Tuesday, 21 October 2014 0 comments By: satyasrinivasg

వేటగాళ్ళను వేటాడటం- మూల వాసుల జీవన వలయం -6



వేటగత్తె కలలు

ఇదంతా షరా మాములే
ఆమె నా కంటే ఎత్తులో  నిలబడి వుంది
అడవిని శుభ్రపరుస్తూ,
ఆమె చెంప పైనున్న  రక్తాన్ని తుడుచుకుంటూ
ఒక కుందేలుదో  లేక జింకదో,
నాకేమీ తెలియదు
కాని నా విద్రోహపు మాంసం,
బందీని చేసే వాంఛలని
పంపాను వాట్ని పసిగట్టమని-
ఆమె ఉత్త చేతుల్ని, ఉత్త చేతులుగా
భుజాల్ని, వదులుగా వున్న  జుట్టుని,
గట్టిగా, ఎత్తైన వక్షోజాలని,
బెల్టుకి వేలాడుతున్న
కత్తులకున్న చేపల్ని-రక్తాన్ని
చికిత్స చేసుకొని ఆమె గాయం.
ప్రతి రోజూ అంతే:
తెగిన కలయిక,
తిరిగి సంసిద్ధ మవుతూ:
ఆమె శరీరంలో  నే మేల్కుంటా
విరిగిన, ఓ  తుపాకిలా
(మూలం- రాబర్ట్ రాబర్ట్ సన్)
(అనుసృజన)

అడవి అనగానే గిరిజనులు జ్ఞాపకం  వస్తారు అలానే వేట కూడా జ్ఞాపకం  వస్తుంది. ఈ రెండు ప్రతీకలు అడవికి ఓ చిరునామాగా మారాయి. కాని విలాసానికి వేట చేయడం వేరు, తమని తాము రక్షించుకుంటూ,ఆహారం కోసం వేటచేయడం వేరు. గిరిజనులు విలాసానికి వేట చేసిన సందర్భాలుండవు. వేట పురుష లక్షణం ,వీరత్వానికి ప్రతీక అన్నవి మనలో ఓ మైలు రాయిగా స్థిరపడి పోయాయి. కాని రాబర్ట్  ఈ గుర్తుల్ని తిరగ రాశాడు. తనని తాను ఓ స్త్రీ తనువులో ఓ విరిగిన తుపాకిగా మలచుకున్నాడు. యిలాంటి ఇమేజస్  చాలా  అరుదుగా చదువుతాం. వేటంటే  కేవలం క్రూర జంతువుల్ని చంపడమే కాదు, చేపలు పట్టటడం కూడా వేటే! కాని అడవుల్ని నాశనం చేసారన్న గిరిజనులు నిజంగా విలాసానికి వేటాడితే ఒక్క జంతువూ వుండేది కాదు .అసలు వాళ్ళని పాలకులు వేటాడనిచ్చింది కూడా  లేదు. ఎందుకంటారా ,. ఈ దృశ్యాలు...
దృశ్యం-1
అడవుల్ని అనాదిగా వర్గీకరించాం. ఈ వర్గీకరణలో వేట కోసం ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్ని ఏర్పాటు చేసారు. అక్కడికి సరదా కోసం పాలకులు వచ్చి విలాసం కోసం, వీరత్వం కోసం వేటాడి వెళ్ళే వారు. వీరికి దారి తెలీదు కాబట్టి స్ధానికులు దారిచూపే వారు, ఇతర విడిది ,భోజనం వగైరా ఆవసరాలు తీర్చే వారు.అప్పట్లో పాలకుల చర్యల్ని పొగిడారు. కాని గిరిజనుల పై బడ్డ నిందకి నివారణ ఇప్పటికీ లేకుండా పోయింది. ఎవరైనా ఒక ఆవరణలో జీవనం సాగిస్తునారంటే ఆ ఆవరణలోని జీవవైవిధ్యాన్ని తెలుసుకోవడం చాల అవసరం. అలా గిరిజనులకు చెట్టు, పుట్టతో బాటు పురుగు పుట్రా గురించి కూడా క్షుణ్ణంగా తెలుసు ,అందుకే వాళ్ళు వాట్ని హతమర్చలేదు.  ఒక రాజ్య వ్యవస్దకి వర్గీకరణ చేసే అవసరం వేరు, గిరిజనులకి వారి ప్రాంతాన్ని గుర్తు పెట్టుకునేందుకు  ఏర్పరుచుకునే ఆనవాళ్ళు వేరు. అలా ఓ స్త్రీ శరీరాన్ని ,వాటి పై  వున్న మరకల్ని రాబర్ట్ చాల బాగా వర్ణించారు. అంతే  గాక ఓ బయట వాడిగా వాట్ని అన్వేషించే తీరు చెప్పారు. వేట గురించిన అంశంలో వాస్తవం , కల్పన విషయాలు ఓవర్ లాప్ అవుతాయి. ఇక్కడ ఏది కల్పనో ,ఏది వాస్తవమో ఒక్కో సారి అంతు బట్టదు. గిరిజనులకి జంతు జాలల గురించి కొన్ని కాలప్నిక నమ్మకాలుంటాయి. సాహిత్యంలో వేటగురించి పాలకుల కధలు ఇతి వృత్తాలుగా వున్నాయి కాని స్ధానికుల నమ్మకాలు, జ్ఞానం గురించిన సమాచరం చాల తక్కువుగా వుంది. ఉదా: రాజు అనగానే ,అనగనగా ఓ రాజు అడవికి వెళ్ళి క్రూర మృగాలను వేటాడేను వగైరా. సహజంగా జంతువులు క్రూరంగా ఎందు కవుతాయి ,మూల వాసులు జంతువుల్ని ఎప్పుడు క్రూర జంతువులని అనరు, వాటికి వాళ్ళు స్ధానిక పేర్లని వాళ్ళ భాషలో పెట్టుకుంటారు. వేటాడటంలో స్ధానికులు పడే ఇబ్బందులు చాలా వుంటాయి.
దృశ్యం-2
తూర్పు గోదావరి జిల్లాలోని అడ్డతీగల మండలంలోని దొరమామిడిలో  అడవి దున్నల బెడద ఎక్కువ. ఒకసారి మాటల్లో వాళ్ళు చెప్పారు. అడవి దున్నలు కనుక చేలల్లో పడితే వాట్ని తరమడం చాలాకష్టమని. మొదటిగా ఒకటి వచ్చి కూర్చుంటుంది. దానిని  వెళ్ళకొడతారు, అది వెళ్ళిపోయి కొద్ది సేపటికి బలగంతో తిరిగి చేలల్లో పడుతుంది, ఊరంతా కలిసి చాల సేపు డప్పులు కొట్టుకుంటూ వాట్ని తరుముతారు. ఈ తతంగంలో చేలు పాడవుతాయి. దున్నల గురించి ఆర్.పి. నొరోన్హ తన వ్యాసంలో మరో విషయం చెప్పారు. గిరిజనులు కూడ ముసలి వాళ్ళను  ఎక్కువగా పట్టించుకోరు ‘వృద్ధ మహిళలు అందరికి చాకిరి  చేసేవారు,ఎవ్వరికి తల్లులు కారు’ . పర్కి o అనే ముసలామెకి రే చీకటి వుంది,ఆమె ఎప్పుడో రాత్రప్పుడు కోతల పండగకి నృత్యం చేసింది,చూచుక పైన పసి పిల్లల తడి పెదాల్ని మర్చి పోయింది . ఒక రోజు రాత్రి నాద అనే  వాని చేలో ఏదో కనీకనిపించనట్టు వుంటే , చేలో పడ్డ పశువు అనుకొని వెళ్ళ గొట్టడానికి వెళ్ళింది. కాని మర్నాడు ఆమెపై  గుచ్చుకున్న దున్న కొమ్ముల  గుర్తుల వల్ల ఏర్పడిన గాయంనుండి వచ్చిన రక్తం ఉషోదయ  కిరణాల రంగుల్లో వుంది.
గిరిజనులకి అడవి జంతువులతో బెడద -చేలో పడడం  వల్ల, వాళ్ళ పశువుల్ని చంపడం వల్ల తరుచు జరుగుతుంది. పశువుల కాపర్లకు, సంచార జాతుల గిరిజనులుకు ఈ బెడద ఇంకా ఎక్కువ, అందుకే వారికి అడవి జంతువుల ఉనికి,అలవాట్లు బాగా తెలుసు. ఒకసారి   తూర్పు గోదావరి జిల్లాలోని అడ్డతీగల మండలంలోని దుచ్చర్తి భీమవరంలో వున్నపుడు రాత్రప్పుడు ఒకరి దొడ్లో కట్టేసిన మేకల పైన మచ్చల పులి(లెపర్డ్) దాడి చేసింది. దాని ఉనికి తెల్సుకుని ఊర్లోని కుక్కలు మొరుగుతూనే వున్నాయి. అందరూ అప్రమత్తమై లేచి పులిని తరిమేసి మిగతా జీవాల్ని కాపాడుకున్నారు. 
దృశ్యం-3
పులినుండి  తమ పశువుల్ని కాపాడుకునేందుకు  మహబూబ్ నగర్లోని మన్ననూర్  దగ్గరున్న అప్పపూర్ లో  గురవయ్య( వూరి పెద్ద)  వూరవతల వున్న  తన పశువుల దొడ్డి దగ్గరే మకాం ఉంటాడు.
గిరిజనులు ఆనవాయితీగా ఇటికల పండుగప్పుడు వేటాడుతారు. ఈ పండుగని దుక్కి దున్నే ముందు ఊరంతా కలిసి జరుపు కుంటారు. రాత్రంతా నృత్యాలు చేసి,గంగానమ్మకి పూజలుచేసి మర్నాడు ఊర్లోని మగవాళ్ళందరూ  వేటకి వెళతారు .ఒక్క మగాడు ఊర్లో ఉండకూడదు ,ఒక వేళవుంటే, అడవి నుండి వేటాడకుండా తిరిగివస్తే, మహిళలందరూ అతని  పై పేడ నీళ్ళు జల్లు తారు. ఈ పండగ తర్వాత  అందరూ పొలం పనుల్లో నిమగ్నమై పోతారు.
దృశ్యం-4
గిరిజనుల ఇళ్ళల్లో ఊరకుక్కలు పెంపుడు జంతువులు ,చాలా బక్క చిక్కి వుంటాయి. తన యజమాని కదిలికల్ని బాగా పసిగడతాయి. అతను వేటకు సంసిద్ధుడు అవుతున్నాడoటే  ముందుగానే ఇవి పనిలోకి దిగుతాయి. అవి లేనిదే వేటాడడం కష్టం. అవి ముందుగా జంతువుని వాసన తో పసిగట్టి ,చుట్టూ ముట్టేస్తాయి. అప్పుడు బాణంతో వాట్ని వేటాడుతారు. ఈ ప్రక్రియలో అడవిలోకి వేటకోసం వస్తున్నారన్న విషయం అడవి జంతువులూ పసిగడతాయి అవి పారిపోయే ప్రయత్నాలు చేస్తాయి. అడవి లోకి పశువుల్ని పచ్చిక కోసం తీసుకెళ్ళే వాళ్ళు పశుపోషణ తో బాటు రోజూ వేటాడరు. కాని తరుచూ జంతువుల్ని చూసే సందర్భాలుంటాయి. వీళ్ళ జాగ్రత్తలలో వీళ్ళు,వాటి జాగ్రత్తలలో అవి వుంటాయి.
దృశ్యం-5
ఒక సారి కేనిత్ అండర్సన్ ( బ్రిటిష్ కాలంలోని వేటగాడు) శేషాచలం ప్రాంతంలో పులిని వేటాడడానికి వచ్చాడు ,ఆ పులి మనిషుల్ని తినేదిగా మారింది. దానితో ప్రమాదం ఎక్కువై స్ధానికుల కోరిక ప్రకారం అతను వచ్చాడు. చాల రోజులు అడవంతా గాలించినా పులిజాడ తెలియలేదు. అన్ని ప్రయత్నాలూ చేసారు అయినా లాభం లేదు. ఒక సారి అది చూఛాయగా కనిపించే సరికి అటు వైపు గురి పెట్టాడు ,కాని కాలు జారి రెండు కొండల మధ్య చరియలో పడిపోయాడు అతి కష్టం మీద స్ధానికుల సహాయంతో బయటకి రాగలిగాడు . ఇక లాభం లేదని తిరుగు ప్రయాణానికి    సన్నాహాలు చేసుకున్నాడు. తిరుపతి రైల్ స్టేషన్లో రైలు కోసం కూర్చున్నాడు. అక్కడి స్టేషన్ మాస్టర్  ఈయన కుశల ప్రశ్నలు మాట్లాడుకున్న తర్వాత ఏ పనిమీద వచ్చాడు అది ఏ మైంది అన్న విషయం స్టేషన్ మాస్టార్కి చెప్పాడు. ఆ పని జరగలేదు అందుకే వెళ్ళిపోతున్న అన్నాడు. ‘అరె, అలానా, అప్పుడెప్పుడో ఒకసారి ఈ ప్రాంతానికి సర్కస్ వాళ్ళువచ్చారు, వాళ్ళు వెళ్ళి పోయేముందు ,ఒక ఆడ పులి తప్పించుకు పోయింది,అది ఈడుకొచ్చిన పులి అంట,ఎంత వెతికినా దొరకలేదు’ ఈ మాటలు విన్న      కేనిత్ అండర్సన్ తిరిగి అడవికి వచ్చాడు మళ్ళీ కొన్ని రోజులు పులి కోసం గాలించాడు. చాల రోజుల తర్వాత కొండంచున రెండు పులులు కనపడ్డాయి, వాటిలో ఏది ఆడ,ఏది మగ అని గుర్తుపట్టలేక పోయాడు ,ఇంకా అవి తిరిగి వెళ్ళి పోతునప్పుడు, ‘రాణి’ అని అరిచాడు, ఒక పులి వెళుతూ ,వెళుతూ తిరిగి చూసింది, అంతే అదే దాని చివరి చూపు.  కేనిత్ అండర్సన్  అప్పుడు తన మనసులో అనుకున్న మాట ‘మిమ్మల్ని మచ్చిక చేసి మరీ చంపేస్తాం,అంతా మా తప్పే, క్షమించు రాణి’ నా మటుకు ఇవన్నీ విరిగిన తుపాకి గొట్టం నుండి అల్లుకుంటున్న పొగల గుసగుసల్లా వుంటాయి... అవి ఇప్పుడు ఏ రూపంలో అంటే...
దృశ్యం-6
 ప్రతి సంవత్సరం అక్టోబరు 2 నుండి 8 వరకు దేశవ్యాప్తంగా వన్యప్రాణి వారోత్సవాలు జరుగుతాయి. ఈ వారోత్సవాలన్నీ నగరాలలో , బడి పిల్లల మధ్యనే కేంద్రీకృత మైవుంటాయి. ఆడవులలో ,అక్కడే వుండే గిరిజనులకు తెలియదు( ఇవే కాదు చాలా  పర్యావరణ ,ధరిత్రి దినోత్సవాలు తెలియవు). నా మటుకు యివన్నీ అడవి జంతువుల గూళ్ళు అంతరించి పోతునప్పుడు ,నగరవాసులు వాటి  పూర్వీకుల ఆత్మల్ని తలుచుకుంటున్నట్టు  వుంటుంది.
ఓ విరిగిన తుపాకి రంద్రం నుండి చూసే చూపులా...





Tuesday, 7 October 2014 1 comments By: satyasrinivasg

భూమి మనకు ఓ లమాఖాన్ – మూల వాసుల జీవన వలయం -5



భూమి మీదకు చివరాఖరిగా వచ్చింది మానవులు.భూమిని ఆక్రమణకు గురిచేసింది వాళ్ళు. భూమి మనకు ఓ ల మాఖాన్( నిరాశ్రయుల గూడు) అయితే ,మనమే మన గూటిని కబళించాం. ఇది మనం అనాదిగా పాటిస్తున్న  ఓ ఆచారం.ఈ ఆచారం బలంగా  వ్యాప్తి చెందడానికి దురాక్రమణ,కబ్జ, అన్న ఆయుధాలను రూపొందిస్తాం, ఈ యుద్ధాలను తు.చ. తప్పకుండ వాడడానికి శాసనాలు, చట్టాలు,ప్రణాళికలు,ఉత్తర్వులు ఏర్పాటు అవుతాయి. ఇవన్నీ కొందరి ఇష్టాయిష్టాలను సంతృప్తి పర్చడానికే కాని భూమిని, భూవాసుల సంరక్షణకు కాదు. ఇది అప్పటి నుండి నేటి వాతావరణ మార్పు పై జరుగుతున్న అంతర్జాతీయ ప్రోటోకాల్ వరకు వర్తిస్తుంది. రాజ్య వ్యవస్థకి ప్రకృతి సంరక్షణ అన్న అభిమతం వుండదు కాబట్టి . అంతర్జాతీయ స్ధాయినుండి మన ప్రాంతీయ స్ధాయి వరకు ఒకే నినాదం, లేని వాడు రక్షించాలి వున్నవాడు వినియోగించాలి. లేనివాడు నిందితుడు, వున్నవాడు నిరపరాధి. ఈ సూత్రం ఆధారంగానే గిరిజనులని,పశువులకాపర్లని అడవులని నాశనం చేశారన్న  ముద్ర వేసారు.అందుకే ఈ లమాఖాన్ లోని వనరులన్నీ ఒకరి  మఖాన్ లోకే చేరుతాయి.
రాజ్య వ్యవస్థకు అనుగుణంగా ప్రకృతిని స్తుతిస్తే అదే పర్యావరణ కవిత్వంగా చలామణి అవుతుంది.అప్పుడు మనం చెప్పే వస్తువు ,రూపం,ప్రతీకలు మనం వర్ణించినవి తప్ప వాస్తవం కావు.అడవులు అందంగా వుంటాయి, నదులు గల గల పారుతాయి,కోయిల  కూత మధురంగా వుంటుంది , వగైరా, వీట్ని  నిర్వచించింది, రాయడం వచ్చిన బయట వారు తప్ప  లోన వారు కాదు. దీని వల్ల ఒక క్రియాత్మక సౌందర్యాన్ని చూసే దృష్టి మనం కోల్పోయి కేవలం సౌందర్య పిపాసులమవుతాం.చెట్టుని రక్షించు అది నిన్ను రక్షిస్తుంది, మొక్కలు నాటండి,అడవులు పెంచండి అన్న నినాదాల శబ్ద తరంగాల్ని లౌడ్ స్పికర్ల్లలోనే వినే వాళ్ళ మవుతాం.
చెట్లని రక్షించు- అంటే వాటి జీవావర్ణలో  మనం బతికేందుకు అనువుగా  మన జీవితాల్ని అలవర్చుకోవడం తప్ప వాట్ని నరకకుండా చూసే కావలి కాదు.అడవులు పెంచితే పెరిగేవి కావు వాటికవే పెరుగుతాయి.వాట్ని సంరక్షించే ప్రజలు కావాలి అన్నప్పుడు ఆ ప్రజలకు కావాల్సినవి ఇవ్వాలి.ఈ విషయాల్ని విస్మరించి రాస్తే అది అసలైన ప్రజలకు అందదు.అది  కేవలం బాషతో కూడినదే కాదు, అంతర్లీన భావన ముఖ్యం. ఆ భావనే ఓ రూపాన్ని,ప్రతీకలని ఏర్పరుస్తుంది.
చెట్టు చుట్టూ అల్లుకున్న జీవితానికి ,చెట్టుతో అల్లిన  జీవితానికి వ్యత్యాసముంది. ఒకటి  ఓ చిగురించే ఆవరణ,రెండవది ఒంటరిగా  బతికే ఆవరణ. రెండవ దాంట్లో నిరాశ్రయులైన రూపాల గుట్టలుంటాయి,మొదటి దాంట్లో సహజీవన రాసులుంటాయి. ఈ రాసులనుండి పుట్టే రూపానికి ముగింపు వుండదు ,అది చీమల పుట్ట కావ్వచ్చు, బొగ్గుగా మారిన ఓ చెట్టు కావచ్చు.అడవిలో యిప్పపూల కాలంలో  యిప్ప చెట్టు ఓ సజీవ సౌందర్య హారంలా గుంటుంది. పైన కోతులు పూలు తింటుంటే, రాలిన పూలని కింద జింకలు తింటుంటాయి. మన కవిత్వానికి వుండే రూపం ఆలానే కొనసాగితే అంతకంటే ముందు తరాలకి ఇచ్చి పోవాల్సినది  ఏమీలేదనిపిస్తుంది. అది మన జ్ఞాపకాల గూడులా పసిమనస్సుల తేమ  చేతుల్లోని రేఖలకంటిన మట్టి లతలవుతాయి. కొరియన్ సామెత ప్రకారం ...
ఈ భూమిని మన పూర్వీకులు మనకి ఆస్తిగా ఇచ్చి వెళ్ళారు
మనం దీనిని మన  బిడ్డలకు వడ్డీ తో సహా  అందించాలి
పూర్వీకులు చెప్పిన  ఈ మాటలు చెవికి సోకవు ఎందుకంటే విల్లియం వర్డ్స్ వర్త్ నాలుక గురించి అన్న మాటలు వాస్తవం అనిపిస్తాయి .
నాలుక, కొద్ది తేమను నింపుకుంటుంది, కొద్ది బువ్వను రుచిస్తుంది, , కొద్ది శభ్దాన్ని చేస్తుంటుంది, కాని దాని రోదన కొంచెం కూడా వినిపించదు.ఇది పశువుల కాపర్ల విషయంలో ముమ్మాటికి నిజమనిపిస్తుంది.
గిరిజనులు కేవలం వనరుల నిర్వహణే కాదు దానికి ఒక పరిబాషనిచ్చారు. విశాఖ,శ్రీకాకుళం,విజయ నగరం ప్రాంతంలోని గిరిజనులు,పశువుల కాపర్లు ఎవరి  పశువులు వారు  కాస్తే వాట్ని పశువులు అంటారు ,వారి వీధిలోని వాట్ని  వంతులు వారిగా కాస్తే వాట్ని వంతు అంటారు, వూరంతటి వాట్ని ఒకరే కాస్తే వాట్ని సొమ్ములు అంటారు.ఈ  సొమ్ములు కాసే వాళ్ళు తొలకరి ముందు అడవులమ్మటే తిరుగుతారు .కారణం వర్షం అప్పుడు వూర్లోని భూమి వ్యవసాయానికి(ముఖ్యంగా పల్లపు ప్రాంతంలో) వాడుతారు,పచ్చిక కొరత ఏర్పడుతుంది అందుకని సంచారులవుతారు. ఇది ఇప్పటికీ కొనసాగుతుంది. తెలంగాణలోని లంబాడాల జీవన శైలికి రాయలసీమలోని సుగాలీల  జీవనశైలి లోని వ్యత్యాసాలకి ప్రధాన కారణం ఇది కావచ్చు.
వీళ్ళకి వివిధ అడవుల జీవావరణ పై సమగ్రమైన అవగహన వుంటుంది. ఇది మనం హిమాలయ ప్రాంతంలో కూడా గమనించ  వచ్చు.అంతే కాక వీళ్ళకి రాజకీయ వ్యవస్థ పై న  కూడా పట్టు వుంటుంది.
పశువుల నిర్వహణ సంచారత్వం తో ముడి పడి వుంది, కాని స్థిరంగా ఒకే చోట వున్నట్టు, వుండేట్టు ఇల్యూషన్ కల్పిస్తుంది.విశాలమైన సంచారాన్ని ఒకే ఫ్రేం లో ఫిక్స్ చేసే టెక్నిక్ (సిల్ ఆవుట్ షాట్). ఇది  ప్రకృతి పరంగా ఏర్పడుతాయి. ఎలా అంటే   పచ్చిక మేస్తున్న పశువుల పైన వాలిన చిత్రిత కొంగలు , ఈ  దృశ్యం లోనే నిగూడార్ధాన్ని  చెపుతాయి. ఒకటి  భూమి మీద సంచరించే జీవి,రెండవది నింగి లోని విహంగం. పశువుల పైన వుండే క్రిముల్ని తింటూ చిత్రిత కొంగ వాటమ్మటే  తిరుగుతుంది. చిన్న అల్కిడికి ఎగిరిపోతుంది, దానితో పశువులు అప్రమత్తం అవుతాయి. ఒకటి నిలకడ రూపం ,మరొకటి విస్తృతంగా సంచరించే  రూపం. ప్రకృతి తనదైన శైలిలో వివిధ రూపాల్లోని ఒకే రకమైన గుణానికి వున్న  విస్తారాన్ని  చూపుతుంది, బయో ఎన్విరాన్మెంట్ నిర్వచనం దీనిని  బయో కామనలిజంగా అంటుంది. 
నిలకడగా  వున్న వాటి కదలిక చెప్పడానికి  దానికున్న ఆవరణ లోని కదలిక ద్వారా  చూపుతాం,ఉదా:చెట్టు కదలికని తెలపడానికి ఆకుల సవ్వడి, ఆకుల రెపరరెపలాడ్డం వంటి వర్ణన వుంటుంది. అదే  పశువులు తిరిగే విస్తారమైన దాన్ని వివరించడానికి ఆ ప్రాంతాన్ని వివరించాలి ,అక్కడున్న ప్రకృతిలోని సంబంధాల్ని,ప్రకృతికి మానవ సమాజాలకి వుండే సంబంధాల్ని వివరించాలి. ఇదంతా ఒక ల్యాండ్ స్కేప్ పెయింటింగ్ లాంటిది. ఆయా ప్రాంతాల్లో ఏర్పడిన సామాజిక,రాజకీయ, మత సంబంధాల్ని బట్టి మనం వనరులకి,జీవరాసులకి సింబల్స్ ఇస్తాం.  ఆవులకి సాధు జంతువని, ఈ గుణం వల్ల స్త్రీలతో పోల్చడం వగైరా...,కాని ఆవు ప్రకృతిలో, మానవ సమాజంలో వ్యవస్థలు ఏర్పర్చడానికి దోహదమైన కీలక జీవి. దీని వర్ణనని ప్రముఖ కవి బద్రి నారాయణ్ కవితలో ఆస్వాదించండి.

కలలో నల్లని ఆవు
నిన్న రాత్రి
నా కలలో వో నల్లని ఆవు
ఉదయం
స్వప్న విశ్లేషకులతో.
 యీ  విషయం ప్రస్తావించినప్పుడు
ఎవరో అన్నారు
పృథ్విఅని
భూమి పై అత్యాచారాలు పెరిగినప్పుడు
అది
కవుల కలలోకి ఆవులా వస్తుందని
మరొకడన్నాడు
 కవులు తమ భార్యల్ని కాదని
పరాయి కాంతలతో ప్రేమ కలాపాలు
రచించినప్పుడు వాళ్ళ కలల్లోకి
భార్యలు ఆవులై వస్తారని
మిత్రమా! నేనింకా బ్రహ్మచారినే!!
ఇంతలో
ఒక లావుపాటి విశ్లేషకుడన్నాడు
ప్రపంచంలో ఎక్కడైనా
ఒక్క సారిగా
రాజ్యం మారినప్పుడు
కవుల కలల్లోకి ఆవు వస్తుందని
ఎందుకో తెలియదు 
నా కలలోకి వచ్చింది మాత్రం
ఓ నల్లని ఆవు
(అనుసృజన)
ఈ కవితలో ఆవు  ద్వారా  మొత్తం వ్యవస్థ చిత్రపటాన్ని చూపించారు.ప్రపంచ స్ధాయి హింస, భార్యా భర్తల సంబంధాలు, రాజ్య రాజకీయ స్ధితిగతులు. ఇది నేటి దేశ స్ధితికి నిలువుటద్దం,నూతనంగా ఏర్పడిన రాష్ట్రాలు, మొన్న నే ఏర్పడిన తెలుగు రాష్ట్రాలలో  నదీ జలాలు, విద్యుత్,విద్య,రాజధాని అంశం ప్రధాన చర్చనీయాశా లయ్యాయి,కాని గిరిజనుల జీవితాలు, పశువుల  కాపర్ల జీవావరణ అంశాలు చర్చలోకి రాలేదు.(ఎప్పుడు ఇవి రాకుండా వుంచు తున్నారు) .మొన్నటి  వరకు ఒకే రాష్ట్రంలో తిరిగిన పశువులు ఇక పై అదే ప్రాంతాన్ని రెండు రాజ్య వ్యవస్థల్లో పచ్చిక మేయాలి. ఒక విషయం మర్చాం, భారతంలో ఐదు కీలక నగరాలని  అడిగించింది  గోపన్నే!నల్లనావు కలలోకి ఎప్పుడొస్తుందో!

 




Wednesday, 1 October 2014 0 comments By: satyasrinivasg

గుప్పెడంత గుప్పిట్లో మట్టి శ్వాస ఖైదీ –మూల వాసుల జీవన వలయం

గత వారం పర్యావరణం నిర్వచనం, రాజ్య వ్యవస్థ , మూలవాసుల దృష్టి,రూపం గురించి ప్రస్తావించాను. ఈ  వారం అదే దిశగా మీతో  బాటు కొనసాగుతాను. పర్యావరణ నినాదం 1960 ల నుండి ప్రచారం లోకి వచ్చింది. మొదట్లో ఈ నినాదాన్ని రొమాంటిక్ ప్రచారంగా జమ కట్టారు. ఇది నిలదొక్కుకోదు అని అన్నారు. ఇప్పటికీ ఓ మొలకగా చిన్నగా పెరుగుతోంది. ఇది ఎదగాలంటే దీనిని  కేవలం ఒక రొమాంటిక్ భావనగా అంచనా వెయ్యొద్దు . పర్యావరణ కవిత్వాన్ని కూడ అంతేగా భావించకూడదు. పర్యావరణ నినాదంలో సంక్షిప్తంగా  వున్నది చరిత్రలోని సంఘటనలను ఆయా జీవావరణ వ్యవస్థల ద్వారా చూడడం తప్ప విడదీసి కాదు. పర్యావరణ కవిత్వానికి మూలం ఇదే.  అంతర్గత, బాహ్య చర్యల ప్రక్రియ  ప్రతీకలుగా  రూపాన్ని అర్ధం చేసుకోవాలి. ఇది ప్రేమ ,ఘర్షణ చిహ్నాల జెండా. ఇది వ్యక్తిగత,సామూహిక మట్టి పాద ముద్ర.

అనగనగా రోజులనుండి నేటి వరకు అడవిని అందంగా చిత్రికరించాము,ఆ ఆవరణలోని వాట్ని అనాగరికులుగా, జంతువుల్నిక్రూర మృగాలుగా   వర్ణించారు. ఈ వర్ణన మన జీర్ణ కోశములో నాటుకుపోయింది. దీనినుండి బయటపడాలంటే చరిత్ర విశ్లేషణలో సంస్కృతిక మనో విశ్లేషణ(చికిత్స) చాలా అవసరం. గిరిజనుల జీవన విధానం వైవిధ్యంతో అల్లుకున్నది. వాళ్ళు కొండ పోడు,చెలక పోడు, అటవీ ఫల సేకరణ,పశుపోషణ,చేపలు పట్టడం,పండ్ల చెట్ల పెంపకం, వేట లాంటి వ్యవస్థల పై  జీవనాన్ని కొనసాగిస్తారు. ఇప్పటికీ కేవలం అటవీ ఫల సేకరణ,పశుపోషణ  పై అచ్చంగా జీవిస్త్తున్నవారు,శ్రీశైలం ప్రాంతంలోని చెంచులు(అహోబిలం వైపు వారు కారు). ఇక మిగితా తెగలవారు (ఆంధ్రా,తెలంగాణలో) అన్నిటి  మీద  ఆధారపడి బతుకు తున్నారు. అంటే ఒక రాజ్య వ్యవస్థ నిర్వహణ,యాజమాన్యం చేసే సహజ వనరుల అన్నింటి పైన వీరి జీవనం ముడి పడి వుంది. ఈ వ్యవస్థ లన్నిటికీ  పరమాణు కేంద్రం  అడవి.  గిరిజనుల జీవన వలయాన్నిజీవన  చిత్రంగా కాక ప్రమేయంగా రాజ్య వ్యవస్థ భావిస్తుంది. వనరుల పై ఆధిపత్యం కోసం వాట్ని వర్గీకరించింది.గిరిజనులకు అడవిని ఉమ్మడిగా చూసే వ్యవస్థలో అడుగడుగునా కంచెలు ఏర్పడ్డాయి.ఈ వర్గీకరణలో కలప,పశు పోషణ కోసం పచ్చిక బైళ్ళుగా మార్చడం,ఆధ్యాత్మిక చింతన కోసం వనాలు, రాజ్యపాలన అనంతరం  విశ్రమించేందుకు వనాలు, వేట కోసం ప్రాంతాలు గా వర్గీకరణ జరిగింది. వీటి మూలాలు ఇతిహాస కాలాల నుండి వున్నాయి.ఈ వర్గీకరణ గిరిజనుల జీవనాన్ని  సంక్షోభంలో పడేసింది.  ఉదాహరణకు ప్రముఖ చరిత్ర కారిణి రొమిల్లా  థాపర్ ఖాండవ దహనాన్ని విశ్లేచించిన తీరులో తెల్సుతుంది,  పశుపోషణ కోసం అడవి ప్రాంతాన్ని పచ్చిక బైళ్ళు గా మార్చడానికి ఖాండవ దహనం జరిగింది. ఆ కాలంలో రాజ్య వ్యవస్థకు పశుపోషణ కీలకం.
 అదే గిరిజనులు పశుపోషణ చేస్కుంటుంటే అది అడవుల్ని నాశనం చేస్తుందన్న అభియోగం ఇప్పటికీ  కొనసాగుతోంది ,అది ప్రకృతి వినాశకరం  అని శాస్త్రీయ జ్ఞానంతో నొక్కి వక్కాణిస్తారు. పశు పోషణ పై ఆధారపడిన వారు ఒకే ప్రాంతంలో వుండరు ,పచ్చిక బైళ్ళను అన్వేషిస్తూ తిరుగుతారు. వాళ్ళు చినుకు జాడను పసిగట్టే జ్ఞానులు. ఇక్కడ తిరుపతి పక్కన తలకోన దగ్గర ఓ చిన్నపిల్లాడు పశువులు కాస్తూ అన్న మాట ఎప్పటికీ మర్చిపోలేను. అన్నాఈ  అడవిలో పశువులు కాస్తే అడవి నాశనం అవుతుందని పారెస్ట్ వాళ్ళంటారు, పశువుల్ని  మేపుకోనివ్వరు,ఇది అభయారణ్యం అంట. మరి  అడవిలోకి పశువులొచ్చి గడ్డి మేస్తుంటే కదన్నా గడ్డి  తక్కువవుతుంది, నలిగి పోతుంది. అప్పుడు అడవికి నిప్పు బెడద తగ్గుతుంది కదా . ప్రతి వేసవి కాలం లో శేషాచలం అడవులు తగల బడుతూనే వున్నాయి. మరి శేషాచల వాసుడి  చెవిలో ఇది ఎప్పుడు పడుతుందో,రోజూ అయన తలుపులు తెరచి భక్తులకి ప్రవేశం ఇచ్చేది ఈ  కాపర్లే కదా.  మరి వారి  జీవనానికి అడ్డంకులు పెరుగుతూనే పోతున్నాయి తప్ప తొలగటం లేదు. ఇదే విషయాన్నీ2002 కాలంలో  హైదరాబాద్ హరిణ వనస్థలిపురం జాతీయ పార్క్  విస్తరణ అప్పుడు (నిజాం కాలంలో వనస్థలి పురం-జంతువుల వేట స్ధలం )అక్కడే వుండే ఓ పెద్దామె ఫారెస్ట్ అధికారితో అంది  సారూ మీరు ఇంటికాడి నుండి ఈడ్కి అచ్చేటప్పుడు,ఇంటికాడ నాస్థా చేసొచ్చినారు ,ఎందు కంటే ఇంటికాడి బువ్వ ఆరోగ్యం అని, మరి మా పశువులకు కూడా అడవిలోని బువ్వ ఆరోగ్యం సారూ.వాట్ని ఆడ్కి  తొల్క పోకపోతే ఎట్లా” - స్థానికుల నాడిని ఎప్పుడూఅర్ధం చేసుకోలేదు అన్న దానికి ఇంత కంటే వివరణ చెప్పలేను. కానీ వారి మాటలు అశాస్త్రీయం అని   వలస వాదం వల్ల ఇంకా ఎక్కువైయ్యాయి.  రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్,ఇబ్రహీం పట్నం,చుట్టుపక్కల ప్రాంతాల్లోని అడవులు పచ్చిక బైళ్ళు గా  ప్రసిద్ధి,వీట్ని కంచెలు అని కూడ అనే వారు ,కారణం ఆ గడ్డిని వేలం లో అమ్మేవారు ,ఆ వేలం ఎక్కువగా భూస్వాముల ఆధీనం లోనే  వుండేది. గడ్డి మీద అధికారం కోసం తిరుబాట్లు జరిగాయి. ఈ సందర్భంలో ‘సుద్దాల హనుమంతు రాసిన పాట పల్లెటూరి పిల్లగాడ,పసులు కాసే పోరగాడ’  ఇంకా ప్రతిధ్వనిస్తూనే వుంటుంది.   ( ఇక పై   ఈ ఉపోద్ఘాతాల్ని ఒక్కో జీవావరణ జీవన రేఖల్ని వివరణ గా చెప్పుకుంటూ వస్తాను.)
అడవి అనేది కేవలం కొన్ని వృక్షాలతో ఇమిడిన ప్రాంతం కాదు. మట్టికి,మట్టి మనసులకి   శ్వాసనిచ్చే గాలి మర. చరిత్ర పాఠాల్లో అడవిని బందీని చేయడం ,స్థానిక గిరిజనులు వ్యక్త పరచిన అభియోగాలు రాయకుండా జాగ్రత్త పడడం జరిగింది.అడవి అనేది ఎంతో నిగూడమైన మర్మం ,  అందులో నివసించే గిరిజనుల జీవన వలయంలో  ప్రతి ఘడియ  ఒక యుద్ధమే, అయితే ప్రకృతితో కాదు బాహ్య రాజ్య వ్యవస్థలతో. ప్రకృతి వలయంలో వేటాడేది,వేట కావించబడేది మధ్యన  కొంత విశ్రాంతి సమయం వుంటుంది,ఆకలేసినప్పుడే వేట జరుగుతుంది.రాజకీయ సామాజిక వ్యవస్థ లో ఈ విశ్రాంతి ఘడిలుండవు, ఆకలే వేటైనప్పుడు ప్రతిదాని మీదా యుద్ధమే!  కానీ గిరిజనులు ఆ జీవనాన్ని ఒక యుద్ధంగా భావించ లేదు ,చడీ చప్పుడు కాకుండా ప్రకృతి సంరక్షిస్తూనే వున్నారు. ఈ సంరక్షణ వెనుక వున్న  యుద్ధం గురించి తెలియటం లేదు ప్రకృతి పైన వారి ప్రేమనే ప్రతీకలుగా చెప్పుకుంటూ పోతున్నాం. అడవిలో ప్రతి చెట్టు ఆకుల పైన ఓ రణ గీతం  సోకుతూనే వుంది.  
ఓ ఆకు  ప్రేమలో,యుద్ధంలో

స్వచ్చమైన చెట్లు,ముదురు రంగుల హారాలు 
నేలతో ఐక్యమవుతూ
ఎండిపోవడం  ఎరుగదు;
ఆకుల పైన  రంగులు
కళ్ళలోని సమూహం .
మనం ఆకుల్ని చూశాం
నగలతో ముస్తాబైన స్త్రీల పైన,
ఘనీభవించిన
వారి ప్రేమ రూపం మీద,

ఇప్పుడు స్వచ్చమైన దండ తెగి పడి వుంది
భూమి మీద,ఎంత మారింది,ఎంతగా మిళితమైపోయిందో
రక్తంతో, రాబందువులు తమ ముక్కుతో రక్కేస్తునాయి
పచ్చి మాంసపు ముద్దలనుకుని.

ఇదీ మనం చూస్తున్నాం
 ఎందుకంటే  ఓ  నవ యువకుడు
యుద్ధం మీద ప్రేమతో
వాట్ని విజయ కేతనంగా ధరించాడు.
(రెండు వేల సంవత్సరాల క్రితం తమిళ భాషలో రాసిన కవిత.ఆంగ్ల మూలం, ఎ.కే. రామానుజం)
(అనుసృజన)

ఈ కవితలో ఆకుల రంగుల్ని వివిధ సందర్భాల్లో  ప్రతీకను కవి జెక్ష్ టాపోస్  చేసాడు, ప్రేమలోని కలయిక లో ,యుద్ధంలో  .ఇది బాధని సుతిమెత్తంగా మన గూట్లోకి చేరుస్తుంది. పర్యావరణ కవిత్వం  మనలోని సునిశితను తట్టి లేపే అనగనగా అల్లిన ప్రకృతి పాట. అందుకే పర్యావరణ కవిత్వం ఒకరి ప్రతీకే, ఒకరి ప్రతిరూపం కాదు, ఎవరి మొహాలు వాళ్ళు చూసుకునే సొంత అద్దం  కాదు, చెరువులోని చేప పిల్ల నోటిబుడగ లోని అందరి ప్రతిరూపం.