Tuesday 14 July 2015 By: satyasrinivasg

నగరీకరణ ప్రకృతి

పర్యావరణ కవిత్వం అన్నది ప్రకృతిలోని జీవవైవిధ్య వ్యవస్ధ అంతరించేటప్పుడు ఆవిర్భవించింది అన్నది ఇకో క్రిటిజం వాదన. అవును ఇది వాస్తవం. మనం సహజమైన ప్రకృతిని కోల్పోయిన తర్వాత నెమరేసుకోవడం.  ఒకానొక కాలంలో నెమరేసుకోవడానికి కనీసం జీవిత కాలంలో ఒక 50 సంవత్సరాలు పట్టేది,కాని ఇప్పుడు ప్రతి రోజూ గతం. మన చుట్టూ వున్నదాన్ని అంత త్వరగా మార్చేగలిగే సాంకేతిక పరిజ్ఞానం వున్న వాళ్ళం. దానితో బాటు నాస్టాల్జియాని అంతే త్వరగా పొంద గల్గుతున్నాం. రాచెల్  కార్సన్ (ప్రముఖ పర్యావరణ ఉద్యమ కారిణి)అన్నట్టుగా వాసన పసిగట్టే ఇంద్రియ జ్ఞానానికి  జ్ఞాపకాల్ని జ్ఞప్తికి తెచ్చుకునే శక్తి అన్నిటికంటే ఎక్కువ వుంది,కాని మన దౌర్భాగ్యం దానిని అతి తక్కువగా వినియోగిస్తాం. అవును కోల్పోయినప్పుడు, వదిలి వచ్చినప్పుడు మాత్రమే మన ప్రయాణంలో మన తో బాటు వచ్చే గాలిలో వాట్ని స్పృశిస్తూ కాలం వెళ్ళదీస్తాం.
మనం ఇప్పుడు  ముని వళ్ళ కొసళ్ళతో సంభాషణని కొనసాగించే ఆప్దారులం. ఈ ఆప్ ని జోడింజుకున్న మొబైల్  జీవితం మనలోని ,చుట్టు పక్కల ప్రకృతిని  ఎంత ఖననం చేస్తోందో అర్ధం కావడం లేదు. పచ్చదనం కేవలం ప్రకృతి లోని ఆకు అలమలు కావు అది దృష్టి అని అద్భుతంగా వివరించిన పచ్చని కవిత...
పచ్చదనం
ఉషోదయం ఆకుపచ్చని ఆపిల్ రంగులో,
ఆకాశం సూర్యుడిలో పచ్చని మధువు పొదిగుంచింది,
వీటి నడుమ చంద్రుడు పైడిరంగు పూరేకు.
ఆమె కనులు తెరిచింది,పచ్చదనం
అవి మెరుస్తూ, పూలలా విచ్చుకున్నాయి,
మొదటిసారిగా, మొట్టమొదటిసారిగా చూసాను.
(1914,అచ్చయిన కవిత, కవి పేరు తెలియదు, అనుసృజన - జి. సత్య శ్రీనివాస్)
ఆకు పచ్చ చంద్రుడు అని వర్ణించాం,కాని అరుదుగా ఆకాశాన్ని ,ప్రేమని పచ్చదనంతో  వర్ణించడం జరుగుతుంది. అది చెట్ల ఆకుల గొడుగుకింద నుంచుని వాటి కొసల నుండి రాలే కాంతి చుక్కలనుండి  చూస్తే తప్ప తెలియదు. పాబ్లో నెరుడా  వాక్యాల్లో , మాటల్లో తెలుస్తుంది.
పాబ్లో నెరుడా  ఒక కవితని ముగించిన తీరు  నేను కిందనుండి వచ్చాను, భూమి నుండి భూమి,మనుషులు,కవిత్వం అంతా ఒక లోతైన కనిపించని బంధాల్లో  ఇమిడివుంది. భూమి పులకించినప్పుడు,మనుషులు స్వేఛ్చా గాలి పీలుస్తారు,కవులు పాడి దారి చూపుతారు.
ఇదే తీరు ఇస్మాయిల్ చిలకలు వాలిన చెట్టు కవితలో ఇలా  ప్రస్తావిస్తాడు
చిలకలు వాలిన చెట్టు
కిచకిచమని శబ్ధమైతే
కిటికిలోంచి చూసాను.
ఎప్పటిలాగే చెట్టు
గుప్పిట విప్పి నిలుచుంది.
మరెక్కడిదీ చప్పుడు?
పరకాయించి చూశాను.
పచ్చటి చీకట్లో
మంటేదో ఎర్రగా కదిలింది.
గుట్టు తెలిసింది!
చెట్టునిండా ఉన్నట్టున్నాయి.
గుబురంతా వెతికి వీటిని
గుర్తించడం ఒక సరదా.
ముక్కుల దీపశిఖలవల్ల
ఒక్కొక్క చిలకనే పోలుస్తుంటే
తెలిసిందప్పుడు నాకు
చిలకలు వాలిన చెట్టు
లోతైన కావ్యం
లాంటిదని.
అవును పచ్చటి చీకట్లో చికలు వాలిన చెట్టు లోతైన కావ్యం ,ఇది చూపించిన కిటికీని మూసేసిన నగరీకరణ ప్రకృతి పరిస్ధితి  నుండి వచ్చే మాట,రాసే వాక్యం ఒక వ్యధా గీతంగానే మారుతుంది.
దానిని ఖైఫి ఆజ్మి ఇలా వివరించాడు
పక్షులు యిలా...
పక్షులు యిలా వూరికే గోల చేయవు
నగర గాలి అడవికి సోకింది
నేలపచ్చంచుని నమిలే వాళ్ళ కోరిక
చందన కాష్టంలోధగ్ధమవ్వాలని
ముళ్ళకు సైతం రక్తాన్ని
రుచింపచేసే వాళ్ళకి
వసంతగీతం సైరన్ మోత
అడవులొదిలి వలసపోయే
దాహార్తులకు
ఎండమావుల సముద్రయానం
చింతల రెక్కలతో
కరెంట్ తీగమీదున్న
ఏకాకికి తెలుసు
అడవి పరాయిదైందని
(మూలం ఖైఫీ ఆజ్మి షోర్ యుహికీ,
స్వేచ్చానువాదం జి. సత్య శ్రీనివాస్, ఆగస్టు-97)
ఆధునికతకు నగరీకరణను పరాకాష్టగా భావించడం అభివృద్ధి నిర్వచనం ఇది ‘అమృత్’(నగర అభివృద్ధి యోచన) సంకల్పంగా భావిస్తాం. నగరీకరణ చెందకూడదు అనట్లేదు, చరిత్రలో నగర,రాజధాని నిర్మాణాలు ఆయా భౌగోళిక స్వరూపాన్ని ,భౌగోళిక వనరులను బట్టి జరిగాయి. అభివృద్ధి చెందాయి. నేడు దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు రాజకీయ,పారిశ్రామిక అనివార్య ప్రేరకాలు ఆయా ప్రాంత రాజధాని నగరాలే. పని కట్టుకుని నగరీకరణ అభివృద్ధి  వెంటే పడితే అది భూమిని,నేలను, జీవ వ్యవస్ధను మింగేస్తుంది.  అది జీవంలేని ఆర్ధిక శాస్త్ర స్తోత్రం. ఇకోనామిక్స్ కి విరుద్ధం. భౌగోళిక శాస్త్రం ప్రకారం ,భౌగోళిక ఆర్ధిక సిద్ధాంతం అనుసారం, నగరం లోని నేల కల్చరల్ వేస్ట్ అంటే నిర్జీవమైన నేల.  ఇది ఎంత విస్తృతంగా విస్తరిస్తే అంతే విస్తృతంగా ప్రకృతి రూపు రేఖలు మారిపోతాయి.
మరి ఈ నేలనుండి పుట్టుకొచ్చే  మాటలు కలిసి నప్పడు, విడిపోయినప్పుడు మధ్యన జరిగే మునివేళ్ళ కొసల కరచాలనం నడుమ జరిగే చర్చలే తప్ప సంభాషణలు కావు. నగ్న మొహాలు (1990 లో రాసుకున్న) నా కవితలోని పంక్తులు జ్ఞాపకం వస్తాయి అవి...
వేళ్ళ చివర్న మొహాలు
పొదిగివుంటాయి
అడవిలో రాలిన
ఆకుల మీద నడుస్తున్న
పాదాల నీడ
భూమి పొరలా(పంక్తులు1-6)
వేళ్ళ చివర మొహాలకి
కళ్ళు వుండవు
తమ మొహాల్ని
మొహంలేని కళ్ళలోనే
చూసుకుంటాయి
 వేళ్ళ మొహాలు
మట్టి వుండల్ని
దొర్లించుకుంటూ నడిచే
చూపుడు కళ్ళు(13-21 పంక్తులు)
అందుకే కాబోలు  వుయ్ ఆర్  పర్ఫెక్ట్, స్మార్ట్ ఆప్స్ అండ్ నేకేడ్ ఏప్స్.

0 comments:

Post a Comment