Monday, 16 March 2020 By: satyasrinivasg

పచ్చటి కవిత్వం ఒక జ్ఞాపకాల పేటిక



మనం ప్రాంతాల్ని, వాటి స్వాభావిక భౌతిక లక్షాణాలతో బాటు అక్కడి రుచి, వాసన ,జ్ఞాపకాలు, భావాలు, వాతావరణం ,సంస్కృతి,ఆహారం, రోడ్లు,ఇంకా మరెన్నో అంశాలతో  గుర్తించుకుంటాం . అది మనం పుట్టిన, పెరిగిన ,వలస వచ్చిన ప్రాంతమే కావచ్చు. అది మనలో ఇమిడిపోయిన ఒక నిక్షిప్త వనరు!. అది మన కవిత్వానికి ఒక నేల రాట్నం!. ఆ రాట్నం నుండే  మన అక్షర రూప,భావసారూప్యం అంకురించుకుంటుంది. దీన్ని లిటరరీ మాప్యింగ్ అంటారు.  కామెల్లి .టి. డంగి అమెరికన్ ఆఫ్రికన్ కవయత్రి మాటల్లో  ప్రకృతి గురించి ,ప్రకృతి కి సంబంధించి రాసే కవిత్వాంశాల్లో మనని మనం ఈ భూమి పైన ఎక్కడ వున్నాం అన్న దాని మీద ఆధారపడివుంటుంది.ప్రకృతి కవిత్వంలో ఆవరణ చాలా కీలకమైనది. దీనిని నిచ్చ్ అని బొటానికల్  బాషలో ప్రస్తావిస్తారు. నిచ్చ్  ఒక చెట్టు, పుట్ట ,జీవి చుట్టూ అల్లుకున్న భౌతిక ,అభౌతిక ఆవరణ. ఇది అందరికీ వర్తిసుంది. మనం మాట్లాడే బాష కూడా ఇక్కడి నుండి పుట్టినదే.  ఒక చెట్టు చుట్టూ అల్లుకున్న జీవనాన్ని ,వాటి విధానాల్ని అర్ధం చేసుకోకుండా చెట్లు నాటడం ,పెంచడం, సంరక్షించడం వృధా ప్రయాస గా మారుతుంది. ఇది అన్ని జీవరాలుసులకీ వర్తిస్తుంది. ఉదాహరణకు మోదుగ చెట్టునే చూద్దాం, దీనిని అగ్ని పూల చెట్టు ,ఫ్లేం ఆఫ్ ధ ఫారెస్ట్ అని కూడా అంటారు. ఇది సుమారు వంద రకాల పక్షులకు ఆహారం, నివాసానికి, గూళ్ళు కట్టుకోడానికి దోహద పడుతుంది. స్దానికులకి వాటి ఆకులతో  విస్తరాకులు చేయడానికి, దాని జిగురు ఆర్ధిక ఉపాధి కల్పిస్తుంది. ఒక కాలంలో వీటి పూల నుండి రంగులు తయారు చేసే వారు. నాకు ఇంకా గుర్తు హైదరాబాద్ నల్లకుంట బస్ స్టాండ్ దగ్గర  ఒకప్పుడు వీటి ఆకులతో చేసిన విస్తరాకులు అమ్మే వాళ్ళు. అప్పట్లో ఇవే చలామణి లో ఉండేవి.
వేసవి కాలంలో అడవిలోని చెట్లన్నీ ఆకులు రాల్చి బోడిగా వున్నప్పుడు మోదుగ చెట్టు  పూలొక్కటే అడవికి దివిటీగా వుంటుంది, ఆ ప్రదేశమంతా శూన్యంగా ఉన్నప్పటికీ   ఒక జ్ఞాన దీపం వెలుగుతున్నట్టుగా  కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా డ్రై ల్యాండ్ , దక్కని ప్లాటో ప్రాంతాల్లో చూడముచ్చటగా వుంటుంది. వేసవిలో మిట్ట మధ్యానం ఓ చెరువు గట్టుకి ముక్కెర లా...! వేసవి లో సూర్యుడు నేలమీద బోర్లాపడుకుని ఆకాశం వైపు చూడడం లాంటవి  అగ్ని పూలు!!. వాటి ఒక్కో రెక్క చిలక ముక్కులు,  తమలపాకుతొ పండిన స్త్రీల ఎరుపు  పెదవులు, గోరింటాకు తో పండిన అరిచేతులు.  మనలో  కవిత్వాలోచనల్ని సృష్టించే ఎర్ర కణాలు!. ఒకప్పడు బాగా విస్తారంగా వున్న ఈ చెట్లు నేడు అక్కడక్కడ మాత్రమే కనపడుతున్నాయి ,అడవిలో అగ్ని పూల జాడను ఇంకా గుర్తుచేయాలన్న తపనతో అన్నట్టుగా!.
నేను 1996లో అడ్డతీగల మండలం పశ్చిమ గోదావరి  జిల్లా లో పనిచేసే వాడ్ని , వేసవి చివర్లో  అక్కడి నుండి ఇంటికి  వచ్చి   , తొలకరి మొదలులో  తిరిగి వెళ్ళాను. నేను అక్కడి నుండి వచ్చే టప్పుడు అడవంతా బోడుగా వుండి కేవలం మోదుగ  పూలు  మాత్రమే కనిపించేవి , తిరిగి వెళ్ళేసరికి   మొదటి తొలకర్లకే అడవంతా పచ్చగా  మారి మోదుగ పూల జాడ లేదు , వాటి స్ధానంలో  ఎక్కడ చూసినా పసుపు పచ్చని రెల్ల పూల  గుచ్చాలు!  అప్పుడు  నాకు కలిగిన  భావన...
నేలేగా  చూసి
తనొచ్చి
వెళ్ళింది 
ఒంటరి ఎర్రని మోదుగ స్ధానంలో
రెల్లు పూల కొలువు
(13-5-96,  దుచ్చర్తి భీమవరం,అడవిలో, ఇంకా సగం,2000)

ఒక తొలకరి జల్లుతోనే అడవంతా మారిపోయింది ,అడవెడారి, పచ్చటి ఏరైయింది .  ఇంతటి మార్పుని ఎన్నో విధాలుగా రాయచ్చు, విస్తారంగా ,సూక్ష్మంగా , నేను మటుకు పూలనే ప్రతీకలుగా  తీసుకుని  చెప్పాను.కారణం  నేను వర్షాన్ని చూడలేదు , అది వచ్చి వెళ్ళిందన్న జాడల్ని చూసి ఇలా  చెప్పాలనిపించింది. మనం లేనప్పుడు, మన ఇంట్లోకి, మన గదిలోకి ఆప్తులు వచ్చి వెళ్తారు, మనం తిరిగి వచ్చి చూసినప్పుడు ఆ జాడల్ని గుర్తించి ,అరే  వాళ్ళని  మిస్ అయ్యాం అన్న ఒక బెంగ వుంటుంది, దానితో  పాటు వాళ్ళు వచ్చి వెళ్ళారు అని చెప్పే ఆ జాడల ద్వారా సంతృప్తి చెందుతాం. ఇది మన భావనల నిచ్చ్. దీని నుండి మన భావాలోనచనాలు అల్లుకుంటాయి.
ఇదే  విధంగా   ప్రకృతి లోని జీవరాసులు ఎదిగి ,అల్లుకుపోవాలంటే వాటికి కావాల్సిన ఆ నిచ్చ్ (ఆవరణ)  కీలకం. చెట్లు  పలు కష్టమైన వాతావరణంలో  ఎదిగి నిలదోక్కువడం కష్టం, అదీ ప్రకృతి పరమైన ,సామాజక పరమైన వాతావరణంలో.
 ఉదాహరణకి ఒక వేప  చెట్టునే చూడండి , అతి కష్టంగా ఎదిగిన వేప చేట్టునుండి రాలిన విత్తనం ఎక్కడ   పడుతుంది  అన్నది గాలి వాటం, పక్షుల   మీద ఆధార పడి వుంటుంది. రాళ్ల గుట్టలో రాలుతుంది. ఆ  రాళ్ళ గుట్టల నేలని చీల్చుకుంటూ  మొలకెత్తాలి, నిలదొక్కుకోవాలి, ఎదగాలి.  తిరిగి  జీవనాన్ని విస్తరింప చేయాలి.  రాళ్ళ  గుట్టలో వుండే రావి చెట్లని చూసినా అవి నా ఆలోచనల్ని తొలిచేస్తాయి. మరొక దృశ్యం తాటిచేట్టులో నుండి మొలకెత్తే మర్రి మాను, అవి నడిచే శిల్పాలుగానూ అగుపిస్తాయి. ఈ ఆవరణల ఆలింగనం పుట్టి ,ఎదగాలంటే  ఎంతో కాలం ,స్పేస్తోతొ  కూడుకున్న ప్రక్రియ . ఇది మన కవితలకి ,కవిత్వానికి కూడా వర్తిసుంది.కారణం  మనం  పర్యావరణ  ,ప్రకృతి కవిత్వం రాస్తునప్పుడు  కేవలం ప్రకృతి  లోని నిచ్చ్  గురించే రాయం,  సామాజిక, సాంస్కృతిక,రాజకీయ, చారిత్రక, జ్ఞాపకాల  నిచ్చ్ గురించి ప్రస్తావిస్తాం.
 పాల్ ఇంజీల్  అన్నట్టు  కవిత్వం  అన్నది “ఆలోచనల నరాల పేటిక, భావాల రక్త స్రవంతి, మందమైన చర్మంలో  పదాలతో ఇమిడిన సునిశిత భావం”. దీనిని మనలో ఇమిడ్చేది ప్రకృతి , అందుకే ప్రకృతి ,పర్యావరణ కవిత్వం అన్నది ఇతర కవిత్వ సాహిత్యాల కంటే భిన్నమైనది. ఇది  మోర్ ధాన్ సైంటిఫిక్ ఇమాజినేషన్. అది మనని మన సృజనాత్మక ఆలోచనల ద్వారా సృష్టించే మరో  యూనివర్స్.  కామెల్లి .టి. డంగి   మాటల్లో పర్యారణ ,ప్రకృతి కవిత్వం అన్నది  “గతాన్ని నెమరేస్తూ, వర్తమానాన్ని గమనిస్తూ, భవిష్యత్తుని సూచించేది”. ఈ మాటలోని నిగూడత్వాన్ని అర్ధం అవ్వాలి అంటే మనకు ,ప్రకృతికి వున్న వివిధ జీవన చక్రవలయాల సంబంధాలు అర్ధం అవ్వాలి. అది అర్ధం అయ్యేంత కాలంలో మన బాహ్య  ప్రకృతి అంతా మారిపోతుంది. కల్పవృక్షమైన  తాటి చెట్లలా... అవి  పూర్వికుల మోనోలిత్  సమాధి పలకాల్లా కూడా కనిపించడం లేదు...
తాటి చెట్టు
నా తనువు
నేల మీద
మోనోలిత్
(6-6-96,  ఇంకా సగం,2000)
  పర్యావరణ ,ప్రకృతి కవిత్వం రాయడానికి చదువుతో బాటు వ్యక్తి గత సంచార అనుభవం అవసరం.  గతం నెమరేస్కుకుంటున్నాం, వర్తమానం చూస్తున్నాం ,భవిష్యత్తు అగమ్య గోచరంగా  వుంది. ఏదో పుస్తకంలో చదివాను  “పర్యావరణం గురించి రాయడమంటే  మన సమాధుల్ని  తవ్వుకుని మనస్సు లేని హృదయంతో ఏడవడం”.  కారణం  అంతరించినవి జీవ రాసులు ,ప్రకృతి పునరావృతం కావు.  ఇవి అనుభవం తో చెప్తున్న మాటలు.
 నమ్మశక్యం కాకపొతే ,తెలుగు సాహిత్యంలో ప్రకృతి పై  మమైక ప్రేమతో, చెట్టునే ఆదర్శంగా  చాటుకున్న గొప్ప కవి ఇస్మాయిల్ గారి కవితని  నెమరేస్కుందాం.
అనుభవం
పూర్వానుభవాల్నించి
నేర్వమన్నారు కదా అని
పూడిపోయిన వాటి
పురాతన నాస్ధికల్ని
తవ్వి తీసుకొచ్చాను.
ఎమికల్ని పేరిస్తే,
ఎవ్వరూ ఎరగని
వింత జంతువొకటి
అంతిమరూపం దాల్చింది:
ఈజాతి అంతమై
ఇదు లక్షలేళ్ళైయిందట!

(8-10-1977,చిలకలు వాలిన చెట్టు)






0 comments:

Post a Comment