Tuesday 11 August 2015 By: satyasrinivasg

నగరీకరణ ప్రకృతి- అభివృద్ధి మలుపు

నగరీకరణ పుణ్యమా అని క్షీణిస్తున్న ప్రకృతిని తలుచుకుంటూ రాసే కవిత్వంలో చాల పాళ్ళు మానవీయ కోణం తొణికిస లాడుతుంది. బాధ, వేదన ఇందులో చాల శాతం ఎక్కువ. ఏమీ చేయలేని దుస్థితి నుండి వేదనని వ్యక్త పరుస్తాం. నగరంలోని చెట్టు, చేమ, పక్షి అన్నిటి నిష్క్రమణ అనివార్య మని తెలిసి. మన నీడలో ఏది ఉండలేదు అని సుస్పష్టంగా మనకి తెలుసు. అందుకే మనం తిరిగే మలుపులో మనం కోల్పోయింది వున్నదని తెలిసి ఆ వైపుగా తిరగ డానికి సంకోచిస్తాం.   పర్యావరణ కవిత్వం ఆ మలుపుల తలంపే.
నేస్తం
-గుల్జార్
వీధి చివర్న చూశాను ఎప్పుడో ఆ  వృద్ధ వృక్షాన్ని?
నాకు పరిచయమే, చాలా ఏళ్లుగా నాకు తెలుసు అది
నా చిన్నప్పుడు  ఒక మామిడి కాయ కోసం
గోడ మీదుగా దాని భుజాల  పైకి ఎక్కే వాడ్ని
తెలియకుండా  నొప్పిపెట్టే ఏ కొమ్మ మీద కాలు పెట్టే వాడినో
అది ఒక్క సారిగా నన్ను కిందకు తోసేసేది
నేను కోపంతో దాని పై రాళ్ళూ విసిరేవాడ్ని
నా పెళ్ళికి జ్ఞాపకం వుంది దాని రెమ్మలిచ్చింది
నా పెళ్లిలో  హోమానికి వేడినిచ్చింది
నా భార్య గర్భవతప్పుడు ,ప్రతి మధ్యాహ్నం
ఆమె వైపు మామిడి కాయలు  విసిరింది
కాలక్రమేణా పళ్ళు ఆకులు రాలిపోయాయి
ఆ వైపుగా తిరుగుతున్నప్పుడు అంటూ వుండేది 'బిబా'
'అవును, ఇదే చెట్టు నుండి వచ్చావు నువ్వు, దీని ఫలమే నువ్వు'
ఇప్పటికీ అటుగా  వెళుతునప్పుడు
దగ్గుతూ అంటుంది 'ఏంటి తల పైన జుట్టంతా రాలిపోయిందే'?
ఉదయం నుండి అ చెట్టుని నరికేస్తున్నారు
వీధి మలుపు వరకు పోయే ధైర్యం లేదు నాకు
(అనుసృజన-జి. సత్య శ్రీనివాస్)
అభివృద్ధి పుంజుకుంటున్న వేగానికి తగ్గట్టుగానే ప్రకృతి క్షీణత జరుగుతుంది. అంతరించిన ప్రకృతిని తిరిగి పునరావృతం చెయ్యడం దుసాధ్యం. ఈ మధ్యన హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద వృక్షాల్ని నరికేస్త్తున్న సందర్భంలో వాట ఫౌండేషన్ అనే సంస్ధ కోర్టు ప్రేమేయం ద్వారా వాట్ని తిరిగి యధా తధంగా నాటే ప్రయత్నం చేసింది. ఇదే ప్రక్రియ కేరళలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్ధ (కే.ఎస్.డి.యం.ఎ)ప్రాంగణంలో కూడా చేపట్టారు.ఈ ప్రయోగం చేసిన హాబిటాట్ టెక్నాలజీ గ్రూప్  వారు అన్నది ఏమిటంటే ఈ ప్రయోగం ఒకటి రెండు చెట్ల కైతే ఫర్వాలేదు కాని చాలా వాటికి చేయాలంటే చాల,శ్రమ వ్యయంతో కూడుకున్న పని అని. ఒక చెట్టుకే సుమారు రూ.20,000 వేలుదాక అవుతుందని అంచనా. అవును దేనినైనా పెకిలించడం సులువు కాని దానిని సంరక్షించడం చాల కష్టం. మరి  ఇటువంటి మలుపుల్ని అర్ధం చేసుకుని అటు వైపు వెళ్ళాలంటే ఒక సంఘటన, దాని మెటాఫర్ ,మెమరి(జ్ఞాపకం) మనని వెంటాడుతూనే వుంటుంది. ఆ ప్రక్రియని గుల్జార్ కంటే గొప్పగా ఎవరు చెప్పలేరు.
ఇపుడు అనుసరిస్తున్న అభివృద్ధిలో సంఘటనల మెటామార్ఫిజం ఎటువైపు వెళుతుందో చెప్పలేం,కారణం ప్యూపా సీతాకోక చిలుకే అవ్వాలని గ్యారెంటి  లేదు.ఏమైనా అవ్వచ్చు ,ఏమి కాకనూ పోవచ్చు.టెక్నాలజీ తో ప్రేరితమైన ప్రక్రియ మన చేతుల్లోనే వుంటుంది అనుకోవడం మూర్ఖత్వం. ప్రకృతికి తనకంటూ ఒక కెమిస్ట్రీ వుంటుంది, అది ఎప్పుడు పేలుతుందో తెలియదు.విపత్తు వల్ల ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసుకో గలుగు తామేమో కాని విపత్తుని ఆపలేము. మన వీధి చివర మలుపు అక్కడే ఆగి పోదు. మన లోని  సంచార శాంతి కపోతాన్ని కుడా అంతరింప చేస్తుంది ఏమో. ఇటువంటి మెలకువల్ని గుల్జార్ చాల సునాయాసంగా పట్టుకుంటాడు. పోయటిక్ ప్రోస్ రాయడంలో ఆయనకు ఆయనే సాటి.
మనం అనుకుంటున్న అభివృద్ధి కూడా అద్దాల కలలానే వుంటాయి.
అద్దాల కలలు
-గుల్జార్
చూడు మెల్లిగా నడువు, ఇంకా మెల్లిగా
చూడు, అలోచించి-అర్ద్ఘం చేసుకుని అడుగు వెయ్యి
పెద్దగా చప్పుడు  చేస్తూ అడుగులెత్తద్దు
అద్దాల కలలు  ఒంటరిగా పడివున్నాయి
కలలు విరిగిపోతాయేమో, మేల్కుంటాయేమో
ఎవరైనా మేల్కుంటారు కలలు మాత్రం చనిపోతాయి
(అనుసృజన-జి. సత్య శ్రీనివాస్)

అవును అభివృద్ధి కోసం కొందరి కలల్ని, అనేక మందిని నిర్జీవుల్ని చేస్తున్నాం, కొందరి కలల ఆశయాల కోసం. అందుకే నా కనిపిస్తుంది పర్యావరణ కవిత్వం అన్నది ఒక నెరేటివ్ పరిశోధన ప్రక్రియ. ఇందులో ఒక రోజు ,రెండు రోజుల కధకంటే కొనసాగబోయే ప్రక్రియని ముగింపు లేని ముగింపు గా కొనసాగింప చేయడం అంతర్లీన సూత్రమని. అందుకే ప్రత్యేకించి ఇదే పర్యావరణ కవిత్వం అని చెప్పలేం. ఆ స్పృహ అంతర్లీన సూత్రంగా ప్రవహించాలి.మేల్కుని కూడా కలలు కనాలి.

0 comments:

Post a Comment