అడవి
డి. వినయ చంద్రన్
వాళ్ళకి ఏ పేరు ఇవ్వను, అడవివాసులకు?
ఏవిధమైన వర్ణన ఇవ్వను?
అక్షరంతో-అ,ఆ
అక్కడ చెట్ల వేర్లు,తుప్పలు మొలకెత్తుతాయి.
వేయ్యిన్నొక్కసార్లు, వేయ్యిన్నొక్క బండలు
దొర్లుతాయి
ప్రేమతో మమేకమై,
పచ్చికబయళ్ళు,గడ్డి మైదానాలు వికసిస్తాయి,
కొండల చుట్టూ తిరిగి అలసి
వాట్ని ఏమని పిలవను- అడవి బిడ్డల్ని,
ఏవిధమైన వర్ణన ఇవ్వను?
రంగులు,కళ్ళకి నగ్నంగా కనిపించేవి,
గొంతులు,చెవులకు విన్పించేవి.
అంతులేని పరిమళం
రాత్రింబవళ్ళు నువ్వు లెక్కపెట్టినా,
గాలి సూర్యుడిలో వర్షాన్నిలెక్కపెట్టడం మానదు
సంయమనం ధ్యానించే పరిపూర్ణతని
మమైకత ఆలింగనాల అసంపూర్తి శీర్షికల్ని.
అడవి బిడ్డలకి ఏ పేరు పెట్టను,
ఏ పేరైనా ఇవ్వగలనా?
ప్రతి నీడా,పూల తివాచీల- నేర్పరి తనం,
ప్రతి చివర నియంతల యేలిక,
అనాగరిక దేవుళ్ళు, చనిపోయిన ఆత్మలు, జననం ఎరుగని
భవిష్యత్తు తరాలు,
శుభసూచికల నమ్మకాల నరికివేత,కాటుకలాంటి అడవి
మంటలు,
రాత్రుల్ని చంపేసిన పైశాచకత్వం,
ఎవరు తల్లి,ఎవరు తండ్రి, ఎవరు తండ్రి ,చెల్లి?,
ఆ తమ్ముడు లేక కాబో యే వరుడా?
క్షీణించిన అడవి మళ్ళీ పునారావృతం అవుతుంది-
మళ్ళీ ఆ కాలం వస్తుంది లేక వెళ్ళిపోతోందా?
మిట్టమధ్యాహ్నం కుడా అడవిలో కురుస్తుంది,
సూర్యుడి రధ చక్రాలు రాత్రప్పుడు కూడా కాంతిని
వెదజల్లుతాయి,
నేను వాడని సరస్సులో దూకి మళ్ళీ వస్తాను,
ఎన్నెన్ని పుట్టుకలు,ఎన్నెన్ని మరణాలు!
భయాన్ని నిప్పుల్లో వేయండి, అది తిరిగి నెగళ్లు
గా వికసిస్తుంది,
శివుడి డమరుకం సముద్రపు ప్రళయం,
అడవి కూడా ఒక సంద్రమే, ఆదరణమైన తాబేళ్లు,
చేపలు,సంద్రపు మాయా జీవాలు,
మైనాక పర్వతపు చిహ్నం
నోవా, మను,కృష్ణుడి ప్రళయ నాదం
మనం, నావికులం,నక్షత్రాలు,పడవలు, అడవి కూడా ఒక
సముద్రమే!
మనం అడవిలో మునిగి తేలుతాం,
మనం వేదాలం,కాలాలం, చెదల గూళ్ళం.
ఏ పేరైనా ఇవ్వగలనా-
అడవి స్నేహితులకు, ఇతర మిత్రులకు,
వారి పిల్లా పాపలకు,ఆ చుట్టు పక్కల వాళ్ళకి,
యవ్వనులకు, పూర్వీకుల ఆత్మలకు,ఋతువులకు?
లక్ష్మణా, వాళ్ళు ద్రౌపది కారు, లేక పరిజన్య
కారు
లేక భాగీరధి,రిగ్,యజుర్ లేక సామవేదాలు కారు
లేక వస్తువులు, వివేకం,నమ్మకం.
వాళ్ళు వన్య ఏనుగులు,సింహాలు, తూనీగలు,ఎలుగుబంట్లు,
దియోదర్ వృక్షాలు,అరటి చెట్లు, టేకు చెట్లు,
పూలు,
గరికలు,పక్షులు, పూర్వజన్మ పై వాలే ముందు ఘడియలు
వాళ్ళని మనం వాళ్ళ పేర్లతో గుర్తించం,
మనకి ఏమి తెల్సుఅని? మన గురించి మనకైనా?
అడవి- భూమాత గాజుల సవ్వడి
ఎవరైతే నక్షత్ర కూటమి దివి పీటం మీద కూర్చు౦టుందో,
అన్నిటిని మేళవించుకుని వీణ వాయిస్తూ
ఆమె కాళ్ళు ఆడిస్తునప్పుడు, కాలం తన్మయత్వంలో
నాట్యమాడుతుంది,
అడవికి ఏ పేరని పెట్టను?
అడవికి నా పేరే పెట్టుకుంటాను
పేర్లు సూర్యుడి తో బాటు పన్నెండు రాసులలో
నడుస్తాయి,
ఉత్తరం, దక్షిణం, తృతీయ గ్రహణాలు
రాహు గొంతు చుట్టూ,
తరచూ వాటి ప్రకాశాన్ని పొందుతూ మళ్ళీ వికసిస్తూ
సూర్యుడి రధం ముందు వాలుతూ
ఏడు గుర్రాల బండిలో
వేకువ వెనక నడిచే పేర్లు ముందుకు కొనసాగుతాయి
సూర్యుడి రధసారధి అరుణలా , గరుడి తమ్ముడు,
ఋషుల అనుంగుడి లా,
దైవతా మూర్తుల ఆనందపు సంగీతం లా,
దైవకన్యల నృత్యంలా,
యక్షులు,నాగాల్లా
సంధ్య, ఛాయ ,సూర్యుడి నమ్మక సహచరిణిల్లా,
చెట్ల కొమ్మలకి తలక్రిoదుల వుండి తపస్సు చేసే
వేలెడంత ఋషుల్లా,
ఉద్యమం, సాయంత్రం విశ్రాంతి లేకుండా,
మది లోని సరిహ ద్దుల్లా,
సూర్యుడితో పేర్లు నడుస్తాయి,
ఏ పేరని పెట్టగలను అడవికి?
అడవిని నా పేరుతోనే పిలుస్తాను,
చంద్రుడి తో పేర్లు నడుస్తాయి
నేలవంక నుండి, పున్నమి చంద్రుడి వరకు,
ఇరవై ఏడు మార్లు వికసించే నెలవంక చారలతో కూడి,
శక్తి నలుముకున్న రోహిణి,శుక్ర బుద్ధ సహచరులతో,
ఔషద గల గుణంతో
సృష్టికి ఉత్తేజమిచ్చే,
రాత్రి పూర్వీకుల ఆత్మలకు లంగరయ్యే విధంగా,
పెంచిన తల్లి కలగా,
కవిత్వానికి రాజ హంస లా,
పేర్లు చంద్రుడి తో నడుస్తాయి, కవిత్వ విల్లుని
ధరించి,
ఏ పేరని
పెట్టగలను అడవికి?
అడవిని నా పేరుతోనే పిలుస్తాను,
సూర్యుడు, చంద్రుడు, భూమి వాటి పేర్లు
సమస్త ప్రపంచం నీ నామం
పేరుల్లోనే పెరుమాళ్ళు వుంటాడు,మూలవాసి,
పేరు ,పెరుమాళ్ళు ఒకటే.
(ఆంగ్ల మూలం-సరితా మోహనన్ వర్మ)
(అనుసృజన- సత్య శ్రీనివాస్)
సైలెంట్ వ్యాలీ ఉద్యమం వల్ల మైక్రో హైడ్రో
ప్రాజెక్ట్ ని ప్రభుత్వం నిలిపేసింది.1983లో సైలెంట్ వ్యాలీ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతoగా ప్రకటించారు.2014లో 25 ఏళ్ల ఉద్యమానికి ప్రతీకగా మలయాళం సాహిత్య కారులు సదస్సు నిర్వహించి, మలయాళం
సాహిత్యం పర్యావరణం అన్న ప్రత్యేక సంచిక విడుదల చేసారు. ప్రకృతి సాహిత్యం లో ఈ
అధ్యయనం ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది.