Tuesday, 12 May 2015 By: satyasrinivasg

భోపాల్ రాత్రి -పర్యావరణ విధ్వంసం -32

కాల క్రమేణా కొన్ని ప్రతీకల భావన  మారుతూ పోతుంది. పరిశ్రమలకు గుర్తుగా రైస్ మిల్లులాంటి బొమ్మ పై  పొగగొట్టం అభివృద్ధికి ప్రతీకగా చాల కాలం మన్నికలో వుంది. 198౦ నుండి ఈ ప్రతికలోని పొగ గొట్టం లో నుండి వచ్చే పొగరంగు మారింది. మిగతా భాగం అంతా ఒక్కటే. పొగలోని బూడిద వర్ణం తగ్గి నలుపు రంగు పెరిగింది. ఇప్పుడు పిల్లల్ని పర్యావరణం గురించి బొమ్మలు వేయమంటే పరిశ్రమలని కాలుష్యం వెదజల్లే పొగ గొట్టాలుగా వేస్తున్నారు, పర్యావరణం,మన మనుగడ  పై దాని ప్రభావాన్ని చెపుతున్నారు.  బ్రహ్మవర్,ఉడిపి,కర్నాటక కు చెందిన 5 వ తరగతి  విద్యార్ధి రిత్విక్ బి.యం. రాసిన కవిత ఇందుకు సజీవ ఉదాహరణ  .
వదిలేయి, వదిలేయి రాక్షసుడా
(రిత్విక్ బి.యం.,5 వ తరగతి  విద్యార్ధి,బ్రహ్మవర్,ఉడిపి,కర్నాటక)

జీవితంలో కొన్ని జరుగుతాయి
కాని నువ్వు వెనక్కి వెళ్ళలేవు
నువ్వు నిర్మించిన మృత్యువు కర్మాగార్ కాలానికి ,
రాక్షాసుడా .
ఇక మంచిది నువ్వు
వదిలిపెట్టు,ఎందుకంటే
మా దేశ ప్రజలందరూ
ఇతరులు
నిన్ను వ్యతిరేకిస్తున్నారు
వేలమంది కనుమూశారు
నీవల్ల-
నీ మృత్యువు కర్మాగారం వల్ల
నీ దుర్వాసన గ్యాస్
మిధైల్  ఐసోసైనేట్
గుర్తించుకో
ఇది నీ వల్లే
కేవలం నీ వల్లే .
భోపాల్ గ్యాస్ దుర్ఘటన పై పరిశ్రమ యాజమాన్యాన్ని రాక్షసుడి గా ప్రతీకిస్తూ చాల కవితలు వచ్చాయి, అందులో అతి పిన్న వయస్కుడు రిత్విక్ కవితలో చాల పరిపక్వతతో బాటు పర్యవరణ కవిత్వంలోని ఇకో సెంట్రిక్ దృక్పధం స్పష్టంగా వుంది. పర్యావరణ కవిత్వానికి ఈ దృక్పధం చాల కీలకం. పర్యావరణ దృక్పధంలో ఆంత్ర ఫో  సెంట్రిక్ అంటే  ప్రకృతిని  విశ్వజనీన   వ్యవస్ధల ద్వారా చూడడం, బయో సెంట్రిక్ దృక్పధం అంటే మన చుట్టూ వున్న భౌతిక వ్యవస్ధల ద్వారా పరిశీలించడం. ఈ దృక్పధాలు  ప్రకృతి సహజంగా వున్నప్పుడు, సహజమైన ప్రకృతిని కాపాడేందుకు , ఉద్యమాలని , సంరక్షణ ప్రక్రియలని  ఈ ధోరణిలో రాయచ్చు, కాని పర్యావరణం విధ్యంసం అయినప్పుడు ఇకో క్రిటికల్ దృక్పధంతో  వ్యక్త పర్చాలి . దోషి ఎవడు అన్నది స్పష్టంగా పలకాలి. పర్యావరణ విద్వంసానికి కారణం వ్యక్తులు కాదు, ప్రకృతిని, ప్రకృతి వనరుల్ని ఉపాయోగించుకుంటున్న  తీరు, వాట్ని పునరావృతం కాకుండా  మృత్యు దిశ సాగే పయనాన్ని చెప్పాలి.  చాల కాలంగా భూమికోసం ,భుక్తి కోసం జరిగిన పోరాటాలలో వనరులని ఒక ఆస్తిగా పరిగణించడం వల్ల వనరుని మానవుని జీవనానికి  ముడి సరుకుగా    మానవ హక్కులు   జమకట్టాయి, కాని వనరుకి తనకంటూ ఉండే అస్ధిత్వాన్ని ఒక హక్కుగా గుర్తించలేదు. మన కంటే ముందునుండి వుండి,మన తర్వాత కూడా  కొనసాగే జీవం వున్నది,హక్కు అన్నది, ఈ జీవ ప్రయాణం అన్నది అస్తిత్వపు ఆస్తి  అన్న ఆలోచన పరిగణలో రావడానికి చాల కాలం పట్టింది. ఈ దృష్టి ఏర్పడడానికి ప్రోద్భలించిoo౦ది పర్యావరణ విధ్వంస కర సంఘటనలు. ఇది అర్ధం చేసుకునే సరికి జరగాల్సినది జరిగిపోయింది. ఇదంతా   రిత్విక్ కవితలో చాల క్లుప్తంగా  చెప్పాడు.
ప్రకృతిని ,ప్రకృతి లోని వాటి గురించి అనాదిగా చెప్పుకుంటూనే వస్త్తున్నాం, ఇవి  చెప్పటంలో వివిధ సిద్ధాంతాల  ప్రేరణతో నూ చెప్పాం, పర్యావరణ దృష్ట్యా చెప్పడంలోని  తేడా అల్లా మనం  ప్రకృతికి  కావలి దారులం ,హక్కుదార్లం  కాదు అని స్పష్టంగా చెప్పడం.ఇది సాహిత్య న్యాయానికి ఏర్పరిచే దారి అని కవి లారి అంటాడు. కవిత్వం  విలువలతో కూడిన  సాక్ష్యం అని నిర్వచిస్తారు.
 ప్రకృతి అంటే ఏంటి? ప్రకృతితో ముడిపడిన మన నడవడిక, అనుబంధాలు ,ప్రకృతికి,ప్రకృతిలో  వీటివల్ల ఏర్పడిన వ్యవస్ధ ,ప్రకృతి ,దానితో మనం తిరిగి  ఏర్పరుచుకునే  బంధాలు ,ప్రకృతికి సంభందించి మన వాక్యాలు వ్యక్తమయ్యే తీరు పర్యావరణ సాహిత్యం, ఇవి పర్యావరణ కవిత్వం కి దిశా నిర్దేశాన్ని కల్పిస్తాయి.రొమాన్టిసిజమ్ నుండి పోస్ట్ హ్యుమనిజం కాలం వరకు జరిగిన సాహిత్య ప్రయాణాన్ని ఈ చూపుతో  పరిశీలించడం అవసరం. సాహిత్యంలో పర్యావరణ సాహిత్యం తనకంటూ    ఒక స్ధానాన్ని ఏర్పరుచుకోడానికి ఈ దిశా,నిర్దేశం  చాల కీలకం. లేకపోతే ప్రాభల్యంలో  వున్న భావజాలంలో ఇది ఒక భాగంగానో లేక అదే భావజాలం తో వచ్చిన సాహిత్యంగానో మిగిలిపోతుంది తప్ప తనకంటూ ఒక విశిష్ట స్ధానాన్ని ఏర్పరుచుకోలేదు.
ప్రకృతిని ఏవిధంగా రొమాంటిక్ గా చూశామో ,పరిశ్రమల్ని చూశాం ,అంతే స్ధాయిలో  నగరాల్నిఅంత  రొమాంటిక్ చూడ లేదు కాని అభివృద్ధికి మటుకు నగరాన్ని  పరాకాష్ట అన్న ప్రతీకగా చూపాం.
అభివృద్ధి క్రమం అంతా ప్రకృతి హక్కుల ఉల్లంఘనే,మనం ఈ భూమి నైసర్గిక స్వరుపాన్ని పూర్తిగా మార్చలేదు కాని, భూ వినియోగ స్వరూపాన్ని మార్చుకుంటూ పోతున్నాం. దానితో బాటు భూమినల్లుకున్నభూతల  స్వారూప్యాన్ని కూడా,  మారిపోతున్న ఈ స్వరూపం మన కళ్ళ ముందే  జరుగుతున్నా  అర్ధం అవ్వడానికి చాల కాలం పట్టింది. అర్ధం అయినా  మనం పూర్వపు స్ధితిని తిరిగి తీసుకు రాలేం, ఇక ముందు  ఇంకా దుర్భరం అవ్వకుండా తగిన జాగ్రత్త పడాలి.ఇది తెలిసి,ఒక్కోసారి తెలియకుండానో ,అనుభవ  పుర్వకంగానో  రాస్తాం. ఇవి రాస్తునప్పుడు ఒకటి మాత్రం స్పష్టం మనం ఒక స్టాన్స్ తీసుకుంటాం. అది పొలిటికల్ కూడా. అది హక్కు అన్న విషయానికి ఇచ్చే పున: నిర్వచనం.ఇది ఇకో కవుల నైజం.
పూర్వం  నుండి వున్న మౌఖిక వ్యక్తీకరణ ద్వారా ప్రకృతికి  ,మనిషి మనుగడకి వున్న  సంబంధాన్ని చెప్పింది అని ఇకో కలాజికల్ సైన్స్  వ్యక్త పరుస్తుంది.. నాటు వైద్యంలో ఆది మానవులు ,చెక్క వైద్యులు మనుషులకి రోగం వచ్చినప్పుడు,ప్రకృతి విధ్వంసం జరిగినప్పుడు దానిని ప్రకృతి సమతుల్యత జరిగినట్టు భావించి ఆట,పాటల ద్వారా నివారణ చర్యలు చేపట్టే వారు.ఇది ఇకో సెంట్రిజం.ఇప్పటికీ కొన్ని వేలమంది శ్యామంస్ ఈ ఆచారాన్ని పాటిస్తారు. మరి యూనియన్ కార్బైడ్ విధ్వంసం వల్ల జరిగిన నష్టాన్ని ఏవిధంగా తీరుస్తాం .  ఆ గాలి , గాలిలో కలిసిపోయిన జ్ఞాపకాల్ని ఎలా భర్తీ చేస్తాం! ఎన్ని గాయాల్ని పూడుస్తాం...
"భోపాల్ దర్శనం"
(అనూషా చంద్రశేకరన్)
మృత్యు హస్తం
మెల్లిగా ముందుకు  సాగుతుంది
పుట్టుక  కోసం ఎదురుచూస్తున్న పసికందుని దొంగలించడానికి.
నైపుణ్యమున్న కరుడుగట్టిన మృత్యు హస్తం;
గాయపర్చే, గుడ్డిచేసే ,గడ్డకట్టించే  ఆ  స్పర్శ
వెన్నపూసలో చలి పుట్టిస్తుంది.
అమాయకులు అభద్రతతో, అసురక్షితంగా   పడివున్నారు.
భయానక పొగ కమ్ముకుంటోంది,
మెడచుట్టూ వున్న సుతి మెత్తన్ని చర్మాన్ని పిసికేస్తోంది,
భయంతో వున్నమొహమంతా మసిచేస్తూ
శ్వాసకోశ లోని గాలిని చుట్టు ముడుతూ
ప్రాణాన్ని మెల్లిగా ,నొప్పిగా జుర్రుకుంటూ.
వాళ్ళు పోరాడుతున్నారు, తిరగబడుతున్నారు, వదిలి పెట్టరు
గర్భసంచిలో మృతి చెందిన పసికందులా
పశువులకి,విషగాలి దాణా.
పురుషులు,స్త్రీలు ఇంకా పిల్లలు,
కొందరి అత్యాశకు బలైయ్యారు...
మరికొందరి  నిర్లక్ష్య వైఖరికి.
ఎదుగుతున్న నగరం నుండి జీవితాన్ని లాక్కు పోతుంది
తెరచుకున్న కళ్ళు , మూతి నుండి
మానవాళి అభివృద్ధిలో మూగ సాక్షిగా నిల్చుండి
ఇంతలో మరో బాధితుడ్ని విషగాలి కబళిస్తూ
భోపాల్ దర్శనం:
భీబత్సం  చనిపోయిన వారితో చనిపోదు
బతికున్న వార్ని వెంటాడుతూ వుంటుంది
అత్యాశ మనుషుల పురోగతిని హెచ్చరిస్తూ
(అనుసృజన-జి.సత్యశ్రీనివాస్)

భోపాల్ రాత్రి మన కళ్ళల్లో కనుపాపై కూర్చుంది. మనం ఏది చూసినా, ఎదుటి వారు మనల్ని చూసినా  అదే బొమ్మ. ప్రతీక అర్ధం మారింది. ప్రతీక ఒక మ్యాట్రిక్స్ (మాధ్యమం) మాత్రమే కనుపాపలోని తళుక్కు పొగగొట్టం చూరులో పేరుకు పోయిన మసి.

0 comments:

Post a Comment