“గాలి,వాన, కొండలు,నదులు,అడవులు,పచ్సిక బైళ్ళు,అక్కడ నివాసులు- ఇవన్నీ మన భౌతిక అవసరాల కంటే మనః స్ధితికి చాలా అవసరం. “-థామస్ బెర్రీ.
ప్రకృతి సంస్కృతి నిర్మాణం (nature cultural construction), అదే సమయంలో పర్యావరణాన్ని వినియోగించడం. ఈ వినియోగంలో ప్రకృతిని సంస్కృతిగా, సంస్కృతిని ప్రకృతిగా అర్ధం చేసుకోవడం చాలా కీలకమైనది. ప్రకృతి వివిధ రూపాల్లో వుంటుంది. ఇది అంతర్గత,బాహ్య చర్యల వల్ల ఏర్పడుతుంది. మనం కొండంచున నిల్చుని, ఉబికివున్న కొండ చర్యల్ని,లోయను చూస్తునప్పుడు,ఆ దృశ్యంలోని అంతర్లీన చర్యలను,వాటి ప్రతిస్పందనను గమనించడం,వ్యక్తపరచడం ముఖ్యం. వాట్ని ఒక క్రియగా చూడాలి తప్ప కేవలం నామ వాచకంగా కాదు. ఈ దృష్టిని అర్ధం చేస్కున్నపుడే మనం మన చుట్టూ వున్న పరిసరాలని మచ్చిక చేసుకుంటూ వాటి రంగునీ, రూపాన్ని,పరిమళాన్ని,స్పర్శని మనలో ఇముడ్చుకుంటూ మనం అందులో ఇమిడిపోతాం.
ఒక భావన ఆవిర్భవించే స్థలం,కాలంతో బాటు అది విస్ఫోటించి పరివ్యాప్తి చెందే మార్గం అంతే అవసరం. చెట్టుకి బ్రీతింగ్ స్పేస్ ఎంత అవసరమో కవితకు కూడా అంతే అవసరం. చాల సందర్భాల్లో మార్గాలే గమ్యాలవుతాయి.
గిరిజన గ్రామాలు ఎగువన కొండ పోడు,దిగువన గరువులు,పల్లాలు ప్రాంతంలో చెలక పోడు,చెట్ల మధ్యన ఇళ్ళు వుంటాయి. కొండ పైనా,కొండమ్మటే పారే వర్షపు నీరుకి అడ్డు కట్టలు వేసి వరి పండించుకుంటారు. ఈ దృశ్యం చూస్తుంటే నక్షత్రాల వెలుగుని ఉదయం మిణుగు సరంగులు పడవల్లో పంచుతూ వెళ్ళుతున్నట్టుతుంది. ఇది ముఖ్యంగా పాడేరు ప్రాంతంలో కనిపిస్తుంది. ఆ ప్రాంతాన్ని” యేరు తిరిగే భూమి” అంటారు. కొండ పైనా, మధ్యలో,అంచునా ,దోసిళ్ళ అంత నీళ్ళు నిలిచినా వరి పండించుకుంటారు. ఇది ఖమ్మం జిల్లాలోని చింతూరు చుట్టు పక్కల ప్రాంతంలో చూసా. అంతటా ఇదే! భూమి స్వరూపాన్ని బట్టి భూవినియోగం జరుగుతుంది. ఇటువంటి పర్యావరణం గిరిజనుల పోడు వ్యవసాయం,పశువుల పెంపకంలో కనిపిస్తాయి. వారి సంస్కృతి ఎక్కువ శాతం కొండ పోడుతో ముడి పడి వుంది. వాళ్ళ జీవిన విధానంలో ఆహార సేకరణతోపాటు వ్యవసాయం మిళితమై ఉంది. అందుచేత ప్రకృతిలో వున్న జీవ వైవిధ్యం, వాళ్ళ సంస్కృతిలోనూ తొణికిసలాడుతుంది. ఏపుగా ఎదిగిన మహా వృక్షాన్ని పోడు చేస్తున్నప్పుడు నరకరు. పేరుకుపోయిన తుప్పనీ, ఆకు రొట్టనీ తొలిచి నేలను శుభ్రం చేస్తారు అంతే. స్థిర-అస్థిర వ్యవస్థల్నికలుపుతూ మరో కొత్త వ్యవస్థను ఏర్పరిచేందుకు దోహదపడేది పోడు వ్యవసాయంగా సూత్రీకరించుకోవచ్చు. ఈ కొత్త వ్యవస్థలోనే గిరిజన సంస్కృతి యావత్తూ ముడిపడి వుంది. పోడుకి సంబంధించిన పాటల్లో ఒకటి-
“తుప్పలు తుప్పలు కొట్టగా ఏమి తుప్పలు కొట్టగా
జాజి రామయ్య తోటలో జామి తుప్పలు కొట్టగా “-తూర్పు గోదావరి గిరిజనుల పాట.
కొండపోడుని ఎకరాల చొప్పున కాకుండా దిగుబడిని బట్టి లెక్క కట్టుకుంటారు. స్థానిక నానుడిలో దిగుబడిని' కుంజ’ల్లో కొలుస్తారు. 'కుంజ అంటే బస్తా' .వారి ప్రాపంచిక దృష్టిలో పుట్టే పదాల్లో అంతర్లీనంగా చర్యలతో ముడి పడి వుంటాయి. ఈ పదాల్లో ,మాటల్లో కాలపరిజ్ఞానం తో బాటు,పరిసరాల దృక్పధం వుంటుంది .
పులిని-దారికి దడ్డడు అంటారు,అంటే దారి వెంట నడిచే బలశాలి అని.
నెమలిని –అడవికి ఆటగాడు
చెవుల పిల్లి- చేనుకి చేటుగాడు
ఆ జీవుల పేర్లు వాటి పరిసరాలతో బాటు వాటి క్రియల్ని తెలుపుతాయి. మనం అవి తెలియచెప్పడానికి ఎక్కువగా ప్రో జ్ వాడుతాం. కానీ వాళ్ళు క్రియని అర్ధం చేసుకుని ప్రతీకలుగా మారుస్తారు. ఆ ప్రతీకలు సంఘటనని,మెటాఫర్ర్ ని తెలియచేస్తాయి.
ఇప్పుడు వేగవంతమైన సాంకేతిక పరిజ్ఞానం వల్ల భాషలో మార్పులు కూడా వేగవంత మవుతున్నాయి. ముఖ్యంగా ప్రిటింగ్ టెక్నాలజీ,ఇంటర్ నెట్ పుణ్యమా అని వాక్యాలని,పదాలని పరమితంగా వాడడం సాగుతోంది. మన బాహ్య పర్యావరణం తో బాటు మన బాషా పర్యావరణం మారుతోంది. బాష మీద పట్టు, సాంకేతిక పరిజ్ఞానం వుంటే దీని సులువు అర్ధం చేసుకోవచ్చు. ఇది ఇరు వ్యవస్దల మధ్య జరిగే చర్య .దాని నుండి ఉత్పన్నమయ్యే ప్రక్రియ. ఇది ఎంత సహజంగా వుంటే అంతే సహజమైన పదాలు ,ప్రతీకలు ఏర్పడుతాయి.
వనరుల వినియోగంలో వనరులకి పునరుత్పత్తి అయ్యే అవకాశం ,తగిన కాలం వుండాలి. డేవిడ్సుజుకి మాటల్లో ‘ప్రతి శ్వాస ఒక ప్రయత్నం ,మన చుట్టూ వున్న వాటితో కలిసి వున్నామన్న నిర్ధారణ .మన పూర్వీకులతో సంబంధాన్ని పునరుద్ధరణ చేసుకోవడం ముందు తరాలకి ఇచ్చే కానుక.మన శ్వాస మన జీవన శ్వాస ,భూమినల్లుకున్న సముద్రపు గాలి.
మన జీవితంలోకి పిల్లలు వస్తున్నారంటే మనము ఓ పిల్లల ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. బైగా తెగ వారు పిల్లల్ని బానిసలుగా చూడరు. వాళ్లు, వాళ్ళకి సహచరులు,తోటి ఆటగాళ్ళు ,సంతోషాన్ని తెచ్చే వాళ్ళు.వాళ్ళని ఉయ్యాల దేవతైన జాలాని దేవత కంటే ఎక్కువగా చూసుకుంటారు. పిల్లలు ప్రకృతికి ఆనవాళ్ళు ,వాళ్ళు నడిచే బాట.
బుల్లి బుల్లి కాలి బాటలు చూపుకి కమ్మదనం
మరిన్ని చిన్ని చిన్ని తియ్యని కాలి బాటలకి దార్లు...
(అనుసృజన).
ఇదే దృష్టి లారి బట్లర్ కవితలోనూ కనపడుతుంది...
పిల్లాడు నవ్వుతూ
చెట్టు ఎక్కుతాడు
చెట్టు నవ్వుతూ
పిల్లాడి పైన ఎక్కుతుంది
నవ్వు
చెట్టుని, పిల్లాడిని ఎక్కుతుంది
ఆకులు తుళ్ళుతూ కేరింతలు కొడతాయి.
మన చుట్టూ పచ్చదనం కనుమరుగయ్యిందంటే మనము మోడుబారామనే సంకేతం. జీవితం, కవిత్వం అంటే త్రీ డైమెన్షన్ ప్రక్రియ. సారాంశాన్ని అన్వయించుకోవడం, పాఠకుడిని,ప్రకృతిని జోడించుకోవడం, బాహ్య ప్రాపంచిక దృష్టిని కలగలుపుకోవడం. నా దృష్టిలో ఇదంతా బ్రీతింగ్ స్పేస్. ఇది ఇరుకైన లాభ నష్టాల కాటాలో కొలిచే అంకెల గారడీ కాదు. ఈ ప్రస్థానంలో నిదా ఫాజ్లి గజల్లో పంక్తులు జ్ఞప్తికి వస్తాయి . '' దో ఔర్ దో కా జోడ్ హమేషా చార్ కహా హోతాహై, సోఛ్ సమజ్ వాలోంకో తోడి నాదానీదే మౌలా !''(రెండు రెళ్ల జోడీ నాలుగే అని చెప్పే జ్ఞానులకి కాసింత అమాయకత్వం ప్రసాదించు దేవా !) ప్రఖ్యాత రష్యన్ రచయిత దాస్తోయెస్కీ నోట్స్ ఫ్రమ్ అండర్ గ్రౌండ్ లో కూడా ఈ ధ్వనే వినిపిస్తుంది. చుట్టుపక్కల కృత్రిమ పర్యావరణం వుంటే అది మనలో నుండి పాకిన వైరస్, ప్రకృతికి కృత్రిమ తత్త్వం వుండదు, ఇది మోనోకల్చర్ లక్షణం. మనం ప్రకృతికి ఆ సంసృతి అంటగడుతాం. అది తిరిగి మనని అదే తీరులో బతికే తీరుని అందిస్తుంది. న్యూటన్ మూడో సూత్రం.
1920లో ఎడిత్ వ్యాత్ రీడింగ్ ఆఫ్ పోయెట్రీ అన్న వ్యాసంలో చెప్పింది, ఆధునిక ధోరణిలో అంశం,ప్రయోగంలో రాసే తీరు ఒకేరకమైన ప్రవాహం గా ఉండడానికి కారణం కవిత్వంలో కేవలం మనుగడకు సంబంధించిన తెలిసిన అంశాలని పదే పదే వాడడం, వాట్ని మెరుగైన తీరులో ప్రస్తావించడం జరుగుతోంది తప్ప భూమి పరిభాషని గొప్పగా చెప్పే అనంత చిరు పదాల్లోని మాధుర్యాన్ని కొద్దిపాటిగా కూడా స్పృశించడం లేదు.కవిత్వాన్ని ఆస్వాదించమంటే కోయిల పాట వినడమే.ఈ రెండు తమంతట తాముగా తమ అందాన్ని,వైవిధ్యాన్ని,పరిధిని చెప్పుకోవు. ఎప్పుడు చెప్పుకుంటాయంటే, వాటి ఆవరణలో చేతులు కట్టుకుని ప్రశాంతంగా కూర్చుని మనస్సు పెట్టి ఆ పాటని వింటే తప్ప గొంతు విప్పవు.అది వినడానికి ప్రకృతి వలయంలో మనం అణువంతే అన్నది అర్ధమవ్వాలి ,ఇది తెలిసినప్ప్డుడు ముగింపుకంటే కొనసాగింపు వైపు అడుగులు సాగుతాయి.
ఇరొక్యుయస్ ల భూమాతకి కృతజ్ఞత ప్రార్ధన
మనం తల్లికి ,భూమికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం
మనకి మనుగడ ఇచ్చినందుకు
మనం నదులకి,వాగులకి కృతజ్ఞతలు చెప్పుకుంటాం
మనకి నీళ్ళు ఇచ్చినందుకు
మనం ఔషద మొక్కలకి కృతజ్ఞతలు చెప్పుకుంటాం
మన రోగ నివారణకి మందులు ఇచ్చినందుకు
మనం చంద్రుడికి, నక్షత్రాలకి కృతజ్ఞతలు చెప్పుకుంటాం
సూర్యుడు లేనప్పుడు తన వెలుగు నిచ్చినందుకు
మళ్ళీ సూర్యుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం
భూమిని తన దివ్య నేత్రంతో చూసుకున్నందుకు
చివరిగా మళ్ళీ మనం దివ్యాత్మలకు కృతజ్ఞతలు చెప్పుకుంటాం
ఎవరిలో మంఛితనమంతా ఇమడివుందో
ఇంకా తన బిడ్డలకై అన్నింటినీ మంచి దారి వైపు నడిపిస్తున్నందుకు.
(అనుసృజన)
ఈ దారిని చూపించే పర్యావరణ కవిత్వం మన కనురెప్పలకద్దిన పచ్చని కాటుక.
3 comments:
చాలా బాగుందండి. మంచి పోస్ట్
Thanks RamaSundari gaaru
నిజమే ఇదంతా ఈ ప్రకృతితో పాటు జీవించే మనుషులు ఆ మనుషుల చుట్టూతా అల్లుకునే అనేక వేల రకాల కీటకాది జంతులోకం పక్షుల గుంపులు ఇవన్నీ ముంపుకు గురవుతున్నాయి ఒకవైపు. తవ్వి పొయ్యబడి వారి ఉనికిని మాయంజేసే కుట్ర సాగుతోంది. ఇదంతా కలగానో అక్షరాలలో పొందికగా అమరిన పద చిత్రాలుగానో మిగిలిపోయే ప్రమాదం పట్ల మాటాడాల్సినంత మాటలే కరువవుతున్నాయి. మంచి పోస్ట్ నకు అభినందనలతో ఇలా మీముందు..
Post a Comment