Wednesday, 27 May 2020 0 comments By: satyasrinivasg

ద హ్యుమేన్ జూ....




సాహిత్యం , కళల్లో యానిమలిజం అన్న దృక్పధం వుంది. అంటే జంతుజాలాదుల ప్రవర్తన .గుణగణాల్ని రాయడం, వాట్ని ఆపాదించడం, పోలికలుగా , భౌతిక, అభౌతిక,సులువుగా, క్లిష్టంగా,వస్తువుగా, ప్రక్రియగా,సంఘటనగా, జీవ, నిర్జీవిగా ప్రస్తావించడం అన్నది  ఆనవాయితీగా వున్నది. అంటే మానవ సమాజ అభివృద్ధి క్రమంలోని సాహిత్య మాధ్యమాల్లో ఇవి మన వెన్నంటే వున్నాయి. కళ అంటే కాల్పనిక ఆలోచనకి రూపమివ్వడం, ఆ రూపమే క్రమేణా ఆలోచనగా మారడం. ఈ రూపాలు ఎక్కువగా మతపరమైన, ఫాంటసీ, మ్యాజికల్ రియలిజం,సైన్స్ ఫిక్షన్  సాహిత్యంలో విస్తారంగా కనిపిస్తాయి.
మానవ సమాజ అభివృద్ధి అంతా ప్రకృతిని మచ్చిక చేస్కోవడమే. అడవులన్నవి మన మనుగడకు ప్రాణమిచ్చే బీజాలు , జన్యు కేంద్రాలు. అభివృద్ధి అంతా  అడవులనుండి కాంక్రీట్ అడవులలోకి (హ్యుమేన్ జూ) వచ్చిన వలస. ఈ వలస అంతా  మనం మన ఆలోచనలోకి రూపమిస్తూ కొనసాగిన బతుకు తెరువు. ఈ క్రమంలో ప్రకృతిని మచ్చిక చేసుకున్న తీరంతా హింసతో కూడుకున్నదే! దురదృస్టవశాత్తు ఈ ప్రయాసలోని వాంఛని యానిమల్ ఇన్స్టింక్ట్ అంటాము, కాని జంతువులకు హింసా  ప్రవృత్తి వుండదు. మనం మంచి వాళ్ళం అని చెప్పుకోడానికి వాటి ప్రవృత్తిని క్రూరంగా చాటాం!.
జెకిల్  అండ్ ద హైడ్
నేడు మనం యానిమలిజం నుండి పోస్ట్ యానిమలిజం, హ్యుమేనిజం నుండి పోస్ట్ హ్యుమేనిజం స్ధాయికి చేరాం. ఈ మార్పు దారిలో ఎక్కువగా మన శారీరక శక్తి కంటే ఇంకా ఎక్కువ శక్తిని జమచేసుకుని ముందు తరాలకి అంది౦చాలన్న వాంచ. ఈ శక్తి ( డబ్బు, పరపతి, అధికారం,పేరు, ప్రతిష్ట ,హోదా అన్నిటికి వర్తిస్తుంది)ని ఒక ఆధ్యాత్మిక శక్తిగా, అంతులేని శక్తిగా పరిగణి౦చాం.  వాస్తవానికి మనం పూర్తిస్ధాయిలో పోస్ట్ హ్యుమనిజం స్ధాయికి చేరామని చెప్పలేము, కారణం మనం ఇంకా పక్షుల్ని, జంతుజాలాల్ని ప్రతీకలుగా వాడుతున్నాం.  యానిమలిజం నుండి  ఇంకా పై స్ధాయికి ఎదిగే క్రమం అన్నది ఇంకా ఎక్కువ తెలుస్కోడానికి అనంతమైన  పరిశోధన. వాటి ఫలితాల్ని పరివ్యాప్తి చేయడం, ఇంకా కొత్త వాట్ని రూపొంది౦చడం.  ఈ క్రమం  భూమి,ప్రకృతి  స్వరూపాన్ని మార్చేస్తుంది, దాని ఫలితంగా మానవ సమాజ స్వరూపాలు మారుతాయి. యుద్ధానంతరం వచ్చిన మార్పులో జంతువుల రూపాల్ని మార్చి మన శక్తి సామర్ధ్యాలకే విలువ నిచ్చే ఆలోచనా ధోరణి చోటుచేసుకుంది. జంతువుల స్ధానంలో యంత్రాల ద్వారా శక్తిని వినియోగించడం ఏర్పడుతుంది.ఇది అన్ని రూపాల్లో కనిపిస్తుంది, ఉదాహరణకి, సర్ కాటన్ దొర ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణమప్పుడు  అన్న మాట, ‘బ్యారిజ్ నీళ్ళు వచ్చిన తర్వాత ,నీళ్ళు అందే ప్రాంతంలో వ్యవసాయ రూపురేఖలు మారిపోతాయి, అక్కడ  పండే  నల్ల బియ్యం కనుమరుగవుతుంది’.  అది జరిగింది. అక్కడ పండే ప్రాంతీయ పంటల స్ధానంలో వాణిజ్య పంటలు చోటుచేసుకుంటాయి. అదే కాదు ఆనకట్టల దిగువ ప్రాంతం అంటే నీరు అందే ప్రాంతంలో ఆవులు ,ఎద్దులు పోయి వాటి స్ధానంలో గేదెల పెంపకం పెరుగుతుంది, ఇదీ నేడు కనిపిస్తుంది.
ఇదంతా యానిమలిజం నుండి పోస్ట్ యానిమలిజం ఎదిగిన తీరు ,అదే విదంగా సమాజం హ్యుమేనిజం నుండి  పోస్ట్ హ్యుమేనిజం స్ధాయికి ఎదిగింది. అంటే  మనిషి తన జీవితానికి తనే ఆర్ధం ,పరమార్ధం కల్పించుకుంటాడు అన్న తీరు నుండి  తన మేధో శక్తితో మనిషి కంటే గొప్ప వాడవుతాడు.  ఈ తాత్విక  మేదస్సు ధోరణి అంతా అన్త్రఫోసెంత్రిక్ దృక్పధం.   ఈ దృక్పధం లో నిగూఢoగా వున్నది వర్తకం , వాణిజ్య దృష్టి. దీనిని చారిత్రాత్మక చూపు లేకుండా జీవావరణం,పర్యావరణ,  ప్రకృతి సంరక్షణ అన్న నినాద కూడిత కార్యక్రమాలు అన్నీ ఒక మిధ్య.
నేడు చలామణిలో వున్న ఎకో పోయట్రీ  పారిశ్రామీకరణమప్పుడు పచ్చిక మైదానాలు హరించిపోతున్నాయి అన్న ఆవేదన నుండి వెల్లువెత్తిన గళం, ఇందుకు ఉదాహరణ విలయం వర్డ్స్ వర్త్ కవిత్వం.వాణిజ్యం,వర్తకం అన్నవి సముద్రయానం ద్వారా ఉదృతమవుతున్న కాలంలో ఓడలకి(ఒకప్పుడు యానా౦ పడవల తయారీకి ప్రసిద్ది గాంచినది) కావాల్సిన ముడి సరుకుల  కోసం అడవుల వాడకం పెరిగింది, తర్వాత పారిశ్రామీకరణ జతవ్వడంతో డబ్బున్న వాళ్ళు ,పాలకులు తమ అవాసాల్ని ఎస్టేట్లు గా ఏర్పరచుకున్నారు.అక్కడే ప్లాంటేషన్ లు ప్రారంభించారు, ఇది నేడు రియల్ ఎస్టేట్ వాళ్ళు కొత్తగా పెట్టిందీ  కాదు, పచ్చదనం కోసమూ కాదు. పారిశ్రామీకరణ వల్ల భూవినియోగంలో  జరిగిన మార్పులు భూమి స్వరూపాన్ని మార్చేశాయి, నేలకు వుండే ఉత్పత్తి గుణాన్ని చంపేశాయి.
ప్రకృతిని మచ్చిక చేస్కోవడమంటే కేవలం చెట్టు ,పుట్ట, నేల ,నింగిని కైవసం  చేస్కోవడం కాదు, ఇతరలనుండి వాట్ని హస్తగతం చేస్కువడం.దానికి ధనిక ,పేద, కులం ,మతం ,జాతి, వర్గం, స్త్రీ, పురుషుడు  అన్న ఆయుధాల్ని ఉపయోగించాలి. అంటే ఎదుటి వారి ఆలోచనలకి మనం అనుకునే రూపం ఇవ్వాలి, ఇందుకు మనిషి రూపం కాదు , జంతుజాలాల రూపం అయితే  సులువుగా వుంటుంది  కదా. ఇదే మనలోని జాకాల్ అండ్ ద హైడ్ కధ.
మన నీడంటే మిగిలిన పక్షులు
మన చుట్టూ వున్న జీవావరణంలో(నగరం) నేడు అరుదుగా కనిపించేవి చిత్రిత కొంగలు(తెల్ల కొంగలు), ఇవి ఎక్కువగా పక్షుల పైన , మేకల,గొర్రెల మందలలో కనిపిస్తాయి. వీటికి చింత చెట్లు అనువైన ఆవాసం . వీటికి మేకలు, గొర్రెలు, పశువుల కాపర్లకి అవినాభావ సంబంధం వుంది. పంట చేలల్లో వరి నాట్లప్పుడు ఇవి చేలో వాలిన మబ్బుల బుడగల్లా గెంతుతాయి. ఇవి మనని ఎంతగా అర్ధంచేసుకున్నయ్యో దీన్ని బట్టి అర్ధం అవుతుంది అంతే కాదు బహుశా మనకంటే ఎక్కువగా యంత్రాలని అర్ధం చేసుకున్నాయనిపిస్తుంది.  ఈ విషయం స్వీయ అనుభవంతో చెబుతున్నా... ఆ అనుభవాన్ని మీరూ చదవండి...
 మేము ,చిత్రిత కొంగ ,ప్రొక్లైనర్
మా ఇంటి వెనుక మైదానంలో
కొంత కాలం క్రితం ఆమె, నేను నాటిన మామిడి,చిన్న వుసిరి, సీతాఫలం ,సపోటా,జామ, నేరేడు, మునగ ,చింత,నిమ్మ, గుల్మొహర్ , వేప మొక్కలు ..
హరిత హారంలో భాగంగా  నాటిన కానుగ, నేరేడు  మొక్కలు...
భారతి ఆంటీ కావాలని తెచ్చి నాటించిన మారేడు, రావి ,వెలగ మొక్కలు...
సుమారు 50 చెట్లు.....
కొన్ని పూతకొచ్చాయి
ఆ చెట్లిప్పుడు చాలా రకాల పక్షుల నివాస ప్రాంతాలు
  ప్రాంతాన్ని పిల్లలు ఆడుకోడానికి అనువుగా ప్రొక్లైనర్ తో చదును చేయిస్తున్నారు
యంత్రం నేలను చదును చేస్తునప్పుడు చెట్లకు ఇబ్బంది కలిగి అవి పెకలించబడతాయన్న శ్రద్ధతో కూడుకున్న భయంతో  కావలి కూర్చున్నా...
 వాటికి నీళ్ళు పోసి, ఆమె ,నేను వాట్ని పిల్లల్లా పెంచాము
---------
ఎక్కడినుండో వచ్చింది ఒక చిత్రిత కొంగ !
యంత్రంతో బాటు భయంలేకుండా దాని  చుట్టూనే తిరుగుతోంది.ట్రాఫిక్లో బాగా తిరిగే అలవాటున్న ప్రాణంలా .
సన్నిహితుడితో నగర రోడ్డుల్లో ఇష్టానుసారంగా  తిరిగినట్టు వుంది దాని స్వభావం.  ఒకప్పుడు పశువుల పైన వాలి తిరిగే సహజీవన వాసి అది. చిన్నపాటి అలికిడికి పశువులు తమ తోకాడించేవి. ఆ సౌ౦జ్ఞకు కొంగ పశువుల నుండి దూరంగా ఎగిరి వాలి, వాట్ని గమనించి మళ్ళీ వచ్చి వాలేది. ఆ అలవాటు ఇప్పటికీ  దానిలో కనపడుతోంది. అది యంతాన్ని పశువుగా ఎందుకు అనుకుని, అలా యంత్రాన్ని వదలకుండా తిరుగుతుందో  కొద్దిసేపటికి అర్ధమయ్యింది.  పెకలించిన మట్టిని కుప్పగా వేస్తునప్పుడల్లా ,అది ఒక్క ఉదుటున ఎగిరి కుప్ప మీద వాలి వాన పాముల్ని,క్రిముల్ని  పట్టుకుని తింటోంది. ఏదో పాత పుస్తకంలోని అక్షరాల్ని ఆస్వాదిస్తున్నట్టు !
పశువులు లేని కాలంలో యంత్ర స్వభావం దానికి అర్ధమైనంతగా  మనకు అర్ధం కాదు.
ప్రొక్లైనర్లను, బుల్డోజర్లను మనం, మట్టిని,మట్టివాసుల్ని, నివాసాల్ని పెకిలించాడానికే ఎక్కువగా ఉపయోగించే యంత్రతంత్రులం. అది మటుకు యంత్రానికి కొద్దిపాటి మట్టి చూపుని కలిగిస్తోందనిపించింది.
.........
మర్నాడు  మళ్ళీ  మిగిలిన పని ముగించడానికి  ప్రొక్లైనర్ వచ్చింది ,నేను వెళ్ళాను ,కాని చిత్రిత కొంగ రాలేదు.తను ,నేను,అందరం నాటిన మొక్కలు  ఇంకా పెద్ద చెట్లైనప్పుడు,దాని సంతతి  వాలుతుందన్న ఆశతో దాన్ని తలుచుకుంటూ కూర్చున్నా ...
ఆవుల,గేదెల మందను కాసే పిల్లలు, నింగి విహంగాలుగా గేదెలపై ఎక్కి రాజ్యాల్ని హస్తగతం చేస్కుంటునట్టు పశువుల్ని కాసేవారు,నేల పైన పిల్లల్లా  చిత్రిత కొంగలు వాటి వెంటే నేల పైన తచ్చాడేవి.
పచ్చటి నేల తివాచీ పై స్వచ్ఛమైన తెల్లటి మబ్బు మన్ను పర్చుకునట్టు...
యాంత్రిక యుగం లోని రాతి కాలంలో,ఆ జీవన దృశ్యాలు ,పిల్లలకు ఆటస్ధలాలు కనుమరుగయ్యాయి ...
పిల్లల ఆటపాటడుగులు లేని  నేల, వేరులేని మట్టే ! చినుకు లేని నేల రోదన !!
------
అక్కడే వున్నా .....
ప్రొక్లైనర్ నడిపే రిజ్వాన్ని అడిగా ఎక్కడి నుంచి వచ్చావని, “ డిల్లీ దగ్గర ఉంటా సార్, రెండు  నుండి నాల్గు  నెలలు వచ్చి ఈ పని చేస్తా, మాములుగా  అయితే చలి కాలంలో వస్తా, కానీ ఇప్పుడు వేసవిలో వచ్చా . అక్కడ వ్యవసాయం చేస్తా! మట్టివాసన తెల్సిన మరో కొంగ కాబట్టి మొక్కలకి ఇబ్బంది కలగ కుండా ,విసుక్కోకుండా శ్రద్ధగా పనిచేశాడు.
ఇంతలో   పిల్లలు అంకుల్ ఇది వాలీ బాల్ కోర్టా”    అయితే  మేము వచ్చి ఆడుతాం అంటూ కట్టమీద నడుచుకుoటూ వెళ్ళి పోతున్నారు,అవును ,నా కొడుకు  వాడి స్నేహితులతో ఒకప్పడు ఆడుకునేవాడిక్కడ !
నీ కోసం ... పిల్లల కోసం...ఇప్పుడు కూర్చున్నాను.
కానుగ, వేప,మామిడి ,నేరేడు,సపోటా  చిగురించాయి, గుల్మొహర్ ఎర్రటి పూలు మొదలయ్యే కాలం.
పని ముగిసే సమయానికి వాలింది చిత్రిత కొంగ. పని ముగిసేంత వరకు వుండి వెళుతూ, వెళుతూ,   నా వైపు వీడ్కోలు చూపు విసిరి  ఎగిరిపోయింది.  
దాని కనుపాప దృశ్యం    నాకు చెప్పిందల్లా... మట్టంటని పసిపాదాలకు తల్లి గర్భమే ఆట స్ధలంగా మిగిలిందని ,కూసింత మట్టిని వాళ్ళకి పచ్చటి మైదానంగా  పెంచి, వేయి ఋతువుల రంగులతో అల్లుకున్న క్రీడా స్ధలంగా ఇవ్వడమే  మనం చేసే  సహజమైన మట్టి వేర్ల   జపమని !
 (లిబ్రా ఎన్ క్లేవ్ పార్క్, బడంగ్ పేట, 25-3-2016),- జి. సత్య శ్రీనివాస్

Thursday, 14 May 2020 0 comments By: satyasrinivasg

బ్లాక్ అండ్ వైట్




ప్రకృతిని అర్ధం చేసుకోడానికి ప్రకృతిలోని జీవ వైవిధ్యాన్ని అర్ధం చేసుసుకోవాలి, దీనికి పరిశీలనతో కూడిన అనుభవం చాలా ముఖ్యం. అది ప్రకృతి రంగులని బ్లాక్ అండ్ వైట్లో చూస్తేనే అవగతమవుతుంది.  ప్రకృతికి కూడా మెమరీ వుంటుంది , యునివర్సిటీ ఆఫ్ స్టుట్ గార్డ్స్  వాళ్ళు  వ్యోమగాములకు  అంతరిక్షంలో అవసరమైన మందులు తయారు  చేయాడానికి చేసిన పరిశోధనలో  నీళ్ళు గురించిన విషయం తెలిసినప్పుడు ఆశ్చర్యచకితులయ్యారు. మైక్రోస్కోప్ లో దానిని చూసినప్పుడు ,వాతావరణం బట్టి దాని రూపం మారుతుందట. దీన్ని బట్టి దానికి జ్ఞాపక శక్తి వుందని భావిస్తున్నారు.సాల్ చెట్లు(గుగ్గిలం) ఒంటరిగా పెరగవు, అవి వాటి సముహంతో కలిసి జీవిస్తాయి, వాట్ని ఒంటరిగా పెంచితే , ఒంటరి తనానికి లోనై చనిపోతాయి. అంతదాక ఎందుకు, ఒంటరిగా ఎదిగిన తురాయి, వేప ,కానుగ, కరివేపాకు  లాంటివి తమ చుట్టూ వాటి సముహాల్ని ఏర్పర్చుకుంటాయి.

కరోనా వల్ల మనుషుల అలికిడి  తగ్గింది, వన్య జీవులు తిరిగి నగరాలలోకి  వస్తున్నాయి అని సంతోషం,ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు, అవేవీ ఇక్కడ  వుండానికి రావడం లేదు, వుండాలన్నా  వుండలేవు. కాలుష్యం   తగ్గింది అని ఏమీ లేదు, ఇవన్నీ తాత్కాలిక మార్పులు. ఈ సమయంలోనే జరగాల్సిన చట్టాల మార్పులు, ఒప్పందాలు జరుగుతూనే వున్నాయి. ఒకసారి కరోనా పోయిన తర్వాత షరా మామూలే...  ఈ భూమి , ప్రకృతి ఎన్ని ఎపిడెమిక్స్, పాండమిక్స్ చూడలేదు...

అసలు మనం మాములుగానే ప్రకృతిని సరిగ్గా పరిశీలించం,  చుట్టూ  వున్న దాన్ని పట్టించుకోము. అసలు మనలో నిక్షిప్తమైన వాట్ని కుడా పట్టించుకోము.అన్నిటికి సమయం లేదు,లేక రాదు అనే అంటాం. ఎందుకంటే మన ఇష్టాలన్నీ డబ్బుతోనే ముడిపడిపోయాయి కాబట్టి  మన ఇష్టాల్ని కుడా మెమొరి లేన్లో వదిలేసాం! కరోనా వల్ల వాట్ని కొద్దో గొప్పో  మన జ్ఞాపకాల వూట బావిలో ఏతమేసి తోడుకుంటున్నాం.  ఇలా జ్ఞాపకాల్ని తోడుతున్నపుడు పరిశీలన ముఖ్యం.  పరిశీలనలో మనం గమనించే వాటిని మనం గమనిస్తున్నాం అన్నది తెలియకూడదు, అది తెలిస్తే అవి అప్రమత్తమయ్యి సహజంగా వుండవు ,లేక అక్కడి నుండి వెళ్లి పోతాయి. ప్రకృతి పరిశీలనలో ఇది చాల కీలకమైన అంశం. దీనినే ఆల్ఫర్డ్ స్క్రుత్స్ నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటారు.  దీనిని ఎలా చేయ్యాల్లో ఎమిలి డికిన్ సన్ కవిత ద్వారా తెలిపింది...
ఒక పక్షి సంచారం
ఎమిలి డికిన్ సన్
ఒక పక్షి ఇటుగా వచ్చింది
దానికి తెలియదు ,నేను చూస్తున్నట్టు-
అది ఒక పురుగుని సగంగా కొరికింది
దానిని పచ్చిగానే తినింది,
తర్వాత పచ్చిక పైనున్న
ఒక చుక్క నీటిని తాగింది
తూనీగలకు దారినిస్తూ
అటు తర్వాత గోడంచునే ఎగిరింది
అది సూక్ష్మ నేత్రాలతో చూసింది
తొందరగా తూనీగలు అంతటా  చెల్లాచెదురుగా వెళ్ళిపోయాయి
నాకు, అవి రాలిపోతున్న ముత్యాల్లా అగుపించాయి-
అపాదం  మునట్టుగా, జాగ్రత్తపడుతూ
అది తన సునిశితమైన  తలను అటిటూ తిప్పింది
నేను దానికి ఒక బ్రెడ్ ముక్కనిచ్చాను
అది తన రెక్కలను విదిల్చి
సముద్రాన్ని ఛేదించే ఖడ్గంలా కాక
రంగులల్లిక మెరుపుతో
మిట్టమధ్యానం ఒడ్డుచేరే  సీతాకోకచిలుక  అలలా
సుతి మెత్తంగా,సవ్వడిలేని ఈతలా  తన  గూటికి ఎగిరింది
(అనుసృజన-జి. సత్యశ్రీనివాస్)

ఎమిలి డికిన్ సన్(1830-1886,అమెరికన్ కవయిత్రి), తన శైలిలో నాల్గు పంక్తులు /అయుదు పంక్తులతో కూడిన స్టాన్
 జాలలో కవితలు రాస్తుంది. కవితలో  ఒక పాజ్ తో కూడిన వాక్యాల్ని అమర్చుతుంది .ఇది  చదవడానికి అనువుగా వుంటుది. తన కవితల్లో కవయిత్రి  ప్రకటితమవుతుంది.

ఒక పక్షి సంచారం కవితలో ,ఒక పక్షి తనకు దగ్గరగా సంచరిస్తున్నప్పుడు దాని నడవడిక తీరుని ప్రస్తావిస్తుంది, ఇక్కడ పక్షి ప్రకృతి ప్రతిరూపం కూడా. పక్షిని పరిశీలిస్తున్నట్లు దానికి తెలియదు. పక్షి పురుగుని తిన్నాక , మనుషులులానే గ్లాస్లోని నీళ్ళు తాగినట్టే అది కూడా గడ్డి పరక మీదున్న నీటిచుక్కను తాగుతుంది. ఇక తూనీగల ప్రస్తావనలోని ప్రతీకల్లో  (రాలిపోతున్న ముత్యాల్లా) సామాజిక మెటాఫర్ల ప్రస్తావన  కనిపిస్తుంది.అపాయం అన్న విషయాన్ని   చిన్నగానే చెబుతూ , అప్పుడు పక్షి అప్రమత్తమై తీసుకున్న జాగ్రత్తల్ని వివరిస్తుంది.కవిత  ముగింపులో పక్షి తిరుగు ప్రయాణంలో వ్యక్త పర్చిన మెటాఫర్స్ ఒక దర్జీ పిట్ట గూడు అల్లే దృశ్యంలా వుంది. అవును  ప్రమాదం అన్నదాన్ని పక్షులు, జంతువులూ చాలా సునిశితంగా పసిగడతాయి, అంతే జాగ్రత్త చర్యలు తీసుకుంటాయి. ఈ చర్యలో మిట్టమధ్యానం ఒడ్డుచేరే  సీతాకోకచిలుక  అలలా, సుతి మెత్తంగా,సవ్వడిలేని ఈతలా  ,తమ సమూహాన్ని తన ,పర అన్న తారతమ్యం  లేకుండా   అప్రమత్తం చేస్తాయి. మనుషులు అలికిడివున్న  చోట పక్షులు,ఇతర ప్రాణులు అప్రమత్తంగానే సంచరిస్తాయి.అలికిడి అన్నది మన ఆలోచనలోని అంతర్లీన భాగం,ఒక స్పర్శ.

ఇప్పుడేదో కరోనా వల్ల అవి తిరిగి వస్తున్నాయి అన్నది నగర వాసులకి ఆశ్చర్యం కాని ,నగర శివారుల్లో, ఊర్లల్లో, పంట పొలాల దగ్గర, పోడు చేనులోని చేనుమకాంల దగ్గర ఇది  షరా మామూలే. మనుషులు , పక్షులు, జంతువులు ఒకరి అలికిడి ఒకరు పసిగడుతూ జీవించాలి.  పక్షులు ,జంతువులు వాటికి హాని కలగదు అన్న భరోసా ఏర్పడినప్పుడు అవి వస్తూ పోతూ వుంటాయి.  ఇప్పుడు జంతువులు అవి కోల్పోయిన జీవావరణలోకి  తిరిగి వస్తున్నాయి, మనుషుల, వాహనాల అలికిడి తగ్గినందుకు.

నిర్మానుష్యమైన వీధులు, అందరూ ఇళ్ళలోనే వున్నారు, ఆ నగరం పోలిమేరనానుకుని అడవి వుంది. జపాన్ లోని నార నగరంలో నిర్మానుష్యమైన వీధుల్లో సిల్కా జింక వీధుల్లో, స్టేషన్లలలో స్వేఛ్చగా తిరుగుతోంది.పనామా లోని సాన్  ఫిలేపి సముద్రపు ఒడ్డున రాకూన్స్ చేరుతున్నాయి.చికాగో లోని లింకన్ జ్యూ పార్క్,అర్బన్ వైల్డ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు సెత్ మాగ్లె మాట్లల్లో మేము ఉపయోగించని ప్రదేశాల్లో జంతువులు తిరుగుతూ వుంటాయి, ‘వాటి సంచారం,ఉనికి మాకు తెలియదు, ఒక రకంగా అవి కనిపించని దెయ్యాలు’. ఇట్లాంటి సంఘటనలు కరోనా వచ్చినప్పుడే కాదు, మామూలు రోజుల్లోనూ  హైద్రాబాద్ , వైజాగ్, తిరుపతి, శివార్లల్లో జరిగాయి. ఇక వూర్లల్లో చెప్పనక్కర లేదు. మాగ్లె  ఈ సందర్బంగా అన్న మాటలు  ‘జ్యూరాసిక్ పార్క్ లో అన్నట్టు, జీవితం తన మార్గాన్ని అన్వేషిస్తుంది,” . ప్రస్తుతం నగర ప్రవేశం చేసిన జింకల పై వాళ్ళు ఇంటిపట్టు నుండే , సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే, వన్య ప్రాణుల పై  ప్రతి సంవత్సరం చేసే కొద్ది పాటి పరికరాలతో చేసే అధ్యయనాన్ని ,ఇప్పుడు  కరోనా వల్ల వాటి నడవడికలో వచ్చే మార్పులపై అధ్యనం  చేస్తారట.

జంతువులు ,పక్షులు తిరిగి అవి కోల్పోయిన ఆవాసాలకు వస్తున్నాయి. మరి మనం కరోనా ప్రభావం వల్ల  ఇంటికి కూడా పోలేక పోతున్నాం,ఆహారం నిల్వ వుండే రోజులు కూడా దగ్గర పడుతున్నాయి, జేబులకు  కూడా కన్నాలు పడుతున్నాయి.

అభివృద్ధి చెందుతున్న, చెందిన  దేశాల్లో లాక్ అవుట్ దృశ్యాలు వేరు, వేరు. అభివృద్ధి చెందిన దేశాల్లో, పేరు చెప్పడం అవసరం లేదన్కుంటా. ఒక మహా నగరంలో నిత్యావసరాల మాల్ దగ్గర జనాలు గుమికూడి వున్నారు, నిత్యావసరాలకంటే ముఖ్య మైన దాని కోసం, ఎగబడి .గంటల కొద్దీ నుంచున్నారు, వాళ్ళ తరుణం వచ్చే సరికి కట్టల కొద్దీ కావాలన్నారు, కౌంటర్ దగ్గర వున్న వాళ్ళు అన్నీ ఇవ్వం ,అందరికీ ఇచ్చే కోటా  ప్రకారమే తీస్కోవాలి, కట్ చేస్తే... దిగాలుగా  గత్యంతరం లేక తనకు వచ్చిన కోటా టిష్యు పేపర్ రోల్స్ తీసుకుని  వెళ్ళాడు.

ఇదంతా ఒక జోక్ సోషల్ మీడియా లో చూసి నవ్వుకోవచ్చు,1943 క్షామం అప్పుడు ఇట్లాంటివి జరిగాయి, డిమానిటైజేషన్ కాలంలో ఇట్లాంటి  సంఘటనలని చూశాం, సినిమా అప్పుడే అయిపోలేదు, కరోనా తగ్గినా  తర్వాత సినిమా ఇంకా వుంది. వాణిజ్య  వైరస్ అంటుకుంటుంది... ఒకటి మాత్రం నిజం ప్రకృతి,సామాజిక నడవడికలు గతంలో లాగానే పునరావృతం కావు. అవి కొండ గుహలలో మన పూర్వీకులు మనకు వీడ్కోలు చెప్పిన అచ్చైపోయిన హస్తాల  ఆనవాళ్ళు మాత్రమే, వాళ్ళు మనని రమ్మని పిలిచే సంకేతం కాదు. !. కారణం మనం, మనిషి-వస్తువు, మనిషి-ప్రకృతి, వ్యక్తి- సమూహం, సమూహం-కులం ,జాతి -మతం  అన్నిట్నీ విడదీసి చూసి కలుపుకుపోతాం. మనకంట్లోని కనుపాప తడి వెలుతురులేని చుక్క మాత్రమే, చూపున్న పక్షి నేత్రం కాదు.