Thursday, 18 September 2014 0 comments By: satyasrinivasg

నిర్వచనాన్ని నిర్వచించడం - మూల వాసుల అంతరంగాలు-3


పర్యావరణ కవిత్వం అన్నది  ఈ మధ్యనే వెలుగులోకి వస్తున్న అంశం. అంటే ప్రకృతికి సంబంధించిన కవిత్వం పూర్వం లేదా అంటే అప్పుడూ వుంది. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటి అంటే, వికిపీడియా నిర్వచనం తో మొదలుపెడదాం. ఇకో పోయెట్రీ - ప్రకృతి తో సంబంధాన్ని పునరావృతం చేసుకునే ధ్వని,ప్రకృతి విధ్వంసం పై  ప్రతిఘటన, మెరుగైన ,ఆరోగ్యకరమైన ప్రకృతి కోసం పర్యావరణ సంరక్షణ ప్రణాళికల్ని, చట్టాల్ని   ప్రోద్భలించడం.( Naseer76). గతంలో పర్యావరణం గురించి రాసినప్పటికీ, ఈమధ్యనే ఇది కొత్త ఒరవడిగా ,నూతన పద సృష్టి గా ఎదుగుతోంది.,ముఖ్యంగా ఆంగ్ల కవిత్వంలో స్ఫురిస్తోంది.జేమ్స్ ఎన్గల్ హార్ట్ చెప్పిన వివరణ లోని కీలక అంశం , ఇతర సిద్దాంతాల్లాగానే (మార్క్స్, స్త్రీవాదం, వగైరా ) సామాజిక  బాధ్యతతో కూడిన ప్రక్రియ. ఇకో పోయెట్రీ  అన్నది విలువలతో కూడుకున్నది.
 వాళ్ళు ఇదే నిర్వచనమని అనరు,కాని ఈ నిర్వచనాన్ని లోతుగా పరిశీలించాలి. ఎందుకంటే ఇది ఎక్కువ శాతం స్టేట్ నిర్వచనంగా కనపడుతుంది. మూలవాసుల  ప్రకృతి ,సంస్కృతి నిర్మాణానికి, స్టేట్ ప్రకృతి సంస్కృతి నిర్మాణానికి మధ్యన పొంతన కుదరరడం లేదు. దీని మధ్యన పర్యావరణ కవిత్వానికి,కవిత్వ పర్యావరణానికి వున్నంత లోతైన అగాధం వుంది. రెండూ పోషకుల పైనే ఆధారపడి వుంటాయి.   ఎటొచ్చీ ధృక్కోణాలే వేరు.
ఇది ఇప్పుడే అని కాదు,అనాదిగా ధృక్పధాల్లో  తేడాలున్నాయి. దీనికి బీజం, వనరుల్ని  అంచనా కట్టే  బిన్న ఆర్ధిక   క్పధాలు. ప్రకృతి భావాన్ని కవిత్వంగా  వ్యక్తపర్చడమంటే వైవిధ్యమైన దారిన సాగే  నిరంతర అన్వేషణ. వలస  పక్షుల  వైతరణి తోవ.  ఇది ప్రణాళికలు  ,చట్టాలకంటే విస్త్రుతమైనది .పాట పాటతో  ముచ్చటించుకోవడం, కవిత కవితతో పెనవేసుకోడం, పర్యావరణ కవిత్వం  కవిత్వ  పర్యావరణమవ్వడం. ఇది మన అంతర్లీన ,బాహ్య ప్రకృతి తో బాటు మన స్పేస్ ,టైంని ఇక్యం చేసే భావ ప్రకటన. అంతే గాని మొక్కలు నాటడం వల్ల అడవులు పెరుగుతాయి అన్న ప్రచారాల వల్ల కాదు. మనలో కవిత్వ ప్రకృతి బీజం లేనప్పుడు పచ్చని  ఆలోచన మొలకెత్తదు. ఒక్టావో పాజ్ ఈ విషయాన్నే ముచ్చటగా ప్రస్తావించాడు, ‘జీవితం నుండి కవిత్వాన్ని రాసుకోవడం కంటె, కవిత్వాన్ని జీవితంగా మలుచుకోవడం ఉత్తమం కదా’ అని.
పర్యావరణ పరిశీలనలో వైవిధ్యమైన దృష్టి అవసరం. చుట్టూ వున్న ఆవరణ మన సామాజిక వ్యవస్థలని ఏర్పరుస్తుంది.ఇవి స్థిరంగా ఉండేవి కావు. దీనిని విస్మరించిన చూపులోని  వాస్తవికత కూడా  అవాస్తికతే.ఆధునిక దృక్కోణంలోని వాస్తవికతలోని కల్పితాలు,మూలవాసుల కాల్పనికతలోని   వాస్తవికత మధ్య చాల వ్యత్యాసం వుంది. అందుకే ప్రకృతిని చూసే కోణంలో   వైరుధ్యం.ఆధునికతలో  నేర్చుకున్నది వాస్తవాన్ని  ఒక రూపంగా జమకట్టడం. నిజం అన్నది ఒక వస్తు రూపంలోనే చూడడం, ఈ ఆలోచన తీరు చిన్నప్పటి  నుండి కధలు ,పాటలు ద్వారా మనలో ఏర్పడ్డాయి. ఉదా: అడవుల వర్ణనలో    కాకులు దూరని కారడవి,చీమలు దూరని చిట్టడవి అని విన్నాం. ఇది చెప్పిన తీరు ,ధ్వని లోనుండి పుట్టిన ఆ వర్ణనని  ఒక మిస్టికల్ వ్యవస్థలు గా మనం భుజించాం, నెమరేసుకుంటాం .ఆదివాసులకి కాకులు దూరని కారడవి అంటే ఎత్తైయిన చెట్లున్న అడవి,చీమలు దూరని అడవి అంటే తుప్పలు,పొదలున్న అడవి.  కాకులు దూరని కారడవిలో వున్న ఆదివాసులు చీమలు దూరని అడవిచూస్తే అడవి గా అస్వాదించలేరు. ఒక సారి తూర్పు కనమల ప్రాంతం ఆదివాసులు రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్  చుట్టూ వున్నఅడవిని చూసి  ఇది ఆడవా  అని ఆశ్చర్య   పోయారు. కాని మనకి  అడవి రూపాలన్ని  భీకరంగానే సృష్టించబడ్డాయి.
ఈ రూపాలు  ప్రకృతి సంస్కృతి నిర్మాణం( nature culture construction) లో ఏర్పడిన ప్రతీకలు.  వీట్ని డి కన్స్ ట్రక్ట్ చేయాలి, దీనికి డి లర్నింగ్ ఆఫ్ హిస్టరీ అవసరం. ప్రకృతిలోని జీవ వైవిధ్యం ఒకే రకమైన ఇమేజస్ని సృష్టించదు.అక్కడి  జీవితం కూడా ఒకే రకంగా వుండదు. కవిత్వం లో ఎంచుకున్న అంశానికి ఒక  ఆవరణ వుంటుంది ,అది తనకంటూ  రూపాన్ని  నిర్మిస్తుంది. పర్యావరణ కవిత్వం ఒక ప్రకృతి  బాషావరణ రూపం . ఇది  మన అనూభూతులు,అనుభవాలతో   నిర్మించున్నాం,పదాలు,వాక్యాలతో ,ప్రతికలతో అల్లిన గూడు. అనుభూతుల అల్లికలో,అనుభవాల అల్లికల్లో చాల వ్యత్యాసం వుంటుంది. ఇది సింపతేటిక్,ఎంపతెటిక్ లో వున్న  తేడా. మూలవాసుల పరిభాషలో ఎంపతెటిక్ ఎక్కువ. పోయిందన్న బాధతో,పశ్చాతాపంతో వ్యక్తీకరణ అగుపించదు.సహజీవనంగా పలుకుతుంది. 

ప్రకృతి  విధ్వంసంలో  అనాదిగా జరుగుతున్నది జీవవైవిధ్య  రూపాల్ని నిర్జీవ ప్రతీకలు గా పెంపొందించే వాతావరణం. ఈ మెటాఫర్ ప్రాసెస్ అంతా  రాజకీయం. అందుకే అడవుల్ని రొమాంటిక్ గా చిత్రీకరిస్తూనే,మూలవాసుల జీవనాన్ని అనాగరింకంగా ప్రచారం చేస్తారు. ఇది వనరుల్ని ఆక్రమించడానికి కీలక ఆయుధం ,వాళ్ళ వనరుల ఉపయోగం నుండి వెలిసిన రూపాల్ని   చిద్రం చేయడం. ప్రకృతి రూపాన్ని మార్చేయడం. దీనిని ఒక ముడిసరుకుగా, విలాసవస్తువుగా సృష్టించడం. భావ  వ్యక్తీకరణలో చిత్రలేఖనం,నృత్యం, శిల్ప కళ,ఆట ,పాట, నటన,కవిత్వం,అన్నీ వనరులే,ఇవి కూడా దురాక్రమణకు   గురయ్యాయి.
అప్పుడు ఆట ,పాట సాముహిక ప్రక్రియ,ఇప్పుడు కొందరు పాడే వాళ్ళు,కొందరు రాసే వాళ్ళు, ఎక్కువ శాతం వినేవాళ్ళు. ప్రకృతి లోని వనరుల్ని ముడి సరుకుగా జమకట్టినప్పుడు అవి మన పంచేద్రియాల్ని అలానే మార్చేస్త్తాయి. పంచభూతాలు   నినాదాల ప్రతిధ్వనులే  అవుతాయి. ఆ దశలో కవిత్వం కేవలం నిర్విజీవ కాగితాలోన్ని అక్షరాల దండ లాగానే మారుతుంది  తప్ప  నాలుక పైన ప్రవహించే  జీవన తేనె నది కాలమవ్వదు.  పర్యావరణ కవిత్వం మంటే  నేలానింగిని  పెనవేసే భూమిలోని నీటి గింజ వేరు,    గోడలకు  వేలాడే పఠం  కాదు.
ఇదంతా చెప్పడానికి కారణం , మెటాఫర్స్  కనుమరుగైపోవడానికి కొన్ని శతాబ్దాలు పడుతుంది, మనలో ఏర్పడ్డ జ్ఞాపకాలు, ప్రతీకలు రాజకీయ వ్యవస్థల నుండి  పుట్టాయి,మూలవాసుల జ్ఞానం నుండి కాదు. పోయిన భూమి ఉపరితల నేల, అడవి పునారావృతం కావు. ఇవి జ్ఞాపకాలే,
కవిత్వ బాష  ప్రాతినిధ్యం  కాదు,నకలు కాదు,ఆకారాల్ని విడతీసి చూడకూడదు, వాట్ని కవిత్వ రూపంలోనే ఆస్వాదించాలి అని క్రీస్తు అనంతరం 2వ  శతాభ్దం  లోని ప్రాకృతి కవులన్న మాట. ఇంతకంటే  నిర్వచనానికి రూపం ఏముంది ? ఈ మిళితం అర్ధమైతే నీటిలో మబ్బులా  కలిసిపోతాం.
ఆకాశం ఒదిగింది
వూరి చెరువులో
ఒక్క తామర పువ్వు నలగలేదు
ఒక్క కొంగ తగ్గలేదు
(గాథాసప్తశతి)
(అనుసృజన)

చూపు సోకేంత నేలాకాశం-మూల వాసుల ఆలోచనలు


“గాలి,వాన, కొండలు,నదులు,అడవులు,పచ్సిక బైళ్ళు,అక్కడ నివాసులు- ఇవన్నీ మన  భౌతిక అవసరాల కంటే మనః స్ధితికి చాలా  అవసరం. “-థామస్ బెర్రీ.
 ప్రకృతి సంస్కృతి నిర్మాణం (nature cultural construction), అదే సమయంలో పర్యావరణాన్ని వినియోగించడం.  ఈ  వినియోగంలో ప్రకృతిని సంస్కృతిగా, సంస్కృతిని ప్రకృతిగా అర్ధం చేసుకోవడం చాలా కీలకమైనది. ప్రకృతి వివిధ రూపాల్లో వుంటుంది. ఇది అంతర్గత,బాహ్య చర్యల వల్ల ఏర్పడుతుంది. మనం కొండంచున నిల్చుని, ఉబికివున్న కొండ చర్యల్ని,లోయను చూస్తునప్పుడు,ఆ దృశ్యంలోని అంతర్లీన చర్యలను,వాటి ప్రతిస్పందనను  గమనించడం,వ్యక్తపరచడం  ముఖ్యం. వాట్ని ఒక క్రియగా చూడాలి   తప్ప కేవలం నామ వాచకంగా కాదు. ఈ దృష్టిని అర్ధం చేస్కున్నపుడే మనం మన చుట్టూ వున్న పరిసరాలని   మచ్చిక చేసుకుంటూ  వాటి రంగునీ, రూపాన్ని,పరిమళాన్ని,స్పర్శని  మనలో ఇముడ్చుకుంటూ మనం అందులో ఇమిడిపోతాం.
ఒక భావన ఆవిర్భవించే స్థలం,కాలంతో బాటు అది విస్ఫోటించి పరివ్యాప్తి చెందే మార్గం అంతే అవసరం. చెట్టుకి బ్రీతింగ్ స్పేస్ ఎంత అవసరమో  కవితకు కూడా అంతే అవసరం. చాల సందర్భాల్లో  మార్గాలే గమ్యాలవుతాయి.
గిరిజన గ్రామాలు  ఎగువన కొండ పోడు,దిగువన గరువులు,పల్లాలు  ప్రాంతంలో చెలక పోడు,చెట్ల మధ్యన  ఇళ్ళు వుంటాయి. కొండ పైనా,కొండమ్మటే పారే వర్షపు నీరుకి అడ్డు కట్టలు వేసి వరి పండించుకుంటారు. ఈ దృశ్యం చూస్తుంటే నక్షత్రాల వెలుగుని ఉదయం మిణుగు సరంగులు పడవల్లో పంచుతూ వెళ్ళుతున్నట్టుతుంది.  ఇది ముఖ్యంగా పాడేరు ప్రాంతంలో కనిపిస్తుంది. ఆ ప్రాంతాన్ని” యేరు తిరిగే భూమి” అంటారు. కొండ పైనా, మధ్యలో,అంచునా ,దోసిళ్ళ అంత నీళ్ళు నిలిచినా వరి పండించుకుంటారు. ఇది ఖమ్మం జిల్లాలోని చింతూరు చుట్టు పక్కల ప్రాంతంలో చూసా. అంతటా ఇదే! భూమి స్వరూపాన్ని బట్టి భూవినియోగం జరుగుతుంది. ఇటువంటి పర్యావరణం గిరిజనుల పోడు వ్యవసాయం,పశువుల పెంపకంలో కనిపిస్తాయి. వారి సంస్కృతి ఎక్కువ శాతం కొండ పోడుతో ముడి పడి వుంది. వాళ్ళ జీవిన విధానంలో ఆహార సేకరణతోపాటు వ్యవసాయం మిళితమై ఉంది. అందుచేత ప్రకృతిలో వున్న జీవ వైవిధ్యంవాళ్ళ సంస్కృతిలోనూ తొణికిసలాడుతుంది. ఏపుగా ఎదిగిన మహా వృక్షాన్ని పోడు చేస్తున్నప్పుడు నరకరు. పేరుకుపోయిన తుప్పనీఆకు రొట్టనీ తొలిచి నేలను శుభ్రం చేస్తారు అంతే. స్థిర-అస్థిర వ్యవస్థల్నికలుపుతూ మరో కొత్త వ్యవస్థను ఏర్పరిచేందుకు దోహదపడేది పోడు వ్యవసాయంగా సూత్రీకరించుకోవచ్చు. ఈ కొత్త వ్యవస్థలోనే గిరిజన సంస్కృతి యావత్తూ ముడిపడి వుంది. పోడుకి సంబంధించిన పాటల్లో ఒకటి-
“తుప్పలు తుప్పలు కొట్టగా ఏమి తుప్పలు కొట్టగా
జాజి రామయ్య తోటలో జామి తుప్పలు కొట్టగా “-తూర్పు గోదావరి గిరిజనుల పాట.
కొండపోడుని ఎకరాల చొప్పున కాకుండా దిగుబడిని బట్టి లెక్క కట్టుకుంటారు. స్థానిక నానుడిలో దిగుబడినికుంజ’ల్లో కొలుస్తారు. 'కుంజ అంటే బస్తా.వారి ప్రాపంచిక దృష్టిలో పుట్టే పదాల్లో అంతర్లీనంగా చర్యలతో  ముడి పడి వుంటాయి. ఈ పదాల్లో ,మాటల్లో  కాలపరిజ్ఞానం తో బాటు,పరిసరాల దృక్పధం వుంటుంది .
పులిని-దారికి దడ్డడు అంటారు,అంటే దారి వెంట నడిచే బలశాలి అని.
నెమలిని అడవికి ఆటగాడు
చెవుల పిల్లి- చేనుకి చేటుగాడు
ఆ జీవుల  పేర్లు వాటి పరిసరాలతో బాటు వాటి క్రియల్ని తెలుపుతాయి. మనం అవి తెలియచెప్పడానికి ఎక్కువగా ప్రో  జ్  వాడుతాం. కానీ వాళ్ళు క్రియని అర్ధం చేసుకుని ప్రతీకలుగా  మారుస్తారు. ఆ ప్రతీకలు సంఘటనని,మెటాఫర్ర్ ని తెలియచేస్తాయి.  
ఇప్పుడు వేగవంతమైన సాంకేతిక పరిజ్ఞానం వల్ల భాషలో మార్పులు కూడా వేగవంత మవుతున్నాయి. ముఖ్యంగా ప్రిటింగ్ టెక్నాలజీ,ఇంటర్ నెట్  పుణ్యమా అని వాక్యాలని,పదాలని పరమితంగా వాడడం   సాగుతోంది. మన బాహ్య పర్యావరణం తో బాటు మన బాషా పర్యావరణం మారుతోంది.  బాష మీద పట్టు, సాంకేతిక పరిజ్ఞానం వుంటే దీని సులువు అర్ధం చేసుకోవచ్చు. ఇది ఇరు వ్యవస్దల  మధ్య జరిగే చర్య .దాని నుండి ఉత్పన్నమయ్యే ప్రక్రియ. ఇది ఎంత సహజంగా వుంటే అంతే సహజమైన పదాలు ,ప్రతీకలు ఏర్పడుతాయి.
వనరుల వినియోగంలో వనరులకి  పునరుత్పత్తి అయ్యే అవకాశం ,తగిన కాలం వుండాలి. డేవిడ్సుజుకి మాటల్లో ప్రతి శ్వాస  ఒక ప్రయత్నం ,మన చుట్టూ వున్న  వాటితో కలిసి  వున్నామన్న నిర్ధారణ .మన పూర్వీకులతో సంబంధాన్ని పునరుద్ధరణ చేసుకోవడం ముందు తరాలకి ఇచ్చే కానుక.మన శ్వాస మన జీవన శ్వాస ,భూమినల్లుకున్న సముద్రపు  గాలి.
మన జీవితంలోకి పిల్లలు వస్తున్నారంటే మనము ఓ పిల్లల ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. బైగా తెగ వారు పిల్లల్ని బానిసలుగా చూడరు. వాళ్లు, వాళ్ళకి సహచరులు,తోటి ఆటగాళ్ళు ,సంతోషాన్ని తెచ్చే వాళ్ళు.వాళ్ళని ఉయ్యాల దేవతైన జాలాని దేవత  కంటే ఎక్కువగా చూసుకుంటారు. పిల్లలు ప్రకృతికి ఆనవాళ్ళు ,వాళ్ళు నడిచే బాట.
బుల్లి బుల్లి కాలి బాటలు చూపుకి కమ్మదనం
మరిన్ని చిన్ని చిన్ని తియ్యని కాలి బాటలకి దార్లు...
(అనుసృజన).
ఇదే దృష్టి లారి బట్లర్  కవితలోనూ కనపడుతుంది...
పిల్లాడు నవ్వుతూ
చెట్టు ఎక్కుతాడు
చెట్టు నవ్వుతూ
పిల్లాడి పైన ఎక్కుతుంది
నవ్వు
చెట్టుని, పిల్లాడిని ఎక్కుతుంది
ఆకులు తుళ్ళుతూ కేరింతలు కొడతాయి.
మన చుట్టూ పచ్చదనం కనుమరుగయ్యిందంటే మనము మోడుబారామనే సంకేతం. జీవితం, కవిత్వం అంటే   త్రీ డైమెన్షన్ ప్రక్రియ. సారాంశాన్ని అన్వయించుకోవడం,  పాఠకుడిని,ప్రకృతిని  జోడించుకోవడం, బాహ్య ప్రాపంచిక దృష్టిని కలగలుపుకోవడం. నా దృష్టిలో ఇదంతా బ్రీతింగ్  స్పేస్. ఇది ఇరుకైన లాభ నష్టాల కాటాలో కొలిచే అంకెల గారడీ  కాదు. ఈ ప్రస్థానంలో నిదా ఫాజ్లి  గజల్‌లో పంక్తులు  జ్ఞప్తికి వస్తాయి . '' దో ఔర్‌ దో కా జోడ్‌ హమేషా చార్‌ కహా హోతాహై, సోఛ్‌ సమజ్‌ వాలోంకో తోడి నాదానీదే మౌలా !''(రెండు రెళ్ల జోడీ నాలుగే అని చెప్పే జ్ఞానులకి కాసింత అమాయకత్వం  ప్రసాదించు దేవా !) ప్రఖ్యాత రష్యన్‌ రచయిత  దాస్తోయెస్కీ నోట్స్ ఫ్రమ్ అండర్ గ్రౌండ్ లో   కూడా ఈ ధ్వనే వినిపిస్తుంది. చుట్టుపక్కల కృత్రిమ పర్యావరణం వుంటే అది మనలో నుండి పాకిన వైరస్, ప్రకృతికి కృత్రిమ తత్త్వం వుండదు, ఇది మోనోకల్చర్ లక్షణం.  మనం ప్రకృతికి ఆ సంసృతి  అంటగడుతాం. అది తిరిగి మనని అదే తీరులో బతికే తీరుని అందిస్తుంది. న్యూటన్ మూడో  సూత్రం.
 1920లో ఎడిత్ వ్యాత్ రీడింగ్ ఆఫ్ పోయెట్రీ అన్న వ్యాసంలో చెప్పింది, ఆధునిక ధోరణిలో  అంశం,ప్రయోగంలో రాసే తీరు ఒకేరకమైన ప్రవాహం గా ఉండడానికి  కారణం కవిత్వంలో  కేవలం మనుగడకు సంబంధించిన తెలిసిన  అంశాలని పదే పదే వాడడం, వాట్ని మెరుగైన తీరులో ప్రస్తావించడం  జరుగుతోంది  తప్ప భూమి పరిభాషని   గొప్పగా  చెప్పే అనంత చిరు పదాల్లోని మాధుర్యాన్ని కొద్దిపాటిగా  కూడా స్పృశించడం లేదు.కవిత్వాన్ని ఆస్వాదించమంటే కోయిల పాట వినడమే.ఈ రెండు తమంతట తాముగా తమ  అందాన్ని,వైవిధ్యాన్ని,పరిధిని చెప్పుకోవు. ఎప్పుడు చెప్పుకుంటాయంటే, వాటి ఆవరణలో చేతులు కట్టుకుని ప్రశాంతంగా కూర్చుని మనస్సు పెట్టి  ఆ పాటని వింటే తప్ప గొంతు విప్పవు.అది వినడానికి   ప్రకృతి వలయంలో మనం అణువంతే అన్నది అర్ధమవ్వాలి ,ఇది తెలిసినప్ప్డుడు ముగింపుకంటే కొనసాగింపు వైపు అడుగులు సాగుతాయి.
 ఇరొక్యుయస్ ల   భూమాతకి కృతజ్ఞత ప్రార్ధన
మనం తల్లికి ,భూమికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం
మనకి మనుగడ ఇచ్చినందుకు
మనం నదులకి,వాగులకి  కృతజ్ఞతలు చెప్పుకుంటాం
మనకి నీళ్ళు ఇచ్చినందుకు
మనం ఔషద  మొక్కలకి కృతజ్ఞతలు చెప్పుకుంటాం
మన రోగ నివారణకి మందులు ఇచ్చినందుకు
మనం చంద్రుడికి, నక్షత్రాలకి కృతజ్ఞతలు చెప్పుకుంటాం
సూర్యుడు లేనప్పుడు తన వెలుగు నిచ్చినందుకు
మళ్ళీ సూర్యుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం
భూమిని తన దివ్య నేత్రంతో చూసుకున్నందుకు
చివరిగా  మళ్ళీ మనం దివ్యాత్మలకు కృతజ్ఞతలు చెప్పుకుంటాం
ఎవరిలో మంఛితనమంతా ఇమడివుందో
ఇంకా తన బిడ్డలకై  అన్నింటినీ  మంచి దారి వైపు నడిపిస్తున్నందుకు.
(అనుసృజన)

 ఈ దారిని చూపించే పర్యావరణ కవిత్వం మన కనురెప్పలకద్దిన పచ్చని కాటుక.

మట్టి గూడు- పర్యావరణ కవిత్వం

మట్టి వేర్లు- మూల వాసుల ఆలోచనలు

సమస్యలున్నాయని పక్షులు పాటలు పాడవు, పాటలున్నాయని పాడతాయి –“అన్నది చైనీస్ సామెత . ఇంద్రధనస్సు చీమల పుట్టనుండి పుడుతుందని గోండ్ల నమ్మకం.మన చుట్టూ వున్న చెట్టు,పుట్ట, వాగు వంక, పోడులో దేవుడున్నాడని పూజించం, అవి మనకు కూడు, గూడూనిస్తాయని పుజిస్తామని విశాఖ జిల్లా,అనంతగిరి  మండలం, ఒలాసి పంచాయతి లోని  నిమ్మలపాడు గిరిజనుడి మాట.
సహజంగా భూమి, ఆకాశం కలయిక రేఖని ఊహిచుంకుంటాం,ఇది భూమి పల్లంగా వుంది అనుకున్నప్పటి నుండి కొనసాగుతోంది. జీవించడానికి ఈ నేల కాక మరొక లోకం వుందని ఆశిస్తాం. అంతా భ్రమణ కాంక్ష.ఈ భ్రమణ కాంక్షని  తీర్చే ఒకానొక వ్యోమనౌక కవిత్వం. ఈ వ్యోమనౌకలో మన ప్రయాణం మన ఆవరణ చుట్టూ అల్లుకున్న మాయతీగలతోనే కొనసాగుతుంది.మొదలు ,అంతం వుండదు. ఇప్పుడు రాసిన కవిత, ఎప్పుడో  రాసినట్టుగానే అనిపిస్తుంది. ఇక పై రాసే వారు కూడా ఇదే వ్యధను రాస్తూవుంటారు.ప్రతీకల్లో మార్పు వుంటుంది, వస్తువులు అవే కావచ్చు.  కవిత ప్రకృతి లోని  మానవ సమజాన్ని అన్వేషిస్తుంది, లేక మానవ సమాజంలోని ప్రకృతిని వెతుకుతుంది.ఒక విధంగా పర్యావరణ కవిత్వం-ప్రదేశాలు, మనం,మనతో,  అంతర్గతo గా,ఇతరులతో సంభా షించుకోవడం.
నాగరికతలో చాలా వాటితో బాటు మనం మచ్చిక చేస్కున్నది అక్షరాన్ని కూడా.ఈ అక్షరం మన వాతావరణాన్ని మార్చేసింది. లిపిలేని భాషలో వుండే ప్రకృతితో మమైకత,ప్రకృతి  పై,సమాజం పై ఆధిపత్యం సాధించడానికి అక్షరం ఓ ఆయుధం కూడా. మళ్ళీ  అదే అక్షరంతో ప్రకృతిని స్మరించుకోవడం జరుగుతోంది. కవిత్వం మనం మనని ,భూమి మీదిక్కడ వున్నాం అని గుర్తుపట్టేందుకు ఒక జి.పి.యస్.మనలోని ప్రకృతి ని రాయడం , దానిని ప్రస్తావించే తీరే పర్యావరణ కవిత్వమనవచ్చు. సహజమైన ప్రకృతి నుండి ,మానవ  ప్రేరిత పర్యావరణం మార్గంగా కృత్రిమ పర్యావరణం లోకి వచ్చాం.
ఈ ప్రస్థానంలోని దశలు  ప్రకృతితో మమైకతతో జీవించడంగా చెప్పుకుంటాం. వునికి, అస్తిత్వ పోరాటాలు చాటుతాం, ప్రకృతిలో విలీనమైన వ్యధను, ప్రకృతి విధ్వంశం , సంరక్షణ గురించి పంచుకుంటాం. ఇదంతా మనలోని ,మన బయట వున్న చెట్టు,పుట్టా, నీరు,నిప్పు,గాలి,మట్టిని అర్ధం చేస్కునే ప్రక్రియ. ఈ ప్రక్రియ వ్యక్తీకరణకు  ఆవరణను మట్టి తివాచీ పై కూర్చుని ఆకాశ మార్గంలో పయనిస్తూ పక్షి కన్నుతో చూడ్డం పర్యావరణ కవిత్వం.
ముందుగా ఈ శీర్షిక మూల వాసుల అంతరంగాల తోనే మొదలెట్టాలన్న ప్రయత్నం .
మూల వాసులు పుట్టుక, చావులను  ప్రకృతి తో అన్వయించు కున్నారు. ఆఫ్రికాలోని హిమబా  అనే గిరిజన  తెగల వాళ్ళు ,బిడ్డ జన్మ తేదీని, పుట్టకతో కాదు,వాళ్ళు గర్భంలో ఏర్పడినప్పటి నుండి కాక ,తల్లి బిడ్డను కనాలనుకున్నప్పటి తేదీ నుండి లెక్కిస్తారు.ఆమె  అలా నిర్ణయించుకున్నప్పుడు , ఒంటరిగా చెట్టు కింద కూర్చుని రాబోయే బిడ్డ పాట వింటుందట.కాబోయే తండ్రికి కూడా  ఆపాట నేర్పిన తర్వాత ఇద్దరూ సంభోగంలో పాల్గొంటారట. బిడ్డ భూమ్మీదకు వచ్చేంతవరకూ ఆ పాట పాడుతూ బిడ్డను ఆహ్వానిస్తారు. ఆమె గర్భిణీ గా వున్నప్పుడు దాయీ లకి, ముసలమ్మలకు,చుట్టు పక్కల వాళ్ళకి, ఇతర గ్రామస్తులకి  ఆ పాట నేర్పిస్తుంది. బిడ్డ పుట్టినప్పుడు అందరూ కలిసి ఆ పాట తో ఆహ్వానిస్తారు. ఆ పాట తో బిడ్డ ఎదుగుతారు.
ఇదంతా ఆధునిక సమాజం దృష్ట్యా చూస్తే చాలా రొమాంటిక్  గా అన్పించొచ్చు. కాని, ఒక ఆర్గానిక్ సొసైటీలోని  ఆలోచనా స్రవంతిలో పాటని,బిడ్డని సమానంగా  చూడడం, పాఠకుడు,శ్రోత, మనలోని  రచయితవ్వడం.  ఈ ప్రక్రియ   అంతా ఒక  ధియేట్రికల్ ఫారం గా అనిపిస్తుంది.(ఇప్పుడు యూరప్ లో పోయట్రీని ధియేటర్ ఫార్మ్  లో పర్ఫాం చేస్తున్నారు)  మన సృజానత్మకతని మనదిగానే కాకుండా అందరితో పంచుకోవడం. 
సహజమైన పర్యావరణం అంటే ఇదే. సృజనాత్మకంగా జీవితాన్ని వ్యక్తపరచడం. కవితాత్మమకంగా  ఆలోచించడం, దాన్ని అన్వయించడం. నా పాటని కూడా నా తెగ పాడుతూ,పెంచడం,  జీవితంలోని నా తప్పొప్పుల్ని చూపడం. చివరి దశలో పాట నా జీవిత చిత్ర పటంలా మిగిలిపోవడం.  
నేటివ్ అమెరికన్ మాటల్లో...

 నేనొక జింకని చంపాను
నేనొక గొల్లభామని  తొక్కేశాను
అది తినే మొక్కల్ని కూడా...
నేను చేపల్ని నీటి నుండి వేరుచేసాను
ఇంకా పక్షుల్ని ఆకాశం నుండి....
నా జీవితం లో  నాకు చావు అవసరం
నా జీవితం
నే చనిపోయిన తర్వాత,జీవితాన్ని ఇవ్వాలి
నన్ను పోషించిన వాటికి
భూమి నా శరీరాన్ని తనలో ఇముడ్చుకుంటుంది
మళ్ళీ మొక్కలకిస్తుంది
గొంగళి పురుగులకి కూడ
పక్షులకి
నా తర్వాత వాళ్ళకి
ప్రతి దానికీ దాని వంతుంది
జీవిత చక్రం ఎప్పటికీ ఆగిపోకుండా...
(అనుసృజన)


మన కవిత్వం కూడ మన జీవిత అక్షరమాల . ముందు  తరాలకు మనమిచ్చే పచ్చని దస్తావీజు.