జి.సత్య
శ్రీనివాస్
-భోపాల్ నా నగరం,నా ఆవాసం,డిసెంబర్ 2,1984 రాత్రి ,ప్రపంచంలోని అత్యంత
పారిశ్రామిక విధ్వంసం జరిగింది. ఆ బాధ, ఆ రక్తపు మరకలు నగరం
గుండెల్లో చెరగని ముద్రల్లా నిలిచిపోయాయి.
10,౦౦౦ మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే ఎక్కువ మంది జీవచ్చవాలుగా ఇప్పటికీ మిగిలి వున్నారు.- అని పా అండ్ టేల్స్ కవి తన మనో వేదనని చెప్పుకున్న తీరు...
భోపాల్ గ్యాస్ దుర్ఘటన పై ఒక గజల్
వాళ్ళు, ఆత్మీయుల మృత దేహాల పై
రోదిస్తున్నారు
మృత్యు వాతావరణంలో నిర్జీవ సాక్షులుగా మిగిలారు
భీకరమైన నిశ్శబ్దంలో గుండెల నిండా భయం కమ్ముకుంది
మంచి శకునాలన్నీ నిష్క్రమించాయి
తుది శ్వాసలో కొట్టుమిట్టాడుతున్నారు
నరకం ఎదుట చేతులెత్తి ప్రార్ధిస్తున్న పర్యాటకుల్లా గుమిగూడారు
భీకరమైన రోజు దృశ్యాలలో చిద్రమైపోతునట్టున్నారు
రోదన దుప్పట్లో కరుగుతున్న ముద్దల్లాగున్నారు
ఈ తూఫాన్ వేళ మస్జిద్ ఒక్కటే శరణార్ధుల
శిబిరమైంది
నీటి గూడు లేని చేపల్లా విలవిల్లాడుతున్నారు
రెప్పపాటు కాలంలో స్వర్గం నరక మైంది
వాళ్ళు, విలపిస్తున్న రాత్రి
ప్రతిధ్వనుల్లో కలిసిపోతున్నారు
(మూలం- పా అండ్ టేల్స్. అనుసృజన-జి.సత్య శ్రీనివాస్ ,)
భోపాల్ గ్యాస్
దుర్ఘటన జరిగి 3 దశాబ్దాలు అయ్యింది, అయినా బాదితులకు న్యాయం జరగలేదు, భోపాల్
చంద్రుడి నుండి ఆ మచ్చా తొలగలేదు. ఇప్పటికి భూపాల్ నగరమంటే యూనియన్ కార్బైడ్
సృష్టించిన భయానక రాత్రి స్మ్రుతి ఇంకా
వెంటాడుతూనే వుంది. ప్రముఖ భోపాల్ ఉర్దూ కవి ఇష్రాత్ కాద్రి షేర్ లా...
వెంటాడే జ్ఞాపకాలు
చాల ఏడిపిస్తాయి
రాత్రి, కళ్ళల్లోనే
ఇంకిపోయినట్లు
(అనుసృజన- జి.సత్య శ్రీనివాస్)
అవును ఆ బాధితుల
మూసుకోని కళ్ళల్లోని నిశీధి రాత్రి తరతరాలు వెంటాడుతుంది. ఎందకంటే వారి
చుట్టాలు ఇంకా వారి కధలు చెపుతూనే వుంటారు,
అంతే కాదు, వారి పూర్వీకులకు, వారికి, వారి తదనంతరం వారికి యూనియన్ కార్బైడ్
కంపెని వారికిచ్చిన గుర్తింపు గ్యాస్ ట్రాజడి విక్టింస్.మనకి ,మన ప్రాంతానికి ఆ
మచ్చ మిగిలిపోయింది.
ఆ నగరం చరిత్రలో ,సాహిత్యం,కవిత్వం,గజల్స్ వంటి కళల్లో గొప్ప పేరున్న ప్రాంతం , హిందుస్తానీ
సంగీతంలో భోపాల్ ఘరానాకి గొప్ప స్ధానం ,ఇప్పడు భోపాల్ ఘర్ కా టికాన బదల్ గయా
(ఇప్పుడు భోపాల్ ఇంటి అస్దిత్వం మారిపోయింది) నేడు దాని ఆవాసం పేరు వినగానే
గుర్తుకొచ్చేది ఆ రాత్రి ప్రతిధ్వనులు.
ఆ రాత్రిని ఎప్పటికీ చెరిపేయలేం. అంతే కాదు ఆ బాధితులకి, ఆ పర్యావరణానికి ఎంత నష్టపరిహారం
ఇచ్చినా జీవితాన్ని తిరిగి తీసుకు రాలేం. అందుకే కంపెని యజమానిని రహస్యంగా
సరిహద్దులు దాటిస్తాం. ఇప్పడు చేస్తున్న అంతర్జాతీయ ఒప్పందాలలో, ప్రవేశ పెడుతున్న చట్టాలలో విధ్వంసానికి భాద్యులు వారు కారని అన్ని కంపెనీలకు అనుగుణంగా
సవరణలు వస్తున్నాయి. ఇది ఒక అణు
రహస్యం.
గేబ్రియల్ గార్షియా మార్కుస్ మాటల్లో ‘మనం ఎలా జీవించాం అన్నదానికి ,దానిని ఎలా
జ్ఞాపకం వుంచుకుంటాం, ఇతరులు జ్ఞప్తికి
తెచ్చుకోడానికి ఏ తీరులో నెమరేసుకుంటారు అన్న దాంట్లో అంతరార్ధం వుంటుంది.’ పిల్చే గాలిని ధ్వంసం చేసే అభివృద్ధిలో ఉచ్శ్వాస, నిశ్వాసలు మర యంత్రాల చప్పుళ్ళు. ఈ
చప్పుళ్ళకి లయ బద్ధంగా నడిచే గుండె, తదనంతరం
వాళ్ళకి గతాన్ని కోల్పోయినదిగానే నెమరేసుకోమని ఒక ఎలిజీని మిగిల్చి వెళుతుంది,గడిచినదంతా ఒక పీడకల మాత్రమె, ఒక మధుర స్మ్రుతి వనం కాదన్న
ఒక నీతి సూక్తి బోధిస్తుంది. గడిచిన రాత్రి
పొగ గొట్టంలోంచి ఉదయించే సూర్యుడు మనని మర మనుషుల్నిగా మల్చే ఒక సైరన్ మోతగాడిగానే చూపిస్తుంది.
ఏకాంతంలో మన
మనస్సుతో సంభాషించుకునేటప్పుడు మనలోని సునిసితను
(స్త్రీతత్వాన్ని) కోల్పోయి మనం దుఖంతో మాట్లాడుకోవడం, రాత్రి ఒక విషాద గజల్. ఆ గజల్
కి ప్రేరణ ఇచ్చినవాళ్ళు, రాసిన వాళ్ళు
,వినే వాళ్ళు తన్మయత్వంతో కళ్ళు మూసుకోరు, కళ్ళు తెరిచి మరణించిన పసికందు నేత్రాల్ని మూస్తున్న చేతి వేళ్ళల్లా మన మనస్సుకి కనురెప్పల తడి హత్తుకున్ని పోతుంటాయి. అప్పుడు పర్యావరణ కవిత భూమిని కప్పెడుతున్న మట్టి నుండి పొరలు పొరలు గా
మన మనో గజల్ అవుతుంది. ఆ కవిత సారాంశం భూమి మన అస్తిపంజరాల ఖార్ఖాన అని, ‘కున్’(తధాస్తు, దైవం అన్న తొలి పదం) మనకు మిగిలిన దీవెనని
నివేదిస్తుంది.
ప్రముఖ గజల్
గాయకుడు శశాంక్ తడ మాటల్లో గజల్ పాడటం అంటే అంతర్లీన ప్రామాణిక కళ ,దైవ వరం,
దీనిని పెంపొందిoచుకోగల్గుతాం,కాని మానవ ప్రమేయం వల్ల సృష్టించలేం. ఇక్కడ దైవం అంటే
కేవలం దేవుడు అని కాదు, మన మనఃస్దితి. ప్రకృతి కవిత్వం లో ఆ దైవత్వాన్ని పొందాం.
పర్యావరణ కవిత్వంలో కోల్పియినదాన్ని నెమరేసుకుంటున్నాం.
భోపాల్ దుర్ఘటన
కాలంలోనే బాబ్రి మస్జిద్ ఉదంతం జరిగింది, అప్పుడు నిదా ఫాజిల్ రాసిన గజల్ లోని
పంక్తులు ప్రకృతి ని, మనుషుల్ని పణంగా పెట్టుబడి పెట్టే అభివృద్ధి కాముకుల్ని
నేర్చుకోమని కోరేదల్లా...
రెండు,రెండు
కలిస్తే ఎప్పుడూ నాలుగే ఎలా అవుతాయి,
మేధావులకి కొంచం
అమాయకత్వం కూడా ప్రసాదించు దేవుడా
బుల్లి పిచుకలకు
కొన్ని గింజలు
పసి పిల్లలకు పప్పు
బెల్లాల్లు ఇవ్వు దేవుడా .
(అనుసృజన- జి.సత్య శ్రీనివాస్)
నేడు నగర గాలిలో
కాలుష్యాన్ని నియంత్రించడానికి ,గాలిలో కాలుష్యశాతాన్ని కొలిచేందుకు కొన్ని సూచికలని
ఏర్పరిచే యోచన చేస్తోంది ప్రభుత్వం. కాలుష్య నియంత్ర మండలి ఈ దిశగా కొత్త ప్రయోగాలు
చెయ్యొచ్చు. కంపెనీల పై మన నడవడిక మారనంత కాలం ఇవన్ని సాంకేతికంగా,పారిశ్రామికంగా నగరంలోని అద్దాల గాలి మేడల్ని శుభ్రపర్చే గీతాలుగానే మిగులుతాయి.