Tuesday, 17 March 2015 By: satyasrinivasg

మనో ‘గనులు’-పర్యావరణ ఉద్యమాలు-26

మన దేశంలో కొన్ని ప్రాంతాలు ప్రకృతి రమణీయతకు ప్రసిద్ది, అక్కడ పర్యాటకం కూడా అంతే విసృతిగా అదాయం తెస్తుంది. కాని ఆ ప్రాంతంలో ప్రకృతి వనరులు ఎంత బీభత్సంగా దోపిడీకి గురవుతన్నాయన్నది వెలుగు లోకి రాదు.ఇక్కడ  ప్రకృతి కేవలం ఆనందానిచ్చే వస్తువు తప్ప ఇంకేమీ కాదు, అదే విధంగా ప్రకృతి, ఆదాయాన్ని పెంచే ముడి సరుకు.
ఆ రంగులు ఏ విధంగా మైనింగ్ పుణ్యామా  మారుతున్నాయో, మన దేశంలో వివిధ ప్రాంతాల్లో చూద్దాం!...
గోవా గోడు..
                దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా స్వాతంత్య్రం రాని ప్రదేశం గోవా. ముందుగానే కంపెనీలకు మైనింగ్‌ లీజులిచ్చారు. స్వాతంత్య్రం తర్వాత పోర్జుగీస్‌ వారు వెళ్ళిపోయినప్పటికీ, గోవాలో ఆ లీజులు అదే విధంగా కొనసాగేటట్టు ఒప్పందాలు జరిగాయి. అది 1961 నాటికి, నేటికి చర్చనీయంశంగా కొనసాగుతోంది. ఈ లీజుల వల్ల గోవా ప్రభుత్వాన్ని, విద్య, ఆరోగ్య, ఇతర కీలక వ్యవస్థలను కంపెనీలు విరాళాలు అందిస్తూ తమ ఆధిపత్యంలో ఉంచుకున్నాయి. గోవాలో బీచ్‌ల కంటే మైనింగ్‌ లీజులెక్కువ. ప్రస్తుతం ఇక్కడ 891 లీజులున్నాయి. బాక్సైట్‌, మ్యాంగనీస్‌ ఖనిజాలు కాక, ఇవి 100కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి.
                ఇప్పటికే గనుల వల్ల కాలుష్యం, నేల సారం కొట్టుకుపోవడం, ధూళి కాలుష్యం, తరచూ వరదలు . సర్వసాధారణమయ్యాయి. ప్రస్తుతం ఎక్కువ ప్రాంతాల్లో ఉన్న కంపెనీలు షాల్‌గాంవ్‌కర్‌, జెనకో, ఇంకా వేదాంత తన ఆలోచనలు ప్రతిపాదిస్తోంది.
                1913లో గనులకోసం భూములు తీసుకున్నప్పుడు ఎకరానికి అయిదు నుండి పది రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు. ప్రస్తుతం లక్ష నుండి 20 లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. నష్ట పరిహారo   వద్దు మా భూములు ఇవ్వం అంటే కథ పోలీస్‌ స్టేషన్‌కి చేరి పోలీసులు ఝళుం, కేసులు వగైరా,...అంతటితో ఆగక పంట పొలాలన్నీ కూడా ధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ రోజుకు ఒక గ్రామంలో సుమారు ఆరు వేల వాహనాలు తిరుగుతున్నాయి. దాని వల్ల  శబ్ధ కాలుష్యం ప్రబలుతుంది. ఈ మధ్యన చికెన్‌గున్యా వ్యాథి కూడా సోకిన సందర్భాలు వెలువడ్డాయి. ఇక్కడి ఖనిజ, నీటి సంపద జపాన్‌, చైనా దేశాలకు ఎగుమతి అవుతుంది. దేశానికి మటుకు కాలుష్యం, ధూళి, వనరుల క్షీణతఅనారోగ్యం దిగుమతి అవుతోంది. గనుల వల్ల గోవాలోని ఘోషల్లో ఇవి కొన్ని.........ఇంకాచాలా చిత్రాలు ప్రభావితుల గుండేల్లో శిధిలమై ఉన్నాయి.
తిరువన్నమలైలో దేవుడుకు కూడా ప్రభావితుడు..:
తిరువన్నమలైలో జిందాల్‌ కంపెనీ పెట్టడంకంటే  దానికి ముందుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇరన్‌ ఓర్‌ ఖనిజాన్ని తీసుకుని స్టీల్‌ ప్యాక్టరి పెట్టాలన్నది యోచన. ఈ ప్రకటన ద్వారా సేలంలోని స్థానికలు కొందరు, తిరువన్నమలై చుట్టుపక్కల ప్రజలకి సమాచారాన్ని అందించారు. స్థానికులు, కార్యకర్తలు, పబ్లిక్‌ హియిరింగ్‌కు 20 రోజులు ముందుగా ప్రభావిత గ్రామాల్లో ప్రచారం చేశారు. కంపెనీకి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది.
                తిరువన్నమలైలో గనులు చేపడుతున్న ప్రాంతాల్లో గౌతమ మహర్షి గుడి, స్థానిక గిరిజనుల దేవుడు కొలువున్నారు. గనుల తవ్వకం వల్ల ఈ గుళ్ళు పోతాయి. గనులున్న ప్రాంతమంతటా పలు ఔషధ మొక్కలు, సహజ ఊటలు ఉన్నాయి. ఇవన్నీ గనుల వల్ల క్షీణిస్తాయి. ఇరన్‌ ఓర్‌ కాక ఇక్కడ లైమ్‌స్టోన్‌, సోప్‌స్టోన్‌, ఎర్రమట్టి, లభిస్తుంది. ఎర్రమట్టిని స్థానికులు ఇళ్లకు ముగ్గుగా ఇంకా ఇతర అవసరాలకు వాడతారు. ఇంత ప్రాభల్యం, నమ్మకం ఉన్న కొండల్లో గనుల తవ్వకం జరగకుండా ఉండాలన్నదే ప్రజల కోరిక. సినిమాలు, ఇతర ప్రచార సాధనాలు వల్ల జరిగిన ప్రచారం వల్ల ప్రజలు, స్థానిక సర్పంచులు గనులకు వ్యతిరేకంగా పోరాటాన్ని బలపర్చారు.
                పబ్లిక్‌ హియిరింగ్‌ రోజున ప్రజలు అధికారులను 'మీరు ముందుగా పెద్ద దేవుళ్లున్న కొండలైన తిరుపతి వంటివి వదిలి, చిన్న కొండలైన, చిన్న దేవుళ్లున్న మా కొండల్లో గనుల తవ్వకం ఎందుకు  చేపడతారు, ముందుగా ఆ కొండల్లో గనుల తవ్వకం చేపట్టoడి. తర్వాత ఇక్కడకి రండి' అన్నారు. అంతేకాక ఎక్కడైతే గనుల తవ్వకం చేపడతారో అది వదిలి ' పల్లపు ప్రాంతంలో ఎందుకు పబ్లిక్‌ హియిరింగ్‌లు ? అడవిలో చెట్టు, పుట్ట, జంతువులు, పక్షులు ,సెలయేర్లు ఉన్నాయి. వాటితో కూడా పబ్లిక్‌ హియిరింగ్‌ పెట్టండి ' అన్నారు.
కంపెనీని ప్రోత్సహించే నాయకులకు ఓటు వేయొద్దనుకున్నారు. దానికి తోడు సర్పంచుల అండ కూడా ఉంది.
                ఇది గ్రహించిన అభ్యర్ధుల పార్టీల రాష్ట్ర నాయకులు ప్రజల వద్దకు ఛలో ! అని చెప్పి ప్రజలకు మద్దతు తెలిపారు. ఇప్పటికయితే కంపెనీని ఆపారు. కంపెనీ వారు 180 ఉగ్యోగాలు ఇస్తామంటున్నారు. ప్రభావిత అంచనా నివేదిక ప్రకారం 2.20 చెట్లు పోతాయి. స్థానికులకు ఉద్యోగాలు  ఎన్ని వస్తాయో తెలియదు. ప్రజల అంచనా ప్రకారం సుమారు పది లక్షల చెట్లు పోతాయి.  గతంలో 2005 నాటికి జపాన్‌ ప్రభుత్వసహాయంతో ఈ ప్రాంతంలో మొక్కలు నాటారు. మళ్ళీ గనుల తవ్వకం వల్ల ఆ ఎదిగిన మొక్కలను పెకలిస్తారు. మళ్ళీ పర్యావరణాన్ని  రక్షించడానికి మళ్ళీ మొక్కలు నాటతారు. బహుశా ఈ కారణం వల్లే మన దేశపు నేల మీద మొక్కలుండడం లేదు. ఈ కొండల్లో నుండి వచ్చే వాగుల మీద ఆధారపడి పెన్నదురు ఆనకట్ట నిర్మించారు. గతంలో ఈ ఆనకట్ట కింద 30,000 ఎకరాల సాగు అయ్యేది. 120 రోజులు నీళ్ళు అందేవి. ఇప్పుడు 90 రోజులు మాత్రమే నీళ్లందుతున్నాయి. ఈ ఆనకట్ట నుండి తిరువన్నమలై, చుట్టు పక్కల ఊర్లకి మంచినీరు అందుతుంది. గనుల తవ్వకం వల్ల ఈ నీరు కూడా పోతుంది. ఇదివరలో ఇది గోవాలో జరిగింది. అక్కడ, గ్రామస్థులకు రోజూ నీరందేది. ఇప్పుడు నాల్గు రోజులకొకసారి ట్యాంకర్ల ద్వారా నీరందుతుంది. మొక్క అయినా తడి గొంతయినా ఒకే పరిస్థితి. ఉన్నవి తీసేసి ఎండగట్టడం, తర్వాత అప్పడప్పుడు గొంతు తడపడం. గనుల తవ్వకాలు కేవలం ముడి ఖనిజాల కోసమేకాదు మొక్క, సుక్కని కనుసూపు మేరలో కనిపించకుండా చేయడానికి, మనుషులు, దేవుళ్ళు, ఋషులని కూడా ప్రభావితుల జాబితాలోకి జోడించుకుంటు పోడానికి!
మాల్కో..నువ్వు మేల్కో !
తమిళనాడులోని సేలం దగ్గర వేదాంత కపెనీ వారు బాక్సైట్‌ ఖనిజాన్ని తవ్వి అల్యూమినియం ఉత్పత్తి చేసే కర్మాగారం 16 కొండలున్న పర్వత శ్రేణుల నుండి ఖనిజాన్ని వెలికితీస్తారు. వచ్చిన వ్యర్థ పదార్థాన్ని కావేరి నది వద్ద ఒడ్డున పారేస్తారు. దీనితోపాటు కాస్టిక్ సోడాని  అదే విధంగా విసర్జిస్తారు. దిగువ ప్రాంతంలో కావేరి నది సుమారు 17 జిల్లాల్లో  ప్రవహిస్తుంది. ఇక పరిస్థితి ...... నీరు పల్లమెరుగు..నిజం దేవుడెరుగు ....కావేరి స్వచ్చమైనదని ఆ నదీ జలాల కోసం సంఘర్షణలు జరిగాయి. మళ్ళీ కావేరిని కలుషితం చేయవద్దని ప్రతిఘర్షణలు కావాలి !
మేటుర్‌ కత...
1936లో ఇక్కడ కావేరి ఒక చిన్న పాయిగా ఉండేది. స్వచ్చమైన నీరు, ఆహ్లాదమైన ఊరు. అప్పుడు బ్రిటిషు వారిక్కడ ఒక పత్తిమిల్లును ఏర్పరిచారు. సుమారు మూడు వేల మందికి ఉపాధి కల్పించారు. స్వాతంత్య్రం తర్వాత వెంకటస్వామి నాయుడు మాల్కో కంపెనీ పెట్టారు. స్వతహాగానే ఉద్యోగాలు వస్తాయని   ప్రజలు తమ భూమల్ని అతి తక్కువ ధరకి అమ్ముకున్నారు. కంపెనీ వారు సుమారు ఐదువేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. స్థానికులెవ్వరికీ ఉద్యోగాలు లభించలేదు. కంపెనీ నుండి వచ్చే వ్యర్థపదార్థాల వల్ల భూమి, నీరు  కలుషితమయ్యింది. గత 15 సంవత్సరాలుగా సాగుతున్న పోరాటం ఎటువంటి ఫలితాలను  ఇవ్వడం లేదు. కంపెనీ వాడి పుణ్యామా అని విద్య ఇతర వసతులు లభించకపోగా చుట్టు పక్కల మందు దుకాణాలు, ఆసుపత్రులు కోకొల్లలుగా వచ్చాయి. ఈ కంపెనీ మీద  అనుభవజ్ఞుల  రాసిన నివేదకలో వీరి దీనగాథను ప్రస్తావించినప్పటికీ, పరిష్కారాలు ప్రజలకు అందకపోగా కంపెనీకి మట్టుకు ఫలితాలిస్తున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా అది యధావిధిగా తన కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఇక్కడ కోల్‌ యార్డ్లో పనిచేసే వారి పరిస్థితి దుర్భరంగా ఉంది, 1996లో కంపెనీకి లీజు కాలం అయిపోవడం వల్ల అప్పటికి వీటికి తన బాధ్యత కాదని చేతులు దులుపుకుంది. పోరాటం కొనసాగుతూనే ఉంది.
 పర్యావరణ కవిత్వం అన్నది రాసే వారిలో చదివే వారిని, చదివే వాళ్ళల్లో రాసే వారిని అన్వేషించే దారి.   మనం సృష్టించే అక్షరానికి జీవం లేక పోతే , అది చదివేవారికి చలనం కలిగించే స్పందన ఇవ్వదు.ఒక నృత్యం, నాటకం ప్రక్రియలో ప్రేక్షకుడు కళ్ళముందు కనబడతాడు, కవిత్వంలో అలా కాదు. కవి ఒక ఆబ్స్ట్రాక్ట్ స్పేస్ ని సృష్టించి దానిని  పాఠకుడితో పంచుకుంటాడు. ఈ స్పేస్ లోకి పాఠకుడు తన స్పేస్ ని  తీసుకు వస్తాడు .ఇక్కడ కవివి, పాఠకుడివి అంతర్లీన ,బాహ్య స్పేస్ షేరింగ్ వుంటుంది తప్ప పూర్తిగా కలిసిపోవు. అది ఎలా అంటే, తీగల మీద కూర్చున్న పక్షులు వరుసగా కూర్చునప్పటికీ వాటి ఫిజికల్ స్పేస్ చుట్టూ కొద్దిగా ఖాళీని ఉంచుతాయి. మనo పార్క్ లో  బెంచి పైన కూర్చున్నప్పుడు ,అలానే కూర్చుంటాము. అదే విధంగా  కవిత, కవి, పాఠకుడి అంతర్లీన ,బాహ్య స్పేస్ షేరింగ్  కి స్పేస్ నిచ్చే తీగ. ఇది మనలోని మానసిక, శారీరక  స్పేస్ డైమెన్షన్.మన కళ్ళ ముందు విశాలమైన ప్రదేశం వున్నప్పుడు మన మనస్సు ,ఆలోచనలు అంతే విస్తారంగా సాగుతాయి, మన ముందు అ ప్రదేశం లేనప్పుడు ఆ రెండూ కుంచించుకు పోతాయి.
ఈ స్పేస్ డైనమిక్స్ అన్నవి ప్రకృతిలో క్షీణించిపోతున్నాయి, ముఖ్యంగా ఖనిజ సంపదకు జరిగే మైనింగ్ వల్ల భూస్వరూపం మారిపోతోంది. ఉదాహరణకి, విజయవాడ, విశాఖ పట్నం చుట్టుపక్కల తూర్పు కనుమల శ్రేణులు పోవడం వల్ల పూర్వం ప్రకృతి  , ఇప్పుడున్న ప్రకృతి రూపం లోనే తేడా ఏర్పడ లేదు, సామాజిక  సంబంధాల్లో కూడా తేడాలు చోటుచేసుకున్నాయి.
పర్యావరణ కవిత్వం ఈ స్పేస్ డైనమిక్స్  ని చెప్పే ఇంట్రా పర్సనల్ ,ఇంటర్ పర్సనల్ సంభాషణ. ఈ  సంభాషణ ఒక దృశ్యాన్ని చిత్రించే చిత్రకళ కాదు , దృశ్యాల  చలనచిత్రం. అందుకే ఇందులో భూత, వర్తమాన, భవిష్యత్తు రంగులుంటాయి.
ఈ రంగులు అభివృద్ధి సారాన్ని చెబుతాయి... ఇది అర్ధ రాత్రి పూట నిశబ్దాన్ని ఛేదించే గోడ గడియారం చిన్న ముల్లు శబ్దం లా విన్పిస్తుంది...

అభివృద్ధి మైనింగ్

చదరంగ పావుల్ని
కదపడం నేర్చుకోవాలి
ప్రత్యర్ధి పావుల్ని నడిపే
వ్యూహాన్ని పసిగట్టాలి
వారి ఆలోచనల్ని
నెమరేయాలి
రెండు మెదళ్ళ మధ్యనున్న
చదరంగ బోర్డులో
ఊహాచిత్ర పావులకి
జీవం పోయాలి
నిర్జీవం చేయాలి
ఎక్కడా రక్తపాతం వుండదు
వాటి మరకలూ కనిపించవు
యుద్ధమంతా
నలుపు తెలుపు గడుల్లో
తొక్కుడు బిళ్ళాట
కిటికు ఒక్కటే
ఆడేవాళ్ళు
మధ్యలో
యాం ఐ ఔట్
అని అడగాలి
ఇంతలో
టైం విల్ రన్ ఔట్
టిక్   టిక్  టిక్
భూవేర్లనంటిపెట్టుకున్న
ఖనిజాన్ని పెకలించే
అధునాతన యంత్రాలు
దూసుకుపోతాయి
అంతరిక్షం లోనూ
గుండెల్లోనూ...
అగుపించని ప్రత్యర్ధి
నీలోనూ
నాలోనూ
పబ్లిక్ హియరింగ్ లోనూ
టిక్  టిక్  టిక్...

(7-2-13, జి. సత్య శ్రీనివాస్)

0 comments:

Post a Comment