చెట్లు, ఆకాశంలో భూమి
రాసిన కవితలు ,వాట్ని నరికి కాగితాలు తయారు చేస్తాం. అందులో మన శూన్యాన్ని పొందు పర్చుకోడానికి.-ఖలీల్ జిబ్రాన్.
తన తొలి దశలో రాసిన
‘ఎ లామెంటేషన్ ఇన్ ది ఫీల్డ్ ‘ అనే సంపుటిలో ఖలీల్ జిబ్రాన్
ప్రకృతిలోని గాలి,పూలు,వాగు,పక్షులు గురించి సంభాషిస్తూ, అవన్నీ
కాలుష్యం,మానవాళి చర్యలు,నగర జీవనం పై రోదిస్తున్నాయని వ్యక్తపరుస్తాడు.దీనిని ప్రకృతి
గురించి విడిగా వ్యక్తీకరణగా కాక సహజమైన జీవనం, నగర జీవనం పై జిబ్రాన్ రొమాంటిక్
వ్యతిరేకత గా చూడాలి. అందుకే అన్నాడు కాబోలు చెట్లు నరికి కాగితాలు చేసి అందులోమన
శూన్యాన్ని లిఖించుకుంటామని.
మృతుల నగరం
-ఖలీల్ జిబ్రాన్.
నిన్న,నేను శభ్దాల ముళ్ళు లేని మైదానం వైపు
కొనసాగాను, కొండ చేరేంత వరకు ,ప్రకృతి అక్కడ తన
అందమైన దుస్తుల్ని పేర్చి వుంది, ఇప్పుడు శ్వాస పీల్చ గలను.
వెనుతిరిగి చూశాను, బ్రహ్మాండమైన మస్జిదులతో,రాష్ట్ర సౌరభాలతో,పొగతో కమ్ముకున్న
దుకాణాలతో నగరం కనిపించింది.
నేను మనిషి ఆశయం గురించిన విశ్లేషణాత్మక ఆలోచనలో పడ్డాను,కాని మనిషి జీవితం అంతా
సంఘర్షణ, కష్టాలు అన్న నిశ్చయానికి వచ్చాను. ఆదాము తనయులు ఏమి చేశారని ఆలోచించ దల్చుకోలేదు,నా చూపుని దేవుడి కీర్తి కిరీటమైన మైదానం వైపు మరల్చాను.
మైదానం లోని ఒక చివర చెట్లతో వున్న
ఖనన ప్రదేశాన్ని చూశాను.
అక్కడ, మృతుల నగరం, బతికివున్న వారి నగరం మధ్యన, నేను ధ్యానం చేశాను. ముందర ఆధ్యాత్మిక నిశబ్ధం గురించి
ఆలోచించాను, తర్వాత అంతులేని రోదన గురించి.
బతికున్న వారి నగరంలో ఆశ, నైరాశ్యం,ప్రేమ,కక్ష,ఆనందం,బాధ,సంపద,పేదరికం,నమ్మకం,ద్రోహం గమనించాను.
మృతుల నగరంలో భూమిలో
కలిపేసిన మట్టి,ప్రకృతి దానిని
మలుస్తుంది,రాత్రి నిశ్శబ్దంలో,వృక్ష సమూహంగా, తర్వాత జంతుజాలంగా, పిదప మనిషిగా. ఇలా నా మదిలో
ఆలోచనలు రేకెత్తుతున్నప్పుడు,అటు వైపు ఒక సమూహం
మెల్లిగా,శ్రద్ధతో వెళుతోంది.సంగీతంతో సాగుతోంది అది నింగిని బాధతో కూడిన
స్వరాన్ని నింపింది.అది చాల పెద్ద శవ
యాత్ర.చనిపోయిన వారి వెంట బతికున్న వారు
ఏడుస్తూ వారి నిష్క్రమణని
తలచుకుంటూ వ్యధ చెందుతున్నారు.ఊరేగింపు సమాధి స్ధలం చేరాక పూజారి ప్రార్ధనలు మొదలుపెట్టి అగరొత్తులు
వెలిగించాడు. వాయిద్యకారులు తమ వాయిద్యం మొదలుపెట్టారు.చనిపోయినవార్ని తలచుకుంటూ
రోదిస్తున్నారు.ఒకరి తర్వాత ఒకరు నాయకులు వచ్చి
తమ అనుబంధపు జ్ఞాపకాల్ని మంచి వాక్యాలతో నెమరేసారు.
చివరికి సమూహం నిష్క్రమించింది, చనిపోయినవార్ని సువిశాలమైన అందమైన , ఇనుము రాతి పై నైపుణ్యంతో
చెక్కిన పేటికలో సేదతీరేందుకు,ఇంకా అందమైన ఖరీదైన
పుష్పగుచ్చాలతో అమర్చిన దానిలో.
అంతిమ యాత్రలో పాల్గొన్న వారు నగరానికి తిరిగివెళ్ళిపోయారు నేను మాత్రం
మిగిలాను,వాళ్ళని గమనిస్తూ,నాతో నేను నింపాదిగా మాట్లాడుకుంటూ,ఈ లోపల సూర్యుడు తీరం దాటిపోతున్నాడు, ప్రకృతి నిద్రించడానికి
తగు ప్రయత్నాలు చేస్తోంది.
అప్పుడు చెక్కతో చేసిన పేటికను మోసుకుంటూ వస్తున్న ఇద్దర్ని చూశాను, వారి వెనకాలే దారిద్ర్యంలో
వున్న ఒక స్త్రీ చంకన పసికందును వేసుకుని ,ఆమె వెంటే ఒక కుక్క, మనో వేదనతో కూడిన చూపులతో స్త్రీని,తర్వాత పేటిక వైపు చూస్తూ.
అది పేద వాడి శవ యాత్ర.ఈ మృత్యువు అతిధి, చలనం లేని సమాజానికి దారిద్రంలో
వున్న భార్యని,ఆమె దుఖాన్ని పంచుకోడానికి పసికందుని, తను లేడని మనసెరిగిన కుక్కని
వదిలివెళ్ళాడు.
వాళ్ళు సమాధి స్ధలం చేరగానే పేటికని లేత గుబురులు ,పాలరాళ్ళకి దూరంగా వున్న ఒక
గోతిలో పెట్టారు,కొన్ని వాక్యాలతో దైవస్మరణ చేసి వెనుతిరిగారు. ఆ చిన్న సమూహం చెట్లల్లో కనుమరుగవుతునప్పుడు
,కుక్క
చివరి సారి చూపుగా వెను తిరిగి చూసింది.
నేను బతికినున్న వారి నగరం వైపు
చూస్తూ నాలో నేను అనుకున్నాను, "ఆ ప్రదేశం కొందరికే చెందుతుంది'. ఓ దేవుడా అందరికీ కావాల్సిన స్వర్గం ఎక్కడ వుంది?"
ఇది అంటూ , మబ్బుల వైపు చూశాను,పొడవైన ,అందమైన సూర్యుడి బంగారు కిరణాలతో మిళితమైవుంది, నాలో ఒక శ్వాసాత్మ
గొంతు అనడం విన్నాను,"అదో అక్కడ!"
(అనుసృజన-జి.సత్య
శ్రీనివాస్)
అవును అందమైన నగరం మృతుల నగరం గానే వుంటుంది అని జిబ్రాన్ మనకి ఒక తాత్వికతో
వున్న ఆలోచనని ఇచ్చాడు.జిబ్రాన్ కవిత్వంలో ప్రకృతి, ఆధునికత నగర జీవనం మార్మికంగా వుంటుంది. ఆయనలోని
ఆ అంశాన్ని విస్మరించాం. నేడు గ్రామాల్ని,
చూస్తునప్పుడు ఇదే కవిత వెంటాడుతుంది. ఎక్కడ చూసినా, విన్నా ఒకే మాట ,బతకడానికి
ఏముంది గ్రామంలో , వలసలు, కరువు, ఆత్మహత్యలు.మరి నగరంలో ఎవరికి వారే యమునా తీరే!
ఆధునికత, అభివృద్ధి అనే ప్రగతిశీల ధోరణిలో ఎప్పటికీ తరగని వనరుల్ని ఇచ్చే
కామధేనువుగా ప్రకృతిని అంచనా వేసాం. ఇది సరైన అంచనా కాదు అని హెగెల్,ఏంగెల్స్
చెప్పినప్పటికీ పట్టించు కోలేదు. ‘ప్రకృతి మన అవసరాల్ని తీరుస్తుంది, అత్యాశను కాదు ‘అని గాంధి అన్నాడు. అయినా
లాభం లేదు.
ఈ విషయాల్ని జిబ్రాన్
ఫ్రీ వర్స్ శైలిలో వస్తువుని కధగా కవితని అల్లాడు. మనకి మనం ఏం చెప్పాలో .చెప్పే
విషయం పై మనకున్న పట్టు మనకి చెప్పేతీరుని
మల్చే నైపుణ్యం,మెళుకువని అందిస్తుంది. అది మన అనుభవం నుండి మొలిచే భావాన్ని
వ్యక్త పర్చే మొలక.
ఒక సంభాషణని చిత్రం ద్వారా చూపడం అంటే కంటి
మనస్సులో ఆలోచన పుట్టాలి అదే మనలోని అనంత అంతర ప్రకృతి-
‘నేను బతికినున్న వారి
నగరం వైపు చూస్తూ నాలో నేను అనుకున్నాను, "ఆ ప్రదేశం కొందరికే చెందుతుంది'.
ఓ దేవుడా అందరికీ కావాల్సిన స్వర్గం ఎక్కడ వుంది?"
ఇది అంటూ , మబ్బుల వైపు చూశాను,పొడవైన ,అందమైన సూర్యుడి బంగారు కిరణాలతో మిళితమైవుంది, నాలో ఒక శ్వాసాత్మ
గొంతు అనడం విన్నాను,"అదో అక్కడ!"
ఇది ఒక సిల్ ఔట్ షాట్లో వాయిస్ ఓవర్ లా వుంటుంది. వెంటాడుతూనే వుంటుంది. ఒక
నది ఒడ్డునో, చెరువు గట్టునో ఒంటరిగా కూర్చుని ఆవలి వైపు చూసే చూపులా... ఆధునికతలో బతుకిని
ఎక్కడ కోల్పోతామన్న భయంతో భీమా చేసుకుంటాం గాని బతకాలన్న ధీమాతో కాదేమో! ప్రకృతి
పునరావృతమయ్యే చోటుని ఒక బతుకుబాటగా చూడక పోవడం కంటే అంధత్వం ఏముంది ?
‘బతికున్న వారి
నగరంలో ఆశ, నైరాశ్యం,ప్రేమ,కక్ష,ఆనందం,బాధ,సంపద,పేదరికం,నమ్మకం,ద్రోహం గమనించాను.
మృతుల నగరంలో మృతుల నగరంలో
భూమిలో కలిపేసిన మట్టి,ప్రకృతి దానిని మలుస్తుంది,రాత్రి నిశ్శబ్దంలో,వృక్ష సమూహంగా, తర్వాత జంతుజాలంగా,
పిదప మనిషిగా.’
ఒక సారి మహబూబ్
నగర్ జిల్లాలోని బొమ్మరాస్ పేట్ లో తిరుగుతున్నప్పుడు ఒక శవ యాత్ర వెళుతోంది, ‘పొలం వుండి కూడా ఈయనని శ్మశానం
లో ఎందుకు బొంద పెడుతున్నారు’ అన్నాడు ఒక పెద్ద మనిషి. అప్పుడు ఆ మాటలు అర్ధం కాలేదు. ఇప్పుడు దాని నిగూడత
స్పష్టమైంది. నూతన రాజధాని నిర్మాణంలో
సీడ్ క్యాపిటల్ పేర్న చేపడుతున్న ప్రయోగం కూడా లింగాయపాలెం,ఉద్దండరాయునిపాలెం
గ్రామస్తుల్ని ఇదే పరిస్దితుల్లోకి నెట్టేస్తోంది.
ఒక ఉర్దూ
కవి అన్నట్టు ‘మనం భూమిని కోల్పోయాం,కాని స్వర్గాన్ని పొందలేదు’ గ్రామాల్ని వదిలి నగరానికి
రావడం అంటే స్వర్గంలోకి అడుగు పెడ్డటం కాదు, భూమిని కోల్పోతున్నామని ఇంతకంటే విశిదంగా చెప్పనవసరం లేదు.
నా ఆత్మకి హితభోధన
అందరు మనుషులూ పుట్టిన ధూళి నుండే నేను పుట్టానని నాకు తెలుసు
వాళ్ళలోని మూలకాలే నాలోనూ వున్నాయి
నా ఆత్మ వాళ్ళలోనూ ఆత్మే
నా సంఘర్షణ వారి సంఘర్షణ
వారి పుణ్యక్షేత్రం నాదీను
వారు అతిక్రమదారులవుతే,నేను కూడా అతిక్రమదారుడినే
వాళ్ళు బాగుంటే ,అందులో నా వాటాకూడా వుంది
వాళ్ళు ఎదుగితే,నేనూ వాళ్ళతో బాటు ఎదుగుతాను
వాళ్ళు వెనకబడితే, నేను కూడా, వాళ్ళకి సహవాసంగా.
(అనుసృజన-జి.సత్య శ్రీనివాస్)
ఈ కవిత కేవలం మనుషుల గురించే కాదు, ప్రకృతికి కూడా వర్తిస్తుంది. ఖలిల్
జిబ్రాన్ కవితల్లో అంతర్లీనంగా వ్యక్తమయ్యే అంశం ‘ఈ భూమి మీద చాలా
కీలకమైన సమస్యలు అహంకారం వల్ల ఏర్పడ్డాయి,అవి వాటి పరిధిని దాటి చూడ లేవు.ఎక్కువ
శాతం ఇవి ధనంతో ముడిపడినవి’. ఇది జిబ్రాన్ నిరంతరం వ్యక్తపర్చిన అంశం. మనం ఒక్కళ్ళమే
బాగుపడాలన్న ఆలోచన కంటే పర్యావరణ విధ్వంశ ఆలోచన మరొకటి లేదు.
పర్యావరణ కవిత్వం నిశబ్దపు ఆలోచనల సముద్రం. ఇది స్పష్టంగా జిబ్రాన్ కవితల్లో తెలుస్తుంది. జిబ్రాన్
కవితలు కధలుగా వుంటాయి. కవితల్ని కధలుగా రాసే ప్రయత్నం విక్రం సేథ్
ప్రయత్నించాడు.అలా చెప్పాలంటే మెటా ఫర్స్(ప్రతీకల్ని) ని మల్చే నైపుణ్యం
వుండాలి.దానికి మెటామార్ఫిక్ ప్రాసెస్ తెలియాలి. ప్రాసెస్,ప్రోగ్రెస్ మధ్య తేడా
తెలియాలి, ఆ చలన చక్రం అర్ధం అవ్వాలి. అందుకు
నిశితమైన పరిశీలన చాల అవసరం. ప్రకృతి ప్రేమికులకి అత్యంత అవసర మైన
లక్షణం ఇది.