Saturday, 28 November 2015 0 comments By: satyasrinivasg

మాను -మాకు సిరీస్ ! (అతి చిన్న కధలు)

భూమి బుగ్గ మీద సొట్ట

బుగ్గ వాగు
కదలకుండా వుంది
వాగు గర్భంలో
ఉపరితల నేల  జ్ఞాపకాల పూడిక చేరింది
నీళ్ళకు
ఆకుల రొట్ట నీడల రంగులు పులుముకున్నాయి
బీడువారిన పాత ఇంటి గోడల్లో మొలచిన రావి చెట్టులా
బుగ్గ వాగెమ్మటే రైలు కట్ట, ఎండాకాలంలో మిగిలి పోయిన నీళ్ళలా అప్పుడప్పుడూ వచ్చిపోయే రైలు. కిటికిలోండి చూస్తున్న ప్రయాణికుడి చూపుల్లో నుండి  కదిలిపోతున్న దృశ్యాల్లా అక్కడక్కడా వాగులో గాలినీటి బుడగలు1  వాగులోని పచ్చంచు  నీళ్ళల్లో కొన్ని సూర్యకిరణాల చుక్కల మెరుపుల్ని  పొదిగున్నాయి.
రైలు కిటికీ  వూచేదో అక్కడ విరిగి పడిపోయినట్టు 16 వ నంబర్ మైలు రాయి కనీ కనిపించకుండా కానుగ చెట్టు నీడల్లో కలిసి పోయింది.
రైల్ కట్ట దాటి ఊర్లోకి చేరాలి . రైల్ కట్ట ముందు ప్రమాద హెచ్చరికలా ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్, చిన్న కార్లల్లో ఎక్కువ మంది కూర్చుంటే , స్పీడ్ బ్రేకర్ దాటాలంటే కొందరు దిగక తప్పదు. రైల్ కట్టకు స్పీడ్ బ్రేకర్ ఒడ్డులావుంది. రైల్ కట్ట వాగుకు  వొడ్డు.
ఒడ్డు నిలకడగా వుంటుంది అన్నది భ్రమ. వాగెమ్మటే మనని తోడట్టు కెళ్ళే నేల విహంగం అది. వాగు నీటిలో శరీరాన్ని తడపకుండా ,వాగు నీటి ఆలోచనలతో  భౌతికంగా మనని  తడ్పుతూ ఎగరేస్కు పోయే పక్షి అది. వాగు ఒడ్డున వూరు  జీవితాన్ని, కాలాన్ని నాటకంగా మల్చే కవిత్వంలా సాగుతుంది.
ఇళ్ళు దాటి వచ్చి చాలా సేపు అలానే చూస్తూ,ఆలోచనల్లో తచ్చాడుతూ ఉండిపోయాను. వాగు నాలో  నింపే దృశ్యాలు, నేను వాగులో వొంపే ఆలోచనలు -రెండిటికి ప్రతీకలు లేవు. రాబోయే ప్రతీకని వూహించుకుంటూ ఒక పెద్ద టెలిస్కోప్ నుండి గగనంలోకి  చూస్తూ లాండ్ స్కేప్ ని సృష్టించుకుంటున్నా.ఇదంతా ఒక చోట పుట్టే ఆలోచనల్ని మరో చోట పేర్చుకుంటూ ,గుర్తు పట్టేలా,మానవీయంగా పెట్టుకుంటూ,అవి మనకు తెలుసు ,వాట్ని అర్ధంచేసుకుంటాం అనే భావనలోని ప్రక్రియలో ఒదిగిపోయా. ప్రకృతిలో  వున్నవిశాలమైన భౌతిక మైదానాల్ని మనకు అనుగుణంగా మల్చుకునే ప్రయాసలో భూమిని తొల్చేసే గురుత్వాకర్షణ శక్తిని సంపాదించాం.అర్ధంలేని యంత్రాలమయ్యాం.
వాగు ఒడ్డునే కదలకుండానే నిర్మలంగా కదిలే గాలికి ,దాని వేగాన్ని బట్టి వూగే రెల్లు గడ్డి పూలు ,గాలికి ఒడ్డుకు లాగున్నాయి. అలా అలోఛిస్తూనే ఇంటి వైపు నడవడం మొదలు పెట్టా. ఎదురుగా బడికి వెళుతున్న పిల్లలు ,ఇంటి గుమ్మం దగ్గర వాళ్ళనే చూస్తూ వున్న తల్లి. ఏమైనా మర్చిపోయి వెనక్కి తిరిగి చూసి అడుగుతారేమోనని ఆదుర్తాతో.
నా వెనాకలే ఒడ్డుమ్మట్టే రైల్ వెళుతున్న చప్పడు. ఇప్పుడు కార్లో వాళ్ళే  కాదు, అందరూ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగాల్సిందే ! ఇంటి నుండి వెళ్ళే వాళ్ళు , ఇంటికి వచ్చే వాళ్ళు.మనం వూహించే ,ప్రతీకరించే ప్రపంచం లోగిల్లోకి ,లోగిలి బయట  అడుగేసేముందు  ఇవ్వాల్సిoది ,తీసుకెళ్లాల్సిoది ఏమైనా ఉందా అన్న ఆలోచనకి కేటాయించే సమయం కోసం.

  
Tuesday, 25 August 2015 0 comments By: satyasrinivasg

ప్రకృతి తాత్వికుడు- ఖలీల్ జిబ్రాన్ -41

చెట్లు, ఆకాశంలో భూమి రాసిన కవితలు ,వాట్ని నరికి కాగితాలు తయారు చేస్తాం. అందులో మన  శూన్యాన్ని పొందు పర్చుకోడానికి.-ఖలీల్ జిబ్రాన్.
తన తొలి దశలో రాసిన ఎ లామెంటేషన్  ఇన్ ది ఫీల్డ్ అనే సంపుటిలో ఖలీల్ జిబ్రాన్ ప్రకృతిలోని గాలి,పూలు,వాగు,పక్షులు గురించి  సంభాషిస్తూ, అవన్నీ కాలుష్యం,మానవాళి చర్యలు,నగర జీవనం పై రోదిస్తున్నాయని వ్యక్తపరుస్తాడు.దీనిని ప్రకృతి గురించి  విడిగా వ్యక్తీకరణగా కాక  సహజమైన జీవనం, నగర జీవనం పై జిబ్రాన్ రొమాంటిక్ వ్యతిరేకత గా చూడాలి. అందుకే అన్నాడు కాబోలు చెట్లు నరికి కాగితాలు చేసి అందులోమన శూన్యాన్ని లిఖించుకుంటామని.
మృతుల నగరం
-ఖలీల్ జిబ్రాన్.
నిన్న,నేను శభ్దాల ముళ్ళు లేని మైదానం  వైపు కొనసాగాను, కొండ చేరేంత  వరకు ,ప్రకృతి అక్కడ తన అందమైన దుస్తుల్ని పేర్చి వుంది, ఇప్పుడు శ్వాస పీల్చ గలను.
వెనుతిరిగి చూశాను, బ్రహ్మాండమైన మస్జిదులతో,రాష్ట్ర సౌరభాలతో,పొగతో కమ్ముకున్న దుకాణాలతో నగరం కనిపించింది.
నేను మనిషి ఆశయం గురించిన విశ్లేషణాత్మక ఆలోచనలో పడ్డాను,కాని మనిషి జీవితం అంతా సంఘర్షణ, కష్టాలు అన్న నిశ్చయానికి వచ్చాను. ఆదాము తనయులు  ఏమి చేశారని ఆలోచించ దల్చుకోలేదు,నా  చూపుని దేవుడి కీర్తి కిరీటమైన మైదానం వైపు మరల్చాను. మైదానం లోని ఒక చివర  చెట్లతో వున్న ఖనన  ప్రదేశాన్ని చూశాను.
అక్కడ, మృతుల నగరం, బతికివున్న వారి నగరం మధ్యన, నేను ధ్యానం చేశాను. ముందర ఆధ్యాత్మిక నిశబ్ధం గురించి ఆలోచించాను, తర్వాత అంతులేని  రోదన గురించి.
బతికున్న వారి  నగరంలో ఆశ, నైరాశ్యం,ప్రేమ,కక్ష,ఆనందం,బాధ,సంపద,పేదరికం,నమ్మకం,ద్రోహం గమనించాను.
మృతుల నగరంలో  భూమిలో   కలిపేసిన  మట్టి,ప్రకృతి దానిని మలుస్తుంది,రాత్రి నిశ్శబ్దంలో,వృక్ష సమూహంగా, తర్వాత జంతుజాలంగా, పిదప మనిషిగా. ఇలా నా మదిలో ఆలోచనలు  రేకెత్తుతున్నప్పుడు,అటు వైపు ఒక సమూహం
మెల్లిగా,శ్రద్ధతో వెళుతోంది.సంగీతంతో సాగుతోంది అది నింగిని బాధతో కూడిన స్వరాన్ని  నింపింది.అది చాల పెద్ద శవ యాత్ర.చనిపోయిన వారి వెంట బతికున్న వారు  ఏడుస్తూ వారి   నిష్క్రమణని తలచుకుంటూ వ్యధ చెందుతున్నారు.ఊరేగింపు సమాధి స్ధలం  చేరాక పూజారి ప్రార్ధనలు మొదలుపెట్టి అగరొత్తులు వెలిగించాడు. వాయిద్యకారులు తమ వాయిద్యం మొదలుపెట్టారు.చనిపోయినవార్ని తలచుకుంటూ రోదిస్తున్నారు.ఒకరి తర్వాత ఒకరు నాయకులు వచ్చి  తమ అనుబంధపు జ్ఞాపకాల్ని మంచి వాక్యాలతో నెమరేసారు.
చివరికి సమూహం నిష్క్రమించింది, చనిపోయినవార్ని సువిశాలమైన అందమైన , ఇనుము రాతి పై నైపుణ్యంతో చెక్కిన పేటికలో సేదతీరేందుకు,ఇంకా అందమైన ఖరీదైన  పుష్పగుచ్చాలతో అమర్చిన దానిలో.
అంతిమ యాత్రలో పాల్గొన్న వారు నగరానికి తిరిగివెళ్ళిపోయారు నేను మాత్రం మిగిలాను,వాళ్ళని గమనిస్తూ,నాతో నేను నింపాదిగా మాట్లాడుకుంటూ,ఈ లోపల  సూర్యుడు తీరం దాటిపోతున్నాడు, ప్రకృతి నిద్రించడానికి తగు ప్రయత్నాలు చేస్తోంది.
అప్పుడు చెక్కతో చేసిన పేటికను మోసుకుంటూ వస్తున్న ఇద్దర్ని చూశాను, వారి వెనకాలే దారిద్ర్యంలో వున్న ఒక స్త్రీ చంకన పసికందును వేసుకుని ,ఆమె వెంటే ఒక కుక్క, మనో వేదనతో కూడిన చూపులతో  స్త్రీని,తర్వాత పేటిక వైపు చూస్తూ.
అది పేద వాడి శవ యాత్ర.ఈ మృత్యువు అతిధి, చలనం లేని సమాజానికి దారిద్రంలో వున్న భార్యని,ఆమె దుఖాన్ని పంచుకోడానికి పసికందుని, తను లేడని మనసెరిగిన కుక్కని వదిలివెళ్ళాడు.
వాళ్ళు సమాధి స్ధలం చేరగానే పేటికని లేత గుబురులు ,పాలరాళ్ళకి దూరంగా వున్న ఒక గోతిలో పెట్టారు,కొన్ని వాక్యాలతో దైవస్మరణ చేసి వెనుతిరిగారు. ఆ చిన్న సమూహం చెట్లల్లో కనుమరుగవుతునప్పుడు ,కుక్క చివరి సారి చూపుగా వెను తిరిగి చూసింది.
నేను బతికినున్న వారి  నగరం వైపు చూస్తూ నాలో నేను అనుకున్నాను, "ఆ ప్రదేశం కొందరికే చెందుతుంది'. ఓ దేవుడా  అందరికీ కావాల్సిన  స్వర్గం ఎక్కడ వుంది?"
ఇది అంటూ , మబ్బుల వైపు చూశాను,పొడవైన ,అందమైన సూర్యుడి బంగారు కిరణాలతో మిళితమైవుంది, నాలో ఒక శ్వాసాత్మ గొంతు అనడం విన్నాను,"అదో అక్కడ!"
(అనుసృజన-జి.సత్య శ్రీనివాస్)
అవును అందమైన నగరం మృతుల నగరం గానే వుంటుంది అని జిబ్రాన్ మనకి ఒక తాత్వికతో వున్న ఆలోచనని ఇచ్చాడు.జిబ్రాన్ కవిత్వంలో ప్రకృతి,  ఆధునికత నగర జీవనం మార్మికంగా వుంటుంది. ఆయనలోని ఆ అంశాన్ని విస్మరించాం.  నేడు గ్రామాల్ని, చూస్తునప్పుడు ఇదే కవిత వెంటాడుతుంది. ఎక్కడ చూసినా, విన్నా ఒకే మాట ,బతకడానికి ఏముంది గ్రామంలో , వలసలు, కరువు, ఆత్మహత్యలు.మరి నగరంలో ఎవరికి వారే యమునా తీరే!
ఆధునికత, అభివృద్ధి అనే ప్రగతిశీల ధోరణిలో ఎప్పటికీ తరగని వనరుల్ని ఇచ్చే కామధేనువుగా ప్రకృతిని అంచనా వేసాం. ఇది సరైన అంచనా కాదు అని హెగెల్,ఏంగెల్స్ చెప్పినప్పటికీ పట్టించు కోలేదు. ప్రకృతి మన అవసరాల్ని తీరుస్తుంది, అత్యాశను కాదు అని గాంధి అన్నాడు. అయినా లాభం లేదు.
ఈ విషయాల్ని జిబ్రాన్ ఫ్రీ వర్స్ శైలిలో వస్తువుని కధగా కవితని అల్లాడు. మనకి మనం ఏం చెప్పాలో .చెప్పే విషయం పై మనకున్న పట్టు మనకి  చెప్పేతీరుని మల్చే నైపుణ్యం,మెళుకువని అందిస్తుంది. అది మన అనుభవం నుండి మొలిచే భావాన్ని వ్యక్త పర్చే మొలక.
 ఒక సంభాషణని చిత్రం ద్వారా చూపడం అంటే కంటి మనస్సులో ఆలోచన పుట్టాలి అదే మనలోని అనంత అంతర ప్రకృతి-
నేను బతికినున్న వారి  నగరం వైపు చూస్తూ నాలో నేను అనుకున్నాను, "ఆ ప్రదేశం కొందరికే చెందుతుంది'. ఓ దేవుడా  అందరికీ కావాల్సిన  స్వర్గం ఎక్కడ వుంది?"
ఇది అంటూ , మబ్బుల వైపు చూశాను,పొడవైన ,అందమైన సూర్యుడి బంగారు కిరణాలతో మిళితమైవుంది, నాలో ఒక శ్వాసాత్మ గొంతు అనడం విన్నాను,"అదో అక్కడ!"
ఇది ఒక సిల్ ఔట్ షాట్లో వాయిస్ ఓవర్ లా వుంటుంది. వెంటాడుతూనే వుంటుంది. ఒక నది ఒడ్డునో, చెరువు గట్టునో ఒంటరిగా కూర్చుని ఆవలి వైపు చూసే చూపులా... ఆధునికతలో బతుకిని ఎక్కడ కోల్పోతామన్న భయంతో భీమా చేసుకుంటాం గాని బతకాలన్న ధీమాతో కాదేమో! ప్రకృతి పునరావృతమయ్యే చోటుని ఒక బతుకుబాటగా చూడక పోవడం కంటే అంధత్వం ఏముంది ?
బతికున్న వారి  నగరంలో ఆశ, నైరాశ్యం,ప్రేమ,కక్ష,ఆనందం,బాధ,సంపద,పేదరికం,నమ్మకం,ద్రోహం గమనించాను.
మృతుల నగరంలో  మృతుల నగరంలో  భూమిలో   కలిపేసిన  మట్టి,ప్రకృతి దానిని మలుస్తుంది,రాత్రి నిశ్శబ్దంలో,వృక్ష సమూహంగా, తర్వాత జంతుజాలంగా, పిదప మనిషిగా.
ఒక సారి మహబూబ్ నగర్ జిల్లాలోని బొమ్మరాస్ పేట్ లో తిరుగుతున్నప్పుడు ఒక శవ యాత్ర వెళుతోంది, పొలం వుండి కూడా ఈయనని శ్మశానం లో ఎందుకు బొంద పెడుతున్నారు అన్నాడు ఒక పెద్ద మనిషి. అప్పుడు ఆ మాటలు అర్ధం కాలేదు. ఇప్పుడు దాని నిగూడత స్పష్టమైంది.  నూతన రాజధాని నిర్మాణంలో సీడ్ క్యాపిటల్ పేర్న చేపడుతున్న ప్రయోగం కూడా లింగాయపాలెం,ఉద్దండరాయునిపాలెం గ్రామస్తుల్ని ఇదే పరిస్దితుల్లోకి  నెట్టేస్తోంది. ఒక ఉర్దూ కవి అన్నట్టు మనం భూమిని కోల్పోయాం,కాని స్వర్గాన్ని పొందలేదుగ్రామాల్ని వదిలి నగరానికి రావడం అంటే స్వర్గంలోకి అడుగు పెడ్డటం కాదు, భూమిని కోల్పోతున్నామని ఇంతకంటే విశిదంగా  చెప్పనవసరం లేదు.
నా ఆత్మకి హితభోధన
అందరు మనుషులూ పుట్టిన ధూళి నుండే నేను పుట్టానని నాకు తెలుసు
వాళ్ళలోని మూలకాలే నాలోనూ వున్నాయి
నా ఆత్మ వాళ్ళలోనూ ఆత్మే
నా సంఘర్షణ వారి సంఘర్షణ
వారి పుణ్యక్షేత్రం నాదీను
వారు అతిక్రమదారులవుతే,నేను కూడా అతిక్రమదారుడినే
వాళ్ళు బాగుంటే ,అందులో నా వాటాకూడా వుంది
వాళ్ళు ఎదుగితే,నేనూ వాళ్ళతో బాటు ఎదుగుతాను
వాళ్ళు వెనకబడితే, నేను కూడా, వాళ్ళకి సహవాసంగా.
(అనుసృజన-జి.సత్య శ్రీనివాస్)
ఈ కవిత కేవలం మనుషుల గురించే కాదు, ప్రకృతికి కూడా వర్తిస్తుంది. ఖలిల్ జిబ్రాన్ కవితల్లో అంతర్లీనంగా వ్యక్తమయ్యే అంశం ఈ భూమి మీద చాలా కీలకమైన సమస్యలు అహంకారం వల్ల ఏర్పడ్డాయి,అవి వాటి పరిధిని దాటి చూడ లేవు.ఎక్కువ శాతం ఇవి ధనంతో ముడిపడినవి. ఇది జిబ్రాన్ నిరంతరం వ్యక్తపర్చిన అంశం. మనం ఒక్కళ్ళమే బాగుపడాలన్న ఆలోచన కంటే పర్యావరణ విధ్వంశ ఆలోచన మరొకటి లేదు.

పర్యావరణ కవిత్వం నిశబ్దపు ఆలోచనల సముద్రం. ఇది స్పష్టంగా   జిబ్రాన్ కవితల్లో తెలుస్తుంది. జిబ్రాన్ కవితలు కధలుగా వుంటాయి. కవితల్ని కధలుగా రాసే ప్రయత్నం విక్రం సేథ్ ప్రయత్నించాడు.అలా చెప్పాలంటే మెటా ఫర్స్(ప్రతీకల్ని) ని మల్చే నైపుణ్యం వుండాలి.దానికి మెటామార్ఫిక్ ప్రాసెస్ తెలియాలి. ప్రాసెస్,ప్రోగ్రెస్ మధ్య తేడా తెలియాలి, ఆ చలన చక్రం అర్ధం అవ్వాలి. అందుకు  నిశితమైన పరిశీలన చాల అవసరం. ప్రకృతి ప్రేమికులకి అత్యంత అవసర మైన లక్షణం  ఇది. 
Tuesday, 11 August 2015 0 comments By: satyasrinivasg

నగరీకరణ ప్రకృతి- అభివృద్ధి మలుపు

నగరీకరణ పుణ్యమా అని క్షీణిస్తున్న ప్రకృతిని తలుచుకుంటూ రాసే కవిత్వంలో చాల పాళ్ళు మానవీయ కోణం తొణికిస లాడుతుంది. బాధ, వేదన ఇందులో చాల శాతం ఎక్కువ. ఏమీ చేయలేని దుస్థితి నుండి వేదనని వ్యక్త పరుస్తాం. నగరంలోని చెట్టు, చేమ, పక్షి అన్నిటి నిష్క్రమణ అనివార్య మని తెలిసి. మన నీడలో ఏది ఉండలేదు అని సుస్పష్టంగా మనకి తెలుసు. అందుకే మనం తిరిగే మలుపులో మనం కోల్పోయింది వున్నదని తెలిసి ఆ వైపుగా తిరగ డానికి సంకోచిస్తాం.   పర్యావరణ కవిత్వం ఆ మలుపుల తలంపే.
నేస్తం
-గుల్జార్
వీధి చివర్న చూశాను ఎప్పుడో ఆ  వృద్ధ వృక్షాన్ని?
నాకు పరిచయమే, చాలా ఏళ్లుగా నాకు తెలుసు అది
నా చిన్నప్పుడు  ఒక మామిడి కాయ కోసం
గోడ మీదుగా దాని భుజాల  పైకి ఎక్కే వాడ్ని
తెలియకుండా  నొప్పిపెట్టే ఏ కొమ్మ మీద కాలు పెట్టే వాడినో
అది ఒక్క సారిగా నన్ను కిందకు తోసేసేది
నేను కోపంతో దాని పై రాళ్ళూ విసిరేవాడ్ని
నా పెళ్ళికి జ్ఞాపకం వుంది దాని రెమ్మలిచ్చింది
నా పెళ్లిలో  హోమానికి వేడినిచ్చింది
నా భార్య గర్భవతప్పుడు ,ప్రతి మధ్యాహ్నం
ఆమె వైపు మామిడి కాయలు  విసిరింది
కాలక్రమేణా పళ్ళు ఆకులు రాలిపోయాయి
ఆ వైపుగా తిరుగుతున్నప్పుడు అంటూ వుండేది 'బిబా'
'అవును, ఇదే చెట్టు నుండి వచ్చావు నువ్వు, దీని ఫలమే నువ్వు'
ఇప్పటికీ అటుగా  వెళుతునప్పుడు
దగ్గుతూ అంటుంది 'ఏంటి తల పైన జుట్టంతా రాలిపోయిందే'?
ఉదయం నుండి అ చెట్టుని నరికేస్తున్నారు
వీధి మలుపు వరకు పోయే ధైర్యం లేదు నాకు
(అనుసృజన-జి. సత్య శ్రీనివాస్)
అభివృద్ధి పుంజుకుంటున్న వేగానికి తగ్గట్టుగానే ప్రకృతి క్షీణత జరుగుతుంది. అంతరించిన ప్రకృతిని తిరిగి పునరావృతం చెయ్యడం దుసాధ్యం. ఈ మధ్యన హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద వృక్షాల్ని నరికేస్త్తున్న సందర్భంలో వాట ఫౌండేషన్ అనే సంస్ధ కోర్టు ప్రేమేయం ద్వారా వాట్ని తిరిగి యధా తధంగా నాటే ప్రయత్నం చేసింది. ఇదే ప్రక్రియ కేరళలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్ధ (కే.ఎస్.డి.యం.ఎ)ప్రాంగణంలో కూడా చేపట్టారు.ఈ ప్రయోగం చేసిన హాబిటాట్ టెక్నాలజీ గ్రూప్  వారు అన్నది ఏమిటంటే ఈ ప్రయోగం ఒకటి రెండు చెట్ల కైతే ఫర్వాలేదు కాని చాలా వాటికి చేయాలంటే చాల,శ్రమ వ్యయంతో కూడుకున్న పని అని. ఒక చెట్టుకే సుమారు రూ.20,000 వేలుదాక అవుతుందని అంచనా. అవును దేనినైనా పెకిలించడం సులువు కాని దానిని సంరక్షించడం చాల కష్టం. మరి  ఇటువంటి మలుపుల్ని అర్ధం చేసుకుని అటు వైపు వెళ్ళాలంటే ఒక సంఘటన, దాని మెటాఫర్ ,మెమరి(జ్ఞాపకం) మనని వెంటాడుతూనే వుంటుంది. ఆ ప్రక్రియని గుల్జార్ కంటే గొప్పగా ఎవరు చెప్పలేరు.
ఇపుడు అనుసరిస్తున్న అభివృద్ధిలో సంఘటనల మెటామార్ఫిజం ఎటువైపు వెళుతుందో చెప్పలేం,కారణం ప్యూపా సీతాకోక చిలుకే అవ్వాలని గ్యారెంటి  లేదు.ఏమైనా అవ్వచ్చు ,ఏమి కాకనూ పోవచ్చు.టెక్నాలజీ తో ప్రేరితమైన ప్రక్రియ మన చేతుల్లోనే వుంటుంది అనుకోవడం మూర్ఖత్వం. ప్రకృతికి తనకంటూ ఒక కెమిస్ట్రీ వుంటుంది, అది ఎప్పుడు పేలుతుందో తెలియదు.విపత్తు వల్ల ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసుకో గలుగు తామేమో కాని విపత్తుని ఆపలేము. మన వీధి చివర మలుపు అక్కడే ఆగి పోదు. మన లోని  సంచార శాంతి కపోతాన్ని కుడా అంతరింప చేస్తుంది ఏమో. ఇటువంటి మెలకువల్ని గుల్జార్ చాల సునాయాసంగా పట్టుకుంటాడు. పోయటిక్ ప్రోస్ రాయడంలో ఆయనకు ఆయనే సాటి.
మనం అనుకుంటున్న అభివృద్ధి కూడా అద్దాల కలలానే వుంటాయి.
అద్దాల కలలు
-గుల్జార్
చూడు మెల్లిగా నడువు, ఇంకా మెల్లిగా
చూడు, అలోచించి-అర్ద్ఘం చేసుకుని అడుగు వెయ్యి
పెద్దగా చప్పుడు  చేస్తూ అడుగులెత్తద్దు
అద్దాల కలలు  ఒంటరిగా పడివున్నాయి
కలలు విరిగిపోతాయేమో, మేల్కుంటాయేమో
ఎవరైనా మేల్కుంటారు కలలు మాత్రం చనిపోతాయి
(అనుసృజన-జి. సత్య శ్రీనివాస్)

అవును అభివృద్ధి కోసం కొందరి కలల్ని, అనేక మందిని నిర్జీవుల్ని చేస్తున్నాం, కొందరి కలల ఆశయాల కోసం. అందుకే నా కనిపిస్తుంది పర్యావరణ కవిత్వం అన్నది ఒక నెరేటివ్ పరిశోధన ప్రక్రియ. ఇందులో ఒక రోజు ,రెండు రోజుల కధకంటే కొనసాగబోయే ప్రక్రియని ముగింపు లేని ముగింపు గా కొనసాగింప చేయడం అంతర్లీన సూత్రమని. అందుకే ప్రత్యేకించి ఇదే పర్యావరణ కవిత్వం అని చెప్పలేం. ఆ స్పృహ అంతర్లీన సూత్రంగా ప్రవహించాలి.మేల్కుని కూడా కలలు కనాలి.
Tuesday, 28 July 2015 0 comments By: satyasrinivasg

నగరీకరణ ప్రకృతి- అంతరిస్తున్న నిశ్శబ్దం

అన్ని పాటలలో ప్రశిష్టమైనది
పక్షి పాట
నిశ్శబ్దంలో, కాని ముందుగా
నీలో నిశ్శబ్దం వుండాలి.
-వెండెల్ బెర్రీ
( అనుసృజన జి. సత్య శ్రీనివాస్)

మనం మానవాళి కోరికలకు అనుగుణంగా  ప్రకృతిని మల్చుకుంటే, మనం మన పరిమితుల్ని అద్దంగా మార్చుకునే ప్రమాదాన్ని సృష్టించుకుంటాం .అని జాన్ గ్రే అంటాడు. అవును పురోగతి అంటూ మట్టికి శ్వాస లేకుండా చేస్తే మనలో అంతరించేది  మనలోని యోగ నిశ్శబ్దం. అప్పుడు శ్వాస  ఉచ్చ్వాస,నిశ్వాస శబ్దంనుండి పుట్టే  కవిత్వం, ముందు తరాలకు మనం ఇచ్చే వీలునామా కాదు, మరణ వాంగ్మూలం.

కవిత్వ తత్వం కోల్పోనప్పుడు కవిత్వం కోల్పోవడంలో ఆశ్చర్యం లేదు. చరిత్ర కవులకు పోషకులు  అరుదనే చెపుతుంది. కారణం కవిత్వం అనేది వినోదం కాదు అందుకే అప్పటికి ఎప్పటికి దానికి ధనం కరువే. దాని ఇంధనం ప్రకృతిగా ఇమిడిపోయిన ని శబ్దగోష.   ఆ ప్రకృతిని  వెతుక్కుంటూ రాసుకుంటూ పోతున్నాం. శ్వాస , గుండెల చకుముకి రాళ్ళ నుండి  పుట్టే  నిప్పు ఇది. రోజురోజుకి పెరిగిపోతున్న పరాధీనత్వం నుండి బయట పడేసే యోగ ముద్ర..పర్యావరణ కవిత్వంలో బహుశా ఎక్కువ శాతం వున్న అంశం పరాధీనత్వమే.  సామాజిక పరిణామంలో అత్యున్నత దశ నగరీకరణం అన్న సిద్ధాంతం అయితే ,ఇదే చివారఖరి దశ అని గుబులు కుడా పుట్టించింది.

దీని పురోగతి నలుదిశలా వ్యాపించలేదు. ఇలా ఎందుకనిపిస్తోంది అంటే చాల మారుమూల గ్రామాలు తిరిగాను ,రోడ్లు వుండవు ఏమీ వుండవు కాని అక్కడి సంస్కృతి మాత్రం  ఇది పాత  వూరు, ఇది కొత్త వూరు అని ఒకే ప్రాంతాన్ని విభజించి చూడదు. ఇది కేవలం నగరాలలోనే కనిపిస్తుంది. ఓ పురానా  షెహర్ ,యే నయా  షెహర్’ ( అది పాత నగరం ఇది కొత్త నగరం). నదికి ఆవలి పాత, ఈవల కొత్త . ఏ నగరంలో నైనా  నదే   కొత్త పాతల మధ్య సరిహద్దు రేఖ. మరి ఇది అద్దంలోని మన పరిమితుల ప్రతిబింబమే  కదా. 

ఇప్పుడు ప్రపంచం విస్తారమైన  నియంత్రణలేని ప్రయోగశాల, ఇందులో అసంఖ్యాక ప్రయోగాలు నిరంతరం జరుగుతూనే వున్నాయి. ఆ ప్రయోగాల ప్రభావం మనలోని ప్రశాంతమైన నిశబ్ద గీతాన్ని రణ గొణ ధ్వని గా మార్చేస్తోంది. ఈ రణ గొణ  ధ్వనిలో  మనతో బాటు మనలాగే  అపార్ట్ మెంటులో  మిగిలి పోయిన పావురాళ్ళు కొన్ని గుత్రున్ ,గుత్రున్  అని శబ్దం చేస్తు వుంటాయి. వాటి పాటల్లా వీ ఆర్ ఇన్ కస్టడి. ప్రకృతినుండి  పరాధీనం అయిన తర్వాత ప్రతి పక్షి పాటలోని అర్ధం  ఇదే. అందుకే పశ్చాతాపంతో వాటికిన్ని గింజలు జల్లుతూ వుంటాం, ఏమి సాధించాం ఏమి కోల్పోయామని అన్న నిశబ్దపు ఆలోచనలో. దానిని -ఎల్లెన్ గిన్స్ బర్గ్  ఇలా వ్యక్తపరిచారు...


చాల ఎక్కువ ,
చాల తక్కువ
-ఎల్లెన్ గిన్స్ బర్గ్

మరి ఎక్కువ పరిశ్రమలు
చాల తినడం
చాల ఎక్కువ బియర్
చాల ఎక్కువ సిగరెట్లు
చాల ఎక్కువ తత్వం
చాల ఎక్కువ ఆలోచనా ధోరణులు
సరిపోని గదులు
తక్కువ చెట్లు
మరి ఎక్కువ పోలీసులు
మితిమీరిన కంప్యూటర్లు
మరి ఎక్కువ హై ఫై
మరి ఎక్కువ పంది మాంసం
మరి ఎక్కువ కాఫీ
మరి ఎక్కువ పొగ
మసిబారిన పై కప్పులు
మరి ఎక్కువ అతివినయం
చాల బానికడుపులు
చాల ఎక్కువ వ్యాపార దుస్తులు
చాల ఎక్కువ కాగితం పైన పనులు
చాల ఎక్కువ పత్రికలు
ఎక్కువ మంది అలసిన కార్మికులు
రైళ్లల్లో
ఎక్కువ వృద్దుల  హత్యలు
ఎక్కువ మంది వెర్రి విద్యార్ధులు
చాలని తోటలు
చాలని యాపిల్ పండ్లు
విపరీతమైన డబ్బు
ఎక్కువ మంది పేదలు
ఓటు హక్కులేని శరణార్ధులు
ఎక్కువ లోహాలు
ఎక్కువ కొవ్వు
మరి ఎక్కువ హాస్యం
అతి తక్కువ ధ్యానం
( అనుసృజన జి. సత్య శ్రీనివాస్)


నగరీకరణాన్ని, అభివృద్ధి ,అభివృద్ధి ప్రకృతిని అతి క్లుప్తత తో చెప్పడం కష్టం ,ఆ శైలి ఈ కవితలో వుంది.విస్తారమైన మైదానాన్ని ఒక్క చూపులో పొదిగినట్టు. ఇదంతా స్లో పాయిజన్ ప్రాసెస్. అందులోని చేదు నిజాల్ని మింగడం క్రమేణా అలవాటైపోతోంది. నగరీకరణం అనివార్యం అయినప్పుడు మనః చెరశాలనుండి వచ్చే వాక్యం హరిత హారానికి మట్టి రేణువవుతే  చాలు.     
Tuesday, 21 July 2015 0 comments By: satyasrinivasg

నగరీకరణ ప్రకృతి-పరాధీన ప్రకృతి

ఫ్రిడ్రిచ్ రాత్జేల్ సైంటిఫిక్ డిటర్మినిజం సృష్టికర్త క్లాసికల్ జియోగ్రాఫికల్ డిటర్మినిజంని సోషల్ డార్వినిజం తో ముడిపెట్టి జీవ వ్యవస్ధ సిద్ధాంతాన్ని పేర్కొన్నాడు.దాని ప్రకారం జీవి లేక ప్రాణి తన జీవనాన్ని భూమితో అనుసంధాన పర్చుకుంటుంది,అది రోజు రోజుకి భౌగోళిక  విస్తృతిని ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది.  రాత్జేల్ ప్రకారం ఒకే రక మైన  ప్రదేశాలు ఒకే రకమైన జీవన తీరుని ఏర్పరుస్తాయి.అభివృద్ధిలో భాగంగా మానవాళి భౌగోళిక విస్తృతిని పెంచుకుంది, పెంచుకుంటూ  పోతుంది. ఈ క్రమంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలన్నీఒకే రూపురేఖలు సంతరించుకుంటూ పోతాయి. గతంలో వాటి భౌగోళిక, పర్యావరణానికి అనుకూలంగా ఏర్పడిన వ్యవస్ధల స్ధానం లో ఒకే రకమైన నివాస,వాణిజ్య,పరిశ్రమల సముదాయాలు ఏర్పడుతాయి. ఈ ప్రక్రియ అంతా ఒక మొనాటనీ గా ప్రబలుతుంది. అప్పుడు వైవిధ్యం అంటే కేవలం ఎక్కువ ,తక్కువ శక్తిని వియోగించడంలోనే వ్యత్యాసాలు వుంటాయి. ముఖ్యంగా డబ్బు, ఇతర ఇంధనం.శక్తిని తీవ్ర స్ధాయిలో వినియోగిస్తాం. ఈ వినియోగం వాతావరణం లోని ఉష్నోగ్రతల్నే కాదు, సామాజిక ఉష్నోగ్రతల్ని పెంచుతుంది. ఈ సంస్కృతి నుండి పుట్టుకొచ్చింది పరాధీనత్వం(alienation).

నగరీకరణతో బాటు పర్యావరణ కవిత్వంలో ఉద్యమ, విధ్వంసం, కవిత్వానికి కంటే  ముందుగానే వచ్చిన కవిత్వం ప్రకృతి పరాధీన కవిత్వం. ప్రకృతి కవిత్వం లో ప్రకృతి ఆరాధనా,మమైకత, చోటుచేసుకుంటే ,పరాధీన కవిత్వంలో మన నుండి ,ప్రకృతి నుండి అన్యాక్రాంతులమై దాన్ని కవిత్వం ద్వారా వ్యక్త పర్చుకుంటాం. మనమున్న ప్రాంతం మన జీవనశైలిని,నడవడికని తెలియచేస్తుందిఅని రాత్జేల్ అంటాడు.అవును నగరం అన్నది అసహజ ప్రకృతి, అందులోని సంబంధాలు కూడా అసహజంగా గానే వుంటాయి. ఎదుగుతున్న కొద్ది మనలోని అవయం కుడా ఫాబ్రికేటేడ్ అయినప్పుడు గుండె చప్పుడు ధ్వని మారుతుంది. మనస్సులోని ఊహలు కుడా. ఈ వూహల  
వాతావరణాన్నివర్ణిస్తూ ఉర్దూ ఘజళ్ళు కోకొల్లలు గా వచ్చాయి. అందులో షహరియార్ సీనే మే జలన్... జనం 

మనసుల్లోకి తడి ఆర కుండా  కొనసాగుతుంది.
మనసులో వేదన,కళ్ళల్లో తుఫానులా ఎందుకుంది
ఈ  నగరంలో ప్రతి ఒక్కరు చెల్లాచెదురుగా  ఎందుకున్నారు
గుండె వుంటే కొట్టుకునేందుకు ఒక కారణాన్ని వెతుకుతుంది
రాయిలా  కదలకుండా నిర్జీవంగా ఎందుకుంది
ఒంటరితనపు  గమ్యం ఇదేమిటి  చెప్పండి జనులారా
దారిలేనిదృష్టి  సందేశం  లేకుండా  ఎందుకుంది
ఏంటి నాలో కొత్త విషయం  ఏమైనా కనపడుతోందా
అద్దం నను చూసి విస్తుపోయింది  ఎందుకు
(మూలం-షహరియార్, అనుసృజన- జి.సత్యశ్రినివాస్)

నగరం ,అద్దం రెండు ఒకటే వర్చువల్ ప్రతికల్ని చూపిప్తాయి. ఇక్కడి రూపకం (మెటాఫర్) సీతాకోక చిలుకలు అవ్వడం కాదు,అద్దాల మేడల్లో మన వర్చువల్ ప్రతిబింబాల్ని చూసుకోవడమే.అరబ్ భౌగోళిక శాస్త్ర వేత్తలు ప్రపంచాన్ని  ఏడు భౌగోళిక ప్రాంతాలుగా విభజింఛి  భౌతిక ,సంస్కృతిక లక్షణాల్నివివరించారు. దానితోబాటు స్ధానిక పర్యావరణాన్ని,మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ని మనుషుల చర్యలతో పోల్చారు. సంవృద్దిగా నీరు వున్న చోట  మనషులు ఒక లాగా, నీరు లేని చోట ఒక లాగా ,విస్తారమైన ప్రదేశాల్లో వుండే సంచారులు శక్తి ,ధృడ నిశ్చయం,వివేకంతో బాటు శారీరక ధృడత్వం కల్గి ఉంటారని పేర్కొన్నారు.
నగరం అన్నది ఇతర ప్రాంత పర్యావరణాన్ని అక్కడి వనరుల్ని వినియోగించుకుంటూ ,ఉత్పాదకని సృష్టించే ప్రదేశం. ఇది ఇతర స్ధానిక పర్యావరణాన్ని కృత్రిమంగా మార్చి వినియోగించే  సమాజంగా  ఏర్పడుతుంది. అటువంటి ప్రదేశంలోనుండి మనలో ఉత్పాదన అయ్యేది పరాధీనతే. మన చుట్టూ వున్న   బాహ్య ప్రదేశం మనలాగే విస్తారమవుతున్న రహదారి. ఆ రాహదార్లు ఎలావుంటాయంటే --

ముసుగు

నడిరాత్రిలో
తడిసిన రోడ్డు
పగటి ముసుగుని
తొలిగిస్తుంది
సప్తవర్ణాల్ని
ఏక వర్ణంలో
చూపిస్తుంది
పెరుగుతున్న
ఏకాంత కొలతల్లో
వెడల్పవుతున్న రోడ్లు
రాత్రి పలుకుతుంది
అమ్మమ్మ చెప్పిన కధలు
ప్రేయసితో చేసిన వాగ్దానాలను
నెమరేస్తుంది
రాత్రి మనం
అలసిపోయి నిద్రపోం
ముసుగులు తొలగించి
దాక్కుంటాం
నిజం పలకడానికి
నిర్జీవులమవుతాం
పగలు
అబద్ధాలు చెప్పడానికి
రాత్రి
శ్వాసలు జోడిచుకుంటాం
అందుకే రాత్రి- చీకటి
వీధులు-నిర్మానుష్యం
-జి.సత్య శ్రీనివాస్
(మే,28,95,ట్యాంక్ బండ్,న్యూ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్,) 

రాత్రి నగరంలో తిరుగుతునప్పుడు మన వెన్నంటే వచ్చే మన నియోన్ కాంతి నీడ ఎ దిల్ ఎ క్యా కరూన్ అని మజాజ్ గజల్...
నగరం రాత్రి నేను
ఏమి తోచక  గమ్యంలేక  తిరుగుతాను
తళుకు మెరుపులతో మేల్కున్న
వీధుల్లో అవారాగా తిరుగుతాను
ఓ వేదనతో వున్న మనసా నే నేమి చేయను...

అంటూ కోల్పోయిందాన్ని వెతుక్కుంటూ తిరిగే ప్రదేశం ఇది. దీనినే స్మార్ట్ సిటి గా మల్చుకుంటాం కాని ఆ స్మార్ట్ సిటి లో ఏమి ఇమిడి వుందో అబ్దుల్ వాహిద్ కవితలో ...

స్మార్ట్ సిటీ

చెత్త కుండీలో
వేలితో డయల్ చేసే ఫోనుల్లా
పాత ర్యాలీ సైకిలుకు దారి చూపిన కిరోసిన్ బుడ్డిలా
తాతల జేబువాచి స్ప్రింగులా
బండెద్దుకు కొట్టిన నాడాలా
పనిచేయని టచ్ స్క్రీన్ మొబైళ్ళ పక్కనే
విరిగిన అంకెలు 
తలతెగిన కలలు
చెల్లచెదురుగా పడున్నాయి
చెత్తకుండీ వీధుల్లో
రాత్రింబవలు తిరిగే బొద్దింకలు, చీమలు
ఆ కలల మూటలు పోగేసుకుంటున్నాయి
గుండెకుంపటి రాజేసి
నాలుగు కలలు కాల్చుకుని 
ఒకపూట ఆకలి తీర్చుకుని
బతికేసే కొన్ని మెతుకులు...
కలను అమ్ముకుని
కలను కొనుక్కుని
కలను నమ్ముకుని
కలగా మారిన బతుకులు
చెత్తకుండీ నెత్తిమీద
రాజుగారి కిరీటంలా
వీధిలైటు వెలుగులు
విరిగిన గ్రామ్ ఫోను రికార్డు
చిట్లిన డివీడీ డిస్కు
చెట్టాపట్టాలేసుకుని
బతికే నగరం...
(5-2-15,కవి సంఘమం)
మట్టి కల్లుకున్న కొన్ని వేల నాటి సంస్కృతిని మట్టి లేని నగరం త్వరితంగా మార్చేస్తుంది. ప్రకృతిలో చివరాఖరికు వచ్చిన వాళ్ళం మనం, మానవ సమాజం కొసలో  ఏర్పడిన నగర సమాజం ప్రకృతికి మనకి చివరకు మిగిల్చేది పరాధీనతనే.ప్రకృతిలో జీవ వైవిద్యం లేని చోట మోడ్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంతా పచ్చ కాగితమే. నగరం ఒక హ్యుమేన్ జూ. 
Tuesday, 14 July 2015 0 comments By: satyasrinivasg

నగరీకరణ ప్రకృతి

పర్యావరణ కవిత్వం అన్నది ప్రకృతిలోని జీవవైవిధ్య వ్యవస్ధ అంతరించేటప్పుడు ఆవిర్భవించింది అన్నది ఇకో క్రిటిజం వాదన. అవును ఇది వాస్తవం. మనం సహజమైన ప్రకృతిని కోల్పోయిన తర్వాత నెమరేసుకోవడం.  ఒకానొక కాలంలో నెమరేసుకోవడానికి కనీసం జీవిత కాలంలో ఒక 50 సంవత్సరాలు పట్టేది,కాని ఇప్పుడు ప్రతి రోజూ గతం. మన చుట్టూ వున్నదాన్ని అంత త్వరగా మార్చేగలిగే సాంకేతిక పరిజ్ఞానం వున్న వాళ్ళం. దానితో బాటు నాస్టాల్జియాని అంతే త్వరగా పొంద గల్గుతున్నాం. రాచెల్  కార్సన్ (ప్రముఖ పర్యావరణ ఉద్యమ కారిణి)అన్నట్టుగా వాసన పసిగట్టే ఇంద్రియ జ్ఞానానికి  జ్ఞాపకాల్ని జ్ఞప్తికి తెచ్చుకునే శక్తి అన్నిటికంటే ఎక్కువ వుంది,కాని మన దౌర్భాగ్యం దానిని అతి తక్కువగా వినియోగిస్తాం. అవును కోల్పోయినప్పుడు, వదిలి వచ్చినప్పుడు మాత్రమే మన ప్రయాణంలో మన తో బాటు వచ్చే గాలిలో వాట్ని స్పృశిస్తూ కాలం వెళ్ళదీస్తాం.
మనం ఇప్పుడు  ముని వళ్ళ కొసళ్ళతో సంభాషణని కొనసాగించే ఆప్దారులం. ఈ ఆప్ ని జోడింజుకున్న మొబైల్  జీవితం మనలోని ,చుట్టు పక్కల ప్రకృతిని  ఎంత ఖననం చేస్తోందో అర్ధం కావడం లేదు. పచ్చదనం కేవలం ప్రకృతి లోని ఆకు అలమలు కావు అది దృష్టి అని అద్భుతంగా వివరించిన పచ్చని కవిత...
పచ్చదనం
ఉషోదయం ఆకుపచ్చని ఆపిల్ రంగులో,
ఆకాశం సూర్యుడిలో పచ్చని మధువు పొదిగుంచింది,
వీటి నడుమ చంద్రుడు పైడిరంగు పూరేకు.
ఆమె కనులు తెరిచింది,పచ్చదనం
అవి మెరుస్తూ, పూలలా విచ్చుకున్నాయి,
మొదటిసారిగా, మొట్టమొదటిసారిగా చూసాను.
(1914,అచ్చయిన కవిత, కవి పేరు తెలియదు, అనుసృజన - జి. సత్య శ్రీనివాస్)
ఆకు పచ్చ చంద్రుడు అని వర్ణించాం,కాని అరుదుగా ఆకాశాన్ని ,ప్రేమని పచ్చదనంతో  వర్ణించడం జరుగుతుంది. అది చెట్ల ఆకుల గొడుగుకింద నుంచుని వాటి కొసల నుండి రాలే కాంతి చుక్కలనుండి  చూస్తే తప్ప తెలియదు. పాబ్లో నెరుడా  వాక్యాల్లో , మాటల్లో తెలుస్తుంది.
పాబ్లో నెరుడా  ఒక కవితని ముగించిన తీరు  నేను కిందనుండి వచ్చాను, భూమి నుండి భూమి,మనుషులు,కవిత్వం అంతా ఒక లోతైన కనిపించని బంధాల్లో  ఇమిడివుంది. భూమి పులకించినప్పుడు,మనుషులు స్వేఛ్చా గాలి పీలుస్తారు,కవులు పాడి దారి చూపుతారు.
ఇదే తీరు ఇస్మాయిల్ చిలకలు వాలిన చెట్టు కవితలో ఇలా  ప్రస్తావిస్తాడు
చిలకలు వాలిన చెట్టు
కిచకిచమని శబ్ధమైతే
కిటికిలోంచి చూసాను.
ఎప్పటిలాగే చెట్టు
గుప్పిట విప్పి నిలుచుంది.
మరెక్కడిదీ చప్పుడు?
పరకాయించి చూశాను.
పచ్చటి చీకట్లో
మంటేదో ఎర్రగా కదిలింది.
గుట్టు తెలిసింది!
చెట్టునిండా ఉన్నట్టున్నాయి.
గుబురంతా వెతికి వీటిని
గుర్తించడం ఒక సరదా.
ముక్కుల దీపశిఖలవల్ల
ఒక్కొక్క చిలకనే పోలుస్తుంటే
తెలిసిందప్పుడు నాకు
చిలకలు వాలిన చెట్టు
లోతైన కావ్యం
లాంటిదని.
అవును పచ్చటి చీకట్లో చికలు వాలిన చెట్టు లోతైన కావ్యం ,ఇది చూపించిన కిటికీని మూసేసిన నగరీకరణ ప్రకృతి పరిస్ధితి  నుండి వచ్చే మాట,రాసే వాక్యం ఒక వ్యధా గీతంగానే మారుతుంది.
దానిని ఖైఫి ఆజ్మి ఇలా వివరించాడు
పక్షులు యిలా...
పక్షులు యిలా వూరికే గోల చేయవు
నగర గాలి అడవికి సోకింది
నేలపచ్చంచుని నమిలే వాళ్ళ కోరిక
చందన కాష్టంలోధగ్ధమవ్వాలని
ముళ్ళకు సైతం రక్తాన్ని
రుచింపచేసే వాళ్ళకి
వసంతగీతం సైరన్ మోత
అడవులొదిలి వలసపోయే
దాహార్తులకు
ఎండమావుల సముద్రయానం
చింతల రెక్కలతో
కరెంట్ తీగమీదున్న
ఏకాకికి తెలుసు
అడవి పరాయిదైందని
(మూలం ఖైఫీ ఆజ్మి షోర్ యుహికీ,
స్వేచ్చానువాదం జి. సత్య శ్రీనివాస్, ఆగస్టు-97)
ఆధునికతకు నగరీకరణను పరాకాష్టగా భావించడం అభివృద్ధి నిర్వచనం ఇది ‘అమృత్’(నగర అభివృద్ధి యోచన) సంకల్పంగా భావిస్తాం. నగరీకరణ చెందకూడదు అనట్లేదు, చరిత్రలో నగర,రాజధాని నిర్మాణాలు ఆయా భౌగోళిక స్వరూపాన్ని ,భౌగోళిక వనరులను బట్టి జరిగాయి. అభివృద్ధి చెందాయి. నేడు దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు రాజకీయ,పారిశ్రామిక అనివార్య ప్రేరకాలు ఆయా ప్రాంత రాజధాని నగరాలే. పని కట్టుకుని నగరీకరణ అభివృద్ధి  వెంటే పడితే అది భూమిని,నేలను, జీవ వ్యవస్ధను మింగేస్తుంది.  అది జీవంలేని ఆర్ధిక శాస్త్ర స్తోత్రం. ఇకోనామిక్స్ కి విరుద్ధం. భౌగోళిక శాస్త్రం ప్రకారం ,భౌగోళిక ఆర్ధిక సిద్ధాంతం అనుసారం, నగరం లోని నేల కల్చరల్ వేస్ట్ అంటే నిర్జీవమైన నేల.  ఇది ఎంత విస్తృతంగా విస్తరిస్తే అంతే విస్తృతంగా ప్రకృతి రూపు రేఖలు మారిపోతాయి.
మరి ఈ నేలనుండి పుట్టుకొచ్చే  మాటలు కలిసి నప్పడు, విడిపోయినప్పుడు మధ్యన జరిగే మునివేళ్ళ కొసల కరచాలనం నడుమ జరిగే చర్చలే తప్ప సంభాషణలు కావు. నగ్న మొహాలు (1990 లో రాసుకున్న) నా కవితలోని పంక్తులు జ్ఞాపకం వస్తాయి అవి...
వేళ్ళ చివర్న మొహాలు
పొదిగివుంటాయి
అడవిలో రాలిన
ఆకుల మీద నడుస్తున్న
పాదాల నీడ
భూమి పొరలా(పంక్తులు1-6)
వేళ్ళ చివర మొహాలకి
కళ్ళు వుండవు
తమ మొహాల్ని
మొహంలేని కళ్ళలోనే
చూసుకుంటాయి
 వేళ్ళ మొహాలు
మట్టి వుండల్ని
దొర్లించుకుంటూ నడిచే
చూపుడు కళ్ళు(13-21 పంక్తులు)
అందుకే కాబోలు  వుయ్ ఆర్  పర్ఫెక్ట్, స్మార్ట్ ఆప్స్ అండ్ నేకేడ్ ఏప్స్.