భూమి బుగ్గ మీద సొట్ట
బుగ్గ వాగు
కదలకుండా వుంది
వాగు గర్భంలో
ఉపరితల నేల జ్ఞాపకాల పూడిక చేరింది
నీళ్ళకు
ఆకుల రొట్ట నీడల రంగులు పులుముకున్నాయి
బీడువారిన పాత ఇంటి గోడల్లో మొలచిన రావి చెట్టులా
బుగ్గ వాగెమ్మటే రైలు కట్ట, ఎండాకాలంలో మిగిలి పోయిన నీళ్ళలా అప్పుడప్పుడూ
వచ్చిపోయే రైలు. కిటికిలోండి చూస్తున్న ప్రయాణికుడి చూపుల్లో నుండి కదిలిపోతున్న దృశ్యాల్లా అక్కడక్కడా వాగులో గాలినీటి
బుడగలు1 వాగులోని పచ్చంచు నీళ్ళల్లో కొన్ని సూర్యకిరణాల చుక్కల మెరుపుల్ని
పొదిగున్నాయి.
రైలు కిటికీ వూచేదో అక్కడ విరిగి పడిపోయినట్టు
16 వ నంబర్ మైలు రాయి కనీ కనిపించకుండా కానుగ చెట్టు
నీడల్లో కలిసి పోయింది.
రైల్ కట్ట దాటి ఊర్లోకి చేరాలి . రైల్ కట్ట ముందు ప్రమాద హెచ్చరికలా ఒక పెద్ద
స్పీడ్ బ్రేకర్, చిన్న కార్లల్లో ఎక్కువ మంది కూర్చుంటే , స్పీడ్ బ్రేకర్ దాటాలంటే
కొందరు దిగక తప్పదు. రైల్ కట్టకు స్పీడ్ బ్రేకర్ ఒడ్డులావుంది. రైల్ కట్ట వాగుకు వొడ్డు.
ఒడ్డు నిలకడగా వుంటుంది అన్నది భ్రమ. వాగెమ్మటే మనని తోడట్టు కెళ్ళే నేల
విహంగం అది. వాగు నీటిలో శరీరాన్ని తడపకుండా ,వాగు నీటి ఆలోచనలతో భౌతికంగా మనని తడ్పుతూ ఎగరేస్కు పోయే పక్షి అది. వాగు ఒడ్డున వూరు జీవితాన్ని, కాలాన్ని నాటకంగా మల్చే కవిత్వంలా
సాగుతుంది.
ఇళ్ళు దాటి వచ్చి చాలా సేపు అలానే చూస్తూ,ఆలోచనల్లో తచ్చాడుతూ ఉండిపోయాను.
వాగు నాలో నింపే దృశ్యాలు, నేను వాగులో
వొంపే ఆలోచనలు -రెండిటికి ప్రతీకలు లేవు. రాబోయే ప్రతీకని వూహించుకుంటూ ఒక పెద్ద
టెలిస్కోప్ నుండి గగనంలోకి చూస్తూ లాండ్
స్కేప్ ని సృష్టించుకుంటున్నా.ఇదంతా ఒక చోట పుట్టే ఆలోచనల్ని మరో చోట పేర్చుకుంటూ
,గుర్తు పట్టేలా,మానవీయంగా పెట్టుకుంటూ,అవి మనకు తెలుసు ,వాట్ని అర్ధంచేసుకుంటాం
అనే భావనలోని ప్రక్రియలో ఒదిగిపోయా. ప్రకృతిలో
వున్నవిశాలమైన భౌతిక మైదానాల్ని మనకు అనుగుణంగా మల్చుకునే ప్రయాసలో భూమిని
తొల్చేసే గురుత్వాకర్షణ శక్తిని సంపాదించాం.అర్ధంలేని యంత్రాలమయ్యాం.
వాగు ఒడ్డునే కదలకుండానే నిర్మలంగా కదిలే గాలికి ,దాని వేగాన్ని బట్టి వూగే
రెల్లు గడ్డి పూలు ,గాలికి ఒడ్డుకు లాగున్నాయి. అలా అలోఛిస్తూనే ఇంటి వైపు నడవడం
మొదలు పెట్టా. ఎదురుగా బడికి వెళుతున్న పిల్లలు ,ఇంటి గుమ్మం దగ్గర వాళ్ళనే చూస్తూ
వున్న తల్లి. ఏమైనా మర్చిపోయి వెనక్కి తిరిగి చూసి అడుగుతారేమోనని ఆదుర్తాతో.
నా వెనాకలే ఒడ్డుమ్మట్టే రైల్ వెళుతున్న చప్పడు. ఇప్పుడు కార్లో వాళ్ళే కాదు, అందరూ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగాల్సిందే !
ఇంటి నుండి వెళ్ళే వాళ్ళు , ఇంటికి వచ్చే వాళ్ళు.మనం వూహించే ,ప్రతీకరించే ప్రపంచం
లోగిల్లోకి ,లోగిలి బయట అడుగేసేముందు ఇవ్వాల్సిoది ,తీసుకెళ్లాల్సిoది ఏమైనా ఉందా
అన్న ఆలోచనకి కేటాయించే సమయం కోసం.