసేవారు,ఎవ్వరికి
తల్లులు కారు’ . పర్కి o అనే ముసలామెకి రే చీకటి వుంది,ఆమె ఎప్పుడో రాత్రప్పుడు
కోతల పండగకి నృత్యం చేసింది,చూచుక పైన పసి పిల్లల తడి పెదాల్ని మర్చి పోయింది . ఒక
రోజు రాత్రి నాద అనే వాని చేలో ఏదో
కనీకనిపించనట్టు వుంటే , చేలో పడ్డ పశువు అనుకొని వెళ్ళ గొట్టడానికి వెళ్ళింది.
కాని మర్నాడు ఆమెపై గుచ్చుకున్న దున్న
కొమ్ముల గుర్తుల వల్ల ఏర్పడిన గాయంనుండి
వచ్చిన రక్తం ఉషోదయ కిరణాల రంగుల్లో వుంది.
గిరిజనులకి అడవి
జంతువులతో బెడద -చేలో పడడం వల్ల, వాళ్ళ
పశువుల్ని చంపడం వల్ల తరుచు జరుగుతుంది. పశువుల కాపర్లకు, సంచార జాతుల గిరిజనులుకు
ఈ బెడద ఇంకా ఎక్కువ, అందుకే వారికి అడవి జంతువుల ఉనికి,అలవాట్లు బాగా తెలుసు.
ఒకసారి తూర్పు గోదావరి జిల్లాలోని అడ్డతీగల మండలంలోని
దుచ్చర్తి భీమవరంలో వున్నపుడు రాత్రప్పుడు ఒకరి దొడ్లో కట్టేసిన మేకల పైన మచ్చల
పులి(లెపర్డ్) దాడి చేసింది. దాని ఉనికి తెల్సుకుని ఊర్లోని కుక్కలు మొరుగుతూనే
వున్నాయి. అందరూ అప్రమత్తమై లేచి పులిని తరిమేసి మిగతా జీవాల్ని
కాపాడుకున్నారు.
దృశ్యం-3
పులినుండి తమ పశువుల్ని కాపాడుకునేందుకు మహబూబ్ నగర్లోని మన్ననూర్ దగ్గరున్న అప్పపూర్ లో గురవయ్య( వూరి పెద్ద) వూరవతల వున్న
తన పశువుల దొడ్డి దగ్గరే మకాం ఉంటాడు.
గిరిజనులు
ఆనవాయితీగా ఇటికల పండుగప్పుడు వేటాడుతారు. ఈ పండుగని దుక్కి దున్నే ముందు ఊరంతా
కలిసి జరుపు కుంటారు. రాత్రంతా నృత్యాలు చేసి,గంగానమ్మకి పూజలుచేసి మర్నాడు
ఊర్లోని మగవాళ్ళందరూ వేటకి వెళతారు .ఒక్క
మగాడు ఊర్లో ఉండకూడదు ,ఒక వేళవుంటే, అడవి నుండి వేటాడకుండా తిరిగివస్తే, మహిళలందరూ
అతని పై పేడ నీళ్ళు జల్లు తారు. ఈ పండగ తర్వాత అందరూ పొలం పనుల్లో నిమగ్నమై పోతారు.
దృశ్యం-4
గిరిజనుల ఇళ్ళల్లో
ఊరకుక్కలు పెంపుడు జంతువులు ,చాలా బక్క చిక్కి వుంటాయి. తన యజమాని కదిలికల్ని బాగా
పసిగడతాయి. అతను వేటకు సంసిద్ధుడు అవుతున్నాడoటే
ముందుగానే ఇవి పనిలోకి దిగుతాయి. అవి లేనిదే వేటాడడం కష్టం. అవి ముందుగా
జంతువుని వాసన తో పసిగట్టి ,చుట్టూ ముట్టేస్తాయి. అప్పుడు బాణంతో వాట్ని
వేటాడుతారు. ఈ ప్రక్రియలో అడవిలోకి వేటకోసం వస్తున్నారన్న విషయం అడవి జంతువులూ పసిగడతాయి
అవి పారిపోయే ప్రయత్నాలు చేస్తాయి. అడవి లోకి పశువుల్ని పచ్చిక కోసం తీసుకెళ్ళే
వాళ్ళు పశుపోషణ తో బాటు రోజూ వేటాడరు. కాని తరుచూ జంతువుల్ని చూసే సందర్భాలుంటాయి.
వీళ్ళ జాగ్రత్తలలో వీళ్ళు,వాటి జాగ్రత్తలలో అవి వుంటాయి.
దృశ్యం-5
ఒక సారి కేనిత్
అండర్సన్ ( బ్రిటిష్ కాలంలోని వేటగాడు) శేషాచలం ప్రాంతంలో పులిని వేటాడడానికి
వచ్చాడు ,ఆ పులి మనిషుల్ని తినేదిగా మారింది. దానితో ప్రమాదం ఎక్కువై స్ధానికుల
కోరిక ప్రకారం అతను వచ్చాడు. చాల రోజులు అడవంతా గాలించినా పులిజాడ తెలియలేదు.
అన్ని ప్రయత్నాలూ చేసారు అయినా లాభం లేదు. ఒక సారి అది చూఛాయగా కనిపించే సరికి అటు
వైపు గురి పెట్టాడు ,కాని కాలు జారి రెండు కొండల మధ్య చరియలో పడిపోయాడు అతి కష్టం
మీద స్ధానికుల సహాయంతో బయటకి రాగలిగాడు . ఇక లాభం లేదని తిరుగు ప్రయాణానికి సన్నాహాలు
చేసుకున్నాడు. తిరుపతి రైల్ స్టేషన్లో రైలు కోసం కూర్చున్నాడు. అక్కడి స్టేషన్
మాస్టర్ ఈయన కుశల ప్రశ్నలు మాట్లాడుకున్న
తర్వాత ఏ పనిమీద వచ్చాడు అది ఏ మైంది అన్న విషయం స్టేషన్ మాస్టార్కి చెప్పాడు. ఆ
పని జరగలేదు అందుకే వెళ్ళిపోతున్న అన్నాడు. ‘అరె, అలానా, అప్పుడెప్పుడో ఒకసారి ఈ
ప్రాంతానికి సర్కస్ వాళ్ళువచ్చారు, వాళ్ళు వెళ్ళి పోయేముందు ,ఒక ఆడ పులి
తప్పించుకు పోయింది,అది ఈడుకొచ్చిన పులి అంట,ఎంత వెతికినా దొరకలేదు’ ఈ మాటలు విన్న
కేనిత్ అండర్సన్ తిరిగి అడవికి వచ్చాడు మళ్ళీ
కొన్ని రోజులు పులి కోసం గాలించాడు. చాల రోజుల తర్వాత కొండంచున రెండు పులులు
కనపడ్డాయి, వాటిలో ఏది ఆడ,ఏది మగ అని గుర్తుపట్టలేక పోయాడు ,ఇంకా అవి తిరిగి
వెళ్ళి పోతునప్పుడు, ‘రాణి’ అని అరిచాడు, ఒక పులి వెళుతూ ,వెళుతూ తిరిగి చూసింది,
అంతే అదే దాని చివరి చూపు. కేనిత్
అండర్సన్ అప్పుడు తన మనసులో అనుకున్న మాట
‘మిమ్మల్ని మచ్చిక చేసి మరీ చంపేస్తాం,అంతా మా తప్పే, క్షమించు రాణి’ నా మటుకు
ఇవన్నీ విరిగిన తుపాకి గొట్టం నుండి అల్లుకుంటున్న పొగల గుసగుసల్లా వుంటాయి... అవి
ఇప్పుడు ఏ రూపంలో అంటే...
దృశ్యం-6
ప్రతి సంవత్సరం అక్టోబరు 2 నుండి 8 వరకు
దేశవ్యాప్తంగా వన్యప్రాణి వారోత్సవాలు జరుగుతాయి. ఈ వారోత్సవాలన్నీ నగరాలలో , బడి
పిల్లల మధ్యనే కేంద్రీకృత మైవుంటాయి. ఆడవులలో ,అక్కడే వుండే గిరిజనులకు తెలియదు(
ఇవే కాదు చాలా పర్యావరణ ,ధరిత్రి
దినోత్సవాలు తెలియవు). నా మటుకు యివన్నీ అడవి జంతువుల గూళ్ళు అంతరించి పోతునప్పుడు
,నగరవాసులు వాటి పూర్వీకుల ఆత్మల్ని
తలుచుకుంటున్నట్టు వుంటుంది.
ఓ విరిగిన తుపాకి రంద్రం
నుండి చూసే చూపులా...
0 comments:
Post a Comment