కవిత కవితతో పెనవేసుకోడం, పర్యావరణ కవిత్వం కవిత్వ
పర్యావరణమవ్వడం. ఇది మన అంతర్లీన ,బాహ్య ప్రకృతి తో బాటు మన స్పేస్ ,టైంనిఐక్యం
చేసే భావ ప్రకటన. అంతే గాని మొక్కలు నాటడం వల్ల అడవులు పెరుగుతాయి అన్న ప్రచారాల
వల్ల కాదు. మనలో కవిత్వ ప్రకృతి బీజం లేనప్పుడు పచ్చని ఆలోచన మొలకెత్తదు. ఒక్టావో పాజ్ ఈ విషయాన్నే
ముచ్చటగా ప్రస్తావించాడు, ‘‘జీవితం నుండి
కవిత్వాన్ని రాసుకోవడం కంటే, కవిత్వాన్ని జీవితంగా మలుచుకోవడం ఉత్తమం కదా’’ అని.
ఆధునిక పర్యావరణ సాహిత్యానికి ,సాంప్రదాయ
పర్యావరణ సాహిత్యానికి తేడాలలో కీలకమైనది, కి స్టోన్ ప్రకారం ఎన్విరాన్మెంటలిజం
(పర్యావరణీయం)అన్నది పారిశ్రామిక సంస్కృతి నుండి పుట్టింది. ‘ఇది అనాదిగా మానవ సమాజాల
చేతుల్లో బలవుతున్న ప్రకృతిని
సంరక్షించుకోడం కోసం ఉద్భవించే వ్యతిరేక నినాదం’. స్లేమేకర్ అనుసారం ‘ పర్యావరణ సాహిత్య,
పర్యావరణ విశ్లేషకులు తమ మనోభావాల్ని రాజకీయ స్ధైర్యంతో ,ఆధ్యాత్మిక చింతనతో,
ప్రకృతిని యాంత్రికంగా మార్చుతున్న తీరుని ఖండిస్తున్నారు.’ సాంప్రదాయకమైన ప్రకృతి
సాహిత్యం లోని జ్ఞానం ప్రస్ఫుటంగా ప్రకృతి విధ్వంసాన్ని భరించే తీరుని
వెల్లడించడంలో తన ఛాయల్ని పూర్తి స్థాయిలో చాటి చెప్పలేదు. అవి పూర్తి స్ధాయిలో
పర్యావరణ స్పృహని వ్యక్తపరచలేదు, చాలా మటుకు ప్రాంతీయ ,జాతీయ స్థాయికే
పరిమితమయ్యాయి , ముఖ్యంగా పర్యావరణ సాహిత్యం భౌగోళికమైనదన్నది ఆయన ప్రస్తావన’. పర్యావరణ
కవిత్వంలో నెరేటివ్ కాపిటల్ ని కాప్చర్ చేస్తునప్పుడు, గతం ,వర్తమానం తో బాటు
భవిష్యత్తుని ప్రస్తావించాలి. ప్రస్తావనలో
అది వాస్తవానికి దగ్గర వుండాలి.
మనమిప్పుడు
సామాజిక,సంస్కృతిక,రాజకీయ,సిద్ధాంతాల్లో ఏర్పడుతున్న పలు మార్పుల స్ధితిలో వున్నామన్నదాన్ని
కాదనలేము. సామాజిక తీరుతెన్నులు,అవి నూతన ఒరవడులను ఒకదానితో ఒకటి ఏవిధంగా
సాగుతున్నాయన్నది కేవలం విద్యావేత్తల అధ్యయనాలకే పరిమితం కావడం లేదు. మన నరనరాల్లోకి మనకి తెలియకుండానే
ఇంకిపోతున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా జీవించడమే మనం అనుభవిస్తున్న ఘర్షణ!.ఈ విషయాన్ని పర్యావరణానికి అతీతంగా భావించడమే
మనం చేస్తున్న తప్పు.
మనం మనలోని సహజంగా మేల్కొలిపే సుప్రభాత గీతాన్ని
కోల్పోయాం. రోజుల్ని యాత్రికం చేస్కునప్పుడు ,రోజులు మనకి ప్రతి రోజు మనకి ‘దినం’
గా నే గడుస్తుంది. డి. వినయచంద్రన్ అన్నట్టు పర్యావరణీయం అంటే ప్రకృతి ని గుడ్డిగా
పూజించడం కాదు, అదే విధంగా తోటల/వనాల పెంపకం గురించి అధ్యయనమూ కాదు. ఈ విధమైన
దృక్పథం ప్రకృతిని కేవలం చెట్లు,నదులు,పక్షులు,అడవులుగా మార్చేస్తుంది. ఈ నిర్జీవ
(సింథటిక్) ఆలోచన, అనాలోచితంగానే మానవ జీవనాన్ని, మనుషుల్ని ప్రకృతిని
విడదీస్తుంది. అప్పుడు సూర్యోదయం కూడ
కరిగిపోతున్న కలే!
పర్యావరణ కవిత్వం అన్నది ఈ మధ్యనే వెలుగులోకి వస్తున్న అంశం. అంటే
ప్రకృతికి సంబంధించిన కవిత్వం. పూర్వం లేదా అంటే అప్పుడూ వుంది. అప్పటికీ ఇప్పటికీ
తేడా వికిపీడియా నిర్వచనం తో మొదలుపెడదాం. ఎకో పోయెట్రీ ‘ప్రకృతి తో సంబంధాన్ని పునరావృతం చేసుకునే
ధ్వని,ప్రకృతి విధ్వంసం పై ప్రతిఘటన,
మెరుగైన ,ఆరోగ్యకరమైన ప్రకృతి కోసం పర్యావరణ సంరక్షణ ప్రణాళికల్ని, చట్టాల్ని ప్రోద్భలించడం.( నసీర్76).’ గతంలో పర్యావరణం గురించి రాసినప్పటికీ, ఈమధ్యనే ఇది కొత్త ఒరవడిగా ,నూతన పద సృష్టి గా ఎదుగుతోంది. జేమ్స్ ఎన్గల్ హార్ట్
చెప్పిన వివరణ లోని కీలక అంశం , ఇతర సిద్దాంతాల్లాగానే (మార్క్స్, స్త్రీవాదం,
వగైరా ) సామాజిక బాధ్యతతో కూడిన ప్రక్రియ.
“ఎకో పోయెట్రీ అన్నది విలువలతో కూడుకున్నది.” వాళ్ళు ఇదే
నిర్వచనమని అనరు,కాని ఈ నిర్వచనాన్ని లోతుగా పరిశీలించాలి. ఎందుకంటే ఇది ఎక్కువ
శాతం స్టేట్(రాజ్య వ్యవస్ధ) నిర్వచనంగా కనపడుతుంది. మూలవాసుల,దళితులు,గ్రామీణ
ప్రజలు, నగర జీవులు ప్రకృతిని చూసే దృక్పధాలు వేరు. ముఖ్యంగా రాజ్య వ్యవస్ధ చూసే
తీరు వేరు. ప్రకృతి ,సంస్కృతి నిర్మాణానికి, స్టేట్ ప్రకృతి సంస్కృతి నిర్మాణానికి మధ్యన పొంతన
కుదరరడం లేదు. దీని మధ్యన పర్యావరణ కవిత్వానికి,కవిత్వ పర్యావరణానికి వున్నంత
లోతైన అగాధం వుంది. రెండూ పోషకుల పైనే ఆధారపడి వుంటాయి. ఎటొచ్చీ ధృక్కోణాలే వేరు.
ఇది ఇప్పుడే అని కాదు,అనాదిగా వున్న
ధృక్పధాల్లో అంతరం. దీనికి బీజం,
వనరుల్ని అంచనా కట్టే భిన్న ఆర్ధిక
దృక్పధాలు. ప్రకృతి భావాన్ని కవిత్వంగా
వ్యక్తపర్చడమంటే వైవిధ్యమైన దారిన సాగే
నిరంతర అన్వేషణ. వలస పక్షుల వైతరణి తోవ.
ఇది ప్రణాళికలు ,చట్టాల కంటే
విస్త్రుతమైనది .పాట పాటతో
ముచ్చటించుకోవడం.
కవిత ప్రకృతిలోని మానవ సమాజాన్ని అన్వేషిస్తుంది, లేక మానవ
సమాజంలోని ప్రకృతిని వెతుకుతుంది.ఒక విధంగా పర్యావరణ కవిత్వం-ప్రదేశాలు,
మనం,మనతో, అంతర్గతంగా,ఇతరులతో సంభా
షించుకోవడం. మనలోని ప్రకృతిని రాయడం , దానిని ప్రస్తావించే తీరే పర్యావరణ
కవిత్వమనవచ్చు. సహజమైన ప్రకృతి నుండి ,మానవ
ప్రేరిత పర్యావరణం మార్గంగా కృత్రిమ పర్యావరణం లోకి వచ్చాం. ఈ ప్రస్థానంలోని దశలు ప్రకృతితో మమైకతతో జీవించడంగా చెప్పుకుంటాం.
వునికి, అస్తిత్వ పోరాటాలు చాటుతాం, ప్రకృతితో పరాధీనమైన వ్యధను, ప్రకృతి విధ్వంసం
, సంరక్షణ గురించి పంచుకుంటాం. ఇదంతా మనలోని ,మన బయట వున్న చెట్టు,పుట్టా,
నీరు,నిప్పు,గాలి,మట్టిని అర్ధం చేస్కునే ప్రక్రియ. ఈ ప్రక్రియ వ్యక్తీకరణ కోసం మట్టి తివాచీ పై కూర్చుని ఆకాశ మార్గంలో
పయనిస్తూ పక్షి కన్నుతో చూడ్డం పర్యావరణ కవిత్వం.
ఎకో పోయెట్రీ (Eco poetry)
ఎకోసెన్ట్రిజం
ప్రకృతి సమతుల్యతను పలుకుతుంది, అది ప్రకృతిలోని జీవ,నిర్జీవ వ్యవస్ధలతో బాటు
చంద్రుడు,ఆకాశం,నక్షత్రాలను కలుపుకుని.అందుకే కవిత అన్నదానికి విశాల అర్ధం అన్ని
ఊహాజనిత మార్గాల ఉత్పత్తి ప్రక్రియ. దీనినే భారతీయ సనాతన సాహిత్య కారులు మానసిక శక్తులను సృజనాత్మక రూపంలో విడుదల చేయడం
అన్నారు.ఇది జరగాలంటే మనం ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతాం అన్న వాస్తవాన్ని
తెల్సుకోవడమే కాక మనలోని సునిశితను పెంచుకోవాలి.అప్పుడు సాహిత్యం ఒక నిర్జీవమైన
పుస్తకంగా మిగిలిపోదు.భిన్న స్వర వచనం
(పోలిఫోనిక్) లేక ముఖ్యమైన
అసంఖ్యాక ( ప్లూరి గ్నిఫికంట్) స్వరాల గళం అవుతుంది,అందులో
రచయిత/రచయిత్రి,విశ్లేషకులు, మధ్య పరస్పర చర్య అవుతుంది.సనాతన భారతీయ తర్కశాస్త్రం
అనుసారం ప్రపంచ మనుగడకు ఒకరిమీద ఒకరికి ప్రేమ మూలం. ఈ మూలాన్నే అద్వైతం పేర్కొoటుంది.
“గాలి,వాన, కొండలు,నదులు,అడవులు,పచ్చిక బైళ్ళు,అక్కడ
నివాసులు- ఇవన్నీ మన భౌతిక అవసరాల కంటే
మనః స్ధితికి చాలా అవసరం. “-థామస్ బెర్రీ.
ప్రకృతి సంస్కృతి నిర్మాణం రూపాంతరం చెందడం (nature cultural
construction), అదే సమయంలో పర్యావరణాన్ని
వినియోగించడం. ఈ వినియోగంలో ప్రకృతిని సంస్కృతిగా, సంస్కృతిని
ప్రకృతిగా అర్ధం చేసుకోవడం చాలా కీలకమైనది. ప్రకృతి వివిధ రూపాల్లో వుంటుంది. ఇది
అంతర్గత,బాహ్య చర్యల వల్ల ఏర్పడుతుంది. మనం కొండంచున నిల్చుని, ఉబికివున్న కొండ
చరియల్ని,లోయను చూస్తునప్పుడు,ఆ దృశ్యంలోని అంతర్లీన చర్యలను,వాటి ప్రతిస్పందనను గమనించడం,వ్యక్తపరచడం ముఖ్యం. వాట్ని ఒక క్రియగా చూడాలి తప్ప కేవలం నామ వాచకంగా కాదు. ఈ దృష్టిని
అర్ధం చేస్కున్నపుడే మనం మన చుట్టూ వున్న పరిసరాలని మచ్చిక చేసుకుంటూ వాటి రంగునీ,
రూపాన్ని,పరిమళాన్ని,స్పర్శని మనలో
ఇముడ్చుకుంటూ మనం అందులో ఇమిడిపోతాం.
పర్యావరణ కవిత్వానికి , నేడు చలా మణిలో వున్నఎకో పోయెట్రీకి మధ్య
చాలా పర్యావరణ దృక్పధాలు వచ్చాయి వాట్ని పరిశీద్దాం...
0 comments:
Post a Comment