Saturday, 30 January 2021 0 comments By: satyasrinivasg

ప్రకృతి కి సమయం- సోజౌర్నర్ ట్రుథ్

 

ప్రకృతి సమతుల్యం కోసం ప్రతి ఏడాది జూన్ 5న పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. ఇది 1972 లో ఐక్య రాజ్య సమితి మొదలుపెట్టింది. 1974లో ‘మనకున్నది ఒకే భూమి’ అన్న అంశంతో శ్రీకారం చుట్టింది, ఈ సంవత్సరం (2020) పర్యావరణ దినోత్సవ అంశం ‘ప్రకృతి కి సమయం.’ అందులో కీలక విషయం   భూమి మనుగడకు దోహదపడే జీవరాశికి, మానవ అభివృద్ధికి సదుపాయాలను ప్రోద్భలించడం. ఇది 46వ పర్యావరణ దినోత్సవం. దీనికి సంబంధించి 1992 లో  ప్యారిస్  కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ conference of parties(COP), ఈ ఏడాది జీవ వైవిధ్య సదస్సు 20 అక్టోబర్లో జరగాలి కాని కరోనా వల్ల అది 2021కు పొడిగించారు. సరే ఇక్కడ మనం ఆ సదస్సు విషయం కంటే ,ఈ సంవత్సరం అంశం గురించి కొద్దిగా లోతుగా పరిశీలిద్దాం!.

‘ప్రకృతి కి సమయం’ అన్నప్పుడు ప్రకృతి మనకు సమయం ఇవ్వడం , మనం ప్రకృతికి సమయం కేటాయించడం.అందులో మనతోబాటు భూమి పై వున్న జీవరాశిని దృష్టిలో పెట్టుకుని మానవ అభివృద్ధి  సాధించడం. ప్రకృతి మనకు సమయం కేటాయించడం అన్న విషయం కంటే మనం ప్రకృతికి సమయం కేటాయించడం , మానవ అభివృద్ధి అన్నవి పరస్పర విరుద్ధ ధోరణులు. ప్రకృతిని దోచుకునే ధోరణిలో వున్నవాళ్ళు ప్రకృతిని ఎంత తొందరగా దోచుకుందామన్న యావతో శాస్త్రీయ,సాంకేతిక పరిజ్ఞానంతో సంవత్సరం, నెలలు పట్టే కాలాన్ని గంటలు ,నిమిషాల్లో ప్రకృతిలోని వనరుల్ని తీసుకునే స్ధాయికి ఎదిగారు. ఈ ఎదగడంలో దళిత,గిరిజన, నల్ల జాతి ఖండాన్నిదోచేస్కున్నారు.

ప్రకృతి వనరులు అధికంగా వున్న ప్రాంతాలు చాల మటుకు అత్యంత పేద,అభివృద్ధి చెందని ప్రాంతాలు. బీహార్, ఒడిస్సా,ఝార్కండ్,చత్తీస్ఘర్, పాడేరు,అరకు,ఈశాన్య ప్రాంతాలు, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ప్రాంతాల్ని అభివృద్ధి అన్న నెపంతో ఉద్దేశ్యపూర్వకంగా పేదరిక ప్రాంతాలుగా వుంచేస్తాం. కారణం వ్యాపారంలో చవకగా ఆ ప్రాంత వనరుల్ని హస్తగతం చేసుకోడానికి. ఇదంతా అనంతపురం గుత్తి ప్రాంతంలో పశువుల సంతలో తుండు గుడ్డ చాటులో చేతుల మధ్యన  పశువుల బేరసారo లాంటిది. మధ్యవర్తికి, వ్యాపారికి మటుకే లాభం, అమ్మే వాడికి ,కొనేవాడికి మటుకు నష్టం.

ప్రకృతి లో వున్న స్పేస్ ఇంకా  టైం అన్నవి  అభివృద్ధికి వనరులు.  అవి వ్యాపారం కోసం  తక్కువ  పెట్టుబడికి కొనుగోలు అయ్యే ముడిసరుకులు మాత్రమే. ఈ ముడిసరుకుల్లో పేద, దళిత,గిరిజన . నల్ల జాతీయులు కూడా చేరుతారు. వారి  శక్తిని, సమయాన్ని  ఉపయోగించుకుంటాం కాని అభివృద్ధి మాత్రం  నామ మాత్రమే.  అందుకే అబివృద్ధి క్రమం ఎన్ని ఏళ్ళు సాగినా వీళ్ళకు దక్కేదల్లా  ఎంతకీ అందుబాటులోకి రాని అభివృద్ధి మృగతృష్ణ వెంట  నడవడం,నడవడం,నడుస్తూనే వుండడం. అది నీళ్ళు, వంటచెరకు, పశుగ్రాసం, చదువు, ఆరోగ్యం, పని అన్నిటికీ వాళ్ళు నడుస్తూనే వుంటారు. కరోనా కాలంలో ఆ నడక భరోసాతోనే వాళ్ళు తిరిగి తమ ఊళ్ళకి నడిచారు, కారణం అభివృద్ది వాళ్ళకి ఇచ్చింది నడవ గలిగే మొండిధైర్యం ,ఆత్మ స్ధైర్యం తప్ప ఇంకేమీకాదు. ప్రకృతిని, భూమిని వనరులను అందించే ముడిసరుకుగా చూడడం రివాజుగా మారింది, దీనివల్ల వీట్ని సమిష్టిగా చూసే చూపుని కోల్పోయాం. ఇలా విడిగా చూడడం వల్ల  వాట్ని జీవ రాశిగా గురించడం లేదు. ఈ సామాజిక దృక్కోణం కన్జూమరిజం,క్యాపిటలిజం లక్షణం, ఈ లక్షణం వల్ల భూమిపైన, లోన వున్న వనరులుని తొలిచి,తొలిచి మరీ భూమినివివస్త్రని చేస్తున్నాం. ఇదే దృష్టి సాటి మనుషుల పైనా చూపుతాం.ముఖ్యంగా దళితులూ, గిరిజనులు, స్త్రీల పైనా. ఈ దృక్పధం వల్ల కుటుంభానికి, పిల్లలకి, అసలు మనకంటూ కూడా సమయం కేటాయించలేని స్దితిలోని వాళ్ళం ఇక ప్రకృతికి ,భూమికి సమయం ఏమి కేటాయిస్తాం, ఇది మనం కోరి తెచ్చుకున్న అభివృద్ధి. ఈ అభివృద్ధి పంధాలో  ప్రకృతి జీవన సమయం దోచుకోవడమే కొందరి మానవుల  అభివృద్ధి  అసంఖ్యాక మంది తమ వనరులు, యాస, బాష, కూడు, గూడు, గుడ్డ తో బాటు ఉనికిని జాడను సైతం కోల్పోతారు.

ప్రకృతిలో అవసరాలకు కావల్సినంత వుంది, అత్యాశకు కాదు అని మహాత్మా గాంధీ అన్నారు, కానీ అవసరం ,అత్యాశ మధ్యనున్న నిడివి కుంచిoచుకుపోయింది. అది ఎలా అంటే ఆర్ధిక శాస్త్రవేత్తల సిద్ధాంతం ప్రకారం ‘ధ ట్రాజిడి ఆఫ్ కామన్స్’. ఒక ఊర్లో నల్గురు కలిసి ఊర్లోని చెరువులో చేపలు పట్టుకోడానికి వెళతారు. అందులో 12  చేపలు వుంటాయి. ఒకే సారి 3 చేపలు పట్టుకుంటే ఇక మిగిలేది అంటూ ఏమీలేవు.అదే రోజుకి ప్రతి ఒక్కరు ఒకటి చప్పున పట్టుకుంటే చేపలు మిగిలి వాటి సంతతి పెరుగుతుంది, వాళ్ళకి చేపలు దొరుకుతాయి. అసలు ఈ ఉమ్మడి వనరులు వాట్ని ఉమ్మడిగా వాడే గుణం పోయింది. ఈ సిద్ధాంతాన్ని 1833 లో విలియం ఫోస్టర్ లాయిడ్ అనే ఆయన పశువుల గ్రాసానికి పచ్చిక మైదానాలు కొరత ఏర్పడుతున్నప్పుడు ప్రస్తావించాడు. పచ్చిక మైదానాల కొరత కృతిమంగా ఎంక్లోజర్స్ వల్ల ఏర్పడింది. అంటే ఒకరి అవసరం కంటే మరొకరి అత్యాశే బలమైనది. అది అనాదిగా కొనసాగుతూనే వుoది. అలా కొనసాగించడానికి పాలన వ్యవస్ధ, దానిని ప్రోద్భలించే సిద్దాంతాలు దోహదపడుతాయి. ప్రజాస్వాయం అందుకు అతీతం కాదు, కారణం దీన్ని నడిపే యంత్రాంగం విడివిడి భాగాలుగా పనిచేస్తుంది తప్ప సమిష్టిగా  కాదు. అందుకే మనకిప్పుడు కావాల్సింది బ్యూరోక్రాట్స్ కాదు బయోక్రాట్స్ కావాలి. ఎందుకంటే బ్యూరోక్రసిలో పాలన అంతా చట్టాల కాటాలో బేరీజు అయ్యి పాలన కొనసాగుతుంది. అందులో కోకొల్లల శాఖల మధ్యన సమన్వయం కొరవడుతుంది. అదే బయోక్రసి లో వైవిధ్య భరితమైన జీవన వ్యవస్ధలోని అంతర్లీన అల్లికల మధ్యన పొంతన కొనసాగుతుంది ,అది స్వయం పాలనకు దోహదపడుతుంది.  అభివృద్ధి  కొందరిదే కాదు అందరిదీ ,సమస్త జీవరాశిదీ అన్న సూక్తి అర్ధం అయినప్పుడే ప్రకృతిలో సమతుల్యత ఏర్పడుతుంది .

బ్లాక్ అండ్ గ్రీన్

నలుపు రంగు గురించి 1949 లో మేరీ చర్చ్ తెరేల్ అనే ఆఫ్రికన్ కార్యకర్త వాషింగ్టన్ పోస్ట్  పత్రిక సంపాదకుడికి రాసిన లేఖలో అంది ...‘ఫ్రెంచ్, జర్మన్,డచ్, జాపనీస్ అందర్నీ క్యాపిటల్ అక్షరంతో సంబోధిస్తూ  రాస్తూ ,అదే నోవా రెండవ కొడుకు హ్యాం సంతానమైన  మమ్మల్ని  స్మాల్ ‘ఎన్’ తో మొదలెట్టి నీగ్రోలు అని సంభోదించడం బావ్యం కాదు, మమ్మల్ని నీగ్రో అని సంభోదించడం మానండి. ఈ ప్రపంచంలో 57 ఛాయలతో   కలిసి  వున్న ఏకైక  జాతి మాది. అందుకే మేము నిజమైన రంగు మనుషులం.

సోజౌర్నర్ ట్రుథ్ మొదటి ఆఫ్రో-అమెరికన్ స్త్రీల హక్కులు, భానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహిళ.ఆమెను తొమ్మిది సంవత్సరాల వయస్సులో తన తల్లితండ్రుల దగ్గరనుండి లాగేసుకుని బానిసగా విక్రయించారు. 1810-1826 వరకు న్యూయార్క్ స్టేట్ లో బానిసగా పనిచేసింది.1827 లో అక్కడి నుండి పారిపోయి ఉద్యమకారిణి గా పనిచేసింది.1867లో ఆమె కన్వెన్షన్ ఆఫ్ థ అమెరికన్ ఈక్వల్ రైట్స్ అసోసియేషన్ లో ప్రసంగిస్తూ అన్న మాటల్లో కొన్ని... ‘స్నేహితులారా ,నేను వేరే క్షేత్రం నుండి వచ్చాను. ఆ క్షేత్రం గురించి మీరు ఏమి ఆలోచిస్తారో నాకు తెలియదు. కొందరికి  స్వేఛ్చ పుష్కలంగా వుంది. బానిసత్వాన్ని కొంత వరకు నిషేధిoచారు, సంతోషం, కాని దాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాలి.అప్పుడే మనందరం స్వేచ్చగా వుంటాం. నేను ఒక పురరుషుడు శ్రమించి నంత  నేను శ్రమించాను , అది చెప్పాలంటే నాకు ఒక పురుషుడికి వున్న హక్కులు వుండాలి’.

నేను స్త్రీని కాదా?

సోజౌర్నర్ ట్రుథ్

అక్కడున్న మగాడు అంటాడు

మహిళకు సహాయం కోసం బళ్ళు కావాలి

కాలువల నుండి వారిని పైకి లాగాలి

ఇంకా వారికి అన్నిచోట్ల మంచి స్ధానం కావాలి

బండ్లు ఎక్కడానికి ఎవరూ నాకు సహాయం చేయలేదు

ఇంకా బురద గుంటల నుండి పైకి లాగను లేదు

మంచి స్ధానము ఇవ్వలేదు...

నేను స్త్రీని కాదా?

నన్ను చూడు

నా కండలు చూడు!

నేను దుక్కిదున్ని, నాట్లు వేశాను

కట్టెలు పోగుచేసి కంచెలు కట్టాను

ఏ మగాడూ నాకు దిక్సూచిగా నడవలేదు

నేను స్త్రీని కాదా?

నేను సరిసమానంగా పనిచేయగలను

నాకు లభి౦చినప్పుడు-

ఒక మగాడు తిన్నంత తినగలను-

కొరడా దెబ్బలూ ఓర్చుకోగలను

ఇలా, నేను స్త్రీని కాదా?

నేను పదమూడు  మంది పిల్లల్ని కన్నాను

అందులో చాల మందిని బానిసలుగా అమ్మేసారు

అప్పుడు పేగు తెగేలా  ఏడ్చాను

అప్పుడు ఏసు తప్ప  ఎవరూ వినలేదు

ఇలా, నేను స్త్రీని కాదా?

అక్కుడున్న పల్చటి నల్లటి మగాడు  అంటాడు

మగాళ్ళకి  వున్న హక్కులు స్త్రీలకూ వుండకూడదని

ఎందుకంటే క్రీస్తు స్త్రీ కాదని

మీ ఏసు ఎక్కడ నుండి వచ్చాడు?

దేవుడినుంచా ,స్త్రీ నుంచా!

మగాడికి అతనితో ఏమీ సంబంధం లేదు!

ఒకవేళ దేవుడే మొదటిగా స్త్రీని సృష్టించి వుంటే

ఒంటరిగా ప్రపంచాన్నితలకిందిలు చేసే

శక్తి సామర్ధ్యాలు ఆమెకుండేవి

స్త్రీలందరూ కలిసి

ప్రపంచాన్నిమళ్ళీ సరిగా నిలబెట్టనూ గలరు

(అనుసృజన-జి. సత్య శ్రీనివాస్)

  పై కవిత ద్వారా స్పష్టంగా తెలిసేది మనం మనతో వున్న స్త్రీని అర్ధం చేస్కోడానికి సమయం ఇవ్వక  పోగా  వాళ్ళ సమయాన్ని దోచుకున్నాం. అదే విధంగా ప్రకృతిని కూడా.  అసలు సమయమివ్వడం అంటే ప్రకృతిలో మనం, మనలో ప్రకృతి మిళితమవ్వడం.  ఒకరి చూపుతో మరొకరు వార్ని వారు అర్ధం చేస్కుంటూ , ప్రకృతి అవ్వడం. అది తెలిసినప్పుడు ప్రకృతి పరిరక్షణ కోసం కేవలం పర్యావరణ దినమప్పుడే చెట్లు నాటి మర్చిపోవడం కాక, చెట్లు జీవరాసులకు ఆసరాగా ,భూమికి కవచంగా, కవులకు,సాహిత్య కారుల సృజనాత్మకతకు ప్రేరణ అన్న బోధి చెట్టు వాక్కు భోధపడుతుంది. 1977లో పర్యావరణ దినోత్సవం నాడు  చెట్లు నాటే కార్యక్రమాని నోబెల్ విజేత కెన్యాకు చెందిన వంగారి మాత్తాయి ఏడుగురు మహిళలతో కలిసి తన పెరట్లో సాదాసీదాగా ఒక ఏడు చెట్లు నాటింది. అది గ్రీన్ బెల్ట్ ఉద్యమంగా మారి 2005  నాటికి 30 లక్షల చెట్లు నాటారు.  చెట్లు నాటుతూ పోతాం కాని దానికి మూలమైన వంగారి మత్తాయి ని మాత్రం స్మరించం. ఆమె ఆలోచన ఆమెకే పరిమితం చేస్కోక దానిని అందరిదిగా మల్చి  సమిష్టిగా పూనుకుంది. ఇవే పలుకులు పై కవితలోని చివరి పంక్తులు చెబుతాయి. ఆ పలుకులే  వాస్తమైనపుడు మన కవితలు కాగితాల మీద కాదు, చెట్లకు ఆకుల్లా, పక్షుల పాటల్లా సదా వుంటాయి. వంగారి అంటుంది  ‘మనం చెట్లు నాటినప్పుడు, శాంతి, ఆశల విత్తనాల్ని నాటుతాం.అంతే కాక మన పిల్లలకు భద్రమైన పచ్చటి భవిష్యత్తు కల్పిస్తాం!.’

ఆది నిజమవ్వాలంటే కుంకుమ సూర్యుడిని , నారింజ పండు లాంటి  సెంద్రుడిని నలుపు రంగులోని ఆకాశంలో  చూడాలి. అప్పుడే ప్రకృతి   వైవిధ్యం మనకు బోధపడుతుంది.అప్పడు  ఆ నలుపు రంగుని కాటుకలా కనురెప్పలకి అద్దిన చూపుడు వేలుకంటుకున్న పుప్పొడిని బుగ్గ మీద పెట్టుకుంటే దిష్టి సుక్కవుతుంది. అదే సుక్క ప్రకృతి ఉయ్యాలలోని  బోసినవ్వుల పసిపిల్లల బుగ్గలపై సదా వుండాలన్నది పచ్చని కోరిక.

 నేల, ఆత్మ, సమాజం

పర్యావరణ సంరక్షణలో చెట్ల సంరక్షణ కీలక మైనదిగా గుర్తించడం అయ్యింది. ఈ విషయంలో మూడు ప్రధాన అంశాలు వుంటాయి,1. చెట్లను(అడవులను ) నరకకుండా అడ్డుకోవడం 2. చెట్లను  నాటి ,సంరక్షించడం,3. అడవుల సంరక్షణ. మొదటి విషయాన్ని చూస్తే మన దేశంలో మూడు ఉద్యమాలు దీనికి సంబ౦ధించినవి వున్నాయి.  300  సంవత్సరాల క్రితం రాజస్థాన్ లోని బైశనవి ప్రాంతంలోని ఉద్యమం. 1972 లో ఉత్తరాఖండ్ లోని చిప్కో ఉద్యమం.కర్నాటకలోని అపికో ఉద్యమం, మొదటి రెండు ఉద్యమాలకి సారధ్యం వహించింది మహిళలే! చిప్కో ఉద్యమంలో ముఖ్య భూమికురాలు  చాము౦డేయి  ఉద్యమానికి గల కారణం చెబుతూ అన్న మాటలు, ‘నేను ఇక్కడికి  నాకు 17 సంవత్సరాలప్పుడు వచ్చాను. అప్పుడు అడవులు దట్టంగా, వివిధ రకాల జాతుల చెట్లతో బాగా ఉండేవి.  ఈ అడవినంతటిని గుజ్రాల్ మైనింగ్ కంపెని నాశనం చేసింది. మాకు నీళ్ళు లభిoచే సెలయేర్లు ఎండిపోయాయి, మైనింగ్ మా అడవుల్ని, సెలయేర్లను, మా జీవనాధారాలను నాశనం చేసింది. అందుకే మేము మా జీవితాన్ని అడ్డుపెట్టి ,మా అడవుల్ని, నదులను కాపాడుకుంటాం.’   ఈ మాటలు కేవలం తనవేకావు, ఆమె సహచరి ఇట్వారి ఇంకా అనేక మంది మహిళలవి కూడా.

అంటే మనం అంటి పెట్టుకున్న నేల మనలో అంతర్లీనంగా అల్లుకుపోతుంది. అది ఎలా అంటే  మా బాల్కనీ లో కూర్చుని ఓ పది అడుగుల దూరంలో  వర్షం పడుతున్నప్పుడు పూలతో నిండి వున్న తురాయి చెట్టుని చూస్తూ వుంటాను. ఓ నల్లటి పిట్ట చెట్టు కొమ్మల మీద కూర్చుని వుంటుంది. అది ఎక్కువ సేపు కూర్చోదు, మళ్ళీ ఏదో మర్చి పోయినట్టు ఏటో వెళ్ళి, ముక్కున కర్చుకుని వచ్చిన దాన్ని ,చెట్టుకు కట్టిన ఓ చిన్న గొట్టం లో తను అల్లుకున్న గూట్లో అమర్చుతుంది. ఇవన్నీ చూస్తున్న నా చూపుకి  ఇదే సమయం, స్ధలం. వర్షం ఆగిన తర్వాత  వెళ్ళి చెట్టుకింద వున్న బండ రాయి మీద కూర్చుంటా , చెట్టు కొమ్మ పైన అదే పిట్ట , అదే మాదిరి తన పనిలో తను నిమగ్నమై. చెట్టు పై నుండి  పూల రేఖలు రాలుతుంటాయి, వాటి తో బాటు వర్షపు చుక్కలు, ఇప్పుడు  నా చూపు, ఆలోచనలు  ఎర్రటి రేఖల తడి నల్లటి నేల సమయ స్ధలంలో  కలిసిపోతునట్టుగా ... . చెట్టు,నేల  మటుకు అలా అల్లుకునే వుంటాయి. కొద్ది సేపైన తర్వాత గూటి లోకి పక్షి వెళ్ళిపోతుంది . నేను నా గూటిలోకి. ఇప్పుడు ఇద్దరం ఎవరి గూటిలో వాళ్ళు. ఆ నేలకంటుకున్న చెట్టుని, చెట్టుకల్లుకున్న నేలని  ఇద్దరి గూళ్లలోని కాలానికి తీసుకుపోతాం. అప్పుడు పచ్చటి స్పృహధూపం గూళ్ళల్లో  పరుచుకుంటాయి.కాలంలోని ఋతువుల్లా. ఒకే ఋతువులో కొద్ది సమయం మాత్రమే, నేను గడిపింది. కాని ధూపం మాత్రం ఎప్పటికీ వుండిపోతుంది.

చెట్టు ఎన్నో జీవరాసులకు జీవనార్దాన్ని ఇస్తు౦ది, నేలకు కవచంలా వుంటుంది, కవిత్వానికి ప్రేరణ కూడా ఇస్తుంది.

మరి కొన్ని వందల  చెట్లు, అట్లాంటి వివిధ రకాల  వందల చెట్ల సముదాయమైన అడవి ఇచ్చే ప్రేరణ ఎంత సృజనాత్మకంగా వుంటుంది.  ‘Time is inner and outer space within us, unless we don’t make it a living, we are equalent to dead’. నేడు  మనం  కోల్పుతున్నది ఈ టైం అండ్ స్పేస్ ని.

ఆధునికతకు  ప్రేరణ ఇచ్చిన the age of enlightenment  వల్ల ఏర్పడిన పురోగతికి  ఆధునిక శాస్త్రీయ చూపు, ఆర్ధిక అభివృద్ధి లో  ‘టైం ‘ లో కామన్ గుడ్  అన్న అర్ధం మారి పోయింది.

 

చాము౦డేయి, చిప్కో ఉద్యమ నాయకురాలు మాటల్లో  ఈ  విషయం చెప్పడానికే ఉద్యమం మొదలయ్యింది. చెట్లని కౌగలించుకోవడం  అంటే మనమున్న నేలను అంటి పెట్టుకున్న చెట్ల కాలంలో మనము కలిసి పోవడం. ఇది అర్ధం కానివారికి అది కేవలం ఒక ఆలింగనం  గానే కనిపిస్తుంది. పది మంది స్త్రీలు చెట్లను కౌగలించుకుని సమిష్టి ప్రకృతి రూపమై జీవన సమరానికి యుద్ధ ధ౦కా మోగించే  దృశ్యం అది. అది సృజనాత్మక చూపులకు తాకుతు౦ది.

చినువ అచేబే మాటల్లో ‘స్త్రీలు, పురుషులు ,పిల్లలు, ఎలా జీవించాలో చూపిస్తున్నారు, ఇక్కడ   జీవితంలో  ఆనందం ఇంకా మరణించలేదు. ఇతర దేశాలకు ఎలా జీవించాలో చెప్పే వాళ్ళను ఇక్కడికి వచ్చి చూడమనండి.’

అవును  జీవితంలోని ఆనందం ,ఆ ఆనందం కోసం చేసే జీవన పోరాటం అన్నది వాళ్ళ ద్వారానే నేర్చుకోవాలి .  ఇది వాస్తవం...

 

సిన్స్యారు ఖాలలో

వాస్తవం కోసం ఓ పోరాటం మొదలయ్యింది

మాల్కొట్  తానాలో

హక్కుల కోసం పోరాటం

మన కొండలు, అడవుల కోసం

అవి మనకు జీవాన్ని ఇస్తాయి

చెల్లి, ఇది సంరక్షణ కోసం పోరాటం

జీవాన్ని ఇచ్చే  చెట్లను కౌగలించుకుందాం

ఇక నదుల్ని మన గుండెలకి

కొండల్ని ఖననం చేసే గనుల్ని ఆపుదాం

అవి మన అడవుల్ని,వాగుల్ని చంపేస్తాయి

సిన్స్యారు ఖాలాలో

జీవితం కోసం పోరాటం మొదలయ్యింది

-ఘనశ్యాం 'షాలని'

-అనుసృజన జి.సత్యశ్రీనివాస్

 

పోరాటం అన్నది కేవలం అడవుల నరికివేతను ఆపడం లోనే కాదు, చెట్లను నాటి సంరక్షించడంలో ,అడవుల సంరక్షణలో వివిధ రీతుల్లో వుంటుంది. చెట్లను నాటడం అంటే  ఏదో మొక్కులు తెచ్చి. గోతులు తవ్వి ,నాటి వెళ్ళి పోవడం కాదు. అవి నిలదొక్కుకునే వయస్సు వచ్చే వరకు వాట్ని పోషించి, సంరక్షించాలి. అంతక౦టే ముఖ్య విషయం చెట్లు అందరివి అన్నప్పుడు వాట్ని సంరక్షించేందుకు అందరూ ముందుకు రారు. ఎవరో కొందరే వస్తారు. ఇది కూడా ట్రాజడి ఆఫ్ కామన్స్ లో ఒక భాగం. ఒక పేద రాసి పెద్దమ్మ కధ...

ఒక వూళ్ళో ఒక పేదరాసి పెద్దమ్మ వుండేది. ఆమెకి ఒక మనవడు వుంటాడు. ఆమె  తన ఇంటి దగ్గర వున్న ఖాళీ ప్రదేశంలో  మూడు చెట్లు నాటుతుంది, వాటికి రోజూ నీళ్ళు పోసి ,సంరక్షిన్తుంది.  వీటిని అస్సలు పట్టించుకోని మనవడు ఒక రోజు ఆమె చెట్లకి  నీళ్ళు పోస్తుంటే  ఆమెని అడుగుతాడు. ముసలిదానా  రోజు ఈ చెట్లకు నీళ్ళు పోస్తావు, ఈ స్ధలం కూడా మనది కాదు, ఈ చెట్లు ఎవరివి, ఎందుకు నీళ్ళు పోసి  వీట్ని పెంచి, కాపాడుతావు?. అందుకు పెద్దమ్మ అన్నది, ఈ మొదటి చెట్టు నాది, అని ఇంకా చెప్పేలోపే  మనవడు అంటాడు, పోయేదానివి నీకెందుకు? నేను పోయినా చెట్టు  ఫలాల్ని నువ్వు , ఇంకా అందరు తింటారు కదా! సరే కాని నేను మాత్రం పండ్లు ఎవ్వరికీ ఇవ్వను. మరి రెండోది ఎవరిదీ?. అది నీది, ఆహా! చాల మంచి పని చేసావు, దీనికి బాగా నీళ్ళు పోసి ,కాపాడు. ఇక మూడోది, అదా,అది అందరిది. మరి అందరిది అయితే నువ్వెందుకు నీళ్ళు పోసి ,పెంచుతున్నావు?. అది అందరిది కాబట్టి ఎవ్వరు దాన్ని పట్టించుకోరు, అందుకే నేనే దానికి నీళ్ళు పోసి , పెంచుతున్నాను అంది.

నేడు చెట్లు నాటడంలో లోపించినది అందరిది అన్న భావన. దురదృష్టవశాత్తు  మన సమాజంలో పేదరాసి పెద్దమ్మలు లేరు. అసలు చెట్లు నాటే ముందు  చెట్లకి అనువైన నేల, వాతావరణం, పోషకులు, కావలి, అసలు స్దలం వుందా అన్నవి పట్టించుకోవడం లేదు. హరితహారం కార్యక్రమం ముందు నేడు ప్రభుత్వాలు చూసేది, వెతికేది, చెట్లు నాటడానికి కావలసిన స్ధలం. అదే కరువయ్యింది. చెట్లు అన్నవి వాతావరణ మార్పుని నియంత్రిస్తాయి , కాని మానవ నైజం ని కాదు కదా. ఈ నైజం అర్ధం అయినప్పుడు చెట్లను ,అడవులను, ప్రకృతిని కాపాడే  సామాజిక కవచాలు ఏర్పడుతాయి. ఆ ప్రయత్నమే వంగారి మాతాయి చేసింది.

 

“It’s the little things citizens do. That’s what will make the difference. My little thing is planting trees.” — Wangari Maathai. ఈ నిజమైన నలుపురంగు బిడ్డ వంగారి మతాయి శాంతి, ప్రజాస్వామ్యం, పర్యావరణం గురించి మనసా,వాచా, కర్మేణ జీవించిన తపస్వి.

కరోలిని న్దిరిటు- బెంజమిన్, హెచ్ ఎస్ సి

ఒక శక్తిశాలి స్త్రీ, మన చేతులు వదిలి వెళ్ళిపోయింది

కాని ఆమె ఆశలు ఎన్నో నెలల్లో ముఖచిత్రాలై అల్లుకున్నాయి

బిన్న దారిలో ఆమె  తన దిక్చూచిని అమర్చింది, దానికి వెనుకంజ వేయలేదు

మనం ఆమెని మార్గదర్శిని అంటాం

ఎందరో  యపడుతూ వణికే  మార్గంలో ఆమె నడిచించింది

మనం ఆమెని సైనికురాలు అంటాం

ఆమె నమ్మిన దాని  కోసం  ధైర్యంగా ,పట్టుదలతో పోరాడింది

మనం ఆమెని విజేత అంటాం

మనం ఆమెని నాయిక అంటాం, ఆమె నాయకురాలు

అలా వంగారి మాతాయి వుంటుంది

ఎందరొ చూడడడానికి భయపడే ఎత్తుల పైన ఆమె చూపు వుంటుంది

ఎందరికో అంతుపట్టని మార్గాలని ఆమె మలిచింది

ఆమె ఒక నిర్ణయం తీసుకుంది

తన కోరికను పరిమితం చేస్కోవద్దని

మోకాళ్ళ మీద కూర్చుని ఆమె

ఏ మాత్రం సిగ్గు,బిడియం లేకుండా

మన చెట్ల జీవితం కోసం వేడుకుంది

ఆమె సంరక్షణ గురించి భోదించింది

నమ్మిన దాని కోసం కట్టుబడింది

ఆమె పట్టుదల వీడలేదు

కరురాకు* అప్రమత్తమైన కాపరి దొరికాడు

ఉహురు వనం ఎప్పటికీ కబళించబడలేదు

భూమికి శుశ్రూష చేయాలన్న

లోతైన వంగారి శ్రద్ధ

అనంతమైన ఆమె  భక్తి వెలుగు కిరణాలు

మనందరిలో నిజమైన తలంపవ్వాలి

మన ఉనికి కోసం కొత్త కోణాల్నిఆహ్వానిద్దాం

ఇక నువ్వు విశ్రమించు అమ్మ, శాంతిగా విశ్రమించు

నీ చెట్లల్లో ప్రశాంతంగా విశ్రమించు

మా చూపుల నుండి నువ్వు  నిష్క్రమించి ఉండచ్చు

కాని నీ శ్రద్ధ పరిమళాలు తచ్చాడుతూనే వుంటాయి

ఇప్పుడు నీ కళ్ళు మూసుకుని వున్నాయి

కాని,నువ్వు చెప్పిన  వాటన్నిటి కోసం  మా కళ్ళని మాత్రం తెరిచే వుంచుతాము,

ఈ భూమి ఎక్కడైనా గాయపడినప్పుడు, నీ గొంతు పలుకుతుంది

మమల్ని చెట్లు నాటమని, నాటమని, నాటమని,కొత్త చిరుగ్లు తొడగమని

కొన్ని లక్షల చెట్ల వేర్లు, కొమ్మలు స్వేచ్చగా ఎదగనివ్వమని

రాబోయే తరాలకు,పిల్లలకు వాస్తవంగా అందించమని

మనం ఆమెని

మార్గదర్శిని అంటాం

స్వేచ్చ సంరక్షకురాలు

జ్ఞాన వసంత

హేతుబద్ధత వాక్కు

కిటేన్గే* ఫ్యాషన్ చిహ్నం

కెన్యా ప్రియ హృదయం, పచ్చదనం రాణి

వంగారిని మననం చేస్కోవడం

అందిన వాటిని కర్చుకుని,నిప్పుని కూడా ఆర్పేందుకు ప్రయత్నించే 

బుజ్జి ముక్కు హామింగ్ పక్షి అని తరచు అంటారు

అలా తలచుకోవడం...

అవిరైపోతున్న భూమిని రక్షించడానికి

మనం కూడా ,మన వంతు మన శక్తిసామర్ధ్యాలకు తగ్గట్టు చేయాలి

అలా వంగారిని మననం చేస్కోవాలి...

అదీ మననం అంటే

మనం ఇష్టంగా అంటిపెట్టుకున్న వాట్ని సంరక్షించడానికి

మనం మన భయాన్ని వదిలేయాలి!

అలా వంగారి ని మననం చేస్కోవాలి...

అది మననం అంటే

చెట్లని నాటడం అంటే

శాంతిని నాటడం

ఆమె ఆత్మ శాంతిoచు గాక!

( అనుసృజన-జి.సత్య శ్రీనివాస్)

*- కరుర- కెన్యా రాజధాని నైరోబిలోని అడవి. జపనిస్లో కరోర అంటే  పక్షి తల వున్నమానవ రూపం తో వుండే  దైవ అంశం

*-ఆఫ్రీకన్ దుస్తులు

మనం ఇష్టంగా అంటిపెట్టుకున్న వాట్ని సంరక్షించడానికి ,అవును మనం చెట్లను ఇష్టంగా నాటాలి,

అప్పుడు... ఈ భూమి ఎక్కడైనా గాయపడినప్పుడు, నీ గొంతు పలుకుతుంది... అంత కంటే గొప్ప కవిత్వం వుండదు....   అప్పుడు కవిత్వం మన అంతర్లీన, బాహ్య స్పేస్ ని కలిపే ఇన్ఫినిట్ టైం అవుతుంది. అది లివింగ్ పొయట్రీ అని ఎకో ఫెనిజం చెప్పే  బోధన... అలా , ఆమె ఆశలు ఎన్నో నెలల్లో ముఖచిత్రాలై అల్లుకున్నాయి...