Friday, 17 August 2012 1 comments By: satyasrinivasg

అమ్మ ఓ పచ్చని పాట


అమ్మ పిల్లల్ని గుడ్డ ఉయ్యాల్లో జోల పాటలు పాడి పడుకో పెట్టేది. కొడుకులు,కూతుర్లనే కాక మనవళ్ళు,మనవరాళ్ళు, వరకూ పాటలు వింటూ పడుకోవడం  అలవాటైయింది. అందులో నాకు బాగా ఇష్టమైన పాట.
ఏడవాకు లకుమార
ఏడవాకురా తండ్రి
ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకొనువారు
కొండవాగు గట్ల కింద
కోనేటి నడుమ
సీతమ్మ కట్టింది చిరు పర్ణశాల...
నీటి కట్టలు కట్టి నీటినినిల్వచెయమని చెప్పె వాటర్ షెడ్ కార్యక్రమ పనులని అన్నమయ్య మాటల్లో వింటూ పడుకోవడం.ఎదుగుతున్న క్రమంలో అవినరాల్లో ఇంకిపోయాయి.
చదువు పూర్తి అయిన తర్వాత నే పనిచేసేరంగంలో పర్యావరణ పరిరక్షణలో భాగమైన పనులన్నీ ఏదో ఒక జోల పాటలో వున్నాయని నెమరేసుకోవడం పరిపాటైంది. ఇది మిత్రులతో చర్చించడం కూడా!మిత్రులు సౌమిత్రి(వాళ్ళ అమ్మకి కూడా పాటలు పాడే అలవాటుంది),విజయ్ కుమార్ తో ఎక్కువగా చర్చించే వాడ్ని.
అమ్మకి  పూజలు చెయ్యడంతో బాటు పురాణాలు చదివి వినిపించడం దినచర్య.
కులాలకి అతీతంగా ఆమె స్నేహాలుండేవి. వీళ్ళు ఆమె చేత పురాణాలు  వినిపించుకునేవారు. మా చిన్నప్పుడు రాఘవమ్మ అత్త ,ఆమె అరవయ్యో ఏటలో సక్కుభాయి అమె ప్రియ మిత్రురాలు. ఆమెకి అమ్మ చెప్పే పురాణం రోజూ వినడం అలవాటు. మేం మా  పనుల్లో వుంట్న్నా అవి చెవుల్లో సోకేవి.చిన్నప్పుడు మాకు బాల రామాయణం, భారతం,బొమ్మల పుస్తకాలు కొనిచ్చేది.వాటి వల్ల నాకు కామిక్స్ చదవడం అలవాటైయింది. 

అమ్మ  గ్రామ దేవతలనుండి అన్ని దేవుళ్ళని పూజించేది.వాళ్ళకి సంబంధించిన ఆరాధకులతో పరిచయం వుందేది.మా ఇంట్లో వీళ్ళందరూ తిష్టవేసిన రోజుల్లున్నాయి.
అప్పుడు నాకు అర్ధం కాలేదు.అడవుల్లో,గ్రామాల్లో తిరుగుతూ వనరుల సంరక్షణలో పనిచేస్తున్నపుడు నా కంటి అజ్ఞాన పొరలు తొలిగిపోయాయి.చెరువు కట్ట మీద మైసమ్మ, అడవిలోని పోతరాజు(వెదురుపొద),పాడేరు లోని డి. గొందురులోని పాండవుల గుడీ అమ్మ ఇచ్చిన బొమ్మల పుస్తకాలుగా అగుపించాయి.
వీటి వల్ల సోషల్, పొలిటికల్, హిస్టారికల్, ఇకాలజీ పైన శ్రద్ధ పెరగడానికి బీజం.     వీటి గురించి చింతా శ్రీనివాస్,టి.శివాజి,మధుకర్లతో రోజుల తరబడి చర్చించేవాడ్ని వనరుల ఉనికి,ఆవరణ,సమాజాల మీద దృక్పధం విస్తృతి అయ్యింది. అందుకే నేమో నాకు అడవులు, గిరిజనుల మీద ఒక వాత్సల్యం పుట్టింది.ఇదే ముఖ్య దారిగా మారింది.ప్రతి అడవిలో భీముడి పాదం,పాండవుల ఉనికిని స్థానికులు చెబుతున్నప్పుడు వాట్ని చూస్తే భక్తి భావం కంటే విశ్లేషాణ్మతక పరిశీలన మొదలైయ్యింది.అదే విధంగా గుళ్ళను స్ధల పురాణం దృష్ట్యా చూడడం. గ్రామ చరిత్రలను సర్ మన్రో "కైఫియత్" పేరుతో డాక్యుమెంట్ చేశాడు.కైఫియత్ అంటే మనసులోని మాట. "అమ్మ జోల పాటలని నెమరేసుకుంటునప్పుడు చైనీస్  సామెత జ్ఞాపకం వస్తుంది పక్షులు సమాధానులు వున్నాయి అని పాటలు పాడవు, పాటలు వున్నాయి అని పాటలు పాడుతాయి." అమ్మ చెట్టూ,పుట్టా, గుట్టా, వాగు వంకా వాటి చుట్టూ వున్న జనాల గురించి ప్రశ్నలకు సమాధానాలుగా కాక జోల పాటతోనే చెప్పింది. అందుకే ఇంటి కైఫియత్ లో మొక్కలు లేకుండా ఉహించలేం. 
అమ్మకి ఇష్టమైన పుస్తకాల్ని భద్రంగా దాచేది. ఆమె చిన్నపుడు రాసుకున్న "సంగీతం" పుస్తకం ఇప్పటికీ చెల్లెలు అరుణా భిక్షు దగ్గర వుంది. సంగీతం మాఇంటిల్లిపాదికీ అలవాటైయింది.పెద్దన్నయ్య (జి.వి. రాం) కి  వీణ వచ్చు.బావగారు యన్.జె.భిక్షుకి సంగీతంలొ మంచి ప్రవీణ్యం వుంది.పెద్ద వదిన వేణికి సంగీతం ఇష్టం, చిన్నవదిన (ప్రభ)కి సితార్ వచ్చు,  ఇలా  అందరూ సంగీత ప్రియులే. మనవలు .మనవరాళ్ళు సైతం. 
సమాచారాన్ని సంగీతంగా పొందుపర్చే అలవాటు మా  తల్లిదండ్రులిద్దరి వల్లా వచ్చాయి. నాన్న గుడ్లవల్లేటి రామారావు వృత్తి రీత్యా జర్నలిస్ట్. ఆయనకీ ఈ అలవాటుండేది. వాళ్ళిద్దరూ మా మొదటీ రిసెర్చ్ గైడ్లు.     వివిధ రకాల సమచారాన్ని పొందు పర్చడాన్ని మాకు ఆస్తిగా ఇచ్చారు.శోధన మా అందరి లక్షణమైయ్యింది.
 కధలని చెప్పే వారు గొప్ప డాక్యుమెంటషనిస్టులు, వాళ్ళు అంతరించిపోతున్నారు.వూళ్ళలో తిరుగుతున్నప్పుడు అలాంటి వాళ్ళు కనిపిస్తే చాలు అక్కడే కాలక్షేపాలు.పర్యావరణంలో ఫోక్ లోర్స్,ఫోక్ టేల్స్ విలువ, అభివృద్ధి పేర్న జరుగుతున్న ఆక్రమణలో అంతరించిపోతున్న 'ది స్టోరి టెల్లర్శ్ కష్టాల్ని తెలుస్కున్నాను. ఏ పరిశోధనలో నైనా వీళ్ళు కీలక సమాచారాన్ని ఇచ్చే వాళ్ళు(కీ ఇన్ ఫర్ మెంట్స్).అదే విధంగా జన సమీకరణలో, వార్ని ప్రేరేపించడంలో కధ, పాట, విలువ తెలిసింది. వాట్ని ఉపయోగించే తీరు కూడా! అభివృద్ధి కార్యక్రమాల్లో డాక్యు మెంటేషన్ ప్రాముఖ్యత,మనం చేసే ప్రతి పనిలో అంతర్లీనంగా ప్రక్రియ,పురోగతి, పర్యవేక్షణ వుండాలన్నది నేర్చుకున్నా. ఇదే పాఠం అందరికీ చెప్తున్నాను.
సమాచారానికి సంబంధించిన వృత్తిలో నా నాలుగో అన్నయ్య జి.వి ప్రసాద్ వెళ్ళాడు. వాడూ జర్నలిస్టే.(ఇప్పుడు లేడు).ఎవరికి ఇష్టమొచ్చిన చదువు వాళ్ళని చదుకోమన్న స్వేచ్ఛ ఇచ్చారు.ఇప్పటికీ ఇదే కొనసాగుతోంది. ఇద్దరు అన్నయ్యలు  అర్త్ సైంటిస్టులయ్యారు . అదే విధంగా వృత్తుల్నికూడా ఎంచుకున్నాం. ఆసక్తికరమైన విషయం పరోక్షంగా, ప్రత్యక్షంగా కలిపి ఇంట్లో ఉపాధ్యాయ వృత్తిలో ఎక్కువ శాతం మంది వున్నారు, అందులో ప్రత్యక్షంగా వున్నది మా మూడో వదిన జానకి,అరుణా, మాధవి,భిక్షు. ఇదీ  రకరకాల జోల పాట లానే వుంది. ఇల్లు వైవిధ్యమైయిన ఆవరణగా మారింది.
చదివినచదువుని ప్రత్యక్షంగా చూసినప్పుడే సమాచారం మనకి జ్ఞామిస్తుంది.దీనిని పదిమందికి ఉపయోగపడేటట్లు చేసినప్పుడు
మనకు వివేకం వస్తుంది. ఈ ప్రక్రియకు ప్రేరణ చుట్టూవున్న వాట్ని ప్రేమించే లక్షణం. ఆ లక్షణమే అమ్మ.  మన చుట్టూ వున్న వాటి గాధే పర్యావరణం.ఆకలితో వున్న వాడికి కధ ఎక్కదు అన్నది కుడా అమ్మే చెప్పింది. అమ్మకి రోజూ పదిమందికి అన్నం పెట్టే అలవాటు. వున్నది ఇద్దరు,ముగ్గురు,నలుగురమే అయినా ఇంటికి అప్పటికప్పుడు ఎవరైనా వచ్చినా వారందరికీ భోజనం వుండేది.ఒకవేళ లేకపొతే  ఏమైనా వండి పెట్టేది. అమ్మ వంటకాలు అమోఘం. వివిధ రకాల వంటకాలు చేసేది.పచ్చళ్ళు పెట్టడంలో ఆరితేరిన చెయ్యి. ఎప్పుడూ మండే కుంపటి.కావడంతో వంటిల్లు పక్కనే కరివేపాకు చెట్టు పెరట్లో వుండాల్సిందే! అందుకే మొక్కలు లేని ఇంటిని ఉహించుకోలేం.చిన్నప్పుడు చిన్నన్నయ్య,సుబ్బారావు  మా ఇంట్లో మొక్కల సంరక్షకుడు. ఇప్పటికీ మా మూడో అన్నయ్య ఉదయ్ భాస్కర్ కీ, నాకూ ఈ అలవాటు పోలేదు.నా ఇంటి నిండా మొక్కలే( ఇందులో మాధవి,ఛోటూ పాత్ర ఎక్కువ).
ఈమెకీ,వాగేష్ వాళ్ళ అమ్మమ్మకి  అన్నం పెట్టడంలో ఒకేపోలిక. వాళ్ళన్న మాటల్లో "పెట్టే గుణం చావకూడదు". కనుమరగువుతున్న గుణమిది(బహుశా రెడ్ లిస్ట్ లో పొందుపర్చవచ్చు).వాట్ని మనకందించిన వాళ్ళు అరుదైన పక్షులు.ఇప్పుడు పచ్చని భూములు కోల్పోతున్న రైతుల్ని చూస్తూంటే ఇదే గుర్తుకు వస్తుంది. వాట్ని కోల్పోకుండా పోరాడే వాళ్ళకి నా వంతు సహాయ సలహాలిస్తున్నాను.అందుకే ఉమ్మడి అటవీ యాజమాన్యంలో గిరిజనుల భూముల్ని ఫారెస్టు శాఖ వారు తీసుకున్నందుకు వ్యతిరేకంగా గొంతెత్తా,ప్రపంచ బ్యాంకు తన నియమాలు ఉల్లంఘించిందని చెప్పా! తిరిగి గిరిజనులకు నష్ట పరిహారం వచ్చేటట్లు చేశా.ఇది జె.ఫ్.యం. నెట్ వర్క్,గిరిజనుల సహకారంతో జరిగిన పోరాటం. అందరం నేల తల్లి బిడ్డలమే కదా. "పెట్టే గుణమే కాదు,అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం కుడా కావాలి" అన్నది ఆమె పరోక్షంగా చెప్పింది.
 పూజ గది , వంటిల్లు పూర్తి స్ధాయిలో ఆమె ఎక్కువ సమయం గడిపిన ప్రదేశాలు.మాధవి,నేనూ ఫీల్డ్ వర్క్ తో బయట తిరుగుతూ వుంటే యిల్లు, వంటా,ఛోటూ పనులన్నీ ఆమే యిష్టంగా చూసుకునేది.ఆమ్మకి వైద్యం కుడా తెలుసు. గృహ వైద్యం నుండి యునాని,ఆల్లోపతికూడా! అమె అనుభవంతో నేర్చుకుంది. ఇంట్లో జిందా తిలిస్మాత్ వుండాల్సిందే. ఛోటూ దగ్గుతో సతమతమవుతుంటే ,తులసి,తేనే, తమలపాకు రసాల్తో మందు ఇచ్చేది.వెంటనే దగ్గు పోయి పొచే!  ఎండాకాలంలో వడదెబ్బ తగల కుండా తర్వాణి అన్నంపెట్టేది.ఇప్పటికీ అదే ఇష్టపడతాను.

మా అమ్మ గుడ్లవల్లేటి కమలమ్మ.పచ్చని పాఠాలు నేర్పిన చల్లటి తర్వాణి కుండ!  ఆమె గాత్రం పంచమం, మంచి విణా విద్వాంసురాలు,ఆ గళం 8-8-2012న  పంచభూతాల్లో ఒకటయ్యింది.  ఆ గళం నుండి జాలువారిన పాటలు నిద్రపుచ్చేవేకావు, మేలుకొల్పేవి కూడా,అవి సదా పరివ్యాప్తి చెందాలని...

సత్య
(16-8-2012)