Thursday, 18 September 2014 By: satyasrinivasg

మట్టి గూడు- పర్యావరణ కవిత్వం

మట్టి వేర్లు- మూల వాసుల ఆలోచనలు

సమస్యలున్నాయని పక్షులు పాటలు పాడవు, పాటలున్నాయని పాడతాయి –“అన్నది చైనీస్ సామెత . ఇంద్రధనస్సు చీమల పుట్టనుండి పుడుతుందని గోండ్ల నమ్మకం.మన చుట్టూ వున్న చెట్టు,పుట్ట, వాగు వంక, పోడులో దేవుడున్నాడని పూజించం, అవి మనకు కూడు, గూడూనిస్తాయని పుజిస్తామని విశాఖ జిల్లా,అనంతగిరి  మండలం, ఒలాసి పంచాయతి లోని  నిమ్మలపాడు గిరిజనుడి మాట.
సహజంగా భూమి, ఆకాశం కలయిక రేఖని ఊహిచుంకుంటాం,ఇది భూమి పల్లంగా వుంది అనుకున్నప్పటి నుండి కొనసాగుతోంది. జీవించడానికి ఈ నేల కాక మరొక లోకం వుందని ఆశిస్తాం. అంతా భ్రమణ కాంక్ష.ఈ భ్రమణ కాంక్షని  తీర్చే ఒకానొక వ్యోమనౌక కవిత్వం. ఈ వ్యోమనౌకలో మన ప్రయాణం మన ఆవరణ చుట్టూ అల్లుకున్న మాయతీగలతోనే కొనసాగుతుంది.మొదలు ,అంతం వుండదు. ఇప్పుడు రాసిన కవిత, ఎప్పుడో  రాసినట్టుగానే అనిపిస్తుంది. ఇక పై రాసే వారు కూడా ఇదే వ్యధను రాస్తూవుంటారు.ప్రతీకల్లో మార్పు వుంటుంది, వస్తువులు అవే కావచ్చు.  కవిత ప్రకృతి లోని  మానవ సమజాన్ని అన్వేషిస్తుంది, లేక మానవ సమాజంలోని ప్రకృతిని వెతుకుతుంది.ఒక విధంగా పర్యావరణ కవిత్వం-ప్రదేశాలు, మనం,మనతో,  అంతర్గతo గా,ఇతరులతో సంభా షించుకోవడం.
నాగరికతలో చాలా వాటితో బాటు మనం మచ్చిక చేస్కున్నది అక్షరాన్ని కూడా.ఈ అక్షరం మన వాతావరణాన్ని మార్చేసింది. లిపిలేని భాషలో వుండే ప్రకృతితో మమైకత,ప్రకృతి  పై,సమాజం పై ఆధిపత్యం సాధించడానికి అక్షరం ఓ ఆయుధం కూడా. మళ్ళీ  అదే అక్షరంతో ప్రకృతిని స్మరించుకోవడం జరుగుతోంది. కవిత్వం మనం మనని ,భూమి మీదిక్కడ వున్నాం అని గుర్తుపట్టేందుకు ఒక జి.పి.యస్.మనలోని ప్రకృతి ని రాయడం , దానిని ప్రస్తావించే తీరే పర్యావరణ కవిత్వమనవచ్చు. సహజమైన ప్రకృతి నుండి ,మానవ  ప్రేరిత పర్యావరణం మార్గంగా కృత్రిమ పర్యావరణం లోకి వచ్చాం.
ఈ ప్రస్థానంలోని దశలు  ప్రకృతితో మమైకతతో జీవించడంగా చెప్పుకుంటాం. వునికి, అస్తిత్వ పోరాటాలు చాటుతాం, ప్రకృతిలో విలీనమైన వ్యధను, ప్రకృతి విధ్వంశం , సంరక్షణ గురించి పంచుకుంటాం. ఇదంతా మనలోని ,మన బయట వున్న చెట్టు,పుట్టా, నీరు,నిప్పు,గాలి,మట్టిని అర్ధం చేస్కునే ప్రక్రియ. ఈ ప్రక్రియ వ్యక్తీకరణకు  ఆవరణను మట్టి తివాచీ పై కూర్చుని ఆకాశ మార్గంలో పయనిస్తూ పక్షి కన్నుతో చూడ్డం పర్యావరణ కవిత్వం.
ముందుగా ఈ శీర్షిక మూల వాసుల అంతరంగాల తోనే మొదలెట్టాలన్న ప్రయత్నం .
మూల వాసులు పుట్టుక, చావులను  ప్రకృతి తో అన్వయించు కున్నారు. ఆఫ్రికాలోని హిమబా  అనే గిరిజన  తెగల వాళ్ళు ,బిడ్డ జన్మ తేదీని, పుట్టకతో కాదు,వాళ్ళు గర్భంలో ఏర్పడినప్పటి నుండి కాక ,తల్లి బిడ్డను కనాలనుకున్నప్పటి తేదీ నుండి లెక్కిస్తారు.ఆమె  అలా నిర్ణయించుకున్నప్పుడు , ఒంటరిగా చెట్టు కింద కూర్చుని రాబోయే బిడ్డ పాట వింటుందట.కాబోయే తండ్రికి కూడా  ఆపాట నేర్పిన తర్వాత ఇద్దరూ సంభోగంలో పాల్గొంటారట. బిడ్డ భూమ్మీదకు వచ్చేంతవరకూ ఆ పాట పాడుతూ బిడ్డను ఆహ్వానిస్తారు. ఆమె గర్భిణీ గా వున్నప్పుడు దాయీ లకి, ముసలమ్మలకు,చుట్టు పక్కల వాళ్ళకి, ఇతర గ్రామస్తులకి  ఆ పాట నేర్పిస్తుంది. బిడ్డ పుట్టినప్పుడు అందరూ కలిసి ఆ పాట తో ఆహ్వానిస్తారు. ఆ పాట తో బిడ్డ ఎదుగుతారు.
ఇదంతా ఆధునిక సమాజం దృష్ట్యా చూస్తే చాలా రొమాంటిక్  గా అన్పించొచ్చు. కాని, ఒక ఆర్గానిక్ సొసైటీలోని  ఆలోచనా స్రవంతిలో పాటని,బిడ్డని సమానంగా  చూడడం, పాఠకుడు,శ్రోత, మనలోని  రచయితవ్వడం.  ఈ ప్రక్రియ   అంతా ఒక  ధియేట్రికల్ ఫారం గా అనిపిస్తుంది.(ఇప్పుడు యూరప్ లో పోయట్రీని ధియేటర్ ఫార్మ్  లో పర్ఫాం చేస్తున్నారు)  మన సృజానత్మకతని మనదిగానే కాకుండా అందరితో పంచుకోవడం. 
సహజమైన పర్యావరణం అంటే ఇదే. సృజనాత్మకంగా జీవితాన్ని వ్యక్తపరచడం. కవితాత్మమకంగా  ఆలోచించడం, దాన్ని అన్వయించడం. నా పాటని కూడా నా తెగ పాడుతూ,పెంచడం,  జీవితంలోని నా తప్పొప్పుల్ని చూపడం. చివరి దశలో పాట నా జీవిత చిత్ర పటంలా మిగిలిపోవడం.  
నేటివ్ అమెరికన్ మాటల్లో...

 నేనొక జింకని చంపాను
నేనొక గొల్లభామని  తొక్కేశాను
అది తినే మొక్కల్ని కూడా...
నేను చేపల్ని నీటి నుండి వేరుచేసాను
ఇంకా పక్షుల్ని ఆకాశం నుండి....
నా జీవితం లో  నాకు చావు అవసరం
నా జీవితం
నే చనిపోయిన తర్వాత,జీవితాన్ని ఇవ్వాలి
నన్ను పోషించిన వాటికి
భూమి నా శరీరాన్ని తనలో ఇముడ్చుకుంటుంది
మళ్ళీ మొక్కలకిస్తుంది
గొంగళి పురుగులకి కూడ
పక్షులకి
నా తర్వాత వాళ్ళకి
ప్రతి దానికీ దాని వంతుంది
జీవిత చక్రం ఎప్పటికీ ఆగిపోకుండా...
(అనుసృజన)


మన కవిత్వం కూడ మన జీవిత అక్షరమాల . ముందు  తరాలకు మనమిచ్చే పచ్చని దస్తావీజు.

0 comments:

Post a Comment